– వి. రాజారామమోహనరావు

అరవై ఏడేళ్ల క్రితం… అప్పుడు నాకు ఏడేళ్లు. మేం తాడేపల్లి గూడెంలో ఉండేవాళ్లం. తాలూకా ప్రధాన కేంద్రమే అయినా పెద్ద పల్లెటూరులా ఉండేది అప్పుడు తాడేపల్లి గూడెం. ఏడేళ్ల ఆ వయసులో, చుట్టుపక్కల విషయాలు నా మనసు మీద లీలగా ముద్రపడుతున్న రోజులు.

తాతయ్య తెలుగు మాస్టారుగా రిటైర్‌ అయ్యారు. అయినా, చుట్టుపక్కల పిల్లలకి మా ఇంటి అరుగు మీద చదువు చెపుతూ ఉండేవారు. పెద్ద మామయ్యకి నాటకాల పిచ్చి. రేలంగి వెంకట్రామయ్య బృందంతో నాటకాలు వేస్తూ తిరుగుతుండేవాడు. చిన్న మామయ్య స్కూలు ఫైనల్‌ ‌చదువుతున్నాడు. నాన్నగారు లేరు. అక్కయ్య, నేనూ పిల్లలం. ఇంతటి సంసారాన్ని పోషించటానికి అమ్మ చుట్టుపక్కల ఊళ్లు తిరుగుతూ సంగీత పాఠాలు చెపుతుండేది. అవకాశం వచ్చినప్పుడు సంగీత కచేరీలు చేసేది. పెద్ద సంసారం, తక్కువ ఆదాయం. ఇంట్లో డబ్బుకి ఇబ్బందిగా ఉండేది.

మేం ఉండే ఆ చిన్న వీధి రెండువేపులా ఉన్న ఇళ్లల్లో చాలావరకు మా అమ్మమ్మ పుట్టింటి వేపు బంధువులే. పొయ్యి మీద ఎసరు పెట్టి, బియ్యం బదులుకోసం ఆ ఇళ్లకి అమ్మమ్మ వెళ్లటం నాకు బాగా గుర్తు. కూడా నేనూ వెళ్లేవాడిని. బియ్యం ఇవ్వటం పెద్ద విషయం కాని రోజులవి. అందరివీ కొద్దో గొప్పో పొలంకానీ, పాడికానీ ఉన్న సంసారాలే. ఎక్కడో మాలాంటి బీద కుటుంబాలు తప్ప, పస్తులుండే పరిస్థితి కాదు కానీ, పరువుగా బతకటానికి ఎంతో కష్టపడాల్సిన రోజులు. ఆ కష్టాలన్నీ ఇంటిపట్టున అమ్మమ్మ, ఇంటి బయట అమ్మా పడేవారు. వీధి చివరి చిల్లర కొట్టు నుంచి సరుకులు అప్పు తెచ్చేవారు. చేతికి డబ్బు అందగానే తీర్చేవారు. అన్నీ చాలావరకు మా వీధిలోనే దొరికేవి, ఒక్క మంచి నూనె తప్ప. సరుకుల కొట్టులో నూనె ఉండేది కాదు. నెల మొదటివారంలో తెలకల అప్పన్న నూనె కావిడితో వచ్చేవాడు. అందరూ నూనె అప్పన్న దగ్గరే కొనుక్కునే వారు. వేరుశెనగ నూనె వంటలకి, నువ్వుల నూనె ఊరగాయలకి. నూనె అమ్మటం, ఎవరి దగ్గరైనా బదులు తెచ్చుకోటం అంత మంచిది కాదన్న నమ్మకం ఆ రోజుల్లో చాలా మందికి ఉండేది. తెలకలవాళ్లే నూనె వ్యాపారం చేసేవారు. మాకూ అప్పన్నే నూనె పోసేవాడు. వృత్తి వ్యవస్థ బలంగా ఉన్న కాలం. కిందటి నెల బాకీ కట్టి, ఈ నెల నూనె అప్పుగా పోయించుకునేవాళ్లం. ఆ ఖాతా అలా నడుస్తూ ఉండేది. చేతిలో డబ్బులేక, ఒక్కో నెల కట్టలేక పోయినా అప్పన్న ఏం అనవాడే కాదు. ఖాతాలో రాసుకునేవాడు.

రోజులు గడిచిపోయాయి. బలవంతంగా మా వాళ్లు గడుపుకు వచ్చారు అనటం సబబు. కొన్నేళ్లు దాటిపోయాయి. పెద్ద మామయ్య తన తిరుగుడు, తాగుడు వల్ల ఆరోగ్యం పాడై చచ్చిపోయాడు. స్కూలు ఫైనల్‌ అవగానే చిన్న మామయ్యకి వ్యవసాయశాఖలో ఉద్యోగం వచ్చింది. కానీ ఆ ఉద్యోగం నైజాం ప్రాంతంలో. అందుకని బాన్సువాడ దగ్గరి కోటగిరి వెళ్లిపోయాడు. చిన్న మామయ్యని అంత దూరం పంపటం, పెద్ద మామయ్య కర్మకాండల ఖర్చుల వల్ల అసలే అప్పుల్లో ఉన్న మా వాళ్ల సంసారం మరింతగా అప్పుల్లో మునిగిపోయింది. ఇల్లు గడవని పరిస్థితి వచ్చింది. చిన్న మామయ్య అమ్మమ్మని, తాతయ్యని నైజాం తీసుకెళ్లిపోయాడు. అక్కయ్యకి బాల్య వివాహం చేసేసి కాపురానికి పంపించేశారు.

ఎవరో తెలిసినవాళ్లు సాయం చేస్తామంటే, అమ్మ నన్ను తీసుకుని ఏలూరు మకాం మార్చేసింది. పారిపోవటంకాదు గానీ ఎవరికీ చెప్పకుండా తాడేపల్లి గూడెం వదిలి వెళ్లిపోయాం. ఏలూరు చేరాక, ఓ చిన్న గదిలో అమ్మా, నేను నివాసం. ఎన్ని తంటాలు పడిందో, నన్ను అమ్మ స్కూల్లో చేర్చింది. సంగీత పాఠాలు, మిషన్‌ ‌కుట్టటం… ఇలా అమ్మ రకరకాల యాతనలు పడింది. పదిహేనేళ్లు గడిచాయి. నాకు సెంట్రల్‌ ‌గవర్నమెంట్‌ ఉద్యోగం వచ్చింది. అప్పుడు అమ్మ తేలిగ్గా ఊపిరి తీసుకుంది.

చిన్న మామయ్య దగ్గరే, ఆ ఊరుకాని ఊరిలో తాతయ్య చనిపోయారు. మామయ్యకి పెళ్లయింది. నలుగురు ఆడపిల్లల సంసారం. ఆయన ఆర్థిక ఇబ్బందులు ఆయనవి. మాకు ఏనాడూ ఓ రూపాయి సాయం చెయ్యలేకపోయాడు. అమ్మమ్మ కొన్నాళ్లు మా దగ్గర, కొన్నాళ్లు మామయ్య దగ్గర ఉంటోంది.

ఇంచుమించు రెండు దశాబ్దాల ఓ దిగువ మధ్య తరగతి చరిత్ర ఇది. చెప్పటం కొద్ది మాటల్లోనే అయినా, ఎన్ని రకాల అనుభవాలో, ఎంతటి దిగులో. ఎందరికో ఉన్నట్టు, మాకు అండగా, నీడగా నిలిచేవాళ్లు ఎందుకు లేరు. ఇన్ని రకాల డబ్బు ఇబ్బందులేమిటి? అమ్మకి ఇంత శ్రమ ఏమిటి? ఇలా అన్నీ ప్రశ్నలే.

అదృష్టం ఏమిటంటే, ఏలూరులో మా చుట్టూ ఏర్పడిన వాతావరణం చాలా చక్కటిది. ఔదార్యం చూపించే ఇరుగు పొరుగు నాకు మంచి స్నేహితులు. ప్రాణం పెట్టేవారు. దీనివల్ల మాకు బంధువులు లేని లోటు తెలియలేదు. మధ్య తరగతి మంచితనాల్లో తోటివాళ్ల మంచి చెడ్డలు పట్టించుకోవటం ఒకటి. నలుగురూ కలిసి హాయిగా ఉండాలనుకునే సమిష్టి తత్వం, అది నాకూ, అమ్మకీ తృప్తినిచ్చింది.

జీతం అంతా అమ్మ చేతికే ఇచ్చేవాడిని. డబ్బు కష్టాలు బాగా తెలిసినందువల్ల, చాలా పొదుపుగా ఇల్లు గడిపేది. ఇంట్లో కొన్ని వస్తువుల అవసరం ఉన్నా, కొనకుండా అమ్మ వాయిదా వేస్తూనే వచ్చింది. ఆరునెలలు గడిచాయి. ‘‘నువ్వోసారి తాడేపల్లి గూడెం వెళ్లిరావాలిరా’’ అంది అమ్మ.

‘‘ఎందుకు?’’ అనడిగాను.

‘‘అప్పుడు తప్పనిసరై గూడెంలో అప్పులు తీర్చకుండా వచ్చేశాం. ఈ ఆరు నెలల్లో చాలా బాకీలు తీర్చేశాను. మనం అద్దెకి ఉన్న శంకరం బాబాయి గారికి ప్రతి నెలా మనియార్డరు ద్వారా డబ్బు పంపాను. అందుకే ఇంట్లోకి ఒక్క వస్తువు కూడా కొనలేదు. శంకరంగారు ఓపిగ్గా బాకీలన్నీ కట్టేశారు. ఒక్క తెలకల అప్పన్న బాకీ ఉండిపోయింది. అది కూడా తీర్చేస్తే రుణవిముక్తులమవుతాం. అప్పన్న కావిడి ఇప్పుడు రావటం లేదట. అందుకని నువ్వే వెళ్లి అప్పన్న ఆచూకీ తెలుసుకుని, ఆ బాకీ తీర్చేసి రావాలి’’ అంది అమ్మ. గుర్తుపెట్టుకుని అమ్మ పాత బాకీలు తీర్చటం నాకు ఎంతో బాగా అనిపించింది.

అప్పన్నకి మేము ఇవ్వవలసిన బాకీ పద్దెనిమిది రూపాయలు. ఇన్నేళ్లు గడిచిపోయాయి కాబట్టి, వడ్డీతో కలిపి ఓ యాభై రూపాయలు ఇచ్చి రమ్మంది అమ్మ.

ఓ ఆదివారం పొద్దున్నే తాడేపల్లి గూడెం బయల్దేరాను. మేం అప్పుడున్న వీధికే ముందుగా వెళ్లాను. కొన్ని పాత ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు వచ్చాయి, అంతకు మించిన మార్పేం లేదు. అప్పన్న రావటం మానేసి చాలా రోజులైందని శంకరంగారు చెప్పారు. కానీ, అతని గానుగ చిన్నొంతెన ఎదురుగా ఉండాలి, ఉందేమో చూడమన్నారు. నాక్కూడా ఆ గానుగ లీలగా గుర్తుంది. నూనె అయిపోయి, అవసరం అయినప్పుడు అమ్మమ్మ తన కూడా ఆ గానుగకి తీసుకెళ్లేది. కొంచెం చీకటి చీకటిగా, నూనె వాసనతో ఆ చోటు, ఎద్దు గుండ్రంగా తిరుగుతూ నూనె ఆట్టం… అవన్నీ గుర్తే. ఆ గానుగమీద, అప్పన్న నన్ను కాసేపు కూర్చోపెట్టేవాడు. గానుగ మీద గుండ్రంగా తిరగటం సరదాగా ఉండేదప్పుడు.

శంకరంగారింటి నుంచి అప్పన్న గానుగ వెతుక్కుంటూ వెళ్లాను. పెద్దగా వెతకనక్కర లేకుండానే దొరికింది. ఇంటి బయటే, అరుగుమీద ఆయన కూచునున్నాడు. అప్పన్న పోలికే, కానీ అప్పన్నకాదు. అప్పన్న కోసం వచ్చానని చెప్పాను.

‘‘అన్నయ్య పోయి రెండేళ్లయిందండి. గానుగ కూడా తీసేశామండి. అన్నీ మిల్లు నూనెలే కదండీ. కాలం మారిపోయింది’’ అన్నాడు.

ప్రకృతి ఇచ్చిన వేరుశనగ, నువ్వుల నుంచి.. ఏ రసాయనాలు కలపకుండా, కల్తీ లేకుండా వాడుకునే గానుగ నూనె.. దాని బదులు ఏవేవో నూనెలు…!

అప్పన్నకి కొడుకు ఉన్నాడని, స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్నాడని, పెద్ద వంతెన దగ్గర, వెంకట్రామా అండ్‌ ‌కో పక్క వీధిలో ఇల్లని చెప్పి, అడ్రస్‌ ‌రాసిచ్చాడు.

అక్కడికి వెళ్లాను. ఆదివారం స్కూలు లేదు. ఇంట్లోనే ఉన్నాడు. అతని పేరు నరసింహం. వచ్చిన పని చెప్పాను. అంతా విని అతను ఆశ్చర్యపోయాడు.

‘‘పదిహేనేళ్ల క్రితం నాటి పద్ధెనిమిది రూపాయల బాకీ తీర్చటానికి, ఇల్లు వెతుక్కుంటూ వచ్చారా…. అదీ ఏలూరు నుంచి. మీ అమ్మగారు మిమ్మల్ని పని గట్టుకు పంపించారా? ఎంతటి మహా తల్లండి ఆవిడ. అప్పటి మనుషులే వేరండి. అందరిలో సాధారణంగా మంచితనం, సానుభూతే ఉండేవి. మనుషుల మధ్య ద్వేషం కన్నా, ప్రేమే ఎక్కువ. మంచి ఉద్దేశంతో వచ్చారు. అదే చాలు. మీరు డబ్బు ఇవ్వనక్కర్లేదు. మీ బాకీ తీరిపోయినట్టే’’ అన్నాడు.

‘‘అలా కాదండీ. మీరు తీసుకోవాలి, లేకపోతే మా అమ్మకి మనశ్శాంతిగా ఉండదు’’ అంటూ బలవంతంగా యాభై రూపాయలు నరసింహం చేతిలో పెట్టాను.

‘‘అయితే సరే. ఊరికే అడుగుతున్నాను, నూనె బాకీ అని, శని అని… మీ అమ్మగారికి ఏమైనా సెంటిమెంటా….’’ అనడిగాడు.

‘‘అదేం లేదండి. అదే అయితే, అన్ని బాకీలకన్నా ముందు మీ బాకీయే తీర్చేది. ఆఖర్న తీరుస్తున్న బాకీ మీదే. బాకీ అంటూ ఉంటే ఎప్పటికైనా తీర్చేయాలన్నది అమ్మతత్వం అండి’’ అన్నాను.

‘‘ఇదంతా ఆశ్చర్యంగా, ఓ అద్భుతంలా ఉంది. ఇది కేవలం బాకీ తీర్చటమే కాదండి. ఓ నమ్మకాన్ని తిరిగి నిలబెట్టటం. అప్పంటే ఓ ధర్మబద్ధమైన ఒప్పందంతో కూడిన పరస్పర అభిమానం. రోజులు, మనుషులు ఎంతగా మారిపోతున్నా, మంచి విలువలు నశించిపోవు. ఏదోనాటికి తిరిగి నిలబడతాయి’’ అని నరసింహం ఎంతగానో పొంగిపోయాడు. ఆ రోజు వాళ్లింట్లో భోజనం చేస్తేనే కానీ నన్ను వదల్లేదు.

ఆ తర్వాత ఎన్నో ఏళ్లు గడిచిపోయాయి. ఎనభై ఏళ్లుపైగా బతికిన అమ్మ పోయింది. నా సంసారం నాకు ఏర్పాటుచేసింది. ఇప్పుడు నా వయస్సు డెబ్భై దాటింది. మనుషులే కాదు, సమాజం కూడా ఎంతగా మారిపోయిందో అందరూ చూస్తూనే ఉన్నారు. విలువలు ఉన్న మాటకే విలువ లేదు. ఓ ఇరవై ఎనిమిది మంది వ్యాపారవేత్తలు ప్రభుత్వ బ్యాంకుల నుంచి ఘరానాగా అప్పుచేసి, తీర్చకుండా తప్పించుకుంటున్న ప్రజల సొమ్ము పదిలక్షల కోట్ల రూపాయలు. అప్పు తీర్చలేని పరిస్థితి వల్ల కాదు, వీళ్లు దేశం విడిచి తప్పించుకుంటున్నది. తీర్చాలన్న నీతి లేక. అప్పు తీరాలన్న ఉద్దేశం తీసుకున్నవాళ్లకే కాదని, అప్పు ఇచ్చిన వాళ్లకీ లేదనిపిస్తోంది. అదే పెద్ద ఆశ్చర్యం. ఇన్ని కోట్లమంది జనంలో ఎవ్వరూ ఏం చెయ్యలేనట్టు, అంత పెద్ద అప్పుని పట్టించు కోవటం మానేశారు.

అయినా నరసింహంలాగా, నాకూ ఇంకా ఆశ చావలేదు. ఎప్పటికైనా స్వార్థం, ఏకాకితనం, అలసత్వం, మొరటుతనాలకి మనిషి విసిగిపోతాడనే ఆశ.

తిరిగి ఒకరి మంచి మరొకరు పట్టించుకునే రోజులు వస్తాయి.

చేసిన అప్పు తీర్చటం అన్న చిన్న ధర్మబద్ధమైన విలువలో ఎంతో సమాజహితం ఉంది. ఇలాంటి విలువలే నిజానికి సమాజ స్వరూపం. ఏ ఇంటికైనా, ఆ ఇంటి గృహిణి పాటించే నీతి నియమాలే వారసత్వంగా మారతాయి. అమ్మలాంటివాళ్లు ఉండకపోరు. అప్పు తీర్చటమనే కాదు, అమ్మతనాన్ని అన్ని రకాలుగా నిలబెట్టుకున్న నిండుతనం విలువ కలకాలం మేలే చేస్తుంది.

About Author

By editor

Twitter
Instagram