పాము అది పెట్టిన గుడ్లను అదే తినేస్తుంది. కొవిడ్‌ 19 ‌రెండోదశ విజృంభణ వేళ భారత దేశ విపక్షాలు ప్రదర్శించిన వైఖరి దీనినే గుర్తు చేస్తుంది. అధికారమనే ఆకలి మండిపోతుంటే, కళ్లు మూసుకుని అవి తన దేశ పౌరులనే మింగుతున్నాయి. మొదటిదశను సమర్ధంగా ఎదుర్కొన్న వ్యక్తిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఖ్యాతి రావడాన్ని జీర్ణించుకోలేని విపక్షాలు రెండోదశ కొవిడ్‌ ‌పోరాటం విజయవంతం కాకుండా అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాయి. ఇందుకోసం అన్ని విలువలను వదిలిపెడుతున్నాయి. ప్రజల ప్రాణాలతో రాజకీయ జూదం ఆడుతున్నాయి. మొదటిదశ కొవిడ్‌ ‌ముగిసిపోతుండగా వ్యాక్సిన్‌కు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసి అంత ఆర్భాటం ఎందుకు చేస్తున్నట్టు అని ప్రశ్నించిన మహా మేధావులు ఉండడం ఈ దేశ దౌర్భాగ్యం. వాళ్ల ప్రకటనలకు విపరీతమైన ప్రచారం ఇచ్చే మీడియా ఈ దేశ విషాదం. ‘భారత్‌లో తయారవుతున్న కరోనా వ్యాక్సిన్‌కు నాణ్యతా ప్రమాణాలే లేవు, ప్రజలారా! ఆ వ్యాక్సిన్‌ ‌జోలికి పోవద్దు’ అని పిలుపునిచ్చిన నేతలు మనకు దాపురించారు.

ఏప్రిల్‌, ‌మే మాసపు మండుటెండలలో  ఇప్పుడు దేశంలో వ్యాక్సిన్‌ ‌కోసం బారులు తీరుతూ, ఆపసోపాలు పడుతూ, ప్రాణభయంతో ప్రజలు పడుతున్న ఇక్కట్లు విపక్షాల విష ప్రచారం ఫలితమే. అందుకే, విపక్ష వికృత రాజకీయ క్రీడ ఈ దేశ పౌరుల జీవించే హక్కుతో ఆడుతున్న రాక్షస క్రీడ అని చెప్పడానికి సందేహించనక్కర లేదు. వారి విష ప్రచారాన్ని నమ్మి నాడు వ్యాక్సిన్‌ను  నిర్లక్ష్యం చేయడం వల్లనే ఈ దుస్థితికి చేరామన్న ఎరుక మన ప్రజలకు ఇప్పటికైనా రావాలి. ‘ఇంతమందిని అమెరికా లేదా బ్రిటన్‌ ‌కనుక ఆదుకోవలసి వస్తే, వాళ్లకి అసాధ్యం. భారత ప్రభుత్వం తన కర్తవ్యాన్ని సక్రమంగానే నిర్వర్తిస్తున్నది. ప్రభుత్వాన్ని నిందించడం చాలా సులభం. కానీ వాస్తవాలు వేరు’ అని కర్ణాటకకు చెందిన డాక్టర్‌ ‌శెట్టి ఇండియా టుడే చానల్‌ ‌ప్రముఖుడు రాజ్‌దీప్‌ ‌సర్దేశాయ్‌తో మాట్లాడుతూ అన్నారు. ఎయిమ్స్ అధిపతి డాక్టర్‌ ‌గులేరియా వంటివారు కూడా ఇలాగే అభిప్రాయపడ్డారు. కానీ, ఈ దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పతనం చేయడమే కాదు, మన ప్రజల ప్రాణాల గురించి కూడా పట్టించుకోకుండా విపక్షాలు అదే పనిగా భయాందోళనలు  సృష్టిస్తున్నాయి.

తాజా టూల్‌కిట్‌

ఇటీవలి ఐదు అసెంబ్లీ ఎన్నికలలో చిత్తుగా ఓడిపోయినా నిస్సుగ్గుగా కాంగ్రెస్‌ ఈ ‌విష ప్రచార కార్యక్రమంలో తలమునకలై ఉంది. మే 18న బయటపడిన తాజా ‘టూల్‌కిట్‌’ ఇం‌దుకు సాక్ష్యం చెబుతున్నది. ప్రధాని మోదీ మీద వీలైనంత బురద జల్లడం, కొవిడ్‌ ‌మీద పోరాటాన్ని నీరు గార్చడం ఈ టూల్‌కిట్‌ ఉద్దేశం. కుంభమేళాను సూపర్‌ ‌స్ప్రెడర్‌ అం‌టూ ప్రచారం చేయాలి, రంజాన్‌ ‌విందుల గురించి మౌనం దాల్చాలి. ఈ హెచ్చరిక కూడా ఈ కుట్రలో ఉంది. అసలు దేశంలో బీజేపీ ప్రభుత్వం, మోదీ పూర్తిగా చేతులు ఎత్తేశారని, ప్రజలను వాళ్ల చావుకు వాళ్లను వదిలిపెట్టారని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయడమే ఈ టూల్‌కిట్‌ ‌లక్ష్యం. ఇందుకు ‘మైత్రి’ ఉన్న ఆసుపత్రులను, జాతీయ, అంతర్జాతీయ జర్నలిస్టులను ఉపయోగించుకోవాలని కూడా సూచించారు. నాలుగు పేజీల టూల్‌కిట్‌ను అఖిల భారత కాంగ్రెస్‌ ‌పరిశోధక విభాగం రచించింది.

కాంగ్రెస్‌ అనుబంధ సంస్థలన్నీ తమ కార్యకలాపాలను పెంచాలని ఈ సూచన పత్రం చెబుతోంది. అది బాధితుల కోసం కాదు, మోదీకి వ్యతిరేకంగా సమాయత్తం కావాలనే. ప్రజలకు ఇప్పుడు తామే దిక్కు అన్న ఒక భ్రమను క్షణాల మీద దేశ ప్రజల అనుభవానికి తేవాలన్నది కాంగ్రెస్‌ ‌కోరిక. మొదట సామాజిక మాధ్యమంలో చురుకైన పాత్ర నిర్వహించడానికి ఒక బృందాన్ని తయారు చేయాలట. ప్రజల నుంచి వచ్చే ప్రతి విన్నపాన్ని ఇది తీసుకోవాలి. ఈ విన్నపాలను ఆలస్యం లేకుండా ‘మైత్రి’ కలిగిన జర్నలిస్టులకు, సామాజిక మాధ్యమానికి అందచేయాలి. పనిలో పనిగా పార్టీలో కీలక పదవులలో ఉన్న వాళ్లకి కూడా అందించాలి. ఎందుకు? ఇన్ని సమస్యలు ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, మేమే దిక్కు అని చెప్పడానికి. స్థానికంగా ఉండే పార్టీ నాయకుల సాయంతో మైత్రిపూర్వక ఆసుపత్రులలో పడకలు, ఇతర వైద్య సదుపాయాలను ముందే స్వాధీనంలో పెట్టుకోవాలి. అంటే బ్లాక్‌ ‌చేయాలి. వాటిని ఎవరికి కేటాయించాలంటే, ఊపిరాడటం లేదు మొర్రో అని తల్లడిల్లేవారికి మాత్రం కాదు. కాంగ్రెస్‌ ‌నాయకత్వం సిఫారసు చేసినవారికి మాత్రమే. ప్రాణాలు పోతున్నాయి, మాకు సాయం కావాలి అంటూ వచ్చే వినతులలో ఏది పడితే ఆ వినతికి యువజన కాంగ్రెస్‌ ‌స్పందించదు. వినతి వచ్చిన ప్రాంతపు యువజన కాంగ్రెస్‌ ‌ముద్ర ఉండాలి. మళ్లీ ఇందులో ప్రాధాన్య క్రమం ఉంది. మిత్రపూర్వక జర్నలిస్టులు, మీడియాలోని వారికి, ఇతర పలుకుబడి కలిగినవారికి ప్రాధాన్యం ఇస్తారు. టూల్‌కిట్‌ ఆరో విభాగంలో కాంగ్రెస్‌ ఒక వాస్తవం ఒప్పుకోక తప్పలేదు. కరోనా మీద పోరాటంలో దేశం ఇంత కకావికలమైనా మోదీ ప్రతిష్ట మసకబారలేదు. ఆ పని మన యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌సమర్ధంగా నిర్వహించాలని కూడా ఆదేశించారు. ఇందుకు కొన్ని కిటుకులు కూడా టూల్‌కిట్‌ అం‌దించింది.

సామాజిక మాధ్యమాలలో వచ్చే కొన్ని ప్రశ్నలు తీసుకుని, బీజేపీ కార్యకర్త ముసుగులో వాటి గురించి మాట్లాడాలి. అంటే వాటి పరిష్కారం పేరుతో ప్రశ్ననే పదేపదే ప్రస్తావించడం. అంతర్జాతీయ మీడియా జర్నలిస్టులు తయారు చేసిన కథనాలలో మోదీ వైఫల్య కోణం మాత్రమే తీసుకుని ప్రచారం చేయాలి. తొందరపడి మోదీ చేసిన మంచి పనులను తెలియనివ్వకూడదు. ఈ పని కోసం పత్రికలలో వ్యాసాలు రాసేవాళ్లతోను, విదేశీ జర్నలిస్టులతోను మైత్రిని పెంచుకోవాలి. ఇంకా ఏమేమి రాయవచ్చునో వాళ్లకి ఉప్పందించాలి. విదేశీ మీడియా ఇప్పటికే వెలువరించిన స్మశానాలలో దృశ్యాలు, శవాల ఫొటోలకి మరింత ప్రచారం కల్పించాలి. ఇలాంటి ఫొటోలు, వార్తలు పంపిన జర్నలిస్టులని స్థానిక యువజన కాంగ్రెస్‌ ఉచిత రీతిన సత్కరించాలి. కొత్త వేరియంట్‌ అం‌టూ ప్రస్తావన వస్తే దానిని ఇండియన్‌ ‌స్ట్రెయిన్‌ అని పిలవాలి. ఇక్కడి సామాజిక మాధ్యమాలను ఉద్ధరిస్తున్న వారికి ఇంకొక అవకాశం కూడా ఇచ్చారు. దానికి వీరు మోదీ స్ట్రెయిన్‌ అని పేరు పెట్టవచ్చునట. బీజేపీ పెద్దలకు కొన్ని విశేషణాలను కూడా పెట్టమని ఆదేశించింది టూల్‌కిట్‌. అమిత్‌షా కనపడడం లేదు, క్వారంటైన్‌లో జైశంకర్‌, ‌పక్కనపెట్టిన రాజ్‌నాథ్‌ ‌సింగ్‌, ‌స్పందన లేని నిర్మలా సీతారామన్‌- ఇలా. మైత్రిపూర్వక వార, మాస, మోస పత్రికలలో ముఖపత్ర  కథనాలు ప్రచురించే ఏర్పాటు చేయించి, అసలు భారత ప్రభుత్వమే కనిపించడం లేదు అనే సారాంశంతో వ్యాసాలను వెల్లువెత్తించాలి.

కరోనా బాధితులకు సాయం చేస్తున్న బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యకు పోటీగా బీవీ శ్రీనివాస్‌ (‌యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు)ను ఎలా పోటీగా పెట్టారో గమనిస్తే ఈ టూల్‌కిట్‌ అమలు జరుగుతున్న తీరు అర్ధమవుతుంది. ఇప్పుడు బీవీ శ్రీనివాస్‌ ‌ఢిల్లీలో కరోనా బాధితులను ఆదుకుంటున్న ఏకైక సేవకుడంటూ వీరతాళ్లు తగిలిస్తున్నారు. అతడి మీద సూపర్‌మెన్‌ ‌రూపంలో కార్టూన్లు కూడా గీయించారు. అశోక్‌ ‌పండిట్‌, ‌స్వర భాస్కర్‌ అనే బాలివుడ్‌ ‌ప్రముఖులు / టుక్డే టుక్డే గ్యాంగ్‌ ‌మద్దతుదారులు, చిదంబరం వంటి వారి చేత బీవీ శ్రీనివాస్‌ ‌సేవలను వేనోళ్ల కీర్తింప చేశారు. ఫిలిప్పీన్స్, ‌న్యూజిలాండ్‌ ‌రాయబార కార్యాలయాల వారు కూడా ఆక్సిజన్‌ ‌సిలిండర్‌ ‌కోసం తననే సంప్రదించారనీ, తానే ఆదుకున్నాననీ బీవీ పోస్టులు పెట్టాడు. అయితే ఆ రెండు దౌత్య కార్యాలయాలలో అసలు కొవిడ్‌ ‌కేసులే లేవని తరువాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌ ‌స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితి తెచ్చినందుకు ఆ రెండు దౌత్య కార్యాలయాలు  భారత ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాయి.

ఈ టూల్‌కిట్‌ అమలులో కాంగ్రెస్‌ ‌ప్రముఖులు చురుకుగానే ఉన్నారు. ఉదాహరణకి, ఆ పార్టీ అధికార ప్రతినిధి డాక్టర్‌ అజయ్‌ ‌కుమార్‌. ‌కనపడకుండా పోయిన ప్రధాని, హోంశాఖ మంత్రి, 300 మంది వరకు (బీజేపీ) ఎంపీల గురించి ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరపాలంటూ ఆయన ఒక ట్వీట్‌ ‌చేశారు. ఇలా కనపడకుండా పోయిన వాళ్ల గురించి పోలీసులు దర్యాప్తు చేయాలంటే మొదట చేపట్టవలసినది రాహుల్‌ ఆచూకీ కోసమే.

విపక్షాలా? విషనాగులా?   

 ఈ దేశంలో విపక్షాలు-కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు, తృణమూల్‌ ‌కాంగ్రెస్‌, ‌బహుజన సమాజ్‌పార్టీ, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌, ‌జార్ఖండ్‌ముక్తి మోర్చా, ఎంఐఎం (మూడునాలుగు రాజకీయ పక్షాలు తప్ప) వంటి రాజకీయ పార్టీలన్నీ వ్యాక్సిన్‌ ‌తయారీని అవహేళన చేశాయి. అది వినియోగిస్తే కొంపలు అంటుకుంటాయని ప్రచారం చేశాయి. బీజేపీ వ్యాక్సిన్‌ అని ముద్ర వేయడానికి చూశాయి. ప్రయోగాలు పూర్తి కాని వ్యాక్సిన్‌ను నేరుగా జనం మీద ప్రయోగిస్తున్నారని నీచపు మాటలు మాట్లాడాయి. ఇందుకు దొంగ మేధావులు, ఒక వర్గం మీడియా, కొందరు ప్రముఖ న్యాయవాదులు, చైనా తైనాతీలు, పాకిస్తాన్‌ ‌భక్తులు వంత పాడడం కూడా విన్నాం. ఇక అర్బన్‌ ‌నక్సల్స్ ‌సరేసరి. ఎంత తెంపరితనం కాకపోతే, మమతా బెనర్జీ అనే ‘వీధి పోరాట యోధురాలు’ ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన కొవిడ్‌ ఆన్‌లైన్‌ ‌సమావేశాలకు హాజరుకానని మొండికేశారు. ఇప్పుడు 11 మంది విపక్ష నాయకులతో కలసి కరోనా కట్టడికి ప్రధాని ఏం చేయాలో సుద్దులు చెప్పడానికి సిద్ధపడ్డారు. సెంట్రల్‌ ‌విస్టా ప్రణాళికను ఆపమనీ, ఢిల్లీలో తిష్ట వేసిన రైతులు డిమాండ్లు తీర్చమనీ కొవిడ్‌ అదుపుతో ఏమీ సంబంధం లేని తిక్క సూచనలు చేస్తూ చేవ్రాళ్లు చేసిన 12 మందిలో ఈ వీధి పోరాట యోధురాలు కూడా ఉన్నారు. అన్నట్టు ప్రధాని మన్‌ ‌కి బాత్‌ ‌వినవద్దనీ, ఆయన చేసే సూచనలు పాటించవద్దని దేశానికి పిలుపు నిచ్చిన జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి సోరెన్‌ ‌చేవ్రాలు కూడా అందులో ఉంది.

అది వ్యాక్సిన్‌ ‌కాదు సాక్షాత్తు విషమే అన్నట్టు ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ‌హిందూ వంటి పత్రికలలో వందల వ్యాసాలు వెలువడినాయి. అన్ని రకాల పత్రికలలో వందలాది వ్యంగ్య చిత్రాలు వచ్చాయి. ఎంత భయపెట్టారంటే కొవిడ్‌ ‌ఫ్రంట్‌లైన్‌ ‌వారియర్స్ ‌కూడా వ్యాక్సిన్‌ ‌వేసుకోవడానికి వెనుకడుగు వేసేశారు. ఇంతలోనే వ్యాక్సిన్‌ ఒక్కటే రక్షా కవచం అంటూ దేశీయ, అంతర్జాతీయ నిపుణులు గట్టిగా చెప్పారు. ఆలస్యంగానే అయినా విపక్షాలది దుష్ప్రచారమని తేలిపోయింది. మన కోవాక్సిన్‌ ‌గొప్పగా పనిచేస్తున్నదని ఆక్స్‌ఫర్డ్ ‌నిపుణులు కూడా ప్రశంసించారు. దాంతో వ్యాక్సిన్‌ ‌కోసం జనం పరుగులు తీశారు. ఇప్పుడు వ్యాక్సిన్‌ అం‌దుబాటులో లేదు. అందుకు కారణాలు వేరు. పైగా వ్యాక్సిన్‌ ‌సమస్యకు తోడు మెడికల్‌ ఆక్సిజన్‌, ‌బ్లాక్‌ ‌ఫంగస్‌ ‌వంటి సమస్యలు తోడైనాయి.

వ్యాక్సిన్‌ ‌మీద దుష్ప్రచారం ఎంత నీచంగా జరిగిందో సమీక్షించుకోవలసిన అవసరం ఉంది. కరోనా తరుముకొస్తున్న వేళ ప్రతి భారతీయుడు ప్రాణరక్షణ కోసం తల్లడిల్లిపోయేటట్టు చేసింది ఈ మూర్ఖుల మంద, కళ్లున్న కబోదుల గుంపు. వ్యాక్సిన్‌ ‌సిద్ధమై, జనం మధ్యకు వస్తుందని అనుకున్న జనవరిలోనే ఈ విష ప్రచారం ప్రారంభించారు. దేశ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, శాస్త్రవేత్తలను వీళ్లు ఎంత ఘోరంగా అవమానించారు. జనాన్ని భయపెట్టి వెనక్కి లాగింది ఈ దుష్ప్రచారంతోనే.

కాంగ్రెస్‌దే పైచేయి

మూడో దశ వ్యాక్సినేషన్‌ ‌ప్రారంభించాలని (మే 1) ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో ప్రజాధనమంతా వ్యాక్సిన్‌ ‌తయారీ పేరుతో ప్రైవేటు వ్యక్తులకు మోదీ ధారాదత్తం చేశారని కాంగ్రెస్‌ ‌దిగ్గజం రాహుల్‌ ‌మాట్లాడారు. కేంద్రమే ప్రజల డబ్బులు ఆ కంపెనీలకు ఇచ్చి, మళ్లీ ప్రైవేటు కంపెనీల నుంచి వ్యాక్సిన్‌ను కొనుక్కోమని ప్రజలకు చెబుతోందని వింత వాదన తీసుకువచ్చారు. అటు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న తరుణంలో ప్రభుత్వ కంపెనీలా, ప్రైవేటు కంపెనీలా అంటూ మీనమేషాలు లెక్కించడం విజ్ఞత ఉన్నవారు ఎవరైనా చేయగలరా? నిజానికి ప్రస్తుతం అత్యవసర ఔషధాల తయారీ అంతా ఎక్కడది? ప్రభుత్వం మహమ్మారిని అదుపుచేయడం లేదు కానీ, దాని గురించిన వాస్తవాలను అదుపు చేస్తున్నదని కూడా లేనిపోని అనుమానాలన• లేవనెత్తారు రాహుల్‌. ‌కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి మనీష్‌ ‌తివారీ వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమాన్నే శంకించారు. ఈ జనవరిలోనే ఆ మహా మేధావి ఇలా అన్నాడు, ‘వ్యాక్సిన్‌ ‌విశ్వసనీయత మీద అనేక ప్రశ్నలు వస్తుంటే అది తీసుకోవడానికి తనకు తానై ఎవరు వెళతారు?’ పైగా కొవిడ్‌ను అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం తన నిరంకుశ అజెండాను అమలు చేయడానికి చూస్తోందని భాష్యం కూడా వెలిగించారు. రాజీవ్‌ ‌బజాజ్‌ అని ఒక వ్యాపారవేత్త ఉన్నాడు. కాంగ్రెస్‌ ‌భక్తుడు. దానికేమీ అభ్యంతరం లేదు. కానీ ఈయన ఎన్‌డీటీవీ నిర్వహించిన ఒక చర్చలో హఠాత్తుగా వైద్యుడి అవతారం ఎత్తాడు.‘ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉంటే కనుక కరోనా వ్యాక్సిన్‌ ‌తీసుకోవడం ప్రమాదం’ అని తెలివి ప్రదర్శించాడు. అర్బన్‌ ‌నక్సల్స్‌కు ఆవాసమైన ఎన్‌డీటీవీకి ఇలాంటి వ్యాఖ్యలు నచ్చుతాయి. వ్యాక్సిన్‌ ‌మీద ఎంత వీలైతే అంత విషం చిమ్మడమే కదా కావాల్సింది! ఇలాంటి ప్రసారాలన్నీ చేసి కూడా, ఈ చానల్‌ ఎడిటర్‌ ‌ప్రణయ్‌ ‌రాయ్‌ ‌మే 13న, ‘ప్రపంచం మొత్తం నుంచి వ్యాక్సిన్‌ ‌కొనుగోలు చేసి వెంటనే దేశ ప్రజలకు ఇవ్వాలి’ అని కేంద్రానికి సూచించారు.

‘కోవాక్సిన్‌ ‌మూడో దశ ప్రయోగాలు పూర్తి కాలేదు. ఇంతలోనే దానిని అనుమతించడం తొందరపాటే కాదు, ప్రమాదం కూడా. అయ్యా, డాక్టర్‌ ‌హర్షవర్ధన్‌ ‌గారు (కేంద్ర ఆరోగ్య మంత్రి), ఈ విషయంలో స్పష్టత ఇవ్వండి. మూడు దశల పరీక్షలు పూర్తయ్యే వరకు దీని వినియోగం ఆపాలి. అంతదాకా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ను అనుమతించవచ్చు’ అని సలహా ఇచ్చిన వారు కాంగ్రెస్‌ ఎం‌పి, మాజీ కేంద్ర మంత్రి శశిథరూర్‌. ‌టీఎస్‌ ‌సింగ్‌దేవ్‌ అని చత్తీస్‌గఢ్‌ ఆరోగ్యశాఖ మంత్రి. ఈయన ఇంకా చాలా ముందుకు పోయారు. ‘వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమంలో కోవాక్సిన్‌ ఉపయోగించడానికి మా రాష్ట్రంలో అనుమతించబోం. ఇందుకు పెద్దకారణం ఏమీ లేదు. ఒక వ్యాక్సిన్‌ ‌పూర్తి పరీక్షలు జరుపుకోకుండా ఎలా అనుమతించగలం?’ అని అన్నారాయన. ‘కోవాక్సిన్‌ ‌సామర్ధ్యం మీద అనేక ప్రశ్నలు ఉన్నాయి. సందేహాలు ఉన్నాయి. ఈ ప్రధాని, ఆయన ఆరోగ్యమంత్రి, ఇతర మంత్రి వర్గ సభ్యులు ఎందుకు వ్యాక్సిన్‌ ‌తీసుకోవడం లేదు?’ అని వాగారు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ ‌సూర్జేవాల్‌.

వ్యాక్సిన్‌కి అన్ని వేల కోట్లు ఎందుకు?

ప్రశాంత భూషణ్‌ అనే పేరు మోసిన న్యాయవాది గురించి వినే ఉంటారు. ఈయనకి అర్బన్‌ ‌నక్సల్స్ ‌కేసులు వాదించడం అంటే మహా ఇష్టం. సుప్రీం కోర్టు మీద నిందలు వేయడం వెన్నతో పెట్టిన విద్య. టుక్డె టుక్డె మూకలంటే ముద్దు. ఒక సందర్భంలో ఈయన సుప్రీంకోర్టు చేత మొట్టికాయలు తిన్నవాడు. అక్కడే వాదిస్తారు. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ (‌ప్రవేటు సంస్థ) నుంచి కోవిషీల్డ్ ‌రావడం గురించి పెదవి విరిచారు. అసలు భారత్‌లో సహజంగా కనుమరుగవుతున్న కొవిడ్‌ ‌కోసం ఇప్పుడు రూ. 35,000 కోట్లు కేటాయించి ఆర్భాటం చేయవలసిన అవసరం ఏమిటి? అన్నాడీయన. వ్యాక్సిన్‌ ‌తయారీలో పారదర్శకత లేదు, ప్రజలకి ఏ విషయమూ తెలియడం లేదు అని కూడా తన అజ్ఞానాన్ని ప్రదర్శించుకున్నారు. కొవిడ్‌ ‌సహజ రీతిలోనే తగ్గిపోతూ ఉంటే, ప్రజల సొమ్ముని పట్టుకెళ్లి ప్రైవేటు కంపెనీకి ధారపోస్తున్నారు (ఫిబ్రవరి 1) అని కూడా అన్నారీ సుప్రీంకోర్టు న్యాయవాది. ఇదే రాహుల్‌ ‌గాంధీకి ప్రేరణ ఇచ్చిందేమో!

‘అమ్మో, బీజేపీ వ్యాక్సిన్‌!’

‘ఇది బీజేపీ వ్యాక్సిన్‌. ‌దీనిని నేను నమ్మను. నేను వేయించుకోను’ అని ఈ సంవత్సరం జనవరిలో సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు, ఉత్తరప్రదేశ్‌ ‌మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌పరమ నీచమైన ప్రకటన చేశారు. ఇలా దేశం అత్యవసరంగా ఎదురుచూస్తున్న ఒక శాస్త్ర పరిశోధన ఫలితాన్ని రాజకీయాలలోకి లాగారు యాదవ్‌. ఆ ‌వ్యాక్సిన్‌ ‌బీజేపీయేతరులకు ప్రమాదం అన్న రీతిలో ఆయన నీచాతినీచంగా ప్రచారం చేశారు. ఎలాగంటే, ‘నేను ఇప్పుడు వ్యాక్సిన్‌ ‌వేయించుకోవడం లేదు. బీజేపీ వాళ్ల వ్యాక్సిన్‌ను నేను ఎలా నమ్మగలను? వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత మన ప్రభుత్వం ఏర్పడినాక ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సిన్‌ ‌వేయిస్తాం. మనం బీజేపీ వ్యాక్సిన్‌ను నమ్మలేం’ అన్నారు. అలా ఒక కలవరాన్ని సమాజంలో సృష్టించారు. వ్యాక్సిన్‌కూ, ఎన్నికలకూ ముడి పెట్టారు. మళ్లీ ఎన్నికలు జరిగే దాకా జనం అఖిలేశ్‌ ‌యాదవ్‌ ‌మాట మీద వ్యాక్సిన్‌ ‌వేయించుకోకుండా, ప్రాణాలు వదులుకోవలసిందేనా? పరమ అసహ్యంగా కొద్దిరోజులకే అఖిలేశ్‌ ‌మాట మార్చారు. వ్యాక్సిన్‌ అం‌దించడం అనేది చాలా సున్నితమైన అంశం. ప్రభుత్వం ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసిన మీదటే వ్యాక్సినేషన్‌ ‌పక్రియ ఆరంభించాలి అంటూ ఉచిత సలహా పడేసి చేతులు దులుపుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధినేత వ్యాక్సిన్‌ను నమ్మవద్దు అన్నాడు. మరి ఆయన అనుచరులు అక్కడితో ఆగితే ఎలా? అశుతోష్‌ ‌సిన్హా అనే ఆ పార్టీ ఎంఎల్‌సీ కాస్త ముందుకు వెళ్లి, ‘ఆ వ్యాక్సిన్‌లో ఏదో ఉందని నా అనుమానం. ఆ ఉన్నది మాత్రం ప్రమాదకరం. దాంతో మీరు నపుంసకులైపోవచ్చు. ఇంకేమైనా కూడా సంభవించవచ్చు’ అని చెప్పాడు. ఇందుకు ఆధారాలు ఏమిటో చూపించలేదు. అసలు అప్పటికి ఎవరికీ వ్యాక్సిన్‌ ‌వేయనేలేదు.

రైతులకు సోకదు కానీ…

వ్యాక్సిన్‌ ‌మీద జాలువారిన ఇంకొన్ని వ్యతిరేక వ్యాఖ్యలు చూద్దాం. ఏప్రిల్‌ 16, 2021‌న కాంగ్రెస్‌ అనుకూల పత్రికా రచయిత సుమంత్‌ ‌సి రామన్‌ ‌నటుడు వివేక్‌ ఒబరాయ్‌ ‌వ్యాక్సిన్‌ ‌తీసుకున్న వార్త మీద, ‘నాకు గుర్తున్నంత వరకు నటుడు వివేక్‌ ‌నిన్న వ్యాక్సిన్‌ ‌తీసుకున్నారు. అతడి వ్యాధికీ, ఈ వ్యాక్సిన్‌కీ ఉన్న సంబంధం గురించి ఇప్పుడే చెప్పడం తొందరపాటు’ అని ట్వీట్‌ ‌చేశారు. స్వాతీ చతుర్వేది అని స్వయం ప్రకటిత పత్రికా రచయిత్రి ఒకరు ఉన్నారు. ఈమె, ‘నాకు భారత్‌ ‌బయోటెక్‌ ‌మీద కాస్త కూడా నమ్మకం లేదు. నేను కోవాక్సిన్‌ ‌తీసుకోనంటే తీసుకోను’ అని ట్వీట్‌ ‌చేశారు. ఢిల్లీ  సరిహద్దులలో తిష్ట వేసిన రైతు నాయకుడు జోగిందర్‌ ఎస్‌ ఉ‌గ్రహాన్‌ (‌బీకేయు, ఉగ్రహాన్‌ ఏక్తా) ఒక ట్వీట్‌లో ఇలా వాక్రుచ్చాడు, ‘నాకు వ్యాక్సిన్‌ అవసరమే లేదు. మేమే కరోనాని చంపేశాం. రైతుల రోగ నిరోధక శక్తి ఘనమైనది. ఎందుకంటే వాళ్లు వాళ్ల పొల్లాలో కష్టించి పనిచేస్తారు. రైతులు కరోనాకు భయపడరు.’ కష్టించే వారికీ, అందునా నిజమైన రైతులకు కరోనా రాదంటే నమ్మవచ్చు. కానీ అక్కడ తిష్ట వేసిన వారు రైతులు కాదని కదా! అందుకే ఆ శిబిరాలలో కరోనా చొరబడింది. ఉగ్రహాన్‌ ‌సిద్ధాంతం ప్రకారమే వాళ్లు రైతులు కాదని తేలిపోయింది.

అందరికీ వ్యాక్సిన్‌ ‌ప్రమాదమట

 శేఖర్‌ ‌గుప్తా అనే ఘన జర్నలిస్ట్ ‌వెబ్‌సైట్‌ ‌ది ప్రింట్‌లో ఒక వ్యాఖ్య (సంజీవ్‌ అగర్వాల్‌, ‌జయ్‌ ‌భట్టాచార్య అనేవాళ్లది), ‘భారతీయులలో అత్యధికులకి రోగ నిరోధక శక్తి ఉంటుంది. కాబట్టి మొత్తం అందరికీ వ్యాక్సిన్‌ అం‌దించడమనేది పెద్ద విపత్తుకు దారితీస్తుంది.’ ఆహా! సతీశ్‌ ఆచార్య అనే ఒక కార్టూనిస్ట్ ‌వ్యాక్సిన్‌ ‌మీద జబ్బ బలం కొద్దీ ఎడాపెడా కార్టూన్లు గీశారు. కానీ జనవరి 16నే, అంటే తొలి వరసలోనే నిలబడి వ్యాక్సిన్‌ ‌తీసుకున్నారు. ఆ సంగతి జాతి జనులకు  ట్వీట్‌ ‌ద్వారా తెలియచేశాడు. సూది వేయించుకుంటున్న ఫోటో కూడా జత చేశాడు. దీని మీద మైఖేల్‌ ‌ఫెర్నాండెజ్‌ అనే నెటిజన్‌ ‌పెట్టిన వ్యాఖ్య ఆ ఆచార్యకి చెంపపెట్టు. ఇదీ మైఖేల్‌ ‌చురక, ‘సతీశ్‌ ఆచార్య, ఇలాంటి ఇతరుల చేతికి నెత్తురు అంటింది. వ్యాక్సిన్‌కు అర్హత ఉండి కూడా అమాయక కరోనా బాధితులు అందుకు నోచుకోలేక పోయారంటే, ఇలాంటి వాళ్లు పెడదారి పట్టించడం వల్లనే’. ఇది వాస్తవం కాదా!

 పందిమాంసం గొడవ

ఇంక, కొందరు ఇస్లామిక్‌ ‌పండితుల ధోరణి మరీ వికృతం. జనవరి 31న వాళ్ల అజ్ఞానం మరోసారి బయటపడింది. ‘ముస్లిములెవ్వరు కొవిడ్‌ ‌వ్యాక్సిన్‌ ‌తీసుకోరాదు. అందులో పందిమాంసం కలిసే అవకాశం ఉంది’ అని ఒక మౌల్వీ ప్రచారం చేశారు. వ్యాక్సిన్‌ను హలాల్‌ ‌చేయకుండానే పంపిస్తారంటూ సామాజిక మాధ్యమాలలో చర్చలు చేశారు. ప్రతి ఉత్పత్తిని హలాల్‌ ‌చేయవలసిందేనని ఇప్పుడు పెద్ద ఉద్యమం నడుస్తోంది. హలాల్‌ ‌చేసిందే ముస్లింలు తీసుకోవాలని హఠం చేస్తారు. నిజానికి దేశంలో తయారైన రెండు వ్యాక్సిన్‌లలోను పందుల ప్రమేయమేమీ లేదు. కానీ సరిగ్గా పందినే ఎందుకు ఎంపిక చేసుకున్నారంటే, అది సాధారణ ముస్లింను వెంటనే ప్రభుత్వానికి వ్యతిరేకిగా నిలబెట్టగలుగు తుంది. జనవరి 4న మరొక మౌల్వీ చేసిన చిత్రమైన ప్రబోధం ఇది, ‘వ్యాక్సిన్‌లో ఒక మైక్రోచిప్‌ ఉం‌టుంది. అది మనిషి బుర్రని క్రమబద్ధం చేస్తుంది’ (ఈ విషయాలన్నీ బీబీసీ నమోదు చేసింది). అంటే ఇప్పుడు వ్యాక్సిన్‌ ‌తీసుకుంటే ఇక జీవితాంతం ఎవరైనా బీజేపీ మాట వినాల్సిందేనన్నది ఆ మౌల్వీ భాష్యం. ఏదైనా కావచ్చు, అసలు వ్యాక్సినేషన్‌ అం‌టేనే వ్యతిరేకించే క్రైస్తవ ప్రచారకులు ప్రపంచ దేశాలతో పాటు ఇక్కడ కూడా ఉన్నారు. వారు ఏ వ్యాక్సినేషన్‌ను సమర్ధించరు- పోలియో, మీజిల్స్, ఇప్పుడు కరోనా వ్యాక్సిన్‌.

‌చైనా పత్రికల దుష్ప్రచారం

ప్రధాని నరేంద్ర మోదీ ఆరంభించిన వ్యాక్సిన్‌ ‌దౌత్యం దక్షిణ ఆసియాలో చైనాను వెనక్కి నెట్టింది. దీనితో చైనా ప్రభుత్వ వార్తాపత్రిక గ్లోబల్‌ ‌టైమ్స్ ‌వ్యాక్సిన్‌ ‌విషయంలో భారత్‌ ‌చేస్తున్న ప్రయత్నాల మీద బురద చల్లడం ఆరంభించింది. ఈ జనవరిలోనే భారత్‌ ‌సీరమ్‌ ‌దేశీయంగా తయారు చేసిన కోవీషిల్డ్ ‌వ్యాక్సిన్‌ను సార్క్ ‌దేశాలకు బహుమానంగా పంపింది. దీనికి వ్యాక్సిన్‌ ‌మైత్రి అని పేరు. ఈ సమయంలోనే గ్లోబల్‌ ‌టైమ్స్ ‌దుష్ప్రచారం ఆరంభించింది. అసలు భారత్‌కు వ్యాక్సిన్‌ను తయారు చేసే సామర్ధ్యం ఉన్నదా అంటు ప్రశ్నించింది. సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌లో జరిగిన అగ్ని ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వ్యాఖ్య చేసింది. ఆఖరికి చైనాలో ఉంటున్న భారతీయులు కూడా చైనా వ్యాక్సిన్‌ ‌తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారని కూడా చెప్పుకుంది. ఎంతమందికి తెలుసో గానీ, భారత్‌లో అఖిల భారత డ్రగ్‌ ‌యాక్షన్‌ ‌నెట్వర్క్ అనే రోగుల హక్కుల సంఘం ఉందట. కోవిషీల్డ్ (‌సీరమ్‌ ఉత్పత్తి) అసలు ప్రయోగాలు పూర్తి కాకుండానే హడావుడిగా బయటకు వస్తోందని ఆ సంఘం ఆరోపించినట్టు బీబీసీ ఉటంకించిందట. దానినే గ్లోబల్‌ ‌టైమ్స్ ‌తన విష ప్రచారానికి ఆధారంగా చూపింది. సీరమ్‌లో సంభవించిన ఆ అగ్ని ప్రమాదం కారణంగా ఆ సంస్థ ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్‌ ‌మీద భారతీయులకు గురి ఉండకపోవచ్చునని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక నెటిజన్‌ ‌పేర్కొన్నట్టు గ్లోబల్‌ ‌టైమ్స్ ‌కథనం అల్లింది. కొన్ని పాశ్చాత్య దేశాల పత్రికలు కూడా ఈ బాటలోనే ఉన్నాయి.

 వాస్తవం ఏమిటంటే, చైనా వ్యాక్సిన్‌ను వినియోగించడానికి ఆ దక్షిణాసియా దేశాల• అర్రులు చాచడం లేదు. చైనా ఆర్థికంగా, దౌత్యపరంగా విస్తరిస్తున్న దేశాలే అవన్నీ. చిత్రంగా నేపాల్‌లో చైనా వ్యాక్సిన్‌ ఉపయోగించడానికి ఆ దేశ ఔషధ నియంత్రణ శాఖ వెంటనే అనుమతించలేదు. అసలు కొవిడ్‌ ‌కట్టడికి వ్యాక్సిన్‌ ‌పంపుతామని చైనా నుంచి సమాచారం రాలేదని నాడే మాల్దీవులు కూడా ప్రకటించింది. చైనా నుంచి మాకు పది లక్షల డోసులు వస్తున్నప్పటికీ మీ దేశం నుంచి కూడా వ్యాక్సిన్‌ ‌కావాలని కంబోడియా భారత్‌ను కోరింది. తమ వ్యాక్సిన్‌ అభివృద్ధిలో ఆర్థికసాయం చేయడానికి నిరాకరించినందుకు గాను  బంగ్లాకు చైనా వాటి సరఫరా నిలిపి వేసింది. ఈ సంగతి అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ ‌వెల్లడించింది. కొందరు భారతీయ హోటల్‌ ‌కార్మికులు తమకు చైనా వ్యాక్సిన్‌ ‌మీదనే నమ్మకం ఉంది కాబట్టి, అదే తీసుకుంటామని చెప్పినట్టు వార్తలు వచ్చాయని గ్లోబల్‌ ‌టైమ్స్ ‌చెప్పుకుంది. అసలు భారత్‌లో హెల్త్ ‌కేర్‌ ‌యోధులే కోవాక్సిన్‌ ‌తీసుకోవడానికి వెనుకాడుతున్నారంటూ ఇక్కడి మీడియాలో వచ్చిన కథనాలను కూడా అది ఉటంకించింది (టైమ్స్ ఆఫ్‌ ఇం‌డియా, జనవరి 25). ఇదంతా మన దొంగ మీడియా నిర్వాకమేనని తెలియడం లేదా!

ఈ విపక్షాలు మోదీని అపఖ్యాతి పాల్జేయడానికి అన్ని విలువలకు నీళ్లొదులుతున్నాయి. శాస్త్రీయ దృక్పథాన్ని కాలదన్నుతున్నాయి. ఘోరమైన అంటు మహమ్మారి నేపథ్యంలో అబద్ధాలు ప్రచారం చేస్తూ సామాజిక బాధ్యతకు, నైతిక బాధ్యతకు నిస్సిగ్గుగా వీడ్కోలు చెప్పాయి. ధైర్యం, ప్రజాబలం ఉంటే మోదీని ఎన్నికలలో ఓడించవచ్చు. అంతేకానీ, మోదీ మీద నమ్మకం పెట్టుకున్నారన్న ఒకే ఒక్క కారణంతో ప్రజలను కరోనా కోరలకు అప్పగించే దుష్ట పన్నాగాలు పన్నడం ప్రజాద్రోహం. ప్రజావంచన.

——————-

టాయ్‌లెట్‌ ‌గొట్టం

నరేంద్ర మోదీ మీద, ఆయన ప్రభుత్వం మీద ద్వేషం రేకెత్తించడానికి కొన్ని జాతీయ చానెళ్లు పోటీ పడి మరీ శ్రమిస్తున్నాయి. అందులో ఎన్‌డీటీవీ ఒకటని ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. కానీ వాస్తవాలు మాట్లాడగలిగిన వాళ్లు ఇప్పటికీ చాలామంది ఉన్నారు. ఆ టీవీ విలేకరి ఒక ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చాడు. గొట్టం అక్కడి డాక్టర్‌ ‌నోటి దగ్గర పెట్టి అడిగాడు.

టీవీ: ఈ కొవిడ్‌ 19 ‌వేళ మంచాల్లేవు. ఆక్సిజన్‌ ‌లేదు. వెంటిలేటర్లు లేవు. ఇదంతా ప్రభుత్వ వైఫల్యమని మీరు చెబుతారా?

డాక్టర్‌: ‌మీ ఇంట్లో పదిమంది ఉన్నారని అనుకుందాం! వీళ్లందరికీ ఒకేసారి విరేచనాలు పట్టుకున్నాయని అనుకోండి!  ఇల్లు కట్టినప్పుడు పది టాయ్‌లెట్లు కట్టాలని ఆ మేస్త్రీ ఎందుకు అనుకోలేదని మీరు ఇప్పుడు తిడతారా?

టీవీ గొట్టం అక్కడ నుంచి మాయం.

About Author

By editor

Twitter
Instagram