– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌

‘‌రాజకీయపరమైన విభేదాలు ఉండవచ్చు. కానీ అందరూ జాతీయ ప్రయోజనాల కోసం కట్టుబడి పనిచేయాల్సిందే.’ జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణ రద్దు తరువాత ఆ ప్రాంత నేతలతో మొదటిసారి జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్న మాట ఇది. ఆగస్ట్ 5, 2019‌లో ప్రత్యేక ప్రతిపత్తిని తొలగించారు. అది జరిగిన రెండేళ్ల తరువాత ఈ జూన్‌ 24‌న ఢిల్లీలో జరిగిన ఆ విస్తృత సమావేశం ఏ విధంగా చూసినా మరో అడుగు వంటిదేనని అంచనా. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 370 అధికరణకు ప్రాణప్రతిష్ట చేస్తాం అంటూ దిగ్విజయ్‌ ‌సింగ్‌ ‌వంటి రాజకీయ కేతిగాడి చేత ఈ కీలక సమావేశానికి కాస్త ముందు ఆ పార్టీ అధినేతలు పలికించినా ఆ పాచిక పారలేదు. మెహబూబా ముఫ్తీ అనే ఒక్క నాయకురాలు మాత్రమే దిగ్గీరాజా మాటలో గట్టి భవిష్యత్తును చూసుకుంటున్నదని అనిపిస్తోంది. మిగిలిన ముస్లిం పార్టీల నాయకులు సన్నాయి నొక్కులకు పరిమితమయ్యారు. సమీప భవిష్యత్తులో మొదలయ్యేది ఎన్నికల పక్రియ. అందులో తమకు స్థానం ఉండబోదని పరిపూర్ణమైన అవగాహన వాళ్లందరికీ వచ్చింది. అందుకే రెండేళ్ల క్రితం వినిపించిన స్థాయిలో ఇప్పుడు నిరసన స్వరం లేదు.

జమ్ముకశ్మీర్‌కు మళ్లీ ప్రత్యేక ప్రతిపత్తి అసంభవమన్న వాస్తవాన్ని ఆ ప్రాంత ముస్లిం పార్టీల నేతలు గుర్తించక తప్పదన్న స్థితికి వచ్చిన సంగతిని ఈ సమావేశం దాదాపు బట్టబయలు చేసింది. కానీ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ మాజీ ముఖ్య మంత్రి ఫారూక్‌ అబ్దుల్లా ప్రథమ ప్రధాని నెహ్రూను తెర మీదకు తేవడానికి చూస్తున్నారు. నెహ్రూ ప్లెబిసైట్‌ ‌నిర్వహిస్తామని చెప్పారని ఆయన కశ్మీర్‌ ‌తిరిగి వెళ్లిన తరువాత గుర్తు చేసుకున్నారు. పీవీ నరసింహారావు కూడా కొన్ని ప్రత్యేక హక్కులు ఇస్తామని చెప్పినా జరగలేదని కూడా ఫారుక్‌ ‌విలేకరులకు గుర్తు చేశారు. ఒక విధంగా ఫారుక్‌ను మించి వాస్తవికంగా ఉన్నవారు మెహబూబా ముఫ్తీ. ఆమె 370 అధికరణాన్ని పునరుద్ధరించేవరకు పోటీ చేయబోనని ప్రతిజ్ఞ చేశారు. ఇది పాకిస్తాన్‌ ‌భాష అన్న సంగతిని ఆమె ఇప్పటికీ గుర్తించలేదా? ఆ సంగతేమో కానీ ఇక కశ్మీర్‌లో తనకు భవిష్యత్తు లేదన్న అంశం ఆమె గుర్తించిన సంగతి అర్ధమవుతూనే ఉంది. అంతర్జా తీయంగా, జాతీయంగా ఎంత ప్రతిఘటన ఎదురైనా 370 అధికరణ రద్దు చేసిన బీజేపీ ప్రభుత్వం అక్కడ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పక్రియ గురించి కూడా ఇప్పటికే ఒక స్పష్టతకు వచ్చింది. అది జాతీయ ప్రయోజనాలు పునాదిగా ఉన్నది. సరిహద్దు రాష్ట్రం పట్ల ఉండవలసిన వాస్తవిక దృక్పథాన్ని నింపుకుని ఉన్నది. అదే అమలులో పెడతానని కేంద్రం కరాఖండీగా చెప్పింది. ముందు నియోజక వర్గాల పునర్‌ ‌విభజన. ఆ తరువాత ఎన్నికలు. వారి వారి అభిప్రాయాలు ఎలా ఉన్నా కశ్మీర్‌లోని ముస్లిం పార్టీలు ఇదే అభిప్రాయానికి మొగ్గినట్టే కనిపించింది. అంటే కేంద్రం దారిలోకే కశ్మీరీ పార్టీలు వచ్చాయి. భవిష్యత్తు లేదని తేలిపోయిన పార్టీలే ఇప్పటికీ సన్నాయినొక్కులు నొక్కుతున్నాయి.

జమ్ముకశ్మీర్‌… ఈ ‌కీలక సరిహద్దు రాష్ట్ర సమస్య ప్రతి ప్రధానికి వారసత్వంగా వచ్చేదే. కాంగ్రెస్‌ ‌హయాంలో కేంద్రం విధానం పూర్తిగా కశ్మీరీ నాయకుల బుజ్జగింపులకే పరిమితమయ్యేది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో ఢిల్లీలో కొలువుదీరిన ప్రభుత్వాలు ఇందుకు భిన్నంగా క్రియాశీలకంగా వ్యవహరించాయి. అటల్‌ ‌బిహారీ వాజపేయి, నరేంద్ర మోదీ కశ్మీర్‌ ‌సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో అడుగులు వేశారు.

ప్రధాన స్రవంతిలోకి రావాలనే

జమ్ముకశ్మీర్‌ ‌ఢిల్లీకి దూరం, మనసుకు దూరం అన్న భావనను తొలగించాలన్న నినాదం బీజేపీదే. తన మాటలను కార్యాచరణలో పెట్టేందుకు 1999 ఫిబ్రవరిలో ‘లాహోర్‌ ‌బస్సుయాత్ర’ ద్వారా వాజపేయి దాయాది దేశానికి స్నేహహస్తం చాటారు. జూన్‌ 24‌న నరేంద్ర మోదీ నిర్వహించిన కశ్మీర్‌ ‌రాజకీయవేత్తల సమావేశంలో కనిపించినది కూడా ఇదే. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందంతో ప్రత్యేక బస్సులో లాహోర్‌ ‌వెళ్లిన వాజపేయి పాక్‌ ‌ప్రధాని నవాజ్‌ ‌షరీఫ్‌తో చర్చలు జరిపారు. శాంతికి బాటలు పరిచారు. ఆ అవకాశాన్ని షరీఫ్‌ ‌సద్వినియోగం చేసుకోలేకపోయారు. నాటి సైన్యాధిపతి జనరల్‌ ‌పర్వేజ్‌ ‌ముషారఫ్‌ ‌సారథ్యంలో పాక్‌ ‌సైన్యం కార్గిల్‌ ‌చొరబాట్లకు పాల్పడి భారత్‌ ‌చేతిలో చావుదెబ్బ తిన్నది. అయినప్పటికీ 2003 నవంబరులో ప్రధాని వాజపేయి పాక్‌ ‌ప్రధాని జాఫరుల్లా జమాలీతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నారు. దానిని పాక్‌ అనేకమార్లు ఉల్లంఘించింది. దీంతో సరిహద్దుల్లో ప్రశాంతత కొరవడింది. 2014లో అధికారం చేపట్టిన ప్రధాని నరేంద్రమోదీ సైతం ఇస్లామాబాద్‌కు స్నేహహస్తం అందించారు. మిత్రులను మార్చగలం, సరిహద్దులను కాదు అన్న వాజపేయి సూత్రమే ఆయననూ నడిపించింది. 2015 డిసెంబరులో అఫ్ఘానిస్తాన్‌ ‌పర్యటన నుంచి తిరిగి వస్తూ మోదీ లాహోర్‌లో ఆగారు. నవాజ్‌ ‌షరీఫ్‌తో చర్చలు జరిపి విశ్వాస కల్పన చర్యలు ప్రారంభిం చారు. పాకిస్తాన్‌ ఆ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకోలేకపోయింది.

370 అధికరణ రద్దు

 2019లో రెండోసారి ఢిల్లీ పీఠం దక్కించుకున్న మోదీ కశ్మీర్‌ ‌విషయంలో మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలని నిర్ణయించారు. కేవలం చర్చలు, సంప్రదింపులతో దాయాది దేశాన్ని దారికి తీసుకురాలేమని గ్రహించడం, అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ ‌పట్ల ఏర్పడిన జుగుప్స ఇందుకు ముఖ్య కారణం. 370 అధికరణ కశ్మీర్‌కు చేసిన మేలు కంటే, పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదానికి ఇచ్చిన ఊతమే ఎక్కువ అన్నది చరిత్ర రుజువు చేసింది. అందుకే ముందుగా ఆర్టికల్‌ 370 ‌రద్దు, రాష్ట్ర విభజన, శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడం ద్వారా, పాలనలో ప్రజలను కింది స్థాయి నుంచి భాగస్వామ్యం చేయడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దగలమని కేంద్రం భావించింది. లోయలో పాక్‌ ఆటలకు అడ్డుకట్ట కూడా వేయవచ్చు. అందుకే అధికారం చేపట్టిన రెండు నెలల్లోనే 370వ అధికరణ రద్దు, రాష్ట్ర విభజన, శాసనసభతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటన వంటి సాహసో పేత నిర్ణయాలు తీసుకుంది. పరిస్థితులు కుదుటపడిన తరవాత ఎన్నికలు జరుపుతామని ఆనాడే ప్రజలకు స్పష్టమైన హామిఇచ్చారు. ఈ నిర్ణయాలు కొంతవరకు సానుకూల ఫలితాలనే ఇచ్చాయని అనంతర పరిణామాలు రుజువు చేశాయి. హామీ మేరకు గత ఏడాది డిసెంబరులో జిల్లా అభివద్ధి మండళ్లు (డీడీసీ- డిస్ట్రిక్ట్ ‌డెవలప్‌మెంట్‌ ‌కౌన్సిల్‌) ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 2019 నాటి పార్లమెంటు ఎన్నికల నాటి కంటే 15శాతం ఎక్కువ పోలింగ్‌ ‌డీడీసీ ఎన్నికల్లో నమోదవడం విశేషం. దీనిని బట్టి ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల ఎంత ఆసక్తితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

 మొన్నటి డీడీసీ ఎన్నికల్లో ప్రజలు భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు కనబరిచారు. మొత్తం 278లో భాజపా 75 సీట్లు, 38.74 ఓట్లు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది. మోదీ నాయకత్వంపై ప్రజలకు గల విశ్వాసానికి ఇంతకు మించిన మరో నిదర్శనం అక్కర్లేదు. 370 అధికరణ రద్దును వ్యతిరేకించిన ఏడు పార్టీల కూటమి పీపుల్స్ అలయన్స్ ‌ఫర్‌ ‌గుప్కార్‌ ‌డిక్లరేషన్‌ (‌పీఏజీడీ) మొత్తం కలిసి సాధించిన సీట్లు 110 మాత్రమే కావడం గమనార్హం. 50 స్థానాలను స్వతంత్రులు దక్కించు కున్నారు. 19 సీట్లలో ఆధిక్యత వంద ఓట్లలోపే ఉండటం విశేషం. మొత్తం 20 జిల్లాలకు అయిదు చోట్ల భాజపాకు ఆధిక్యం లభించగా 12 జిల్లాల్లో ఏడు పార్టీల కూటమి పైచేయి సాధించింది. దీనిని బట్టి కశ్మీరీ ప్రజలు ఎవరి పక్షాన ఉన్నారో స్పష్టమైంది.

 జూన్‌ 24 ‌సమావేశం

 డీడీసీ ఎన్నికల పక్రియ, ప్రజల ఆసక్తి స్ఫూర్తిగా తీసుకున్న కేంద్రం కశ్మీర్‌లో ఎన్నికల నిర్వహణకు యోచన చేసింది. అదే సమయంలో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు కట్టుబడింది. వీలైనంత త్వరలో శ్రీనగర్‌లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో అఖిలపక్ష భేటీని నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో 8 పార్టీలకు చెందిన 14 మంది కీలక నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర గవర్నర్‌ ‌మనోజ్‌ ‌సిన్హా, హోంమంత్రి అమిత్‌ ‌షా, రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రి జితేంద్రసింగ్‌, ‌నలుగురు మాజీ ముఖ్యమంత్రులు ఫరూక్‌ అబ్దుల్లా (నేషనల్‌ ‌కాన్ఫరెన్స్- ఎన్‌సీ), ఆయన కుమారుడు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ (పీడీపీ- పీప్పుల్స్ ‌డెమొక్రటిక్‌ ‌పార్టీ), గులాంనబీ ఆజాద్‌ (‌కాంగ్రెస్‌), ‌పీసీసీ చీఫ్‌ ‌జి.ఎ.మిర్‌, ‌పాంథర్స్ ‌పార్టీ అధ్యక్షుడు భీంసింగ్‌, ‌సీపీఎం నాయకుడు తారిగామి, జమ్ముకశ్మీర్‌ అప్నీ పార్టీ అధ్యక్షుడు అల్తాఫ్‌ ‌బుఖరీ, పీపుల్స్ ‌కాన్ఫరెన్స్ ‌నాయకుడు సజ్జాద్‌లోనె, బీజేపీ సీనియర్‌ ‌నాయకుడు రవీందర్‌ ‌రైనా పాల్గొన్నారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగినట్లు ఇరువర్గాలు పేర్కొన్నాయి. ఎన్నికైన ప్రభుత్వమే రాష్ట్రాన్ని ప్రగతి మార్గంలో పయనింపజేస్తుందని, శాంతి భద్రతల పరిస్థితిని మెరుగు పరుస్తుందని, రాష్ట్ర వ్యవహారాల్లో జోక్యం చేసుకోవాలన్న ఆలోచన ఏ కోశాన తమకు లేదని ప్రధాని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలన్న కశ్మీరీ పార్టీల డిమాండును అంగీకరించినప్పటికీ నియోజకవర్గాల పునర్విభజన తరవాతే ఈ విషయం పరిశీలిస్తామని కేంద్రం ప్రకటించింది. పునర్విభజన పక్రియ పూర్తయితే ఈ ఏడాది డిసెంబరు, లేదా వచ్చే ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలన్న యోచనతో కేంద్రం ఉంది.

మళ్లీ కొరివితో తల గోక్కోరాదు

370 అధికరణను పునరుద్ధరించాలని కశ్మీరీ పార్టీలు కోరుతున్నప్పటికీ కేంద్రం ఈ విషయాన్ని పక్కనపెట్టింది. అసలు అలాంటి ఆలోచనే లేదని కేంద్రం ప్రభుత్వ వర్గాలు నిర్దిష్టంగా పేర్కొన్నాయి. ప్రత్యేక ప్రతిపత్తి, రాష్ట్ర హోదా పునరుద్ధరణపై గతంలో పీజీడీఏ తరఫున వివిధ పార్టీలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ అంశాల గురించి మాట్లాడటం ‘సబ్‌ ‌జుడిస్‌’ అవుతుందని ఆ వర్గాలు గుర్తుచేశాయి. ఇతర విషయాలు ఎలా ఉన్నప్పటికీ 370 రద్దుపై పోరాటాన్ని కొనసాగిస్తామని, ఈ విషయంలో రాజీ ప్రసక్తి లేదని పీఏజీడీలోని ప్రధాన పార్టీలు పీడీపీ, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌ప్రకటించాయి. కశ్మీరీ పార్టీలుగా ఇది తమ హక్కని, బాధ్యత అని అవి అంటున్నాయి. ఆ మాటైన ఢిల్లీలో వినిపించకపోతే పాక్‌ ‌ప్రేరేపిత ఉగ్రవాదంతో కష్టం. వీటి డిమాండ్‌ ఎం‌త వరకు సమంజసమో త్వరలోనే వెల్లడవుతుంది.

నియోజకవర్గాల పునర్‌ ‌విభజనతో తొలి అడుగు

రాష్ట్రంలో జనాభా ప్రాతిపదికన అసెంబ్లీ నియోజకవర్గాలు లేవు. దీనితో కొన్ని దశాబ్దాలుగా జమ్ము, లద్దాఖ్‌లకు న్యాయం జరగలేదు. 2011 జనాభా లెక్కల ప్రకారం కశ్మీర్‌ ‌లోయలో 68,88,475 మంది జనాభా ఉండగా జమ్ములో 53,75,538 మంది ఉన్నారు. 2014 ఆగస్టులో రాష్ట్ర విభజనకు ముందు 87 అసెంబ్లీ, ఆరు పార్లమెంటు సీట్లున్నాయి. విభజనతో లద్దాఖ్‌ ‌పార్లమెంటు స్థానం, నాలుగు అసెంబ్లీ సీట్లు కొత్తగా ఏర్పాటైన లద్దాఖ్‌ ‌కేంద్ర పాలిత ప్రాంతానికి వెళ్లాయి. దీంతో కశ్మీర్‌కు శ్రీనగర్‌, ‌బారాముల్లా, అనంతనాగ్‌, ‌జమ్ము, ఉద్ధంపూర్‌… అయిదు పార్లమెంటు సీట్లే మిగిలాయి. పాక్‌ ఆ‌క్రమిత కశ్మీర్‌ (‌పీవోకే)లో 24 సీట్లున్నాయి. పీవోకేను ఇప్పటికీ భారత్‌లో అంతర్‌ ‌భాగంగా పరిగణిస్తారు. అలా ఆ ప్రాంతానికి 24 సీట్లు ప్రత్యేకించారు. విభజన తరవాత కేంద్ర పాలిత ప్రాంతమైన లద్దాఖ్‌కు నాలుగు సీట్లు కేటాయించారు. మిగిలిన 83 సీట్లలో కశ్మీరులో 46, జమ్ములో 37 సీట్లు మిగిలాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే కశ్మీర్‌, ‌జమ్ము మధ్య సీట్లకు సంబంధించి సమతౌల్యం లోపించింది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ‌రంజనా ప్రకాశ్‌ ‌దేశాయ్‌ ‌సారథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన కమిటీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ తాత్కాలిక అంచనాల ప్రకారం మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంది. వీటిల్లో కశ్మీర్‌లో నాలుగు, జమ్ములో మూడు అసెంబ్లీ సీట్లు పెరుగుతాయని అంచనా. అయితే పునర్విభజనను పీడీపీ, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌వ్యతిరేకిస్తున్నాయి. ముఖ్యంగా హిందువుల ఆధిక్యం ఉన్న జమ్ములో సీట్లు పెరిగితే బీజేపీకి మేలు జరుగుతుందని ఆ పార్టీల అంచనా. 2014 ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన మొత్తం 25 సీట్లలో సింహభాగం జమ్ములోనివే. సుదీర్ఘకాలం కాంగ్రెస్‌కు మద్దతుగా నిలిచిన జమ్ము ప్రాంత హిందూ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ముస్లింల ఆధిక్యం ఉన్న కశ్మీర్‌ ‌లోయలో ముస్లిం పార్టీలైన పీడీపీ, నేషనల్‌ ‌కాన్ఫరెన్స్ ‌మధ్య ఓట్లు చీలిపోయే అవకాశం ఉంది. దీనివల్ల తమ పార్టీలకు సీట్లు తగ్గుతాయన్నది పీడీపీ, ఎన్‌సీ అంచనా. అంతిమంగా రాష్ట్రంలో బీజేపీ అధికారం చేజిక్కించుకునే పరిస్థితులు ఏర్పడతాయన్నది వాటి గుబులు. 2014 ఎన్నికల్లో పీడీపీ 28 సీట్లు గెలుచుకోగా, బీజేపీ దానికి దీటుగా 25 గెలుచుకోవడం ముస్లిం పార్టీలను కలవరపాటుకు గురిచేసింది. అప్పట్లో ఎన్‌సీకి 15, కాంగ్రెస్‌ ‌పార్టీకి 12 సీట్లు మాత్రమే లభించాయి. ఈ నేపథ్యంలో జమ్ములోనే సీట్లు పెంచుతారన్న అంచనాలు రావడంతో పునర్విభజనను ముస్లిం పార్టీలు వ్యతిరేకించాయి. లోయ లోనూ సీట్లు పెరుగుతాయన్న వార్తలు రావడంతో మళ్లీ తలూపాయి. కానీ దీని ద్వారా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ నిష్పాక్షికతను ఆ పార్టీలు గుర్తించాయి. సరిహద్దు రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు ఏర్పడాలన్నదే మోదీ లక్ష్యం తప్ప అందరూ అనుకున్నట్లు శ్రీనగర్‌ ‌పీఠాన్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచన ఏ కోశానా సర్కారుకు లేదు. సర్కారు వేరు, పార్టీ వేరు. ప్రభుత్వ ఆలోచన ఏమైనప్పటికీ ఒక పార్టీగా భాజపా అన్ని రాష్టాలతో పాటు కశ్మీర్‌లోనూ అధికారాన్ని సాధించేందుకు శతథా ప్రయత్నిస్తుంది. అది ఒక రాజకీయ పార్టీగా దాని హక్కు.

గుప్కార్‌ ‌గుట్టు

 పీఏజీడీలోని కొన్ని పార్టీల మధ్య ఏకాభిప్రాయం లేదు. మొదట్లో పీఏజీడీలో భాగస్వామి అయిన సజ్జాద్‌లోనె సారథ్యంలోని పీపుల్స్ ‌కాన్ఫరెన్స్ (‌పీసీ) సొంత పార్టీ తరఫున సమావేశంలో పాల్గొన్నారు. అంటే పీఏజీడీ రాజకీయ ఎజెండాతో ఆయనకు సంబంధం లేదనుకోవాలి. ఇక అప్నీ పార్టీకి ప్రాతినిథ్యం వహిస్తున్న అల్తాఫ్‌ ‌బుఖారీ గతంలో పీడీపీ- బీజేపీ సర్కారులో మంత్రి. ఈ ఇద్దరు నేతలూ బీజేపీకి పరోక్ష మద్దతుదారులన్న భావన ఉంది. హురియత్‌ ‌కాన్ఫరెన్స్‌ను విమర్శించే నేతగా పేరున్న లోనే కమలం పార్టీకి ఇష్టమైన నాయకుడు. ఇవి ప్రధాన ముస్లిం పార్టీలైన ఎన్‌సీ, పీడీపీకి మింగుడు పడని అంశాలే. 2019 ఆగస్టులో 370 అధికరణ రద్దు సందర్భంగా ఈ రెండు పార్టీలకు చెందిన అనేకమంది నాయకులను అరెస్టు చేశారు. ఫరూక్‌, ఒమర్‌, ‌మెహబూబా సైతం అరెస్టయ్యారు. జైలు నుంచి విడుదల అనంతరం ఈ ముగ్గురు నాయకుల వైఖరిలో కొంత మార్పు వచ్చింది. అయినదానికి, కానిదానికి గుడ్డిగా కేంద్రాన్ని వ్యతిరేకించడం వల్ల ఒరిగేదేమీ లేదని గ్రహించారు. 370పై ఢిల్లీ వైఖరి మారదన్న సంగతి వారికీ తెలుసు. కొంతలో కొంత రాష్ట్ర పునరుద్ధరణ, ఎన్నికలు జరిగితే తాము అధికారాన్ని అందకోవచ్చన్నది ఆ పార్టీల ఆశ. అందుకే తమలో తమకు ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ ఈ రెండు అంశాల్లో ఒకేమాట వినిపించారు. డీడీసీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీల మధ్య అభిప్రాయభేదాలు వెలుగులోకి వచ్చాయి. పరిస్థితులు ఏమైనప్పటికీ అధికార సాధనకు రెండు పార్టీలు పోటీ పడతాయి. ఎన్‌సీ అధికారం అందుకుంటే ఆ సర్కారును పడగొట్టేందుకు పీడీపీ ప్రయత్నిస్తుంది. పీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌సీ అదే పని చేయడానికి వెనకాడదు. పైకి రాష్ట్ర ప్రయోజనాలు, 370 అధికరణ గురించి ఎన్ని మాటలు చెప్పినప్పటికీ అవసరమైతే భాజపాతో, హస్తం పార్టీతో సంకీర్ణ సర్కార్లు ఏర్పాటుకు ఆ పార్టీలు వెనకాడవు. జాతీయ పార్టీలతో అంటకాగి పీడీపీ, ఎన్‌సీ గతంలో అధికారాన్ని పంచుకున్న సందర్భాలు ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తు రాజకీయాలలో బీజేపీని కాదనే పరిస్థితులు ఉండవు. బీజేపీ తన విధానాన్ని వీడదు.

వ్యాసకర్త: సీనియర్‌ ‌జర్నలిస్ట్

——————————————————————————————————————————————————————–

‌తాజా సవాళ్లు- డ్రోన్ల దాడులు, ట్విట్టర్‌ ‌తెంపరితనం

పాకిస్తాన్‌కీ, ఆ దేశం ప్రేరేపిస్తున్న ఉగ్రవాద మూకలకీ కశ్మీర్‌లో ఎంతో సౌకర్యంగా ఉన్న యథాతథ స్థితికి ఎప్పుడు భంగం వాటిల్లినా రక్తపాతం ద్వారా, విధ్వంసం ద్వారా రెచ్చిపోవడం రివాజు. కొన్ని దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది.  అలాంటి సౌకర్యం కల్పించినదే 370 అధికరణ. ఈ అధికరణాన్ని రద్దు చేసిన రెండేళ్ల తరువాత ఢిల్లీ ఏర్పాటు చేసిన కశ్మీరీ నేతల సమావేశంలో తాము ఆశించిన ఫలితం రాకపోవడంతోనే కాబోలు జమ్ములో ఉగ్రవాద మూకలు ప్రథమ డ్రోన్‌ ‌దాడికి దిగాయి. అక్కడి వైమానికి దళ స్థావరం మీద డ్రోన్‌తో రెండు శక్తిమంతమైన బాంబులను జారవిడిచాయి. జూన్‌ 27 అర్ధరాత్రి 1.40 ప్రాంతంలో ఆరు నిమిషాల వ్యవధిలో అవి పేలాయి. ఇద్దరు గాయపడ్డారు. భారతదేశ కీలక రక్షణ స్థావరం మీద ఉగ్రవాదులు దాడికి దిగడం ఇదే మొదటిసారి. అయితే ఇది జరిగిన కొన్ని గంటలలోనే, అంటే జూన్‌ 28 ఉదయం రెండు డ్రోన్లతో దాడి యత్నం జరిగింది. కానీ మన దళాలు తిప్పికొట్టాయి.  అదే రోజు దక్షిణ కశ్మీర్‌లోని హరిపరిగామ్‌లో రాత్రి ప్రత్యేక పోలీసు అధికారి ఫయాజ్‌ అహ్మద్‌, ఆయన భార్య రజాబేగం, కుమార్తె రఫియాలను ఇంట్లోనే జైషే మహమ్మద్‌ ఉ‌గ్రవాదులు కాల్చి చంపారు. ఇక ట్విట్టర్‌ అనే సామాజిక మాధ్యమం కూడా దేశ వ్యతిరేక చర్యకే పాల్పడింది కూడా ఆ రోజే. జమ్ముకశ్మీర్‌, ‌లద్దాఖ్‌లను భారతదేశం బయట వేరే దేశాలుగా అది ఒక మ్యాప్‌లో చూపించింది. ఈ మూడు చర్యలు వేటికేవీ తీసిపోయేవి కావు. వీటి మధ్య సంబంధం గురించి కూడా దర్యాప్తు చేయడం అవసరం. నిజానికి ఇవన్నీ దేశ సార్వభౌమాధికారానికి వచ్చిన తాజా సవాళ్లు. దీని మీద భారత్‌ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. అంటే ఈ అంశాన్ని భారత్‌ ‌తీవ్రంగానే పరిగణిస్తున్నది.

జమ్ము విమానాశ్రయంలోని ఐఏఎఫ్‌ (ఇం‌డియన్‌ ఎయిర్‌ ‌ఫోర్స్) ‌స్టేషన్‌పై అర్ధరాత్రి దాటిన తరవాత ఉగ్రవాదులు డ్రోన్ల సాయంతో రెండు బాంబులు జారవిడిచారు. తొలి బాంబుదాడిలో స్టేషన్‌ ‌పైకప్పు దెబ్బతిన్నది. రెండో బాంబు నేలపై పడింది. జమ్ము నగర శివార్లలోని సత్వారీ ప్రాంతంలో గల విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. యుద్ధ విమానాలకు ఎలాంటి నష్టం జరగలేదు. దాడి చేసిన డ్రోన్లు తిరిగి ఎక్కడకు వెళ్లాయన్న విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయితే సరిహద్దులు దాటి వెళ్లి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. మందు పాతరలు పేల్చడం, దొంగచాటు దాడులు, ఆత్మాహుతి దాడులు గతంలో జరిగేవి. కానీ డ్రోన్లతో దాడి జరగడం ఇదే తొలిసారి. ఈ డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న విషయమై స్పష్టత కొరవడింది. అయితే పాకిస్తాన్‌ ‌నుంచే వచ్చాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు బలమైన కారణం ఉంది. దాడికి గురైన వైమానిక స్థావరం పాక్‌ అం‌తర్జాతీయ సరిహద్దుకు కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉండటం గమనార్హం. దీనిని బట్టి సహజంగానే అందరి చూపు పాక్‌ ‌వైపే మళ్లింది.

గతంలోనూ దాయాది దేశం ఆయుధాలు, పేలుడు సామగ్రి ఉగ్రవాదులకు అందించేందుకు డ్రోన్లను ఉపయోగించేది. అనేక సందర్భాల్లో భారత బలగాలు వీటిని దీటుగా ఎదుర్కొని తగిన బుద్ధి చెప్పాయి. 2019 ఆగస్టులో పంజాబ్‌లోని అమృత్‌సర్‌ ‌నగర సమీపంలోని ఓ గ్రామం వద్ద కూలిన పాక్‌ ‌డ్రోన్‌ ‌శకలాలను గుర్తించారు. అదే ఏడాది సెప్టెంబరు రెండోవారంలో డ్రోన్లు వచ్చి ఆయుధాలు, నగదు, మందుగుండు సామగ్రిని జారవిడిచాయి. గత ఏడాది జూన్‌లో జమ్ము నగరం పరిసర ప్రాంతాల్లో నిఘా డ్రోన్‌ను సరిహద్దు భద్రతా దళం కూల్చింది. అదే సమయంలో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను పోలీసులు పట్టుకున్నారు. వీరికి డ్రోన్‌ ‌ద్వారా ఆయుధాలు సరఫరా అయినట్లు దర్యాప్తులో తేలింది. గత ఏడాది సెప్టెంబరు మూడోవారంలో అక్నూర్‌ ‌సెక్టార్లో డ్రోన్‌ ‌ద్వారా ఆయుధాలను జారవిడిచినట్లు గుర్తించారు. ఉగ్రవాదులకు ఆయుధాల సరఫరాకు, భారత సైనిక స్థావరాలపై నిఘా పెట్టేందుకు దాయాది దేశం డ్రోన్లను ఉపయోగిస్తుంది. డ్రోన్లతో భారత్‌కు ముప్పు లేకపోలేదు. ఈ నేపథ్యంలో సైనిక స్థావరాల భద్రతను పెంచాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో నిఘా వర్గాలు మరింత అప్రమత్తం కావాల్సిన అవసరాన్ని ఈ ఘటన హెచ్చరిస్తోంది. తక్కువ ఎత్తులో ఎగురుతూ విధ్వంసానికి పాల్పడే డ్రోన్లను సమర్థంగా ఎదుర్కొనే సాంకేతికత ప్రస్తుతం భారత సైన్యం వద్ద లేదు. గత కొన్నేళ్లుగా కశ్మీర్‌ ఉ‌గ్రవాదులకు ఆయుధాలను, పంజాబ్‌లోకి మాదక ద్రవ్యాలను పాక్‌ ‌సరఫరా చేస్తోంది. ఈ ఘటనపై భారత్‌ ‌వెంటనే అప్రమత్తమైంది. రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తక్షణమే రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. బంగ్లాదేశ్‌ అధికారిక పర్యటనలో ఉన్న వాయు సేనాధిపతి ఎయిర్‌ ‌చీఫ్‌ ‌మార్షల్‌ ఆర్‌.‌కె.ఎస్‌. ‌భదౌరియా అక్కడి నుంచే ఘటన వివరాలు తెలుసు కుని అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారు.

తాజా ఘటన నేపథ్యంలో కశ్మీరీ పార్టీలు వాస్తవాలను గ్రహించాలి. పాక్‌ ‌కపట నాటకాన్ని గుర్తించాలి. దానికి వంత పాడటం మానేయాలి. దాయాది దేశం ద్వంద్వ వైఖరిని ఎండగట్టాలి. దేశ భద్రత ఏ ఒక్క పార్టీకో సంబంధించిన విషయం కాదని తమకూ బాధ్యత ఉందని గుర్తించాలి. భద్రత విషయంలో సర్కారుకు అన్నివిధాలా మద్దతు ఇవ్వాలి. పాక్‌ ‌పట్ల ఇంకా ఏమైనా భ్రమలు ఉంటే వాటిని తొలగించుకోవాలి. దాని నిజ స్వరూపాన్ని గుర్తించాలి. అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. అంతేతప్ప నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించే వైఖరిని ఎంత త్వరగా విడనాడితే పార్టీలకు, దేశానికి అంతగా మంచిది. పార్టీల విధానాలు, సిద్ధాంతాలు ఎలా ఉన్నప్పటికీ రాష్ట్రంలో శాంతియుత పరిస్థితులు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కలసి పని చేయాల్సిన అవసరం ఉంది. ఆర్టికల్‌ 370, 35 ఏ ‌వంటి వివాదాస్పద అంశాలను పక్కనపెట్టి రాష్ట్ర ప్రగతికి తమ వంతు పాటుపడాలి. ఒక్క కశ్మీరీ ప్రజలే కాదు… యావత్‌ ‌భారతావని ఆశిస్తుందీ ఇదే.

By editor

Twitter
Instagram