ఎక్కదలచిన నావ ఏడాది లేటు

– ఎం.వి.ఆర్‌. ‌శాస్త్రి

జర్మనీ వాడికీ జపానువాడికీ బుద్ధుండి ఉంటే ఇండియాకు స్వాతంత్య్రం 1942 లోనే వచ్చేది.

అది రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న కాలం.

అందులో జర్మనీ, జపాన్‌ ‌లు మిత్రులు. వాటికి ప్రధాన ప్రత్యర్థి బ్రిటన్‌. ఆ ‌బ్రిటను బలానికి పెద్ద దన్ను- దాని కబ్జాలో ఉన్న భారతదేశం. దాని బారి నుంచి భారత్‌ ‌బయట పడేట్టు చేయగలిగితే ఇంగ్లండు కొమ్ములు విరుగుతాయి.

అదీ ఎలా అవుతుందా అని జుట్టు పీక్కోవలసిన పనిలేదు. ఆ కార్యం సాధించగల మహావీరుడు తనంతట తానే అక్ష కూటమిని ఆశ్రయించాడు.

ఆ పని అతడివల్ల కాకపోతే ఈలోకంలో ఇంకెవరివల్లా కాదు. ఎందుకంటే అతడు అలాంటి ఇలాంటి బలశాలి కాడు. ఇండియా మొత్తంలో మహాత్మా గాంధీ ప్రజాబలానికి తిరుగులేదు. అంతటి మహాత్ముడినే ధిక్కరించి… ఆయన సర్వశక్తులూ ఒడ్డిన అభ్యర్థినే బహిరంగ ఎన్నికలో మన్ను కరిపించి భారత జాతీయ కాంగ్రెసుకు అధ్యక్షుడు కాగలిగిన ప్రజా నాయకుడు-

నేతాజీ సుభాస్‌ ‌చంద్ర బోస్‌ !!

‌ప్రజాస్వామ్య విహితంగా అధ్యక్షుడయిన వాడిని తన మానాన తనను పనిచేసుకోనివ్వాలన్న వివేకం గాంధీ వర్గానికి కొరవడింది. తమను ఎదిరించి గెలిచాడన్న అక్కసుతో -ఎన్నికైన అధ్యక్షుడిని తిన్నగా పని చేసుకోనివ్వకుండా సహాయనిరాకరణ చేసి గాంధీ వర్గీయులు నానావిధాల సతాయించారు. వారితో వేగలేక, మహాత్ముడి మనసు మార్చలేక, చీటికీ మాటికీ ఆయనతో తలపడటం ఇష్టం లేక సుభాస్‌ ‌బోసు అధ్యక్ష పదవిని వదిలి వేరే దారి వెతుక్కున్నాడు. గాంధీ గ్రూపు మూర్ఖత్వం, మంకుతనాల మూలంగా దేశంలో ఉండి సాధించలేకపోయిన స్వాతంత్య్రాన్ని దేశం వెలుపల నుంచయినా సాయుధ పోరాటం ద్వారా సాధించాలని నిశ్చయించి, తెల్లవాళ్ళ కళ్ళు కప్పి దేశం నుంచి మాయమయ్యాడు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతిని అనుసరించి బ్రిటిష్‌ ‌సామ్రాజ్య వాదానికి సైద్ధాంతికంగా బద్ధ శత్రువయిన సోషలిస్టు రష్యా మద్దతుతో స్వాతంత్య్ర సమరం సాగించాలని విశ్వప్రయత్నాలు చేశాడు. మాస్కో చేరాలని తహతహలాడినవాడు గత్యంతరం లేని పరిస్థితుల్లో నాజీ జర్మనీ చెంతకు గౌరవ అతిథిగా వెళ్ళాడు.

రాచమర్యాదల నడుమ బెర్లిన్‌లో అడుగు పెట్టీపెట్టగానే బోస్‌ ‌జర్మన్‌ ‌విదేశాంగ శాఖ ఉన్నతాధి కారులను కలిసి వివరంగా మెమొరాండం ఇచ్చాడు. బ్రిటిష్‌ ‌పట్టునుంచి ఇండియాను విడగొడితేగానీ బ్రిటన్‌ను యుద్ధంలో గెలవటం ఎలా అసాధ్యమో పూసగుచ్చినట్టు వివరించి, మీ స్వార్థం కోసమైనా మాకు మద్దతు నివ్వమని జర్మన్‌ ‌ప్రభుత్వంలో ముఖ్యులకు ప్రతిపాదించాడు.

కాని అది నాజీల తలకెక్కలేదు. ఇంగ్లండ్‌ ‌మీద ఎన్ని బాంబులు వేసినా, బ్రిటిషు సామ్రాజ్యాన్ని తుదముట్టించి, రంగుతక్కువ నేటివ్‌ ‌జనాలకు దానిపై అధికారాన్ని పంచిపెట్టటం శ్వేత జాతి దురహంకారి హిట్లర్‌కు ఎంత మాత్రం ఇష్టం లేదు. ‘‘గాంధీని కాల్చి పారేయండి. ఇంకా వాళ్ళకు బుద్ధి రాకపోతే డజనుమంది కాంగ్రెస్‌ ‌పెద్దలను కాల్చెయ్యండి. అదీ చాలకపోతే ఇంకో 200 మందినైనా కాల్చేసి ఇండియన్లను అణచివేయ్యండి’’ అని 1937లో తనను కలసిన బ్రిటిష్‌ ‌విదేశాంగ మంత్రి లార్డ్ ‌హాలిఫాక్స్ ‌కు మార్గదర్శనం చేసిన ఘనుడు అడాల్ఫ్ ‌హిట్లర్‌! ‌బ్రిటిష్‌ ‌సామ్రాజ్యాన్ని వీలైతే తాము చేజిక్కించుకోవాలి; అది సాధ్యపడకపోతే తెల్లతోలు ఇంగ్లిషువాళ్ళ చేతుల్లోనే ఉండనివ్వాలి. అంతేతప్ప నల్లవాళ్ళ పరం మాత్రం కానివ్వకూడదని మొదటినుంచీ అతడి పాలిసీ. అందుకే భారత స్వాతంత్య్రానికి ముందే హామీ ఇవ్వాలన్న సుభాస్‌ ‌బోస్‌ ‌షరతుకు నాజీల దొరతనం ఒప్పుకోలేదు. బ్రిటన్‌తో బేరమాడటానికి బోసును ఒక పావుగా ఉపయోగించుకోవాలనే జర్మన్లు కడదాకా ఎత్తువేశారు. ఏవో తాయిలాలిచ్చి, అదిగో ఇదిగో అంటూ మభ్యపెట్టి, మరీ తప్పనిసరైతే ఏవో చిల్లర వరాలిచ్చి దాదాపు రెండేళ్ళ విలువైన సమయాన్ని వృథా చేశారు.

1941 ఏప్రిల్‌లో బెర్లిన్‌లో అడుగు పెట్టినది మొదలుకుని నాజీ నియంతను నేరుగా కలవాలని సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌తెగ ప్రయత్నించగా సంవత్సరం తరవాత 1942 మే 29న గాని హిట్లర్‌ అతడికి దర్శనం ఇవ్వలేదు. ఆ తరవాతా అతడి ఉన్మాద ధోరణి మారలేదు. జర్మనీలో నేతాజీని అట్టే పెట్టుకోవటం వల్ల ఇక తమకు పెద్ద లాభం ఉండదని తలిచాక, ఆయన ఆసియాకు తిరిగి వెళ్ళవచ్చునని అంగీకారమైతే తెలిపాడు. కాని తిరుగు ప్రయాణానికి చేయగలిగిన ఏర్పాట్లు చప్పున చెయ్యకుండా జర్మన్లు ఏడెనిమిది నెలలు సాగదీశారు.

సరైన అదనులో తన దేశ విముక్తి కోసం పోరాడే అవకాశం చిక్కక మాతృభూమికి వేల మైళ్ళ దూరాన నిస్సహాయంగా ఉండిపోయినందుకు ఆ దేశ భక్తుడు ఎంత తల్లడిల్లిందీ సుభాస్‌ ‌బోస్‌ ‌జర్మన్‌ ‌విదేశాంగ మంత్రి రిబ్బెన్‌ ‌ట్రాప్‌కి1942 డిసెంబర్‌ 5‌న రాసిన ఈ ఉత్తరం చూస్తే అర్థమవుతుంది:

“I could do much more for my country, if I could be somewhere near India … I believe that it is technically possible for the German government to help me travel to the far east -either by aeroplane or by submarine or by ship.There is a certain amount of risk undoubtedly in this undertaking. That risk I shall gladly undertake. I believe in destiny… And the sooner I could travel, the better it would be for India and for the common cause… India is a place where one could strike directly at England and indirectly at America…”
[NetajiSubhas Bose the Great Revolutionary – by V.R. Adiraju, pp.268-269]

(ఇండియాకు దగ్గర్లో ఎక్కడికైనా చేరగలిగితే నేను నా దేశానికి ఇంకా చాలా చేయగలను. విమానంలో గాని, సబ్‌ ‌మెరైన్‌లోగాని, ఓడపై గాని నేను దూర ప్రాచ్యానికి ప్రయాణించగలిగేందుకు సహాయపడటం సాంకేతికంగా జర్మన్‌ ‌ప్రభుత్వానికి సాధ్యమని నా నమ్మకం. అలాంటి ప్రయత్నంలో నిస్సందేహంగా రిస్కు ఉంటుంది. ఆ రిస్కుకు నేను సంతోషంగా సిద్ధపడతాను. విధిలీల మీద నాకు నమ్మకం ఉంది. నా ప్రయాణం ఎంతత్వరగా జరిగితే ఇండియాకూ, ఉమ్మడి ప్రయోజనాలకూ అంత మంచిది. ఇండియా నుంచి నేరుగా ఇంగ్లండ్‌ ‌మీదా, పరోక్షంగా అమెరికా పైనా దెబ్బ కొట్టవచ్చు…’’)

నన్ను ఇండియా చెంతకు వెళ్ళనివ్వటం నాకేదో మహోపకారం అనుకోకండి. అది మీకే లాభం; మీ ముఖ్య విరోధులైన ఇంగ్లండ్‌, అమెరికాలను దెబ్బ తీసేందుకు అది మంచి అవకాశం – అని బెర్లిన్‌ ‌చేరింది లగాయతు సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఎన్నితీర్ల బోధపరిచినా పట్టించుకోక, చప్పున కదలక నాజీ భస్మాసురుడు హిట్లర్‌ ‌చివరికి తన నెత్తిన తానే చెయ్యి పెట్టుకున్నాడు. అతడే మూర్ఖుడనుకుంటే అతడిని మించిన మూర్ఖాగ్రేసరుడు జపాన్‌ ‌టోజో.

హిట్లర్‌కి ఇంగ్లిషు వాళ్ళ మీద జాత్యభిమానం. భారతీయులంటే ఏవగింపు. అయినా తాను ఇండియాను ఆక్రమించాలన్న ఆశ గాని, ఆక్రమించ గలనన్న భ్రమగాని అతడికి లేవు. జనరల్‌ ‌టోజోకు ఏకంగా ఇండియామీదే కన్ను. ఆ దేశం మీద దండెత్తి, తెల్లవాళ్ళను గెంటేసి తాము రాజ్య మేలాలని అతడి దుర్బుద్ధి. దానికి భారతీయులను మభ్యపెట్టి పావుల్లా వాడుకోవాలని అతడి ఎత్తు.

నిజానికి జపాన్‌ ‌సవ్యంగా సహకరించి ఉంటే సుభాస్‌ ‌చంద్ర బోస్‌కి నాజీల జర్మనీ పంచన చేరాల్సిన అగత్యమే వచ్చేది కాదు. నేరుగా జపాన్‌కే వెళ్లి, అక్కడి నుంచి పోరాటం సాగించేవాడు. బోస్‌ ఇం‌డియాలో ఉండగానే 1940 మధ్యలో లాలా శంకర్‌ ‌లాల్‌ అనే నమ్మకస్థుడిని జపాన్‌కి దూతగా పంపించి, భారత విముక్తి పోరాటానికి వారు సాయపడతారా అన్నది కనుక్కురమ్మన్నాడు. బ్రిటిషు వారితో గొడవపడకుండా మంచిగా ఉండి ప్రభుత్వంలో కీలక స్థానాలను మీరు దక్కించుకోండి -అన్నది జపాన్‌ ‌పాలకుల నుంచి అతడికి అందిన సందేశం. అలా కీలక స్థానాల్లో కుదురుకుని, మేము మీ దేశం మీద దాడి చేసినప్పుడు మాకు పంచమాంగదళంగా ఉపయోగపడమన్నది జపాన్‌ ‌వారి ఆంతర్యం. ఆ దిక్కుమాలిన సలహాను సుభాస్‌ ‌బోస్‌ ‌సహజంగానే కొట్టి పారేశాడు.

 1942 చివరిలో అమెరికా, బ్రిటన్ల మీద నేరుగా యుద్ధానికి దిగటానికి ముందునుంచే జపాన్‌ ఆసియాలో తన ఆక్రమణ వ్యూహానికి సాన పెట్టింది. ఆగ్నేయాసియాలో ప్రవాస భారతీయులది పెద్ద సమూహం. కాబట్టి అక్కడ తాము పాతుకోవాలంటే భారతీయుల మద్దతు అవసరమని టోక్యో గ్రహించింది. భారతీయుల మద్దతు కూడగట్టే పనిని మేజర్‌ ‌ఫుజివారాకు పురమాయించింది. అతగాడు బాంగ్‌కాక్‌ ‌వెళ్ళి భారత స్వాతంత్య్రం కోసం రహస్యంగా పని చేస్తున్న రహస్య విప్లవ సంస్థ ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ (ఐ.ఐ.ఎల్‌.) ‌నాయకులు ప్రీతం సింగ్‌, అమర్‌ ‌సింగ్‌లనూ, మలయాలో కెప్టన్‌ ‌మోహన్‌ ‌సింగ్‌నూ సంప్ర దించాడు. (ఈ ఐ.ఐ.ఎల్‌.‌ను 1928లో జవాహర్లాల్‌ ‌నెహ్రూ, సుభాస్‌ ‌బోస్‌లు స్థాపించారు.) మీరు మాకు సహకరించండి. మేము ఇండియాకు స్వాతంత్య్రం తెప్పిస్తాం అని ఫుజివారా చేత టోక్యో ఆశ పెట్టించింది. ఆ పని మీద వెళ్ళిన ప్రతి చోటా, ప్రతి నోటా జపాన్‌ ‌సైన్యాధికారికి సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌పేరు వినిపించింది. బోస్‌ ‌ను కనుక ఆసియా వచ్చేట్టు చేయగలిగితే ఈ ప్రాంతంలోని భారతీయులందరినీ కదిలించగలడు అని కెప్టెన్‌ ‌మోహన్‌ ‌సింగ్‌ అతడికి గట్టిగా చెప్పాడు. జపనీయులతో సహకరించటానికి లీగ్‌ ‌నాయకులు పెట్టిన షరతులన్నిటికీ అంగీకరిస్తూ కర్నల్‌ ‌తమూరా అగ్రిమెంటు మీద సంతకం చేశాడు. బెర్లిన్‌లో ఉన్న సుభాస్‌ ‌చంద్ర బోస్‌ను ఇండిపెండెన్స్ ‌లీగ్‌ ‌నాయకులు కాంటాక్ట్ ‌చేసేందుకు జపాన్‌ ‌సహాయపడాలన్నది ఆ షరతుల్లో ఒకటి.

1941 అక్టోబరులో ఐ.ఐ.ఎల్‌. ‌నాయకులతో అవగాహన కుదిరిన వెంటనే… సుభాస్‌ ‌చంద్ర బోస్‌ అనే మనిషి గురించి వాకబు చేసి, అతడు ఎలాంటి వాడన్నది జాగ్రత్తగా గమనించి రిపోర్టు చేయమని జర్మనీలోని తన రాయబారి హిరోషి ఒషిమాను టోక్యో ఆదేశించింది. ఆ రాయబారికి చూడగానే బోస్‌ ‌నచ్చాడు. అతడి తెలివితేటలను, దీక్షా దక్షతలను తెగ మెచ్చుకుంటూ తమ రాయబారి పంపిన రిపోర్టు చూడగానే ఆ మనిషి తాము ఆడించినట్టల్లా ఆడేవాడు కాడని, అవసరమైతే తమకే ఎదురు తిరగగల వాడనీ జపాన్‌ ‌పాలకులకు అర్థమయింది.

మరి ఏమిటి చెయ్యటం? జపాన్‌ ‌ప్రధాని, విదేశాంగ మంత్రి సహా పలువురు కేబినేట్‌ ‌మంత్రులు, మిలిటరీ విభాగాల అధిపతులు సభ్యులైన లైజాన్‌ ‌కాన్ఫరెన్సు 1942 జనవరి 10న కొలువుతీరినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది. బోస్‌ను టోక్యోకు ఆహ్వానించి, మన పాలసీకి అతడు ఎంతవరకూ ఉపయోగపడతాడో మదింపు చెయ్యాలి- అని అత్యున్నత స్థాయిలో నిర్ణయమయింది.

 ఆ వెంటనే అయినా జపాన్‌ ‌వారు కదిలి సుభాస్‌ ‌చంద్ర బోస్‌ను అనుకున్న ప్రకారం టోక్యోకు పిలిపించి ఉంటే, ప్రధానమంత్రి, సర్వాధికారి అయిన జనరల్‌ ‌టోజోకు తన మీద ఉన్న అనుమానాలను, భయాలను సంవత్సరం ముందే తొలగించి, అతడి బుద్ధి శుద్ధి చేసి, తన అభిమానిగా మార్చుకునేవాడు. తన సాటిలేని ప్రజ్ఞతో అద్భుత సైనిక వ్యూహాన్ని సూచించి, ఇండియాకు స్వాతంత్య్రాన్నీ , జపాన్‌కు దిగ్విజయాన్నీ సాధించగలిగేవాడు.

 ఎందుకంటే అది రవి అస్తమించడని మిడిసిపడే బ్రిటిష్‌ ‌మహాసామ్రాజ్యం అప్పుడు ఘోర పరాజయాల పరంపరతో గిలగిలలాడుతున్నది. 1939 -40 ప్రాంతాల్లో ‘జర్మన్ల బ్లిట్జ్ ‌క్రీగ్‌’ ‌స్థాయిలో 1942 మొదటి పాదంలో దూరప్రాచ్యాన జపాన్‌ ‌జైత్రయాత్ర తెల్లవాళ్ళ పీచమణచింది. ‘జిబ్రాల్టర్‌ ఆఫ్‌ ‌ది ఈస్ట్’ అని గర్వంగా చెప్పుకునే బ్రిటిష్‌ ‌కంచుకోట సింగపూర్‌ 1942 ‌ఫిబ్రవరి 15న జపాన్‌ ‌వశమైంది. 90వేల మంది సైనికులు ఖైదీలయ్యారు. 1781లో అమెరికా సైన్యం చేతిలో జనరల్‌ ‌పెర్సివాల్‌ ‌చిత్తుగా ఓడిన తరవాత ఘనత వహించిన బ్రిటిష్‌ ‌మహా సామ్రాజ్యానికి మళ్లీ అంతటి తలవంపులయింది. ఫిలిప్పీన్స్, ఇం‌డోనీసియాలు పతనమయ్యాయి. తూర్పున తిరుగులేనిదనుకున్న బ్రిటిష్‌ ‌ప్రాభవాన్ని ఒక చిన్న ఆసియన్‌ ‌రాజ్యం మట్టికరిపించింది. సింగపూర్‌తో బాటే మొత్తం మలయా ద్వీపకల్పాన్ని జపాన్‌ ఆ‌క్రమించింది. అది బ్రిటిష్‌ ‌మహసామ్రాజ్యా నికి ఘోర సైనిక పరాభవం అని ప్రధాని చర్చిల్‌ ‌రేడియోలో లబలబలాడాడు. ఇంకో నెలకల్లా రంగూన్‌ ‌సహా బర్మా మొత్తం జపాన్‌ ‌సేనలకు పాదాక్రాంత మయింది. మార్చ్ 23‌న భారత భూభాగమైన అండమాన్‌ ‌దీవులను జపాన్‌ ‌స్వాధీనపరచుకుంది. జపాన్‌ ‌సేనలు భారతదేశం గేటు ముందు నిలిచాయి.

తమ ఆసియా వ్యూహంలో బర్మా విమోచనం తరవాత ఇండియాకు స్వాతంత్య్రమే తదుపరి లక్ష్యమని జపనీస్‌ ‌ప్రభుత్వ ప్రముఖులు పలు మార్లు నొక్కి చెపుతూ వచ్చారు. బ్రిటన్‌ ‌బారినుంచి భారత్‌ ‌కు విముక్తి కలిగించడానికే సింగపూర్‌లో పట్టుబడిన భారత యుద్ధఖైదీలతో ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీని ఏర్పరచి అన్నివిధాల సహాయపడుతున్నామనీ వారు తెగ నమ్మబలుకుతున్నారు. వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బ్రిటిష్‌ ‌పీడ విరగడ చేయటానికి అదే సరైన అదను. బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం అప్పుడున్నంత దుర్బలంగా, నిస్సహాయంగా దాని మొత్తం చరిత్రలో ఎన్నడూ లేదు. గుండెకాయలాంటి ఇండియాను వేరు చేయగలిగితే ఆ సామ్రాజ్యం మొదలు నరికిన చెట్టులా కూలిపోతుంది. ఆసియాలో జపాన్‌ ‌కత్తికి ఏనాటికీ ఎదురు లేకుండా పోతుంది.

 కాని జపాన్‌ ‌వారిని భారతీయులు కలలో కూడా నమ్మరు. వారు దాడికి దిగితే ఎట్టి పరిస్థితులలోనూ ప్రజలు సహకరించరు. భారతీయులను కదలించి తెల్లవారికి వ్యతిరేకంగా సమీకరించగలిగిన ఒకే ఒక్కడు నేతాజీ సుభాస్‌ ‌చంద్ర బోస్‌. ‌జపాన్‌తో సహకరించటానికి అతడు సిద్ధంగా ఉన్నాడు. అతడి నాయకత్వాన్నే ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ ముక్త కంఠంతో కోరుతున్నది. 1942 జూన్లో బాంగ్‌ ‌కాక్‌లో తొమ్మిది రోజులపాటు పెద్ద ఎత్తున జరిగిన తూర్పు ఆసియా భారతీయుల మహాసభ ‘‘దయచేసి తూర్పు ఆసియాకు వచ్చి ఉద్యమం నడిపించాలి అని సుభాస్‌ ‌చంద్ర బోస్‌ను అభ్యర్థిస్తూ తీర్మానం చేసింది.

సుభాస్‌ ‌బోస్‌ను టోక్యో పిలిపించి మాట్లాడాలని ఎలాగూ 1942 జనవరిలోనే అత్యున్నత స్థాయిలో నిర్ణయమయిపోయింది కనుక కనీసం జూన్‌లో బాంగ్‌ ‌కాక్‌లో భారతీయుల మహాసభ తీర్మానం తరువాత అయినా టోక్యో చప్పున కదిలి నేతాజీని తూర్పుకు రప్పించి ఉంటే చరిత్రగతి ఇంకోలా ఉండేది. అప్పట్లో భారతదేశమంతటా ఉవ్వెత్తున క్విట్‌ ఇం‌డియా ఉద్యమం లేచిన సమయంలోనే నేతాజీ నాయకత్వంలో ఇండియన్‌ ‌నేషనల్‌ ఆర్మీ బయటి నుంచి సాయుధ సంగ్రామం సాగించి ఉంటే సైనికంగా, నైతికంగా, అంతర్జాతీయంగా డీలా పడ్డ బ్రిటిష్‌ ‌ప్రభుత్వం బర్మాలో లాగే బహుశా కుప్పకూలేది. స్వతంత్ర భారత్‌ అం‌డ ఉన్నప్పుడు యుద్ధంలో జపాన్‌ది పైచేయి అయి, హిరోషిమా, నాగసాకిల సర్వనాశనం తప్పేది.

 బాంగ్‌ ‌కాక్‌ ‌సభకు కొద్దిరోజుల ముందే నేతాజీ హిట్లర్‌ని కలిశాడు. ఆ సమయాన యూరప్‌లో అక్షరాజ్యాలు ఆక్రమించిన ఒకానొక రేవులో జపాన్‌ ‌జలాంతర్గామి వచ్చి ఉంది. టోక్యో కావాలనుకుంటే దానిలో మిమ్మల్ని తూర్పుకు తీసుకువెళ్ళవచ్చు అని హిట్లర్‌ ‌సూచించాడు. భారత స్వాతంత్య్రానికి పరిస్థితులన్నీ కలిసివచ్చిన తరుణంలో తాను రంగంలో ఉండాలని నేతాజీ ఎంత తహతహ లాడినా, బెర్లిన్లో జపాన్‌ ‌రాయబారి, మిలిటరీ దౌత్యాధికారి ఎన్ని సార్లు ఎంత గట్టిగా సిఫార్సు చేసినా టోక్యో స్పందించలేదు.

బోస్‌ ‌మా చెంతకు రావటం మాకు ఇష్టమే. కాని అంత పెద్ద నాయకుడిని వదిలేసుకోవటానికి జర్మనీ ఎందుకు ఇష్టపడుతుంది అనేమో మొదట అన్నారు. మాకు ఇష్టమేనని స్వయంగా ఫ్యూరర్‌ ‌హిట్లరే చెప్పాడు అంటేనేమో అంతటి వి.వి.ఐ.పి.ని తరలించాలంటే భద్రత జాగ్రత్తలు ఎన్నో చూసుకో వాలి కదా? ఇప్పుడు ప్రయాణం చాలా ప్రమాదం – అని వాదించారు. సబ్‌ ‌మెరైన్లో వెళ్ళొచ్చని హిట్లర్‌ ‌సూచించినా సరే- తమ దగ్గర బోస్‌కు స్పేర్‌ ‌చేయటానికి జలాంతర్గామి ఏదీ అందుబాటులో లేదు అని జపాన్‌ ‌పాలకులు బుకాయించారు. నేతాజీని విమానంలో తీసుకుపోవచ్చు. ఆ సమయాన రష్యాకు చెందిన ఉక్రెయిన్‌ ‌జర్మనీ చేతుల్లో ఉన్నది. అక్కడి నుంచి నేతాజీని తూర్పుకు తరలించవచ్చు. అప్పట్లో రష్యా, జపాన్ల మధ్య విరోధం లేదు కనుక టోక్యో అడుగితే మాస్కో కాదనదు. అయినా మాస్కో ఒప్పుకోదు అని ముందే ఊహించేసి అది అయ్యేపని కాదు అని టోక్యో కొట్టిపారేసింది. అలా సాగదీసి దీసి ఎట్టకేలకు 1942 ఆగస్టులో బోస్‌ ‌తరలింపుకు జపాన్‌ ‘‘‌సూత్రరీత్యా’’ అంగీకారం తెలిపింది.

ఆ తరువాతా అడ్డుపుల్లలు వేయటం మానలేదు. సుభాస్‌ ‌చంద్రబోస్‌ ఇక్కడికి రావటం మీకు ఇష్టమేనా? అతడికింద మీరు పనిచేయగలరా అని రాస్‌బిహారీ బోస్‌ను జపాన్‌ ‌సైన్యాధికారులు కెలికారు. అతడు బోస్‌ను వ్యతిరేకిస్తాడేమోనని ఆశపడ్డారు. కానీ అతడేమో ‘‘మాకు ముమ్మాటికీ ఇష్టమే. నేను స్వచ్ఛందంగా తప్పుకుని అతడి నాయకత్వం కింద పనిచేస్తాను’’ అని ఇష్టంగా చెప్పాడు. పోనీ అంతటితో ఆగారా? ‘మీరు మా వైపు వచ్చినా ఒకరికింద పని చేయవలసి ఉంటుంది. చేస్తారా?’ అని జపాన్‌ ‌వాళ్లు బెర్లిన్లో బోస్‌ని అడిగారు. ‘‘నేను వచ్చేది నాయకత్వం కోసం కాదు. నాకు కావలసింది మా దేశానికి స్వాతంత్య్రం. దాని కోసం ఎవరి కింద అయినా పనిచేస్తాను’’ అని నేతాజీ చెప్పాడు.

భారతీయ యుద్ధ ఖైదీలతో తాము కూర్చిన సైనిక దండుకు నాయకుడుగా జపనీయులు ఏరికోరి ఎంచుకున్న కెప్టెన్‌ ‌మోహన్‌ ‌సింగ్‌ ఎదురుతిరిగి మొత్తం ఐ.ఎన్‌.ఎ.‌నే రద్దుచేయబోయాడు. నేతాజీ మినహా ప్రత్యామ్నాయం కోసం టోక్యో చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. చేయిదాటిన పరిస్థితిని చక్కదిద్దటానికి ఇక ఏ దారీ లేదని బోధపద్దాక గానీ నేతాజీ రాకకు జపాన్‌ ‌సరే అనలేదు. బోస్‌ను జలాంతర్గామిలో తరలించటానికి సరే అన్న తరువాతా దానిని అడ్డుకొట్టటానికి టోక్యో చివరి ప్రయత్నం చేసింది. యుద్ధనౌకలో సివిలియన్‌ ఎవరినీ అనుమతించరాదని జపాన్‌ ‌నౌకాదళంలో ఒక నిబంధన ఉన్నదట. మరి సివిలియన్‌ అయిన బోస్‌ను మేము ఎలా రానివ్వగలం? అని జర్మన్‌ ‌విదేశాంగ కార్యాలయానికి టోక్యో నుంచి అభ్యంతరం అందింది. అక్కడ ఇండియా డిపార్ట్‌మెంట్‌కు అధిపతిగా ఉన్న ఆడం వాన్‌ ‌ట్రాట్‌కు అది చూసి ఒళ్లు మండింది. ‘‘సుభాస్‌ ‌చంద్ర బోస్‌ ‌మామూలు సివిలియన్‌ ‌కాదు.. ఆతడు ఇండియా విమోచన సైన్యానికి కమాండర్‌ ఇన్‌ ‌చీఫ్‌’’ అని ఆ అధికారి జవాబిచ్చాడు. దాంతో జపాన్‌ ‌వాళ్ళు నోరు మూశారు.

ఈ విధంగా.. సుభాస్‌ ‌చంద్ర బోస్‌కు సంబం ధించి ఇండియన్‌ ఇం‌డిపెండెన్స్ ‌లీగ్‌ ‌నాయకులతో థాయిలాండ్‌లో 1941 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకున్న తరవాత సంవత్సరం మీద మూడునెలల పాటు చచ్చు శంకలతో, పుచ్చు సవాళ్ళతో విలువైన సమయం వృథా చేసి చేసి చిట్టచివరికి జపాన్‌ ‌ప్రభువులు నేతాజీ రాకకు పచ్చ జండా ఊపారు. ఈ లోపు పుణ్యకాలం దాటిపోయింది. అక్షరాజ్యాల ప్రభ మసకబారింది. రెండో ప్రపంచ యుద్ధంలో బలాబలాలు తారుమారయ్యాయి. జర్మనీ జపాన్‌ల నడుములు విరగటానికి కౌంట్‌ ‌డౌన్‌ ‌మొదలయింది.

ప్రపంచంలోని పెద్ద స్టేట్స్ ‌మన్లకే రాజనీతి పాఠాలు చెప్పగలిగిన నేతాజీ సుభాస్‌ ‌చంద్ర బోస్‌కు ఆ సంగతి అందరికంటే బాగా తెలుసు. అయినా అతడు బెదరలేదు. చెదరలేదు. ఓటమి భయాన్ని దరిదాపులకు రానివ్వలేదు. తన మీద తనకు కొండంత విశ్వాసంతో, మాతృభూమి విముక్తి ఒక్కటే లక్ష్యంగా, మృత్యువుతో పందెం వేసి ఉత్సాహంగా ఉరకలు వేస్తూ సాహసయాత్రకు సిద్ధమయ్యాడు.

మిగతా వచ్చేవారం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram