జాగృతి – ఎండివై రామమూర్తి స్మారక నవలల పోటీలో మొదటి బహుమతి పొందిన రచన

‘‘సుధీర మాకు అన్ని విధాలా నచ్చింది. అన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీరు ఒకసారి ఇక్కడికి వస్తే, బావుంటుంది.’’ అని విక్రాంత్‌ ‌తండ్రి ఫోన్‌ ‌చేసారని సుధాకర్‌ ‌భాస్కరరావుకు మెసేజ్‌ ‌పెట్టాడు.

ఆరోజు అంతా సుధీర మనసు మనసులో లేదు. అమెరికా గురించి గూగుల్‌లో చూస్తోంది. విక్రాంత్‌ ఉం‌డే ప్రదేశం. అక్కడికి ఏ ప్రదేశాలు దగ్గర, ఏవి చూడచ్చు, వాటి బొమ్మలు చూస్తూ అక్కడ ఏం దొరుకుతాయో, దేనికి ఆ ఊరు ప్రత్యేకమో అన్నీ ఎంతో ఉత్సాహంగా చూస్తోంది. అక్కడి ఇళ్లూ, పచ్చని లాన్‌ల మధ్య సన్నటి సిమెంటు దార్లు, తనని అక్కడ ఊహించుకుంటూ ఆమె మనసు ఎక్కడికో వెళ్లిపోతోంది.

అసలు కల్లో కూడా అనుకోలేదు, తను అమెరికా వెళ్తుందని. ఎందుకంటే అమెరికా అబ్బాయిలందరూ ఇంజినీరింగ్‌ ‌చదివిన అమ్మాయిలే కావాలనుకుంటు న్నారు. లేదా అక్కడే ఎమ్మెస్‌ ‌చేస్తున్న అమ్మాయిలని వాళ్లే చూసుకుంటున్నారు. తను ఇంజినీరు కాదు. అమెరికాలో పైచదువుల కోసం ఉండడం లేదు. తను బీకాం చేసింది. కంప్యూటర్‌ ‌క్లాసులకెళ్లింది. ఎమ్మెస్‌ ఆఫీసు చేసింది. ఉద్యోగం కోసం కావలసిన చదువు చదువుకుంది. చక్కటి ఉద్యోగం వచ్చింది. అమెరికా సంబంధానికి కావలసిన అర్హతలు తనకి లేవు. అలాంటిది తనని ఇష్టపడి చేసుకుంటున్న విక్రాంత్‌ ‌విషయం, తన పెళ్లి విషయం తన ఫ్రెండ్స్‌కి చెప్పాలా, వద్దా. చెప్తే ఎప్పుడు చెప్పాలి. ముహూర్తం పెట్టాక చెప్తే బావుంటుందనిపించింది.

ఇంక స్వర్ణ, భాస్కరరావులు కూడా ప్రతీ నిమిషం పెళ్లి మాటలే…‘‘పెళ్లి ఫిబ్రవరిలో చేస్తే బావుంటుంది. అప్పుడే చెయ్యమని అడుగుదాం. సుధాకర్‌కి చెప్దాం, ఫిబ్రవరిలో ముహూర్తం చూడమని. మగ పెళ్లి వారు తొందరగా ముహూర్తం పెట్టి పంపిస్తే బావుంటుంది. ఏ రోజుకి కుదిరిందో తెలిస్తే మనం మన ఏర్పాట్లు చేసుకోవచ్చు. ముందు హాలు అదీ దొరకాలి. ఆ తరవాత పెళ్లి పత్రికలు వేయించాలి. ఎలా చెయ్యాలి? ఎక్కడ చెయ్యాలి? వచ్చిన వాళ్లకి ఏం పెట్టాలి? ఎంతలో పెట్టాలి? ఇలా ఇలా – ఎన్నో పనులున్నాయి. పట్టు చీరలకి చెన్నై వెళ్తే బావుంటుంది. బరేలీలో ఉన్న పెద్దమ్మాయి రజనిని రమ్మని చెబుదాం. దాన్ని కూడా తీసుకెళ్దాం. దానిక్కావలసినది అది తీసుకుంటుంది.’’ అని స్వర్ణ, భాస్కరరావు మాట్లాడుకుంటున్నారు.

వీళ్ల మాటలు ఇలా ఉంటే సుధీర ఆలోచనలు ఇప్పుడు మరో వైపు మళ్లాయి. పెళ్లి అయ్యాక విక్రాంత్‌ ఊరు వెళ్లాలి. ఓ విధంగా పల్లెటూరు, చాలా మంది బంధువులు వస్తూంటారు, వెళ్తూంటారు అని విక్రాంత్‌ ‌మాటల్లో అన్నాడు. బంధుప్రీతి ఎక్కువ. అలాంటి వాళ్ల మధ్య ఉండగలదా! అమ్మా వాళ్లు అక్కడ ఉండాల్సిన అవసరం లేదన్నారు, పెళ్లయ్యాక ఓ వారం పదిరోజులు తప్పనిసరిగా ఉండాలి అంతే కదా, అయినా అవి పెద్ద ఆలోచించాల్సిన విషయాల్లాగా అనిపించడం లేదన్నారు. కాని వారం కూడా ఎక్కువే. మనుషుల మధ్య కష్టం అనుకుంది.

‘‘కట్నం ఎంత అంటారో, వాళ్లకి ఇద్దరమ్మాయి లున్నారు, లాంఛనాలంటారు. ఏం అడుగుతారో’’ అని అంది స్వర్ణ.

‘‘కట్నం అడిగితే మాత్రం నేను చేసుకోను. మనం కూడబెట్టిన డబ్బుని వాళ్లకి ఇవ్వడం ఏంటీ? మనం ఇచ్చిన డబ్బుని వాళ్లు తమ ఖర్చులకి వాడుకోవడం ఏంటీ? అయినా ఈ పెళ్లి నా ఒక్కదానికే కాదు విక్రాంత్‌కి కూడా కదా. వాళ్లు కూడా ఖర్చు పెట్టుకోవాలి. వాళ్లు మనల్ని డబ్బు అడుగుతే మనం కూడా వాళ్లని అడుగుదాం.’’ ఆవేశంగా అంది సుధీర.

‘‘మతి లేకుండా మాట్లాడకు. నువ్వు ఇప్పటి నుంచి గొడవ పెట్టకు. ఆది నుంచి వస్తూన్నదే. ఎంతో కొంత ఇవ్వడం అన్నది ఉంది. భూములూ, కోట్లూ అడగడం మనవాళ్లల్లో లేదు. మేము నీ పెళ్లి కోసం కొంచెం కొంచెంగా దాస్తూ వచ్చాం. అది ఇప్పుడు ఉపయోగపడుతుంది. అప్పు చేయక్కర్లేకుండానే పెళ్లి జరిగిపోతుందనే అనుకుందాం. రజనికి కట్నం ఇవ్వక్కర్లేకుండానే పెళ్లి అయింది. ఇది కూడా అలాగే అవుతుందని నాకనిపిస్తోంది.’’

‘‘మరి మీ సంగతేంటీ, దాచిన డబ్బుని నా పెళ్లికి ఖర్చు పెట్టేస్తే..?’’ కోపంగా అంది.

‘‘చాల్లే. మొన్న నీ పుట్టిన రోజు అంటూ పార్టీ ఇవ్వలేదూ. ఆ రోజున ఎన్ని వేలు ఖర్చు పెట్టావో నీకు గుర్తుందా! ఆ రోజున మేము ఏమన్నా అడిగామా? లేదు కదా. వాళ్లంతా నీకు బహుమతులివ్వలేదూ ఇది కూడా ఇంచు మించు అలాంటిదే. కానీ డిగ్రీల్లో తేడా అంతే. ఈ రోజుల్లో చిన్నపిల్లల పుట్టినరోజులకి రిటర్న్ ‌గిఫ్టులిస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా అంతే. పెళ్లికి వచ్చిన వాళ్లకి ఏదో మనకి తోచింది పెట్టాలి. నువ్వేం మాట్లాడకు.’’

‘‘అది ఇది ఒకటి కాదు. అది కొన్ని వేలే. కానీ పెళ్లంటే లక్షలు’’ అంది కాస్త తగ్గి.

‘‘ఆ.. ఈ మాటలన్నీ పైపైనే. పెళ్లికి ముందు అమ్మాయి లందరూ ఇలాగే అంటారు. ఎన్నో విన్నాం, ఎన్నో చూసాం. నువ్వు నీ నగలు, చీరలు ఎంత రేంజ్‌లో కొంటావో నేను చూస్తాను గదా. నీ ఖర్చులు నువ్వెంత తగ్గించుకుంటావో అదీ చూస్తాను.’’

నిజమే తను ఏం తగ్గించాలి. వెళ్లేది అమెరికా. అక్కడి పార్టీలకి, గెట్‌ ‌టు గెదర్‌లకి, బయటికి వెళ్తే ఎన్నో కావాలి. అమెరికా వెళ్లే రోజున ఏం చీర కట్టుకోవాలో కూడా ఆలోచించుకుంది. అలాంటిది తను ఏం తగ్గించుకోగలదు. అన్నీ కావాలి. అన్నింటికీ డబ్బు కావాలి. అసలు తన అకౌంట్‌లో ఎంత ఉందో చూడాలి. ఎంత ఉన్నా అది సరిపోదు. అందుకే అమ్మ చెప్పిన దానికి తలూపాలి. నీ ఇష్టం అనాలి.

అందుకే చీరలు ఒక్కొక్కటి ఇరవై వేలకి తక్కువ కాకుండా కొనాలి అని అమ్మ అంటూంటే వద్దని అనలేదు. పైగా రంగులు చెప్తోంది. డ్రెస్సులు, అవి కూడా అంతే ఖరీదుల్లో ఉన్నాయి. పార్టీ చీరలు, పంజాబీ డ్రెస్సులు, షార్ట్ ‌స్కర్టులు, లాంగ్‌ ‌స్కర్టులు, గౌన్లు, జీన్స్‌టాప్‌లు అన్నీ ఒకదాని తరవాత మరొకటి లిస్ట్ ఇస్తోంది.
ఏం అక్కర్లేదు. అంతంత డబ్బు పెట్టి నాకు కొనక్కర్లేదు. పెళ్లికి కనీసం ఓ రెండు నెలలైనా టైముంటుంది, ఈ లోపల నా జీతం డబ్బుతో నేను నాకు కావలసినవి కొనుక్కుంటాను అని అనడం లేదు. ఇంక తను అమ్మా వాళ్ల గురించి ఏం ఆలోచిస్తుంది. ఇది ఓ రకమైన దోపిడి. అమ్మా నాన్న గార్లకి నచ్చిన ప్రియమైన దోపిడి. వాళ్లకి ఇష్టమై చేస్తున్నారు. ఏం బాధ పడడం లేదు. సంతోషంగా చేస్తున్నారు అలాంటప్పుడు తనది స్వార్థం కాదు.

మర్నాడు ఆఫీసులో అంశుకి మాత్రమే చెప్పింది. ఎవరికీ చెప్పద్దని ఒట్టేయించుకుంది. కాని అది లంచ్‌ ‌టైంలో అందరికి చెప్పేసింది. అందరూ కలిసి పెళ్లిళ్లు, ఖర్చులూ దాని మీద డిస్కషన్‌ ‌పెట్టుకున్నారు.

ఆఫీసులో కొలీగ్స్ అం‌తా యూపీ, పంజాబీ, హిందీ వాళ్లే. వాళ్లు వాళ్ల కమ్యూనిటీలో పెళ్లిళ్లలో ఒక్కొక్క అకేషన్‌కి ఎంతెంత డబ్బు అవుతుందో చెప్తున్నారు. రోకా అనే ఫంక్షన్‌కి ఎంత ఇవ్వాలో, ఎంగేజ్‌మెంటు ఎలా చెయ్యాలో, బారాత్‌లో ఎన్ని వెండి నాణేలు అందమైన మెరుపుల వెల్వెట్‌ ‌బుట్ట సంచీలో పెట్టి ఇవ్వాలో, డ్రై ఫ్రూట్స్, ‌స్వీట్స్ ఎన్నెన్ని కిలోలు ఇవ్వాలో ముందే చెప్తారుట. ఇది కాకుండా ఫర్నిచర్‌, ‌బహుమతులు అవీ కూడా ఎంతలో ఉండాలో, తాహతుని బట్టి వెహికల్‌ అన్నీ కూడా మగ పెళ్లివారే చెప్తారని, విదాయిలో ఎన్ని రకాల స్వీట్లు ఎదురు సన్నాహంలో మగపెళ్లి వారికి అందించాలో, ఇలాంటివి ఒకళ్ల తరవాత ఒకళ్లు వంతుల వారీగా చెప్పారు.

అంతా విన్నాక తమలో ఇలాంటి కోరికలుండవు కానీ మరో రకంగా ఉంటాయి. ఏవో లాంఛ•నాలు, వెండి, బంగారాలు ఉంటాయి. వాటికి కూడా చాలానే అవుతుంది. ఆ మాటే అంది..

‘‘సరే నువ్వు ఖర్చుల గురించి అంతగా ఆలోచిస్తూ తగ్గించుకోవాలని అనుకుంటే సింపుల్‌గా దండలపెళ్లి చేసుకో. లేకపోతే గుళ్లో, రిజిస్టర్‌ అవి ఎలాగూ ఉంటాయి. అది వద్దనుకుంటే ఆర్య సమాజ్‌లో పెళ్లి చేసుకుంటే సరి. అక్కడ వాళ్లు పద్ధతి ప్రకారంగా చేస్తారు. కాని వీటికి నువ్వు ఒప్పుకుంటావా, ఒప్పుకోవు. మీ వాళ్లు కూడా ఒప్పుకోరు. జీవితంలో పెళ్లి ఒకసారే కదా చేసుకుంటాం అని నువ్వు అనుకుంటావు, మీ వాళ్లు కూడా అలాగే అనుకుని ఎలాగూ గ్రాండ్‌గానే చేస్తారు. బాగానే ఖర్చు పెడతారు. నువ్వు అంతా చూస్తూ ఊరుకుంటావు కానీ ఏం అనవు. అంతా లెక్క వేస్తే పెళ్లి ఖర్చులో సగం నీ బట్టలకి, నగలకే అవుతుంది. వాటి సంగతేంటీ. ఈ మాటలన్నీ ఇప్పటికే. తరవాత పెద్దగా పట్టించుకోవు. మీ పేరెంట్స్ ఎం‌త ఖర్చు పెట్టారో, అందులో అప్పు ఎంత చేసారో కూడా వాళ్లని అడగవు, అసలు ఆ విషయం నువ్వు పట్టించుకోవు. అవన్నీ వదిలెయి. హాయిగా పెళ్లి చేసుకో. అమెరికా వెళ్లిపో. కాని మమ్మల్ని మర్చిపోకు.’’

వాళ్ల మాటలు విన్నాక అంతా నిజమే అనిపించింది. జీవితంలో పెళ్లి ఒకేసారి చేసుకుంటాం. నలుగురిని పిలిచి ఆ మాత్రం ఖర్చు చేసి డిన్నర్‌ ఇవ్వడంలో కష్టం లేదనిపించింది. డబ్బు సరిపోకపోతే అప్పుచేయచ్చు, తరవాత తీర్చచ్చు. కాని పెళ్లి తరవాత రాదు కదా.. అదీ నిజమే అనిపించింది. మిసెస్‌ ‌మెహతా తన కూతురి పుట్టినరోజుకి ఎంత ఖర్చు చేసిందో చెప్తూంటే బుర్ర తిరిగి పోయింది. రిటర్న్ ‌గిఫ్టస్‌గా వచ్చిన పిల్లలకి హెడ్‌ ‌ఫోన్లని ఇచ్చారుట.

‘‘ఆ తరవాతది కూడా విను. పెళ్లంటే చాలా వాటిని త్యాగం చెయ్యాలి. నీ ఇష్టాల్ని త్యాగం చెయ్యాల్సి వస్తే నా ఇష్టం, నేనింతే అని ఆర్గ్యూ చేస్తావా అప్పుడు కూడా ఏం అనవు, ఏం చెయ్యవు. ఇలాంటివి మేం ఎన్నో చూసాం’’

‘‘అందరి సంగతి వేరు. నేను వేరు. నా ఇష్టాల్ని నేను చంపుకోను. అతను చెప్పింది వినడానికి, చేయడానికి నేను ఓ బానిసని కాదు. ఇద్దరూ సమానం.’’ అని గట్టిగా అంది.

‘‘సరే ఇష్టాలని చంపుకోకుండా రోజూ వాదించు కుంటూంటే గొడవలు మొదలవుతాయి. అప్పుడు?’’ అంటున్న స్నేహితులని ఆలోచనగా చూసింది.
‘‘ఏమో అతనలా అనిపించడం లేదు. నెమ్మది. పైగా బాగా చదువుకున్న వాడు. డామినేట్‌ ‌చేసే మనిషిలా అనిపించలేదు.’’

‘‘ఇతను కావచ్చు, కాని అక్కడితో ఆగదు. అతనికో కుటుంబం ఉంది కదా. ఆ ఇంట్లో కొంతమంది ఉంటారు కదా. వాళ్ల సంగతి. అందరూ కొత్త వాళ్లు, మెంటాలిటీస్‌ ఎలా ఉంటాయో’’

‘‘నీకంతా కొత్తగా ఉంటుంది. కొత్త మనుషులు, కొత్త వాతావరణం, కొన్ని విషయాల్లో నువ్వు సర్దుకు పోవాల్సొస్తుంది.’’
ఈ సర్దుకుపోవడం అన్నది ఆమెకి నచ్చలేదు.

మరోసారి ఆఫీసులో ఈ సర్దుకుపోవడం గురించి పెద్ద డిస్కషన్‌ ‌జరిగింది. అంతకు ముందు కొలీగ్‌ ‌మెహక్‌ ‌కొఠారి పెళ్లి జరిగింది. వాళ్లు మార్వడీ వాళ్లు. పెళ్లి బాగా చేసారు. పెళ్లి అవగానే ఓ పదిహేను రోజులు రాలేదు. ఆ తరవాత ఆఫీసుకి రావడం మొదలు పెట్టింది.

మధ్య మధ్య అత్తగారింటి కబుర్లు చెప్పేది. ముగ్గురు అన్నదమ్ములు, అందరూ కలిసి బట్టల దుకాణం చూసుకుంటూ, వ్యాపారం చేస్తుంటారు. మెహక్‌ ఆఖరి కోడలు. అందరూ కలిసి ఉంటారు. ఇంట్లో పెత్తనం అంతా అత్తగారిది. అత్తగారి మాట ఎవరూ జవదాటకూడదు. వంట పని అంతా ఆమె చూస్తుందిట. పైపని అంతా కోడళ్లు చూస్తారుట. ఎప్పుడూ వంటింట్లోనే ఉంటారు. పనిమనుషులు ఉన్నా ఇంట్లో పని ఎక్కువే. ఎప్పుడూ ఏదో ఒక హడావుడి.

ఎవరో ఒకళ్లు వస్తూంటారు, వెళ్తుంటారు. రెండు రోజులకోసారి ఓ వారానికి సరిపడా చిరుతిళ్లు చేసి డబ్బాల్లో ఉంచుతారుట. రెండు మూడు రకాల తీపి, కారం ఇంట్లో చేసి ఉంచుతారు. వారానికోసారి అప్పడాలు ఒత్తుకుంటారట. సాయంత్రాలు ఆడవాళ్లు, మగవాళ్లు, పిల్లలు టీతో పాటూ ఇవి తింటారుట. ఇలాంటి సమయాల్లో ఆ రోజున వంట అంతా మెహక్‌ ‌చెయ్యాల్సి వస్తుందిట. అంతమందికి రొట్టెలు చేసేటప్పటికి చేతులు పడిపోతాయిట. అని చెప్పిన ఆమెని చూసి తనకి కూడా ఇలాంటి

ఇంట్లో ఉండాల్సి వస్తుందా!?

మెహక్‌ ‌మళ్లీ తన కష్టాన్ని చెప్పుకుంది.

ఉమ్మడి కుటుంబం అంటే ఇలాగే ఉంటుంది. ఇంటినుంచి వర్క్ ‌చేయాలంటే అర్ధరాత్రి మాత్రమే కుదురుతోంది. పగలు పనితో కుదరడం లేదు. ఇల్లూ ఉద్యోగం కుదరదు. ఇక్కడ సర్దుకుపోవడం అనేది ఎలా కుదురుతుంది. పెళ్లైన కొత్తలో అత్తగారింటి విషయాలు ఏం చెప్పకపోయినా, రాను రాను అన్నీ మాతో చెప్పడం మొదలెట్టింది. రాత్రి నిద్ర ఉండడం లేదని బాధపడేది. మానేయాలనిపించి నప్పుడు చెప్పింది.

‘‘ఇన్ని వేలు వచ్చే ఉద్యోగం మానకు. అంతగా అయితే వేరే ఉండండి’’ అంటూ ఆవేశంతో ఆఫీసులో వాళ్లు ఏవో సలహాలు ఇచ్చారు. ఈ లోపల రెండో నెలట. ఓ నెల మామూలు గానే వచ్చింది. ఆ తరవాత ఏం జరిగిందో ఏమో కాని ఉద్యోగం మానేసింది. పెళ్లైతే ఇంతేనా! కెరీర్‌ ‌పక్కదారి పట్టేస్తుందా?

ఓరోజు సాయంత్రం ఆఫీసు నుంచి మెహక్‌ ఇం‌టికి వెళ్లారు. ఆమె తోడికోడళ్లు బాగా మాట్లా డారు. వెళ్లగానే మంచినీళ్లు తెచ్చారు. అత్తగారు వాళ్ల పక్కనే కూచుంది. మెహక్‌కి రెండు నిండి మూడో నెల వచ్చింది. కడుపుతో ఉన్నప్పుడు ప్రెషర్‌, ‌టెన్షన్‌ ఉం‌డకూడదు. అది లోపల బేబీ మీద ప్రభావం చూపుతుంది. ఈ సమయం ప్రతి క్షణం అనుభ వించాలి. రెండోసారి గర్భం అక్కర్లేదనుకుంటున్నారు, అందుకని దీన్ని పూర్తిగా సంతోషంగా పిల్లల ఆటలు పాటలు అన్నీ చూడాలి. ఉద్యోగానిదేముంది తరవాత చెయ్యచ్చు అని ఇన్‌డైరెక్ట్‌గా అన్నీ చెప్పింది. ఆఫీసులో వాళ్లు ఏం మాట్లాడలేదు.

అంతలో తోడికోడళ్లు మటరీలు, కచోడీలు పెట్టి, టీ ఇచ్చారు. అందరూ ఎంతో కలివిడిగా ఉన్నారు.

మెహక్‌ ‌గుమ్మం వరకూ వచ్చింది. తను ఇంక ఉద్యోగం చెయ్యడం కష్టం అంది.

ఇది కూడా సర్దుకుపోవడమేనా! త్యాగమా, రాజీ పడిపోవడమా! మరి ఈ ఉద్యోగాలు, సంపాదనా అంతా పెళ్లికి ముందేనా! ఆ తరవాత కుదరదా!

వంట చెయ్యడం, వంటిల్లు సర్దుకోవడం, పిల్లల్ని చూడడం, అన్నీ ఆడవాళ్ల పనులేనా! వాళ్ల కర్తవ్యాలేనా! జీవితం ఇద్దరికి అయినప్పుడు త్యాగాలు ఇద్దరూ చెయ్యాలి… అని ఆ రోజున ఎన్నో మాట్లాడింది.

‘‘సుధీరా నీ పెళ్లవనీ అప్పుడు నువ్వు ఏం మాట్లాడుతావో చూస్తాం. ఈ మాటలు ఇప్పుడే. అన్నీ పైపైనే. నువ్వు అమెరికా వెళ్లాకా నీ మాటలు నువ్వు మింగాల్సిందే. ఎందుకంటే నీ క్వాలిఫికేషన్‌కి అమెరికాలో ఉద్యోగం రాదు. ఉద్యోగం కావాలంటే అక్కడి పరీక్షలు పాసవ్వాలి. అక్కడ పనిమనుషులు ఉండరు. అన్ని పనులు నువ్వే చేసుకోవాలి. అమెరికా అనే పదం ముందు త్యాగం, సర్దుకుపోవడం అన్నీ కూడా వెనక్కి వెళ్లిపోతాయి. ఇక్కడ ఇంతే. ఇక్కడి సిస్టం ఇదే అని ఆ చట్రంలో ఉండిపోతావు.’’

‘‘ఏం కాదు. నేను డిఫరెంటు.’’ అని వాళ్ల మాటల్ని కొట్టేసింది.

‘‘ఆ.. ఇప్పుడలాగే అంటావు కానీ, నువ్వు ఎడ్జస్ట్ అయిపోతావు’’ అన్న మాటలకి ఆలోచనలో పడింది.

అమెరికా వెళ్లినవాళ్లందరూ ఆ పనులన్నీ ఏదో పెద్ద కష్టాలుగా చెప్పుకున్నట్టు తను వినలేదు.

ప్రాబ్లెం అది కాదు, ప్రాబ్లెం ఆ పల్లెటూరు.

విక్రాంత్‌తో పెళ్లికి ఓకే.

కానీ అత్తగారు, మామగారు, ఆడపడుచులు, ఆ పల్లెటూరు, ఆ మనుషులు ఓకే కాదు.

(ఇంకా ఉంది)

By editor

Twitter
Instagram