ఒక గొప్ప దేశభక్తుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సాంఘిక సంస్కర్త, స్మృతి శాశ్వతంగా నిలిచిపోయేలా చేసిన పని ఇది. రాధాష్టమి రోజున

ఉత్తరప్రదేశ్‌లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌యూనివర్సిటీకి పునాది పడింది. నేతాజీ సుభాష్‌ ‌చంద్రబోస్‌తో భుజం కలిపిన నాయకుడు, విదేశి గడ్డమీద ఏర్పడ్డ తొలి ప్రవాస భారతదేశ ప్రభుత్వ అధినేతకు అసలైన నివాళి ఇది. అలీగఢ్‌ ‌ముస్లిం యూనివర్సిటీ రాజా సాహెబ్‌ ‌నుంచి భూములను విరాళంగా పొందినా, గుర్తించడానికి ఇష్టపడని సందర్భంలో ఏకంగా ఆయన పేరిట సరికొత్త విశ్వవిద్యాలయం ఏర్పడబోతోంది.

మన చరిత్ర కొందరు నాయకుల చుట్టే తిరుగుతుంది. ఎందుకంటే తమ కుటుంబాలకే ఖ్యాతిని పరిమితం చేసుకునేలా చరిత్ర పాఠాలను రూపొందించుకున్నారు గత పాలకులు. ఫలితంగా భావితరాలకు తెలిసే అవకాశం లేకుండా ఎందరో మహనీయుల పేర్లు కనుమరుగవుతున్నాయి. ఇలాంటి గొప్ప వ్యక్తుల్లో రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌కూడా ఉన్నారు.

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడంతో ఇంతకీ ఈ మహనీయుడు ఎవరు అనే చర్చ జరిగింది. దేశ ప్రజలకు ఆయన పెద్దగా తెలియకపోవచ్చు. కానీ ఉత్తరప్రదేశ్‌లో మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ను గుర్తుచేసుకోవడానికి ఆయన జ్ఞాపకాలు ఇంకా పదిలంగా ఉన్నాయి. కానీ ఎక్కువగా లబ్ధిపొందిన కొందరు ఈ మహనీయుని స్మృతులను చెరిపే పనులు ఎన్నో చేశారు. ఉత్తరప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్‌ ‌తీసుకున్న నిర్ణయంతో రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది.

ప్రస్తుత ఉత్తరప్రదేశ్‌, ‌నాటి యునైటెడ్‌ ‌ప్రావిన్స్‌లోని హత్రాస్‌ ‌జిల్లాలో ముర్సాన్‌ ‌జమీందార్‌ ‌ఘన శ్యాంసింగ్‌కు 1886 డిసెంబర్‌ 1‌న జన్మించారు మహేంద్ర ప్రతాప్‌సింగ్‌. ‌ప్రతాప్‌ను మూడేళ్ల వయసులో ఉన్నప్పుడు హత్రాస్‌ ‌జమీందారు రాజా హరినారాయణసింగ్‌ ‌దత్తత తీసుకున్నారు. ఆయన తదనంతరం మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌తన 20వ ఏట పట్టాభిషిక్తుడయ్యారు. 1902లో హర్యాణా జింద్‌ ‌జాట్‌ ‌వంశానికి చెందిన బల్వీర్‌ ‌కౌర్‌తో వివాహం జరిగింది. మహేందప్రతాప్‌ ఉన్నత విద్యాభ్యాసం అలీగఢ్‌లోని ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. ఆ తర్వాత మహమ్మదన్‌ ఆం‌గ్లో ఓరియంట్‌ ‌కళాశాలలో చేరారు. కానీ అక్కడ గ్రాడ్యుయేషన్‌ ‌పూర్తి చేయలేదు. ఈ కాలేజీయే కాలక్రమంలో అలీగఢ్‌ ‌ముస్లిం యూనివర్సిటీగా మారింది. ఆంగ్లేయ ప్రభుత్వం మహేంద్ర ప్రతాప్‌సింగ్‌కు రాజాబహదూర్‌ ‌బిరుదు ఇవ్వలేదు. కానీ ఆయన సేవలు, దేశభక్తిని గుర్తించి ప్రజలే రాజాసాహెబ్‌గా గుర్తించారు.

రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌తన ఆస్తిలో చాలా భాగం ప్రజలను విద్యావంతులను చేసేందుకే ఖర్చు చేశారు. 1909 బృందాబన్‌లోని తన రాజ భవనంలో సాంకేతిక కళాశాలను స్థాపించారు. మహేంద్ర ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉండాల్సి వచ్చింది. చిన్ననాటి నుంచే బ్రిటిష్‌ ‌పాలనలో దురాగతాలను చూసి స్వేచ్ఛా భారతదేశం కోసం కలలు కన్నాడు. 1913లో దక్షిణాఫ్రికాలో గాంధీజీని కలుసుకున్నారు. భారత్‌తోపాటు అఫ్ఘానిస్తాన్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన కల్పించేందుకు ప్రపంచ పర్యటన చేశారు. అఫ్ఘానిస్తాన్‌ ‌తరఫున అనధికారిక ఆర్థిక మిషన్‌లో కూడా ఉన్నారు. అఫ్ఘానిస్తాన్‌లో గోవధ నిషేధం కోసం పోరాడి, అక్కడి ప్రజలను ఇందుకోసం ఒప్పించారు.

తొలి భారత రాష్ట్రపతిగా!

రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌భారతదేశ స్వాతంత్య్రం కోసం విదేశీ గడ్డ మీద నుంచే సమర శంఖానాదం వినిపించారు. ఇందులో భాగంగా కాబుల్‌లో తొలి ప్రవాస స్వతంత్ర భారత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీనికి ఆయన అధ్యక్షుడు (రాష్ట్రపతి). మౌలానా బర్కతుల్లాను ప్రధానమంత్రిగా నియమించారు. తన ఫ్రీ ఇండియా మిషన్‌కు విదేశాల మద్దతు కూడగట్టేందుకు పర్యటనలు ప్రారంభించారు. 1925లో టిబెట్‌కు వెళ్లి దలైలామాను కలిశారు. సోవియట్‌ ‌రష్యా వెళ్లి లెనిన్‌ను కూడా కలుసుకున్నారు. ఆయనతో మంచి సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ కారణంగానే కమ్యూనిస్టులు రాజా సాహెబ్‌ను సోషలిస్టుగా చూపించే ప్రయత్నం చేశారు. చైనా, జపాన్‌, ‌టర్కీ, జర్మనీ, అమెరికాల్లో కూడా పర్యటించారు.

నేతాజీతో భుజం కలిపి..

రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌విదేశాల్లో ఉన్నప్పుడే సుభాష్‌ ‌చంద్రబోస్‌ని కలిశారు. ఆజాద్‌ ‌హింద్‌ ‌ఫౌజ్‌లో కీలకపాత్ర పోషించారు. మహేంద్ర ప్రతాప్‌ ‌కార్యకలాపాలు చూసి ఆందోళనకు గురైన బ్రిటిష్‌ ‌ప్రభుత్వం భారత్‌లోని ఆయన ఆస్తులను జప్తు చేసి పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ద కాలంలో 1940లో జపాన్‌లో ఉండి ఫ్రీ ఇండియా వరల్డ్ ‌ఫెడరేషన్‌ ‌సెంటర్‌ ఏర్పాటు చేశారు ప్రతాప్‌ ‌సింగ్‌. ‌తర్వాత కాలంలో బ్రిటిష్‌ ‌వారు ప్రతాప్‌సింగ్‌ ‌మీద ఆంక్షలను తొలగించారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత తన సేవా కార్యక్రమాలను తిరిగి ప్రారంభించారు.

మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌సామాజిక సేవలకు గుర్తింపుగా 1932లోనే నోబెల్‌ ‌శాంతి బహుమతికి నామినేట్‌ అయ్యారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత స్వాతంత్య్ర సమరయోధుల సంఘానికి అధ్యక్షునిగా పనిచేశారు. ఆలిండియా జాట్‌ ‌మహాసభకు అధ్యక్షునిగా కూడా ఉన్నారు. 1957 లోక్‌సభ ఎన్నికల్లో మధుర నుంచి పోటీ చేశారు. జనసంఘ్‌ ‌నుంచి బరిలో నిలిచిన అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయిపై విజయం సాధించి రెండో లోక్‌సభలో అడుగు పెట్టారు. రాజా మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ 1979 ఏ‌ప్రిల్‌ 29‌న తన 92వ ఏట తుదిశ్వాస విడిచారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం ఒక పోస్టల్‌ ‌స్టాంప్‌ను విడుదల చేసింది.

మహనీయుడిని అవమానించిన ఏఎంయూ

అలీగఢ్‌ ‌ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) ఏర్పడ్డప్పుడు మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌దాని పూర్వ రూపమైన మహమ్మదన్‌ ఆం‌గ్లో ఓరియంట్‌ ‌కళాశాలలో చదువుకున్న విద్యార్థిగా భూరి విరాళంతో పాటు తన సొంత ఏస్టేట్‌ ‌నుంచి భారీగా భూమిని కూడా ఇచ్చారు. అదే భూమిలో యూనివర్సిటీ ఏర్పడింది. 1977లో ఏఎంయూ స్వర్ణోత్సవాల సందర్భంగా రాజాసాహెబ్‌ను అప్పటి పాలక వర్గం సన్మానించింది. కానీ ఆయన మరణం తర్వాత పూర్తిగా మరచిపోయింది. ఇదే విషయంలో మహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌మనవడు చరణ్‌‌ప్రతాప్‌ ‌పలు సందర్భాల్లో విచారం వ్యక్తంచేశారు. 2014లో బీజేపీ రాజా మహేంద్ర ప్రతాప్‌ ‌జయంతిని జరిపేందుకు ప్రయత్నించగా యూనివర్సిటీ అనుమతి ఇవ్వలేదు. దీంతో ఏఎంయూ గేట్‌ ‌దగ్గరే దీన్ని జరుపుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత 2018లో అలీగఢ్‌ ‌ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో దేశ విభజనకు కారకుడు, ముస్లింలీగ్‌ ‌వ్యవస్థాపకుడు, పాకిస్తాన్‌ ‌తొలి అధ్యక్షుడు మహమ్మద్‌ అలీ జిల్లా చిత్రపటం ఏర్పాటు చేయడం వివాదంగా మారింది. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ పేరును రాజా మహేంద్ర ప్రతాప్‌ ‌యూనివర్సిటీగా మార్చాలని ప్రజల నుంచి డిమాండ్‌ ‌వచ్చింది.

ఇటీవల రాధాష్టమి రోజున ప్రధాని నరేంద్ర మోదీ అలీగఢ్‌లో రాజమహేంద్ర ప్రతాప్‌సింగ్‌ ‌స్టేట్‌ ‌యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ‌గతంలో ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేరింది. అలీగఢ్‌లోని కోల్‌ ‌తహసీల్‌లోని లోధా, ముసేపూర్‌ ‌కరీం జరౌలి గ్రామాల్లో ఈ విశ్వవిద్యాలయం కోసం 92 ఎకరాలు కేటాయించారు. అలీగఢ్‌ ‌డివిజన్‌లోని 395 కళాశాలలకు ఈ యూనివర్సిటీ అనుబంధంగా ఉంటుంది.

రాజా సాహెబ్‌ ‌సేవలకు గుర్తింపు

స్వాతంత్య్ర సమరయోధుడు, విద్యావేత్త, సాంఘిక సంస్కర్త రాజామహేంద్ర ప్రతాప్‌ ‌సింగ్‌ను గౌరవిస్తూ ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు శంకుస్థాపన కార్యక్రమంలో ప్రకటించారు ప్రధాని నరేంద్ర మోదీ. మహేంద్ర ప్రతాప్‌ ‌సేవలను ఇలా గుర్తించు కున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు.

– క్రాంతి, సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram