రాష్ట్రంలో కొద్దిరోజులుగా పొలిటికల్‌ ‌హీట్‌ ‌పెరిగింది. అటు హుజురాబాద్‌ ఉపఎన్నిక.. ఇటు విపక్షాలలో, రాజకీయాలలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఈ పరిస్థితులను సృష్టించాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత దాదాపు ఏడేళ్ల తర్వాత అధికార, విపక్షాలు సై అంటే సై అనే స్థాయిలో విమర్శలు, కౌంటర్లు ఇచ్చుకునే స్థాయికి చేరాయి. దీంతో రాష్ట్ర రాజకీయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. విపక్షాలు లేకుండా చేయాలన్న లక్ష్యంతో అవసరం లేకపోయినా ఎమ్మెల్యేలందరినీ టీఆర్‌ఎస్‌ ‌తన గూట్లోకి చేర్చుకుంది. ఫలితంగా తెలుగుదేశం పార్టీ, వైఎస్‌ఆర్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ నామరూపాలు లేకుండా పోయాయి. కాంగ్రెస్‌ ‌పార్టీ సభ్యులు కూడా పలువురు టీఆర్‌ఎస్‌ ‌గూటికి చేరారు. ఒక్క బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్‌ఎస్‌ ‘ఆకర్ష్’‌కు ప్రభావితం కాలేదు. అదే ఒరవడి ఇన్నాళ్లుగా కొనసాగుతూ వచ్చింది. ప్రధాన ప్రతిపక్షాలు కూడా కేసీఆర్‌పై పోరాడాల్సిన స్థాయిలో పోరాడలేదు. అనేక అంశాల్లో అవకాశం వచ్చినా విమర్శించాల్సిన రీతిలో విమర్శలు చేయలేదు. ప్రజల పక్షాన నిలబడి ఉద్యమం చేయాల్సిన అవసరం వచ్చినా, పరిస్థితులు కల్పించినా మిన్నకుండిపోయారు. ఫలితంగా టీఆర్‌ఎస్‌కు తిరుగులేకుండాపోయింది.

ఈ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలో జరిగిన రెండవ సాధారణ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్‌ ‌తన హవా కొనసాగించింది. కేసీఆర్‌ని ఢీకొట్టే నాయకుడు ప్రతిపక్షంలో ఎవరూ లేరనే భావన ప్రజల్లో కలిగించింది. క్షేత్రస్థాయిలో కూడా తెరాస తన ‘అధికార’ బలాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించు కుంది. నిజానికి కేసీఆర్‌ ఆరు నెలల ముందుగానే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. పదవీకాలం ఇంకా ఉన్నప్పటికీ ఆ సమయంలో ఎన్నికలు నిర్వహిస్తేనే తాము గట్టెక్కుతామన్న ఆలోచనతో కేసీఆర్‌ ఈ ‌నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నట్లు గానే రెండోసారి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది. సరిగ్గా అప్పటి నుంచే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారడం మొదలైంది.

రాష్ట్ర అసెంబ్లీలో అప్పటిదాకా టీఆర్‌ఎస్‌ ఆకర్షణకు ప్రభావితం కాని బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య రెండోసారి ఎన్నికల తర్వాత తగ్గిపోయింది. దీంతో టీఆర్‌ఎస్‌కు మరింత బలం పెరిగిందన్న సంకేతాలను జనంలోకి తీసుకెళ్లేందుకు గులాబీ శ్రేణులు కష్టపడ్డాయి. కానీ ఆ తరువాత ఆరు నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌పరిస్థితి చావుతప్పి కన్ను లొట్టపోయిన చందంగా మారింది. అనూహ్యంగా బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్‌ ‌నుంచి ఇద్దరు గెలుపొందారు. అంతేకాదు, ఆ తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ని నియమించడంతో కమలదళం అనూహ్య రీతిలో పుంజుకుంది. టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం వచ్చేసిందన్న భావన ప్రజల్లోకి వెళ్లిపోయింది. అదే సమయంలో జరిగిన దుబ్బాక ఎన్నికల్లో, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో బీజేపీ అనూహ్య విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే, ఆ తర్వాత జరిగిన నాగార్జున సాగర్‌ ఉపఎన్నిక, పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో గులాబీ పార్టీ పుంజుకుంది. ఆ ఫలితాల తర్వాత టీఆర్‌ఎస్‌ ‌తెలం గాణలో తాము తప్ప ఇంకెవరూ ప్రత్యామ్నాయం కాబోరన్న వాదనను మళ్లీ తెరపైకి తెచ్చింది.

ఈ సమయంలో తెలంగాణలో ఓ గంభీర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఎవరు ఊహించని టర్న్ ‌తీసుకున్నాయి. ఓవైపు హుజురాబాద్‌ అసెంబ్లీకి ఉపఎన్నికలు జరగనుండటం.. మరోవైపు ఇప్పటికే ఉన్న రాజకీయ పార్టీలలో చోటు చేసుకున్న పరిణామాలు.. ఇంకోవైపు మరో కొత్త పార్టీ తెలంగాణ రాజకీయ యవనికపై ప్రత్యక్షం కావడం వంటి పరిణామాలు రెండేళ్ల ముందే ఎన్నికల కోలాహలానికి నిదర్శనం అవుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కూడా ఫామ్‌హౌస్‌, ‌ప్రగతిభవన్‌ ‌వదిలి బయటకు వచ్చారు. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేబినెట్‌ ‌సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటికి తోడు వరుస జిల్లా పర్యటనలతో వేడి పుట్టిస్తున్నారు. అప్పుడెప్పుడో ఏడాది కింద తాను దత్తత తీసుకున్నట్లు నామమాత్రంగా ప్రకటించిన గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వాసాలమర్రిని బంగారు వాసాలమర్రిగా మారుస్తానని శపథం చేశారు.

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలకు సంబంధించి పార్టీల వారీగా చూసుకుంటే.. బీజేపీ తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. దానికితోడు ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్‌ ‌విస్తరణలో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్‌ ఎం‌పీ కిషన్‌రెడ్డికి కేంద్ర కేబినెట్‌ ‌మంత్రిగా ప్రమోషన్‌ ‌కల్పించింది. ఈ అంశంపై జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. భారతీయ జనతా పార్టీ తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించిందనీ, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా వ్యూహాలు రూపొందిస్తోందనీ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కిషన్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక కూడా ఇదే కారణం ఉండి ఉండవచ్చని విశ్లేషణలు సాగుతున్నాయి. ఓ వైపు యువకుడైన బండి సంజయ్‌ ‌రాష్ట్ర బీజేపీని ఉరకలెత్తిస్తుండగా, మరోవైపు కిషన్‌రెడ్డి కేంద్రంతో సంధానకర్తగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో పార్టీ బలపడేందుకు అవసరమైన వ్యూహాలను సిద్ధం చేయడంలో వాహకంగా వినియోగించుకునేలా బీజేపీ కేంద్ర నాయకత్వం ప్రయత్నిస్తోందని భోగట్టా.

ఇదే కాకుండా ఇప్పటికే ముంచుకొస్తున్న హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాషాయ కండువా కప్పుకున్న ఈటల రాజేందర్‌ను కూడా అసెంబ్లీకి పంపించడమే లక్ష్యంగా బీజేపీ క్షేత్రస్థాయిలో నిమగ్నమై ఉంది. ఈ విజయంతో అసెంబ్లీలో మొదట ఒక సీటుగా ఉన్న బీజేపీ బలం క్రమంగా మూడు సీట్లకు పెరుగుతుందని అంచనాతో పనిచేస్తోంది.

ఇక కాంగ్రెస్‌ ‌పార్టీ ఇన్నాళ్లు స్తబ్దుగా ఉందన్నది ఎవరు కాదనలేని విషయం. అసెంబ్లీలో అతి పెద్ద విపక్షంగా ఉన్నప్పటికీ అధికార పక్షంపై ఏ విషయంలోనూ అవసరమైనంతగా పోరాడ లేదన్నది తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. దానికి సవాలక్ష కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు, ఆధిపత్య పోరు దీనికి కారణం అన్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రదేశ్‌ ‌కాంగ్రెస్‌ ‌కమిటీ చీఫ్‌ ‌బాధ్యతలు అప్పగించింది పార్టీ నాయకత్వం. సీనియర్లను ఆయన కార్యవర్గంలో వివిధ బాధ్యతల్లో నియమించింది. తన ప్రసంగంలో దూకుడు, ముఖ్యంగా కేసిఆర్‌ ‌టార్గెట్‌గా చేసే పదునైన విమర్శలూ రేవంత్‌కి కలిసొచ్చి పీసీసీ పీఠాన్ని అధిరోహించేలా చేశాయి. అందరూ ఊహించినట్టే పదవీ బాధ్యతల స్వీకరణ సభలోనే సరికొత్త ప్రసంగ సంస్కృతికి తెరతీశారు రేవంత్‌రెడ్డి. ఇన్నేళ్ల కాంగ్రెస్‌ ‌చరిత్రలో వ్యక్తి పూజ వద్దని ప్రకటించారు. అలా.. సీనియర్ల ఆదరణను చూరగొనే ప్రయత్నం చేశారు. ఏదిఏమైనా తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్‌ ‌టార్గెట్‌గా కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి అధికారిక నిలదీత ఈ స్థాయిలో తొలిసారి వచ్చిందని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.

ఇక, ఆంధప్రదేశ్‌లో వైఎస్సార్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం నడిపిస్తున్న వైఎస్‌ ‌జగన్‌ ‌సోదరి షర్మిల తెలంగాణలో కూడా తన తండ్రి పేరుతో కొత్త రాజకీయ పార్టీ ప్రారంభించింది. అట్టహాసంగా పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించింది. వాస్తవానికి మూడు నెలల నుంచే షర్మిల తన పార్టీ కార్యక్రమాలు ప్రారంభించింది. ముహూర్తం చూసుకుని పార్టీ ఆవిర్భావ వేడుక నిర్వహించింది.

ఇలా.. తెలంగాణ రాజకీయాల్లో ముప్పేట దాడి కొనసాగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌కూడా అప్రమత్తం అయ్యారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడ్డ కేసీఆర్‌ ‌ఫామ్‌హౌస్‌ ‌నుంచి ప్రగతిభవన్‌ ‌బాటపట్టారనీ, జిల్లాల పర్యటనలు సాగిస్తున్నారనీ విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. వీరందరి టార్గెట్‌ 2023 అయినా.. అప్పటిదాకా రేసులో నిలిచేది ఎవరో, బలమైన పోటీ ఇచ్చేది ఎవరో, జెండా ఎగరేసేది ఎవరో కాలమే సాక్ష్యంగా నిలుస్తుంది.

– సుజాత గోపగోని,  సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

By editor

Twitter
Instagram