ఈ ‌నూరేళ్లు నిండా కన్నీళ్లు

ఇప్పుడు గబ్బిలాల పేరు వింటే ఎవరికైనా చైనా గుర్తుకు వస్తుంది. కొవిడ్‌, ‌చైనా ప్రత్యామ్నాయ పదాలయినాయి. కారణం గబ్బిలాలు. నిజానికి చైనా గోడ వెనుక నిజంగా గబ్బిలాలే కంపే ఉంది. అదే చిరకాలంగా మగ్గిపోతున్న వాస్తవం. అక్కడ చరిత్ర అంటే గ్రేట్‌ ‌లీప్‌ ‌ఫార్వార్డ్, ‌సాంస్కృతిక విప్లవం, తియానాన్మెన్‌ ‌స్వ్వేర్‌ ‌దురంతం, కొన్ని లక్షల మంది నిర్బంధం, అదుపు లేని ఉరిశిక్షల లెక్క. కానీ బయటి ప్రపంచానికి ఇప్పటికీ అవేవో గొప్ప చర్యలుగా చెప్పే సాహసం చేస్తుంది చైనా. ఇంతకీ అసలు వాస్తవం ఏమిటి? ప్రపంచ వ్యాప్తంగా ఎందరో చరిత్రకారులు వెలుగులోకి తెచ్చిన కొన్ని వాస్తవాలు.

——————————-

మహా ముందడుగు

సోవియెట్‌ ‌రష్యాకు జలుబు చేస్తే భారత కమ్యూనిస్టులు తుమ్ముతారని నయా సామెత చాలాకాలం రాజ్యమేలింది. మన కమ్యూనిస్టులే కాదు, అలనాటి రష్యాలో వర్షం పడుతుంటే చైనా కమ్యూనిస్టులు కూడా గొడుగులు వేసుకు తిరిగారు. అలాగే, చేయవలసిన నిర్వాకం చేసేసి, వేలాది ప్రాణాలు బలితీసుకుని ‘చారిత్రక తప్పిదం’ అంటూ ఒక్కమాటలో తేల్చడం మన దేశవాళీ కమ్యూనిస్టులకే కాదు, చైనా కమ్యూనిస్టులకు కూడా వచ్చు. మాంత్రికుడి మంత్రదండం కూడా చేయలేని రీతిలో దేశంలో ఆర్థికాభివృద్ధి జరిగిపోవాలని పీపుల్స్ ‌రిపబ్లిక్‌ ఆఫ్‌ ‌చైనా నిశ్చయించింది. ఈ మహా మంత్రం నాటి చైనా ‘చైర్మన్‌’ ‌మావో జెడాంగ్‌ది. నిజానికి ఆయన సొంతం కాదు, సోవియెట్‌ ‌రష్యా నేతకు అస్మదీయుడిగా ఉన్న టి.డి. లిసెన్కో అనే అజ్ఞానిది.

అమాంతం ఆర్ధికాభివృద్ధి సాధించాలని 150 కార్యక్రమాలను చైనా చేపట్టింది. దీనికి పథక రచన, ఆర్థికసాయం, సిబ్బంది, నిపుణులు అంతా రష్యాయే ఏర్పాటు చేసింది. కానీ అప్పుడే మావోకూ, రష్యా అధ్యక్షుడు నికితా కృశ్చేవ్‌కు సైద్ధాంతిక విభేదాలు వచ్చాయి. దీనితో రష్యా నుంచి వెళ్లిన ఇంజనీర్లు, సిబ్బంది మొత్తం 15,000 తిరిగి స్వదేశం వెళ్లిపోయారు. అంతేకాదు, ఈ అభివృద్ధి పథకాల బ్లూప్రింట్‌లు కూడా ధ్వంసం చేశారు.

 కానీ ఆ పథకాలను పూర్తి చేయడానికి చైనా దగ్గర సాంకేతిక నిపుణులే కాదు, ఆర్థికబలం కూడా లేదు. రష్యా కమ్యూనిస్టు దేశమే అయినప్పటికి మరొక కమ్యూనిస్టు దేశాన్ని ఇలా చేయడం, ఇతర దేశం మీద ఆధారపడడం మావోకు జ్ఞానోదయం కలిగించింది. తనకు తానే పారిశ్రామిక శక్తిగా ఎదగాలని ఆశించాడు. 1921 నాటి రష్యా ఆర్థిక వైఫల్యాలను దృష్టిలో ఉంచుకుని, ఏ కమ్యూనిస్టు దేశానికైనా మొదటి దశలో ఇలాంటి ఆర్థిక కుంగుబాటు తప్పదని సర్ది చెప్పుకున్నాడు. కృశ్చేవ్‌తో రష్యాతో వైరం వచ్చినా, అంతకు ముందే స్టాలిన్‌ ‌చేపట్టిన సంస్కరణలు- అవి విజయవంతం అయినాయా లేదా అనే విషయం ఆలోచించకుండా స్వీకరించాడు. అదే సమష్టి వ్యవసాయ క్షేత్రాల పథకం. పారిశ్రామిక విప్లవానికి పుట్టినిల్లు బ్రిటన్‌ను, తొలి కమ్యూనిస్టు పాలన ఏర్పడిన రష్యాను అధిగమించాలన్న పగటికలే మావోను ఇలాంటి దుడుకు చర్యకు ప్రోత్సహించిందని చెబుతారు. నగరాలను పరిశ్రమలతోను, గ్రామాలను పంటలతోను ఏకకాలంలో కళకళలాడించాలని అనుకున్నాడాయన. దీనికి న్యూ చైనా న్యూస్‌ ఏజెన్సీ తన వంతు సాయం చేసింది. కొయ్యరా కొయ్యరా కోనయ్య అంటే కోటప్పకొండ మిరియాలు తాటికాయ లంత అన్నట్టే ఆ ఏజెన్సీ ప్రచారం సాగింది. పిల్లలను కాటాలో కూచోపెట్టి భారీ గుమ్మడికాయలను (130 పౌన్లు), ముల్లంగి దుంపలను తూకం వేస్తున్నట్టు ఫోటోలు ప్రచురించేవారు. మిగులు వ్యవసాయోత్ప త్తులను చైనా ఎలా వినియోగించుకోవాలో పీపుల్స్ ‌డైలీ చర్చలు నిర్వహించింది. కానీ స్టాలిన్‌ అభివృద్ధి బూటకమని కృశ్చేవ్‌ ‌ప్రకటించడం కమ్యూనిస్టు దేశాలలో నిరసన ధ్వనులు మొదలయ్యాయి.

నిజానికి సమష్టి వ్యవసాయం సోవియెట్‌ ‌రష్యాకు ఘోర చేదు అనుభవాన్ని ఇచ్చింది. కానీ ఆ విషయం చైనా సహా బయటి ప్రపంచానికి రష్యా తెలియకుండా తొక్కి పెట్టిన సంగతి మావోకు తెలియదు.ఆ పథకంతో వ్యవసాయోత్పత్తులు పెరగడం మాట అటుంచి, ఉక్రెయిన్‌ ‌దగ్గర దుర్భిక్షం ఆరంభమై దేశాన్ని కబళిం చింది. 1949లో ఇలాంటి రైతులకు భూములన్నీ పంచిపెట్టి కమ్యూన్లుగా ఏర్పడాలని చైనా కమ్యూనిస్టు పార్టీ ఆదేశించింది. కానీ 1958లో జన చైనాయే సమష్టి వ్యవసాయం ఆరంభించదలచి ఆ భూములను మళ్లీ తిరిగి తీసేసుకుంది. రైతులు తమ పెరళ్లలో ఇనుము ఉత్పత్తి చేయాలని ఆదేశించాడు. దానితో పనిముట్లు చేయాలన్నది ఆయన ఆశయం. అటు సమష్టి వ్యవసాయ క్షేత్రాల ద్వారా తిండిగింజలు, ఇటు ఇనుము కొలుములతో పారిశ్రామిక వృద్ధి ఏకకాలంలో జరిగిపోతాయని కమ్యూనిస్టు చైనా అభిప్రాయం. కానీ రైతులు నాసిరకం ఇనుమును ఇతోధికంగా ఉత్పత్తి చేశారు. అదే సమయంలో పారిశ్రామికీకరణ జరగాలని, రైతులను వాటికి తరలించారు. అలాగే కమ్యూన్ల పేరుతో జరుగుతున్న వ్యవసాయంలో నారును దగ్గరదగ్గరగా నాటాలన్న నిబంధనతో వ్యవసాయోత్పత్తి ఘోరంగా దెబ్బతిన్నది. దుర్భిక్షం ఏర్పడింది. నారును ఖాళీ లేకుండా ఊడ్చాలని సలహా ఇచ్చినవాడే లిసెంకో. ఇవన్నీ తీవ్ర దుష్పరిణామాలకు కారణమవుతున్నాయని మావో దృష్టికి తీసుకువెళ్లిన మార్షల్‌ ‌పెంగ్‌ ‌దెహూయిని విప్లవ ప్రతీఘాతశక్తిగా అభివర్ణించారు. మితవాద శక్తులకు ఊతమిచ్చే వారు దేశంలో ఉన్నారంటూ ఐదు లక్షల మందిని బోనులో నిలబెట్టారు. దేశంలో దుర్భిక్షం పెరుగుతున్నదన్న వాస్తవంతో పనిలేకుండా రష్యా దగ్గర నుంచి తీసుకున్న అప్పు కోసం కొద్దిగా పండిన వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేసేశారు.

తరువాత వాస్తవాలు బయటపడ్డాయి. రైతులు తిండిలేక ఎక్కడ బడితే అక్కడ కుప్పకూలేవారు. కుటుంబ సభ్యులు కూడా శవాలు తీసుకెళ్లి అంత్యక్రియలు చేసే శక్తి లేక వదిలి వెళ్లిపోయేవారు. శవాలను పీక్కుతింటూ ఎలకలు కనిపించేవి. అంతిమంగా తప్పిదం జరిగిందని మావో అంగీకరించి లియు షావో, డెంగ్‌ ‌జియావోపెంగ్‌, ‌చౌఎన్‌లైలకు ఐదేళ్ల పాటు అధికారం అప్పగించాడు. ఈ ముగ్గురు పరిస్థితిని కొంత మెరుగుపరిచారు. ఈ మొత్తం విఫల ఆర్థిక విన్యాసానికే గ్రేట్‌ ‌లీప్‌ ‌ఫార్వార్డ్ అని పేరు. దీని ఫలితం మూడు కోట్ల మంది దుర్భిక్షం బారిన పడి ఆకలితో మరణించారు. ఇది అత్యధిక ప్రాణాలు తీసుకున్న దుర్భిక్షంగా చరిత్రకెక్కింది. చరిత్రలో చైనా చూసిన 1,828 దుర్భిక్షాలలో  1958-60 మధ్య గ్రేట్‌ ‌లీప్‌ ‌ఫార్వార్డ్ ‌తెచ్చిన దుర్భిక్షమే దారుణమైనదని తేలింది.

చరిత్రకారుడు జాస్పర్‌ ‌బెకెర్‌ ‘‌హంగ్రీ ఘోస్టస్ అన్న పుస్తకంలో ఈ ఘట్టాలను నమోదు చేశారు.కానీ 1966లో మళ్లీ మావో అధికారంలోకి వచ్చాడు. ఈసారి  సాంస్కృతిక విప్లవం పేరుతో మరొక ఉత్పాతం తెచ్చాడు. కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం చేసిన ఒకే ఒక్క తప్పుకు చైనా ప్రజలు చెల్లించుకున్న మూల్యం మూడు కోట్ల ప్రాణాలు. రష్యాలో విఫలమైన ఒక సామాజిక ప్రయోగాన్ని గుడ్డిగా దేశంలో అమలు చేసిన చైనా నేతలు ఇన్ని ప్రాణాలు పొట్టన పెట్టుకున్నారు.

———————————-

సాంస్కృతిక విప్లవం

చైర్మన్‌ ‌మావో సాగించిన మరొక స్వజాతి హననం పేరే సాంస్కృతిక విప్లవం. 1966 నుంచి 76 వరకు జరిగింది. సోవియెట్‌ ‌రష్యాలో విప్లవ స్ఫూర్తి గాడి తప్పుతున్నదని తనకు తాను నమ్మి, అదే చైనాలోను పునరావృతమవుతుందనే ఎలాంటి హేతువు లేని నమ్మకంగా మావో ప్రారంభించినదే సాంస్కృతిక విప్లవం. ఈ విప్లవంతో నాలుగు లక్ష్యాలు సాధించాలని ఆయన అనుకున్నాడు. అప్పటిదాకా పార్టీ పదవులలో ఉన్నవారిని తొలగించి తన స్వకపోల కల్పిత సాంస్కృతిక విప్లవ చింతనకు దగ్గరగా ఉండేవాళ్లని నియమించడం. పార్టీని తీర్చి దిద్దడం. చైనా యువతరానికి కూడా విప్లవానుభవాన్ని కలిగించడం. విద్య, సంస్కృతి, ఆరోగ్యం వంటి రంగాలలో సంస్కరణలు తేవడం. ఈ ధ్యేయాన్ని అమలు చేయడానికి పట్టణ ప్రాంతంలోని యువకులను రెడ్‌ ‌గార్డస్ ‌పేరుతో సమీకరించాడు. మావో సతీమణి జియాంగ్‌ ‌క్వింగ్‌, ‌రక్షణమంత్రి లిన్‌ ‌బియావో వంటివారు ఇతోధికంగా ఈ విప్లవ సాధనలో చేయూతనిచ్చారు. బియావో చైనా కమ్యూనిస్టు పార్టీలో వ్యక్తి పూజకు హద్దులు లేకుండా చేశాడు. అదే చైర్మన్‌ ‌మావో ఆరాధన. ఇప్పటికి ఎంతో పేరున్న లిటిల్‌ ‌రెడ్‌ ‌బుక్‌ను ఇతడే ఆ కాలంలో అచ్చు వేయించి, లక్షలాది ప్రతులను చైనా అంతటా పంచి పెట్టించాడు. ఈ భూమ్మీద ఇన్ని ప్రతులు అచ్చయిన పుస్తకం లేదంటారు. దీని నిండా మావో ఉల్లేఖనలే. పార్టీలోను, ప్రభుత్వంలోను బూర్జువాలు చొరబడ్డారని, వీరే తన విప్లవ ఆలోచనలకు ప్రతిఘటించే శక్తులని మావోకు మళ్లీ జ్ఞానోదయం అయింది. మే 16, 1966 నాటి పార్టీ సెంట్రల్‌ ‌కమిటీ పత్రంలో ఈ విషయాన్ని ఆయన ప్రస్తావిం చాడు. ఇదే సాంస్క్కతిక విప్లవానికి ఆరంభమని చరిత్రకారులు చెబుతారు. నిజానికి గ్రేట్‌ ‌లీప్‌ ‌ఫార్వార్డ్ ‌ద్వారా తాను పార్టీ మీద కోల్పోయిన పట్టును తిరిగి సాధించుకోవడానికి మావో వేసిన అత్యంత నీచమైన, రక్తపాత ఎత్తుగడ ఈ విప్లవం. చైనా-రష్యా సంబంధాలు పతనం కావడం, గ్రేట్‌ ‌లీప్‌ ‌ఫార్వార్డ్ అత్యంత ఘోరమైన అనుభవాలు మిగల్చడం, స్టాలిన్‌ ‌వారసత్వాన్ని నికితా కృశ్చేవ్‌ ‌బాహాటంగా నిరాక రించడం మావో జెడాంగ్‌కు  సాంస్కృతిక విప్లవం ఆలోచనను ఇచ్చాయి. నిజానికి కృశ్చేవ్‌ను 1964లో బలవంతంగా పదవి నుంచి గెంటేశారు. అలాంటి గతి తనకు కూడా పడుతుందేమోనన్న భయమే మావో చేత ఇంతటి ఘాతుకాలు చేయించింది. ఆ విప్లవం ప్రతి అడుగులోను ఇదే కనిపిస్తుంది కూడా.

గ్రంథాల దహనంలో వెలిగిన సాంస్కృతిక విప్లవం. 1966లో చైనా ప్రజలు, రెడ్‌ ‌గార్డస్ ‌సాహిత్యం, కళ, వాస్తు సంపద వంటివన్నీ విప్లవ వ్యతిరేకమని ప్రచారం సాగించారు. కళాఖండాలు నాశనం చేశారు. గొప్ప  భవంతులు కూల్చారు. ఇలా పుస్తకాలను నడిరోడ్డు మీద పోసి దగ్ధం చేశారు.

ఆగస్ట్‌లో ఈ విప్లవం మొదలయింది. దీని పూర్తి పేరు గ్రేట్‌ ‌ప్రోలిటేరియన్‌ ‌కల్చరల్‌ ‌రివల్యూషన్‌. ఇం‌దులో మొదట మావో చేసిన పని విద్యా సంస్థలు మూసి వేయించడం. రెడ్‌ ‌గార్డస్ ‌వీధులలోకి వచ్చి కమ్యూనిస్టులను విమర్శించాలని ప్రోత్సహించాడు. దీనితో పార్టీ నిగ్గు తేలుతుందని అతడి నమ్మకం. అలాగే బూర్జువా వర్గ విలువల మీద దాడి చేయాలని వారిని ప్రోత్సహించాడు. చాలామంది వృద్ధుల మీద, మేధావుల మీద విమర్శలే కాదు, భౌతికదాడులు కూడా జరిగాయి. ఎందరో చనిపోయారు. ప్రజలకు ఒక హెచ్చరిక అందింది. వాటినే నాలుగు పురాతనాలు అంటారు. అవి- పాత సంప్రదాయాలు, పాత సంస్కృతి, పాత జీవనం, పాత ఆలోచనలు. తొలి దశలో పార్టీ అధ్యక్షుడు లియు షావుకిని పదవి నుంచి తొలగించారు. ఇతడిని చావగొట్టి జైలులో పడేశారు. అక్కడే అతడు 1969లో చనిపోయాడు. 1966లో సాంస్కృతిక విప్లవం ఆరంభమైన రెండు నెలల్లోనే అంటే ఆగస్టులో స్వైర విహారం చేసింది. అరాచకం వెల్లువెత్తింది. దీనితో సైన్యం రంగంలోకి దిగింది. నగరంలో ఉన్న రెడ్‌ ‌గార్డస్ ‌గ్రామాలకు వచ్చారు. ఈ గందరగోళంలో పారిశ్రామిక ఉత్పత్తి దారుణంగా పడిపోయింది. ఈ దారుణ విధ్వంసానికి పార్టీ పత్రికలు పార్టీకి కొత్త రక్తం ఎక్కించడంగా అభివర్ణించేవి. నిజానికి ఇది పదేళ్ల రక్తపాతం, హత్యాకాండ. ఒక బీభత్స యుగం. తాను తెచ్చిన ఈ విప్లవంతో సోషలిస్టు ఉద్యమం సోషలిస్ట్ ‌ప్రపంచాన్ని తారస్థాయికి తీసుకుపోతుందని మావో నమ్మాడని అంటారు. ఈ భూగోళాన్ని కమ్యూనిజంలోకి తెచ్చాడని కీర్తించారు. కానీ అదంతా పదవీ దాహంతో ప్రజా ఉద్యమం అనే భ్రమాజనిత మంచుతెర వెనక నుంచి సాగించిన అరాచకమని కొందరు చరిత్రకారులు చెబుతారు. ఎందుకంటే పాఠశాలలు, విశ్వవిద్యాలయాలు మూసివేశారు. చర్చ్‌లు, ప్రార్ధనా మందిరాలు, దుకాణాలు, ఆఖరికి గ్రంథాలయాలు కూడా ధ్వంసం చేశారు. భూస్వామిక అవశేషాలు అంటూ ఎందరివో ఇళ్లు కూడా కూల్చారు. ఉపాధ్యాయులను, మేధావులను తరిమి తరిమి కొట్టి చంపారు. లేదా ఆత్మహత్యకు పాల్పడేటట్టు చేశారు. రెడ్‌ ‌గార్డస్‌కు అడ్డు వెళ్లరాదని మావో మొదటే ఆదేశాలు ఇచ్చాడు. దీనితో 1966 ఆగస్ట్, ‌సెప్టెంబర్‌ ‌మాసాలలోనే ఒక్క బీజింగ్‌లోనే 1800 మంది ప్రాణాలు కోల్పోయారు. కొందరు చరిత్రకారుల అంచనా ప్రకారం 5 లక్షల నుంచి 20 లక్షల మధ్యన చైనా ప్రజలు మావో విప్లవానికి బలైపోయారు. నిజానికి ఈ సాంస్కృతిక విప్లవ విధ్వంసానికి ప్రజలలో ప్రతిఘటన వచ్చింది. అప్పుడు అంతర్యుద్ధం అంచులకు చైనా వెళ్లిందని కొందరు చరిత్రకారులు చెబుతారు కూడా. ప్రతి నగరంలోను విప్లవకారులకు, ప్రభుత్వ అనుకూలురకి పోరాటాలు జరిగేవి. ఈ పోరాటాలలో రెడ్‌ ‌గార్డస్ ‌కంటే సైనికులు చేసిన హత్యాకాండే పెద్దది. అయితే రెడ్‌ ‌గార్డస్ ‌చేసిన రక్తపాతం తక్కువేమీ కాదు. పాత విలువల విధ్వంసం పేరుతో చాలామంది విద్యార్థులు వారి అధ్యాపకులను, ఉపాధ్యాయులను కొట్టి చంపారు. ఇక జైళ్లలో చనిపోయినవారి సంఖ్యకు అంతేలేదు. ఆ విధ్వంసం వేళ నడివీధిలో అవమానాల పాలైన వారిలో ఇవాళ్టి చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ ‌తండ్రి జీ జోగ్జమ్‌ ‌కూడా ఉన్నారు. 13 ఏళ్ల బీజింగ్‌ ‌పాఠశాల విద్యార్థి కూడా ఈ రక్తపాతంలో పాలు పంచుకున్నాడు. అంత రక్తదాహం జాతిలో పెరిగింది.

1968లో మళ్లీ మావోకు జ్ఞానోదయం అయింది. దేశంలో పరిస్థితులు అదుపుతప్పాయన్న వాస్తవం అర్థమయింది. అప్పుడే మళ్లీ రెడ్‌ ‌గార్డస్‌నీ, యువతనీ చదువుల కోసం గ్రామాలకు తరలమని పిలుపునిచ్చాడు. ఈ దారుణ మారణకాండ మావో తన 82వ ఏట సెప్టెంబర్‌ 9, 1976‌న చనిపోయాక అంతమయింది. తరువాత మావో భార్య (సినీ నటి) జియాంగ్‌ ‌క్వింగ్‌ను, మరొక నలుగురిని బహిరంగంగా విచారించారు. వీరినే గ్యాంగ్‌ ఆఫ్‌ ‌ఫోర్‌ అం‌టారు. చైర్మన్‌ ‌మావో కుక్కగా అభివర్ణించే క్వింగ్‌కు 1981లో మరణ శిక్ష పడింది. తరువాత జీవితఖైదుగా మార్చారు. చివరికి సాంస్కృతిక విప్లవం 25 ఏళ్ల సందర్భంగా క్వింగ్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తన  సాంస్కృతిక విప్లవంతో చైనా కమ్యూనిజంలో తేలియాడుతుందని మావో భావించాడు. కానీ దానికి పూర్తి భిన్నమైన వాతావరణం ఏర్పడింది. యాభయ్‌ ఏళ్లు గడచిన తరువాత ఇప్పుడు అంతా భావిస్తున్నదేమిటి? 1980లోనే చైనా కేపిటలిజం వైపు మళ్లింది. సాంస్కృతిక విప్లవం చైనాకు పెద్ద అపవాదు. కానీ అక్కడ ఆర్థిక సంస్కరణలకు కారణం అదే అని తేల్చినవారు కూడా ఉన్నారు. ఇంకొందరైతే మావో మరణానికి ముందే చైనాలో మార్క్సిజం మరణించింది అంటారు. కానీ ఎవరు ఏం చెప్పినా మన దేశవాళి మార్క్సిస్టులు బూర్జువా ప్రచారం అని ఒక్కమాటతో కొట్టి పారేస్తారు. చరిత్ర పట్ల గౌరవం ఉన్నవారు ఆ పని చేయలేరు. అందుకు ఎందరో చరిత్రకారులు సరైన ఆధారాలతో రాసిన పుస్తకాలు ఉన్నాయి. వీటిని ఎందుకు చదవాలి? ఇవాళ కూడా ఈ దేశంలో చైనాను పవిత్ర భూమిగా, మావోను దేవుడిగా కొలిచేవారు ఉన్నారు. ఆ ప్రేరణతో ఉద్యమించేవారు, రాజకీయాలు చేసేవారు ఉన్నారు. వాళ్లని ఇంకా జనం నమ్మవలసిన పనిలేదు. సాంస్కృతిక కార్యకర్తల పేరుతో భారతీయతను విమర్శించేవారంతా చైనా సాంస్కృతిక విప్లవాన్ని ఆకాంక్షిస్తున్నవారేమో తెలుసుకోవాలి. 1980 ప్రాంతంలో చైర్మన్‌ ‌మావో భారత చైర్మన్‌ అం‌టూ గోడల మీద నినాదాలు దాపురించాయి. వాస్తవాలు చూడని అంధులు ఇంకా ఎందరో మిగిలే ఉన్నారు. సాంస్కృతిక విప్లవం అనే మహా విధ్వంసంలో భాగస్వాములైన నాయకులకు కూడా తరువాత అధికారం కట్టబెట్టిన పార్టీ అది. చిత్రం ఏమిటంటే లిన్‌ ‌బియావో వంటివారు మాత్రం దేశం విడిచి పారిపోవలసి వచ్చింది. ఒక పార్టీలో, ఒకే విధ్వంసంలో పాల్గొన్నవారిలో  ఒకరికి ఒక న్యాయం వేరొకరికి వేరొక న్యాయం.

—————–

తియనాన్మెన్‌ ‌కూడలి దగ్గర జూన్‌ 5,1989‌న కనిపించిన భయానక దృశ్యం. ఆ కూడలి దగ్గర ఆ సమయంలో దాదాపు నెలరోజులు ప్రజాస్వామ్యం కావాలంటూ విద్యార్థులు ఉద్యమం చేశారు. తరువాతే ఆ విద్యార్థి ఒక ట్యాంక్‌ ‌మీదకు ఎక్కి ఉపన్యసించే ప్రయత్నం చేశాడు. తరువాత అతడు కనిపించకుండా పోయాడు. ఈ రోజుకీ అతడి ఆచూకీ లేదు.

తియనాన్మెన్‌  ‌దురంతం

1966లో సాంస్కృతిక విప్లవంలో విద్యార్థులను విధ్వంసకారులను చేసిన చైనా, 1989 నాటికి వారిలో సంఘ విద్రోహులను చూసింది. చైనాలో ప్రజాస్వామ్యం కావాలని కోరుతూ ఏప్రిల్‌ 15, 1989‌న ఆరంభమైన నిరసన అత్యంత విషాదంగా జూన్‌ 4, 1989‌న ముగిసింది. ఈ దుర్ఘటనకు జూన్‌ 4 ఉదంతం అని పేరు కూడా ఉంది. 1989 ప్రజాస్వామ్య ఉద్యమమన్న పేరు కూడా దీనికి ఉంది. మానవ హక్కుల గురించి ప్రపంచానికి నిరంతరం పాఠాలు చెప్పే చైనా ఆనాడు విద్యార్థుల మీద సైన్యం చేత తుపాకులు ఎక్కు పెట్టించింది. ట్యాంకులు నడిపించింది. ఆ జూన్‌ 4‌న జరిగిన ఆఖరి సైనిక చర్యలో వందల నుంచి వేలాది మంది చనిపోయారని చెబుతారు. వ్యక్తి గత స్వేచ్ఛ ఇవ్వాలని కోరుతూ 1986-87 ప్రాంతంలోనే చైనా విశ్వవిద్యాలయాలలో ఉద్యమాలు మొదలయినాయి.కానీ ఈ ఉద్యమాలన్నీ బూర్జువా వర్గ ఉదారవాదుల ఆలోచనేనని చైనా కమ్యూనిస్టు పార్టీ తేల్చేసింది. ఈ అణచివేతతో ప్రాణాలు కోల్పోయినవారిలో ఒకరు హు యోబాంగ్‌. ఇతడు 1980 నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి. కానీ హక్కుల కోసం గళమెత్తి విద్యార్థులను ప్రోత్స హించాడు. 1987లో ఇతడి చేత రాజీనామా చేయించారు. 1989 ఏప్రిల్‌ 22‌న జరిగిన హు అంత్యక్రియల నాడు వేలాది మంది విద్యార్థులు తియనాన్మెన్‌ ‌కూడలి వద్ద చేరి నిరసన వ్యక్తం చేశారు. ఇదే ఆ ఉద్యమానికి నాంది. షాంఘై, జియాన్‌, ‌చాంగ్షా, చెంగ్డు నగరాలకు కూడా ఆందోళన వ్యాపించింది. నిజానికి అప్పుడే సోవియెట్‌ ‌రష్యా అధినేత రావడంతో, విదేశీ మీడియా పెద్ద ఎత్తున అక్కడకు చేరింది. ఇదే తియనాన్మెన్‌ ‌కూడలి ఉద్యమం గురించి ప్రపంచానికి తెలియచేసింది. విద్యార్థులతో చర్చలు జరపమని పార్టీలో మధ్యేవాదులు ప్రతిపాదించినా డెంగ్‌ ‌జియావోపెంగ్‌ ‌నిర్ద్వంద్వంగా నిరాకరించాడు. జూన్‌ ‌మూడు రాత్రి సైన్యం వచ్చింది. తెల్లవారే సరికి మొత్తం ఉద్యమాన్ని అణచివేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram