బుజ్జగింపు రాజకీయాలు దేశానికి ఒక బెడదగానే కాదు, సమైక్యతకు భంగకరంగా పరిణమిస్తున్నాయంటే తొందరపాటు కాదు. ఐదారు దశాబ్దాలుగా తీవ్రస్థాయిలో సాగుతున్న ఈ బుజ్జగింపు వల్ల కొన్ని రాజకీయ పార్టీలు స్థిరంగా అధికారంలో ఉండగలిగాయే గానీ, ఆ ధోరణి ముస్లింల వెనుకబాటుతనాన్ని తగ్గించలేకపోయింది. పైగా వారిని ప్రధాన స్రవంతి భారతీయతకు దూరం చేసిందన్న ఆరోపణ కూడా ఉంది.   భారతీయ జనతాపార్టీ దేశ రాజకీయాలలో కేంద్ర బిందువుగా మారిన తరువాత ముస్లింలను ఓటుబ్యాంకుగా చూడకుండా, ప్రధాన స్రవంతిలో కలపడానికీ, తాము కూడా ఈ దేశ సంతానమేనన్న ధోరణికి రావడానికీ దోహదం చేసింది. అందుకు తగ్గట్టే విధానాలు తీసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాలలో ఎక్కడా హిందువులకూ, ముస్లింలకు మధ్య విభజన తీసుకువచ్చే మాటలు ఉపయోగించలేదని భారతీయ జనతా మైనార్టీ మోర్చా జాతీయ అధ్యక్షులు జమాలుద్దీన్‌ ‌సిద్ధిఖీ చెబుతున్నారు. అలాగే ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. ముస్లింలు, బుజ్జగింపు రాజకీయాలే కేంద్రబిందువుగా ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల గురించి ఆయన ‘జాగృతి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తావించారు. సబ్‌ ‌కా సాథ్‌ ‌సబ్‌ ‌వికాస్‌ అన్న నినాదానికి తోడుగా వచ్చిన సబ్‌కా విశ్వాస్‌తో ముస్లింలు బీజేపీకి మరింత చేరువ కాగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నాగపూర్‌కు చెందిన సిద్ధిఖీ, ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తూ దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తుంటారు. ఇటీవల విజయవాడ వచ్చినప్పుడు ఆయనతో జరిపిన ముఖాముఖీలోని కొన్ని అంశాలు:

మైనార్టీ మోర్చా విస్తరణకు పార్టీ అమలు చేస్తున్న ప్రణాళిక ఏమిటి?

ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం ఐదువేల మంది ముస్లింలను పార్టీ కార్యకర్తలు వెళ్లి కలుసుకో వాలని నిర్ణయించాం. బూత్‌స్థాయి నుంచి ఇలాంటి కృషి జరగాలని నాయకత్వం ఆశిస్తున్నది. మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోదీ సందేశం ‘సబ్‌ ‌కా సాథ్‌ ‌సబ్‌ ‌కా వికాస్‌’ ‌నినాదమే స్ఫూర్తిగా ఈ కృషి జరుగుతుంది. దీనికి ‘సబ్‌ ‌కా విశ్వాస్‌’ ‌తోడై ముస్లింలలో నెలకొని ఉన్న లేదా ఇతర పార్టీలు నెల కొల్పిన బీజేపీ వ్యతిరేక భావనను తొలగించగలమని నాయకులు ఆశిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం మైనార్టీల కోసం గతంలోని లేని విధంగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఆ పథకాల ప్రభావం మైనారిటీ వర్గాల మీద ఎలా ఉంది?

చూడండి! ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి ఎన్నో ప్రసంగాలు చేశారు. ఆ ఉపన్యాసాలలో ఆయన ఏనాడూ హిందూ ముస్లిం అన్న భేదభావన చూపలేదు. కానీ, ఇంతకాలం ముస్లిం ఓట్లతోనే పబ్బం గడుపు కున్న రాజకీయ పార్టీలు, నాయకులు చేసే రాద్ధాంతం అంతా యింతా కాదు. ఇది నిజంగా దురదృష్టం. బీజేపీ ముస్లింలను దూరం చేసుకోవాలని ఏనాడూ అనుకోలేదు. కేంద్రమంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ ‌నక్వీ ముస్లింలను జాతీయ స్రవంతిలో కలపటానికి ఎంతో కృషి చేస్తున్నారు. హజ్‌ ‌యాత్రకు సముద్ర మార్గాన కూడా అవకాశం కల్పించాలని తలపెట్టారు. అలా హజ్‌ ‌యాత్రికుల కోటాను రెండు లక్షలకు పెంచారు. కల్యాణ్‌ ‌షగూన్‌ ‌పథకం క్రింద రూ. 51వేలు మంజూరు చేస్తున్నారు.

 ఓట్‌ ‌బ్యాంక్‌ ‌రాజకీయాలకు అడ్డుకట్ట ఎలా?

ఇందులో విపక్షాల దుష్ట పాత్ర గర్హించదగినది. ఇప్పటికీ కొనసాగుతోంది. విపక్షాలు ముస్లింలకు తాయిలాలు ఎరగా వేసి, విద్వేషాలు రెచ్చగొట్టి వారిని ఓట్‌బ్యాంక్‌గానే వాడుకోవడం బాధాకరం. స్వతంత్ర దేశం ఆవిర్భవించి 74 సంవత్సరాలైంది. అయినా ఇలాంటి వైఖరిలో మార్పు రావడం లేదు. ముస్లింలలో భ్రమలు తొలగించి, సమైక్యతకు బీజేపీ, మోర్చా కృషిచేస్తున్నాయి. కొన్ని ఫలితాలు సాధించాం కూడా.

మైనార్టీల సాధికారతకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

‘హునార్‌ ‌హాథ్‌’ ‌చేతివృత్తులవారికి వరప్రసాదం, సీఖ్‌అవుత్‌ ‌కామ్‌ ‌పథకం వారి నైపుణ్యాన్ని పెంచి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోంది.

ముస్లిం రాజకీయాల చుట్టూ తిరిగే పశ్చిమ బెంగాల్‌, ‌కశ్మీర్‌లలో నేటి పరిస్థితి ఏమిటి?

ఆర్టికల్‌ 370, 35 (ఎ) ‌రద్దు ద్వారా కశ్మీర్‌లో గుణాత్మకమైన మార్పులు వచ్చాయి. కశ్మీర్‌ ‌విషయంలో, ఆ ఆర్టికల్‌ ‌విషయంలో ఇన్నాళ్లూ విపక్షాలు, ప్రధానంగా కాంగ్రెస్‌ ‌దేశ ప్రజలలో ఎన్నో భయాలు నింపి ఉంచింది. అదే సమయంలో కశ్మీరీ ముస్లింలను భ్రమలలో పెట్టి ఉంచింది. కానీ 370 అధికరణ రద్దు తరువాత ఏమైంది? కశ్మీరీ ముస్లింలు జాతీయ స్రవంతిలోకి మళ్లడానికి బాటలు పడ్డాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించి, ప్రజా స్వామ్యానికి మార్గం చూపారు. ఉగ్రవాదంతో కాదు, ప్రధాన జీవన స్రవంతిలో కలవడమే ఉత్తమమన్న అభిప్రాయం అక్కడి యువతలో వచ్చింది. రాళ్లు రువ్వే మూకలు పోయాయి. ఇక పశ్చిమబెంగాల్‌లో బీజేపీది ఘనవిజయమే. ప్రత్యర్థుల ఎంత ఘోరంగా హింసాత్మక చర్యలకు పాల్పడినా బీజేపీ విజయాన్ని ఆపలేకపోయారు. బంగ్లాదేశ్‌ ‌నుంచి అక్రమంగా వలస వచ్చినవారి అండతో తృణమూల్‌ ‌కాంగ్రెస్‌ ఎన్నో అరాచకాలు చేసింది. ఎంత దారుణమంటే, కేసులు నమోదు చేసుకోవడానికి పోలీసులు కూడా అంగీకరించలేదు. కొంచెం ఆలస్యంగానే అయినా కోర్టుల ద్వారా బీజేపీకి న్యాయం దక్కబోతున్నది. మే 2 తరువాత, ముందు కూడా అక్కడ జరిగిన ఎన్నికల హింస అత్యంత బాధాకరమైనది. అయినా 3 స్థానాలు ఉన్న అసెంబ్లీలో బీజేపీ తన బలాన్ని 77 స్థానాలకు పెంచుకుంది. ఇది విజయం కాక మరేమిటి?

ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న లక్షద్వీప్‌లో ఈ మధ్య ముస్లింల అణచివేత, హిందూత్వ అమలు పేరుతో రగడ జరిగింది. అక్కడి ప్రజల అభిమానం పొందడానికి మీరేం చేస్తారు?

లక్షద్వీప్‌లో పరిస్థితి చాలా చిత్రమైనది. నిజానికి స్థానిక ముస్లింలకు ఈ రాజకీయాలేమీ పట్టడం లేదు. కేంద్ర ప్రతినిధి అక్కడ అమలు చేయదలిచిన చట్టాలేవీ కొత్తవి కాదు. అయినా అంత రగడ ఎలా జరిగిందంటే అదంతా సమీప కేరళ మార్క్సిస్టుల కుట్ర. దానికి ఒక వర్గం మీడియా తోడైంది. అవేమీ పట్టించుకోకుండా అభివృద్ధే లక్ష్యంగా అక్కడ కేంద్రం పథకాలను అమలు చేస్తున్నది. ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలున్నవారు పోటీకి అనర్హులు అనే నిబంధనను ముస్లిం వ్యతిరేకతగా మలచాలనీ, దానితోనే ముస్లింల మీద పట్టు సాధించాలని ఇతర పార్టీలు పని చేస్తున్నాయి.నిజానికి అది బీజేపీ వచ్చిన తరువాత అమలు చేస్తున్నది కానేకాదు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో కేంద్రం స్థానికులకు దగ్గర కావడానికి ప్రయత్నం చేస్తోంది.

పౌర చట్ట సవరణ (సీఏఏ), నేషనల్‌ ‌రిజిస్టర్‌ ఆఫ్‌ ‌సిటిజన్‌ (ఎన్‌ఆర్‌సీ) లతో దేశంలో పెద్ద ఎత్తున విపక్షాలు గగ్గోలు సృష్టించాయి. ఢిల్లీ, అస్సాం, పశ్చిమ బెంగాల్‌, ‌కేరళ రాష్ట్రాలలో దాని ఆ గగ్గోలు ఎక్కువగా కనిపించింది. ఇప్పుడు అక్కడి పరిస్థితి ఏమిటి?

ఇదంతా కూడా ఓట్‌ ‌బ్యాంక్‌ ‌రాజకీయాలలో భాగమే. ఆ రెండు చట్టాలను చూపించి విపక్షాలు ముస్లింలలో అభద్రతాభావాన్ని సృష్టిస్తున్నాయి. ఆ చట్టంతో ఈ దేశ ముస్లింలంతా జీవించే హక్కును కోల్పోతారంటూ విద్వేషం రెచ్చగొడుతున్నాయి. సీఏఏ అవసరం ఏమిటో అఫ్ఘానిస్తాన్‌ ‌పరిణామాల తరువాత తెలిసింది. కానీ ఇంతవరకు ఆ చట్టం కారణంగా ఏ ఒక్క ముస్లిమైనా భారత పౌరసత్వం కోల్పోయాడా అన్న ప్రశ్నకు ఏ విపక్షం నుంచి సమాధానం లేదు. ఇక ఎన్‌ఆర్‌సీని ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదు. అస్సాం ప్రజల చిరకాల వాంఛ కాబట్టి అక్కడకి మాత్రమే దానిని ఉద్దేశించారు.

అస్సాంలో పశుమాంస విక్రయాలపై నిషేధం ప్రతిపాదన సమర్థనీయమా?

అస్సాం ప్రభుత్వం పశుమాంస విక్రయంపై షరతులు విధించింది. ప్రార్థనా స్థలాల వద్ద విక్రయించవద్దన్నారు. అంతే తప్ప అసలు మాంసాన్నే నిషేధించలేదు. ఎవరి మతాన్ని వారు నిర్భయంగా అనుసరిస్తూనే పశు సంపదను కూడా రక్షించాలి.

త్రిపుల్‌ ‌తలాక్‌ ‌చట్టంతో ఎలాంటి ఫలితాలు వచ్చాయి?

నిస్సందేహంగా మంచి ఫలితాలే వచ్చాయి. తలాక్‌తో ఎంతోమంది ముస్లిం మహిళలు అష్టకష్టాలు పడ్డారు. ఓటు బ్యాంకు దృష్టితో కాంగ్రెస్‌ ‌పార్టీ ఇంతకాలం దాని జోలికే పోలేదు. షాబానో ఉదంతం నుంచి ఈ సమస్య దేశం ముందు నానుతూనే ఉంది. కానీ ముస్లిం ఓట్లు పోతాయన్న భయంతో కాంగ్రెస్‌ ‌సమస్యను పరిష్కరించలేదు.ఆ పని బీజేపీ చేసింది. చాలా ముస్లిం దేశాలలోనే తలాక్‌ను నిషేధిస్తే ఇక్కడ ఎందుకు తటపటాయించాలి? తలాక్‌ ‌రద్దు చర్యతో ఎంతోమంది ముస్లిం మహిళలకు లాభం చేకూరింది. బిహార్‌లో ఎన్డీఏ కూటమి విజయానికి కారణం ముస్లిం మహిళల ఓట్లే.

భారత్‌ ‌నుండి గల్ఫ్ ‌దేశాలకు వెళ్లినవారి ప్రయోజనాలకు పరిరక్షణ చర్యలేమిటి?

గల్ఫ్ ‌దేశాలలో వందలాది మంది భారతీయు లున్నారు. బెహరెయిన్‌, ‌కువైట్‌, ఒమన్‌, ‌ఖతార్‌, ‌సౌది దేశాల నుంచే భారతీయులు 40 బిలియన్ల డాలర్లను స్వదేశానికి పంపి ఆర్థిక వికాసానికి దోహదం చేస్తున్నారు. ప్రవాసీ భారతీయ బీమా యోజన, ఇండియన్‌ ‌కమ్యూనిట్‌ ‌వెల్ఫేర్‌ ‌ఫండ్‌ ‌ద్వారా వలస కార్మికుల సంక్షేమానికి భారత ప్రభుత్వం తన వంతు సాయం అందిస్తున్నది.

గోమాంస విక్రయం, గోహత్య నిషేధం బిల్లును ఎట్లా చూస్తారు?

భారతీయులకు గోవు పవిత్రమైనది. గోఆధారిత వ్యవసాయం దేశ ఆర్థికాభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది. గోవును రక్షించడం అంటే సయోధ్యకు సంకేతం. గోవధ ఎంత మాత్రం సమర్థనీయం కాదు.

ముస్లిం మహిళలను మసీదులలోకి అనుమతిం చాలన్న నినాదం మీద మీ అభిప్రాయం?

ఇది మత విశ్వాసానికి సంబంధించిన అంశం. మత పెద్దలకు సంబంధించిన విషయం. ఎటూ ఎవరూ తేల్చలేకపోతే కోర్టులలో తేల్చుకోవచ్చు. ఈ అంశంలో బీజేపీ జోక్యం చేసుకోదు.

పశ్చిమబెంగాల్‌కు చెందిన జాన్‌ను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకున్నారు కదా? ఆయన నుండి ఏమి ఆశిస్తున్నారు?

జాన్‌ ‌బర్లా గిరిజన క్రైస్తవుడు. ఆయనకి తేయాకు కార్మికులలో మంచి బలం ఉంది. కాబట్టి మైనార్టీల సంక్షేమ పథకాల అమలులో ఆయన అనుభవం బాగా ఉపయోగపడుతుందనే మా అందరి అభిప్రాయం. ఆయన కూడా ఆ కోణంలోనే కృషి చేయాలని ఆశిస్తున్నారు.

మదర్సాల ఆధునికీకరణను మీరు స్వాగతిస్తారా?

ప్రధాని మోదీ ఉద్దేశం ఖురాన్‌ ఓ ‌చేతిలో మరో చేతిలో ల్యాప్‌టాప్‌. అలాగే ముస్లింలకు ఉద్యోగావ కాశాలు. మదర్సాలలో కూడా కంప్యూటర్‌ ‌విద్య, ఇతర లౌకిక విద్యలు ప్రవేశపెట్టడమే ఆ ఆలోచన వెనుక ఉంది. నిజానికి ఈ చర్యతో ముస్లింలు అభివృద్ధి సాధించగలరు. వెనుకబాటు తనం నుంచి అభివృద్ధి దిశలో పయనించగలరు.

షరియాకు భారత్‌లో తావుందా?

సాధ్యంకాదు. భారత్‌ ‌ప్రజాస్వామ్య దేశం. మనది లౌకిక రాజ్యాంగం. తమ తమ జీవన విధానాలతోనే అందరికీ జీవించే హక్కు ఉంది. షరియా అమలు చేయాలని అనుకోవడం సరికాదు. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి పౌర స్మృతి అమలులోకి రావడం అవసరం.

దేవ్‌బంద్‌ను రాజకీయాల నుండి కాపాడేది ఎలా?

దేవ్‌బంద్‌ ‌ముస్లింలకు మార్గదర్శి. విద్యాదాయిని. ఎన్నో ముస్లిం దేశాలు ఈ సంస్థపై ఆశలు పెట్టు కున్నాయి. ఇప్పటిదాకా మౌల్వీల ఇష్టారాజ్యంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌ ‌ప్రభుత్వం రాజకీయలకు అతీతంగా సంస్థ అభివృద్దికి చర్యలు చేపట్టింది. మదర్సాల ఆధునికీకరణ అభివృద్ధికి సంకేతమవుతుంది.

లద్దాఖ్‌, ‌కార్గిల్‌, అమర్‌నాథ్‌లలో ముస్లింల సేవలు ఎనలేనివి. వారి సేవలను మోర్చా ఎలా పరిగణిస్తున్నది?

కార్గిల్‌, ‌లద్దాఖ్‌లలో యుద్ధ సమయంలో దేశభక్తులైన ముస్లింలు సైనికులకు బాసటగా నిలిచారు. అమర్‌నాథ్‌ ‌హిమలింగ దర్శనార్థం వచ్చే భక్తులకు సేవలందించే వారిలో అధిక సంఖ్యాకులు ముస్లింలే.వారికి మైనారిటీ మోర్చా సంక్షేమ పథకాలను అందించేందుకు కృషి చేస్తున్నది.

వారణాసి, కచ్‌ ‌తదితర ప్రాంతాలలో చేనేత, ఇతర చేతివృత్తులలో ముస్లింలు రాణిస్తున్నారు. వారి సంక్షేమానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

కరోనా సమయంలో 12 చేనేత ఎగ్జిబిషన్లు నిర్వహించారు. స్థానికంగా అంతర్జాతీయంగా 53 కేంద్రాలలో విక్రయానికి కేంద్రం ఏర్పాట్లు కోసం 534 కేంద్రాలను ఏర్పాటుచేసి చేనేతలకు బాసటగా నిలిచింది.

ఇంటర్వ్యూ : దండు కృష్ణవర్మ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram