– ‌డా।। దుగ్గరాజు శ్రీనివాస్‌

‌భారతదేశం 1947లో స్వాతంత్య్రం సాధించింది. నాడు స్వాతంత్య్ర సాధన ఆనందాన్ని మించిన విషాదం కూడా అందింది భారతీయులకు. అదే దేశ విభజన. మతం ఆధారంగా అఖండ భారత్‌ని ముక్కలు చేశారు బ్రిటిష్‌ ‌వారు. అందుకు మూలం నాటి ఆలిండియా ముస్లిం లీగ్‌, ‌దాని నేత మహమ్మ దాలి జిన్నా. హిందువులతో తాము కలిసి బ్రతకలేం కాబట్టి తమకు ప్రత్యేకంగా ఒక దేశం కావాలన్న మహమ్మ దాలి జిన్నా వాదన. ఆ వాదనను నిర్ద్వం ద్వంగా తిరస్కరించాల్సింది పోయి భారత జాతీయ కాంగ్రెస్‌ అనుసరించిన ముస్లిం లీగ్‌ ‌సంతుష్టీకరణ విధానం వల్ల జిన్నా మరింత బలపడ్డాడు, మొండికేశాడు. విభజించి పాలించే మనస్తత్వం గల బ్రిటిష్‌ ‌పాలకులు ఇటువంటి అవకాశం వదులుకుంటారా! దేశాన్ని మతపరంగా చీల్చారు. సరిహద్దులు సక్రమంగా నిర్దేశించని విభజన చేశారు. ఎన్ని లక్షలమంది మరణించారో లెక్కలేదు. ఎన్ని కోట్లమంది అటు, ఇటు శరణార్థులుగా ప్రయాణం చేశారో అంచనా వేయలేం. ప్రపంచ చరిత్రలోనే అదొక విషాద ఘట్టం.


ఆ విషాదాన్ని మరచిపోయి భారతీయులందరిని ఏకం చేయగల పంథాలో పరిపాలన ప్రారంభించగలమనుకున్నాం. కాని తొలి భారత ప్రధాని నెహ్రూ తప్పిదాలు భారతీయులను ఏకం చెయ్యలేదు. మతం సంగతి మరచిపోయి భారతీయతకు ప్రాధాన్యత పెంచే చట్టాలు రూపొందించ లేదు. మత చట్టాలకు రాజ్యాంగ బద్ధంగా పెద్దపీట వేసి, దేశ సమైక్యతకు భంగం కలిగించేలా చేసింది కాంగ్రెస్‌.

అలా స్వదేశానికి గాయాలు చేసిన నెహ్రూ కుటుంబీకుల బారి నుండి దేశాన్ని రక్షించుకుని భారతీయతకు ప్రాధాన్యతనిచ్చే దిశలో కొత్త చట్టాలను నిర్మిస్తూ, అందరిలో జాతీయతా భావం పెంపొందించి, మనదేశ స్వాతంత్ర దిన ప్లాటినమ్‌ ‌జూబ్లీని ఘనంగా జరుపుకోవాలని నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. అయితే దురదృష్టవశాత్తు ఆనాటి ముస్లిం లీగ్‌ ‌రాజకీయం దేశంలో పునఃప్రతిష్టించేందుకు కొత్త శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

జిన్నా కాలపు ముస్లిం లీగ్‌ని కేరళలోని కొన్ని నియోజకవర్గాలకు పరిమితం చెయ్యగలిగింది భారతీయ చైతన్యం. కాని కొన్ని రాజకీయ వర్గాల స్వార్థం ఆ ముస్లిం లీగ్‌ని మరో రూపంలో దేశంలో విస్తరిల్లేలా చేస్తున్నది. ఆ సరికొత్త ముస్లిం లీగ్‌ ఆలిండియా మజ్లిస్‌ ఇత్తేహాదుల్‌ ‌ముస్లిమీన్‌ (ఏఐఎమ్‌ఐఎమ్‌). అలనాటి మహమ్మదాలి జిన్నాకి మరో రూపమే మజ్లిస్‌ ‌నేత అసదుద్దీన్‌ ఒవైసి.

నిజాం నవాబు అండతో హత్యాకాండ, అత్యాచారాలు జరిపి హిందూ జనాభాని అడుగడుగునా వేధించిన రజకార్ల వారసత్వంతో రూపుదిద్దుకున్న పార్టీ ఎమ్‌ఐఎమ్‌ ‌స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో అది హైదరాబాద్‌ ‌పాత బస్తీలోని ఒక గల్లీ పార్టీ. అటువంటి పార్టీని దగ్గరకు తీసి, బుజ్జగించి, ఆర్థికంగా సహాయం చేసి ఒక శక్తిగా హైదరాబాద్‌ ‌లోక్‌సభ స్థానానికి శాశ్వత ప్రతినిధిగా చేసింది కాంగ్రెస్‌ ‌పార్టీ రాజకీయం.

ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ‌పార్టీ నిలబెట్టిన అభ్యర్థులను ఒక్కసారి గమనించండి. అది శాసనసభ స్థానానికికైనా లేక లోక్‌సభ స్థానానికైనా ఆ నియోజక వర్గాలలో సంఖ్యాపరంగా బలంగా ఉన్న వర్గం వారిని ఎంపిక చేస్తారు. కాని అందుకు పూర్తిగా విరుద్ధం హైదరాబాద్‌ ‌లోక్‌సభస్థానంలో ఆ నియోజక వర్గంలో ముస్లింలు అధిక సంఖ్యాకులైనా సరే.. అక్కడ కాంగ్రెస్‌ ‌నిలబెట్టేది హిందువునే. తద్వారా హిందువుల ఓట్లు చీలి మజ్లిస్‌ ‌గెలవాలి. నాటి సలావుద్దీన్‌ ఓవైసి వరస గెలుపు అలా సాధ్యమైనదే. అందుకు ప్రతిగా మిగిలిన నియోజక వర్గాలలో ముస్లింల ఓట్లు కాంగ్రెస్‌కి వేయించటం ఆ రెండు పార్టీల చీకటి ఒప్పందం. దశాబ్దాలు సాగిన ఆ కాంగ్రెస్‌, ఎమ్‌ఐఎమ్‌ అనుబంధం ఏ కారణం చేతనో తెగింది. అయితేనేం కాంగ్రెస్‌ ‌పార్టీ నేర్పిన సంతుష్టీకరణ, మత రాజకీయ దండం మజ్లీస్‌ అం‌దిపుచ్చుకుంది. పాతబస్తీ దాటి జంట నగరాలకు విస్తరించింది. ఇప్పుడు ఇతర రాష్ట్రాలకు చేరుతోంది. ఇది అలనాడు ముస్లిం లీగ్‌ ‌రూపుదిద్దుకున్న తీరులోనే సాగుతున్నది. ముస్లిం ప్రయోజనాలు అంటూ నాడు మహమ్మదాలి జిన్నా చేసిన ప్రసంగాల తరహాలోనే నేడు అసదుద్దీన్‌ ఒవైసి ప్రసంగిస్తున్నారు. కానీ నాడు జిన్నా కూడా చెయ్యనంత తీవ్రంగా ఒవైసి సోదరుడు హైందవ మతం మీద దాడి చేస్తున్నాడు. ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రానికి విస్తరిస్తున్న ఎమ్‌ఐఎమ్‌ని చూస్తుంటే భారతదేశంలో తిరిగి ముస్లిం లీగ్‌ ‌ప్రాణం పోసుకుని ద్విజాతి సిద్ధాంతాన్ని మరోమారు తెరమీదికి తెస్తుందా అనే భయాందోళనలు సహజంగానే కలుగుతున్నాయి. ఒవైసి చేస్తున్న మత రాజకీయాలను ఖండించాల్సింది పోయి తమకు కలిగిన రాజకీయ నష్టం గురించే కాంగ్రెస్‌, ఇతర ప్రాంతీయ పార్టీలు మథన పడుతున్నాయి. మరోవైపు మజ్లిస్‌ ‌మేధావులు ఒవైసి మత రాజకీయానికి అస్థిత్వ రాజకీయమంటూ కొత్త ముసుగు కప్పి సమర్థిస్తున్నారు.

దేశ జనాభాలో 12-15% ఉన్న ముస్లిమ్‌లకు సొంత పార్టీ ఉంటే తప్పేమిటని ఎమ్‌ఐఎమ్‌కి మద్దతు పలికేవారు చరిత్ర తెలియని హీనులు. దేశంలో 73 ఏళ్ల క్రితం ఏమి జరిగిందో తెలిసికూడా గుడ్డిగా ‘ముస్లిమ్‌లీగ్‌’ ‌రూపాన్ని సమర్థించటం దేశద్రోహమే అవుతుంది.

ఇటీవల జరిగిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు సీట్లు గెలుచుకున్న మజ్లిస్‌ ఇక మా అడుగులు బెంగాల్‌ ‌వైపు అంటూ సవాలు విసురుతున్నది. ఈ నేపథ్యంలో 2015-2020 మధ్య బిహార్‌లో ఏమి జరిగిందని, మజ్లిస్‌ ఐదు సీట్లు ఎలా గెలుచుకున్నదనే దానిని పరిశీలించాలి.

2015లో జరిగిన బిహార్‌ ఎన్నికలలో కూడా మజ్లిస్‌ ‌పోటీ చేసింది, ఒవైసి ప్రచారం చేసారు. కాని నాడు పోటీ చేసిన ఐదు సీట్లు ఓడిపోయింది. నాల్గింటిలో డిపాజిట్‌ ‌కోల్పోయింది. 2020లో 20 సీట్లు పోటీ చేసి ఐదు చోట్ల గెలిచింది. ఈ ఐదేళ్లలో ఒవైసి బిహార్‌లో తిరిగింది లేదు, పార్టీని నిర్మించిందీ లేదు. కాని ఐదు సీట్లు గెలవటం వెనుకున్నది ముస్లిం ఓటర్లను రెచ్చగొట్టేందుకు, తగిన వాతావరణం ఇతర పార్టీలు నిర్మించి పెట్టాయి. విదేశాల నుండి అక్రమంగా భారత్‌లోకి వస్తున్న వారిని నిలువరించేందుకు తెచ్చిన సిఎఎ చట్టాలను ముస్లిం వ్యతిరేక చట్టాలుగా కాంగ్రెస్‌, ‌కమ్యూనిస్టులు పనిగట్టుకొని ప్రచారం చేసారు. ముస్లింలలో భయాందోళనలను నింపారు. ఆ విధంగా సమాజాన్ని మతపరంగా చీల్చటంలో ప్రతిపక్షాలు పాత్ర పోషించగా, ఆ విద్వేష ప్రచార పంటను ఒవైసి కోసుకుంటున్నారు. రేపు బెంగాల్‌లో మజ్లిస్‌ ‌పోటీ చేస్తే జరిగేది కూడా ఇదే. ఆ రాష్ట్రంలో ముస్లిం ఓట్లు మజ్లిస్‌కి పడటమే కాదు, ముస్లిం లీగ్‌ ‌మనస్తత్వం బెంగాలీలలో పెరుగుతుంది. తాము ప్రత్యేకం అనే భావజాలం ముస్లిం లీగ్‌ ‌పెంచి పోషించినందున బెంగాల్‌ ‌విభజన నాడు జరిగింది. ఆ తర్వాత భారత విభజన జరిగింది. తిరిగి అటువంటి విభజనను దేశం ఎదుర్కోవాలా! అది ఎంత ప్రమాదకర పరిణామమో వీరికి తెలియదా! అయినా రాజకీయ స్వార్థం కోసం మరో ‘ముస్లిం లీగ్‌’‌ని సృష్టిస్తారా! అందుకు అవసరమైన నేపథ్యం నిర్మించి పెడుతున్న కమ్యూనిస్టులు కళ్లు తెరవాలి. తనది కమ్యూనిస్టు భావజాలం అని చెప్పుకుంటున్న నటుడు కమలహాసన్‌ ‌తమిళనాడులో రాజకీయ అవతారం ఎత్తి ఇప్పుడే ఎమ్‌ఐఎమ్‌తో పొత్తు పెట్టుకుంటున్నట్టు ప్రకటించాడు. ఇదంతా ఒక ప్రమాదకర పరిణామం.

ఈ విషయాలు జాతీయ భావాలున్న వారినే కాదు ముస్లింలలోని మేధోవర్గంలో కొందరిని సైతం ఆందోళనకు గురి చేస్తున్నాయి. భారతదేశంలో మరో ముస్లిం లీగ్‌ ‌తల ఎత్తితే, అది ఆ మతస్థులకే ప్రమాదం అంటూ వారు హెచ్చరిస్తున్నారు. దేశ విభజన సమయంలో జరిగిన ఘోర సంఘటనలు గుర్తు చేసుకుని మరోసారి ఈ గడ్డమీద మతం పేరుతో మారణకాండ ఎంత ప్రమాదమో, ఇక్కడ కారే రక్తం, అయ్యే గాయాల ప్రభావం దేశాన్ని ఎటు తీసుకు పోతాయో వారు గుర్తు చేసేందుకు యత్నిస్తున్నారు. 1947 నాటి గాయాలు మరచిపోతున్న వేళ తిరిగి ముస్లిం లీగ్‌ ‌పుట్టుక సరికాదన్నదే వారి హెచ్చరిక.

మహారాష్ట్ర, యు.పి., బిహార్‌ ‌గెలుపు తర్వాత అసదుద్దీన్‌ ఒవైసి వెనక్క తిరిగి చూడాల్సిన పనిలేదనీ, తాను మరో జిన్నాను అనుకుంటున్నాడు. గల్లీ స్థాయి నుండి అఖిల భారత ముస్లిం నేతగా ఎదిగే క్రమంలో తాను ఎటువంటి హీన మార్గాన్నైనా అనుసరించేం దుకు సిద్ధం అంటున్నాడు. తనను విమర్శించే వారికి ‘నేను చేతులు ముడుచుకుని ఇంట్లో బిర్యానీ తింటూ, ముషాయిరాలు వింటూ గడపాలా?’ అని ఎదురు ప్రశ్న వేస్తున్నాడు. ముస్లింలను కూడగడితే తప్పేమిటి! అనేది ఒవైసి ప్రశ్న.

అయితే ఉత్తరప్రదేశ్‌కే చెందిన ఉర్దూ కవి మునావర్‌ ‌రాణ మాత్రం ‘ఒవైసి చేస్తున్నది పెద్ద తప్పు, ముస్లింలకు ముప్పు కలిగించేది’ అని కుండబద్దలు కొడుతున్నాడు. ‘అసదుద్దీన్‌ ఒవైసి వంటివాడు సమాజాన్ని చీల్చటమే కాదు ముస్లింలను దెబ్బతీస్తున్నాడు. కాబట్టి ముస్లింలు మేలుకుని ఈ దేశంలో మరో జిన్నా తయారవకుండా ఆపాలి’ అని పిలుపునిచ్చాడు. ‘ఒవైసి కుటుంబం నాకు నాలుగు దశాబ్దాలకుపైగా తెలుసు. వారి స్వార్థం గురించి తెలుసు. హైదరాబాద్‌లో వారు సంపాదించిన 15 వేల కోట్ల ఆస్తులు కాపాడుకునేందుకు ముస్లింలను పావులుగా వాడుకుంటున్నారు. ఇక చిన్నవాడు అక్బరుద్దీన్‌ ఒక గూండా’ అని అన్నాడు.

‘ముస్లింల సమస్యలకు ఒవైసి ఇచ్చే మందు వారి సమస్యలను పరిష్కరించకపోగా రోగాన్ని మరింత పెంచుతుంది’ అన్నది అమెరికాలోని మిచిగన్‌ ‌యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ ‌మహమ్మద్‌ అయూబ్‌ ‌మాట. ‘అసదుద్దీన్‌ ఉద్వేగపూరిత ప్రసంగాలు సమస్యలను పరిష్కరించవు. కాని వారిని రెచ్చగొడతాయి. ఫలితంగా భారతీయ సమాజంలో వారు మరింత వేరవుతారు. తన సొంత ప్రయోజనాల కోసం, మజ్లిస్‌ ‌రాజకీయ విస్తరణ కోసం సహజంగానే రెచ్చిపోయే గుణం గల ముస్లిమ్‌లను మరింత రెచ్చగొట్టి వారిని స్వీయ విధ్వంసానికి ప్రోత్సహిస్తున్న మోసపూరిత మత పెద్ద ఒవైసి’ అని విమర్శించాడు అయూబ్‌.

‌ముస్లిం లీగ్‌ ‌మనస్తత్వం ప్రమాదకరమైనది అని అందరూ హెచ్చరిస్తున్నదే. ప్రస్తుత సమాజం కోరుకుంటున్నది ఏమిటో ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల అలీఘడ్‌ ‌ముస్లిం విశ్వవిద్యాలయ శతవత్సర (శత జయంతి) సమావేశంలో స్పష్టంగా చెప్పారు. ఈ దేశంలో రాజకీయాలకు తొందర లేదు, వాటిని ఆపుదాం. కాని అభివృద్ధిని ఆపవద్దు. అందుకు అవరోధాలు కల్పించవద్దు. ఈ దేశంలో అభివృద్ధి ఫలాలు అందుకునేందుకు మతం అడ్డంకి కానేకాదు. కానివ్వను. శరీరం ఆరోగ్యంగా కనిపించాలంటే దేహంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉండాలి. దేశం సుభిక్షంగా ఉండాలంటే అన్ని వర్గాలు సుభిక్షంగా ఉండడం అవసరం అంటూ నరేంద్రమోదీ ముస్లిం విద్యావంతులకు సందేశమిచ్చారు.

అయితే ఇలాంటి సందేశం నేడు ప్రత్యేకంగా ఇచ్చినది కాదు. తొలి ప్రధాని జవాహర్‌ ‌లాల్‌ ‌నెహ్రూ 1948 జనవరిలో అదే ఆలీఘడ్‌ ‌విశ్వవిద్యాలయంలో ప్రసంగిస్తూ ‘నేడు ఈ దేశానికి మేధో సంపత్తిని, సంస్కృతిని అందించిన వారి వారసత్వాన్ని చూసి గర్విస్తాను. మరి మీరు ఈ దేశ గతం గురించి ఏ భావాలు కలిగి ఉన్నారు? మీరు కూడా ఆ సంస్కృతికి వారసులుగా భావించుకుని నాలాగానే గర్వపడతారా! ఆ సంస్కృతి నాది, మీది, ఇక్కడి వారందరిది అనుకుంటారా? లేక అదేదో మరెవరిదో, నాకు సంబంధం లేనిదని, ఆ సంస్కృతిని అర్థం చేసుకోకుండా, సంస్కృతి వారసులుగా, వాటి పరిరక్షకులుగా, ఆ సంపదలో భాగంకాకుండా దూరంగా ఉంటారా?’ అంటూ ప్రశ్న సంధించారు.

ఇద్దరు ప్రధానుల ప్రసంగాలు విన్న తర్వాతైనా ముస్లింలు తమ లోపం ఎక్కడుందో, తాము ఎవరిని అనుసరించాలో నిర్ణయించుకోవాలి. సమాజంలో ఉన్న బంధాలను పెంపొందింపచేసే నాయకులను ఎంచుకుంటారా! లేక స్వార్థ పూరిత ముస్లిం లీగ్‌ ‌మనస్తత్వ ఒవైసి ప్రసంగాలకు కొట్టుకపోయి నష్టపోతారా! నేడు కావాల్సింది వేగంగా అభివృద్ధి చెందేందుకు అవసరమైన రహదారి, దానిని నిర్మించే నాయకత్వం. అంతేకాని కృత్రిమ వేగ నిరోధకాలు నిర్మించేవారు, గొయ్యి తవ్వేవారు కాదు. భారతీయతకు ప్రాధాన్యత నిచ్చే ప్రజానీకంగా ముస్లింలు రూపుదిద్దుకుని, తమను స్వార్థం కోసం వాడుకుంటున్న ఒవైసి వంటివారికి బుద్ధి చెప్పాలి.

 వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram