తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌యూటర్న్ ‌తీసుకున్నారు. రైతుల విషయంలో మాట మార్చేశారు. రైతులు వేయాల్సిన పంటలను తానే నిర్దేశించాలని చేసిన ప్రయత్నం వికటించడంతో భంగపడ్డారు. అంతేకాదు, ఇకపై ప్రభుత్వ ఆధ్వర్యంలో పంట కొనుగోళ్లు చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ పరిణామాలు రైతుల్లో సందిగ్ధానికి కారణమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రకటనలు చేయడం, నిర్ణయాలు మార్చుకోవడం పట్ల అసహనం వ్యక్తమవుతోంది. మరి, నియంత్రిత సాగు పేరుతో ఒక దఫా పండించిన పంటలకు దిక్కెవరని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. నిర్ణయం తీసుకొని చేతులెత్తేయడంపై పెదవి విరుస్తున్నారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించకున్నా, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా.. కేవలం కేసీఆర్‌ ‌చెప్పారంటూ నియంత్రిత సాగు పేరిట చెప్పిన పంట వేశామని, చాలా ప్రాంతాల్లో పంట నష్టపోయామని, కొన్నిప్రాంతాల్లో వచ్చిన కొద్దిపాటి దిగుబడికి మార్కెట్‌ ‌లేక, గిట్టుబాటు ధరలేక ప్రభుత్వం ఆదుకుంటుందని ఎదురుచూస్తున్న క్రమంలో, ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చిన సమయంలో ఇలాంటి యూటర్న్ ‌నిర్ణయాలు ప్రమాదకరంగా పరిణమించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల విషయంలోనూ కేసీఆర్‌ ‌వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చింది. కనీసం నెల రోజులు కూడా కాకముందే మాట మార్చారు. ఆ చట్టాలను తెలంగాణ రైతులు అనుసరించాలని సూచించారు. ఇది కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. నూతన వ్యవసాయ చట్టాల గురించి ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు కొనసాగుతుండగా.. గత డిసెంబర్‌ ఏడవ తేదీన పలు సంఘాలు భారత్‌ ‌బంద్‌కు పిలుపు నిచ్చాయి. అయితే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆ ‌బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. స్వయంగా తెలంగాణ రాష్ట్రసమితి శ్రేణులే రాష్ట్రమంతటా బంద్‌కు తోడ్పాటునందించాయి. స్వచ్ఛందంగా షాపులు బంద్‌ ‌చేయని వాళ్లను సైతం బలవంతంగా బంద్‌ ‌చేయించారు. కొన్నిచోట్ల టీఆర్‌ఎస్‌ ‌నాయకులే దౌర్జన్యాలకు పాల్పడిన సంఘటనలు కూడా నమోదయ్యాయి. ఆ సమయంలో కేసీఆర్‌ ‌బాహాటంగానే, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై విమర్శలు చేశారు. అయితే, కేసీఆర్‌ ‌ద్వంద్వ వైఖరులపై అప్పుడే తెలంగాణ వ్యాప్తంగా వ్యతిరేకత వచ్చింది. ముఖ్యంగా తెలంగాణ రైతులు కేసీఆర్‌ ‌తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఇంటగెలిచి రచ్చ గెలవాలి గానీ, తెలంగాణ సొంత రాష్ట్రంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేసీఆర్‌.. ఎక్కడో ఢిల్లీలో జరుగుతున్న ఉద్యమానికి మద్దతు తెలపడం ఏంటని అన్నదాతలు ఘాటుగా ప్రశ్నించారు కూడా.. అయితే, కేసీఆర్‌ ఆ ‌సమయంలోనే ఉన్నట్టుండి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా కేందప్రభుత్వ పెద్దలను కలిశారు. కానీ, అక్కడే ఉద్యమం చేస్తున్న రైతులను మాత్రం కలవలేదు. మూడు రోజులు ఢిల్లీలో ఉన్నా.. రైతులను కలిసే సమయం దొరకలేదా? అన్న విమర్శలు కూడా అప్పుడు వచ్చాయి. అయితే, ఇన్నాళ్లూ మౌనంగా ఉన్న కేసీఆర్‌.. ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు మరోసారి చర్చనీయాంశం అయ్యాయి. ఓ వైపు తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై యూటర్న్ ‌తీసుకోవడంతోపాటు.. కేంద్ర వ్యవసాయ చట్టాలపైనా తన వైఖరి మార్చుకున్నారు.

తెలంగాణలో ఈ వర్షాకాలంలో నియంత్రిత సాగు విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అందరూ ఒకే రకమైన పంటలు వేయకుండా.. డిమాండ్‌ ఉన్న పంటలనే వేయాలని సీఎం కేసీఆర్‌ ‌రైతులకు సూచించారు. అప్పుడే మంచి లాభాలు వస్తాయని పదే పదే విజ్ఞప్తి చేశారు. వానాకాలంలో మొక్కజొన్న పంటలను వేయవద్దని.. దాని స్థానంలో పత్తి, కందులు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పారు. అలాగే, సన్నరకం వడ్లు పండించాలని, అవసరమైతే ఇక్కడినుంచి దేశవ్యాప్తంగా ఎగుమతులు చేయవచ్చని ఆశచూపారు. కానీ వర్షాకాలం సీజన్‌ ‌ముగిసి.. యాసంగి పంటకు రైతులు సిద్ధమవుతున్న వేళ.. నియంత్రిత సాగుపై సీఎం కేసీఆర్‌ ‌యూటర్న్ ‌తీసుకున్నారు. రాష్ట్రంలో నియంత్రిత సాగు అవసరం లేదని స్పష్టం చేశారు. రైతులు ఇక నుంచి తమకు నచ్చిన పంటను పండించవచ్చని.. నచ్చిన చోట అమ్ముకోవచ్చని తెలిపారు.

వ్యవసాయంపై డిసెంబర్‌ 27‌వ తేదీన ముఖ్య మంత్రి కేసీఆర్‌ ‌ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. వివిధ రకాల పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు విధానం, రైతుబంధు అమలు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు – కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు-ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు వ్యవసాయ సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది.

రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతోందని, ఈ రైతువేదికల్లో రైతులు, వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశం కావాలని, తమ స్థానిక పరిస్థితులు, మార్కెట్‌ ‌పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనే విషయంలో ఎక్కడికక్కడే నిర్ణయాలు తీసుకోవాలని ఆ సమా వేశంలో నిర్ణయించారు. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించు కోవాలని, రాష్ట్రవ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుండి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిదని, రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలని, పంటను ఎక్కడ అమ్ముకుంటే మంచి ధర వస్తుందో అక్కడే అమ్ముకోవాలని, ఈ అంశాలన్నింటిపై ఇకపై రైతులకే పూర్తిస్థాయి స్వేచ్ఛ అని, ఇదే ఉత్తమ విధానం అని ఈ సమావేశంలో అభిప్రాయం వ్యక్తం కావడంతో సీఎం కేసీఆర్‌ ‌దీనికే మొగ్గుచూపారు. అయితే వ్యవసాయ మార్కెట్‌లో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా పద్ధతి ప్రకారం నిర్వహించాలని ప్రభుత్వం సూచించింది. రైతులంతా ఒకేసారి తమ పంటను మార్కెట్‌కు తీసుకురాకుండా వంతుల ప్రకారం తీసుకురావాలని సూచించింది.

అంతేకాదు.. ఇకపై గ్రామాలలో, కొనుగోలు కేంద్రాల్లో పంట కొనుగోళ్లను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దనే మానవతా దృక్పథంతో ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసిందని పేర్కొంది. ప్రతిసారి అలాగే చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడింది. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని.. రైస్‌ ‌మిల్లరో, దాల్‌ ‌మిల్లరో కాదని తెలిపింది. కొనుగోళ్లు – అమ్మకాలు ప్రభుత్వం బాధ్యత కాదు కాబట్టి వచ్చే ఏడాది నుండి గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం సాధ్యపడదని వెల్లడించింది.

ఇదే సమయంలో నూతన వ్యవసాయ చట్టాల ప్రస్తావన కూడా తెచ్చారు కేసీఆర్‌. ‌దేశంలో అమలు కాబోతున్న కొత్త చట్టాలు కూడా రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయని తెలిపారు. కాబట్టి ప్రభుత్వమే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని, పంట అమ్మకం ఇకపై రైతు ఇష్టమని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తాజాగా తీసుకున్న ఈ నిర్ణయాలపై విపక్షాలు కన్నెర్ర జేశాయి. కేసీఆర్‌ ‌తలతిక్క నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పిచ్చి నిర్ణయాలతో అందరినీ గందరగోళంలో పడేస్తున్నారని విమర్శిస్తున్నాయి. రైతులకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యులు అని ప్రశ్నిస్తున్నారు. రైతులు పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్న కేసీఆర్‌.. ‌భారత్‌ ‌బంద్‌కు మద్దతు ఇచ్చి ఎందుకు సతాయించారని మండిపడుతున్నారు. అయితే, ఇప్పటికైనా కేసీఆర్‌కు నూతన వ్యవసాయ చట్టాల ఆవశ్యకత తెలియడం మంచి పరిణామమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

– సుజాత గోపగోని,  సీనియర్‌ ‌జర్నలిస్ట్, 6302164068

About Author

By editor

Twitter
Instagram