(కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృతోత్సవ్‌ ‌పిలుపు మేరకు ప్రచురిస్తున్న 5వ వ్యాసం.)

చరితార్థులైనప్పటికీ చరిత్ర పుస్తకాలలో పది వాక్యాలకు కూడా నోచుకోని చరిత్ర పురుషులు ఎందరో ఉన్నారు. ప్రతివాది భయంకర వేంకటాచారి లేదా భయంకరా చారి అలాంటి చరిత్రపురుషుడు. సాహసి, త్యాగమూర్తి. రచయిత, గొప్ప వక్త. సామర్లకోటలో (తూర్పు గోదావరి) సంస్కృత పండితుల కుటుంబంలో పుట్టారాయన. అయినా ఇంగ్లిష్‌ ‌విద్య నేర్చుకున్నారు. సొంతూళ్లోనే పదవ తరగతి చదివి విశాఖ పట్నంలోని ఏవీఎన్‌ ‌కళాశాలలో ఇంటర్మీడి యెట్‌లో చేరారు. అప్పుడే ఆంధ్ర విశ్వవిద్యా లయం విద్యార్థి సంఘానికి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. కానీ చదువు ఆగిపోయింది. ఆ తరువాత కొద్దికాలం సీతానగరం ఆశ్రమంలో గడిపారు. భయంకరాచారిది ఆకర్షణీయమైన విగ్రహం.

దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు ప్రభావంతో భయంకరాచారి (ఆగస్ట్ 28,1910- ‌మే,1978) జాతీయోద్యమంలోకి వచ్చారని అనిపిస్తుంది. 1928 ప్రాంతంలో ఆయన కాశీనాథుని కలుసుకున్నారు. ఆంధ్రపత్రిక యజమాని కాశీనాథుని ఆ రోజులలో కవులు కలుసుకుని తమ పుస్తకాలు ప్రచురించమని కోరేవారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘అనుభవాలూ జ్ఞాపకాలూను’లో ఇందుకు అద్దం పట్టే ఉదంతం ఉంది. భయంకరాచారి కూడా కాశీనాథుని కలుసుకుని, తాను రాసిన ‘ప్రమద్వరా పరిణయం’ గ్రంథం అచ్చు వేయించమని కోరారు. పశ్చిమ గోదావరి జిల్లా పేరుపాలెం గ్రామంలో చెన్నాప్రగడ భానుమూర్తి ఉండేవారు. ఈయన మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీకి ప్రధాన అనువాదకునిగా పనిచేశారు. తెలుగు పరీక్షల నిర్వహణాధికారి కూడా. పుస్తకంలో అభ్యంతరకర అంశాలు లేవని భానుమూర్తి దగ్గర నుంచి అనుమతి పత్రం తీసుకురావాలని చెప్పారు కాశీనాథుని. సాంఘికమైనా, పౌరాణికమైనా, చరిత్రాత్మకమైనా అందులో ప్రత్యక్షంగా, పరోక్షంగా బ్రిటిష్‌ ‌ప్రభుత్వం మీద విమర్శలు ఉండకూడదు. అలాంటి విమర్శలు ఏమీ లేవనీ, పుస్తకం బ్రిటిష్‌ ‌వ్యతిరేకమేమీ కాదని భానుమూర్తి ఆమోదముద్ర వేసేవారు. ఆ పత్రం తెచ్చాక పుస్తకం ప్రచురించారు. నిజానికి పుస్తక ప్రచురణ కంటే భయంకరాచారి వ్యక్తిత్వం మీదే కాశీనాథుని ఎక్కువ ఆసక్తి చూపారు. ఆ తరువాతే భయంకరాచారి జాతీయోద్యమంలో ప్రవేశించారు.

గాంధీమార్గం నుంచి బాంబుల వైపు

1929(డిసెంబర్‌) ‌నాటి లాహోర్‌ ‌జాతీయ కాంగ్రెస్‌ ‌సభలకు కాశీనాథునితో పాటు భయంకరా చారి వెళ్లారు. అప్పటికి ఆయన వయసు 19 ఏళ్లు. అక్కడే పూర్ణ స్వరాజ్యం గురించి నేతలు ప్రకటించారు. అక్కడ ఆయన గాంధీజీని కలుసుకున్నారు. భారతదేశంలో అనుసంధాన భాషగా హిందుస్తానీ కాకుండా సంస్కృతం ప్రవేశపెట్టడానికి ప్రయత్నించ వలసిందని కోరారు. తరువాత కాకినాడలో బులుసు సాంబమూర్తి నాయకత్వంలో ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు.1930 మే నెలలో గురజనల్లిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లారు. కన్ననూరు, బళ్లారి జైళ్లలో ఉండగానే బెంగాల్‌ ‌విప్లవకారులతో పరిచయాలయ్యాయి. వారంతా లాహోర్‌ ‌కుట్ర కేసులో ఉన్నవారే. పరిశోధకుడు ఉల్లి ధనరాజు సేకరించిన సమాచారం ప్రకారం, ‘యువతను ఉరితీస్తూ, ప్రవాస శిక్షలు విధిస్తూ ఉంటే జాతి కళ్లు మూసుకుని కూర్చోలేదు. ఎదురుతిరిగి విప్లవించాలి. అందుకు అవసరమైన ఖర్చుల కోసం బ్యాంకులను దోచాలి’ అన్నది భయంకరాచారి అభిప్రాయంగా ఉండేది.

ఉప్పు సత్యాగ్రహంలో నాటి తూర్పుగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ ‌ముస్తాఫాఅలీ ఖాన్‌ ‌సాంబమూర్తి తల పగలగొట్టాడు. భయంకరాచారికి కూడా గట్టి దెబ్బలే తగిలాయి. ఆ సందర్భంగా జైలుకు వెళ్లినప్పుడే ఆయన తీవ్ర జాతీయోద్యమం వైపు మొగ్గుతున్న లక్షణాలు కనిపించాయి. సన్నిహితులు అనుమానించినట్టుగానే గాంధీజీ అహింసా ఉద్యమానికి ఆయన వీడ్కోలు పలికారు. తరువాత జరిగిందే కాకినాడ బాంబు కుట్ర కేసు.

కాకినాడ బాంబు కేసు

జలియన్‌వాలా బాగ్‌లో కాల్పులు జరిపిన వారినీ, లాలా లాజ్‌పతిరాయ్‌ని కొట్టి చంపిన అధికారినీ హత్య చేసి ప్రతీకారం తీర్చుకోవడం ఆత్మ గౌరవ ప్రకటనగా ఆనాడు కొందరు యువకులు భావించారు. అంతేతప్ప వారిది నేర మనస్తత్త్వం కాదు.అలాంటి తీవ్ర నిర్ణయాలకు రావడానికి ముందు వారికీ ఒక ఉద్యమ నేపథ్యం ఉందని మరచిపోరాదు. గోదావరి తీరంలో జరిగిన కాకినాడ బాంబు కుట్ర కేసులో కీలక పాత్రధారి భయంకరాచారికీ ఇలాంటి నేపథ్యమే ఉంది. అలాంటి నిర్ణయానికి ఆయనను తీసుకువచ్చిన పరిణామాలు వేరు.

బ్రిటిష్‌ ఇం‌డియా పోలీసు జులుంకు పెద్దాపురం ఘటన (డిసెంబర్‌ 16, 1930) ‌గొప్ప ఉదాహరణ. ధనుర్మాస సంతర్పణ కోసం దాదాపు ఎనభయ్‌ ‌మంది పెద్దలు, పిన్నలు బొక్కా నారాయణమూర్తి అనే రైతు తోటకు వచ్చారు. వత్సవాయి జగపతివర్మ (జమిందారు) కూడా ఉన్నారు. క్రొవ్విడి లింగరాజు, దువ్వూరి సుబ్బమ్మ, పెద్దాడ నారాయణమ్మ వంటి ప్రముఖులూ పాల్గొన్నారు. ఉద్యమం గురించి అక్కడ చర్చించాలనుకున్నారు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ‌డప్పులు సుబ్బారావు హెచ్చరిక ఇచ్చినా, సమయం ఇవ్వకుండా లాఠీచార్జి చేశాడు. వాడపల్లి రథయాత్రలో కాల్పుల (మార్చి 30, 1931) జరిగాయి. నలుగురు చనిపోయారు. సీతానగరం గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని (జనవరి 19,1932) పోలీసులు ధ్వంసం చేశారు. ఒక సందర్భంలో భయంకరాచారి యూనియన్‌ ‌జాక్‌ను తగులబెట్టారు. అప్పుడు జరిగిన లాఠీచార్జిలో గాయపడిన భయంకరాచారి ఎనిమిది గంటల పాటు స్పృహ కోల్పోయారు. ఆపై కొన్నిరోజుల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. వీటన్నిటికి మూలకార కులు పోలీసు సూపరింటెండెంట్‌ ‌ముస్తాఫాఅలీ ఖాన్‌, ‌సర్కిల్‌ఇన్‌స్పెక్టర్‌ ‌డప్పుల సుబ్బారావు. నిజానికి ఆ రోజులలో ఈ ఇద్దరి అకృత్యాలకు హద్దేలేదని ముందు తరాల వారు చెప్పేవారు. జాతీయ కాంగ్రెస్‌ ‌సభ్యుల మీద, స్వరాజ్య సమరయోధుల మీద ఈ ఇద్దరు కక్ష కట్టారు. అందుకే ముస్తాఫాను చంపాలని భయంకరాచారి పథక రచన చేశారు.

పడవలో బాంబులు

మరొక ఎనిమిదిమందితో కలసి భయంకరాచారి ముస్తాఫాను కడతేర్చాలని పథక రచన చేశారు. కాకరాల కామేశ్వరరావు, బోయిన సుందరం, చల్లా అప్పారావు, వడ్లమాని శ్రీరామమూర్తి, చిలకమర్రి సత్యనారాయణాచార్యులు, నండూరి నరసింహా చార్యులు వంటివారు ఈ బృందంలో సభ్యులు (ఓరుగంటి రామచంద్రయ్య పేరు ఉన్నా, అనవసరంగా ఇరికించారని ఒక వాదన ఉంది. ఈయన తరువాత ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చరిత్ర ఆచార్యులుగా పనిచేశారు). ప్రధాన పాత్ర మాత్రం భయంకరాచారి, కామేశ్వరరావులదే. కలకత్తా, బొంబాయి, పుదుచ్చేరిల నుంచి బాంబుల తయారీకి పదార్థాలు సేకరించారు. బాంబులతో శత్రువులో భయోత్పాతాన్ని నింపగలమన్న నమ్మకం భయంకరా చారికి ఉంది. కానీ ఈ ప్రయత్నం సజావుగా సాగడానికి జగన్నాథపురంలో సీహెచ్‌ఎన్‌చారి అండ్‌ ‌సన్స్ ‌పేరుతో ఒక దొంగ కంపెనీని ప్రారంభించారు.

మొదట ముస్తాఫా నివాసం, కదలికల గురించి కష్టపడి కనుగొన్నారు. కాకినాడలోనే ఉప్పుటేరు సమీపంలో ఉంటున్నాడతడు. అక్కడే బ్రిటిష్‌ ‌సంస్థ రిప్లయ్‌ ‌కంపెనీ ప్రాగణంలో నివాసం. అతడి నివాసం ఎదురుగానే బొమ్మల జెట్టి దగ్గర భారీ నావలు ఉంటాయి. ఇవన్నీ స్ట్రాస్‌ అం‌డ్‌ ‌కంపెనీకి చెందినవి. ఉప్పుటేరుకు అవతలి గట్టున ఉన్న జగన్నాథపురానికి జాలీ బోట్ల (చిన్నవి)లో వెళతాడని తెలిసింది. అందుకే ఆ పడవలోనే బాంబు పెట్టాలని నిశ్చయించారు. ప్రణాళికను 1933 ఏప్రిల్‌ ‌మొదటివారంలో అమలు చేయడం ప్రారంభించారు. తొలిగా 6న, తరువాత 14న బాంబులు పెట్టారు. ఆ రెండు రోజులూ కూడా అతడు రాలేదు. 15వ తేదీ వేకువన మళ్లీ బాంబు పెట్టారు. ఈసారి కూడా ముస్తాఫా జాడలేదు. ఆరోజు బాంబులన్నీ సంచిలో పెట్టి, ఒక పడవలో దాచి సమీపంలోనే ఉన్న హోటల్‌కు భయంకరాచారి, కూడా ఉన్నవారు వెళ్లారు. ఇంతలోనే బాంబుల మోత. 16వ నంబర్‌ ‌బోటులో దాచిన ఆ బాంబుల సంచిని సరంగు తీయడంతో పేలాయి. తొమ్మిది మంది కూలీలు గాయపడ్డారు.

పేలుడు శబ్దానికి అక్కడికి చేరుకున్నవారిలో సాక్షాత్తు ముస్తాఫా కూడా ఉన్నాడు. అక్కడ పేలకుండా మిగిలిన మూడు బాంబులు దొరికాయి. ఐదురోజుల తరువాత గాని అది విప్లవకారులు కుట్ర అనీ, పైగా తనను అంతం చేసేందుకే జరిగిందనీ అతడికి తెలియలేదు. కాకినాడకే చెందిన ఎస్‌కెవి రాఘవాచారి రామచంద్రపురం ఎస్‌ఐకి విషయం చెప్పడంతో కుట్ర బయటపడింది. ఒక్కొక్కరిని పట్టుకోవడం ఆరంభించారు. అప్పటికి తప్పించు కున్నా, భయంకరాచారిని సెప్టెంబర్‌ 11‌న కాజీపేట రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు.

అండమాన్‌కు

తూర్పుగోదావరి జిల్లా సెషన్స్ ‌కోర్టు కేసు విచారించి అందరికీ శిక్ష విధించింది. దీని మీద అప్పీలుకు వెళ్లారు. మద్రాస్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది వీఎల్‌ ‌యతిరాజు కేసు వాదించారు. కామేశ్వరరావుకు నాలుగేళ్ల శిక్ష విధించారు. భయంకరాచారికి ఏడేళ్ల ద్వీపాంతర శిక్ష వేసి అండమాన్‌ ‌జైలుకు పంపించారు. ఆ జైలులో అందరిలాగే భయంకరాచారి నరకం చూశారు. ఈ కారాగారాన్ని ‘ప్యారడైజ్‌’ అని మద్రాస్‌ ‌ప్రెసిడెన్సీ హోం మెంబర్‌ ‌హెన్రీ క్రేక్‌ ‌వ్యంగ్యంగా అంటూ ఉండేవాడు. 1937లో జాతీయ కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తరువాత భయంకరాచారి విడుదలయ్యారు. ఆపై అండమాన్‌ ‌జైలు అనుభవా లకు అక్షరరూపం ఇచ్చారు. దీనికి ఆయన పెట్టిన పేరు ‘క్రేక్స్ ‌ప్యారడైజ్‌, ‌లైఫ్‌ ఇన్‌ అం‌డమాన్స్. ‘‌సండే టైమ్స్’ ‌సంపాదకుడు కేఎస్‌ ‌కామత్‌ ‌ప్రచురించారు. చక్రవర్తుల రాజగోపాలాచారి ముందుమాట రాశారు. ఒక కారాగారవాసి రాసిన పుస్తకానికి ప్రధానమంత్రి ముందుమాట రాయడం విశేషమేనని రాజాజీ వాఖ్యానించారు కూడా. అండమాన్స్‌లో శిక్ష అనుభవించిన ఎందరో తీవ్ర జాతీయవాదుల ప్రస్తావనలు ఇందులో ఉన్నాయి.

భయంకరాచారికి అప్పటికి వివాహం కాలేదు. అనేక కష్టాలు పడుతున్నారు. అలాంటి సమయంలో భారత జాతీయ కాంగ్రెస్‌ ‌ప్రముఖడు అనంతశయనం అయ్యంగార్‌ ‌భయంకరాచారిని నెహ్రూకు పరిచయం చేశారు. వెంటనే ప్రథమ ప్రధాని ఆయన ఆశయాల మేరకు పనిచేయడానికి స్వేచ్ఛనిస్తూ ఫీల్డ్ ‌పబ్లిసిటీ ఆఫీసర్‌గా నియమించారు.తరువాత పెళ్లి చేసుకుని ప్రశాంత జీవనం ఆరంభించారు చారి. అయితే ఒకదశలో భారత ప్రభుత్వ విధానాన్ని విమర్శించ డంతో ఉద్యోగం పోయింది. మళ్లీ నెహ్రూయే కలగచేసుకుని బాధ్యతలు ఇప్పించారు. ఆయనకు భారత ప్రభుత్వం తామ్రపత్రం ఇచ్చింది.

పాత్ర ముగిసినా రంగస్థలం మీదే ఉండిపోయిన నటుడిని తలపించారాయన అని పి.రాజేశ్వరరావు తన ‘ది గ్రేట్‌ ఇం‌డియన్‌ ‌పేట్రియాట్స్-2’‌లో భయంకరా చారి గురించి వ్యాఖ్యానించారు.1975లో భార్య కన్నుమూసిన తరువాత వీరి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. తీవ్ర జాతీయోద్యమంలో పనిచేసిన చాలామంది ఏవేవో కారణాలతో కమ్యూనిజం వైపు మొగ్గినా భయంకరాచారి తుదికంటా జాతీయవాది గానే ఉన్నారు. పైగా సంప్రదాయవాదిగా మారి పోయారు. టంగుటూరి ప్రకాశంకు సన్నిహితంగా ఉండేవారు.1952లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికలలో కిసాన్‌ ‌మజ్దూర్‌ ‌ప్రజా పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. భయంకరాచారి 1978 మే మాసంలో తుదిశ్వాస విడిచారు. తుదివరకు కూడా ఆయన సమకాలీన రాజకీయాల పరిణామా లను పరిశీలిస్తూనే ఉన్నారు. కమ్యూనిస్టులతో కాంగ్రెస్‌ ‌కలవడం ఆయనకు నచ్చలేదు. అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత దేశమంతటా ప్రధానంగా కాంగ్రెస్‌, ‌జనతా పార్టీ ఎన్నికలలో పోటీ పడ్డాయి. ఆయన ఈ రెండింటినీ విశ్వసించలేదు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే అది ప్రజా స్వామ్యానికి ఉత్పాతం. జనతాకు ఓటు వేస్తే అది దేశానికి పెను ముప్పు అన్న అభిప్రాయానికి వచ్చారు. జనతా అతి తక్కువ సారూప్యత ఉన్న ఐదు పార్టీల కూటమి కాబట్టి నమ్మరాదని ఆయన ఉద్దేశం.

దేశం కోసం త్యాగం చేయడం జీవితాన్ని వృధా చేయడం కాదు అన్న సావర్కర్‌ ‌వ్యాఖ్యకు నిలువెత్తు రూపం భయంకరాచారి. అండమాన్‌ ‌కారాగారంలో ఆయన మొదటిగా విన్న మహనీయుడి పేరు కూడా అదే- వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌.

– ‌గోపరాజు

About Author

By editor

Twitter
Instagram