– వసుంధర

వాకాటి పాండు రంగరావు స్మారక దీపావళి కథల పోటీకి ఎంపికైనది


విషం – భయంకరమైన విషం – నల్లమల అడవుల్లో ఉండే ప్రమాదకరమైన విషసర్పాల కోరల నుంచి తీసిన ఎక్స్-11 ‌విషం. 20 మిల్లీగ్రాములు ఒంట్లోకెక్కితే – క్షణాల్లో ప్రాణాలు తీసే విషం!

అది నేను ఇష్టపడి తీసుకుంటే – ఆత్మహత్యా, దుస్సాహసమా, వేరెవరికో ప్రాణం పోసినట్లా?

ఇది సందేహం కాదు, సందిగ్ధం! చావుకీ బ్రతుక్కీ మధ్య సందిగ్ధం! అసలేం జరిగిందంటే..

నాన్నకి హార్ట్ఎటాక్‌. ఆపరేషనుకి అర్జంటుగా మూడు లక్షలు కావాలి. తర్వాత ఇంకా అవసరం పడుతుందేమో తెలియదు.

నాన్న రైతు. ఐదెకరాల పొలం, స్వంతిల్లు ఉన్నాయి. నా ఇద్దరక్కల పెళ్లిళ్లకు చేసిన అప్పులకి అవింకా తాకట్టులోనే ఉన్నాయి. నా పరిస్థితి చూస్తే – పట్నంలో ‘ఓం శాంతి’ నర్సింగ్‌ ‌హోం అధినేత డాక్టర్‌ ‌కొండల్రావుగారి కారు డ్రైవర్ని. పెళ్లయింది. ఇద్దరు పిల్లలు. కొండల్రావుగారింటి ఔట్‌హౌస్‌లో ఉంటున్నాను. ఇంటి ఖర్చులకీ, పిల్లల చదువుకీ పోనూ.. నాన్న అప్పు తీర్చడానికి అడపాదడపా వెయ్యీ, రెండు వేలూ పంపుతుంటాను. మూడు లక్షలంటే నాకు చాలా పెద్ద మొత్తం. కానీ ఏదో చెయ్యాలి!

కొండల్రావుగారికి చెప్పాను. ఆయన జాలిగా నిట్టూర్చి ఊరుకున్నాడు. ఔను మరి, వైద్యం ఆయనకు వ్యాపారం. జాలిని చేతల్లో చూపితే, ఈ స్థాయికి చేరుకోలేడు.

అప్పుడు బాల్యమిత్రుడు అశోక్‌ ‌గుర్తుకొచ్చాడు. ఊళ్లో వాడివీ మావీ పక్కపక్కిళ్లు. వాడి తల్లికి జబ్బు చేస్తే పట్నం తీసుకెళ్లారు. వైద్యానికి వెంటనే వెయ్యి రూపాయలు కావాలి. మా ఊరి రైసుమిల్లు ఓనరు ప్రకాశాన్నడిగాడు. అప్పుగా కాదు – ధాన్యం కొన్న బాపతు పన్నెండొందలు ఇవ్వాల్సుందని. కానీ ఆయన ధాన్యమాడిన బియ్యం ఇంకా అమ్ముడుపోలేదనీ, అమ్మేదాకా తనవద్ద పైసా ఉండదనీ చెప్పేశాడు. పైగా అశోక్‌ ‌తల్లి ఆరోగ్యం గురించి మొసలి కన్నీళ్లు కార్చాడు. ఎంతలా అంటే, అప్పుడు చుట్టూ ఉన్నవాళ్లు అశోక్‌ ‌తల్లి మాట మర్చిపోయి, ఆయన అసహాయ స్థితికి ఎక్కువ జాలిపడ్డారు. వాళ్లలో వడ్డీ వ్యాపారి ఏడుకొండలు ఒకడు. అశోక్‌ ‌చటుక్కున ఆయనతో, ‘‘అయ్యా! మా అమ్మకి ప్రాణప్రమాదం. అర్జంటుగా వెయ్యి రూపాయలు కావాలి. మాకు బాకీ ఉండీ, సమయానికి ఆదుకోలేక, వేరే ఉపాయం తోచక ప్రకాశంగారు మనసు పాడు చేసుకునున్నారు. తమరు నాకు అప్పివ్వండి. ప్రకాశంగారు హామీ ఉంటారు. వడ్డీ ఆయన కడతారు. అసలు మేం కడతాం. అందరికీ సంతోషంగా ఉంటుంది’’ అన్నాడు. ఏమనాలన్నట్లు ఏడుకొండలు ప్రకాశాన్ని చూశాడు. ప్రకాశం మింగలేక, కక్కలేక అవస్థ పడ్డాడు. తమాయించుకున్నాక, ‘‘బుర్ర సరిగ్గా పని చెయ్యక, స్ఫురించలేదు. ఇంట్లో పన్నుకి కట్టాల్సిన డబ్బు కొంతుంది. అందులోంచిస్తాను. తర్వాత అంతగా అవసరపడితే, అప్పుడే ఏడుకొండలు దగ్గర అప్పు తీసుకుంటాను’’ అన్నాడు.

బక్క రైతు కొడుకు, పదమూడేళ్ల కుర్రాడు, రైసుమిల్లు యజమానితో అలా మాట్లాడ్డాన్ని విశేషంగా అప్పట్లో చెప్పుకున్నారు.

అప్పుడు నేనడిగాను, అశోక్‌ని.. ఏడుకొండలు ప్రకాశానికి అప్పివ్వనంటే ఏం చేసేవాడివని. వాడు నవ్వేసి, ‘‘ప్రకాశం ఇంట్లో క్యాష్‌ ఎప్పుడూ రెండువేలకు తక్కువుండదని తెలుసు. ఆ రాత్రి వాళ్లింట్లో కన్నమేసి డబ్బు కొట్టుకొచ్చేవాణ్ణి’’ అన్నాడు. దొంగతనం తప్పు కదరా అంటే, ‘‘నా డబ్బు నేను తీసుకోవడం దొంగతనమెందుకవుతుందీ’’ అన్నాడు.

మరిప్పుడు కొండల్రావుగారింట్లోనూ క్యాష్‌ ‌లక్షల్లో మూలుగుతోందని తెలుసు. నల్లడబ్బు కాబట్టి పోయినా చెప్పుకోలేడు. కానీ ఆ ఆలోచనొచ్చినందుకే నాలో వణుకు మరి. అలాంటి నేను అశోక్‌లా మారగలనా? మారదామన్నా నాన్నే ఒప్పుకోడు!

రైతు జీవితం దుర్భరమనీ, నన్ను బాగా చదవమని పోరేవాడు నాన్న. కానీ నాకు చదువబ్బలేదు. ఊరిబడిలో ఎలాగో టెన్తు అయిందనిపించి, ఇక చదవనన్నాను. ఆ విషయంలో అశోక్‌ ‌నాకు తోడు. ఆర్థికంగా మా ఇద్దరి పరిస్థితీ ఒక్కటే అయినా, వాడి రూటే వేరు. అది నాకు గొప్పదే కానీ, నాన్నకు నచ్చేది కాదు. అందుకు ఉన్న ఎన్నో ఉదాహరణల్లో మచ్చుకి రెండు..

ఏడెనిమిదేళ్లప్పుడు ఇద్దరం తరచుగా ఊరి చెరువులో జలకా లాడేవాళ్లం. నేనెప్పుడూ ఒడ్డుకి దగ్గర్లో మోకాలి లోతు నీళ్లలో, వాడేమో మొలలోతు నీళ్లలో. ఒక్కోసారి పీక లోతుకీ వెళ్లేవాడు. అలా చేస్తే ఈత దానంతటదే వస్తుందనేవాడు. ఈత నేర్వాలన్న పట్టింపు లేక, నా జాగ్రత్తలో నేనుండేవాణ్ణి. కానీ ఓసారి చెరువులో పాకుడెక్కువై లోతుకి జారి మునిగిపోయాను. నన్ను రక్షించాలని అశోకూ లోతుకొచ్చేశాడు. చిన్న కుర్రాడు. వచ్చీరాని ఈత. దాంతో వాడూ మునిగిపోతే, మా ఇద్దర్నీ అక్కడే ఉన్న ఓ గజీతగాడు రక్షించాడు. ఇంటికెళ్లేక ఇద్దరికీ బాగా అక్షింతలు పడ్డాయి. మరి నాన్న నన్ను మళ్లీ చెరువు కెళ్లనివ్వలేదు. అశోక్‌ ‌పట్టుదలగా ఈత నేర్చుకుని ఒకట్రెండేళ్లలో చెరువులో చేపలతో పోటీపడేవాడు.

రెండో విశేషం నాకు పన్నెండేళ్లప్పుడు జరిగింది. సాయంత్రాలు ఊరి చివర పాడుపడ్డ గుడి దగ్గర దొంగాట ఆడేవాళ్లం. దొంగని నిర్ణయించడానికి పంట లేస్తుండగా, నా కాలికప్పుడు ఏదో మెత్తగా తగిలింది. అంతలోనే మాలో ఒకడు, ‘పాము, పాము’ అనరిచాడు. చూస్తుండగా ఓ పాముపిల్ల చరచరా పాకుతూ అక్కడున్న పాత గోడ పగుల్లోకి దూరిపోయింది. అది నా కాలిని రాసుకుంటూ వెళ్లిందని నా అనుమానం. కానీ అశోక్‌, ‘‘‌నువ్వు దాన్ని తొక్కి ఉంటావ్‌. అది పగబట్టి, ఎప్పుడో వచ్చి ఏమరుపాటున నిన్ను కాటేయొచ్చు. ఇప్పుడే దాని భరతం పట్టాలి’’ అని పక్కనున్న చెట్టుకొమ్మ విరిచి ఆకులు దూసి, ఆ కర్రతో పాము దూరిన గోడ పగుల్లో కెలికాడు. వెంటనే లోపల పాముందనడానికి సూచనగా బుస్సుమన్న శబ్ధం.

మేమంతా హడలిపోయాం. మాలో ఒకడు, ‘‘తాచుపాము లాగుందిరా. ఎప్పుడో పగ బట్టడం మాట తర్వాత! ఇక కెలకడం ఆపకపోతే, ఇప్పుడే బయటికొచ్చి కాటేస్తుంది’’ అని అరిచి హెచ్చరించి బాగా వెనక్కి తగ్గాడు. వాడితోపాటు మేమూ తగ్గాం కానీ అశోక్‌ ‌కర్రతో కెలుకుతూనే ఉన్నాడు. ఉన్నట్లుండి పాముపిల్ల ఆ పగుల్లోంచీ శరవేగంతో బయటి కొచ్చింది. వాడంత ఎత్తు గాల్లోకెగిరింది. వాడిమీద పడేదే, కానీ వాడు చురుగ్గా ఒక్కడుగు వెనక్కి వెయ్యడంతో నేలమీద పడింది. అది కింద పడీ పడగానే కర్రతో ఒక్కటేశాడు. గిలగిల కొట్టుకుంటుంటే ఇంకో రెండు దెబ్బలేశాడు. అది మరి కదల్లేదు. మేము భయంతో చేస్తున్న హాహాకారాలు విని అటుపోతున్న ఓ పెద్దాయనొచ్చి, జరిగింది విని, చచ్చిన పాము పిల్లని చూసి, ‘‘గోధుమతాచు. ఇంకా పిల్ల కదా, మహా పొగరైనది! కింద పడీపడగానే గురి తప్పకుండా కొట్టావు కాబట్టి బ్రతికిపోయావు. లేకుంటే అంతే సంగతులు’’ అని, ‘‘దీని తల్లిపాము ఎక్కడో ఉంటుంది. అది నీ మీద పగబట్టి ఇక్కడే కాపేయొచ్చు. ఇకమీదట ఇక్కడకు రాకు’’ అని హెచ్చరించి వెళ్లాడు. నాన్న మళ్లీ నన్ను అటెళ్లనివ్వ లేదు. అశోక్‌ ‌మాత్రం అడపాదడపా ఓ కర్రుచ్చుకుని అక్కడికెళ్లి కాసేపు తచ్చాడి వస్తుండేవాడు.

పిల్లలం పొగిడేవాళ్లం కానీ, పెద్దవాళ్లు వాడిది దుడుకుతనమనేవారు. వాడితో తిరగొద్దనేదమ్మ. వాడితో తిరిగే నా చదువు దెబ్బతిందని నాన్న బాధ. కానీ నేను వాణ్ణొదిలేవాణ్ణి కాను. ఎందుకంటే అలా తిరగడం బాగుండేది. ఆపైన నాకు చదువు రాకపోతే అందుకు బాధ్యత వాడి సావాసమే తప్ప, నా లోపమని నావాళ్లనరు. అది నాకు కొంత ఊరట!

టెన్తయ్యేక మా ఊళ్లోనే వాడు డ్రైవింగు నేర్చుకున్నాడు. బలవంతాన నాకూ నేర్పించాడు. ఈసారి నాన్న వద్దనలేదు. ఇద్దరం కలిసి పట్నమెళ్లి, ముందు ఆటో డ్రైవర్లం, తర్వాత కారు డ్రైవర్లం అయ్యాం. అనుకోకుండా నాకు ‘ఓం శాంతి’ నర్సింగుహోంలో డ్రైవరుద్యోగం దొరికింది. జీవితంలో స్థిరపడ్డాను. అశోక్‌ ‌లారీడ్రైవరై పట్నం వదిలిపెట్టాడు. నన్నూ వచ్చెయ్యమన్నాడు కానీ, సావాసంతో సాహసాలు వంటబట్టవు కదా! నేను వెళ్లలేదు. వెడితే నాకిప్పుడీ మనోవ్యధ ఉండేది కాదేమో! వాడి గుణాలు వంటబట్టి – నాన్నకోసం ఎలాగో అలా డబ్బు సంపాదించేవాణ్ణేమో ననుకుంటూ, ‘‘దేవుడా! నాన్నకోసం ఏం చెయ్య డానికైనా రెడీగా ఉన్నాను. నాకో అవకాశమివ్వు’’ అనుకున్నాను మనసులో.

దేవుడు విన్నాడో ఏమో, ఆ తర్వాత కాసేపటికే కొండల్రావుగారినుంచి నాకు పిలుపొచ్చింది. డ్రైవింగుకని అనుకున్నాను కానీ ఆయన నన్ను ఎప్పటికంటే చాలా ఆత్మీయంగా పలకరించి, ‘‘మీ నాన్నకోసం ఏదో చెయ్యాలని నేనూ ఆలోచిస్తున్నాను. చూద్దాం కానీ, ఈలోగా నువ్వోసారి మన ల్యాబుకి వెళ్లి, పరీక్షకి రక్తమిచ్చి రా’’ అన్నాడు.

కొండల్రావు మామూలు డాక్టరా? ఆయన చెయ్యి తగిలితే, రోగులకి యమపాశం తగులుకున్నా పట్టు సడలి తీరుతుందిట. ఆయనకు దేశానివీ, విదేశాలవీ బోలెడు డిగ్రీలు. అవి చాలవన్నట్లు, తన నర్సింగ్‌ ‌హోం పక్కనే ఓ ప్రయోగశాల ఉంది. అక్కడ తయారయ్యే కొత్త మందులు వేరెక్కడా దొరకవట. అవి కేవలం ఆ నర్సింగుహోంలో వైద్యానికే వాడతారుట. అపురూపమైన ఆ మందులు అవసరం పడినప్పుడు రోగులు ‘ఓం శాంతి’ నర్సింగుహోంలో చేరక తప్పదట. అంత గొప్ప ల్యాబునీ మన ల్యాబు అని డ్రైవరుతో అనడం గొప్ప సంస్కారం. ల్యాబునే కాదు, ఆయన నాతో మాట్లాడినప్పుడు మన కారు, మన హాస్పిటలు – అనే వ్యవహరిస్తాడు. అలాగే తన సంపదని కూడా మన సంపద అంటే బాగుండేది. మా నాన్న ఆపరేషను సమస్యే అయ్యేది కాదు. సంపద దాకా ఎందుకు? నాన్నకి తన నర్సింగుహోంలో ఫ్రీగా ఆపరేషను చేయించొచ్చు. లేదా ఆపరేషను ఖర్చుని, వడ్డీ లేని అప్పుగా భావించి, వాయిదాల మీద బాకీ తీర్చమన్నా చాలు. అవేం చెయ్యకుండా – మన ల్యాబు అంటే ఏం లాభం?

నాక్కావాల్సింది మూడు లక్షలు. దానికీ రక్తపరీక్షకీ ముడేమిటో అనుకుంటూ మా ల్యాబుకి వెళ్లాను. అక్కడ పరీక్షకి రక్తం తీసుకునే శంకర్‌ ‌నన్ను చూసి నవ్వి, ‘‘దేవుడికి దణ్ణం పెట్టుకో. ఫలితం బాగుంటే పది లక్షల లాటరీ కొడతావు’’ అన్నాడు. ఆశ్చర్యమేసింది, ‘‘ఫలితం ఏమిటి? పది లక్షలేమిటి?’’ అన్నాను.

‘‘రక్తాన్నిప్పుడు పరీక్షిస్తారుగా, అది పనికొస్తుందని తేలితే నీ వరకూ పది లక్షలు..’’ అన్నాడు శంకర్‌.

‌రక్తానికి పది లక్షలా? అంటే రక్తదానమా? ఇచ్చినా ప్రతిఫలం వందల్లోనో వేలలోనో ఉండాలి కానీ ఏకంగా పది లక్షలా?

పోనీ అంటే నా రక్తం గ్రూపు ఓ. అది అరుదైనది కాదు. ‘‘పనికి రావడమంటే దేనికి?’’ అనడిగాను.

‘‘దేనికో తెలియదు. పరీక్ష కూడా టాప్‌ ‌సీక్రెట్‌. ‌శాంపిల్‌ ‌కలెక్ట్ ‌చెయ్యడంవరకే నా పని. టెస్టు కిషోర్‌ ‌గారు చేసి, రిజల్ట్ ‌డాక్టరుగారికి పంపుతారు. ఆయన ఆశించిన ఫలితం వచ్చిందో, నీకు పది లక్షలు గ్యారంటీ. అంతవరకే నాకు తెలుసు’’

అంతకుమించి తనింకేం చెప్పడని అర్థమైంది. తను చెప్పినట్లే మనసులో దేవుణ్ణి పార్థించి చెయ్యి చాపాను. ఏమాత్రం నొప్పి తెలియకుండా, నా ఒంట్లోంచి కొంచెం రక్తం తీశాడు కిషోర్‌. ‌తర్వాత అక్కణ్ణించి వెళ్లి కొండల్రావుగార్ని కలిశాను. ఎన్నడూ లేనిది ఆయన నన్ను చూస్తూనే లేచి నిలబడి చేయి చాచి కరచాలనం చేసి, ‘‘నీ రక్తం నీ అదృష్టం. అది నీకు పది లక్షలు ఇవ్వగలదు. ఎటొచ్చీ నువ్వు కాస్త ధైర్యం చెయ్యాలి’’ అన్నాడు.

ధైర్యం అన్న మాట విని ఉలిక్కిపడ్డాను. నాకూ ధైర్యానికీ ఆమడ దూరం. ‘‘ధైర్యమా, నాకా?’’ అన్నాను.

‘‘అవసరంలో ఉన్నావని అవకాశం నీకిస్తున్నా కానీ, ఇందుకు ఇప్పటికే క్యూలో ముగ్గురున్నారు’’ అన్నాడు కొండల్రావు.

ధైర్యం చేస్తే పది లక్షలు. దానికి క్యూలో ముగ్గురు. వారిని కాదని నాకు మొదటి అవకాశం. ‘‘ఏం చెయ్యాలి సార్‌’’ అన్నాను.

కొండల్రావు గొంతు సవరించుకున్నాడు, ‘‘ఎక్స్-11 అనే భయంకర విషముంది. మనిషి ప్రాణాల్ని క్షణాల మీద తియ్యడానికి 20 మిల్లీగ్రాములు చాలు. అయితే అదే విషం వై-09 అనే ఓ భయంకర రోగానికి తిరుగులేని మందు’’ అన్నాడాయన.

21వ శతాబ్దంలో వాతావరణ కాలుష్యం నుంచి పుట్టిన వింత జబ్బు వై-09. ఒంట్లో మార్పులు రోగికి తెలియవు. మానసికంగా చూస్తే – ఉత్సాహం చచ్చిపోతుంది. జీవితేచ్ఛ నశిస్తుంది. వేదాంతధోరణి వస్తుంది. చిన్న విషయానికే గాబరా పడ్డం. రోగం అంటిన 3-4 మాసాల్లో ఏ సూచనా లేకుండా హఠాన్మరణం. శారీరకంగా మార్పులు తెలీక పోవడం వల్ల, రోగి ఆరోగ్యంగానే కనిపించడం వల్ల, ఈ రోగాన్ని పటిష్టమైన వైద్యపరీక్షల్లో తప్ప, మామూలుగా గుర్తించలేరు. అందుకేనేమో, ఇంత వరకూ గుర్తించిన వై-09 రోగుల్లో – ధనికులే తప్ప – పేదలూ, మధ్యతరగతివాళ్లూ లేరు.

ప్రస్తుతానికీ జబ్బుని గుర్తించే సంస్థలు ఇండియాలో మూడంటే మూడే! వాటిలో ‘ఓం శాంతి’ నర్సింగుహోం ఒకటి. రోగులు ఎక్కువగా లేకనేమో, దీనికింకా చికిత్సావిధానం రాలేదు. ‘ఓం శాంతి’ నర్సింగుహోం పరిశోధనల్లో, ఎక్స్-11 అనే విషం, వై-09 జబ్బుకి తగిన మందు అని తేలింది. అయితే ఎక్స్-11 ‌భయంకర విషం కాబట్టి – రోగి ప్రాణాలకు ప్రమాదం.

ఇంతవరకూ కుతూహలంగా విన్న నేను ఇక ఆగలేక, ‘‘విషమే మందైతే – అందువల్ల ప్రయోజన మేముంది సార్‌! ‌రోగం కంటే ముందు మందే విషమై ప్రాణాలు తీస్తుంది కదా!’’ అన్నాను.

కొండల్రావుగారు నవ్వి, ‘‘దానికే వస్తున్నాను. ఎక్స్-11 ‌విషం నల్లమల అడవుల్లో ఉండే అరుదైన విషసర్పం కోరల్లో ఉంటుంది. ఆ పాము కాటుకి గురై కూడా, బ్రతికి బట్టకట్టిన ఆటవికులు కొందరున్నారని తెలిసింది. వాళ్లమీద పరిశోధనలు జరిపి, ఈ రోగానికి విరుగుడు కనుక్కోవచ్చు. కానీ వాళ్లమీద పరీక్షలు చెయ్యడానికి గట్టి ఆంక్షలున్నాయి. అందుకని మేము మా పరిశోధనకు నాగరికులనే వాడుకుంటున్నాం’’ అన్నాడు.

‘‘వాడుకోవడమంటే?’’ అన్నాను కొంచెం అనుమానంగా, కొంచెం భయంగా.

‘‘మనిషి రక్తం తీసుకుని, అందులోకి ఎక్స్-11 ‌విషాన్ని ఎక్కిస్తాం. ఆ రక్తంలో కణాలు చని పోతాయా, లేక విషానికి విరుగుడు తయారవుతుందా అని పరీక్షిస్తాం. విరుగుడు తయారైతే కనుక ఆ రక్తాన్నించి విరుగుడు వేరు చేసి, రోగి రక్తంలోకి ఎక్కిస్తాం. అప్పుడు రోగికి విషం వల్ల ప్రమాద ముండదు. విషం మందులా పనిచేసి రోగాన్ని తగ్గిస్తుంది’’ అన్నాడు కొండల్రావుగారు.

‘‘అర్థమయ్యేలా బాగా చెప్పారు సార్‌! ‌మెడికల్‌ ‌సైన్సు ఇలాంటి పరిశోధనలతో ఎందరికో ప్రాణాలు పోస్తోంది’’ అన్నాను.

‘‘నా వద్ద ప్రస్తుతం ముగ్గురు వై-09 రోగు లున్నారు. వైద్యానికి ఎన్ని లక్షలైనా ఇవ్వగల భాగ్యవంతులు వాళ్లు’’ అన్నాడాయన.

అర్థమైంది నాకు. నా అదృష్టం! నా రక్తం ఎక్స్-11‌కి విరుగుడు తయారు చేసింది! అదిప్పుడు కొందరు భాగ్యవంతుల ప్రాణాలు నిలబెడుతుంది. అందుకు వాళ్లిచ్చే దాంట్లో ఓ పది లక్షలు కొండల్రావుగారు నాకిస్తున్నాడు. కానీ ఇందులో ధైర్యమేముంది? నా రక్తాన్నిప్పటికి మూణ్ణాలుగుసార్లు రక్తపరీక్షకిచ్చాను. అదే రక్తం పది లక్షలిచ్చి నా జీవితాన్నే మార్చేస్తుంది. ధైర్యమంటే కాసిని మిల్లీలీటర్ల రక్తమివ్వడమా? కొండల్రావు గారు మంచివాడు కాబట్టి కానీ, ఈ మాత్రం రక్తానికి ఓ పదివేలిచ్చినా గొప్పే! నాక్కావాల్సింది మూడు లక్షలే అని తెలిసికూడా పది లక్షలిస్తున్న కొండల్రావుగారి ఔదార్యమేమని చెప్పను!

నా సమస్యని తీర్చినందుకు థాంక్స్ ‌చెబితే, ఆయన నవ్వి, ‘‘అయితే ధైర్యం చేస్తావా?’’ అన్నాడు.

ఉలిక్కిపడి, ‘‘ధైర్యమేమిటి సార్‌! ఒక మనిషి ఇవ్వకూడనంత రక్తం గానీ ఇవ్వాలా?’’ అన్నాను కొంచెం భయంగా.

‘‘అబ్బే, ప్రస్తుతానికి రక్తమేం ఇవ్వక్కర్లేదు. 20 మిల్లీగ్రాముల ఎక్స్-11 ఇం‌జక్షన్‌ ‌తీసుకోవాలి నువ్వు’’

‘‘నేనా, ఎందుకు?’’ అన్నాను తడబడుతూ.

‘‘వై-09కి విరుగుడు తయారు చెయ్యడానికి’’ నెమ్మదిగా అన్నాడు కొండల్రావుగారు. ‘‘అందుకు ఆల్రెడీ నా రక్తం తీసుకున్నారుగా’’ అన్నాను.

‘‘అది నీ రక్తం ఆ విషానికి విరుగుడు తయారు చెయ్యగలదో లేదో తెలుసుకునేందుకు’’

నాలో ఏదో అనుమానం రేగింది, ‘‘విరుగుడు తయారైందిగా’’ అన్నాను వణుకుతున్న గొంతుతో.

‘‘ఒంటిబయట తయారైన విరుగుడు వైద్యానికి పనికిరాదు. ఆ విరుగుడు నీ ఒంట్లోనే తయారవ్వాలి. అప్పుడది రోగి ఒంట్లోకి ఎక్కించాలి. ఇందాకా మేము చేసిన పరీక్ష, ఆ విషం వల్ల నీకు ప్రమాదముందో లేదో తెలుసుకునేందుకు మాత్రమే!’’

‘‘అంటే ఇప్పుడు నాకా విషం వల్ల ప్రమాదం లేదన్నమాట!’’ అన్నాను. మాట తడబడుతోంది. దానికి కొండల్రావు, ‘‘అది నాకు తెలుసు, నీకు తెలుసు. విషానికి తెలియక పోవచ్చుగా. అందుకే నువ్వు కాస్త ధైర్యం చెయ్యాలి’’ అన్నాడు.

ఒక్కసారి గుండెలవిసిపోయాయి. అంటే నేనా ఇంజక్షన్‌ ‌తీసుకుంటే, నా ప్రాణం పోయే ప్రమాదం కూడా ఉందన్నమాట!

‘‘ఆలోచించుకో. మీ నాన్నకి ఆపరేషను జరుగుతుంది. నీ చేతిలో అదనంగా డబ్బుంటుంది. మనుషులపై తొలి ప్రయోగమిది కాబట్టి, ఫలవంత మైతే వైద్యచరిత్రలో నీ పేరు చిరస్థాయి అవుతుంది’’ అన్నాడు కొండల్రావు. వీటిలో ఆయన చెప్పని దొకటుంది. ప్రయోగం ఫలవంతం కాకపోతే, నాది ఆత్మహత్య కూడా అవుతుంది!

భార్య గుర్తుకొచ్చింది. పిల్లలు గుర్తుకొచ్చారు. నాన్న గుర్తుకొచ్చాడు. ప్రస్తుతం ఆయనే ప్రాణంగా బ్రతికే అమ్మ గుర్తుకొచ్చింది. వీళ్లంతా నా సంతోషం కోసం చేసినవన్నీ గుర్తుకొచ్చాయి. అన్నీ పోతాయన్న భావన నాలో బలహీనతను బలపరుస్తోంది.

సరిగ్గా అప్పుడే అశోక్‌ ‌గుర్తుకొచ్చాడు. ఈత రాకున్నా నన్ను రక్షించాలని నీళ్లలో దూకాడు. నా మీద పగబట్టొచ్చని, విషసర్పం జోలికెళ్లి ప్రాణాల్ని పణంగా పెట్టాడు. చివరకు డ్రైవింగు నేర్చుకునేందుకు ప్రోత్సహించి నా జీవనోపాధికి కారణమయ్యాడు. తను లేకుంటే నేనుండేవాణ్ణా? ఉన్నా, ఇలా ఉండేవాణ్ణా?

ఇప్పుడు అశోక్‌ ‌నా స్థానంలో తనుంటే ఏం చేసేవాడు?

ఆర్నెల్ల సావాసంలో వారు వీరవుతారంటారు. మాది అంతకంటే చాలా పెద్ద సావాసం. అశోక్‌లా నేనెందుకు తెగించలేను? అయినా ఇది తెగింపు కాదు. నా ప్రాణాలకి రిస్కున్నదని కొండల్రావు అంటున్నది ఒక హెచ్చరిక. అది నిజంగా పెద్ద రిస్కే కనుక అయితే, కొండల్రావుగారే నన్ను ప్రోత్సహిస్తాడనుకోను.

ప్రమాదకరమైన గుండె ఆపరేషన్లకీ సక్సెస్‌ ‌రేట్‌ ‌వంద శాతం ఉంటున్న ఈ రోజుల్లోనూ – కాలికో కంటికో చిన్న ఆపరేషన్‌ ‌చెయ్యాల్సొస్తే – ఫలితానికి బాధ్యత డాక్టర్లది కాదు, మాదేనన్న హామీపత్రాన్ని రోగి బంధువుల నుంచి తీసుకుంటున్నారు.

‘‘ఇదీ అంతేనేమో!’’ అనుకుంటూ, ‘‘ఆలోచించాను సార్‌! ఎక్స్-11 ‌తీసుకుందుకు నేను రెడీ’’ అన్నాను.

ఆ తర్వాత ముగ్గురు వై-09 రోగులు స్వస్థులయ్యారు. నాన్నకు ఆపరేషన్‌ ‌జరిగింది. నా భార్యాబిడ్డలకి అర్థిక సదుపాయాలు పెరిగాయి.

ఇదంతా నా ప్రతిభేనని నేననుకోవడం లేదు. జీవితంలో మరోసారి అశోక్‌కి రుణపడ్డాననుకున్నాను.

చుట్టూ జరిగే అత్యాచారాలకు వేడి నిట్టూర్పులు విడిచే బదులు -మన చుట్టూ ఉండే అశోక్‌ ‌వంటి వార్నించి ఆత్మస్థైర్యాన్నీ, నిస్వార్థపరత్వాన్నీ ప్రేరణగా తీసుకుని సమాజాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి సహకరిస్తుందన్న ఆశతో నా ఈ కథని ఈ కరోనా కాలంలో మీతో పంచుకుంటున్నాను.

About Author

By editor

Twitter
Instagram