ఐదువందల ఎకరాలు దానం చేశారు!

జూలై 21 లక్ష్మీకాంతరావు బాబా 99వ జయంతి

వినోబాభావే భూదానోద్యమం యువతరానికెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ ఉద్యమం పప్రథమంగా ‘పోచంపల్లి’ (నల్గొండ జిల్లా) గ్రామం నుండి 1952లో ప్రారంభమైంది. 1954లో పాలమూరు జిల్లా (మహబూబ్‌నగర్‌) ‌పర్యటన జరిగింది. ఆనాడు పరిగి పాలమూరు జిల్లాలో ఉండేది. మా నాన్నగారు మత్స్యరాజ లక్ష్మీకాంతరావుబాబా (పరిగి పట్టణ వాస్తవ్యులు). ఆయన వినోబాభావే వెంట 30 రోజులకు పైగా విస్తృతంగా పర్యటన జరిపి భూదానోద్యమంలో చురుగ్గా పనిచేశారు.

వినోబాభావే భూదానోద్యమం యువతరాని కెంతో స్ఫూర్తినిచ్చింది. ఈ ఉద్యమం పప్రథమంగా ‘పోచంపల్లి’ (నల్గొండ జిల్లా) గ్రామం నుండి 1952లో ప్రారంభమైంది. 1954లో పాలమూరు జిల్లా (మహబూబ్‌నగర్‌) ‌పర్యటన జరిగింది. ఆనాడు పరిగి పాలమూరు జిల్లాలో ఉండేది. మా నాన్నగారు మత్స్యరాజ లక్ష్మీకాంతరావుబాబా (పరిగి పట్టణ వాస్తవ్యులు). ఆయన వినోబాభావే వెంట 30 రోజులకు పైగా విస్తృతంగా పర్యటన జరిపి భూదానో ద్యమంలో చురుగ్గా పనిచేశారు.

ప్రతిరోజు ఉదయం 3.30 గంటలకు ప్రారంభ మయ్యే కార్యక్రమం రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా కొనసాగేది. రోజూ ఒక్కో గ్రామాన్ని సందర్శించేవారు. వినోబాభావే ఆయనలో నింపిన స్ఫూర్తి గురించి చెబుతూ మా నాన్నగారు ఇలా అన్నారు- ‘ఉదయం 4.30కి పాదయాత్రగా వినోబాభావే వెంట వెళ్లేవాళ్లం. ఉదయం 8-9 గంటల వరకు మరో గ్రామానికి చేరేవాళ్లం. కార్యకర్తల సమావేశం, భూదాన పత్రసేకరణ జరిగేది. ఆ గ్రామాల్లో ఉండే వారితో సాయంత్రం చర్చాగోష్టి జరిగేది. భూదానోద్యమం, క్రాంతి, భగవద్గీతలపై వినోబాభావేగారి ఉపన్యాసాలు ప్రతిరోజు సాయంత్రం ఏర్పాటుచేసేవారు. హైదరాబాద్‌ ‌నుండి బయలుదేరిన పాదయాత్ర నందిగామ, షాద్‌నగర్‌, ‌మొగలిగిద్ద, కొందూర్గు, ఎలిడిచర్ల, కుల్కచర్ల, వెన్నబేడ్‌ (‌పరిగి తాలుకా), గుండుమాల్‌, ‌మద్దూర్‌ల గుండా నెలరోజులకు పైగా సాగింది. పాలమూరు-జడ్చర్ల మార్గంగా రోజూ దాదాపు 10-15 కిలోమీటర్ల దూరం నడిచేవాళ్లం. పరిగి తాలుకాలో 13 వందల ఎకరాల భూమిదానం జరిగింది. ప్రతిరోజు జరిగే గ్రామసభలో సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్‌, ‌పట్వారీలు కూడా పాల్గొనేవారు. సర్వోపయం, స్వదేశీ, ఖాదీ గ్రామీణ పరిశ్రమల భూదాన్‌, ‌గ్రామదాన్‌, ‌గ్రామ స్వరాజ్‌ ‌మొదలైన అంశాలపై వినోబాజీ ఉపన్యాసాలు యువతరాన్ని ఉత్తేజితుల్ని చేశాయి. ఏ గ్రామం సమస్య ఆ గ్రామంలోనే పరిష్కారం చేసుకోవాలని ఆయన ఉద్బోధించేవారు. రామరాజ్యం స్థాపనలో యువతరం గ్రామస్వరాజ్యం (సురాజ్యం)పై వినోబాజీ ప్రసంగించేవారు. ‘జీవనదాన్‌’ ‌ప్రణాళిక ద్వారా తమ పూర్తి సమయాన్ని ఈ కార్యక్రమాలకై వినియోగించేం దుకు ఎంతోమంది ముందుకు యువకులు వచ్చారు. ఆనాటి భూదానోద్యమ ప్రభావంవల్ల కమ్యూనిష్టుల ప్రభావం తగ్గింది. రైతుసంఘం ప్రారంభమైన నల్గొండ జిల్లాలోనే భూదానోద్యమం ప్రారంభం కావడం విశేషం. వినోబాభావేగారి సాన్నిహిత్యంలో గడిపిన 30పైగా రోజులు మరచిపోలేనివి’ అని గుర్తుచేసుకున్నారు.

లక్ష్మీకాంతరావు బాబా స్వాతంత్య్రోద్యమ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ‌పార్టీ చేపట్టిన అనేక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. పరిగి పట్టణం మున్సిపల్‌ ‌చైర్మన్‌గా పనిచేశారు. విశ్వ హిందూ పరిషత్‌ ‌హైదరాబాద్‌ ‌జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. రంగారెడ్డి, మెదక్‌, ‌మహబూబ్‌గర్‌ ‌జిల్లాలో విస్తృతంగా గీతాజ్ఞాన యజ్ఞాలు నిర్వహించారు. భూదానోద్యమానికి 500 ఎకరాలకు పైగా భూమిని దానం చేశారు. పరిగి ప్రాంతంలో సరస్వతీ శిశుమందిర్‌ల నిర్మాణం కోసం స్థలసేకరణ చేశారు.

బాబా 90వ జన్మదినోత్సవం సందర్భంగా వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు రాకమచర్ల శ్రీ యోగానంద లక్ష్మీనృసింహస్వామివారి సన్నిధిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు హాజరై ఆయనను ఘనంగా సన్మానించారు. వారు దానంచేసిన భూమి వివరా లతో పాటు వారి ఛాయాచిత్రాన్ని పరిగిలోని తహ సీల్దార్‌ ‌కార్యాలయంలో ఏర్పాటు చేశారు.

ఆయన అందించిన సేవలకు గుర్తుగా పరిగి పట్టణం (ప్రస్తుతం వికారాబాద్‌ ‌జిల్లాలోని) తహసీల్దార్‌ ‌కార్యాలయం ముందు బాబా విగ్రహం ఏర్పాటు చేశారు. 21 జూలై 2021న బాబా 99వ జయంతి సందర్భంగా ఆయన సేవలను మరొకసారి గుర్తుచేసుకునే అవకాశం కల్గింది. లక్ష్మీకాంతరావు బాబాకి మా పాదాభివందనాలు.

-ఆచార్య మత్స్యరాజ హరగోపాల్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram