అంతర్జాతీయ సంబంధాల ముఖచిత్రం మారబోతున్నదా? గల్ఫ్ ‌దేశాల ప్రభుత్వాలలో వస్తున్న కొత్త ఆలోచనలు, ఆ ఆలోచనలకు కార్యరూపం ఇవ్వడానికి జరుగుతున్న పరిణామాలు విశ్వ విదేశాంగ విధానాన్ని మార్చబోతున్నాయనడానికి సంకేతాలే. ఇజ్రాయెల్‌, అరబ్‌ ‌దేశాల మధ్య విభేదాలు తగ్గడం; పాకిస్తాన్‌, ‌టర్కీ, ఇరాన్‌ల మిడిసిపాటుకు అడ్డుకట్ట పడడం ఈ పరిణామంతో సాధ్యమయ్యే అవకాశాలు ఎక్కువే. ఈ నేపథ్యంలోనే డిసెంబర్‌ 9 ‌నుంచి 14వ తేదీ వరకు భారత సైనిక దళాల అధిపతి జనరల్‌ ‌మనోజ్‌ ‌ముకుంద్‌ ‌నరవణె మధ్య ప్రాచ్యంలో పర్యటించారు. ఈ యాత్రకి మీడియాలో పెద్దగా చోటు దక్కలేదు. పర్యటనకు సైనికాధికారి కేంద్రబిందువు అయినంతమాత్రాన, దానితో వచ్చిన ఫలితాల ప్రస్తావనార్హం కాకుండా ఉండవు. గల్ఫ్‌ప్రాంతానికీ, ప్రపంచ ముస్లిం దేశాలకీ తలమానికంగా ఉండే యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, ‌సౌదీ అరేబియాలలో జనరల్‌ ‌నరవణె పర్యటించారు. క్రమం తప్పకుండా ఉమ్మడి సైనిక విన్యాసాలు జరపడం, సైనికబలగాలకు శిక్షణ, కలసి రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేయడం వంటి అంశాలను సానుకూలం చేసుకోవడమే ఆ పర్యటన ఉద్దేశం.

ఈ పర్యటన విజయవంతం అయినట్టే చెప్పాలి. పర్యటన ఫలితాలు భారత్‌, ఆ ‌రెండు దేశాలకే పరిమితం కావడం లేదు. అంతర్జాతీయ సంబంధాలు కొత్తరూపు సంతరించుకుంటున్న స్పష్టమైన సంకేతాలు కూడా ఆ ఫలితాలతో ప్రపంచానికి వెల్లడైంది.

మొదటిసారి

మన విదేశాంగ విధానంలో సైనికాధికారుల స్థాయిలో మంత్రులు, ప్రధానుల మధ్య వ్యవహారం గానే ఉంటుంది. కానీ మారిన పరిస్థితులలో రక్షణ, సాంకేతిక రంగ ప్రాధాన్యం దృష్ట్యా విదేశాంగ విధానం రూపు కూడా మారింది. దాని పరిణామమే జనరల్‌ ‌నరవణె యాత్ర. అయితే మన విదేశ వ్యవహారాల మంత్రి ఎస్‌. ‌జైశంకర్‌ ‌బహ్రెయిన్‌, ‌యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పర్యటించిన తరువాతే మన జనరల్‌ ‌వెళ్లారు. భారత్‌ ‌సైనిక బలగాల అధిపతి అధికారికంగా సౌదీ అరేబియా వెళ్లడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఏడు చిన్నరాజ్యాల యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో పర్యటించడం కూడా ఇదే తొలిసారి. ఆయన పర్యటన విజయవంతం కావడం అంటే, మధ్య ప్రాచ్యంతో భారత్‌ ‌సంబంధాలు పటిష్టమవుతున్నాయనే అర్థం. కొన్నేళ్లుగా ఆ రెండుదేశాలతో భారత్‌ ‌సంబంధాలు మెరుగైన దిశగా సాగుతున్నాయని మన రక్షణ, భద్రతవర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ పర్యటన చాలా ముందే జరగవలసి ఉంది. కొవిడ్‌ 19 ‌కారణంగా వాయిదా పడింది. మధ్య ప్రాచ్యానికి వెళ్లడానికి ముందు అక్టోబర్‌లో మైన్మార్‌, ‌నవంబర్‌లో నేపాల్‌ ‌కూడా జనరల్‌ ‌నరవణె వెళ్లి వచ్చారు. దాడి చేసే సామర్ధ్యం ఉన్న జలాంతర్గామిని మైన్మార్‌కు ఇవ్వడానికి చర్చలు జరిగాయి.

మంచికో చెడ్డకో కొవిడ్‌ 19 ‌నేపథ్యంలో కొన్ని దేశాల నిజస్వరూపాలు బయటపడిన తరువాత సంభవించిన ఈ పరిణామం వల్ల సానుకూల దృక్పథం కలిగిన అంతర్జాతీయ సంబంధాల రూపకల్పనకు అనువైన వాతావరణం ఇంకాస్త బలపడిందని అనిపిస్తుంది. విచారించవలసింది ఒక్కటే ఉంది- ఈ చర్చలు ఆలస్యం కావడం వల్ల ఆ రెండుదేశాలతో కలసి మన దేశం చేయవలసిన సైనిక విన్యాసాలు వాయిదా పడ్డాయి. ఇది కొన్ని దేశాల విరగబాటుకు అవకాశం కల్పించింది.

 జనరల్‌ ‌నరవణె పర్యటన కాబట్టి ఇందులో ప్రధానంగా రక్షణ దిగుమతుల అంశం ప్రాధాన్యం దక్కించుకుంది. రక్షణ ఉత్పత్తులలో దేశీయమైన సామర్ధ్యం పెంచుకోవాలన్న ఆశయం ఈ మూడు దేశాలకు ఉంది. ఇందుకు సహాయసహకారాలు అందించుకోవాలని భావిస్తున్నాయి. భారత సైన్యానికి కావలసిన కార్బయన్లను మేక్‌ ఇన్‌ ఇం‌డియా పంథాలో తయారుచేయడానికి అరబ్‌ ఎమిరేట్స్‌తో ఇప్పటికే చర్చల పక్రియ మొదలయింది కూడా. అవి పూర్తయితే ఆ దేశ ప్రభుత్వ సంస్థ కరాసెల్‌తో ఒప్పందం జరుగుతుంది.

కీలక ఘట్టంలో రంగ ప్రవేశం

ఇవన్నీ ఆధునిక కాలపు విదేశీ సంబంధాలలో సాధారణమైన అంశాలే. అసాధారణమైనది మాత్రం జనరల్‌ ‌నరవణె పర్యటన జరిగిన సమయం. అరబ్‌ ఎమిరేట్స్, ‌సౌదీ రెండూ ముస్లిం ప్రపంచంలో అగ్రరాజ్యాలే. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత నుంచి ఇస్లాం దేశాలు కఠోరంగా పాటిస్తున్న ఒక దౌత్య నియమానికి ముగింపు పలికి, పెనుమార్పు తేవడానికి ఇప్పుడు ఆ రెండు దేశాలు ప్రయత్నాలను ముమ్మరం చేశాయి. ఆ రెండు ప్రముఖ దేశాలు కలసి మిగిలిన ముస్లిం దేశాలలో తీసుకురావాలను కుంటున్న మార్పు, ఇజ్రాయెల్‌- ‌ముస్లిం దేశాల మధ్య సయోధ్య. ఇది ప్రపంచ దౌత్యనీతిలోనే పెద్ద పరిణామం. ఈ ప్రయత్నాల మీద విశ్లేషకులు విశ్వాసంతో ఉన్నారు కూడా. ఎనిమిది దశాబ్దాల చరిత్ర, వర్తమాన పరిస్థితుల ప్రాతిపదికగా ఆ ప్రయత్నం జరుగుతున్నదని అనిపిస్తుంది. అందులో భాగంగానే పాకిస్తాన్‌ ‌కూడా తన పాత వైఖరిని వీడి ఇజ్రాయెల్‌తో బంధం నెరపేటట్టు చేయాలన్న ప్రయత్నం జరుగుతున్న సమయం కూడా ఇదే. అయితే, ఆ దిశగా ఎమిరేట్స్, ‌సౌదీలు చేస్తున్న ప్రయత్నాలకు గండికొట్టి, ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కో ఆపరేషన్‌ (ఓఐసీ)కు పోటీ కూటమిని ఏర్పాటు చేయడానికి పాక్‌ అతి తెలివి ప్రదర్శిస్తున్న సమయమూ ఇదే. కశ్మీర్‌ అం‌శంలో ముస్లిం దేశాలు తనతో వంత పాడనందుకు ఆగ్రహించిన పాకిస్తాన్‌ ఇలాంటి ఆత్మహత్యాసదృశమైన ధోరణిలోకి దిగజారిపోయింది.

అర్ధం లేని ఆగ్రహం

 జనరల్‌ ‌నరవణె పర్యటించిన వేళకు వ్యూహాత్మకమైన కోణమూ ఉంది. నిన్న మొన్నటిదాకా ఎంతో బలమైన మిత్రదేశంగా ఉన్న సౌదీతో పాకిస్తాన్‌ ‌సంబంధాలు మున్నెన్నడూ లేని స్థాయిలో క్షీణించిన సమయమిది. ఇది ముమ్మాటికీ పాకిస్తాన్‌ ‌స్వయంకృతాపరాధం. కశ్మీర్‌ ‌భారత్‌ అం‌తర్గత సమస్య అని చాలా ముస్లిం దేశాలు ప్రకటించడం పాక్‌ ‌జీర్ణించుకోలేకపోతున్నది. అందులో సౌదీ ఒకటి. దశాబ్దాల కాలంగా సత్సంబంధాలు సాగిస్తూ, పాలక కుటుంబం నుంచి ఎంతో లబ్ధి పొందినప్పటికీ సౌదీ అరేబియాకు కూడా ఇప్పుడు పాకిస్తాన్‌ ‌దూరమైంది. కశ్మీర్‌పై దాని మంకుపట్టు ఇందుకు కారణం. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దును వ్యతిరేకించేందుకు ఓఐసీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడంలో విఫలమయ్యారంటూ పాకిస్తాన్‌ ‌విదేశాంగమంత్రి షా మహమ్మద్‌ ‌ఖురేషీ సౌదీ మీద విరుచుకుపడ్డారు. దీనితో మొన్న ఆగస్ట్ ‌నుంచి పాకిస్తాన్‌ను సౌదీ పక్కన పెట్టేసింది. తన ఆగ్రహం ఏ స్థాయిలో ఉన్నదో ఆలస్యం లేకుండా ఆ నెలలోనే పాకిస్తాన్‌కు సౌదీ అర్థమయ్యేటట్టు చేసింది. నష్ట నివారణ చర్యల కోసం పాక్‌ ‌సైనికాధిపతి ఖమర్‌ ‌జావెద్‌ ‌బజ్వా సౌదీ వెళ్లారు. కశ్మీర్‌ ‌విషయంలో ఆ దేశాన్ని తమ వైఖరికి దగ్గరగా తీసుకురావడం కూడా బజ్వా ఆశయం. ఇదే కాదు, పాక్‌ ‌సైనికాధిపతిని సౌదీ యువరాజు మహమ్మద్‌ ‌బిన్‌ ‌సల్మాన్‌ ‌పతకంతో సత్కరిస్తారనీ, పాక్‌ ‌తీసుకున్న రుణంలో రాయితీ ప్రకటిస్తారనీ అనుకున్నారు. కానీ బజ్వాతో సమావేశం కావడానికి కూడా యువరాజు అంగీకరించలేదు. సైనికాధికారులతో లాంఛనంగా సమావేశమై బజ్వా ఒట్టి చేతులతోనే వెనుదిరిగారు. తన విదేశాంగ విధానాన్ని తానే నిర్దేశించుకునే స్వేచ్ఛ సౌదీకి ఉంటుంది అంటూ ఈ పరిణామం మీద విశ్లేషణలు వచ్చాయి.

నరవణెకు ఎమిరేట్స్, ‌సౌదీ స్వాగతం

 భారత్‌ ‌పంపిన జనరల్‌ ‌నరవణెకు అక్కడ ఘనస్వాగతమే లభించింది. గల్ఫ్ ‌రాజ్యాలతో పాకిస్తాన్‌ ‌బంధాన్ని తెంచడంలో భారత్‌ ‌విజయవంత మైందన్న విషయం దీనితోనే అర్థమవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. భద్రతా వ్యవహారాలలో భారత్‌నే ముఖ్య భాగ స్వామిగా గల్ఫ్‌దేశాలు భావిస్తున్న సంగతీ స్పష్టమైంది. భారత్‌, ‌రష్యా సంయుక్త ఆధ్వర్యంలో నిర్మించిన బ్రాహ్మోస్‌ ‌క్షిపణి అమ్మకాల గురించి జనరల్‌ ‌నరవణె సౌదీ, ఎమిరేట్స్‌లతో జరిపిన చర్చలలో ప్రస్తా వించారు. వాటిని కొనుగోలు చేయడానికి ఆ దేశాలు ఆసక్తి చూపించాయి.

జనరల్‌ ‌నరవణె ఎమిరేట్స్ ‌సైనిక దళాధిపతి మేజర్‌ ‌జనరల్‌ ‌సలేహ్‌ ‌మహమ్మద్‌ ‌సలేహ్‌ అల్‌ అమేరితో చర్చలు జరిపారు. అక్కడ సైనిక వందనం అందుకున్నారు. అమర సైనికుల స్మారక స్తూపం దగ్గర నివాళి ఘటించారు. అక్కడే ఉన్న పదాతిదళ తర్ఫీదు కేంద్రాన్ని సందర్శించారు. సౌదీ సైనికాధికారులు ఫయ్యాద్‌ ‌బిన్‌ ‌హమీద్‌ ‌రువేలీ (సైనిక దళాల ప్రధానాధికారి), లెఫ్టినెంట్‌ ‌జనరల్‌ ‌ముత్లాక్‌ ‌బిన్‌ ‌సలీమ్‌ ‌బిన్‌ అల్‌ అజీమ్‌లను కలుసుకున్నారు.

నోరు విప్పిన పాక్‌ ‌మీడియా

ఇంత జరిగిన తరువాత గాని పాకిస్తాన్‌ ‌చేస్తున్న వరస తప్పిదాల విషయంలో ఆ దేశ మీడియా నోరు విప్పలేదు. ఇప్పుడు దేశ విదేశాంగ విధానం మీద పాక్‌ ‌మీడియా దుమ్మెత్తి పోస్తున్నది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు ఏర్పాటు చేసుకోవలసిందంటూ తమ మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్నదని ఇటీవల పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ‌ప్రకటించారు కూడా. అప్పుడే వెలువడిన వార్త- ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాల కోసం అరబ్‌ ఎమిరేట్స్, ‌బహ్రెయిన్‌, ‌సుడాన్‌ ‌ముందడుగు వేశాయి. పాకిస్తాన్‌ ‌చేస్తున్న తప్పిదాల గురించి కొత్తగా అనుకునేది ఏమీ లేకున్నా, మధ్య ప్రాచ్యంతో ఇమ్రాన్‌ఖాన్‌ అనుసరించిన విధానం మాత్రం ఘోర వైఫల్యమని ‘ఫ్రైడేటైమ్స్’ ‌పత్రిక వ్యవస్థాపకుడు నజామ్‌ ‌సేథి వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌తో ఇస్లామిక్‌ ‌రాజ్యాలు సంబంధాలు నెలకొల్పుకోవాలన్న సౌదీ, అరబ్‌ ఎమిరేట్స్ ‌ప్రయత్నాన్ని నిరాశపరచి, ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కోఆపరేషన్‌ (ఓఐసీ)కి పోటీ సంస్థ లేదా ప్రత్యామ్నాయ సంస్థను టర్కీతో కలసి నిర్మించాలన్న పాకిస్తాన్‌ ‌యోచన దేశానికి ఎంత నష్టం తెచ్చిందో కూడా నజామ్‌ ‌వెల్లడించాడు. టర్కీతో పాటు మలేసియా, ఇరాన్‌ ‌కూడా ఆ పనిలో తన వెంటే ఉంటాయని పాక్‌ ‌విశ్వాసం. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణం రద్దు చేయడాన్ని ఖండించడానికి ఓఐసీని సమావేశ పరచకపోవడం తప్పిదమని విమర్శిస్తూ, సౌదీని ముస్లిం ప్రపంచం ముందు బోనులో నిలబెట్టడానికి పాక్‌ ‌చేసిన ప్రయత్నాన్ని ఆ దేశం పెద్ద సవాలుగానే తీసుకుంది. పాకిస్తాన్‌ను నిలువరించేందుకు ఉద్యుక్తమైంది. తీసుకున్న మూడు బిలియన్‌ ‌డాలర్ల రుణం వెంటనే చెల్లించమని మాడు పగిలేలా స్పందించింది. పాక్‌ ‌తలపెట్టిన గ్వదర్‌ ‌నౌకాశ్రయ నిర్మాణానికి సౌదీ సాయం చేస్తానని చెప్పిన 10 బిలియన్‌ ‌డాలర్ల సాయం కూడా ఇక హుళక్కేనని అర్ధమైపోయింది.

చైనా శల్య సారథ్యం

 ఇక్కడ ఇంకొక విషయం ఉంది. సౌదీ ఇచ్చిన రుణం తిరిగి చెల్లించడానికి తాను 1.5 బిలియన్‌ ‌డాలర్లు అందిస్తానని పాకిస్తాన్‌ ‘ఉక్కు మిత్రుడు’ చైనా ముందుకు వచ్చింది. అంటే సౌదీని ఖాతరు చేయవద్దని చెప్పడమే. ముస్లిం దేశాలతో చెలిమి కంటే, భారత్‌తో వైరమే ప్రధానమన్న ధోరణితోనే పాక్‌ ఉం‌డాలన్న తన ఆశయాన్ని చైనా కాపాడు కుంటున్నది. కశ్మీర్‌ ‌వివాదం భారత్‌ అం‌తర్గతమని సౌదీ విధానం. ఈ విధానం నుంచి తప్పుకోవడానికి ఇష్టపడక, వీర ముస్లిం దేశమైన పాకిస్తాన్‌నే దూరంగా పెట్టింది. సౌదీ పాలక కుటుంబానికి రక్షణ ఇచ్చేది పాక్‌ ‌సైనికులే. సౌదీ సైనికులకు పాక్‌ ‌సైనికాధికారులు తర్ఫీదు ఇస్తారు. అక్కడి మక్కా, మదీనాలకు రక్షణ కల్పించేది కూడా పాకిస్తాన్‌ ‌సైనికులే. ఇదంతా కొన్ని దశాబ్దాలుగా సాగుతున్నది. వీటన్నిటిని వదిలి, దౌత్యనీతిని గౌరవించే క్రమంలో పాకిస్తాన్‌ను పక్కకు పెట్టినందుకు సౌదీని అభినందించవలసిందే. మరొక ముఖ్య పరిణామం, మరీ ముఖ్యంగా భారత్‌లో విపక్షాలు గమనించవలసిన అంశం- ముస్లింలు మెజారిటీగా ఉన్న దేశాల నుంచి తమ దేశాలకు వచ్చే వారికి ఎమిరేట్స్ ‌వీసాలను నిలిపివేసింది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్టు ఆ దేశం చెబుతోంది. వీసాలకు అడ్డుకట్ట పడిన దేశాలలో పాకిస్తాన్‌ ఒకటి. ఆడలేక మద్దెల ఓడు అన్నట్టు, ‘బహుశా కొవిడ్‌ 19 ‌రెండో దశ వల్ల వీసాలు నిలిపివేసి ఉండవచ్చు’ అని పాక్‌ ‌విదేశాంగ కార్యాలయం ఒక చచ్చు కారణం ప్రపంచం ముందు పెట్టింది.

అమెరికా మధ్యవర్తిత్వంతో అరబ్‌ ఎమిరేట్స్, ఇ‌జ్రాయెల్‌ ‌మధ్య శాంతి ఒడంబడిక జరిగింది. పాలస్తీనా వాసులకు పూర్తి స్థాయి హక్కులు దక్కేవరకు తాను ఇజ్రాయెల్‌తో సంబంధాలు పెట్టుకునే ప్రశ్నే లేదని ఇమ్రాన్‌ఖాన్‌ ‌మొండికేస్తున్నారు. తక్షణం వెళ్లి సౌదీ అరేబియా యువరాజును శరణు వేడమంటూ భారత్‌లో పాకిస్తాన్‌ ‌రాయబారి అబ్దుల్‌ ‌బాసిత్‌ ఇ‌మ్రాన్‌కు ట్వీట్‌ ‌చేశారు. సౌదీ అంటే ప్రపంచ ముస్లింలకు మూడు రకాలుగా భవ్యమైనది. ఒకటి- ఇస్లాం పవిత్ర క్షేత్రాలన్నీ అక్కడే ఉన్నాయి. వాటి పరిరక్షణ బాధ్యత తీసుకున్న దేశం సౌదీ. రెండు- మెజారిటీ సున్నీలకు నాయకత్వం వహిస్తున్న దేశం. మూడు- ఏ దేశ ఆర్థిక పురోభివృద్ధికైనా అక్కడి ఇంధన వనరులు అత్యంతావశ్యకం. కశ్మీర్‌ ‌మీద దురాశతో, భారత్‌ ‌మీద పగతో పాకిస్తాన్‌ ‌చేస్తున్న మూర్ఖపు పని ఏమిటో అబ్దుల్‌ ‌బాసిత్‌ ‌బాగానే గ్రహించారు.

కశ్మీర్‌ ‌విషయంలో మూర్ఖత్వాన్ని తలకెక్కించుకున్న పాక్‌, ఆ ‌మూర్ఖత్వాన్ని అలాగే నిలిపి ఉంచాలన్న చైనాలను అలా ఉంచితే, మధ్య ప్రాచ్యంలో దౌత్యనీతి విషయంలో వచ్చిన పరిణామం నిజంగా విప్లవమే. ఇజ్రాయెల్‌ ‌కూడా గతాన్ని విస్మరించి అరబ్‌ ‌దేశాలతో పాటు, ప్రపంచ దేశాలతో దేనితో వీలైతే దానితో బంధాన్ని నెలకొల్పుకోవాలన్న ఆశయంతోనే ఉంది. జపాన్‌తో ఆ దేశం ఏర్పరుచుకున్న సంబంధాలు ఇందుకు ఉదాహరణ. ఇజ్రాయెల్‌, ‌మధ్య ప్రాచ్యం నడుమ శాంతి నెలకొంటే పాలస్తీనా సమస్యకు పరిష్కారాన్ని ఆశించవచ్చు. మొత్తంగా చూస్తే ప్రపంచ శాంతికి పడుతున్న మరొక అడుగులో 1992 నుంచి భారత్‌ అనుసరిస్తున్న విధానం మార్గదర్శకంగా ఉండడం సంతోషించవలసిందే. ఆసియా అశాంతికి కేంద్రంగా ఉన్న పాకిస్తాన్‌ ‌బలహీనపడడం కూడా మంచి పరిణామమే. కానీ పాకిస్తాన్‌, ఇరాన్‌, ‌టర్కీ త్రయం తరువాత అడుగు ఎటు?


ఇండియా… ఇజ్రాయెల్‌

‌గతాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇజ్రాయెల్‌తో దౌత్య బంధం నెలకొల్పాలని తాజాగా ఎమిరేట్స్, ‌సౌదీలు చేస్తున్న ప్రయత్నం దౌత్యనీతిలో మైలురాయి. 1992లోనే భారత్‌ ఆ ‌దేశంతో సంబంధాలకు శ్రీకారం చుట్టి, మూడో ప్రపంచ దేశాల విదేశాంగ విధానానికి కొత్త దిశను చూపింది. భారత ప్రధానులు పీవీ నరసింహారావు (కాంగ్రెస్‌), అటల్‌ ‌బిహారీ వాజపేయి (ఎన్‌డీఏ/బీజేపీ), మన్మోహన్‌ ‌సింగ్‌(‌యూపీఏ/కాంగ్రెస్‌) ఇ‌జ్రాయెల్‌ ‌విధానంలో తెచ్చిన మార్పుకీ, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానానికీ ఎమిరేట్స్, ‌సౌదీల తాజా ప్రయత్నం కొనసాగింపే. వరసగా అధికారంలోకి వచ్చిన ఈ నలుగురు ప్రధానులు ప్రథమ ప్రధాని నెహ్రూ తప్పిదాన్ని సరిగ్గా గుర్తించి, వాస్తవిక పరిస్థితులకు అను గుణంగా విదేశాంగ విధానాన్ని మార్చుకున్నవారే.

ఇ‌జ్రాయెల్‌ ‌తొలి ప్రధాని బెన్‌ ‌గురియన్‌తో జయప్రకాశ్‌ ‌నారాయణ్‌, 1958

స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత విదేశాంగ విధానం మొత్తం నెహ్రూ భావనా ప్రపంచం శాసించినదే. దానికీ, వాస్తవ ప్రపంచా నికీ పొంతన లేకపోవడమే విషాదం. ఇజ్రాయెల్‌ ‌పట్ల అనుసరించిన విధానంలో అది పరోక్షంగా కనిపిస్తుంది. చైనా విషయంలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. తమకొక రాజ్యం (తాము కోల్పోయినదే అది) ఉండాలని యూదులు కోరుకోవడం న్యాయబద్ధమేనని గాంధీజీ భావించారు. అంటే ఇజ్రాయెల్‌ ఏర్పాటును స్వాగతించారు. కానీ మత ప్రాతిపదికన దేశం ఏర్పడడం సరికాదని భావించారాయన. పాలస్తీనా అరబ్బులదేనని ఆయన విశ్వసించారు. అంటే పాలస్తీనా విభజనను వ్యతిరేకించారు. దాని మీద అరబ్బులకు సహజ హక్కు ఉందని గాంధీజీ అన్నారు. మూడు భాగాలుగా చీలిన పాలస్తీనా ఒక వంతు ఇజ్రాయెల్‌లో ఉంది. ఈ విభజనకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో (1949) భారత్‌ ఓటు వేసింది. హిందుత్వ పునాదిగా జాతీయతను, స్వాతంత్య్రోద్యమాన్ని నిర్వచించిన నాయకులు కూడా ఇజ్రాయెల్‌ ఏర్పాటును స్వాగతించారు. హిందూ మహాసభ నేత వినాయక్‌ ‌దామోదర్‌ ‌సావర్కర్‌ ‌రాజకీయ, నైతిక కారణాలతో ఇజ్రాయెల్‌ ఏర్పాటును సమర్థించారు. నెహ్రూ వైఖరిని విమర్శించారు కూడా. ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రెండో సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ఎంఎస్‌ ‌గోళ్వాల్కర్‌ ‌యూదు జాతీయతా దృక్పథానికి మద్దతు పలికారు. జాతీయత ప్రాతిపదికగా రాజ్యం ఏర్పడాలన్న వారి ఆకాంక్ష నెరవేరాలంటే పాలస్తీనా ఇజ్రాయెల్‌లో అంతర్భాగంగా ఉండాలని కూడా గురూజీ గట్టిగా చెప్పారు. ఈ వాదనతో ఆనాడు గురూజీని నెహ్రూభక్తులు, వామపక్షవాదులు ఆజన్మాంతం కటువైన పదాలతో విమర్శించారు.

 నెహ్రూ ప్రభుత్వం 1950లో ఇజ్రాయెల్‌ను గుర్తించింది. ‘మేం చిరకాలం క్రితమే గుర్తించి ఉండ•వలసింది. ఎందుకంటే ఇజ్రాయెల్‌ ఒక వాస్తవం. కానీ గుర్తించకుండా ఉండిపోవడానికి కారణం మా మిత్రులైన అరబ్‌ ‌దేశాల మనోభావాలను గాయపరచకూడదన్న భావనే’ అన్నారు. అరబ్‌ ‌మిత్రులే కాదు, భారత్‌ ‌ముస్లింల మనోభావాల గురించి నెహ్రూకు ఇంకా పెద్ద బాధే ఉందనుకోవాలి. పాలస్తీనా సమస్యకు తాను అనుకూలం కాబట్టి ఇజ్రాయెల్‌తో పూర్తిస్థాయి దౌత్య సంబంధాలన• నెహ్రూ నిరాకరించారు. ఇజ్రాయెల్‌ ‌దౌత్య కార్యాలయం రాజధాని ఢిల్లీలో కాకుండా ముంబై (బొంబాయి)లో ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే అంగీకరించారు. అది ఢిల్లీలో ఉంటే అరబ్‌ ‌దేశాలతో సంబంధాలు బెడిసికొడతాయని భయం.1950 నుంచి 1990 వరకు ఇజ్రాయెల్‌ ‌కాంగ్రెస్‌ ‌ప్రభుత్వాలకు అంటరానిదే. 1958లో జయప్రకాశ్‌ ‌నారాయణ్‌ ఇ‌జ్రాయెల్‌ ‌వెళ్లి, ఆ దేశ తొలి అధ్యక్షుడు డేవిడ్‌ ‌బెన్‌గురియన్‌ను కలుసుకోవడం వంటి ఘట్టాలు తప్ప దౌత్య సంబంధాలు లేవు. వాస్తవం చెప్పాలంటే, నెహ్రూ తన వారసత్వంగా భారత్‌కు అందించినది ఒక అవాస్తవిక విదేశాంగ విధానం. దానికి ముస్లింల బుజ్జగింపు ధోరణి ఉచితం.

 ఈ వృధా విన్యాసానికి పీవీ హయాంలో, అంటే కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఉన్నప్పుడే మంగళం పాడారు. 1992లో టెలి అవివ్‌ (ఇ‌జ్రాయెల్‌ ‌రాజధాని)లో భారత దౌత్య కార్యాలయం వెలసింది. అప్పటికి ఈ ఇరుదేశాల వ్యూహాత్మక ప్రయోజనాలు, భద్రతకు సంబంధించిన బెడదల మధ్య సారూప్యం ఉండ డంతో బంధం బలపడింది. అప్పటికీ, పాలస్తీనా భూభాగాల మీద ఇజ్రాయెల్‌ ‌దాడులను నిరంతరం భారత్‌ ‌ఖండిస్తున్నా కూడా ఈ బంధం పటిష్టమవు తూనే ఉంది.ఈ ద్వంద్వ వైఖరి కూడా యూపీఏ మైనారిటీ బుజ్జగింపు ధోరణి ఫలితమేనని విశ్లేషకుల నిశ్చితాభిప్రాయం. 2014, జూలైలో ఇజ్రాయెల్‌, ‌హమాస్‌ (ఇ‌జ్రాయెల్‌కు వ్యతిరేకంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ) మధ్య ఉద్రిక్తతలు తారస్థాయికి వెళ్లినప్పుడు వాటికి కారణం ఇరుపక్షాలు అని భారత్‌ ‌ప్రకటించింది. మోదీ ప్రధాని అయిన తరువాత వచ్చిన గుణాత్మకమైన మార్పు ఇది. భారతదేశానికి తొలిసారి వచ్చిన ఇజ్రాయెల్‌ అధ్యక్షుడు – ఎజెర్‌ ‌వీజ్‌మెన్‌ (1997). ఇ‌జ్రాయెల్‌ ‌సందర్శించిన తొలి కేంద్రమంత్రి ఎల్‌కె అడ్వాణి (2000). ఆ మరుసటి ఏడాది నాటి విదేశాంగ మంత్రి జస్వంత్‌ ‌సింగ్‌ ‌వెళ్లారు. ఇజ్రాయెల్‌ ‌వెళ్లిన తొలి భారత విదేశాంగ మంత్రి ఆయనే. 2003లో ఆ దేశ ప్రధాని ఎరియల్‌ ‌షరొన్‌ ‌భారత్‌ ‌వచ్చారు. తొలిసారి భారత్‌కు వచ్చిన ఆ ఇజ్రాయెల్‌ ‌ప్రధానికి నాటి ప్రధాని వాజపేయి ఘనస్వాగతం పలికారు. ఆనాటి పర్యటనను మీడియాలో ఒక వర్గం స్వాగతించింది. కొన్ని ముస్లిం సంఘాలు, వీరికి తోడుగా వామపక్షాలు నిరసనలు చేపట్టాయి. ఇజ్రాయెల్‌తో తెంచుకుని, పాలస్తీనాతో బంధం పటిష్టం చేసుకోవాలని అలీఘడ్‌ ‌ముస్లిం విశ్వవిద్యాలయ విద్యార్థులు ధ్వజమెత్తారు. అంటే యూదుమతం ప్రమాదం. ఇస్లాం కాదు. ముస్లిం రాజ్యాలలో సహా ప్రపంచమంతటా మారిన పరిస్థితులు వీరికి పట్టలేదు. యథాతథ స్థితినే కోరుకున్నారన్నమాట.

2006లో నలుగురు భారత ప్రముఖులు ఇజ్రాయెల్‌ ‌యాత్రకు వెళ్లారు. వారు శరద్‌ ‌పవార్‌, ‌కపిల్‌ ‌సిబల్‌, ‌కమల్‌నాథ్‌, ఇం‌కొకరు నాటి గుజరాత్‌ ‌ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ. ఇజ్రాయెల్‌ ‌నుంచి పెద్ద ఎత్తున సైనిక సామగ్రిని కొనుగోలు చేసే దేశం భారత్‌. ‌భారత్‌కు సైనిక సామగ్రిని ఎగుమతి చేసే రెండో అతి పెద్ద దేశం ఇజ్రాయెల్‌. 1999-2009 ‌మధ్య ఇరుదేశాల మధ్య జరిగిన సైనిక కొనుగోళ్లు మొత్తం 9 బిలియన్‌ ‌డాలర్లు.

ఇప్పుడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ఇ‌జ్రాయెల్‌కు దగ్గర కావడం వెనుక ఉన్న కారణాలలో ఒకటి- తన చిరకాల శత్రువు ఇరాన్‌ ‌నుంచి పొంచి ఉన్న బెడదే. సౌదీ అరేబియా పాకిస్తాన్‌ను మెడపట్టుకు గెంటడానికి కారణం ఆ దేశ మొండి వైఖరి తప్ప మరొకటేదీ కాదు. కాబట్టి ఇజ్రాయెల్‌ ‌పట్ల నెహ్రూ అనుసరించిన విధానం, ముస్లిం దేశాలపట్ల ఏర్పరుచు కున్న భావన ముస్లిం సంతుష్టీకరణలో భాగమే కానీ, కీర్తి కండూతే కానీ దేశ ప్రయోజనాన్ని ఆశించి కాదన్న గురూజీ అభిప్రాయమే సత్యమని కళ్లెదుట కనిపిస్తున్న ఈ పరిణామాలు చాటడం లేదా!

– జాగృతి డెస్క్

About Author

By editor

Twitter
Instagram