– గంటి శ్రీరామ ప్రకాశ్‌

‌వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


‘తరతరాల నుండి పంటలు పండుతున్న భూమి. ఒక్కసారిగా తన పంట విత్తులు ఎక్కడికో తరలిపోతే…?

నారు, నీరు లేక బంజరు అయిపోతుంటే.. ఏ భూమి మాత్రం బాధపడదు బాబూ?’

‘పోనీలేండమ్మా! మీరు ఆ భూములను చూసుకోలేకపోతున్నారు. మరి, మీ పిల్లలా.. అమెరికా నుండి రానంటున్నారు. మీ కౌలు రైతు మంచివాడే నంటున్నారుగా, అతను ఏం చెబితే అది చెయ్యండి..’ అంటున్నాడు ఎదురుగా ఉన్న ఆ పెద్దావిడతో, నాతో పాటూ రైల్లో ప్రయాణం చేస్తున్న నా కొలీగ్‌.

‘‌మా భూమిపై మాకు మమకారం లేకపోతే, అలా చేసేసే వాళ్లమే. ‘వ్యవసాయం చెయ్యడం కష్టమైపోతుంది, ఇక వరి పండించలేం. కౌలు చెయ్యలేం..’ అంటున్నాడు మా రైతు. చుట్టూ ఆక్వా చెరువులు వచ్చేసాయ్‌. ‌మీ పొలమూ చెరువులుగా తవ్వేయండి లేదా వాటిని అమ్మేసుకోమని అతను ఒకటే గొడవ’ అన్నదావిడ.

‘ఔనండీ! నిజమే. రాన్రాను, వ్యవసాయం రైతుకు కిట్టట్లేదు. అమ్మేయడమే బెటర్‌. అది ఇష్టంలేకపోతే మీ పంట భూముల్ని రొయ్యల చెరువులుగా మార్చేయండి. సాంప్రదాయం, సింగినాదం అంటూ కూర్చుంటే ఎలా…?’ ఆవిడకు సలహాలిచ్చేస్తున్నాడు మా వాడు.

‘అలా కాదయ్యా.. ఛాదస్తం అని కాదు కాని అదంత మంచిది కాదేమోనయ్యా. అలా వాటిని చెరువులుగా తవ్వి, ఉప్పునీటితో నింపేస్తే, మళ్లీ అక్కడ పంటలు పండటం అసాధ్యం…’ ఆవిడ తన ఆవేదనను వెళ్లగక్కుతోంది.

‘హు.. వీళ్లే పండుటాకుల్లా ఉన్నారు. ఇంకా వీళ్లకి భవిష్యత్‌పై చింతే..?’ నా చెవిలో ఊదుతు న్నాడు మా కొలీగ్‌.

ఆ ‌రోజు నేను, నా కొలీగ్‌ ‌పాండిచ్చేరిలో ఆఫీస్‌ ‌ట్రైనింగ్‌ ‌పూర్తి చేసుకొని, చెన్నపట్నం చేరి ఎగ్మూర్‌ ‌స్టేషన్‌లో సాయంత్రం తిరుగు ప్రయాణంలో ట్రైనెక్కాం.

సర్కార్‌ ‌టూటైర్‌ ‌బోగీలో మా బెర్తుల్లో బ్యాగులు, పాండిచ్చేరిలో ఇంట్లో వారందరికీ కొన్న పాండీ స్పెషల్స్ ఇతర లగేజ్‌లు బెర్త్ ‌క్రింద సర్దుకుంటున్నాం.

ఇంతలో ఒక వృద్ధ జంట చెరొక బ్యాగ్‌తో మా వద్దకు వచ్చారు.

‘బాబూ, మేం తణుకు వరకూ. ఆఖరి నిమిషంలో రిజర్వేషన్‌ ‌చేయించాం. క్రింద బెర్తులు దొరకలేదు. మీకు ఇబ్బంది లేదంటే…’ ఆ పెద్దావిడ ఆదుర్దా పడుతోంది.

‘అమ్మా..! మీరు ముందు ప్రశాంతంగా కూర్చోండి. మేం బ్యాగులు సర్దుకొని కుదురుకున్నాక చెబుదురుగాని. ముందు కూర్చోండి’ అంటూ నా పని చేసుకోసాగాను.

సిగ్నల్‌ ‌పడింది. ట్రైన్‌ ‌బయలుదేరింది. కంపార్టు మెంటులో అప్పటివరకూ అటూ, ఇటూ కలియదిరిగిన వాళ్లు సర్దుకొని ఎవరి సీట్లలో వారు సెటిల్‌ అయ్యారు.

తల తిప్పి మా ఎదురుగా కూర్చొన్న ఆ వృద్ధ దంపతులకేసి చూసాను. ఎనిమిది పదులు దాటి నట్లున్న ఆ పెద్దాయన, ఏడు పదులు దాటినట్లున్న ఆవిడ, చూడబోతే ఓ ఉన్నత కుటుంబానికి చెందిన వారిలా ఉన్నారు. మేం ఎప్పుడు పర్మిషన్‌ ఇస్తే.. అప్పుడు మమ్మల్ని ఏదో అడగాలి అన్నట్లు మాకేసి చూస్తున్నారు.

వాళ్లను అలా ఆపేసి నందుకు నాకే ఏదో తప్పు చేసానని అన్పించి,

‘ఆ…. ఇప్పుడు చెప్పండమ్మా.. మీరిందాకా ఏదో..’ ఆవిడని ఉద్దేశించి అడిగాను.

‘బాబూ మేం అకస్మాత్తుగా ప్రయాణమయ్యాం. ఆఖరు నిముషంలో రిజర్వేషన్‌. ‌కింద బెర్తులు దొరకలేదు. ఈ వయస్సులో మేం పై బెర్త్‌లకు ఎక్కలేం. ఆయనకా, కుడికాలుకి యాక్సిడెంట్‌లో దెబ్బకూడా తగిలింది. మీరు చిన్నవాళ్లే కదా, మీ క్రింది బెర్తులు మాకిచ్చి మా పైవి మీరు తీసుకుంటారేమోననీ…’

ఆవిడ మమ్మల్ని అడిగి మా నిర్ణయం కోసం ఎదురు చూస్తోంది.

‘అయినా, బెర్తులు రాత్రి నిద్దరోయే సమయానికి కదండీ. వచ్చినప్పటి నుండీ కంగారెందుకు. అంతవరకూ మనందరం కింద బెర్తుల్లోనే కూర్చుందాం..’ విసుకున్నాడు, మా వాడు.

‘అలా కోప్పడకండి నాయనలారా.. పెద్దవాళ్లం, కొంచెం చాధస్తం.. టైముంది కదా, వేచి చూద్దాం అనుకొనే మేం ఇబ్బందులు తెచ్చుకున్నాం. మరి మీరు..’  అన్నది పెద్దావిడ.

ఆవిడలోని ఆదుర్దాను గమనించి, అన్నాను.

‘అమ్మా! మీరేం కంగారు పడకండి. రైల్వేవారు క్రింద బెర్తులను ఎవరికి రిజర్వ్ ‌చేసినా, అవి చివరకు మీ లాంటి పెద్దలకు ఇవ్వడం కోసమే. మేం ఇద్దరం మీ పై బెర్తుల్లో పడుకుంటాం. మా క్రింద బెర్తులు మీరే తీసుకోండి. కాకపోతే కొంచెం సమయం గడిచాక వెళ్తాం…’

‘అయ్యో.. దానికేముంది చాలా సంతోషం బాబూ…’ ఆ వృద్ధ జంట ఇద్దరి లోనూ ఆనందం.

వారితో మాట కలుపుతూ.. ‘ఏంటండీ, ఇంత హడావిడిగా బయల్దే రారు.. లగేజూ లేదు, ఏదైనా అర్జంట్‌ ‌పనా…’

పెద్దాయన తల ఊపుతున్నాడు, ఆవిడ ‘తణుకు దగ్గర మా ఊర్లో మాకు పొలం, ఇల్లు ఉన్నాయి. పిల్లల చదువులు, మా ఉద్యోగాల రీత్యా మదరాసు వచ్చి స్థిరపడ్డాం. ప్రతీ సంవత్సరం ఓ రెండుసార్లు మా ఊరెళ్లి వస్తుంటాం. మాకు ఇబ్బంది కలగకూడదని అక్కడ మా ఇంట్లో ఒక పోర్షన్‌ ఇల్లు చూడడానికని ఓ కుటుంబానికి ఇచ్చి మిగతాది మేం ఉంచేసుకున్నాం. మా ఊరి దేవుడి పెళ్లికి, వినాయక నవరాత్రులకి కచ్చితంగా మా ఊరు వెళ్తుంటాం. ఆ నవరాత్రుల్లో పగలు ఊరంతా ఉపవాసం ఉంటారు. రాత్రికి మేం కట్టించిన గణపతి మందిరం లోనే ఊరందరికీ మా పంట బియ్యం, పప్పులతోనే భోజనాలు..’

‘ఇప్పుడు గణపతి నవరాత్రులు కాదే.. మరి మీ ఊరి దేవుడి పెళ్లా..?’ ఆవిడ మాటలకు బ్రేక్‌ ‌వేసాడు మా కొలీగ్‌.

‘‌లేదు బాబూ.. వాటికి ఎప్పుడూ ముందుగానే రిజర్వేషన్‌ ‌చేయించుకుంటాం. మా పొలాలు చూసే రైతు గొడవ పెడ్తున్నాడు. వరి గిట్టుబాటు కావడం లేదు. ఇంక కౌలు చెయ్యను, పొలాన్ని ఆక్వా చెరువులుగా తవ్వించేద్దాం అని ఒకటే పోరు. నిన్నగాక మొన్న ఫోన్‌ ‌చేసి, మా పొలం చుట్టూ అన్ని రొయ్యల చెరువులవుతున్నయ్‌, ఇక మన భూమి పండదు. ఒప్పుకుంటే తవ్వి చెరువులు చేయించేస్తానని, తనే పెట్టుబడులు పెట్టుకొని, పంటకు మూడు రెట్లు శిస్తు ఇస్తానని ఫోన్‌ ‌పెట్టేసాడు’.

ఆవిడ మాకేసి చూసి ఇదంతా చెబుతుంటే అవునన్నట్లూ తలుపుతున్నాడు పెద్దాయన.

‘అందుకనే కంగారుగా బయలుదేరాం. మేం ఎక్కడున్నా మా పంట మేం తినడం, నలుగురికి పెట్టడం, మాకదో తృప్తి. వాటిని రొయ్యల చెరువులుగా మార్చుకోవడం మాకిష్టం లేదు. దేవుడు మనందరికీ ఇచ్చిందే నాలుగోవంతు భూమి. మూడింతలు ఉప్పునీటి సముద్రమే. ఇచ్చిన ఆ కొంత భూమిలో దొరికే మంచినీరూ ఒక్క శాతమే. దొరికిన కొంచాన్నే మనం మళ్లీ ఉప్పునీటిగా, సముద్రంగా మార్చేయటం ఎంత వరకు సమంజసం?’

ఆవిడ చెప్తుంటే.. ఆ పెద్దావిడకున్న విషయ పరిజ్ఞానానికి విస్తూపోయాన్నేను.

‘అయినా ఇదంతా మీ ఛాదస్తం కానీ, మీ చుట్టూ ఉన్న రైతులు అందరూ ఆక్వా సాగు చేయాలని ఒక్కమాట మీదుంటే, కాదని మీరొక్కరు ఏం చేయగలరు?’ వ్యవసాయంపై అవగాహనున్న మా కొలీగ్‌ ‌ప్రశ్నించాడు.

‘లేదు బాబూ, నేను ఇరిగేషన్‌ ‌డిపార్టుమెంటులో ఇంజనీరుగా పనిచేసి రిటైర్‌ అయినవాడిని. డబ్బు మీద అత్యాశతో మూడు పంటలు పండే భూమిని ఆక్వా చెరువులుగా మార్చేసుకుంటున్నారు మా ఊరివాళ్లు. పోనీ.. ఎవరిష్టం వారిది. నాలా ఇష్టంలేని వాళ్లచేత కూడా బలవంతంగా మార్పించ కూడదు కదా..’ అంటూ మొదటిసారి నోరు విప్పాడా పెద్దాయన.

‘మీరిద్దరూ సరేనండీ.. ఇకపై ఇవన్నీ చూసుకో వాల్సింది మీ పిల్లలే కదా. ఇంతకీ వాళ్లు ఏమంటారు?’ అన్నాన్నేను.

మాకా ఇద్దరబ్బాయిలు, ఒక అమ్మాయి. అందరూ అమెరికాలోనే స్థిరపడిపోయారు. వాళ్లే ఇక్కడుంటే మాకు ఏ కష్టం లేదయ్యా. పిల్లలకు చదువులు బాగా వస్తున్నాయని సంబరపడిపోయాం. చదువుపై వారికి శ్రద్ధ కల్పించగలిగాం కానీ, మాతృభూమిపై మమకారం పెంచలేకపోయాం. ఐజాక్‌ ‌న్యూటన్‌, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ ‌గురించి చదువుకొంటున్నారు అనుకొన్నాం. కానీ మన వివేకానందుడిని, సుభాష్‌ ‌బోస్‌ని చదవలేదని గుర్తించలేకపోయాం..’ డీలాగా చెప్పాడు పెద్దాయన.

‘అదేంటండీ! వాళ్లు ఇక్కడికి రారనా…’ అలా అనేసాక నాకనిపించింది, ఆయన్ను మరింత బాధించానేమోనని.

‘ఆయన మాటలకేం నాయనా… మా పిల్లలు అందరూ రెండోళ్లకొకసారి కచ్చితంగా వస్తుంటారు… కనీసం ఒక్కనెలైనా మా వద్ద ఉంటారు..’ తల్లి హృదయం మాట్లాడింది.

‘ఆ.. వస్తారొస్తారు. ఆ ఉన్న నాల్రోజులూ చెన్నపట్నం నుండి ఎక్కడికీ కదలనంటారు. మన ఊరికి పదండర్రా అంటే ఆ గాలి పడదు, నీళ్లు పడవూ, దుమ్ము, ధూళీ అంటూ ఇబ్బందులు పడతారు’ అని నిష్టూర పడ్డాడాయన.

‘పోనీ, వాళ్లకిక్కడ కష్టం, మీరైనా అక్కడికి వెళ్లి ఉండవచ్చు కదండి. అమెరికా ఇక్కడకన్నా విశాలంగా, శుభ్రంగా ఉంటుంది కదా..’ అన్నాను.

‘మేమూ వెళ్తుంటాం బాబూ. పాపం, వాళ్లూ మమ్మల్ని వారాంతాలలో అన్నీ చోట్లకీ తిప్పుతూనే ఉంటారు. కాని ఆ పెద్ద పెద్ద బిల్డింగ్‌లని, స్టూడియో లనీ మేమేం చూస్తాం…? అక్కడ మాకేం తోస్తుంది. శని, ఆదివారాల్లో తప్ప మిగతా రోజులు నేనూ, మా ఆయన ఇద్దరమూ ఒకరి మొహం మరొకరు చూసుకోవాలి. పిల్లల్ని మాత్రం ఏం అనగలం? అక్కడి వ్యవస్థే అంత.’

‘మరి పిల్లలు రానిదానికి, మీరు ఈ వయసులో పొలాలు, పోరాటాలు, ఆరాటాలు దేనికండి? పిల్లలూ మీ మాట వినరనీ, మీ ఊర్లో వారు మీకేదైనా హాని తలపెడితే?’ మనసులో మెదలిన మాటను చటుక్కున అడిగిన మా కొలీగ్‌ను అక్కడితో ఆగమని సైగ చేసాను.

‘ఆ అబ్బాయి అన్నదాంట్లో తప్పేం లేదు బాబు. మా ఊర్లోనే పాత తరం వాళ్లం. మా రైతులు, మా ఊరివాళ్లూ మా పిల్లల్లాంటి వాళ్లే. మాకు ఏ భయమూ లేదు. ఏంటో అందరూ కాలం ఎలా లాక్కొని పోతే అటు పోతున్నారు. మనవైనవి నిలుపుకోవాలన్న ధ్యాస ఎవరికీ ఉండటం లేదు. పెద్దవాళ్లుగా తెలియజెప్పటం, మా… మా ప్రయత్నం మేం చేస్తాం..’

ఆయాస పడుతూ మాటలను పూర్తి చేసాడు పెద్దాయన.

‘ఎప్పటికైనా వీళ్లూ, వాళ్లూ మా మాట వింటారనే మా ఆశ…’ జత కలిపిందావిడ.

‘మీ పిల్లలు సరే, మరి మీ మనవల సంగతేమిటి? వాళ్లకు ఇండియా ఇష్టమేనా…’ మనవలపై ఉండే ప్రేమతో ఆ వృద్ధ దంపతులలో ఆలోచనలను సాధారణ స్థాయికి తీసుకొద్దామని వారినడిగా.

‘మా పెద్దబ్బాయికి ఒక అమ్మాయి. కూతురికి ఒక కొడుకు. ఇంక రెండో వాడూ, కోడలు అసలు మేం పిల్లల్ని కనమని చెప్పేసారు. పిల్లల్ని కనడం, పెంచడం, ఆ బాధ్యతల్ని పంచుకోవడంలో ఆనందం వారికిప్పుడు అర్థం కావడం లేదు. అదేదో మోయ లేనంత బరువుగా భావిస్తున్నారు. దంపతులందరూ ఇలా ఆలోచిస్తే, అసలు లోకం మనుగడే ప్రశ్నార్థకం కాదూ..?’

చెప్తున్న ఆవిడను చూస్తే తరాల అంతరానికి ప్రాంతాల అంతరం మరింత ఆజ్యం పోసినట్లని పించింది. సరిగా చదువబ్బక, జీవితంలో సరిగా స్థిరపడలేకపోయిన పిల్లల వలన తల్లిదండ్రులకు ఒక బాధ అయితే.. బాగా చదువుకొని ఎక్కడికో తరలిపోయిన వారి తల్లిదండ్రులది ఒక బాధ అనుకొన్నా స్వగతంలో.

రైలు వేగం నెమ్మదించింది. స్టేషన్‌ ఏదో వస్తున్నట్లుంది. రైలు చక్రాలు వేగం తగ్గి ప్లాట్‌ ‌ఫారమ్‌కు మళ్లుతున్న సూచికగా బోగీ కర కర శబ్దాలు చేస్తోంది.

చీకటి పడుతోంది. డిన్నర్‌ ఆర్డర్‌.. ‌డిన్నర్‌.. అం‌టూ రైల్వే హాకర్లు డిన్నర్‌కు ఆర్డర్లు తీసుకుంటు న్నారు.

కూర్చుని జోగుతున్న పెద్దాయన్ను లేపి, ‘షుగర్‌ ‌మందులేసుకోండంటూ’ ఇచ్చిందావిడ.

ఆ పెద్దవాళ్లు వాల్తారు అని, పైగా మా ఆత్మరాముడు కూడా ఆకలేస్తోందనడంతో క్రింది బెర్తులు వారికి ఖాళీ చేసి ఇచ్చి మా బెడ్‌షీట్‌లు, పిల్లోలు పై బెర్తులకు తెచ్చుకొని పరుచుకున్నాం. చెన్నపట్నంలో ప్యాక్‌ ‌చేయించుకున్న టిఫిన్‌ ‌ప్యాకులు తిందామని విప్పాం.

క్రింది బెర్తులో కూర్చొని ఉన్న ఆ పెద్దావిడ నడముకు దాదాపుగా వాల్చి ఉన్న బెర్తు బోల్టు తీయలేక దానిని క్రిందకు వేయడానికి బలం సరిపోక ఆపసోపాలు పడుతోంది.

తినబోతున్న టిఫిన్‌ను పక్కకి నెట్టి పై బెర్త్ ‌నుండి క్రిందకు దిగి వారిద్దరికి బెర్తులు వేసి దుప్పట్లు సర్దాను.

‘అయ్యో! తినబోతూ, ఆపి వచ్చి మా బెర్త్‌లు సర్దిపెట్టావా బాబూ. మీ తల్లిదండ్రులను చూసు కుంటున్నట్టు చూస్తున్నావ్‌ ‌మమ్మల్ని. చాలా సంతోషం’ అందావిడ.

‘మరేం పర్లేదండీ. నా ప్లేస్‌లో ఎవరున్నా మీకిలాగే సహాయపడతారు. ప్రశాంతంగా నిర్దరోండి. నాకు తెల్లవారు ఝామునే తెలివి వచ్చేస్తుంది. ట్రైను తణుకు చేరడానికి ముందే మిమ్ములను నిద్రలేపుతాను.’

‘మాకా.. అంత నిద్ర పడితే ఇంకేం నాయనా. ఏదో మగత నిద్ర ఆయనకు. కూర్చోలేను అంతసేపు కాబట్టి నేను వాలతానంతే.’

‘మీరు ఎలాగూ నన్ను మీ పిల్లవాడు లాంటి వాడ్నని గుర్తించారు కాబట్టి, చెబుతున్నా. మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచనలు పెంచుకుంటు న్నారండీ. మీ పిల్లలందరూ చక్కగా అమెరికాలో స్థిరపడ్డారు. హ్యాపీగా ఉన్నారు. అక్కడా బాగా గడించే ఉంటారు. మీరిక్కడ అక్కరలేని ఆవేదన పడ్తున్నారని నా భావన.’

‘నిజమే నాయనా. సంపదలో వారెవ్వరికీ లోటు లేదు. మా అల్లుడు అమెరికాలో పెద్ద సర్జన్‌. అతని అపాయింట్‌మెంట్‌ ఎవరికైనా దొరకాలంటే చాలా రోజులు పడ్తుంది. అలా అని వాళ్లు సుఖంగా ఉన్నారా అంటే… ఎప్పుడూ టెన్షన్‌ ‌గానే ఉంటాడు. ఎప్పుడు, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా, అప్పటి వరకూ సాధించుకున్నది పోతుందనే భయం.

పెద్ద కొడుక్కా ఇండియా అంటే కోపం. ఈయన కాలికి యాక్సిడెంట్‌ అయిందని చెప్పాను కదా. ఒకసారి పెద్దాడు, పిల్లలు ఇండియా వస్తే, మా మదరాస్‌ ‌మెరినా బీచ్‌ ‌వద్దకు మేం అందరం ఫుట్‌పాత్‌ ‌మీదే నడుచుకుంటూ వెళ్తున్నాం. ఎవడో మోటరిస్ట్, ‌రాంగ్‌ ‌రూట్లో వచ్చి జీబ్రా క్రాసింగ్‌ ‌వద్ద ఈయన్ని గుద్దేసాడు, అప్పుడు కాలు విరిగిందీయనకు.

ఇండియాలో వాళ్లకి డిసిప్లీన్‌ ‌లేదంటాడు మా పెద్దాడు. ఏ సమాజంలోనైనా మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. అక్కడ మాత్రం ఇటువంటి ఘటనలు జరగవా ఏమి?

ఇక చిన్నవాడు, కోడలు ఇద్దరూ ఉద్యోగాల్లో బిజీ. వారంలో మొదటి ఐదు రోజులు వారికి పగలు, చివరి రెండు రోజులు రాత్రి.

చూడు నాన్నా.. ఏవో బి.టి. విత్తనాలంటారే. ఆ అమెరికావే. చాలా మంచి పంటనిస్తాయట. చీడలు, పీడలు ఉండవట. కానీ మళ్లీ పంట వేయాలంటే దాని విత్తనాలు పనికి రావట. అలా ఉంటుదయ్యా! అక్కడి జీవితం.’

అదేంటండీ, అలా అంటారు, పిల్లలకు రెక్కలొచ్చేంత వరకే గూడుగాని.. ఎప్పుడూ మీ పిల్లలు మీతో ఉండిపోవాలనడం ఎలా కుదురుతుంది…’ అంటూ ఆవిడ మాటలకు బ్రేక్‌ ‌వేసాను.

రెక్కలొచ్చేదాకే గూడు.. ఆ తరువాత ఎవరి దారి వారిదే అన్నది పక్షులకు గాని మనుషులకు కాదయ్యా.

మొక్కకి, మనిషికీ, మనసుకీ మట్టితో లంకె ఉంటుంది. ఎక్కడెక్కడివో విత్తులు ఇక్కడికి తెచ్చినా, హైబ్రీడ్‌లు సాధించినా కళ్లకు ఇంపుగా ఉంటాయోమో కాని రుచిని, ఆరోగ్యాన్ని అవి ఇవ్వలేవయ్యా. మనదైన విత్తులో, మట్టిలో ఔషధముందయ్యా. వాటిని తరతరాలూ నిలుపుకోకపోతే, మనిషి రోగగ్రస్థుడు కావల్సిందే. గాలీ, వెలుతురూ మన కిటికీల్లోంచి లోపలికి రావాలే గాని, మనదైనవి తలుపుల గుండా బయటకు వెళ్లిపోకూడదు. అయ్యోయ్యె.. టిఫిన్‌ ‌తినకుండా క్రిందకు సాయం చేద్దామని వచ్చిన నిన్ను ఇంతసేపు ఆపేసాను చూసావా… ఎవరైనా మాట్లాడే వాళ్లు కనిపిస్తే మాటలు ఆపుకోలేక పోతున్నానయ్యా.. వెళ్లి టిఫిన్‌ ‌తిను. లేటయిపోతుంది. ఆ.. ఒక్కసారి నీ ఫోన్‌ ‌నెంబరు ఇవ్వు… ’ అని ఆవిడ అంటుంటే..

నా నెంబరు ఆవిడకిచ్చి, ఆవిడ నెంబర్‌ ‌నేను నోట్‌ ‌చేసుకున్నా. నా బెర్త్‌కు వచ్చి టిఫిన్‌ ‌తిని పడుకున్నా.

తెలతెలవారుతోంది. కళ్లు నులుముకొని లేచి చూస్తే, క్రింద బెర్తులు ఖాళీగా ఉన్నాయ్‌. ‌క్రిందకి దిగాను. ట్రైన్‌ ‌స్లో అవుతోంది. డోర్‌ ‌వద్దకు వెళ్లి చూస్తే, ఆ వృద్ధ దంపతులు ఇరువురూ ట్రైన్‌ ఆగడం కోసం నిరీక్షిస్తున్నారు.

నన్ను చూసి…

‘అ.. లేచావా బాబూ.. నిద్రపోతున్నావ్‌ ‌కదా అని లేపలేదు. చాలా చాలా థాంక్స్.. ‌మమ్మల్ని బాగా చూసుకొన్నందుకు’ అన్నదావిడ.

తణుకు స్టేషన్‌లో ట్రైన్‌ ఆగింది. వారి బ్యాగ్‌లను, వారిని కిందకు దింపి వారికి నమస్కరించాను. ఆ పెద్దాయన ఆశీర్వాదాలు అందుకొని ట్రైన్‌ ‌కదులుతుంటే బోగీలోకి వచ్చేసాను.

ఓ గంట తరువాత లేచాడు మా కొలీగ్‌. ‘‌గుడ్‌ ‌మార్నింగ్‌.. ఈ ‌పెద్దాళ్లు దిగిపోయారా? అయినా అంత చాదస్తంగా ఉంటే ఈ కాలంలో ఎలా బ్రతుకుతారు. అటు అమెరికాను కాక, ఇటు ఆంధ్రాను కాక మధ్య ఆకాశంలో ఉందామనుకుంటే కుదురుతుందా? నాకు డౌటే.. మళ్లీ వాళ్లు సేఫ్‌గా చెన్నపట్నం చేరగలరో లేదోనని…’ అంటూ బెర్త్ ‌దిగాడు వాడు.

ఈ లోగా చివరి స్టేషన్‌, ‌మా ఊరు వచ్చేసింది. ట్రైన్‌ ‌దిగిపోయాం.

ఎవరి పనులు వారివి..

కాలం కరిగిపోతుంది.

కొన్ని నెలల తరువాత సడెన్‌గా ఒకరోజు ఆ పెద్దావిడ నుండి నాకు ఫోన్‌ ‌కాల్‌.

‘‌హలో బాబూ, బాగున్నావా?’ పెద్దావిడ పలకరింపు.

‘నేను బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? సార్‌ ఏం ‌చేస్తున్నారు? ఇంతకీ ఈ రోజు నేను.. ఎలా గుర్తొచ్చానమ్మా మీకు..?’

‘ఏం లేదయ్యా. అచ్చం నీలాగే, మా పిల్లలూ నిన్న రాత్రి సర్కార్‌ ఎక్స్‌ప్రెస్‌లో మా బెర్త్‌లు సర్దారు. ఈ రోజు ఉదయమే మేము, పిల్లలూ, మనుమలు అందరూ తణుకులో ట్రైన్‌ ‌దిగి మా ఊరి దేవుడి పెళ్లి అని వచ్చాం. అందుకే నువ్వు గుర్తొచ్చి ఫోన్‌ ‌చేసాను.

‘చాలా.. చాలా… సంతోషమమ్మా. మీ పిల్లలు ఇండియాకి ఎప్పుడొచ్చారు? ఎప్పటి వరకూ ఉంటున్నారు?’

‘లేదు బాబూ.. వాళ్లందరూ ఇక్కడ. అదే ఇండియాలో ఉండిపోవడానికే వచ్చేసారు. ఏదో క్రిమి అట, అన్ని దేశాలను ఆవరించి, ఏ విత్తు ఆ మట్టికే చేరమని ఆదేశించిందట. ‘వందేభారత్‌ ‌మిషన్‌’ ‌విమానాల్లో మా పిల్లలందరూ అమెరికా నుండి ఇండియా చేరుకొన్నారు. ఇదిగో ఇప్పుడు మా ఊరి దేవుడి పెళ్లికి అందరం. ఇంతకీ మీ ఊరు ఇక్కడికి దగ్గరే కదా! ఒక్కసారి మా దేవుడి పెళ్లి చూసి మా ఊరి భోజనం తిని వెళ్లరాదూ…?’

‘తప్పక వస్తానమ్మా. ఈ రోజు ఎలాగూ ఆదివారమే. నాకూ అటుపక్క పనులున్నాయ్‌… ‌కాని నాది ఒక్క సందేహం… ఇంతకీ మీ పొలం ఏమయ్యింది. ఆక్వా చెరువులుగా మార్చారా?’

‘వైరస్‌ ‌వ్యాప్తితో చెరువుల కన్నా వరి సాగే మేలని మా రైతు మా మాటే విన్నాడు. మా పొలంలో అతడు పండించిన పప్పు, బియ్యాలతోటే ఈ రోజు మా ఊరివారికి సంతర్పణ’… ఆనందంగా చెబుతోంది ఆ పెద్దావిడ.

‘ఇంకా మీ భోజనం వచ్చి చేయకుండానే నా ఆకలి తీరినట్టుందమ్మా. అమెరికాను వదిలి మీ వాళ్లు మీ దగ్గరకు వచ్చేసారంటే ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంది.’

‘అదే బాబూ! ఒక వృక్షం ఎన్ని ఫలాలు ఇచ్చినా, అంత్యకాలంలో రాలి నేలపై పడి తన తరువాతి తరాల వనానికి ఎరువై పోతే.. ఆ వృక్షానికి ఎంత సార్ధకతా! అలాగే మేమూ భావించాం. చివరకు మా పిల్లలూ అర్థం చేసుకొని ఇక్కడకు వచ్చి మాకు శాశ్వత ఆనందాన్ని కల్గించారు. ఇవి సరే కాని.. ఇంతకు నువ్వు బయలుదేరి వస్తున్నావా…?’ గట్టిగా ఫోన్‌లో అడుగుతున్నారు పెద్దావిడ.

‘ఆ… వచ్చే పనిలోనే ఉన్నానండీ. సొంత ఊరిపై మమకారాన్ని మరచిపోకుండా చేసే మీ ఊరి నీళ్లు నాకూ ఒకసారి తాగాలని ఉంది..’  అంటూ వారి ఊరి వైపు నా కారు స్టీరింగ్‌ ‌తిప్పాను.

About Author

By editor

Twitter
Instagram