అభివృద్ధి కోసం ఆన

హైదరాబాద్‌లో జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల నుంచి భారతీయ జనతా పార్టీ రాజకీయాలు పాతబస్తీలోని చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మీ ఆలయం చుట్టే తిరుగుతున్నాయి. వరద సాయం నిలిపివేతకు బీజేపీయే కారణమని టీఆర్‌ఎస్‌ ఆరోపించడంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌భాగ్యలక్ష్మీ ఆలయానికి వెళ్లారు. ఎన్నికల సంఘానికి తాను ఎలాంటి లేఖ రాయలేదని అమ్మవారి మీద ప్రమాణం చేసి చెప్పారు. అంతేకాదు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కూడా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి రావాలని సవాల్‌ ‌కూడా చేశారు. కానీ టీఆర్‌ఎస్‌ ఈ ‌సవాలును స్వీకరించలేదనుకోండి, అది వేరే విషయం. అయితే, ఈ పరిణామం తర్వాత చార్మినార్‌ ‌భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. అదే సమయంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షా కూడా మొదట ఇక్కడ ప్రత్యేక పూజలు చేసిన తర్వాతే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. దీంతో హైదరాబాద్‌ ‌నగర నడిబొడ్డున ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం ఇప్పుడు బీజేపీకి ప్రధాన కేంద్రంగా మారిందని చెప్పాలి.

ఈ నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో గెలుపొందిన తమ పార్టీ కార్పొరేటర్లతో అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేయించారు. ప్రజల ఆశీస్సులు, అమ్మవారి కృప వల్లే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలిచామని ఈ సందర్భంగా సంజయ్‌ అన్నారు. వాస్తవానికి పోలింగ్‌ ‌కంటే ముందే.. సంజయ్‌ ‌భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి వెళ్లిన సమయంలోనే ఈ మేరకు ప్రకటన చేశారు. తాజాగా దానిని అమలు చేశారు.

సాధారణంగా ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలు అసెంబ్లీలో, ఎంపీలు పార్లమెంట్‌లో, కార్పొరేటర్లు సంబంధిత కార్పొరేషన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ఈ ‌సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.  ఇందుకు ప్రత్యేకంగా ప్రమాణ పత్రం రూపొందించారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు అందరితోనూ ఆ ప్రమాణ పత్రం చదివించారు.

ఆ ప్రమాణ పత్రం చూస్తే- ‘బీజేపీ కార్పొరేటర్‌గా ఎన్నికైన నేను స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని, ఎటువంటి అవినీతి, అక్రమాలకు పాల్పడబోనని, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని భాగ్యలక్ష్మీ మహాశక్తి అమ్మవారి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నా డివిజన్‌ ‌పరిధిలోని ప్రజలతో సంప్రదింపులు జరిపి రాగద్వేషాలకు అతీతంగా ప్రాధాన్యాంశాల వారీగా డివిజన్‌ అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తానని హామీ ఇస్తున్నాను. జాతీయ భావాలు, దేశం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న బీజేపీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని ప్రమాణం చేస్తున్నాను’ అని ఉంది. దీనిని పరిశీలిస్తే ఓవైపు కార్పొరేటర్‌గా తమ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడం, మరోవైపు బీజేపీ సిద్ధాంతాలకు, క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానన్న అంశాలు ఉన్నాయి. అంటే, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి, విస్తరణకు ప్రణాళికలు రచిస్తోన్న బీజేపీ వ్యూహాలను ఈ ప్రమాణ పత్రం ప్రతిబింబిస్తోంది.

రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ‌బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీలో, కార్యకర్తల్లో సరికొత్త ఉత్సాహం కనబడుతోంది. అందుకు తగ్గట్టే బండి సంజయ్‌ ‌సంచలన నిర్ణయాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటివరకు ఎవరూ చేయని కార్యక్రమాలను ఆయన నేతృత్వంలో పార్టీ  రూపొందిస్తోంది. అనూహ్యమైన కార్యాచరణ అమలు చేస్తోంది. పూర్తి దూకుడుగా వ్యవహరిస్తోంది.

ఈ ఏడాది చివరలో జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు, ఫలితాలు తెలంగాణ రాజకీయాలపైనే కాదు, సామాజికంగానూ పెనుమార్పులు తీసుకొచ్చే దిశగా పయనిస్తున్నాయని చెప్పవచ్చు. ప్రధానంగా హైదరాబాద్‌లోని పాతబస్తీని భారతీయ జనతా పార్టీ టార్గెట్‌ ‌చేయడం సంచలనం సృష్టిస్తోంది. పాతబస్తీలో పరిస్థితులు, వెనుకబాటుతనం, అక్కడి హిందువుల స్థితిగతులు, అభివృద్ధికి ఆమడదూరంలో జీవనం వెల్లదీస్తున్న నిరుపేదలు వంటి అంశాలను బీజేపీ లేవనెత్తుతోంది. మొత్తానికి ప్రగతివైపు పాతబస్తీ పయనం మందకొడిగా సాగడాన్ని సవాల్‌ ‌చేస్తోంది. ఈ సందర్భంగానే శరవేగంగా పాతబస్తీ అభివృద్ధిని చేసిచూపిస్తామన్న భరోసాను ప్రజల్లో కల్పించే ప్రయత్నం చేస్తోంది. దీనికి ప్రజల మద్దతు కావాలని కోరుతోంది. అంటే, ఇప్పటినుంచే రానున్న సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అంతేకాదు, తమ పార్టీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని ప్రత్యేకంగా ప్రస్తావిస్తోంది.

మజ్లిస్‌ ‌విముక్త హైదరాబాదే లక్ష్యం..

కార్పొరేటర్ల ప్రమాణం సందర్భంగా బండి సంజయ్‌ ‌చేసిన వ్యాఖ్యలు మరోసారి ప్రాధాన్యం సంతరించుకున్నాయి. భాగ్యలక్ష్మీ అమ్మవారి శక్తిని దేశవ్యాప్తంగా చాటేందుకే ఇక్కడకు వచ్చామని, మజ్లిస్‌ ‌విముక్త  హైదరాబాదే తమ ముందున్న లక్ష్యమని సంజయ్‌ ‌స్పష్టం చేశారు. కానీ టీఆర్‌ఎస్‌, ఎంఐఎం ‌కలిసి కుట్రలు చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌కు మణిహారంగా నిలుస్తోన్న మెట్రో రైలును ఓల్డ్ ‌సిటీకి ఎందుకు వద్దంటున్నారని, పాతబస్తీకి కంపెనీలు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. సంఘ విద్రోహశక్తులకు ఎందుకు అడ్డాగా మారిందో చెప్పాలని టీఆర్‌ఎస్‌, ఎంఐఎం‌ను నిలదీశారు. తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని.. అయితే, హిందూ సమాజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరిం చారు. అంతేకాదు, కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం తెలంగాణ బీజేపీ సహకరిస్తుందని స్పష్టం చేశారు. నగరాభివృద్ధికి బీజేపీ కార్పొరేటర్లు సహకరిస్తారన్నారు. పాతబస్తీకి మళ్లీ మళ్లీ వస్తామని నినాదాలు చేశారు. ఇదే మా అడ్డా అని ప్రకటించారు. ఎంఐఎంకు వ్యతిరేకంగా శివాజీలా పోరాడతా మన్నారు. పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఇలాంటి ప్రసంగాలు చేయడం, ఇలాంటి ప్రతిజ్ఞలు చేయడం దాదాపు ఇదే తొలిసారి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
Instagram