జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పర్యావరణ పరిరక్షణ.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రతిదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య. అంతర్జాతీయ సమాజం ముందున్న ఓ అతిపెద్ద సవాల్‌. ‌మారిన పరిస్థితుల్లో పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఏ ఒక్కరి వల్లో అయ్యే పని కాదు. అందరూ చేయి చేయి కలిపి సమష్టిగా ముందుకు సాగితేనే ఫలితాలను అందుకోగలం. ఈ సమస్య పరిష్కారానికి ఐక్యరాజ్య సమితితో సహా అనేక దేశాలు తమ వంతు ప్రయత్నిస్తున్నాయి. ఏటా ఈ దిశగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేవలం ఆయా దేశాల ప్రభుత్వాలే కాకుండా అనేక స్వచ్ఛంద సంస్థలు, ఎంతోమంది పర్యావరణ ఉద్యమకారులు ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల కన్నుమూసిన చిప్కో ఉద్యమనేత సుందర్‌ ‌లాల్‌ ‌బహుగుణ చెట్లను కాపాడేందుకు, అడవుల సంరక్షణకు తన జీవితకాలం వెచ్చించారు. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి దరిపల్లె రామయ్య మొక్కలు నాటడాన్ని ఉద్యమంగా చేపట్టి ముందుకు సాగుతున్నారు. కొందరు ప్రముఖులు గ్రీన్‌ ‌ఛాలెంజ్‌ ‌పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని స్ఫూర్తిదాయకంగా కొనసాగిస్తున్నారు. మొక్కలు నాటేందుకు తెలంగాణ సర్కారు హరిత హారం కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపట్టింది. అయినా ఇంకా చేయాల్సినది ఎంతో ఉందన్నది కాదనలేని వాస్తవం.

పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1974 జూన్‌ 5‌న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. అపటినుంచి ఏటా కొనసాగిస్తోంది. పర్యావరణానికి సంబంధించి ఏటా ఏదో ఒక అంశాన్ని ప్రధానంగా తీసుకుంటూ వివిధ కార్యక్ర మాలు నిర్వహిస్తోంది. 1974లో అమెరికాలోని స్పోకనే నగరంలో తొలిసారి సదస్సు నిర్వహించారు. అప్పటినుంచి ఏటా ఏదో ఒక దేశంలో ఒక అంశాన్ని ప్రధానంగా తీసుకుని ప్రపంచ పర్యావరణ దినోత్స వాన్ని నిర్వహిస్తున్నారు. అత్యధికంగా బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌ ‌నగరంలో పర్యావరణ దినోత్సవాలను నిర్వహించారు. 1975, 77, 78, 79, 80, 81, 82, 83ల్లో ఈ నగరంలో ప్రపంచపర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించడం విశేషం. సిల్హెట్‌కు దేశంలో సంపన్న నగరంగా పేరుంది. 1984లో ఈ దేశంలోని రాజాషాహి, 2010లో రంగ్‌పూర్‌ ‌నగరాల్లో పర్యావరణ దినోత్సవాన్ని జరిపారు. విస్తృత జలవనరులు గల బంగ్లాదేశ్‌ ‌పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తోంది. 2011లో భారత్‌ ‌పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించింది. రాజధాని నగరమైన న్యూఢిల్లీలో అంతర్జాతీయ సదస్సు నిర్వహించింది. ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టింది. గత ఏడాది జర్మనీ భాగస్వామ్యంతో కొలంబియా పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించింది. ఈ ఏడాది తొలిసారి ప్రపంచ పర్యావరణ పరిరక్షణ సదస్సు పాకిస్తాన్‌ ఆధ్వర్యంలో జరగనుంది. ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌ ‌నగరంలో కార్యక్రమాన్ని ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ ‌ప్రారంభిస్తారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌, ‌పోప్‌ ‌ఫ్రాన్సిస్‌, ‌జర్మనీ ఛాన్సలర్‌ ఏం‌జెలా మెర్కెల్‌, ‌పాక్‌ ‌పర్యావరణ శాఖ మంత్రి అమిన్‌ అస్లాం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ వ్యవస్థల పునరుద్ధరణ.. ప్రధానాంశంగా ఈ కార్యక్రమం జరగనుంది. వాతావరణ మార్పులకు గురవుతున్న పది ప్రధాన దేశాల్లో పాకిస్తాన్‌ ఒకటి. దీనివల్ల ఆ దేశం అనేక అనర్థాలను ఎదుర్కొంటోంది. నానాటికీ అటవీ విస్తీర్ణం తగ్గుతోంది. కాలుష్యం పెరుగుతోంది. జలవనరులు కాలుష్యానికి గురవుతున్నాయి. దీనివల్ల దాయాది దేశం సరికొత్త సమస్యలతో సతమతమవుతోంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 2013లో ఖైబర్‌ ‌ఫక్తూన్‌ ‌క్వా ప్రావిన్స్‌లో పది బిలియన్ల ట్రీ సునామీ ప్రాజెక్టును ప్రారంభించింది. యునైటెడ్‌ ‌నేషన్స్ ఎన్విరాన్‌మెంట్‌ ‌పోగ్రామ్‌ (‌యూఎన్‌ఈపీ), ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ- ‌ఫుడ్‌ అం‌డ్‌ అ‌గ్రికల్చర్‌ ‌సంస్థ) సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

అనర్థాలు అనేకం..

పర్యావరణాన్ని పరిరక్షించుకోవడంలో ఉదాసీనత కారణంగా అనేక అనర్థాలు తలెత్తుతున్నాయి. ఈ అనర్థాలు అనేక రూపాలలో మనకు కళ్లకు కడుతున్నాయి. మత్స్య సంపద, ధాన్యం, భూగర్భ జలాలు కలుషితం కావడం వంటి పర్యావరణ సమస్యల వల్ల ఆంధప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్ధానంలో కిడ్నీ సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ వ్యాధి నివారణలో అక్కడి ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టలేదన్నది చేదు నిజం. దేశవ్యాప్తంగా 7 నుంచి 8 శాతం మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతుండగా ఉద్ధానంలో 21 శాతం మంది దీర్ఘకాలికంగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వ్యాధి తీవ్రతకు ఇది నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసిన ‘జార్జి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌గ్లోబల్‌ ‌హెల్త్’ ‌సంస్థ జిల్లాలోని వజ్రపుకొత్తూరు, పలాస, మందస, సోంపేట, కవిటి, కంచిలి మండలాల్లో ఈ సమస్యపై అధ్యయనం చేస్తోంది. పర్యావరణాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల కలిగే అనర్థాలను ప్రత్యక్షంగా చూస్తున్నాం. అడవుల నరికివేత వల్ల జంతుజాలాలు కడుపు నింపుకోవడానికి జన సంచార ప్రాంతాలకు వస్తున్నాయి. కోతులు, పులులు, జింకలు, ఏనుగులు ఆహారం కోసం పల్లెలు, పట్టణాల బాట పడుతున్నాయి. మడ అడవుల నరికివేత వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాలుష్యం విస్తరిస్తోంది. ప్రాణవాయువు కరవవుతోంది. అంతిమంగా అనేక సరికొత్త సమస్యలు ఉత్పన్న మవుతున్నాయి.

భారత్‌ ‌భాగస్వామ్యం…

పర్యావరణ పరిరక్షణలో భారత్‌ ‌తన వంతు పాత్రను చిత్తశుద్ధితో పోషిస్తోంది. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. వివిధ పథకాల ద్వారా వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అడవులను విస్తరిస్తోంది. మొక్కలు నాటడాన్ని ప్రోత్సహిస్తోంది. అదే సమయంలో అంతర్జాతీయంగా చేపట్టే కార్యక్రమాల్లో భాగస్వామి అవుతోంది. తన వంతుగా నిధులను అందజేస్తోంది. అంతర్జాతీయంగా ఒక పెద్ద దేశంగా తన పాత్రను సమర్థంగా నిర్వర్తిస్తోంది. ఈ ఏడాది జనవరి నెలాఖరులో నెదర్లాండ్స్ ఆధ్వర్యంలో జరిగిన వాతావరణ అనుసరణ సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా పాల్గొన్న ప్రధాని మోదీ మాట్లాడుతూ పర్యావరణం క్షీణించకుండా ఉండటంతోపాటు దాని పరిరక్షణకు భారత్‌ ‌నిరంతరం పాటుపడుతుందని పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్‌ ఒప్పందానికి మించి వివిధ కార్యక్రమాలు చేపట్టేందుకు భారత్‌ ‌సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 2030 నాటికి 450 గిగావాట్ల పునరుత్పాదన ఇంధనాన్ని ఉత్పత్తి చేయడంతో పాటు ఎల్‌ఈడీ బల్బుల వినియోగాన్ని మరింతగా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. తద్వారా 3.2 కోట్ల టన్నుల కార్బన్‌ ‌డై ఆక్సైడ్‌ను తగ్గిస్తామని వెల్లడించారు. అంతేకాక క్షీణించిన 2.6 కోట్ల హెక్టార్ల అడవులను పునరుద్ధరిస్తామని తెలిపారు. అంతర్జాతీయ సౌరశక్తి కూటమి ద్వారా ఇతర దేశాలకు తనవంతు సేవలు అందిస్తామని చెప్పారు. దేశీయంగా పర్యావరణ పరిస్థితులను సమగ్రంగా సమీక్షించేందుకు, అవసరమైన చర్యలను చేపట్టేందుకు జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (‌నేషనల్‌ ‌గ్రీన్‌ ‌ట్రైబ్యునల్‌)‌ను 2010 మే నెలలో ఏర్పాటు చేశారు. పదవీ విరమణ చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి దీనికి సారథ్యం వహిస్తారు. సాగునీటి, ఇతర ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల్లో పర్యావరణ ఉల్లంఘనలు జరిగినట్లు నిర్ధారణ అయితే వాటి అనుమతులను ఇది రద్దు చేస్తుంది. తాజాగా తెలంగాణలోని రామగుండం థర్మల్‌ ‌విద్యుత్కేంద్రానికి గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులను ఏడు నెలల పాటు తాత్కికంగా రద్దు చేస్తూ మే 27న జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ‌తీర్పిచ్చింది. సిమెంటు తదితర కర్మాగారాల నుంచి వెలువడే కాలుష్యం విషయంలో అప్రమత్తంగా ఉంటోంది.

సనాతన భారతీయ సంప్రదాయాలు పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేశాయి. భారతీయుల అలవాట్లు, ఆచార వ్యవహారాలు, పద్ధతులు, విధానాలు పర్యావరణానికి ప్రాధాన్యం ఇచ్చాయి. సగటు భారతీయుడు ప్రకృతిని దైవంగా పరిగణిస్తాడు. అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యుడిని దేవుళ్లుగా పరిగణించి వారికి పూజలు చేస్తారు. తద్వారా ఆయా దేవుళ్లు చేసే పనుల వల్ల పర్యావరణ పరిరక్షణ సాధ్యపడుతుంది. వేసవిలో కొన్ని ప్రాంతాల్లో అడవులను దహనం చేసే అలవాటుంది. దీనివల్ల వ్యర్థ పదార్థాలు నాశనమవుతాయి. వానాకాలంలో వరుణుడి దయ వల్ల కురిసే వర్షాలతో చెట్టు చేమ పులకరిస్తుంది. అడవులు పచ్చని అందాలను సంతరించుకుంటాయి. దీనివల్ల పశు పక్ష్యాదులకు ఆహారం లభ్యమవుతుంది. వానల వల్ల నదులు గలగలా ప్రవహిస్తాయి. చెరువులు, ప్రాజెక్టులు నిండి భూములను బంగారుమయం చేస్తాయి. నేటికీ నదీమతల్లికి హారతులు ఇచ్చే సంప్రదాయం దేశంలో ఉంది. ప్రాజెక్టులు నిండినప్పుడు పూజలు చేసే సంప్రదాయం ఉంది. బిహార్లో మహిళలు ‘ఛాత్‌’ ‌పూజను చేస్తారు. నదిలో స్నానం చేసి సూర్య భగవానుడిని పూజించడమే ఈ పండగ ప్రధాన ఉద్దేశం. ఉత్తర భారతాన జ్యోతిర్లింగ క్షేత్రమైన కాశీ నగరంలో నిత్యం సాయంత్రం సమయంలో గంగానదికి హారతి ఇస్తారు. సగటు భారతీయుడు చెట్టును పూజిస్తాడు. దానిని దేవతగా భావిస్తాడు. కాపాడతాడు, సంరక్షిస్తాడు. మొక్కలను విరివిగా నాటుతాడు, వాటిని పెంచేందుకు పాటుడతాడు. సగటున భారత్‌లోని ప్రతి ఇంటిలో కనీసం ఒక మొక్కయినా, చెట్టయినా ఉంటుంది. పాతరోజుల్లో కొన్ని ఇళ్లల్లో వేప, రావిచెట్లు ఉండేవి. వీటిని దైవ స్వరూపాలుగా భావించి వాటికి వివాహం చేసే సంప్రదాయం ఉండేది. సంప్రదాయ కుటుంబాల్లో ఇప్పటికీ తులసి మొక్కలు మనకు కనిపిస్తుంటాయి. ఆధునిక కాలంలో సొంత ఇంటి సంస్కృతి కొంతవరకు కనుమరుగై బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్ల సంస్కృతి వచ్చింది. అపార్ట్‌మెంట్లలోనూ కొన్ని కుటుంబాలు నేటికీ తులసి మొక్కలను పెంచుతుండటం గమనార్హం. తులసి ఆకును నమలడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. చెట్లు చల్లనిగాలిని, పండ్లు, ఫలాలను అందిస్తాయి. గాలిద్వారా వాతావరణంలో స్వచ్ఛత ఏర్పడుతుంది. తద్వారా పర్యావరణ పరిరక్షణకు భారతీయ సంప్రదాయాలు దోహదపడుతున్నాయి. హిందువుల పండగలైన వినాయక చవితి, హోలీ, దీపావళి… వెనక పర్యావరణ అంశాలు ముడిపడి ఉన్నాయి. వినాయక చవితి సమయంలో ఎటుచూసిన పచ్చదనంతో ప్రకృతి పరవశించి పోతుంటుంది. వివిధ రకాల మొక్కల ఆకులతో గణపతికి చేసే పూజల వల్ల అంటు వ్యాధులు దూరమవు తాయన్న నమ్మకం ప్రజల్లో ఉంది. హిందువులే కాదు ముస్లిముల్లో కూడా చెట్లను ఆరాధించే సంప్రదాయం అనాది నుంచీ ఉంది. రావి, జువ్వి చెట్లు మహిమా న్వితమైనవని భావించేవారు. వీటిని కొన్ని చోట్ల జెండా చెట్లు అని పిలుస్తుంటారు.

పెద్దన్న బాధ్యతారాహిత్యం…

పర్యావరణ పరిరక్షణలో అగ్ర రాజ్యమైన అమెరికా తనవంతు పాత్రను చిత్తశుద్ధితో నిర్వహించ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా రిపబ్లికన్‌ ‌పార్టీ హయాంలో అధ్యక్షుడు డొనాల్డ్ ‌ట్రంప్‌ అనా లోచితంగా వ్యవహరిస్తూ అర్థరహితమైన వ్యాఖ్యలు చేసి అభాసుపాలయ్యారు. పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్‌ ఒప్పందం 2015 డిసెంబరులో రూపుదిద్దుకుంది. ఈ ఒప్పందం నుంచి 2016 నవంబరులో ట్రంప్‌ ‌హయాంలోనే అమెరికా వైదొలగింది. అనేక దేశాలపై ట్రంప్‌ ‌నోరు పారేసుకున్నారు. వాచాలత్వం ప్రదర్శించారు. గత ఏడాది నవంబరులో అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన వైఖరిలో మార్పులేకపోవడం గమనార్హం. ఈ ఏడాది మార్చి మొదటివారంలో ఫ్లోరిడాలో జరిగిన రిపబ్లికన్ల సమావేశంలో మాట్లాడుతూ పాత వైఖరినే పునరుద్ఘాటించడం గమనార్హం. అన్యాయమైన పారిస్‌ ఒప్పందం వల్ల అమెరికాపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందన్నారు. పర్యావరణ ఒప్పందంలో అమెరికా భాగస్వామి కావడం వల్ల కోట్ల డాలర్లను కోల్పోవాల్సి వస్తుంది. అంతేకాక ఉద్యోగాలను కోల్పోవలసి వస్తుందన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణకు ఉద్దేశించిన పారిస్‌ ఒప్పందంలో అమెరికా తిరిగి చేరాలన్న అధ్యక్షుడు జో బైడెన్‌ ‌నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పర్యావరణానికి సంబంధించి చైనా, రష్యా, భారత్‌ల పైన ట్రంప్‌ అభాండాలు వేశారు. అమెరికాలో వాతావరణం స్వచ్ఛంగా ఉంటుంది. రష్యా, చైనా, భారతదేశాల్లో ఈ పరిస్థితి ఉండదు. ఆ దేశాల్లో నీరు, గాలి, వాతావరణం కలుషితమైంది. ఫలితంగా అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయని ట్రంప్‌ అనాలోచి తంగా వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌ ‌వాచాలత్వం ఎలా ఉన్నప్పటికీ పారిస్‌ ‌వాతావరణ ఒప్పందాన్ని గౌరవిస్తూ అందులో చేరాలని కొత్త అధ్యక్షడు బైడెన్‌ ‌నిర్ణయించడం స్వాగతించదగ్గ పరిణామం. అంతర్జాతీయ సమాజం క్రమంగా పర్యావరణ ప్రాధాన్యాన్ని గుర్తించడం ఆశావాహ పరిణామం. 2019 నాటి ఆస్ట్రేలియా సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీల ఎన్నికల ప్రణాళికల్లో పర్యావరణం ప్రధానాంశం కావడం ఇందుకు నిదర్శనం. జూన్‌ 5‌న జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సమాజం మరింత మెరుగైన నిర్ణయాలు తీసుకుని ముందు తరాలకు మార్గదర్శిగా నిలబడాలి.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

By editor

Twitter
Instagram