‘అమెరికాలో డాలర్లు పండును, ఇండియాలో సంతానం పండును’ అంటాడు దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ఒక కవితలో. భారత్‌ అం‌టేనే జనాభా గుర్తుకు వస్తుందన్నది నిజం. కానీ, ఏ వ్యవస్థకైనా జనాభాను వరంగానే భావిస్తారు. అలా భావించాలి కూడా. ఇంత జనాభా కలిగిన భారత్‌ ‌కొన్ని సానుకూల అంశాలు, అలాగే ప్రతికూల అంశాలను జమిలిగా చవిచూస్తున్న మాట నిజం. ప్రపంచం దృష్టిలో భారత్‌ అతిపెద్ద మార్కెట్‌. అదే సమయంలో దేశ సమగ్రాభివృద్ధికి జనాభా ఒక గుదిబండ కూడా. జనాభా విధానం లేకపోవడం భారత్‌కు ఉన్న పెద్ద బలహీనత. ఒక భవ్యమైన ఆర్థికవ్యవస్థగా భారత్‌ ఆవిర్భావానికి ఉన్న అడ్డంకులలో ఇదే ప్రధానమైనది కూడా. పక్కనే చైనా బలం యావత్తు సరిగ్గా ఇదే. ఆ దేశానికి జనాభా విధానం ఉంది. ఆ విధానం కాలానుగుణంగా మారుతూ వస్తున్నది. నిజానికి జనాభా నియంత్రణ మీద రెండు దేశాలకు దృష్టి ఉంది. కానీ ఈ అంశంలో చైనాకు ఉన్న వెసులుబాటు భారత్‌కు లేదు.అలాగే జనాభా నియంత్రణ మీద మీనమేషాలు లెక్కిస్తూ కాలక్షేపం చేసే పరిస్థితి ఇప్పుడు మన దేశానికి లేదనే అనాలి. కాబట్టి భారత్‌లో జనాభా విధానానికి ఇప్పటికైనా శ్రీకారం చుట్టగలమా? 

సమీప భవిష్యత్తులో ఐదు ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్ధిక స్థాయిని అందుకోవాలని భారత్‌ ఆశిస్తోంది.కానీ అప్పటికి దేశ జనాభా చైనా జనసంఖ్యను మించిపోవచ్చును. కాబట్టి జాతీయ జనాభా విధానం ఇప్పుడు అత్యవసరం. అధిక సంతానం కలిగిన కుటుంబాలకు సదుపాయాలు, సౌకర్యాలు అందవని తెలియజెప్పడమే జనాభా నియంత్రణకు ఏకైక మార్గం.

దేశ జనాభాలో ఎక్కువమంది 25 ఏళ్ల కంటే తక్కువ వయసు వారేనని, ఈ జనసంఖ్య దేశానికి ఎంతో లాభదాయకమని, ఇదే అమెరికా, చైనా వంటి ట్రిలియన్‌ ‌డాలర్‌ ఆర్ధిక వ్యవస్థను సాధించడానికి ఉపయోగపడుతుందని చాలామంది రాజకీయ నాయకులు, పత్రికా రచయితలు గొప్పగా చెపుతుంటారు. ఇంతకీ ఆ వాదనలలోని హేతుబద్ధత ఎంత? ఈ యువ జనాభాకు దేశాభివృద్ధికి ఉపకరించే విద్య అందించి, ఉపాధి చూపుతున్నారా? లేక వారిని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నారా అన్నది ప్రధాన ప్రశ్న. ఎందుకంటే వీరిని పోషించ డానికి దేశ వనరులు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం పెద్ద ఎత్తున ఖర్చవుతుంది. ఈ సందర్భంలోనే వాస్తవం మాట్లాడితే, ఆ తరహా జనాభాను ఆకర్షించడానికీ, ఓటు బ్యాంకు రాజకీయాలకీ మధ్య అవినాభావ సంబంధమే ఉంది. వీరి కోసం విలువైన ప్రజాధనాన్ని కేవలం సంక్షేమ పథకాలకే ఖర్చు చేయడం వల్ల నష్టమే తప్ప దేశానికి ప్రయోజనం చేకూరదు.

జనాభా సూత్రం గురించి రెండు శతాబ్దాల క్రితమే ప్రతిపాదనలు చేసిన థామస్‌ ‌రాబర్ట్ ‌మాల్తస్‌ (1766-1834)‌ను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాం. దేశ ఆర్ధికాభివృద్ధి, జనాభా మధ్య సంబంధాన్ని 18వ శతాబ్దంలోనే మాల్తస్‌ ‌విశ్లేషించాడు. జనాభా అన్న అంశం మీద ప్రపంచానికి లోతైన అవగాహన కల్పించినవాడు మాల్తస్‌. ‌తన సూత్రాన్ని 1789లో ప్రచురించిన -యాన్‌ ఎస్సే ఆన్‌ ‌ది ప్రిన్సిపుల్‌ ఆఫ్‌ ‌పాపులేషన్‌’ (An Essay on the Principle of Population) అనే వ్యాసంలో ప్రస్తావించాడు. ఆ వ్యాసం యూరప్‌ అం‌తటా, ఆర్ధికవేత్తలు, రాజకీయ నాయకుల్లో భారీగా ఆలోచనను రేకెత్తించింది. అయితే ఆ వ్యాసంలో ప్రస్తావించిన అంశాలపై దృష్టి సారించినది చైనా మాత్రమే. ఆహార అవసరాలు తీరుతున్నప్పుడు జనసంఖ్య విపరీతంగా పెరుగు తుందని, పరిమితికి మించిన జనాభాకు ఆహారం అందించే శక్తి, సామర్ధ్యం ఈ భూమికి లేవని మాల్తస్‌ ఆ ‌వ్యాసంలో పేర్కొనడం విశేషం. కొన్ని వ్యవస్థలు, కొందరు వ్యక్తులు రాజకీయ ప్రయోజనాల కోసం పేదవారిని నిరంతరం పేదరికంలోనే ఉంచాలని ప్రయత్నిస్తుంటారు. అందువల్ల అపారమైన దేశ వనరులు వృధా అవుతుంటాయి. ఉదాహరణకు మన దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 80 కోట్ల ప్రజానీకానికి దాదాపు ఉచితంగా ఆహార ధాన్యాలు, ఇతర పదార్ధాలు సరఫరా చేస్తున్నారు. అంతేకాదు వారికి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (NREGA) క్రింద నేరుగా నగదు కూడా అందిస్తున్నారు. సంవత్సరం మొత్తంలో కొన్ని రోజుల పాటైనా కనీస వేతనం అందించడం ద్వారా వారిని పేదరికం నుండి బయటకు తేవాలన్నది ఆ పథకం ఉద్దేశం. అయితే అలా కనీస వేతనం అందించడానికి వారితో చేయిస్తున్న పని ఎలాంటిది? అది ఏపాటి నిర్మాణాత్మకమైనది? ఉత్పాదకత కలిగినది? దాని వల్ల దేశానికి శాశ్వతమైన ఆస్తులు, సంపద సమకూరుతున్నాయా? అని ప్రశ్నించుకుంటే వచ్చే సమాధానం- అదేమీలేదు. చిన్నాచితకా పనుల కోసం వారికి వేతనం ఇస్తున్నారు.

 సమీప భవిష్యత్తులో 5 ట్రిలియన్‌ ‌డాలర్ల ఆర్ధిక స్థితిని చేరుకోవాలని భారత్‌ ఆశిస్తున్నా, ఆ సమయానికి దేశ జనాభా చైనాను మించిపోయి 140 కోట్లకు చేరుతుంది. కొనుగోలు శక్తితో పోలిస్తే అప్పటికి తలసరి ఆదాయంలో వచ్చే వృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్లీ మొదటికే పరిస్థితి వస్తుంది.

ఆహార భద్రత వల్ల భారత్‌లోనే కాదు ప్రపంచ మంతటా జనాభా విపరీతంగా పెరుగుతోంది. (క్రింది పట్టికలో చూడండి) అంటే దీనర్ధం ఆహార భద్రతను నిర్లక్ష్యం చేయమని కాదు. ఆ పథకాన్ని, ఆలోచనను మరింత అర్ధవంతంగా, నిర్మాణాత్మకంగా అమలు చేయాలనే.

–      1951లో భారత్‌లో ముస్లిం జనాభా 9.5 శాతం. అది ప్రస్తుతం, బంగ్లాదేశ్‌ ‌చొరబాటు దారులు, రోహింగ్యాలతో కలిపితే 16-20శాతం ఉంటుంది.

–     అలాగే షెడ్యూల్‌ ‌కులాల వారి సంఖ్య 15-22శాతం, షెడ్యూల్‌ ‌తెగల జనాభా 7.5-12శాతం ఉంటాయి.

–    ఓట్లర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు రకరకాలు తాయిలాలు, కానుకలు అందిస్తున్నాయి. పసుపు కుంకుమలు అనే పథకం చంద్రబాబు నాయుడు అమలు చేస్తే, బతుకమ్మ చీరలు అని కె. చంద్రశేఖర రావు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు.

భారత్‌లో జనసంఖ్య పెరుగుదల సంపన్న వర్గాల్లో కంటే పేదల్లోనే ఎక్కువ. పేదవర్గాల జనాభా విపరీతంగా పెరుగుతుంటే ఉన్నత కులాలుగా పేరు పడినవారి సంఖ్య 10-12శాతం మించదు. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకు 2500 కేలరీల ఆహారం తీసుకోవాలి. కానీ మన దేశంలో ఇంకా అందరూ ఆ స్థితిని చేరుకోలేదు.

 దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలు మన తరువాత స్వాతంత్య్రం సాధించు కున్నాయి. కానీ ఆ దేశాలు 90శాతం అక్షరాస్యత సాధిస్తే భారత్‌ 65‌శాతం (1947లోనైతే 20శాతం కంటే తక్కువే) మాత్రమే సాధించగలిగింది. 80వ దశకంలో మనం ఆహారధాన్యాలు, సంబంధిత ఉత్పత్తులలో స్వయంసమృద్ధి సాధించాం. దీనికి దీటుగా జనాభా కూడా పెరుగుతూ వచ్చింది. ప్రతి సంవత్సరం మన దేశ జనాభా 15-18మిలియన్‌ల చొప్పున పెరుగుతోంది. ఈ సమస్యను గమనిస్తూనే, అందుకు తగ్గట్టే చాలాకాలం అవిద్య, నిరుద్యోగాలను రూపుమాపాలని ప్రభుత్వాలు కృషి చేశాయి. అయినా పెరుగుతున్న జనాభాతో ఆ కృషి ఆశించిన ఫలితం ఇవ్వలేకపోయింది. విద్యావంతుల సంఖ్యతో పాటు వృత్తినైపుణ్యం లేని నిరుద్యోగుల సంఖ్య కూడా దానితోపాటే పెరిగింది. దానితో వృత్తినైపుణ్యంపై దృష్టి పెట్టాం. దీని ఫలితం అనూహ్యంగా ఉంది. విద్యావంతులు, వృత్తినైపుణ్యం కలిగిన నిరుద్యోగులు తయారయ్యారు.

సంపన్న స్థితి నుంచి మన ప్రభుత్వాలు సంక్షేమ రాజ్యాల వైపు ప్రయాణించి, చివరికి పన్నుల ఆదాయం సరిపోక అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నాయి. ఆహార భద్రత, ఉపాధి హామీ, ఉచిత గృహవసతి, వివాహ కానుకల పంపిణీ, మొదలైన అనేక -‘ఉచితాల’ కోసం ఖర్చు చేస్తున్నాయి. (తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం 700 రకాల వస్తువులను, సేవలను ఉచితంగా అందజేస్తామని హామీ ఇచ్చి, ఆ హామీని నిలబెట్టుకునేందుకు ప్రయత్ని స్తోంది). కొన్ని రంగాల వారు ఏమీ అడగకపోయినా కూడా ప్రభుత్వం వారికి ఎడాపెడా ఉచితాలు కట్టబెడుతున్నది. 30ఏళ్ల కాలపరిమితితో ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి. 30ఏళ్ల తరువాత ఆ అప్పులు తీర్చవలసివచ్చేనాటికి ప్రస్తుత ముఖ్యమంత్రి, ఆయన వారసులు (కాబోయే ముఖ్యమంత్రి) ఎలాగూ ఉండరు. కనుక, ఆ భారం రాబోయే తరాలపై పడుతుంది.

ఈ ధోరణి సరికాదనీ, ఆర్థిక వ్యవస్థకు గుదిబండ అని అందరికీ తెలుసు. అయినా పరిస్థితులు, రాజకీయ పార్టీల స్వార్థం దానికి అడ్డుకట్ట వేయకుండా నిరోధిస్తున్నాయి. అయినా, అవిభాజ్య ఆంధప్రదేశ్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఈ సలహాలు అందజేశాను –

–   ఒక కుటుంబానికి ఒకే సంతానం ఉంటే వారి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం వహించాలి. ఇద్దరు పిల్లలు ఉంటే వారి సంరక్షణ తల్లిదండ్రులదే. ముగ్గురు పిల్లలు, అంతకంటే ఎక్కువమంది ఉంటే దేవుడిదే భారం.

–   ఉచితాలను వెంటనే నిలుపుచేయాలి. ప్రభుత్వం ఇచ్చే ఉచిత ఆహార పదార్ధాలను పొందే పేద ప్రజానీకంవల్ల జన సంఖ్య కూడా పెరుగుతోంది.

–    వృత్తినైపుణ్యం సాధించి ఉపాధి పొందాలి. ప్రతిఒక్కరు చదువుకుని, తద్వారా వచ్చే నైపుణ్యంతో కష్టపడి పనిచేసి సంపాదించు కోవాలి.

ఈ సూచనలను బాగా ప్రచారం చేయడం వల్ల 2004నాటికి ఆంధప్రదేశ్‌ ‌జనాభా వృద్ధి రేటు 2.8 నుండి 1.8శాతానికి తగ్గింది.

మాల్తస్‌ ‌వ్యాసంలో పేర్కొన్న విషయాల నుండి చైనా మాత్రమే లాభపడింది. 1970 తరువాత చైనా -ఒక కుటుంబం, ఒక సంతానం’ అనే పద్ధతిని అమలు చేసింది. ఇక్కడ ఒక విషయం గుర్తు చేసుకోవాలి. 1992 వరకు చైనా తలసరి ఆదాయం భారత్‌ ‌కంటే తక్కువగా ఉండేది. అలాగే పారిశ్రామిక రంగం కూడా బలహీనంగా ఉండేది. కానీ జనాభా విధానం వల్ల ఆ దేశం త్వరగా అభివృద్ధి సాధించి 15 ట్రిలియన్‌ ‌డాలర్లతో ప్రపంచంలోనే రెండవ పెద్ద ఆర్ధిక వ్యవస్థగా రూపొందింది. ఈ ఆర్ధికాభివృద్ధిని, శక్తిని స్థిరపరచుకునేందుకు 2006లో ప్రతి కుటుంబంలో ఇద్దరు సంతానం ఉండాలని చైనా నిర్ణయించింది. ఇక 2021లో అమెరికా వార్షిక స్థూల జాతీయోత్పత్తిని అధికాగమించడానికి వీలుగా ప్రతి కుటుంబంలో ముగ్గురు పిల్లలు ఉండాలని చైనా ప్రభుత్వం నిర్ధారించింది. అలా ఆర్ధికాభివృద్ధికి తగినట్లుగా చైనా తన జనాభా విధానాన్ని మార్చు కుంటూ వచ్చింది. ఆవిధంగా ప్రపంచంలోనే బలమైన ఆర్ధిక వ్యవస్థగా నిలబడటమేకాక, ఆ స్థానాన్ని సుస్థిరం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది.

దురదృష్టవశాత్తు మన దేశంలో జాతీయ విద్యావిధానం, జాతీయ టెలికాం విధానం వంటి మిగిలిన రంగాల్లో స్పష్టమైన విధానాలు ఉన్నట్లుగా జనాభా విధానం మాత్రం లేదు. 1975-77లలో దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్‌ ‌గాంధీ జనాభా నియంత్రణపై దృష్టి పెట్టారు. కానీ ఇది తొందర పాటు కార్యక్రమంగా తయారై, మానవీయత లేని పథకంగా ప్రజలకు అతి పెద్ద చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తరువాత 1977 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌ఘోర పరాజయం పాలుకావడానికి ఇది ఒక కారణం. పురుషులకు బలవంతంగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించారు. ఆ చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అప్పటి నుంచి ఏ రాజకీయపార్టీ, ఏ మేధావి జనాభా నియంత్రణ గురించి మాట్లాడలేక పోతున్నారు. కానీ సంక్షేమ పధకాలపైన ఆధారపడిన వర్గాల్లో జనసంఖ్య విపరీతంగా పెరుగుతుండడం పట్ల అందరూ ఆందోళన చెందుతున్నారు. అంటే అదనంగా పేదలు తయారవుతున్నారు. పేదరికం ఇంకాస్త పెరుగుతోంది.

అయితే నిరంకుశ పాలనావ్యవస్థ కలిగిన చైనాలో ఎలాంటి విధానాన్నైనా రూపొందించి, అమలు చేయడం సులభం. మన దేశం వంటి బహుళ రాజకీయ పక్షాలు కలిగిన ప్రజాస్వామ్య దేశంలో అది సాధ్యం కాదు. ఓట్లు, రాజకీయం వీటికి ముఖ్యం. పేదలకు, ఓటు బ్యాంకులకు వారి ప్రయోజనాలు, బలహీనతలు వారికి ఉన్నాయి. ఫలితం పేదరికం, పేదరికం నుంచి విముక్తి అనే రెండు అంశాలు రైలు పట్టాల మాదిరిగా కలవడం లేదు. ఎంతో పేదరికంతో బాధపడుతున్నా, పర్యవసానాలు తెలిసినా జనాభా విధానం గురించి మాట్లాడితే ముస్లింలు మత విశ్వాసాలు తీసుకువస్తున్నారు. ముస్లింలు ఎంతమంది సంతానాన్ని కలిగి ఉండా లన్నది నిర్ణయించగలిగిన చట్టాలను ఈ దేశంలో అమలు చేయలేరని అస్సాంకు చెందిన ఆల్‌ ఇం‌డియా యునైటెడ్‌ ‌డెమొక్రటిక్‌ ‌ఫ్రంట్‌ ‌నాయకుడు మౌలానా బద్రుద్దీన్‌ అజ్మల్‌ ‌బహిరంగంగానే హెచ్చరిస్తున్నాడు. దశాబ్దాలుగా ముస్లిం ఓటు బ్యాంకు వల్ల లాభపడుతున్న పార్టీలు కూడా అలాంటి చట్టాలకు మద్దతునివ్వకపోవచ్చును. కానీ అజ్మల్‌ ‌వంటి నేతల వల్లనే ఈ దేశంలో ఒక వర్గం పేదరికం అనే సాలెగూడు నుంచి బయటపడలేకపోతున్నది. సెక్యులరిజం గురించి చాటుకునే రాజకీయ పార్టీలు కూడా అజ్మల్‌ ‌వంటివారి ఉన్మాదానికి పరోక్షంగా బలం చేకూరుస్తున్నాయి. అందువల్ల వివిధ వర్గాల మధ్య పెరుగుతున్న అసమతౌల్యం, దానితో తలెత్తుతున్న విష పరిణామాలను ఇకనైనా పరిగణన లోనికి తీసుకోక తప్పదు.

మరి పరిష్కార మార్గం ఏమిటి? 2014లో నేను ఏపీ ప్రభుత్వానికి ఇచ్చిన సలహాలను స్వీకరించవచ్చు. ఎక్కువమంది పిల్లలు ఉన్న కుటుంబాలకు సదుపాయాలు, సౌకర్యాలు నిలిపివేయడమే ఏకైక పరిష్కారంగా కనిపిస్తోంది.

–    ఏకైక సంతానం కలిగిన కుటుంబాలకే ఉపాధి హామీ, సంక్షేమ పధకాలు అమలు చేయాలి. ఆ కుటుంబంలో రెండవ సంతానం కలగగానే ఈ సదుపాయాలు నిలిపివేయాలి. ఏకైక సంతానం కలిగిన కుటుంబాలను పోషించగలిగిన శక్తి మాత్రమే రాజ్యాలకు ఉంది.

–    ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్‌ ‌సదుపాయం చిన్న కుటుంబాలకు మాత్రమే వర్తింపచేయాలి. దీనికి రాజకీయ సంకల్పం అత్యవసరం.

–   ఇద్దరు సంతానం కలిగిన వారికి పంచాయత్‌, ‌మండల్‌, ‌జిల్లా పరిషత్‌, ‌శాసనసభ, పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి అనుమతి ఇవ్వకూడదు.

ఇలాంటి చర్యలు తీసుకునేముందు మేధావులు, రాజకీయ నాయకులు జనాభా విస్ఫోటనం వల్ల కలుగుతున్న, కలిగే నష్టాల గురించి ప్రజలకు వివరించాలి. ముఖ్యంగా అధిక జనాభా వల్ల పేదవారికి జరిగే నష్టాన్ని తెలియజేయాలి. దేశం అన్నీ రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే పేదరికాన్ని కొనసాగించే పద్ధతులు, విధానాలకు స్వస్తి చెప్పాల్సిందే. దేశాభివృద్ధికి అనుగుణంగా జాతీయ జనాభా విధానాన్ని రూపొందించుకుని, కాలాను గుణంగా దానిని మార్చుకుని అమలుచేసుకోవాలి. దానివల్ల అందరికీ ప్రయోజనం చేకూరుతుంది. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా జనాభా విధానాన్ని సవరించుకోగలగాలి.

– డాక్టర్‌ ‌త్రిపురనేని హనుమాన్‌చౌదరి, టెలికాం నిర్వహణ, అధ్యయన సంస్థ డైరెక్టర్‌

అను: కేశవనాథ్‌

About Author

By editor

Twitter
Instagram