– వెంకటమణి ఈశ్వర్‌

‌శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీకి ఎంపికైనది

అడవివరం కుమ్మరిదిబ్బ వద్ద రావిచెట్టు కింద గంటన్న ఇల్లు. ఇల్లంటే అది ఇల్లు కాదు. రావిచెట్టును ఆనుకుని ఓ పాత గోడ ఉంటుంది. ఆ గోడకు ఆనబెట్టి రోడ్డువరకు ఉన్న పదడుగుల ఖాళీ జాగాలో రేకులు దించి మూడు పక్కలా విరిగిన రేకు ముక్కల్ని గోడల్లా అడ్డంగా పెట్టి కట్టిన పొదరిల్లు అది. అది పొదరిల్లు ఎందుకంటే, కూరకి పనికొస్తుందని గంటన్న రావిచెట్టుపైకి ఎప్పుడూ ఏ బీరపాదో, ఆనప పాదో పాకిస్తూంటాడు. అది చెట్టుపైకే కాకుండా ఇంటి కప్పుపైకి కూడా పాకుతుంది. అందువల్ల అదో పొదరిల్లులాగుంటుంది. గంటన్నకు అదే ఇల్లు, అదే దుకాణం. అతను తాళాలు, గొడుగులు బాగుచేస్తాడు. ఇల్లంతా తాళం కప్పలు, పాత గొడుగులతోనే నిండిపోయింటుంది. వందల తాళపుచెవులు కాసులపేరులాగా ఇంటిముందు తీగకు వేలాడుతూ ఉంటాయి.

ఉదయం తొమ్మిదయ్యేసరికి అరుగుమీద గోనె పరుచుకుని సామాన్లు ముందేసుకుని కూర్చుంటాడు గంటన్న. మరమ్మత్తుకు తాళాలు, గొడుగులు ఎక్కువగా ఉంటే ఇంటిపట్టునే ఉండిపోతాడు. లేదంటే చుట్టుపక్కల ఊర్లమీదకు పోతాడు. అతగాడు పనిమీద ఎక్కడకు పోయినా అతని వెంట సావిత్రి కూడా పోతుంది. ఆ రోజు ఇంటివద్ద చేయదగిన పని లేకపోయేసరికి ఇద్దరూ ప్రహ్లాదపురం పోయారు.

‘‘గొడుగులు బాగుసేస్తాం.. తాళాలు బాగుసేస్తాం..’’ అని అరుచుకుంటూ వీధి వీధీ తిరిగారు. గంటన్న గొడుగుల సంచీ భుజాన వేసుకుని ముందుకు సాగిపోతుంటే ఆ వెనకనే సావిత్రి తాళాల గుత్తులు చేతులకు వేలాడదీసుకుని అనుసరిస్తోంది.

‘‘యేసవి కదా.. గొడుగులతో, తాళాలతో కాసింత పనిబడతాది జనాలకి.. ఎండకి గొడుకేసుకోవా.. రాత్రుళ్లు ఆరుబయట తొంగున్నప్పుడు యింటికి తాళం కప్పేసుకోవాల.. బేరాలుంతాయనే ఎండయినా ఊరిమీదకి రావడం.. పొద్దు నడినెత్తి కొచ్చెత్తంది.. ఒక్క బేరమూ తగల్నేదు..’’ భుజాన తుండుగుడ్డ తీసి ముఖంపై చెమట తుడుచు కుంటూ అన్నాడు గంటన్న.

‘‘ఏటి సేద్దువు.. ఎండ సుర్రుమంతంది.. ఎనక్కి పోదువా..’’ అంది సావిత్రి.

‘‘ఏటంతన్నావే ఎధవకాన! ఎనక్కి పోదారా.. మరి కూడెవడెడతాడె.. మీ నాన్నా..’’

‘‘ఆఁ.. ఇంకా ఎడతాడు మా నాన్న.. పెళ్నాడెట్టింది సాలదా.. అయినా ఉప్పుడు నానేటనీసినానని అంత ఇదైపోతన్నావు..’’ ముఖం చిట్లించింది సావిత్రి.

‘‘మనయ్యి అచ్చరం నేర్చిన బతుకులంటే.. ఆపీసుల్లో ఫేనికింద కూకోని పనిసెయ్యనికి.. రా..పార్రా..’’ అని నడక వేగం పెంచాడు గంటన్న.

సావిత్రి ఏం చేస్తుంది? కాళ్లకడ్డం పడుతున్న కుచ్చిళ్లను బొడ్లో ఎగదోపుకుని అతని అడుగులో అడుగేసింది.

దారిలో ఓ ఇంటిదగ్గర బేరం తగిలింది. ‘‘గొడుగు సివర కొత్త పొన్ను బిగించాల బాబూ.. ఇరవై రూపాయలవుద్ది..’’ అని చెప్పాడు గంటన్న.

‘‘ఏంటి ఇంతోటిదానికి ఇరవై రూపాయలా?!’’ నోరు బార్లా వెళ్లబెట్టాడు ఇంటాయన. చివరికి పది రూపాయలకు ఆ బేరం కుదిరింది. చేతిలో ఓ వందన్నా లేకపోతే ఆ రోజు అవసరాలు తీరవని పైన ఎండ కాలుస్తున్నా రోడ్లు పట్టి తిరిగారు ఇద్దరూ.

—————————–

గంటన్నకి ఎన్నడూ లేనిది ఎండదెబ్బ తగిలేసింది. జ్వరం పట్టేసింది మనిషికి. ఆరోజు పనిలోకి పోలేకపోయాడు. ఇద్దరు గొడుగులు పట్టుకుని ఇంటికి వచ్చారు. వాటిని బాగుచేయడానికి నులకమంచం మీదనుంచి లేవబోయాడు.

సావిత్రి ‘‘నేను సూత్తానులే.. నువ్వు తొంగో..’’ అని అతగాడిని వారించి తానే ఆ గొడుగుల్ని బాగు చేసి ఇచ్చింది. ఆ మధ్యాహ్నం, రాత్రీ ఉడుకుడుకు గంజి తాగేసి పడుకున్నాడు గంటన్న. తెల్లారుకి లేస్తాడనుకున్న మనిషి లేవలేదు, సరికదా జ్వరం మరింత హెచ్చింది. ఎ.ఎన్‌.ఎం ‌దగ్గరకి వెళ్లి మందులు తెచ్చి వేసింది. అయిదు రోజులకుగానీ జ్వరం తగ్గలేదు. మనిషి బాగా నీరసించిపోయాడు. నీరసం తగ్గేవరకు పనిలోకి పోవద్దంది సావిత్రి. ఇంట్లో కూర్చుంటే గడవదని గంటన్నకు అన్ని సపర్యలూ చేసి తను ఒక్కతే గొడుగులు, తాళాల సంచీని భుజాన వేసుకుని ఊరిమీదకు పోయింది.

‘‘గొడుగులు బాగు సేత్తాం.. తాళాలు బాగు సేత్తాం..’’ అని అరుస్తూ శ్రీనివాసనగర్‌ ‌వైపు వెళ్లింది.

‘‘ఓయ్‌ ‌గొడుగులూ.. గొడుగు చిన్న రిపేరు.. చేస్తావా?’’ అని ఓ ముసలాయన పిలిచాడు. సావిత్రి వెనక్కి తిరిగింది. ఆమెను చూసేసరికి ఆ ముసలాయనకు ఏం అనుమానం వచ్చిందో, ‘‘నువ్వు బాగా చెయ్యగలుగుదువా?’’ అని అడిగాడు ఆమెను ఎగాదిగా చూస్తూ.

‘‘అయ్యో నాయనా! నన్నేటి సూత్తావు.. నా పని సూడు.. నాను పదేల్లకాణ్ణుంచి గొడుగులు, తాళాలు బాగుసేత్తన్నాను.. ముందు నువ్వు గొడుగు అట్రా.. బాగుసేసాక డబ్బులియ్యి..’’ అంది సావిత్రి ఖరాకండీగా.

అతను లోనికి వెళ్లి గొడుగు తెచ్చి ఇచ్చాడు. ఆ గొడుగును చూసి దాని జబ్బేమిటో ఇట్టే గ్రహించేసింది సావిత్రి. ‘‘బావూ! టెంపరు బానేదు.. కొత్తదేసుకోవాల.. రివిట్లు బిగించాల.. పాతిక రూపాయిలిచ్చు కోండి..’’

‘‘ఏటిదీ వంద రూపాయల గొడుక్కి పాతిక రూపాయల రిపేరా?! ఎళ్లు ఎళ్లవమ్మా.. పది రూపాయలిస్తాను.. చేస్తే చె•య్యి లేకపోతే లేదు..’’ కసురుకున్నాడు ముసలాయన.

‘‘ఎందుకు బావూ అలగ సిరాకు పడిపోతన్నావు.. నీ సొమ్మేదో నాకు ఊరకనే ఇచ్చెత్తన్నట్లు.. ఆ రేటుకయితే కొత్త టెంపరెయ్యను మరి.. అదయినా పదేనిత్తేనే సేత్తాను..’’ సావిత్రి కూడా తెగేసినట్లు బదులిచ్చింది.

తను అనుకున్న బేరానికి దిగింది అని లోన సంతోషిస్తూ ఆ ముసలాడు ‘‘కొత్త గొడుగులా చెయ్యాలి మరి..’’ అని చెప్పి సావిత్రి చేతిలో పెట్టాడు.

సావిత్రి సంచీలోంచి జవగారు తీసి పాత టెంపరునే వొంచి సరిచేసింది. రివిట్లు బిగించి గొడుగును విప్పి, ముడిచి సరిచూసి ఇచ్చింది. వచ్చిన డబ్బుని చిక్కంలో దాచి బొడ్లో దోపుకుని ‘‘గొడుగులు బాగు సేత్తాం.. తాళాలు బాగు సేత్తాం..’’ అని మళ్లీ తన జీవనయానాన్ని సాగించింది. సందు గొందులన్నీ తిరిగింది. మరో రెండు చిన్న బేరాలు తగిలాయి. చువ్వలకు గుడ్డ బేరం వచ్చిందిగానీ అది తెగలేదు. ఎండకు గొంతెండిపోయింది సావిత్రికి. సంచీలోంచి కూల్‌‌డ్రింకు బాటిల్‌ ‌తీసి అందులోని గంజిని గొంతులోకి ఆబగా ఒంపుకుని తాగింది. గదువపైన ఒలిగిన గంజి నీళ్లను చెంగుతో తుడుచుకుని ‘‘ఇంటికాడ మడిసి ఎలాగున్నాడో.. గంజి నీళ్లయినా తాగినాడో నేదో..’’ అని తలుచుకుంది. కాసేపు గణపతి గుడి దగ్గర కూర్చుని మరో రెండు వీధులు తిరిగింది.

—————————–

‘‘తాళాలు బాగుసేత్తాం.. గొడుగులు బాగుసేత్తాం..’’

ఆ పిలుపు విని వంట గదిలో తాళింపు పెడుతున్న సరిత స్టవ్‌ ‌కట్టేసి బయటకొచ్చి ‘‘ఎయ్‌ ‌తాళాలూ.. తాళాలూ..’’ అని పిలిచింది.

ఆ పిలుపునకు సావిత్రికి కొత్తగా ఏమని పించిందోగానీ ‘‘ఏటో నా పేరు తాళం అని ఎట్టీసినాడు కాదు మా బావు..’’ అని గొణుక్కుంటూ వచ్చింది ఆమె.

ఉండమని చెప్పి లోనికి వెళ్లి ‘‘తాళం కప్ప ఒకటి తెచ్చి సావిత్రి చేతిలో పెట్టింది. సావిత్రి దానిని కిందా మీదా చూసి కప్పని బద్దలుకొట్టిన విషయాన్ని గ్రహించి ‘‘పెద్ద పనేనమ్మా.. బెట్లు సెడిపోనాయి.. నొత్తలు సరిచెయ్యాల.. ఖర్సవుతాది..’’ అని చెప్పింది.

‘‘బెట్లో గిట్లో అవన్నీ నాకు తెలియదు.. ఎంతవుద్దో చెప్పు..’’

‘‘యాభై రూపాయలవుద్దమ్మా.. ఆపైన నీ సొమ్ము నాకొద్దు తల్లే..’’

‘‘అంతా?! తగ్గించు మరి..’’ ఏదో బేరమాడాలని అడిగింది సరిత.

‘‘నలభైకి తక్కువ సెయ్యనేనమ్మా.. సూడ్డానికి మాలచ్మిలాగున్నావు తల్లే.. నువ్వు కూడా బేరాలాడుతన్నావు..’’ అంటూ కింద నేలమీద మటం వేసుకుని కూర్చుని సంచీలోంచి తాళాలు బాగు చేసే సరంజామా అంతా బయటకు తీసి పని మొదలుపెట్టింది. సుత్తీ సేనంతో కుస్తీలు పట్టి తాళం కప్పని విప్పింది. మగాడిలా పనిచేస్తున్న సావిత్రిని విచిత్రంగా చూస్తూ సరిత ‘‘ఆడదానివి.. ఈ పనెలా చేయగలుగుతున్నావు?’’ అనడిగింది.

‘‘పనికి ఆడేటి.. మగేటమ్మా.. నేర్సుకుంతే ఎవుళన్నా ఏ పనన్నా సెయ్యగలరు కదా తల్లే..’’

‘‘వుండు వచ్చి మాట్లాడతాను..’’ అని చెప్పి వంటింట్లోకి వెళ్లింది సరిత. చారు తాళింపు పెట్టి ఆమె తిరిగొచ్చేసరికి సావిత్రి తాళం కప్పని మొత్తంగా విడదీసేసింది. తాళం కప్ప ఏ భాగానికి ఆ భాగం విడిపోయి ఉండడం చూసి ఒకప్పుడు తను ఆ తాళం కప్పని బద్దలు కొట్టడానికి పడినపాట్లు గుర్తుకొచ్చాయి సరితకు. ఆ సంఘటనను గుర్తు చేసుకోవడానికి ఆమెకు మనస్కరించలేదు. ఆ ఆలోచనలను పారదోలాలని చెప్పి సావిత్రితో మాటలు కలిపింది. ‘‘నువ్వీ పని ఎక్కడ నేర్చుకున్నావు?’’ అనడిగింది.

‘‘నానెక్కడ నేర్సుకుంతాను.. నా మొగుడుకాడే.. నా పెళ్లయ్యేసరికి నాకే పనీ రాదు. వొండెట్టి వొల్లక యింట్లోనే కూకుండేదాన్ని.. నా మొగుడు కట్టం సూసి నానూ నేర్సుకోవాలనుకున్నాను. అడిగితే ఆ బావు నువ్వేటి నేరుత్తావే అని గసురుకునీవోడు. నానొల్లకుంతేనా… ఉడుం పట్టు పట్టీనాను. మొదట్లోన ఆ బావు గొడుగుల సంచీ అట్టుకొని ఎనకమాలే పోయీదాన్ని. ఆ బావు పని సేత్తంటే అదీ ఇదీ సేతికందిత్తా గొడుగు సువ్వలకు గుడ్డ తొడ గడమో, ఉక్కుతీగ బిగించ డమో, తాళాలు యిడగొట్టడమో సేసీ దాన్ని. అలాగ పని నేర్సీనాను. యిప్పటికి పదేళ్లకాణ్ణుంచి ఈ పనిలో వున్నాను తల్ల్లే.. నా మొగుడెనకాలే తిరుగుతు•న్నాను..’’

‘‘మరి మీ ఆయనేడి?’’

‘‘ఆ బావుకి జొరమమ్మా… వారం ఇడిసిపెట్టకుండా కాసిం దమ్మా.. ఉప్పుడు తగ్గినాది కానీ మడిసి నీరసపడిపోండు.. అందుకే ఆ బావుకి అన్నీ సరిపెట్టి నాను ఊరిమీద కొచ్చినాను..’’

సరిత మనసు కాస్త లోనికి కుంచించుకుని పోయింది. పధ్యానంలో పడిపోయిందామె. తనకు జ్వరమొచ్చినప్పుడు గంగా ధర్‌ ఎప్పు‌డైనా ఇలా చూసు కున్నాడా? ఏవో మాత్రలు తెచ్చే వాడు. వేసుకోమనేవాడు. అంతకీ తగ్గకపోతే ఆసుపత్రికి పోయి చూపించుకోమనేవాడు. ఓసారి టైఫాయిడ్‌ ‌జ్వరమొచ్చి మంచాన పడిపోతే తీసుకెళ్లి రక్తపరీక్ష చేయించడానికి కూడా అతగాడికి ఖాళీ లేక పోయిం ది. ఆఫీసు పని నెపంతో ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లి రమ్మన్నాడు. సరిత మనో ఫలకంపై ఒకటొకటిగా ఆ సంగతులు కదలాడాయి. సావిత్రి తాళపు ఒకపక్క కప్పు వంకీ తీయడానికి గట్టిగా సుత్తి దెబ్బలు వేయడంతో ఒక్కమారుగా ఆ ఆలోచనలన్నీ చెదిరి పోయాయి.

‘‘అమ్మా సెప్తే నీకు నవ్వులాట గుంటాదిగానీ నాకు జొరమొత్తేనమ్మా నా మొగుడు అగ్గగ్గిలాడి పోతాడు.. నన్ను పొయ్యికాడికి పోనియ్యడు.. ఉడుకుడుకు గంజి కాసి తాగిపిత్తాడు. తాగీదాకా వొగ్గడనుకో.. రాత్రిళ్లు ఒళ్లు సూసి తలకి తడి గుడ్డెడతాడు మడిసి..’’ ముసిముసిగా నవ్వుకుంది సావిత్రి.

అంత పేదరికంలో ఈ మనుషుల మధ్య ఇంత అన్యోన్యతా! ఆశ్చర్యం వేసింది సరితకు. అప్పుడు తన అంతర్వాణి ‘‘నువ్వు మాత్రం నీ భర్తను అంత అన్యోన్యతతో ఎప్పుడైనా చూశావా?’’ అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు సమాధానం ఆమె వద్ద ఉంది. అవును, తను కూడా ఎన్నడూ భర్తకు సేవలు చేసింది లేదు. గంగాధర్‌కు ఒంట్లో బాగులేని సందర్భాల్లోనూ, ఇతరత్రా ఇబ్బందుల్లోనూ తనూ నిర్లక్ష్యంగానే మసిలింది. తన పాట్లేవో తనే పడేవాడు. కనీసం సహకరించేది కాదు. ఆ సంఘటనలు గుర్తుచేసుకునేసరికి సరిత మనసు డోలాయమానంలో పడిపోయింది. తనముందు తైల సంస్కారం లేకుండా చింపిరి జుత్తుతో కూర్చున్న మనిషిలో.. మురికి పట్టిన చినుగుల చీర కట్టుకుని ఏ హుందాతనమూ లేని మనిషిలో… తనలా ఏ చదువూ సంధ్యా లేని మనిషిలో ఇటువంటి సంస్కారమా? విస్తుపోయింది సరిత! తనకు డబ్బుండీ అందనిది.. ఆమెకి పేదరికంలో అందుతోంది. ఎందుకో తెలియదు, ఆ క్షణంలో సావిత్రిపై అసూయ కలిగింది ఆమెకు. అంతలోనే మనసులో ఏదో ఇబ్బందనిపించి ఒక్కక్షణం పాటు దీర్ఘంగా శ్వాస తీసి విడిచి ‘‘మీ ఆయన నిన్ను ఎప్పుడైనా కొడతాడా?’’ అనడిగింది సావిత్రిని.

ఉంటే చుట్టుపక్కల వాళ్లు కూడా చూసేలా బొకా బొకా నవ్వింది సావిత్రి. నవ్వి నవ్వి ‘‘భళేటిదానివి తల్లే.. తన్నడవా.. సితకదంతాడమ్మా మాయదారి సచ్చినోడు.. ఎన్నిసార్లు తన్నినాడో నెక్కేనేదు..’’ అని చెప్పింది.

‘‘మరి నువ్వు ఎదురుతిరగవా?’’

‘‘తిరుగుతానమ్మా… ఓసారైతే నానూ తన్నీనాను ఆ మడిసిని..’’

‘‘మొగుడ్ని తన్నావని నిన్ను నీ వాళ్లింటికి పంపె య్యలేదా?’’ ఉత్సుకతతో అడిగింది సరిత.

‘‘కొట్టుకున్నా, తిట్టుకున్నా ఆలూమగలమమ్మా… ఆ బావు తిడితే నాను పడతాను, నాను తిడితే ఆ బావు పడతాడు.. మా మధ్యన ఎన్నున్నా బంధం ఎలా తెంపీసుకుంతామమ్మా.. అయినదానికీ కాని దానికీ బంధం తెంపీసుకుందామనుకుంతే ఇక ఆ జీవితానికి తోడు నిలవడం కట్టవమ్మా.. మేవు ఎంత గొడవపడినా ఆ క్చణానికే.. ఆ తర్వాత ఏం జరగనట్లు మాట్టాడీసుకుంతాం..’’ అని తాళం కప్పలో ఓ చోట జాయింటు బిగిస్తూ అంది.

జీవితం పచ్చిగా ఇలా ఉంటుందా? సావిత్రి జీవితంలో రాజీపడి బతుకుతోందా? లేదు, ఆమె రాజీపడి బతకడం లేదు. ఆమె ఇష్టపూర్వకంగా ఆమె బంధాన్ని కోరుకుంటోంది. తనే గంగాధర్‌తో రాజీపడి బతుకుతోంది. తమ బంధంలో ప్రేమ లేదు, అనురాగం లేదు. మరమనుషుల కంటే అధ్వానం. అవి కూడా ఈ రోజున భావాలు పంచుకునే స్థితికి వచ్చాయి. పెళ్లిచేశారు కాబట్టి లోకంకోసం బతుకు తున్నట్లుగా తమ బతుకులు! గతం వర్తమానంలోకి ముసురు కమ్మినట్లుగా కమ్ముకువస్తోంది. సావిత్రి తాళంచెవి కోణీలను ఆకురాయితో గీస్తుంటే సరిత పరధ్యానంగా చూస్తూ కూర్చుండిపోయింది. నిజానికి ఆ తాళం తను ఓ ఉద్దేశంతో బాగు చేయిస్తోంది. కిందటి శుక్రవారం గంగాధర్‌తో గొడవ పడినప్పుడు ఆ మధ్యాహ్నం పుట్టింటికి వెళ్లిపోవాలనుకుంది తను. బ్యాగు తీసుకుని బయటకు వచ్చి ఇంటికి తాళం వేద్దామనుకుంటే తాళం కప్ప చెడిపోయి ఉంది. ఇంటిని గాలికొదిలిపోతే ఎంత బాధ్యత లేకుండా పోయిందమ్మా అని నలుగురూ అంటారని ప్రయాణం వాయిదా వేసుకుంది.

‘‘తాళంచెవి వున్నాది కదమ్మా.. మరి కప్పెందుకు పగలగొట్టినారు..’’ ఉండబట్టలేక అడిగేసింది సావిత్రి.

‘‘అదా.. అది.. మావారు తాళం వేసి తెలిసిన వాళ్లింట్లో ఇవ్వకుండా ఆఫీసుకు పట్టుకుపోయారు. పైగా అటునుంచి అటే టూరు వెళ్లిపోయారు. ఇంకేం చేయాలి?’’ అని కొంత నిజం, కొంత అబద్ధం కలిపి చెప్పింది సరిత.

గంగాధర్‌ ‌తాళంచెవి ఆఫీసుకు పట్టుకుపోవడం వరకూ నిజమే. మిగిలింది అబద్ధం. ఇక వాస్తవంగా జరిగిందేమిటంటే, ఆరోజు ఉదయం తనకు టిఫిన్‌ ‌కింద రవ్వ ఉప్మా చెయ్యమన్నాడు గంగాధర్‌. ‌రవ్వ నిండుకుంది ఇంట్లో. పోనీ ఉల్లి, పచ్చిమిర్చి వేసి గోధుమపిండి అట్టు వేసిమన్నాడు. గోధుమపిండీ నిండుకుందని చెప్పింది. ఇంట్లో సరుకులు అయిపోతే తెచ్చుకోవడం తెలీదా అని నిలదీశాడు. సరితకు మండుకొచ్చింది. తెలియదని పెడసరంగా జవాబి చ్చింది. నిన్ను పెళ్లి చేసుకోవడం నాది బుద్ధి తక్కువ అని చెడామడా తిట్టిపోశాడు. ఇప్పుడు మట్టుకు ఏం మించిపోయింది, తనను వదిలెయ్యమని చెప్పి సంచీ తీసుకుని బయటకు వెళ్లింది సరిత. ఆమె అలా వెళ్లిన కాసేపటికి బట్టలు వేసుకుని బయటకు వెళ్లిపోయాడు గంగాధర్‌. ‌సరిత ఇంటికి తిరిగొచ్చేసరికి ఇంటికి తాళం వేసి ఉండడంతో ఆమె గంగాధర్‌కు ఫోన్‌ ‌చేసింది. పావుగంటలో వచ్చి తాళంచెవి ఇస్తాను, వేచి ఉండమని చెప్పాడు అతడు. తను అవసరం లేదని తాళం కప్ప బద్దలు కొట్టేసింది. అదీ ఆ రోజు కథా కమామీషు!

గంగాధర్‌తో సరితకు పెళ్లయి ఏడాదవుతోంది. ముచ్చటగా మూన్నెళ్లే కాపురం చేశారు. అటుపైన కలతలు ప్రారంభమయ్యాయి. ఆలూమగల మధ్య ఉండాల్సిన అనురాగం, ఆప్యాయతల కంటే వాళ్ల వాళ్ల అహాలకే ప్రాధాన్యత ఇచ్చుకుని ఒకరు నుంచి ఒకరు దూరంగా జరిగి ఎవరి గదుల్లో వాళ్లు కాపు రాలు వెలగబెడుతున్నారు. ఇప్పటికే పెద్దలు రెండు మూడుసార్లు చెప్పి చూశారు. ఫలితం కన్పించలేదు. పోనీ ఓ పిల్లాడో పిల్లో కంటేనన్నా ప్రేమలు పుటు్ట కొస్తాయని భావిస్తే సరిత తన ఒంటిపై గంగాధర్‌ని చెయ్యి వెయ్యనిస్తేగా!

‘‘ఇదుగో చూడమ్మా.. నీ పేరేటోగానీ తల్లే.. ఇదిగో.. చూడు..’’ అని సావిత్రి రెట్టించి పిలిచేసరికి సరిత ఉలిక్కిపడ్డట్టు కుర్చీలో సర్దుకుని ‘‘ఆఁ.. ఆఁ.. ఏవిటో చెప్పు..’’ అని అడిగింది.

‘‘ఇదుగో తల్లే.. తాళం కప్పకి, సెవికి వున్న అనుబంధం ఉన్నాది సూసావమ్మా.. మా గొప్ప సిత్రమైందమ్మా.. ఏ కప్పకి దాని సెవి యేరే.. ఒక కప్పకి మరో కప్ప సెవి సరిపడదు.. ఈ బంధం ఆలూమగల బంధంలాటిదమ్మా.. తాళం కప్ప భర్తయితే తాళం సెవి భార్యలాటిదటమ్మా.. నీకే బాసలో సెప్తే అర్థమవుద్దోగానీ.. ఇదుగో తాళం కప్పని తెరవడానికి సివర్లో తాళం సెవికి పెట్టిన ఈ కోణీలున్నాయి సూశావూ..’’ అని తాళం చెవి చివరి భాగాన్ని చూపిస్తూ ‘‘ఈ కోణీల మాదిరే తాళం కప్పలో కూడా కోణీలు ఉంతాయమ్మా.. మనం తాళం కప్పలో సెవి పెట్టి తిప్పినప్పుడు ఈ కోణీలు ఒకదానిలో ఒకటి కుదురుకుంతేనే తాళం కప్ప తెరుసుకుంతాది.. నేకపోతే తెరుసుకోదుగాక తెరుసుకోదు.. అలాగే ఆలూమగలూ తాళం కప్ప, దాని సెవి కోణీల లెక్కన ఒకరికొకరు కుదురుకోవాల.. నా గంటన్న ఓ మాట సెప్పీవోడమ్మా.. తలుపు కన్నా తాళం సిన్నది.. ఆ తాళం కన్నా తాళం సెవి సిన్నది.. అయినా ఆ సిన్న సెవితో పెద్ద ఇంటిని తెరిసియ్యగలమని! భార్యలో అంత శక్తున్నాదమ్మా.. ఆఁ.. మర్సిపోనాను.. ఇంకో మాట.. సంతోసం తాళం కప్పలాటిదటమ్మా.. ఆ సంతోసం తలుపులు మూసియ్యాలన్నా, తెరాలన్నా సిన్న తాళం సెవిలోనే మర్మమంతా ఉన్నాదని! భార్య ఆ మర్మమెరిగి మసలుకోవాలమ్మా.. ఈ మాటలకేంగానీ తల్లే.. లే..ఇంద తాళం..’’ అని సరిత చేతిలో పెట్టి డబ్బులు పుచ్చుకుని ‘‘తాళాలు బాగుసేత్తాం.. గొడుగులు బాగుసేత్తాం..’’ అని మరో బేరం వెతుక్కుంటూ వెళ్లిపోయింది సావిత్రి. సరిత భవిష్యత్తుపై చిగురించిన కొత్త ఆశతో తన చేతిలోని తాళం కప్పవైపు చూస్తూ ‘‘దీంతో ఇక నాకేం పని..’’ అని దానిని ఓ మూలన పెట్టేసింది.

About Author

By editor

Twitter
Instagram