సంపాదకీయం

శాలివాహన 1943 శ్రీ ప్లవ శ్రావణ బహుళ అష్టమి – 30 ఆగస్టు 2021, సోమవారం


మానవ చరిత్ర మీద, మానవత్వం మీద తాలిబన్‌ ‌వేస్తున్న తాజా నెత్తుటి అడుగులలో కొందరికి ‘దివ్యత్వం’ కనిపించడం ఈ కాలపు దౌర్భాగ్యమే. మతోన్మాదం తలకెక్కిన మూకల అమానుషత్వం నుంచి బీజేపీ, హిందుత్వ వ్యతిరేక వాతావరణం సృష్టించుకోవాలని చూడడమూ అలాంటిదే. ఇది ఈ దేశంలో యథేచ్ఛగా సాగిపోతోంది. ముస్లిం మతోన్మాదులు, అర్బన్‌ ‌నక్సల్స్, ‌స్వయం ప్రకటిత మేధావులు అందుకోసం పడుతున్న తపన పరమ జుగుప్సాకరంగా ఉంది. కుళ్లిన మెదళ్ల నుంచి వచ్చిన రోగగ్రస్థ దృష్టే ఇదంతా. తాలిబన్‌ ‌పిడికిలిలో క్షణం కూడా ఉండలేమంటూ అఫ్ఘానిస్తాన్‌ ‌సాధారణ ప్రజలు విమానాశ్రయాలకి పరుగులు తీస్తున్నారు. మా బతుకులు ఇంతే, మా పిల్లలైనా చల్లగా ఉండాలి, మీరు తీసుకోండి అని వేడుకుంటూ నిన్నటిదాకా శత్రువుల్లా చూసిన అమెరికా, బ్రిటన్‌ ‌సైనికుల చేతుల్లో బిడ్డలను ఉంచుతున్నారు తల్లులు. మునుపటి ఆ ముష్కరపాలన గుర్తుకు వచ్చి కాదా ఆ కఠోర నిర్ణయాలు? ఇక కాబూల్‌ ‌విశ్వవిద్యాలయంలో యువతుల ప్రవేశం నిషేధించారు. పెళ్లిళ్లకి బాలికలను అప్పగించాలట. విధవలైతే ఉపయోగించు కుంటారట.

అయినా భారతదేశంలో ఆ రాక్షస మూకలకు నైతిక మద్దతు లభించడమే దౌర్భాగ్యం. భావ ప్రకటనా స్వేచ్ఛ చాటున జరుగుతున్న విషప్రచారానికి ఇది పరాకాష్ట. షరియత్‌తో పాలిస్తామంటూ హుంకరిస్తున్న శక్తులకు నైతిక మద్దతు పలకడంలోని హేతుబద్ధత ఏమిటి? కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370‌ని పునరుద్ధరించక పోతే అఫ్ఘాన్‌లో అమెరికాకు పట్టిన గతే ఢిల్లీ పెద్దలకూ పడుతుందని శ్రీనగర్‌లో కూర్చుని శాపనార్థాలు పెడుతున్నారు మెహబూబా ముఫ్తీ అనే ఉగ్రవాద రాజ పోషకురాలు. తాలిబన్‌ ‌పోరాటం భారత స్వాతంత్య్ర సమరం వంటిదని ఒక సమాజ్‌వాదీ పార్టీ అజ్ఞాని అంటే, తాలిబన్‌ను మంగళ్‌ ‌పాండేతో పోల్చే అధముడు మరొకడు.తాలిబన్‌ ఉ‌గ్రవాదాన్ని చూపించి, హిందూ ఉగ్రవాదాన్ని దాచిపెట్టలేరంటూ అత్యంత హేయమైన వ్యాఖ్య చేసింది -నటి పేరుతో చెలామణి అవుతున్న అర్బన్‌ ‌నక్సల్‌ ‌స్వర భాస్కర్‌. ‘ఐ ‌లవ్‌ ‌తాలిబన్‌’- ఇది కర్ణాటకలోని జమాఖండి ప్రాంతంలో ఉండే ఆసిఫ్‌ ‌గల్గలి అనే దివాంధుడు పెట్టిన పోస్ట్. ‌తాలిబన్‌ను స్వాగతిస్తూ పోస్ట్ ‌పెట్టినందుకే అస్సాంలో ఒక వైద్య విద్యార్థి సహా 14 మంది కటకటాల వెనక్కి వెళ్లవలసి వచ్చింది. సామాజిక మాధ్యమాలలో చెలరేగిపోతున్న పోస్టులు ఈ సమాజం ఎంత రోగగ్రస్థమైందో అద్దం పడుతున్నాయి.

భారత స్వాతంత్య్ర సమరంతో తాలిబన్‌ ‌దుండగీడుతనాన్ని పోల్చేవాళ్లకి మన స్వరాజ్య సమరం గురించి నిజంగానే తెలియదా? లేకపోతే తాలిబన్‌ ‌చేస్తున్నదంతా కంటికి ఇంపుగా ఉందా? ఒక ముష్కరుల గుంపు, రక్తదాహంతో వేగిపోతున్న మూక తెచ్చే మత రాజ్యం మీద ఇంత ప్రేమా? ఒక సమున్నత ఆశయంతో, ప్రజాస్వామ్య దృష్టితో, త్యాగబుద్ధితో, మేధో పరిపక్వతతో భారత స్వాతంత్య్రం కోసం పోరాడిన ఆ మహనీయ నేతలు ఎక్కడ! మత సూత్రాలు ఉల్లంఘించినందుకు శిక్ష అంటూ మహిళలను నడిబజార్లో కొరడాలతో కొట్టే, రాళ్లతో కొట్టి చంపే మధ్యయుగాల ఉన్మాదులు ఎక్కడ? జీవన వైవిధ్యానికీ, భారతీయత చెప్పే సమధర్మ సమభావనకీ శిరసు వంచిన మన స్వరాజ్య సమరనేతలు ఎక్కడ? ముస్లిమేతరుల మీద జిజియా పన్ను విధించే మతోన్మాదులు ఎక్కడ? తాలిబన్‌ ‌నెత్తుటికాండను భారత స్వరాజ్య సమరంతో పోల్చడం మహా నేరం. మానవాళికి ద్రోహం. ఇలాంటి పోలిక పెట్టినంత మాత్రాన తాలిబన్‌ ‌నెత్తుటి కాండకు గౌరవం రాదు. నెత్తుటిచుక్కకు పచ్చబొట్టు విలువ రాదు.

మెదళ్లు కుళ్లిన ఇలాంటి వాళ్లకి కళ్లూ చెవులూ ఎందుకు పనిచేస్తాయి? నేనే అధికారంలో ఉంటే అఫ్ఘాన్‌ ‌శరణార్థులకు నీడనిచ్చేవాడినని జమ్ముకశ్మీర్‌ ‌మాజీ ముఖ్యమంత్రి, మరొక వేర్పాటువాది ఒమర్‌ అబ్దుల్లా అన్నాడు. ఐక్య రాజ్యసమితి మానవహక్కుల సంఘం అత్యవసరంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వెల్లడైన వాస్తవాలేమిటో వీళ్లెవరికీ అవసరం లేదా? 1991లో తాలిబన్‌ ‌గద్దెనెక్కినప్పుడు పోటీపడి ఆ ప్రభుత్వాన్ని గుర్తించిన దేశాలలో ఒకటి రెండు ముస్లిం దేశాలు తప్ప మిగిలినవి అఫ్ఘాన్‌ ‌శరణార్థులకు అసలు తలుపులే తీయడంలేదు. తాలిబన్‌ ‌ప్రధానంగా సున్నీ వర్గం. కానీ మీరు ఎంతమందైనా రావచ్చునంటోంది షియా ప్రాబల్యం ఉన్న ఇరాన్‌. అఫ్ఘాన్‌లో షియా పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో తెలిసినా ఇదొకరకం బుజ్జగింపు. ఇప్పుడు అక్కడ మాత్రమే దాదాపు 38 లక్షల శరణార్థులు ఉన్నారు. తాలిబన్‌ను అల్లారు ముద్దుగా పెంచిన పాకిస్తాన్‌ 30 ‌లక్షల మంది శరణార్థులను అనుమతించి, ఇక వల్ల కాదని సరిహద్దులు మూసేసింది. మతోన్మాదానికి ఎర్రతివాచీ పరిచే దేశాలన్నింటిని ఏకం చేసి, నాయకుడిని కావానుకుంటున్న టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్‌ అఫ్ఘాన్‌ ‌శరణార్థులలో ఇప్పుడు ముస్లిం సహోదరత్వం కాదు, వారెంత భారమో చూస్తున్నాడు. ఇంకా చిత్రం, శరణార్ధులు రాకుండా గోడ కట్టుకుంటున్నాడు. ఇక ఏ ధనిక ముస్లిం దేశం ఆ శరణార్థులను అనుమతించడం లేదు. చైనా దగ్గరకే రానివ్వదు. ఇవన్నీ మన సెక్యులరిస్టులకి ఎందుకు పట్టడం లేదు? ఉన్మాదులను మించిన ఉన్మాదం కాదా ఇది! ఎవరు మాట్లాడిస్తే మాట్టాడుతున్న మాటలు?

 ‘ఎముకలు క్రుళ్లిన/ వయస్సు మళ్లిన/ సోమరులారా చావండి’ అన్నాడు కవి. మెదళ్లు కుళ్లినవాళ్లకి కూడా అలాంటి పిలుపు తక్షణం ఇవ్వాలి. ఎవరో ఒక కవి కాదు, ఈ దేశమే ముక్తకంఠంతో ఇవ్వాలి. కాగా భారత్‌కు ఇది క్లిష్ట సమయం. వేటికీ చలించకుండా సీఏఏకి కట్టుబడి ఉండడమే అవసరం. భారత్‌ ‌కోసం పనిచేసిన వారికీ, తాలిబన్‌ ‌వ్యతిరేక దేశాధినేతలకీ పరిమితంగా వీసాలు ఇచ్చే అవకాశం ఉందని కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ చర్య ఈ చట్టానికి తూట్లు పొడిచేందుకు పొంచి ఉన్న శక్తులకు అవకాశం ఇచ్చేదే!

About Author

By editor

Twitter
Instagram