తెలుగు సాహిత్య పక్రియలలో సాధారణ ప్రజలు కూడా చదివి అర్థం చేసుకోవటానికి వీలైనవి శతకాలు. లోతయిన భావాలను వాడుక భాషలోని పదాలతో చెప్పి, సామాన్య మానవుని కూడా జ్ఞానిని చేయగలిగినవి ఈ శతకాలు. ఈ శతకాల గురించి పెద్దలు ఏమన్నారో చూడండి.

‘చట్టాన్ని చెబుతుంది శాస్త్రం /హితాహితాలు చెబుతుంది ఇతిహాసం

బుద్ధులు చెబుతుంది పురాణం /సుద్దులు చెబుతుంది శతకం’ ఇదీ ప్రాముఖ్యం.

శతకమంటే?

శతకం అంటే 100 లేదా 108 పద్యాల సంకలనం. మన సంస్కృతిలో 100, 108 లకి ఉన్న ప్రాముఖ్యం చాలా ప్రత్యేకం. ఒక శతకంలోని పద్యాలన్నీ ఒకే వృత్తంలో ఉంటాయి. అన్నింటికి ఒక మకుటం ఉంటుంది. మకుటం అంటే కిరీటం కదా! కానీ ఇక్కడ సంబోధన అని అర్ధం. మకుటాన్ని బట్టి పద్యం ఏ శతకంలోనిదో తెలుస్తుంది.

శతకం-ఉపయోగం

మాటలు పలికే పిల్లలకు వీటిని నేర్పించటం వలన స్పష్టమైన ఉచ్చారణ సాధ్యమవుతుంది. మాతృభాషపై పట్టు పెరుగుతుంది. భావ వ్యక్తీకరణ తెలుస్తుంది. జ్ఞాపకశక్తీ వృద్ధి చెందుతుంది. పెద్దలకు నిత్య జీవితంలో వచ్చే చిన్న చిన్న కష్టాలను దాటే సలహాలు ఉంటాయి. ఈరోజులలో అందరూ కోచింగ్‌ ‌సెంటర్ల చుట్టూ తిరిగి నేర్చుకుంటున్న ‘వ్యక్తిత్వ వికాసం’ ఈ శతకాలలో కావలసినంత దొరకుతుంది. పిల్లలకు ఇటువంటి విలువైన తెలుగు పద్యాలు కనీసం నెలకు రెండు నేర్పితే, భవిష్యత్తులో వేరొకరి ద్వారా సామాజిక, నైతిక విలువలు నేర్చుకునే అగత్యం తప్పుతుంది. పూర్వం పాఠశాలల్లో సరళమైన శతకాలను నేర్పి, వాటిలోని చిన్నచిన్న నీతిసూత్రాలనూ, కృష్ణశతకం వంటివాటి ద్వారా శ్రీకృష్ణుని లీలలనూ, మహిమలనూ చిన్నారుల మనసులలో నాటుకునేలా చెప్పేవారు. క్రమంగా విద్యార్ధులు సాహితీ వివరణలతో కూడిన పద్యాలూ, శతకాలూ, వాటి అర్ధాలను ఆకళింపు చేసుకునే జ్ఞానం లభించేది. వేమన శతకం సులభమైన పదాలతో, పండిత పామర జనులకు సులువుగా అర్ధమయ్యేలా ఉంటుంది. ఇక సుమతీ శతకం, భాస్కర శతకం, నారాయణ శతకం, నారసింహ శతకం- అనేక శతకాలు తెలుగుభాషకు వన్నె తెచ్చాయి.

ఇవాళ వ్యక్తిత్వవికాసం గురించి పలు అపోహలు ఏర్పడ్డాయి. ప్రత్యేక శిక్షణ సంస్థలు, గ్రంథాలు అసంఖ్యాకంగా కనిపిస్తున్నాయి. వ్యక్తిత్వవికాసం అంటే పదిమందినీ మించిపోవడం కాదు. పదిమందినీ కలుపుకు పోవడం. సంభాషణా నైపుణ్యం అంటే దబాయించి వాదించడం కాదు. గుబాళించేలా మాట్లాడ గలగడం. నాయకత్వ లక్షణం అంటే పెత్తనం చలాయించడం కాదు, ప్రేమతో జయించడం. నిర్వహణా సామర్థ్యం అంటే నెత్తిమీద కత్తి పెట్టి పని చేయించడం కాదు, ఒత్తిడి లేకుండా ఒప్పించి పని చేయించడం. ఇవన్నీ ప్రాచీన సాహిత్యం లోని పద్యాల ద్వారా అత్యాధునిక విద్యార్థినీ విద్యార్థులకు మనస్సుకి పట్టేలా చెప్పవచ్చు.

పద్యం పాత పక్రియే కావచ్చు. కానీ పిల్లలకు నైతిక జీవనసూత్రాలు తెల్పటానికి, ధారణాశక్తి వృద్ధికి, భాషా సౌందర్యం తెలుసుకోటానికి పద్య సాహిత్యం ఉపయోగపడుతుంది. ఇక శతక సాహిత్యం జీవన సాన్నిహిత్యానికి ప్రతీక. ఆత్మవిశ్వాసం కోల్పోతున్న అనేక సందర్భాలలో మనలో ఆత్మవిశ్వాస బీజాల్ని నాటి వాటిని మహావృక్షాలుగా పెంచేవి శతకాలు.

శతకనీతి లోకరీతికి దర్పణం

కమలములు నీట బాసిన/కమలాప్తుని రశ్మి సోకి కమలిన భంగిన్‌

‌తమతమ నెలవులు దప్పిన/దమ మిత్రులె శత్రులగుట తథ్యము సుమతీ!

పద్మాలు తమ స్థానమైన నీటిని విడిచిపెడితే సూర్యుడి ఎండకి కమిలిపోతాయి. అదే నీటిలో ఉన్నప్పుడు ఆ సూర్యుడి ఎండకే వికసించి శోభిస్తాయి. తమతమ స్థానాలు మారితే మిత్రులు సైతం శత్రువు లవుతారు. ఈ పద్యం లోకరీతికి నిలువుటద్దం. తమతమ పరిధులలో జీవించడమే ఉత్తమ వ్యక్తిత్వం. సుమతీ శతకకారుడు బద్దెన రాసిన కొన్ని పద్యాలను వ్యక్తిత్వవికాసకోణంలో చూద్దాం.

సంభాషణా నైపుణ్యం

మనుషులకు దేవుడిచ్చిన వరం మాట. మనసులో చెలరేగే భావాలను వ్యక్తపరచేందుకు వీటిని ఉపయోగించాలి గాని భావాలను కప్పిపుచ్చుకుంటూ, ఎదుటి వ్యక్తిని తప్పుదారి పట్టించేందుకు కాదు. మాటతో ఎంత ప్రేమను పొందవచ్చో అంతే ద్వేషాన్ని కొనితెచ్చుకోవచ్చు. వ్యక్తిత్వవికాసంలో మాట అత్యంత ప్రాధాన్యం వహిస్తుంది. అందుకే సుమతీ శతకకారుడు మాట ప్రాధాన్యాన్ని ఇలా వివరించాడు.

ఇమ్ముగ జదువని నోరును/నమ్మాయని పిలిచి యన్న మడుగని నోరున్‌

‌దమ్ముల బిలువని నోరును/కుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ!

తనివితీరా చదవాలి. మొక్కుబడిగా కాదు. చిత్తశుద్ధితో మనస్ఫూర్తిగా చదవాలి. పరస్త్రీలను సైతం నోరారా అమ్మా అని పిలిచి గౌరవించాలి. తమ్ముళ్లను కూడా ప్రేమగా గౌరవంగా సంబోధిం చాలి. ఒరే అని పిలిచినా ఆత్మీయత, అభిమానాలు ఉండాలి. తల్లి ముద్దుగా పిచ్చిమొద్దు అంటే హృదయం ఉప్పొంగుతుంది. అదే బయటివాడు అంటే ఒళ్లు మండుతుంది. ఏదో మొక్కుబడిగా పలికే పదాలకు శక్తి ఉండదు. అవి మామూలు పదాల్లా మిగిలి పోతాయి. ఆ పదాల వెనుక ఉండే వ్యక్తి వ్యక్తిత్వం పదాలకు శక్తినిస్తుంది. ఎదుటివారి మనసులపై ప్రభావం చూపిస్తుంది.

మాటకు బ్రాణము సత్యము/కోటకు బ్రాణంబు సుభట కోటి ధరిత్రిన్‌

‌బోటికి బ్రాణము మానము/చీటికి బ్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!

చీటికి సంతకం, కోటకు భటులు, పడతికి మానం, మాటకు సత్యం ప్రాణం వంటివి. ధర్మ పాలనకు ఎంత ప్రాముఖ్యముందో సత్యం మాట్లాడటానికీ అంతే ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే సత్యం పలకడమే మన ధర్మం. ఎదుటివాడు మనకన్నా చిన్నవాడా పెద్దవాడా తక్కువస్థాయి వాడా అన్న దాంతో సంబంధం లేకుండా గౌరవించాలి. మనం గౌరవిస్తే మనకు గౌరవం లభిస్తుంది. అందుకే మన మాటలో మంచితనాన్ని ప్రకటించాలి. అమంగళకరమైన మాటలను కూడా మంగళప్రదంగా చెప్పాలి. వృథాగా ఒకరితో వైరం, వివాదాలు పెట్టుకోకూడదు. అనవసరమైన అహం ప్రదర్శిస్తే క్షణంలో తేలిపోయే విషయం కూడా అనవసరమైన వాగ్వివాదాలకు, మనస్తాపాలకూ దారి తీస్తుంది.

శుభముల నొందని చదువును/నభినయమును రాగరసము నందని పాటల్‌

అభిలాష లేని కూటమి/సభమెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ!

మంచిని చేకూర్చని చదువు, ఇంపును, హాయిని కలిగించని పాటలు, ఉత్సాహాన్నివ్వని కలయిక, సభాసదులు మెచ్చని మాటలు సారం లేనివి. సభ మెచ్చని మాటలు మాట్లాడేవారు ఎంత విజ్ఞాన వంతులైనా, ఎంత తెలివి గలవారైనా ప్రజల అభిమానానికి పాత్రులు కాలేరు.

శ్రవణ నైపుణ్యం

నిదానమే ప్రధానం- దేనికీ తొందర పనికిరాదు, పరిగెత్తి పాలు తాగేకంటే నిలబడి నీళ్లు తాగడం మంచిది. ఇలాంటి పెద్దల మాటలు, వారు వాడే సామెతలు, మందలింపులు, పాఠాలు, పద్యాలు అన్నీ పిల్లల వ్యక్తిత్వ వికాసానికి తోడ్పడతాయి, ఆలోచింప జేస్తాయి, నడవడిని తీర్చిదిద్దుతాయి. లిజనింగ్‌ ‌స్కిల్స్ ‌విషయానికొస్తే ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందర పడక నిజమో, అబద్ధమో తెలుసుకోవాలి. ఇది బద్దెన గారి సూక్తి. ఈ పద్యం నేటికీ వినిపిస్తుంది.

వినదగు నెవ్వరు చెప్పిన/వినినంతనె వేగపడక వివరింపతగున్‌

‌కని కల్ల నిజము తెలిసిన/మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ!

మరి ఎంత మంది ఇలా మంచి చెడ్డలు పరిశీలించి న్యాయమైన నిర్ణయాలు తీసుకొంటు న్నారు? అందుకే చాడీలు చెప్పే వారి మాటలే చెల్లుబాటు అవుతున్నాయి. నిజానిజాలు గమనించక తొందర నిర్ణయాలు తీసుకొని అపార్ధాలతో ఆవేశపడి, తర్వాత ఎంత బాధపడితే ఏమి ప్రయోజనం? చేతులు కాలాక ఆకులు పట్టుకొన్నట్లవుతుంది.

సంకల్ప బలం

తనకోపమే తన శత్రువు – ఇది నీతివచనం. జీవితానికి పనికొచ్చేమాట. అందరికీ తెలిసినదే. కానీ ఈ శత్రువును నిగ్రహించడం, జయించడం మాత్రం సాధ్యం కాని అంశంగా మిగులుతోంది. కోపం వల్ల అవతలి వారికి జరిగే ప్రమాదమేమో కానీ, ముందు కోపధారికే అది దుష్ఫలితాలనిస్తుంది. మనవల్ల కానిదేదీ లేదు. దానికి కావలసిందల్లా సంకల్పబలం ఒక్కటే.

చెడు స్నేహాలు

ఎవరితో ఎలా వ్యవహరించాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఏ విషయానికి ఎలా స్పందించాలి వంటి విషయాలు వ్యక్తిత్వవికాసంలో అత్యంత ప్రాధాన్యం వహిస్తాయి. ముఖ్యంగా చెడ్డవారి స్నేహాన్ని గుర్తించేందుకు సుమతీ శతకకారుడు మార్గం చూపిస్తున్నాడు.

ఉపమింప మొదలు తియ్యన/ కపటం బెడనెడను, జెఱకు కై వడినే పో

నెపములు వెదకును గడపట/గపటపు దుర్జాతి పొందుగదరా సుమతీ!

చెరకుగడ మొదట తియ్యగా ఉండి తరువాత తీపి తగ్గి చివరికి చప్పిడియై పోయినట్లు చెడ్డవారితో స్నేహం కూడా ఆరంభంలో బాగా ఉండి మధ్యలో వికటమై చివరికి చేటు కలిగిస్తుంది.

కొంచెపు నరు సంగతిచే/నంచితముగ కీడు వచ్చునది యెట్లన్నన్‌

‌కించిత్తు నల్లి కరచిన/మంచమునకు చేటు వచ్చు మహిలో సుమతీ!

చిన్న నల్లి కరచినా దాన్ని తొలగించే యత్నంలో భాగంగా మంచానికి కూడా దెబ్బలు తగులుతాయి. అలాగే నీచుడితో స్నేహం చేస్తే కీడు కలుగుతుంది.

తలనుండు విషము ఫణికిని/వెలయంగా తోకనుండు వృశ్చికమునకున్‌

‌తలతోక యనక యుండును/ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ!

దుష్టుడికి నిలువెల్లా విషమే. కాబట్టి స్నేహాలు చేసేటప్పుడు మంచిచెడులు విచారించి చేయాలి. తన లక్ష్యం ఏమిటి, తానేం సాధించదలచుకున్నాడు, ఈ స్నేహం వల్ల తన లక్ష్యం ఎలా నెరవేరుతుంది అన్న విషయాలు విశ్లేషించి మరీ స్నేహం చేయాలి. మన చదువుకి, ఏకాగ్రతకు భంగం కలిగించేవాడికి వీడ్కోలు చెప్పాలి.

చెడు ఆలోచనలు

మానవుడి మనసు ఒక కెమెరా లాంటిది. అనుక్షణం మన చుట్టూ జరుగుతున్న విషయాల నన్నిటిని అది గ్రహిస్తుంది. దాన్ని ఆపేసే వీలు లేదు. ఎటువంటి ఆలోచనైనా మనసుపై ప్రభావం చూపుతుంది. అందుకనే వీలైనంత వరకు చెడు ఆలోచనలు చేయకూడదని నియమం ఏర్పరిచారు. ప్రపంచంలో అతిశక్తివంతమైనది కామం. కామం లేనిదే ప్రపంచం లేదు. వ్యక్తిత్వవికాసంలో కామాన్ని అదుపులో ఉంచడం అత్యంత ప్రధాన పాత్ర వహిస్తుంది. వ్యక్తుల స్వభావాన్ని బట్టి కామాన్ని అదుపులో పెట్టుకోవాలి.

పరసతుల గోష్టి నుండిన/పురుషుడు గాంగేయుడైన భువి నింద పడున్‌

‌బరసతి సుశీలయైనను/బరు సంగతి నున్న నింద పాలగు సుమతీ!

బ్రహ్మచర్యవ్రతంలో ఉన్న భీష్ముడైనా పరకాంత లతో మాట్లాడుతూ కనిపిస్తే అపకీర్తి పాలవుతాడు. మంచి శీలవతి అయినప్పటికీ పరపురుషుడితో స్నేహంగా ఉంటే నిందలు మోయాలి. పది మంది ఓ అబద్ధాన్ని పదిసార్లు పలికితే ఆ అబద్ధమే నిజమై కూచుంటుంది. కానీ ఆధునిక సమాజంలో స్త్రీ పురుషులిరువురూ సాన్నిహిత్యంగా ఉండటం తప్పనిసరి అవుతోంది. ఇటీవల అయితే రాత్రులు కూడా కలిసి పనిచేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. పురుషులతో సన్నిహితంగా మెలగటం స్త్రీ విముక్తికి నిదర్శనం. ఈ విధానాల వల్లనే నేడు సమాజంలో కొన్ని వికృతులు జనిస్తున్నాయన్న అభిప్రాయం ఉన్నా, కాలాన్ని కూడా పరిగణనలోనికి తీసుకుని పరిధులలో ఉండాలి.

నవ్వకుమీ సభలోపల/నవ్వకుమీ తల్లిదండ్రి నాథులతోడన్‌

‌నవ్వకుమీ పరసతితో/నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!

సభలో తల్లిదండ్రులతో అధికారులతో పరస్త్రీలతో బ్రాహ్మణ శ్రేష్టులతో పరాచకాలు ఆడకూడదని తెలుసుకోవాలి.

ఆత్మాభిమానం

ఆత్మాభిమానం కలవాడు రాజులను మెప్పించి వారి వెకిలి చేష్టలను భరించడం కన్నా నీళ్లు తాగి బతకడానికి ఇష్టపడతాడు. పోతన చెప్పిన దానినే సుమతీ శతకకారుడు మరో కోణంలో చెప్పాడు.

అడిగిన జీతంబియ్యని/మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కంటెన్‌

‌వడిగల యెద్దుల గట్టుక/మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ!

అడిగిన జీతం ఇవ్వని వాడి దగ్గర పని చేయడం కన్నా వ్యవసాయం చేస్తూ బ్రతకడమే మేలు. ఇంకా అడియాస కొలువు కొలువ కూడదట. అంటే ఏ ఉద్యోగంలో అయితే వ్యక్తి ఆశలు నెరవేరవో ఆ ఉద్యోగం చేయకూడదని అర్థం.

అధరము కదిలియు కదలక/మధురములగు మాటలుడిగి మౌనవ్రతుడౌ

నధికార రోగపురిత/బధిరాంధక శవము జూడ బాపము సుమతీ!

పెదవి కదిలిందో లేదో తెలియని విధాన మంచి మాటలు మాని అధికారమనే రోగంతో మాట్లాడ కుండా దర్పంగా ఉండే అధికారి జీవచ్ఛవంతో సమానం, అటువంటి అధికారిని చూస్తేనే పాపం.

సాహితీ పక్రియల్లో కథా కథన పద్ధతి, వర్ణనలు, రసం, ఉదాత్తత తదితర లక్షణాలకే పెద్దపీట దక్కుతుంది. అవసరమైన చోట అలతి యలతిగా సామాజిక విలువల ప్రస్తావన జరుగుతుంది. కానీ శతకంలో మాత్రం నైతిక వర్తనంతో కూడిన సామాజిక విలువలే ప్రధానాంశాలు. మానవ మనస్తత్వ చిత్రణతో పాటు మనిషి మనుగడ ప్రశ్నార్థకం కాకుండా వీలైన ధర్మసూత్రాలు, సత్య వచనాలు ఇందులో కనిపిస్తాయి. మొత్తమ్మీద సమగ్ర సమాజ నైతిక విలువల పతాకలు శతకాలు.

శతకాలు సత్య సన్నిహితాలు. సమాజ ప్రతిబింబాలు. నైతిక విలువల వృద్ధికారకాలు. సామాజిక విలువలకు పట్టంకడుతూ, మనిషిని మనీషిగా నిలబెట్టగలిగిన శతకాలకు తెలుగు సాహిత్యంలో లోటులేదు. రుజువర్తనకు దూరమవుతూ, ఆర్థిక విషయలోలత్వంతో ప్రవర్తిస్తున్న నేటి సమాజానికి ఈ శతక పద్యాలే మార్గదర్శకాలు. సమాజానికీ, వ్యక్తికీ అవినాభావ సంబంధముంటుంది. ఏ వ్యక్తీ ఒంటరిగా జీవించలేడు. కొన్ని భౌగోళిక పరిసరాల మధ్య, కొన్ని సామాజిక సంస్థలను పెంపొందించుకుని, ఆర్థిక సంబంధాలతో, సంస్కృతీ సంప్రదాయాలతో, నైతిక విలువలతో మనుగడ సాగించే మానవ సమూహమే సమాజం. పటిష్టమైన సంస్కృతీ సంప్రదాయాలు, మానవీయ ఆలోచనలూ, ఆచరణాత్మక నైతిక ప్రవర్తన, ధర్మపరాయణత్వం, సత్యవాక్శుద్ధితో కూడిన సమాజమే నిజమైన సంతోషానికి నిలయమవుతుంది. కానీ, నేటి సమాజంలో ఈ విలువలతో కూడిన జీవనం లుప్తమవుతోంది. ఈ దుస్థితి నుంచి సమాజాన్ని ధర్మమార్గం వైపు నడిపించగలిగేది సాహిత్యమే. అందులోనూ ప్రజా ప్రయోజనాలకు, సామాజిక శక్తుల అభివృద్ధికి దోహదపడే ప్రజాసాహిత్యం పాత్ర అపరిమితం. ఇలాంటి ప్రజా సాహిత్యం మాత్రమే విలువైన సమాజాన్ని నిర్మిస్తుంది. అలాంటి సమాజ నిర్మాణం కోసం దేశ, కాల, భాషలతో సంబంధం లేకుండా సాహితీ వేత్తల్లో ఎక్కువ మంది తమ రచనల్లో సామాజిక విలువలకు పెద్దపీట వేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఇంట్లో తల్లులు కూడా నీతిశతకాలను చదివించేవారు. ఎందుకంటే తేట తెలుగు మాటలతో, సరళమైన అల్లికలతో మన శతకాలు వ్యక్తిత్వ వికాస అవసరాలను నిర్దేశిస్తూ వచ్చాయి. వేరే ‘వ్యక్తిత్వ వికాసాలు’ అవసరమయ్యేవి కావు. దాంతో అనేక జీవిత సత్యాలు పిల్లలకు ఈ పోటీప్రపంచంలో అడుగిడక ముందే తెలిసిపోయేవి. ఆధునిక సమాజంలో ఆనాటి శతక సాహిత్యంలోని వ్యక్తిత్వ వికాస విలువలు, సామాజిక విలువలు తప్పనిసరి అనటం అతిశయోక్తి కాదు. మానవుల్ని చూసే కోణం, స్త్రీ జాతిని చూసే కోణం, ధనాన్ని చూసే కోణం మారితే సమాజంలోని చాలా సమస్యలు దూరం అవుతాయి. చట్టాలు చేయలేని పనిని కుటుంబాలు చేయవచ్చు. కుటుంబాల్లో రాబోయే తరానికి నైతిక, సామాజిక విలువల్ని అందివ్వటంలో నాటి పద్యరత్నాలు కొన్ని చాలవా? పిల్లలు ఇవి నేర్చుకుంటే పెద్దలమయిన మనం భావితరాలకి మానవత్వ భిక్ష పెట్టినవాళ్లం అవుతాం. వెనుకటి తరాల రుణం తీర్చుకున్నవాళ్లం అవుతాం. కాబట్టి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరు శతక పఠన పక్రియని వ్యాపింపచేయాలని సవినయ మనవి. శతకాల్లోని మేలిమి ముత్యాలని ఏరి నేటి తరానికి అందివ్వాల్సిన బాధ్యత సాహితీ సంస్థల పైన, సాహితీకారుల పైన ఉంది.

– సామల కిరణ్,  ‌తెలుగు అధ్యాపకులు, సెల్‌: 9949394688

By editor

Twitter
Instagram