ఆగస్ట్ 14 ‌సంస్మరణ దినం

సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ శ్రావణ  బహుళ పాడ్యమి

23 ఆగస్టు 2021, సోమవారం

అసతో మా సద్గమయ  తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ  – బృహదారణ్యకోపనిషత్‌


ఆగస్ట్ 15, 1947‌న స్వాతంత్య్రం వచ్చింది. ఇది సత్యం. మరోపక్క అఖండ భారత్‌ ‌రెండు ముక్కలైంది. ఇది చేదునిజం. ఈ విభజన ప్రపంచ చరిత్రలోనే రక్తపంకిల ఘట్టమనేది కఠోర చారిత్రక వాస్తవం. ఇది ఈ దేశ ప్రజల రక్తంలో ఇంకాలి, కేవలం గుర్తు చేసుకోవడం కాదు. ఇది గాయాన్ని రేపడం కాదు. దేశం స్వతంత్రమవుతోందన్న వార్త వినడమే కానీ, దాని ఫలాలలను ఒక్క గంట కూడా అనుభవించలేక, అప్పటి చారిత్రక తప్పిదాలకు బలైన అమాయక భారతీయులకు నివాళి ఘటించడం మాత్రమే. జనవరి 30న సమరయోధులను తలుచుకున్నట్టే, లక్షలలో ఉన్న విభజన బలిదానాలకూ నివాళులర్పించడం ప్రతి తరానికి ఉన్న విధ్యుక్త ధర్మం. ఏటా ఆగస్ట్ 14‌వ తేదీని ఇకపై విభజన గాయా సంస్మరణ దినంగా జరుపుకుందామని  ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు ఉద్దేశం అదే. 74 ఏళ్లుగా ఆ బలిదానాలకు దక్కని మర్యాద ఇక నుంచి దక్కాలి. 

ఎలాంటి గాయాన్నయినా కాలం మాన్పగలదని అంటారు. కానీ విభజన భారతజాతికి చేసిన గాయం మాత్రం ఇప్పటికీ మానలేదు. ఆ దుర్ఘటన మీద కొన్ని లక్షల పేజీల సమాచారం లేదా సాహిత్యం వెల్లువెత్తింది. చరిత్రకారులే కాదు, సృజన్మాతక రచయితలే కాదు, నాటి క్షతగాత్రులు కూడా ఆ పీడకలలను అక్షరాలతో గుదిగుచ్చారు. వాటిని నమోదు చేసి గుండెమంటను శాంతింప చేసుకున్నారనాలి. రక్తంతో తడసిన ఊళ్లు, శవాల గుట్టలతో వచ్చిన రైళ్లు, బూడిదగుట్టలైన ఇళ్లు, స్త్రీల పిల్లల ఆర్తనాదాలు ఆ కొన్ని రోజులను వణికిం చాయి. ఆ ఉన్మాదం చూసి అహింసామంత్రం విఫలమైంది. చిత్రంగా, బ్రిటిష్‌ ఇం‌డియా సైనికులు, పోలీసులు అహింసామూర్తులైపోయారు. భారత్‌కు హిందూ-ముస్లిం కలహాలు కొత్తకాదు. ముస్లింలీగ్‌ ‌బలపడినాక వాటి స్వరూపమే మారింది. ముస్లింలకో దేశం అన్న ఉన్మాదం తకెక్కిన తరువాత స్వైర విహారం చేసిన క్రూరత్వం ముందు రాక్షసత్వం, పశుత్వం తలదించు కున్నాయి. ఇది వాస్తవం, ప్రపంచం అంగీకరించిన సత్యం. ఆ అనంత దుఃఖం ముమ్మాటికీ  జాతీయ కాంగ్రెస్‌ ‌బుజ్జగింపు ధోరణి ఫలితం. అమృతా ప్రీతమ్‌, ‌భీష్మ సహానీ, గుల్జార్‌, ‌కుల్దీప్‌నయ్యర్‌, ‌కుష్వంత్‌ ‌సింగ్‌, ‌సాదత్‌ ‌హసన్‌ ‌మంటో, ఇస్మత్‌ ‌చుగ్తాయ్‌ ‌వంటి ఎందరో ఆనాడు గాయపడిన మనిషితనానికి అక్షరరూపం ఇచ్చారు.

ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలకు స్వతంత్ర హోదా ఇవ్వాలని 1940నాటి లాహోర్‌ ‌సమావేశాలలో ముస్లిం లీగ్‌ ‌తీర్మానించింది.  ఆ మాటకే నాటి చాలా పత్రికలు ‘పాకిస్తాన్‌’ అన్న రూపాన్ని ఆపాదించాయన్న విమర్శ ఉంది. అంటే జిన్నా అంతరంగాన్ని అనుకోకుండా పత్రికలు చాటిచెప్పాయి. ఆగస్ట్ 16, 1946‌న ముస్లింలీగ్‌ ‌నాయకుడు మహమ్మదలీ జిన్నా ప్రత్యక్ష చర్య దినం అంటూ బొంబాయిలో పిలుపునిచ్చాడు. ఆ పిలుపు హుసేన్‌ ‌షహీద్‌ ‌సుహ్రావర్ది (ముస్లింలీగ్‌) ‌ముఖ్యమంత్రిగా ఉన్న కలకత్తాలో ప్రతిధ్వనించింది. విభజన నెత్తుటి కాండకు అదే ఆరంభం. 4000 మంది చనిపోయారు. లక్ష మంది నిరాశ్రయులయ్యారు. అత్యంత బీభత్సమైన నౌఖాలి హత్యలు ఆ ఆక్టోబర్‌ 10‌న జరిగాయి. రక్తం రుచి మరిగిన లీగ్‌ ‌రక్తక్రీడను నిలువరించడానికి జాతీయ కాంగ్రెస్‌ ‌చేసినదల్లా ఉపవాసాలు, ఉపన్యాసాలు, ఉపదేశాలే. కాగల కార్యాన్ని గంధర్వులే తీర్చారని బ్రిటిష్‌ ‌సర్కారు భావించింది. జూన్‌ 3, 1947 ‌దేశ విభజన ప్రణాళికను జాతీయ కాంగ్రెస్‌, ‌లీగ్‌ ఆమోదించాయి. చిత్రం, అంతవరకు స్వరాజ్య సమర సేనానిగా వెలిగిన గాంధీజీకి అంతటి  చరిత్రాత్మక సమావేశంలో స్థానం దక్కలేదు. సేనాని ప్రమేయం లేకుండా సమరం ముగిసింది.

బారిస్టర్‌ ‌సిరిల్‌ ‌రాడ్‌క్లిఫ్‌ ‌నేతగా బౌండరీ కమిషన్‌ ఏర్పాటయింది. మెహర్‌చంద్‌ ‌మహాజన్‌, ‌తేజ్‌సింగ్‌ (‌కాంగ్రెస్‌), ‌దీన్‌ ‌మహమ్మద్‌, ‌మహమ్మద్‌ ‌మునీర్‌ (‌ముస్లిం లీగ్‌) ‌సభ్యులు. అంటే ఆంగ్లేయుడు సహా ఐదుగురు సభ్యుల ఆ కమిషన్‌లో ముగ్గురు భారత వ్యతిరేకులే. కాలదోషం పట్టిన భౌగోళిక పటాలతోనే  విభజన ఘనకార్యం పూర్తి చేసినట్టు ఒక సందర్భంలో రాడ్‌క్లిఫ్‌ అం‌గీకరించాడు. అసలు లాహోర్‌ ‌మీదే (భారతీయులది), కాని చివరిక్షణంలో నిర్ణయం మారిందని ప్రఖ్యాత పత్రికా రచయిత కుల్దీప్‌ ‌నయ్యర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో (1971)లో ఆయనే చెప్పడం ఇంకా చిత్రం. అంతకు మించిన ఘోరం, 1948లో స్వాతంత్య్రం ఇస్తామని చెప్పి, ముస్లిం లీగ్‌ ‌బెదిరింపులతో ఆగస్ట్ 15, 1947‌నే అదరా బాదరా ఇచ్చారు. దేశ విభజన అధికారికంగా 17వ తేదీన జరిగింది. 1,700 కిలోమీటర్ల సరిహద్దు నిర్ణయం ఇంత హడావిడిగా, ప్రణాళిక లేకుండా జరిగింది. ఫలితం- ఆనాటి ఘోరకలి.

ఎంతమంది చనిపోయారు? రెండు లక్షల నుంచి 20 లక్షలు. ఇందులో హిందువులు ఎంతమంది? మహిళలు ఎందరు? ఇంతవరకు తెలియదు. ‘రెండు నుంచి ఇరవై లక్షలు’ అనే కాకిలెక్కే ఆ ప్రాణాల పట్ల స్వతంత్ర భారత తొలితరం పాలకులకు ఉన్న గౌరవాన్ని తెలియచేయడం లేదా? లైంగిక అత్యాచారాలకు గురైనవారు, ఆచూకీ లేకుండా పోయిన మహిళలు, బాలికలు 75,000 నుంచి ఒక లక్ష. అటు లాహోర్‌లో ఊచకోతకు గురైన 35 మంది సిక్కుల దేహాల నుంచి నెత్తురోడుతుండగానే ఇటు ఆగస్ట్ 14, 1947 అర్ధరాత్రి ఎర్రకోట మీద నెహ్రూ గంభీరోపన్యాసం ఇచ్చారు- ఆనాటి కన్నీళ్ల ఊసే లేకుండా.

చరిత్ర అధ్యయనంలో, అవగాహనలో ‘అయితే’ (ఇఫ్‌) అనే భావనకు చోటు లేదు. కానీ వర్తమాన పరిస్థితులను, అంటే మన జీవితాలను చరిత్ర ప్రభావితం చేస్తుంది, చేస్తోంది. ఒక పురాతన భూమి స్వతంత్రం సాధించిన క్షణాలు ఇవ్వగలిగే ఆనందాన్నే కాదు, అసలు ప్రాణాలనే కోల్పోయిన అభాగ్యులను తలుచుకోవడం విధాయకం. రెండు నిమిషాలు మౌనం పాటించడం దేశ పౌరుల ధర్మం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram