పునర్నిర్మాణం –

అంతర్యుద్ధంలో మునిగిన దేశాలలోను, సంక్షోభాలను చవిచూసిన సమాజాలలోను, విదేశీయుల పాలన నుంచి స్వేచ్ఛను పొందిన వ్యవస్థలలోను వినిపించే మాట. ధ్వంసమైన రహదారులు మళ్లీ వేసుకోవడం, కూలిన భవనాలకు మరమ్మత్తులు చేసుకోవడం, కొత్తవి కట్టుకోవడం, పేల్చేసిన వంతెనలు కట్టుకోవడం ఇవీ పునర్నిర్మాణంలో భాగమే. కానీ అసలు సిసలు పునర్నిర్మాణం వేరు. అది దేశాన్ని జ్ఞాన నిలయంగా, ఆధ్యాత్మికంగా మార్చే కొత్తతరం కావాలని కోరుకోవడం. దూరదృష్టి, హేతుబద్ధత ఉన్న సమాజం కోసం తపించే తరాన్ని స్వాగతించడం. దేశం కోల్పోయినదేదో దానిని సాధించే తరం కోసం తపించడం. మనదైన గతంతో ఈతరం తెంపేసుకున్న భావధారకు, జీవనధారకు నడుమ తిరిగి వంతెన నిర్మించుకున్నప్పుడు పునర్నిర్మాణం అన్న గొప్ప భావనకు ఆకృతి సిద్ధిస్తుంది. నిజమే, కానీ అంతటి పునర్నిర్మాణం అనే విస్తృత కార్యక్రమం కోసం ఆ కొత్తతరం ఎక్కడ నుంచి వస్తుంది? ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల నుంచా? మంచి రాజకీయ పార్టీ నుంచా? పెద్ద పెద్ద గ్రంథాలయాల నుంచా? ఉద్యమాలూ, నినాదాల నుంచా? కాదు, తల్లి గర్భం నుంచి వస్తుంది. అక్కడే రూపొందుతుంది కూడా. ఇది విశ్వాసం కాదు. విజ్ఞానశాస్త్రం రుజువు చేసిన వాస్తవం. పునర్నిర్మాణం అంటూ స్వామి వివేకానంద వంటివారు ఇచ్చిన పిలుపు వెనుక గొప్ప పరమార్ధం ఉన్న సంగతి సరే, పెద్ద యజ్ఞం కూడా ఉంది. దానినే ఇప్పుడు ‘ఆర్యజనని’ పేరుతో రామకృష్ణ మిషన్‌ తిరిగి ఆరంభించింది.

దేశ భవిష్యత్తును భవ్యంగా దర్శించే తరం రావడానికి మనవైన విధానాలు, మార్గదర్శకాలు ఉన్నాయి. అందులో మొదటిది గర్భవతిని కొత్తతరాన్ని అందించే శక్తిగా భావించడం. గర్భం దాల్చిన తరువాత ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఏఏ వ్యాయామాలు చేయాలి? అవసరమైతే ఎలాంటి మందులు వాడాలి? ఇలాంటి వైద్య సదుపాయాలు ఎక్కడైనా దొరుకుతాయి. వాటి పట్ల ఎవరికీ వ్యతిరేకత ఉండదు. కానీ వీటితోనే గర్భస్థ శిశువు పట్ల బాధ్యత తీరిపోయిందని తల్లిదండ్రులు, కుటుంబం, ఆఖరికి సమాజం కూడా భావించే వాతావరణం నెలకొంది. ఆ సదుపాయాలను కల్పిస్తే గర్భస్థ శిశువు సక్రమంగా ఎదిగి శారీరక ఆరోగ్యంతో పుడతారు కూడా. కానీ జ్ఞానవంతులైన సంతానం కావాలంటే, ఉన్నతమైన ఆలోచనలు కలిగిన తరం రావాలంటే, అన్నింటికీ మించి మనో ధైర్యం కలిగిన సంతానం కావాలంటే వైద్య పరమైన సదుపాయం ఒక్కటే చాలదు. మానసికంగా కూడా ఆరోగ్యవంతులైన శిశువులు జన్మించేందుకు ఉన్న మార్గాల గురించి కూడా సమ ప్రాధాన్యం ఇవ్వాలి. శిశువు మానసిక, శారీరక ఆరోగ్యాల గురించే ఆర్యజనని చెబుతుంది.

ఇప్పుడైనా భారతదేశానికి ప్రసవం, ఆరోగ్యం వంటి విషయాలు బోధించే సాహసం తాము చేయబోవడం లేదని ఆర్యజనని నిపుణులు చెబుతున్నారు. పదివేల ఏళ్ల నాగరికత కలిగిన ఈ దేశంలో నాలుగు వేల ఏళ్లుగా అమలులో ఉన్న, చరిత్రకు అందుతున్న కొన్ని విధానాల గురించి గుర్తు చేసే కార్యక్రమం మాత్రమే తాము స్వీకరించామని చెబుతున్నారు. భారతదేశం ప్రధానంగా ఆధ్యాత్మిక దేశం. ఇక్కడ ఉన్నది స్పిరుట్యువల్‌ సైన్స్‌. హిందూ మతం సైంటిఫిక్‌ మతం అంటారు వివేకానందులు. ఈ దృక్కోణం గర్భిణుల పట్ల కూడా కనిపిస్తుంది. అంతరిక్షానికీ, భూగోళానికీ నడుమ ఎంత దూరం ఉన్నదో చెప్పగలిగిన మహా శాస్త్రవేత్తలు పుట్టిన మన దేశం ఈ ప్రపంచంలోకి రాబోతున్న కొత్త శిశువు కోసం ఆలోచించకుండా ఎందుకు ఉంటుంది? ఈ దేశంలోనే పుట్టిన సుశ్రుతుడు, చరకుడు వంటివారు గర్భస్థ శిశువు గమనం, గమ్యాల గురించి అధ్యయనం చేయకుండా ఉంటారా? పుడమి గర్భంలోకి వెళ్లేవరకు సాగే మానవాళి అనంతమైన ప్రయాణానికి మార్గ నిర్దేశనం మాతృగర్భంలోనే జరుగుతుందని చెప్పారు వారు. ఆ ప్రయాణానికి చోదకశక్తి అమ్మపాల ద్వారానే వస్తుందని కూడా ఆ ధన్వంతరి స్వరూపులు తేల్చారు. ఇప్పుడు ఆర్యజనని కూడా మన పురాణాలూ, చారిత్రక ఘటనలూ ఇచ్చిన సమాచారాన్ని సైన్స్‌తో మేళవించి అందిస్తున్నది. వాటిలో కనిపించే కొన్ని ఘట్టాల తాత్త్వికతకు పాశ్చాత్య శాస్త్రవేత్తలు గర్భస్థ శిశువు గురించి చెప్పిన శాస్త్ర సమ్మత విషయాలకు చాలా సారూప్యం కనిపిస్తుంది.

ప్రహ్లాదుడు, అభిమన్యుడు అనే రెండు పురాణ పాత్రలు మనందరికీ పరిచయమే. వీరిద్దరూ తల్లి గర్భంలో ఉండగానే బాహ్య ప్రపంచం నుంచి మాటలు గ్రహించారు. సంభాషణలు విన్నారు. పాశ్చాత్య దేశాలలో ఎక్కువమంది గర్భిణులు పాటలు పాడతారు. మాట్లాడతారు. అదంతా తమ గర్భస్థ శిశువుతో జరిపే భావ వినిమయమే. ఎక్కడైనా గర్భస్థశిశువు పూర్తిగా ఎదిగే లోపుననే వాళ్ల చెవులు పనిచేయడం మొదలవుతుంది. తల్లి తుమ్మడం వంటి పనులు చేస్తే వాళ్లు ఉలిక్కి పడతారు. ఎగిరిపడతారని కూడా విజ్ఞానశాస్త్రం చెబుతోంది. చెవులే కాదు వాళ్లలో ఘ్రాణ శక్తి కూడా తగినంతగానే ఉంటుంది. గర్భం వచ్చిన 28వ వారాని కల్లా శిశువు వాసనను పసిగట్టే శక్తి తెచ్చుకుంటుంది. ఎమినియోటిక్‌ ఫ్లుయిడ్‌ వాళ్లకి ఆ లక్షణం ఇస్తుందని సైన్స్‌ చెబుతోంది. గర్భంలోని శిశువు మాట వినగలుతుందని చెబితే చాలామందికి, భారత పురాణాలు అంటేనే నిరసన చూపించే మూఢులకీ, సెక్యులరిస్టులకీ వింతే అయినా, ఇది నిజం. చాలా దేశాలలో కడుపులోని శిశువులకు సంగీతం వినిపిస్తారు. రెండో నెల నుంచే వాళ్లకి చెవులు అభివృద్ధి చెందుతూ ఉంటాయని మెడికల్‌ న్యూస్‌ టుడే ప్రచురించింది. ఈ అంశం గురించి మేయో క్లినిక్‌ (అమెరికా) చెప్పింది కూడా చూడాలి. 18వ వారానికి చెవులు ఆకృతి దాలుస్తాయి. అప్పటి నుంచి వినికిడి శక్తి వస్తుంది. ఆ సమయంలోనే వాసన, రుచి, చూపు, స్పర్శ, శబ్దం వంటి వాటిని గ్రహించే శక్తిని కూడా శిశువు మెదడు తెచ్చు కుంటుంది. 22 నుంచి 24వ వారాలలో మామిడి కాయ పరిమాణానికి వచ్చే శిశువు బయట నుంచి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ధ్వనులు వింటుంది. 25వ వారం నుంచి పుట్టిన తరువాత 5,6 మాసాల మధ్య వాళ్ల వినికిడి శక్తి బాగా వృద్ధి చెందుతుంది. కానీ పెద్ద పెద్ద శబ్దాలు వాళ్లకి చేటు చేస్తాయి. వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉందని కూడా పరిశోధనలు చెబుతున్నాయి. గుంపుల గోల, సైరెన్‌, ట్రక్కు, విమానాలు, యంత్రాలు, తుపాకులు చేసే శబ్దం వాళ్లకి చేటే. 23వ వారం నుంచి వినపడే శబ్దాలు భవిష్యత్తు వినికిడి శక్తికి కీలకమైనవి.

శిశువు మీద ప్రేమతో తల్లి గుండె కూడా పెద్దదవుతుందా? నిజమనే చెబుతోంది సైన్స్‌. తలి ఉదరం, వక్షమే కాకుండా గుండె కూడా పెద్దదవు తుంది. శిశువు పెరుగుదలకు అవసరమైన రక్తాన్ని సరఫరా చేయడానికి వెంట్రికల్స్‌ దళసరిగా మారతాయి.

గర్భస్థ శిశువు ఏడుస్తుందా లేదా అన్నదాని మీద కూడా న్యూజిలాండ్‌లో పరిశోధన జరుగుతోంది. ఈ అంశం మీద ఇంకా స్పష్టత లేకున్నా కొన్ని అంశాలు తెలిశాయి. 20 వారాల వయసున్న శిశువులో కొన్ని చేష్టలు కనిపిస్తాయి. ఇవన్నీ రోదనకు సంబంధించినవే అంటున్నారు శాస్త్రవేత్తలు. నాలుక చాపడం, ఊపిరి తీసుకోవడంలో సంయమనం, నోరు తెరవడం, దవడలు కదపడం, గుటక వేయడం కనిపిస్తాయి. కానీ 24వ వారంలో బయటి ఏడుపును గమనిస్తారు. 2015లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం తల్లి స్పర్శను గ్రహిస్తుంది. బిడ్డతో తల్లి భావాలు పంచుకోవచ్చునని కూడా రుజువైంది. తల్లి తన కడుపు మీద చేతులు వేస్తే శిశువులో కదలికలు ఎక్కువ అవుతాయని కూడా కనుగొన్నారు. తల్లి నెమ్మదిగా మాట్లాడితే వాళ్లకి సాంత్వన కూడా లభిస్తుంది. మంచి పుస్తకాలు, మంచి సంగీతం వినడాన్ని స్వాధ్యాయం అంటారు. స్వాధ్యాయం చేసేటప్పుడు, పూజ, ధ్యానం సమయాలలో తన గర్భం మీద తల్లి తన చేయి ఉంచి బిడ్డకోసమే చేస్తున్నట్టు సంకేతించాలి. గర్భంలోని తన చిన్నారితో తల్లి రోజూ మూడుసార్లు మాట్లాడాలి. అసూయకు దూరంగా ఉండాలి. ఇందులో తండ్రికి కూడా పాత్ర ఉంది. మానసిక ప్రశాంతతో పాటు, శారీరక పరిశుభ్రత కూడా పాటించాలంటుంది ఆర్యజనని. సంసారంలో ఒత్తిళ్లు ఉంటే వాటికి ఆమెను దూరంగా ఉంచాలి.ఇది తొమ్మిది మాసాలు ఆచరించవలసిన నియమం. శిశువులు జ్ఞానవంతులు కావడం గర్భం నుంచే మొదలవుతుందన్న స్పృహ సదా కలిగి ఉండాలి.

గర్భ సంచిలో, మాయ మధ్య ఈదులాడే శిశువుకీ, బాహ్య ప్రపంచానికీ ఉన్న బంధం గురించి మన పురాణాలు వర్ణించాయి. గర్భిణుల పట్ల సమాజం, కుటుంబం తీసుకున్న శ్రద్ధాసక్తులతో ఈ లోకంలోకి వచ్చి మహనీయులుగా అవతరించిన వారి గురించి చరిత్రలో చదువుతాం. ఛత్రపతి శివాజీ, రామకృష్ణ పరమహంస, వివేకానందులు అలాంటి వారే. అలాగే కొన్ని దశాబ్దాల క్రితం వరకు ఏ వర్గమైనా గర్భిణులను సకల మర్యాదలతో చూసేవారు. చరిత్రకు ఎక్కని అలాంటి వారు కన్న ఎందరో శిశువులు కూడా సమాజానికి గొప్ప సేవ చేశారు. విలువలు పాటించిన తరంగా అవతరించారు. విద్యావంతులయ్యారు. దేశ రుణం తీర్చుకోవాలన్న భావనతో జన్మించారు. గర్భిణికి ప్రత్యేక గౌరవం అనేది నేటికీ ఉంది. అది వేరే రూపం సంతరించుకుంది. మారుతున్న కాలంలో వారి స్థానంలో కొంత మార్పు వచ్చింది. ఇవి కాకుండా ఒత్తిడి, కాలుష్యం, ప్రతికూల ధోరణి విపరీతంగా పెరిగాయి. ఇవే గర్భస్థ శిశువు పాలిట ఆగర్భ శత్రువులు. ఈ బాహ్య దుష్పరిణామాలనే ఎపి జెనిటిక్స్‌ అంటున్నారు. వారసత్వంగా వచ్చిన జెనిటిక్స్‌ 20 శాతం కాగా, ఎపి జెనిటిక్స్‌ 80 శాతం. 23 తల్లి నుంచి, మరొక 23 తండ్రి నుంచి క్రోమోజోమ్స్‌ శిశువుకు ఆధారం. ఆ ఇద్దరి నుంచి మంచి లక్షణాలు వస్తే బిడ్డ సక్రమంగా ఆలోచించే వాడయి ఉంటాడు. కానీ జీన్స్‌కు సంబంధించిన శాస్త్ర రుజువులకు కూడా మినహాయింపులు ఉంటాయని చెబుతోంది స్పిరుట్యువల్‌ సైన్స్‌. అదే బాహ్య పరిణామాలను గమనించుకుంటూ, మనను మనం నియంత్రించుకోవడం. కాబట్టి ఏం చూడాలి? ఎలాంటివి చూడాలి? ఏది వినాలి? ఎలాంటివి వినాలి? అనేవాటి పట్ల పూర్తి అవగాహన ఉండాలని ఆర్యజనని బోధిస్తుంది.

చక్కని శిశువు ఈ భూమ్మీదకు రావాలంటే గర్భిణికి కావలసినది `ప్రశాంతత. రేపటి సమాజాన్ని నిర్మించి ఇచ్చే ఇలాంటి కీలక అంశం పట్ల పెళ్లి తతంగం నుంచి ఒక స్పృహ కలిగి ఉండాలని చెబుతోంది ఆర్యజనని. మనవైన భజన కీర్తనలు, గాయత్రి జపం, ధ్యానం, యోగ వంటివి నేర్పి గర్భిణులకు సహజంగా ఉండే భయాలతో పాటు ఎపి జెనెటిక్స్‌తో వస్తున్న అశాంతిని పారద్రోలుతారు. స్త్రీపురుషులు సమానులే. కానీ వారిద్దరు ఒకే శారీరక లక్షణాలు కలిగిన ఉన్నవారు మాత్రం కాదని ఆర్యజనని చెబుతుంది. గర్భం దాలుస్తారు కాబట్టి ఈ వాస్తవాన్ని మహిళలు దృష్టిలో ఉంచుకో వాలంటుంది ఆర్యజనని. ఒకప్పుడు మాతృత్వంలో భారతదేశానికి విశ్వంలోనే అగ్రస్థానం. దానిని తిరిగి తెచ్చుకోవాలి. అంటే అసలైన భారతీయతను కాలికస్పృహతో తెచ్చుకోవడమే.


పాఠ్య పుస్తకాలలో మన పురాణ గాథలేవి?

– స్వామి శితికంఠానంద, ఆర్యజనని రూపకర్త

మన దేశం, మన సంస్కృతి ఎంతో గొప్పవి. పదివేల ఏళ్ల నాగరికత మనది. ఎందరో మహా రుషులు తపస్సు చేసి, సముపార్జించి మనకు ఇచ్చిన మహోన్నత జ్ఞానమది. ఆ మహాజ్ఞానంలోను, చరిత్రలోను వాటిని కాపాడుకోవలసిన గొప్ప తరాన్ని సృష్టించడం గురించిన ఆలోచన కూడా ఉంది. కానీ ఇలాంటి మౌలికాంశాలన్నింటి మీద రానురాను శ్రద్ధ తగ్గిపోతోంది. ఆ తపోధనులకు వారసులమైన మనమే వాటిని స్వీకరించలేకపోతున్నాం. ఇలాంటి తరాలు తయారు కావడానికి కారణం నానాటికీ మనదైన జ్ఞానాన్ని, అంటే రుషులు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని విస్మరించడమేనని అనాలి. దానిని పునరుద్ధరించుకుని, భారతజాతి పునరుజ్జీవనం పొందాలంటే తల్లి గర్భం నుంచి పుడమి గర్భం వరకు సాగే మనిషి ప్రయాణం ఎలాంటిదో మనకు మనదైన వారసత్వం ఇచ్చిన పరిజ్ఞానం ద్వారా తెలియాలి. కొత్త తరాన్ని ప్రపంచానికి పరిచయం చేసే గర్భిణులకు సమాజం ఇవ్వవలసిన మానసిక, ఆధ్యాత్మిక మద్దతు ఇవాళ సమకూర్చలేకపోతున్నాం. ఆ మద్దతు మన నాగరికత ఇచ్చిన జ్ఞానం ఆధారంగా ఇవ్వాలి. అది మనకు ఎంతవరకు తెలుసో మనకే తెలియదు. కారణం ఇప్పటి విద్య. సెక్యులరిజం పేరుతో ఈ రోజున ఆ పదివేల ఏళ్ల నాగరికతను పక్కన పెడుతున్నారు. పాఠ్య పుస్తకాలలో రామాయణ గాథలేవి? భారత కథలు ఏవి? అలాగే జనం కూడా భాగవతం, లేదా భగవద్గీత చదడవం తగ్గిపోతోంది. ఇలాంటి వాతా వరణం రాను రాను తరాలలో ఏర్పడడానికి కారణం కూడా గర్భస్థ శిశువుల పట్ల సమాజం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకోకపోవడమే.

మనం పూర్తి మెటీరియలిస్టులుగా మారి పోతున్నాం. డబ్బు సంపాదన వెనుక పరుగులు తీస్తున్నాం. ఆధునిక సమాజంలో భావోద్వేగాలను నియంత్రించు కోలేకపోతున్నాం. ఫలితం సమస్యలు. సమస్యలు ఎందుకు వస్తాయి? చాలావాటికి మనం బానిసల్లా మారిపోతున్నాం కనుక! దీనికి పరిష్కారం మనకీ మానసిక నిపుణుల సంఖ్య పెరగాలని అనుకోవద్దు. అమెరికాలో లక్ష మందికి ఐదుగురు మానసిక వైద్య నిపుణులు ఉంటే, మన దేశంలో 2.5 లక్షల మందికి ఒక్కరే ఉన్నారని ఒక కథనం వచ్చింది. అదేమీ నష్టం కాదు. అసలు అలాంటి పరిస్థితే మనకు వద్దు. అది పరిష్కారం అనుకోవద్దు. వాటిని నియంత్రించడమూ సైన్సే. సబ్జెక్టివ్‌ ‌సైన్స్ అం‌దాం. అసలు మనిషిగా నేనేమిటి? నేనేం చేయాలి? అన్న ప్రశ్న రావాలి. వాటిని నియంత్రించుకోవాలంటే మనం మన మూలాలలోకి వెళ్లాలి. భగన్నామ స్మరణ చేయాలి. దీనికి మతం అని పేరు పెట్టవద్దు. ఆధ్యాత్మిక చింతన అనండి. మనం పురాణాలలో చదువుకున్నాం. శకుంతలా దుష్యంతుల కుమారుడు భరతుడు సింహప్పిల్లలతో ఆడుకున్నాడు. ఇప్పుడు సింహాల్లాంటి పిల్లలు పుట్టాలి. అందుకు పటిష్టమైన మానసిక స్థితి కలిగిన తల్లులు కావాలి. ఇందుకు జెనిటికల్‌ ‌ప్రయోగాల ద్వారా, అక్కడో ఉత్తమమైన జీన్స్, ఇక్కడో ఉత్తమమైన జీన్స్ ‌తీసి ప్రయోగాలు చేసి సమున్నత మానవుని సృష్టించడం వంటి ఆలో చనల కన్నా, మన పురాణాలు, మన చరిత్ర ద్వారా రుజువైన క్రమం కనిపిస్తున్నది కదా! ఈ స్థూల జగత్తును నడిపించే భగవంతుడిని నమ్ము కోవడం ద్వారా అది సాధించవచ్చు. మనకి రాశి అవసరం లేదు. వాసి కావాలి. ఇదంతా భ్రమ కాదు. ఆరోగ్య జనని దగ్గరకు వచ్చిన తల్లుల స్వీయానుభవాలు ఉన్నాయి. ఆరోగ్య జనని గురించి తెలియని కాలంలో కన్న తొలి బిడ్డకీ, తెలిసిన తరువాత కన్న బిడ్డకీ ఉన్న వ్యత్యాసం గురించి కేస్‌ ‌స్టడీస్‌ ‌కూడా ఉన్నాయి. మన భూమిలో జరిగిన మహా తపస్సు, మన పురాణ గాథలు ఆధారంగా జరగవలసిన ఇలాంటి కార్యక్రమం ప్రభుత్వం చేపడితే సెక్యులరిజానికి హాని జరిగిందంటూ అనవసరమైన అపోహలు వస్తాయి. కానీ ఇది రెలిజియన్‌ ‌కాదు, ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతకు విజ్ఞాన శాస్త్రాన్ని మేళవించి ఆర్యజనని రూపొందించాం. దీనిని రేపటి తరం తల్లులకు కూడా అందచేయాలన్నదే మా సంకల్పం. కళాశాలలకు వెళ్లాలి. చెప్పాలి.మనం ఎవరికైనా విషయాలు చెబుతాం. పాటిస్తే మంచి ఫలితాలు వచ్చాయన్నది సుస్పష్టం. పాటించడం, పాటించకపోవడ మన్నది వారిష్టం. కాబట్టి రామకృష్ణ మఠమే, సంఘీభావం కలిగిన వ్యక్తులతో ఆర్యజననిని నిర్వహిస్తోంది.


భావితరాన్ని అందించేదే గర్భిణి

– డాక్టర్‌ అనుపమా రెడ్డి (పిల్లల వైద్యురాలు)

జీన్స్‌ను బట్టి జననం ఉంటుందని సహజంగా ఉండే విశ్వాసం. ఒక గాయకుడు లేదా గాయని సంతానం మళ్లీ గాయకులవుతారని మనందరం నమ్ముతాం. కానీ పెంపకం అనేది కూడా ఉంది. పెంపకం వల్ల జీన్స్ ‌లక్షణం ఎలా మారగలదో విజ్ఞానశాస్త్రం ద్వారా, మనవైన అనేక పౌరాణిక, చారిత్రకు ఘట్టాల ఆధారంగా ఇక్కడ చెబుతాం. ఎలాగంటే ఒక శిశువులో 20 శాతం జెనిటిక్స్ ‌వారసత్వపరంగా ఉంటాయి. 80 శాతం ప్రభావం ఎపి జెనిటిక్స్‌వే. ఎపి జెనిటిక్స్ అం‌టే బాహ్య వాతావరణం శిశువు మీద చూపించే ప్రభావం. కాబట్టి ఎపి జెనిటిక్స్ ‌ప్రభావం అంటే స్విచ్‌ ఆన్‌ ‌చేసి మళ్లీ ఆఫ్‌ ‌చేయడమన్నమాట. వారసత్వం మీద జీన్స్ ‌ప్రభావం స్వీచ్‌ ఆన్‌, ఆఫ్‌ల వంటిది. ప్రహ్లాదుడి గాథే చూడండి! ఆయన రాక్షసరాజు కుమారుడు. వంశం అదే అయినా గొప్ప భాగవతోత్త మునిగా అవతరించాడు. కారణం- ఆయన గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు కల్పించిన బాహ్య వాతా వరణం. కాబట్టి బాహ్య పరిస్థితులు గర్భస్థ శిశువు భవిష్యత్తును నిర్దేశిస్తాయి.

ఆర్యజననిలో గర్భంలో శిశువు అంకుర దశ నుంచి జరిగే పరిణామాలను వివరించి చెబుతాం. పిండం మౌలిక లక్షణాల దగ్గర నుంచి వివరిస్తాం. గర్భస్థ శిశువు, పెరుగుదల ఒక అద్భుతం. నిమిషా నికి 2.5 లక్షల నరాలు శిశువులో నిర్మితమవుతూ ఉంటాయి. అలా తల్లిగర్భం నుంచి బయటపడేనాటికి  వంద బిలియన్‌ ‌నరాలు ఏర్పడతాయి. ఈ నరాల అభివృద్ధి దశే బిడ్డ భవిష్యత్తును నిర్దేశిస్తుంది. భవిష్యత్తులో బిడ్డ వ్యక్తిత్వానికి కూడా ఆ దశలోనే పునాది పడుతుంది. అయితే ఆ సమయంలో గర్భిణిలో ఒత్తిడి ఉంటే ఆ నరాల వృద్ధి సక్రమంగా జరగదు.  ఈ దశలో తల్లీ తండ్రి మధ్య ప్రేమాభిమానాలు, సఖ్యత ఉండాలి. అందరికీ మంచి చేయాలన్న సానుకూల దృక్పథం ఆ సమయంలో ఉండడం కూడా శిశువు మీద చక్కని ప్రభావం చూపుతుంది. కొన్ని సందర్భాలలో భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు ఉన్నా, తల్లి మీద ఒత్తిడి ఉంటుంది. ఈ దశలో ప్రతికూల లక్షణం కలిగిన బాహ్య పరిస్థితుల నుంచి గర్భస్థ శిశువును రక్షించుకోవడం ఎలాగో ఆర్యజనని ప్రణాళిక ద్వారా చెబుతాం. ఇదంతా ‘శిశువు తొలి వేయి రోజుల జీవితం’ అని పిలిచే కాలంలో అందిస్తాం.

ప్రతి గర్భిణికి సమస్యలూ, సందేహాలూ సహజం. వీటిని వైద్యపరంగా నివారించడం ఒకటైతే బాహ్య వాతావరణంలోని ప్రతికూలత గర్భస్థ శిశువు మీద పడకుండా జాగ్రత్త పడడం మరొకటి. దానిని ఎపి జెనిటిక్స్ అం‌టాం. అందులో కీలకమైనది ఒత్తిడి. ఒత్తిడి నుంచి తప్పించి తల్లిలో సానుకూల ఆలోచనలు కలిగించాలి. పాట, యోగ, ధ్యానం, చక్కని కథలు వినిపించడం వల్ల అలాంటి వాతావరణం కల్పించ వచ్చునని రుజువైంది. కీర్తనలు వినడం వల్ల మనిషి లోని ప్రతికూల లక్షణం మొత్తం అంతరిస్తుంది. గాయత్రి జపం వివరిస్తూ చెబుతాం. ఓంకారం శిశువుల మీద చూపే ప్రభావం విశేషంగా ఉంటుంది. నిజానికి ఎపి జెనిటిక్స్ ‌ప్రభావాన్ని సరిగ్గా గుర్తించక పోవడం వల్ల చాలా అనర్ధాలు జరుగుతు న్నాయి. నెలల తక్కువ పిల్లలు జన్మించేది ఒత్తిడి వల్లనే. ఆటిజం వంటి సమస్యలు ఉండడం కూడా దీనితోనే. ఇవి కాకపోతే పిల్లలు నాలుగేళ్ల వయసు వచ్చేసరికి వారిలో అది ప్రతిబింబిస్తుంది. విపరీత ప్రవర్తన కనిపిస్తుంది. ఇంకొంచెం వయసు వచ్చాక ఆత్మహత్యలు, జీవితంలో విఫలమైనామన్న భావన, విడాకుల ఆలోచనలు వంటివన్నీ కనిపిస్తున్నాయి. అందుకే ప్రతి గర్భిణి లేదా స్త్రీని భవిష్యత్‌ ‌తరాన్ని అందించే వ్యక్తిగా భావించాలి. మంచితరం రావడానికి మనవంతు కర్తవ్యం నిర్వహించాలి.


గర్భస్థ శిశువుకు స్పందనలుంటాయి

– వృషాలీరెడ్డి (క్లినికల్‌ ‌సైకాలజిస్ట్)

‘‌కాన్షస్‌ ‌పేరెంటింగ్‌’ ‌కావాలి అంటాం. అందుకు దోహదం చేసేదీ, కీలకమైనది అనుబంధం. సంతానానికీ, తల్లిదండ్రులకీ నడుమ అనుబంధం. అది ఎక్కడ నుంచి ప్రారంభం కావాలన్నదే ఇప్పుడు వేసుకోవలసిన ప్రశ్న. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి ఆ అనుబంధం ఉండాలి. ఇది చాలా ముఖ్యం. గర్భస్థ శిశువును ఎక్కడో పెరుగుతున్న ఒక మాటా మంతీ లేని జీవి అనుకోవద్దు. అది కూడా మనిషి లక్షణం కలిగినదే. దానికి స్పందనలు ఉన్నాయి. ఇప్పుడు తల్లీబిడ్డల మధ్య అలాంటి బంధం లేదా? ఉండవలసిన విధంగా అయితే లేదు.

చూడండి! పెళ్లి అవుతుంది. పెళ్లిలో ఏం చూస్తున్నారు? ఘనంగా పెళ్లి చేయడం. ఫోటో సెషన్‌. ‌మంచి బట్టలు తెచ్చుకుంటున్నారు. నగలు, ఇతర ఆడంబరాలు చూస్తున్నారు. ఇక్కడ మదికి రావలసిన ఒక్క అంశం రావడం లేదు. అది భార్య,భర్త ఎలా ఉండాలి? వారి మధ్య అన్యోన్యత లేదా ప్రేమాను రాగాలు ఎలా ఉండాలి? ఇవి పరిశీలనకు రావడం లేదు. ఆపై బిడ్డ కోసం ప్రణాళిక వేసుకుంటున్నారు. పుట్టిన వాళ్లకి ఎలాంటి వసతులు కల్పించాలి? ఎలాంటి చదువు? ఎలాంటి ఉద్యోగం? ఆఖరికి ఎలాంటి సంబంధం చూడాలి అన్నది కూడా ఉంటుంది. అంటే ఒక జీవితానికి ప్యాకేజీని నిర్ధారించుకున్నాక బిడ్డని కనాలని అనుకుంటున్నారు. అలాగే కంటున్నారు. ఇక్కడ జరుగుతున్నదేమిటీ అంటే, మొత్తం ప్రాపంచిక అంశాలే బిడ్డ జననాన్ని శాసిస్తున్నాయి. బిడ్డ కడుపులో పడిన తరువాత ఆ నవమాసాలు నిష్కల్మషమైన వాతావరణంలో తల్లిని ఉంచాలి. ఆ దృష్టి కరవౌతోంది.

గర్భస్థ శిశువులుగా ఉన్నప్పుడే సంతానంతో తల్లిదండ్రుల అనుబంధం ఆరంభం కావాలి. గర్భవతిని అన్న స్పృహ చాలామందిలో కనిపించడం లేదు. ఫోన్‌లో మాట్లాడుతుంటారు. చూస్తున్నదేమిటి అన్న స్పృహ లేకుండా టీవీ చానల్స్‌కు అంకితమైపోతూ ఉంటారు. పిల్లలు పుడతారు. వీళ్లకీ, తల్లిదండ్రులకీ మధ్య అనుబంధం లేదు. అనుబంధం రాదనే చెప్పాలి. ఎందుకంటే గర్భంలో శిశువు ఉన్నప్పుడు తల్లికి ఇవ్వవలసిన వాతావరణాన్ని కల్పించలేదు. ఇంకా, మొదటే అన్నీ సిద్ధం చేసుకున్నారు కాబట్టి, అన్ని సౌకర్యాలు, విలాసాలు వాళ్లకి అందుతాయి. అవే సర్వస్వం అనుకుంటారు వాళ్లు.

మరొక కోణం కూడా ఉంది. రెండేళ్లకో మూడేళ్లకో విడాకులు తీసుకునే తల్లిదండ్రులు. వీళ్ల పిల్లలకు వీరి ఎడబాటు గురించి అసలు స్పృహే ఉండదు. ఎందుకంటే అన్నీ ముందే అమర్చి పెట్టారు. ఇక తల్లిదండ్రుల మధ్య ఉండవలసిన అనుబంధం లేదా కుటుంబం కలసి ఉండడం గురించి వీళ్లకి పట్టదు. ఈ రెండు రకాల తల్లిదండ్రుల విషయంలో ఇలా ఎందుకు? గర్భస్థ శిశువు పట్ల వ్యవహరించ వసిన తీరుతెన్నుల గురించి వాళ్లకి వాళ్ల తల్లిదండ్రులు ఇవ్వలేదనే అనాలి. దాని ఫలితమే ఇది. మరొక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులతో బిడ్డలు అనుబంధంతో వ్యవహరించడానికి అనువైన వాతావరణాన్ని వారే పిల్లలకు ఇవ్వలేదు. ఇది ఇటీవలి తరాలు కోల్పోతున్న చిన్న తర్కం. అలాంటి అవాంఛనీయ వాతావరణాన్ని వీళ్ల తరం కూడా కొనసాగించ కూడదన్నదే, ఎక్కడో ఒకచోట ఆగాలన్నదే మా కోరిక. ఇప్పుడు పుట్టబోయే పిల్లల విషయంలో అయినా మనం జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబాలు సఖ్యంగా ఉంటాయి. మన సంస్కృతి కొనసాగుతుంది. దీనిని పునరుద్ధరించాలన్నదే ఆర్యజనని ఆశయం.

ఇదేదో కొత్త శాస్త్రీయ ఆవిష్కరణ కాదు. మేము ఏదో కొత్త విజ్ఞానాన్ని మీకు అందిస్తున్నామని కూడా కాదు. ఇదంతా 4 వేల ఏళ్ల మన గతం కూడా చెబుతోంది. బిడ్డ కడుపులో పడడం, కదలికలు, తల్లి అంతరంగం ఇవన్నీ కూడా కుడ్యచిత్రాలుగా శిల్పాల రూపంలో, శిలాశాసనాలలో ఉన్నాయి. అంటే మనమే మూసేసిన ఒక అధ్యాయాన్ని మళ్లీ తెరిచి అందులో ఏముందో, దాని ఫలితాలు ఎలా ఉంటాయో  మన గర్భిణులకు అందించాలన్నదే ఆర్యజనని ఆశయం.


తల్లి గుండెకు చేరువగా నవమాసాలు

– లక్ష్మి, ‘రామకృష్ణ ప్రభ’

బలమే జీవనం, బలహీనతే మరణం అన్నారు స్వామి వివేకానందులు. మనిషి కుంగిపోవడానికి బలహీనతే కారణం. అదే మానసిక బలహీనత. వివేకానందుల వారు జాతి పునర్నిర్మాణం అన్న భావనలో కీలకమైనది బలమే జీవనం. శితికంఠా నంద స్వామి చెప్పినట్టు మనది కర్మభూమి. పుణ్యభూమి. కానీ ఇన్ని కోట్ల జనాభాలో సంపూర్ణ వ్యక్తిత్వం కలిగినవారు కరువైపోవడం బాధాకరం. ఇప్పుడు మనిషిని బలహీనుని చేసే శక్తులే ఎక్కువ. అన్నీ నేర్చుకుంటారు. కానీ వాటిని ఆచరించడం దగ్గర మానసిక బలం లోపిస్తున్నది. మనిషిని నిర్వీర్యం చేసే వాతావరణం ఎక్కువ. జంతు జన్మ, మనిషి జన్మ తరువాత దివ్యత్వం అని కదా అంటారు. మానవులంతా  దివ్యత్వం సాధించాలి. ఇందుకు పుట్టుక ముందు నుంచి ప్రయత్నం జరగాలని మన పూర్వులు చెప్పారు. అది వాస్తవం. ఒక కొత్తజాతి ఆవిర్భవించాలనీ, అది శక్తిమంతమైన జాతి ఉద్భవించాలని వివేకానందులు కోరుకోవడం ఈ దృష్టితోనే. తన సందేశంతో ఈ విశ్వాన్ని ఊపేశారా యన. ఆయన తపన యావత్తు నవ నిర్మాణం కోసమే. అది కూడా సానుకూల చింతన కూడిన తరం కావాలని ఆకాంక్షించారాయన. కొత్తతరం మీద ఎంత నమ్మకమో చూడండి. అలాంటి తరంతో భారతమాత నిద్ర లేస్తుంది అంటారు స్వామివారు. ఆ తరంతో పునర్‌ ‌వైభవం సాధించాలని స్వప్నించారు. సత్వ గుణమే కావాలన్నారు వివేకానందులు. సత్వగుణం అంటే నెమ్మదితనం అనుకుంటే పొరపాటు. అదొక సమున్నత మానసిక స్థితి.

వివాహం నుంచి యువతీయువకులకు మనవైన నిర్మాణాత్మక ఆలోచనల మీద అవగాహన కల్పించాలి. కుటుంబం, దాని విలువ, విలువలతో కూడిన కుటుంబంతో వచ్చే సంతానం వంటి అంశాల మీద అవగాహన లేకుండానే పెళ్లిళ్లు జరిగి పోతున్నాయి. ఇక హడావిడి జీవితం సరేసరి. అందుకే ఇప్పటి తరం మానసిక బలహీనతతో పుడుతోంది. ఈ ఆత్మహత్యలేమిటి? చిన్న చిన్న విషయాలకి జీవితం అంతం చేసుకోవడం ఏమిటి? మానసిక వైద్యులను సంప్రతించని పిల్లలు లేరంటే నమ్మవలసిందే.

ఈ దుస్థితి నుంచి మన ఆశాజ్యోతులు బయటపడాలంటే తల్లే కీలక పాత్ర వహించాలి. తండ్రి బాధ్యత కూడా ఎంతో ఉంటుంది. దానినీ విస్మరించలేం. తల్లిదే ఎందుకు కీలకపాత్ర అంటే, నవమాసాలు మోస్తుంది. కొత్తగా ఈ ప్రపంచంలోకి రావడానికి ముందు ఆ శిశువు హృదయం తొమ్మిది మాసాలపాటు అనుసంధానమై ఉండేది అమ్మ హృదయంతోనే కదా! గర్భంతో ఉన్నప్పుడు తల్లి చేసిన ఆలోచన పిల్లలలో నిశ్చయంగా ప్రతిబింబిస్తాయి. ఇందుకు చరిత్రలో నేను చూసిన అద్భుత ఉదాహరణ జిజాబాయి.

జిజాబాయి గర్భం దాల్చినప్పుడు సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు ఎంత కల్లోలంగా ఉన్నాయో మనందరికీ తెలుసు. భారతీయత మొత్తం ధ్వంస మవుతున్నదన్న భయానక వాతావరణం. అంతా అరాచకం. ఆత్మగౌరవం లేని పరిస్థితి. ఇది బయటి పరిస్థితి అయితే, గర్భిణి జిజాబాయి భర్తకు కూడా దూరంగా ఉండవలసి వచ్చింది. అలాంటి సమయంలో ఆ భయానక వాతావరణానికి చలించిపోకుండా, ఈ దుర్మార్గాన్ని నిరోధించే బిడ్డ కావాలని ఆమె కోరుకుంది. నిరంతరం దాని గురించే ఆలోచించింది. ఫలితం- శివాజీ వంటి ధార్మిక, సాంస్కృతిక విలువలు కాపాడగలిగిన చరిత్రపురుషుడు జన్మించాడు. ఇక అతడిని ఆమె అందుకు అనుగుణంగానే తీర్చిదిద్దింది. అందుకే వివేకానందుల వారికి శివాజీ అంటే ఎనలేనని గౌరవం. గర్భస్థ శిశువుకీ, తల్లి ఆలోచనలకీ మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తిస్తూ ‘ఆర్యజనని’ మనదైన ఆధ్యాత్మిక చింతన ద్వారా తల్లుల మానసిక స్థితిని తీర్చిదిద్దుతుంది. ఆధ్యాత్మిక చింతన మనసుకు గొప్ప ప్రశాంతతను ఇస్తుంది. వీటన్నిటిలోని వాస్తవికత పునాదిగా సరైన సంతానాన్ని ఈ దేశానికి అందించేందుకు తన వంతు కృషి చేయాలనుకుంటోంది.

21-08-2021న రామకృష్ణ మఠం  (హైదరాబాద్‌)‌లో  స్వామి శితికంఠానంద, డాక్టర్‌ అనుపమ, వృషాలీరెడ్డి, లక్ష్మి ఇచ్చిన నాలుగు ప్రసంగాల సారాంశం..

ఆర్యజనని వెబ్‌సైట్‌ : aaryajanani.org


స్తన్యం కంటే ముందు అందేది సంస్కారమే

‘మాతృత్వ ఆదర్శ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి; నా జీవనయాత్ర ఆనందంగా, సాఫీగా సాగాలి’ అనే నిర్మాణాత్మకమైన, సమున్నతమైన భావన కలిగిన వారంతా ఆర్యజనని కార్యక్రమంలో పాల్గొనవలసిందని రామకృష్ణ మఠం కాబోయే మాతృమూర్తును ఆహ్వానిస్తున్నది. ఆర్యజనని ప్రచురించిన ‘మహనీయులు-పుట్టుక- కారణం’ అన్న చిన్న పుస్తకం వెనుక ఉన్న వాక్యాలలో ఇవీ ఉన్నాయి. ఇదొక చక్కని రచన. ఇందులోని అంశాలన్నీ పౌరాణికి ప్రమాణాలు. ఉత్తేజకరంగానే కాదు, ఆసక్తికరంగానూ ఉన్నాయి. ‘తల్లుల నుంచి సమున్నతమైన సంస్కారాన్ని అందిపుచ్చుకున్న బిడ్డలు మానవాళి భవితను సువర్ణమయం చేసిన ఘటనలు కోకొల్లలు’ అంటుందీ పుస్తకం. ఆ ఘట్టాలనే క్లుప్తంగా చెప్పారు.

ప్రహ్లాదుడు

గర్భస్థ శిశువు బయటి పరిస్థితులతో, మాటలతో ప్రభావితమవుతుందన్న విషయాన్ని చెప్పే గాథ ఇది. అలాగే గర్భంలో ఉన్నప్పుడు అబ్బిన సంస్కారమే తరువాత కూడా వృద్ధి అవుతుందని చెప్పే ఉదంతం కూడా. లీలావతి గర్భంలో ఉండగానే ప్రహ్లాదుడు నారద మహాముని భగవన్నామ స్మరణతో ప్రభావితుడై గొప్ప భాగవతోత్తముడవుతాడు.

శ్రీరాముడు

 బిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి దశరథుడు, రాణలు చేసిన తపస్సు శ్రీరామ కథగా ఎలా ఆవిష్కృతమైనదో, ప్రపంచ మానవాళికి దిక్సూచిగా ఎలా మిగిలి ఉందో ఈ కథలో చెబుతారు.

పాండవులు

పాండవులు వరప్రసాదం. దేవతల అంశం ఉన్నవారు. కుంతి, మాద్రిలకి వారు జన్మించారు. ఈ ఇద్దరు మహోన్నత స్త్రీలు. అలాగే గాంధారి కూడా గొప్ప మహిళ. కానీ ఆమెకు కౌరవులు జన్మించారు. ఇందుకు కారణం- గాంధారి మాత్సర్యం. తన కంటే ముందు కుంతి, మాద్రి బిడ్డలకు జన్మనివ్వడంతో ఆమె అసూయాగ్రస్తురా లైంది. అంటే గర్భస్థ శిశువుల మీద తల్లి మానసిక స్థితి ఎలా పనిచేస్తుందో చెప్పే గాథ ఇది.

అభిమన్యుడు

అభిమన్యుడికి పద్మవ్యూహంలోకి వెళ్లడమే తెలుసు. రావడం తెలియదు. అందుకు కారణం – అభిమన్యుడు సుభద్ర గర్భంలో ఉండగా అర్జునుడు పద్మ వ్యూహంలోకి వెళ్లడం గురించే చెప్పాడు. బయటపడే విధానం వినిపించలేదు. ఒక గర్భస్థ శిశువు మీద బయటి వాతావరణం ప్రభావం ఎంత గాఢంగా ఉంటుందో ఈ గాథ చెబుతుంది. ఇంకా పరీక్షిత్తు, మార్కండేయుల గురించి కూడా ఇందులో చెప్పారు.

మదాలస

ఇది పూర్తిగా తల్లి అంతరంగా నికీ, గర్భస్థ శిశువు హృదయానికీ మధ్య ఉన్న అవినాభావ సంబంధం గురించి చెప్పింది. మదాలస నలుగురు బిడ్డలను కన్నది. గొప్ప చింతనాపరులు కావాలంటూ మొదటి ముగ్గురుని కన్నది. వారు తపస్సుకు వెళ్లిపోయారు. మరి రాజ్యపాలనకు కావాలి కదా అంటే మరొక కొడుకును కని గొప్ప పాలకుడిని అందించింది.

ఆదిశంకరులు

ఆర్యాంబ, శివగురులకు శంకర భగవానుడి వరప్రసాదం శంకర భగవత్పాదులు. అల్పా యుష్కుడైన మహా పురుషుడిని ఆ దంపతులు కోరుకోవడం ఈ కథలో గొప్ప తాత్త్వికాంశం. పుట్టే బిడ్డ గొప్ప జ్ఞానవంతుడు కావాలని కూడా అమ్మలు కోరుకోవాలని ప్రబోధించే అజరామర గాథ.

శివాజీ

పరిపూర్ణ ఆధ్యాత్మిక సంపన్నత కలిగిన జిజాబాయి కుమారుడాయన. హిందూ ధర్మం మనుగడ ప్రశ్నార్థక మైన క్షణాలలో పుట్టిన ఆయన ఆ ధర్మం ఔన్నత్యాన్ని కాపాడిన వీరుడయ్యాడు.

పరమహంస

పేదరికానికీ, మహోన్నతులు జన్మించడానికీ సంబంధం లేదని చెప్పే గొప్ప గాథ ఇది. తల్లి దండ్రులు ఇచ్చిన సంస్కారంతో గొప్ప భక్తుడయ్యాడు. వివేకానందుని వంటి శిష్యుడిని ఈ ప్రపంచానికి ఇచ్చాడాయన.

వివేకానందులు

ఆయనను గర్భంలో మోస్తున్నప్పుడు తల్లి నిరంతరం నిరంతరం ఆధ్యాత్మిక చింతనలోనే గడిపింది. కాశీ విశ్వనాథుని వరంతో పుట్టిన ఆయన హైందవ వాణి విశ్వానికి పంచారు.

ఇందులో అభిమన్యుని తల్లి ఉత్తర చేసిన ప్రార్ధన ఒకటి తప్పక చదవాలి. భారత గాథ అయినా వర్తమాన కాలానికి దాని సారాంశం యథాతథంగా సరిపోతుంది. ప్రళయాగ్ని జ్వాలలతో ఒక భయంకర బాణం నా కడుపులో ఉన్న కసుగాయను లక్ష్యంగా చేసుకుని వస్తోంది. నీవే నన్ను రక్షించాలి అని భగవానుని వేడింది.

నిజమే, ఈ రోజు అలాంటి బాణాలు కోకొల్లలు. వాటి నుంచి గర్భస్థ శిశువును రక్షించుకోవడం పెద్ద సవాలే మరి. కానీ మన వంతు ప్రయత్నం మనం చేయాలి. ఇలాంటి గాథలు చదవడం అందుకు కావలసిన మానసిక సంసిద్ధతను సంతరించుకోవ డానికే కదా!

వీటితో తెలిసే గొప్ప సత్యం –

స్తన్యం కంటే ముందు సంస్కారమే తల్లి నుంచి అందాలి.

About Author

By editor

Twitter
Instagram