– తరిగొప్పుల వి ఎల్లెన్‌ ‌మూర్తి

‌శ్రీగిరిరాజు ధర్మసంరక్షణ పరిషత్తు కథల పోటీలో ప్రత్యేక బహుమతి పొందినది


చలికి భయపడి ఈత నేర్చుకోకపోతే

లక్ష్యాలూ… ఆవలి తీరంలోని అందాలు సొంతం ఎలా అవుతాయి?

— – – – – – – – –

‘దేవీ! సాయంత్రం.. సీత వాళ్లింట్లో సీమంతానికొస్తావా?’ ఫోన్‌లో అడిగింది గిరిజ.

‘హబ్బా నేను రాలేను… ఇంట్లో మా అత్తగారు ఉన్నారు కదా. ఆవిడ ఎక్కడికి వెళ్లదు. నన్ను ఎక్కడికీ వెళ్లనివ్వదూ. ఈ జీవితం అంతే!’ నిర్లిప్తంగా జవాబిచ్చింది దేవి.

‘ఈ ఒక్కసారికీ రావే, ఆవిణ్ణి ఎలాగోలా బతిమాలి’

‘అది కుదిరే పని కాదు కానీ వేరే ఏదైనా చెప్పు’

‘అలా కాదే! పెళ్లయి ఎన్నో ఏళ్లకి సీత కడుపు పండిందని ఓ పండగలా చేస్తున్నారే. పోనీ ఫోన్‌ ‌మీ అత్తగారికియ్యి…నేను మాట్లాడుతా!’ దేవిని ఎలాగైనా తనతోపాటు సీమంతానికి తీసుకెళ్లాలని చివరి ప్రయత్నం చేసింది గిరిజ.

‘వద్దులేవే అది మరో గొడవా!’…మాట తప్పించే ప్రయత్నం చేసింది దేవి.

‘సరే అయితే రేపు ఫోన్‌ ‌చేస్తా..’

‘ఆ.. అక్కడి విశేషాలూ చెప్పూ’ ఫోన్‌ ‌పెట్టేసి హాయిగా నిట్టూర్చింది దేవి. ఆమె అత్తగారు ‘ఎవరు దేవీ ఫోన్లో..’ఆరా తీస్తున్నట్లుగా అడిగింది.

‘అదేనండీ… గిరిజ ఫోన్‌ ‌చేసిందీ…సీత సీమంతం గురించీ’

‘ఎప్పుడూ’

‘ఇవాళే.. రమ్మని ఫోన్‌ ‌చేసింది’

‘మరి వెళ్తున్నావా’

‘లేదు తలనొప్పిగా ఉందండీ’

‘అదేంటీ మీ ముగ్గురూ మంచి స్నేహితులు కదా, వెళ్లకపోతే ఏమీ అనుకోరూ?’

‘నేను వెళ్తే మీ భోజనానికి ఇబ్బంది’

‘ఒక్కపూట ఏమిబ్బందీ – నువ్వు మరీనూ. ఏదో టిఫినూ చేసేస్తాలే..నువ్వు వెళ్లు’!

‘వద్దులెండీ… ఓ గంట పోగ్రాం కోసం నాలుగు గంటలు టైం వేస్ట్!’

‘ఏం‌టో నీ వయసులో నేను బొంగరంలా తిరిగేదాన్ని. మీ మామగారు పోయాక ఎక్కడికీ వెళ్లబుద్ధికావడంలేదు కానీ, ఏ వేడుకకి వెళ్లినా నేనే తలలో నాలుకలా అయిపోయేదాన్ని. ఇప్పుడు వయసు సహకరించడం లేదు..’ అత్తగారు చెప్పుకుపోతోంది.

‘ఏంటోనండీ … ఈ తిరగడాలంటే చిరాకు వస్తోంది’ విసుగూ అసహనం దేవి మాటల్లో మేళవింపు.

‘నిజమేననుకో.. కానీ స్నేహితులూ బంధువులూ అంతా కలిసి మాట్లాడుకునే రోజులేవీ!?’ నిట్టూర్చిందామె అత్తగారు.

హు… ఈవిడ సోది వినడం ఇక కష్టం అనుకుంటూ ఫోన్‌లో వాట్సాప్‌ ఆన్‌ ‌చేసి సీతకి గ్రీటింగ్స్ ‌పంపింది. ఫోటోలు పెట్టమని మెసేజూ పెట్టింది. ఆ తర్వాత ఏసీ ఆన్‌ ‌చేసుకుని ఫేస్‌బుక్‌, ‌వాట్సాప్‌ ‌మెసేజ్‌లు చదువుకుంటూ ఉండగా అత్తగారు భోజనానికి పిలవడంతో ఫోన్‌కి చార్జింగ్‌ ‌పెట్టి అత్తగారు పెట్టిన భోజనం సుష్టుగా తిన్నది. తింటున్నప్పుడే మరో ఇద్దరు స్నేహితులు ఫోన్లు చేసి రమ్మన్నా ‘రాలేనని అత్తగారి వల్ల ఎక్కడా ఇల్లు కదల్లేకపోతున్నా’నని చెప్పేసింది.

దేవి ఉన్న కాలనీలోనే రెండిళ్లవతల శిరీష ఉంది. ఆమె భర్తా, దేవి భర్తా ఒకే ఆఫీసు. రాష్ట్రం విడిపోవడంతో అమరావతిలో రూం తీసుకుని వారానికోసారి సెలవులప్పుడు వస్తూ ఉంటారు. దేవి, శిరీషలకి ఇక కబుర్లే కబుర్లు… కలిసి మాట్లాడుకోవడం కన్నా ఫోన్లే ఎక్కువ. ఫేస్‌బుక్‌ ‌వంటల గ్రూప్‌లో వస్తోన్న పిండివంటల గురించీ, సినిమాల గురించీ, కాలనీలోని మిగతావాళ్ల గురించీ గంటల తరబడి మాట్లాడు కుంటున్నా తనివి తీరదు వాళ్లకి. ఇక్కడ ఇద్దరికి ఒకే విషయంలో తేడా. అదేవిటంటే దేవికి అత్తగారు ఇంట్లో ఉంటే, అక్కడ శిరీషకి మామగారు ఉంటారు. ఆయన పని ఆయనిది. ఉదయం పదివరకూ భక్తి పోగ్రాములు టీవీలో చూసి సాయంత్రం దగ్గర్లోని దేవాలయానికి వెళ్లడమే. దీంతో దేవి – శిరీషల స్నేహం మరింత పెనవేసుకుంది. భోజనం అయ్యాక అత్తగారు తన గదిలోకి వెళ్లి నిద్రలోకి జారుకోగానే శిరీషకి ఫోన్‌ ‌చేసింది దేవి.

‘ఇవాళ సీత ఇంట్లో ఫంక్షన్‌కి వెళ్తున్నావా’ అని

‘లేదు!’ అట్నుంచి జవాబిచ్చింది శిరీష.

‘వాళ్లకేం చెప్పావ్‌ ‌మరి’

‘ఏవుందీ రొటీనే – మా మామగారితో పడలేకపోతున్నాం. ఆయన ఎక్కడికీ వెళ్లనివ్వరూ అని.. అంతే.’

‘మరి గిరిజ ఏమందీ’

‘అదే సతాయిస్తోంది… మొత్తానికి తప్పించుకున్నాను.. మామగారి గురించి చెప్పేసరికి సానుభూతి కూడా దక్కింది.’

‘ఇక్కడా అంతే’ నవ్వింది దేవి.

‘ఈ ఫంక్షన్స్ ‌మన వల్ల కాదే…ఈ పెద్దాళ్లున్నారు చూసావూ! వీళ్ల వల్ల చాలా లాభాలుంటాయి.’

ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్లలో మంచి చెప్పుకోవడానికి లేనప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడుకుంటారుట.. అదీ చెడ్డగా..! అలాంటివారికి శిరీష, దేవి అతీతం కాదు.

— – – – – – – – –

చాలాకాలం కిందట ఓ పదం వాడుకలో ఉండేది, పాపాల భైరవుడు అనీ. అంటే ఇంట్లో ఎవరు ఏం పాపం చేసినా అతడి ఖాతాలోకి వెళ్లిపోతుందన్నమాట. అంటే అందరి పాపాల్ని సహించేవాడు – పాపాల భైరవుడు. సాధారణంగా ఇంట్లో ఓ ముసలాయన కానీ, ఓ ముసలమ్మ కానీ ఉంటే, వాళ్లని బూచిలా, భూతద్దంలో చూపించి కావల్సినవన్నీ హాయిగా చేసుకునేవాళ్లు చాలామంది. ఎక్కడికి కావాలన్నా వెళ్లవచ్చు – ఈ పెద్దోళ్లని ఇంట్లో ఉంచేసి. అదే బయటికి వెళ్లడం ఇష్టం లేకపోతే ‘ఈ ముసలాళ్లు – నా ప్రాణానికి’ అని అందరికి డప్పేసుకుని ఇంట్లోనే ఉండిపోవచ్చు. దాంతో సానుభూతికి సానుభూతి, మనసుకు కావల్సినంత శాంతి.

— – – – – – – – –

దేవి, శిరీష ఉండే కాలనీలో పెద్దవాళ్లందరూ కలిసి తీర్ధయాత్ర ప్లాన్‌ ‌చేసారు. దేవి భర్త తన తల్లినీ, శిరీష భర్త తన తండ్రిని పంపాలని నిర్ణయించేసుకున్నారు. ఒకే కాలనీ, ఒకే కుటుంబంలా ఉంటుందని భావించారు. అంతా వృద్ధ గణమే! తీర్ధయాత్ర కాంట్రాక్టర్‌కీ, డ్రైవరుకీ, క్లీనరుకీ బోల్డు అప్పగింతలు. ఫోన్‌ ‌నెంబర్లూ, మందుల వివరాలు అందరూ ఇచ్చారు. గోవింద నామ స్మరణతో బస్సు బయల్దేరింది.

ఇంట్లో వయోవృద్ధులు ఉన్నప్పుడు చిరుబురులాడుకున్నా, వాళ్లు లేనప్పుడు ఏదో మానసిక అశాంతి ఉంటుంది. వృద్ధుల ఆసరా కొండంత ధైర్యాన్నిస్తుంది. తమతో పాటు ఉన్న వ్యక్తి దూరం అవ్వడం ఏదో వెలితిగా ఉంటుంది. ఇప్పుడు దేవి, శిరీష అనుభవిస్తోన్న పరిస్థితి అదే. కాలక్షేపంగా టీవీ చూస్తూన్నా దేవికి తన అత్తగారు లేకపోవడంతో చాలా కోల్పోయినట్లయింది. భోజనానికి రెండు రకాల వంటకాలు, రకరకాల పిండివంటలూ, ఇతర కబుర్లూ కాలక్షేపాలూ ఏవీ లేవు. అయితే టీవీ, లేకపోతే ఫోను అంతే. వండాలంటే బద్ధకంగా ఉందామెకి.

ఓ రోజు మధ్యాహ్నం… వంటలో అవస్థలు పడుతోన్న దేవికి ఫోన్‌ ‌వచ్చింది.

‘హల్లో నేనే గిరిజని.’

‘ఆ.. పేరొచ్చింది చెప్పు ఏంటీ విశేషం?’

‘అదేనే మన టీచరుగారబ్బాయికి పెళ్లి రిసెప్షన్‌ ఇవాళ. సాయంత్రం వస్తావా అని అడగటానికి ఫోన్‌ ‌చేసాను’

‘అబ్బా ఇవాళా నేను రాలేనే’

‘అదేంటే ఎన్నాళ్లకో కుదిరింది సంబంధం. అంగరంగ వైభవంగా చేస్తున్నారు పెళ్లి- రాకపోతే ఎలానే’

‘అదే మా అత్తగారూ’ దేవి నోరు జారేసింది.

‘అదేంటే మీ అత్తగారు తీర్ధయాత్రలకి వెళ్లారుగా.. ఇప్పుడే శిరీషకి ఫోన్‌ ‌చేస్తున్నా. మీరిద్దరూ రావాల్సిందే!’ హుకుం జారీచేసి ఫోన్‌ ‌కట్‌ ‌చేసింది గిరిజ.

వెంటనే శిరీషకి ఫోన్‌ ‌చేసింది దేవి. ఆమె ఫోను ఎంగేజ్‌ ‌రావడంతో అర్ధమైంది. ఆమెకీ గిరిజ అక్కడ క్లాసు పీకుతోందని. ఇక తప్పేదేం ఉందని చీరల ఎంపికలో పడింది. సాయంత్రం నాలుగవుతోంది. శిరీష ఆమె ఇంటికొచ్చి తాను సెలక్ట్ ‌చేసుకున్న చీరను చూపించి దేవి చీరల సెలక్షన్లోనూ భాగం పంచు కుంది. రిసెప్షన్‌ ‌కెళ్లారు ఇద్దరూ. కాలనీవాళ్లే కాకుండా తన చిన్నప్పటి స్నేహితులు కలవడంతో చక్కగా ఎంజాయ్‌ ‌చేసారు. అక్కడ గిరిజ అల్లరీ, పెద్దరికం, కలుపుగోలుతనం అన్నీ పెళ్లివాళ్లతో పాటు దేవీ, శిరీషలకి కూడా నచ్చేసాయి. ఆమె పలకరింపులు కట్టిపడేసాయి. ఇన్నాళ్లూ ఇంత సరదా, హుషారు చంపుకున్నామేమో అని ఆలోచించేలా చేసాయి. తాము తెచ్చిన గిఫ్టులను ఇచ్చి భోజనాలు అయ్యాక పెళ్లివాళ్లిచ్చిన బహుమతులను తీసుకుని ఇంటికి బయలుదేరారు శిరీష, దేవి.

ఆటో కోసం ఎదురుచూస్తుంటే వాళ్లపక్కనే కారు వచ్చి ఆగింది. అందులోంచి గిరిజ దిగింది.

‘నువ్వెప్పుడు కారు డ్రైవింగ్‌ ‌నేర్చుకున్నావే..’ ఇద్దరూ దాదాపుగా ఒకేసారి అడిగారు.

‘చాలా రోజులైంది లే.. మొదట్లో మా ఆయన్ని మా అబ్బాయి బస్టాండ్‌లో డ్రాప్‌ ‌చేసేవాడు. తర్వాత వాడు హాస్టల్‌కి వెళ్లిపోవడంతో ఆయన ఆటోలో వెళ్తున్నారు. కారు ఉన్నా ఆటో ఎందుకని నేనే డ్రైవింగ్‌ ‌నేర్చుకున్నా! ఇప్పుడు ఆయన్ని బస్టాండుకి దిగబెడుతున్నా..’

‘మరి నువ్వు కారు తిప్పుతుంటే మీ అత్తగారు ఏమనదా?!’

‘ఏమంటారే… నువ్వే నయం హాయిగా మా అబ్బాయికి ఏ కష్టం లేకుండా డ్రాప్‌ ‌చేస్తున్నావ్‌ అం‌టారు. ప్రతీ శనివారం ఆవిణ్ణి దేవాలయాలకి కూడా తీసుకువెళ్తా కదా. చాలా మురిసిపోతూ వచ్చిన వాళ్లందరికీ నా గురించి గొప్పగా చెప్తారు!’

‘నీ పనే బాగుందే. మంచి అత్తగారు దొరికారు’ దేవి వెంటనే అంది.

‘ఏం నీకు మంచి అత్తగారు దొరకలేదా?’

‘ఎక్కడా… ఎక్కడికీ వెళ్లనివ్వదూ…కారు డ్రైవింగ్‌ ‌నేర్చుకోనివ్వదూ’ చిరాగ్గా చెప్పింది దేవి.

‘నీకు చెప్పారా అత్తగారు – కారు నేర్చుకోవద్దనీ..’

‘చెప్పాలా… ఆవిణ్ణి చూస్తే అలా అన్నట్లే ఉంటుంది.’

‘ఆవిడ అనుకుంటారని నువ్వు అనుకోవడం ఉంది చూసావూ.. ఇదే పెద్ద ట్రాజెడీ. అసలు కారు డ్రైవింగ్‌ ‌నేర్చుకుని ఇంట్లోవాళ్లని కార్లో తీసుకెళ్తుంటే ఆ మజానే వేరు తెలుసా?!’ ‘అంతులేని అవకాశాలు కాచుక్కూ చుంటాయిట. ఎవరు సాహసాలు చేసి తమని సొంతం చేసుకుంటారో అని’… కానీ మనకి బద్ధకం జాస్తి కదా… ఆ సంగతి దాచేసి వాళ్లేమి అనుకుంటారో, వీళ్లేమి అనుకుంటారో అని బాండ్‌ ‌కొట్టుకుంటూ చెప్తుంటాం!’ జాలిగా వాళ్లిద్దరినీ చూస్తూ చెప్పింది గిరిజ.

‘అబ్బా! నువ్వెన్నన్నా చెప్పు. ఈ ట్రాఫిక్‌ ‌జంఝాటం నేను పడలేను’ విసుగూ చిరాకూ కలబోసి చెప్పింది దేవి.

‘అద్గదీ అలా చెప్పూ! అదీ నీలో ఉన్న వీక్‌నెస్‌… ‌నీ బలహీనతని బయటికి చెప్పుకోలేక దాన్ని మీ అత్తగారి మీద రుద్దేస్తున్నావ్‌. ఇం‌ట్లో కారు ఉంచుకుని మీ అత్తగారు ఆటోలో వెళ్లాలంటే మరి బాధపడరా… ఆటోల కోసమో క్యాబ్‌ల కోసమో వెయిట్‌ ‌చేయడం ఆ వయసులో ఎంత కష్టమో ఆలోచించు. నీకు కారు డ్రైవ్‌ ‌చేయడం ఇష్టం అని ఒక్కసారన్నా అన్నావా?!’ దేవిని సూటిగా అడిగింది గిరిజ.

‘అడగాలనిపించలేదు!’ నిజాయితీగా చెప్పింది దేవి.

‘‘మొన్న నేనూ మా అత్తగారూ శ్రీవేంకటేశ్వరుని దేవాలయానికి వెళ్తే అక్కడ మీ అత్తగారొక్కరే కూర్చుని ఉన్నారు. మేం వెళ్లి పలకరిస్తే చాలా సంతోషించారు. నేను మాట వరసకి ‘మీ కోడలికి కారు డ్రైవింగ్‌ ‌నేర్పవచ్చు కదా హాయిగా ఇద్దరూ వచ్చేవాళ్లూ అన్నాను.’ అప్పుడు మీ అత్తగారు ‘నాకంత అదృష్టం కూడానా. కారు షెడ్‌లో ఉంది. కొడుకు వేరే ఊళ్లో వారాల తరబడి ఉంటాడు. మనవడు హాస్టల్లో ఉంటాడు. కోడలికి ట్రాఫిక్‌ అం‌టే చిరాకు. డ్రైవర్ల దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాలంటే, ఆ ఫోన్లేంటో నాకు సరిగ్గా తెలియదు. ఇక కారు తీసేవాళ్లు ఎవరూ.. తలరాత ఉండాలి కదా ఏది అనుభవించా లన్నా’ అని బాధగా అన్నారు తెలుసా’’

‘అవునా? మరి నాతో ఎప్పుడూ అలా అనలేదే!’

‘నీకిష్టమో కష్టమో ఆవిడకేం తెలుసు… నువ్వు అడిగితే – ఆవిడ కాదంటే కదా సమస్య’

‘అయితే డ్రైవింగ్‌ ‌నేర్చుకోమంటావ్‌..’

‘‌నేను అనడం కాదు. నీకు అనిపించడం లేదా… మనం పుట్టగానే వంటలు చేసెయ్యలేదు… గరిట తిప్పడం మొదట్లో చిరాగ్గా ఉన్నా మనం వండినది తిన్నవాళ్లు మెచ్చుకుంటే ఆ సంతృప్తే వేరు. ఇదీ అంతే. కారు డ్రైవింగ్‌ ‌నేర్చుకుంటున్నప్పుడు జనం మనల్ని చిరాకు పెడతారు. తర్వాత మనమూ వాళ్లని భయపెడతాం. ఓ స్టేజ్‌లో స్మార్ట్ ‌డ్రైవింగ్‌కి అలవాటుపడతాం.’ మీ అత్తగారు వచ్చేసరికి నెలరోజులు పడుతుంది. ఈలోగా కారు డ్రైవింగ్‌ ‌నేర్చేసుకో’

‘ఓడ ఒడ్డునే క్షేమంగా ఉంటుంది. అలాంటప్పుడు అది తయారు చేయడం ఎందుకు? అలలకి ఎదురీదాలి. తుపాన్లను దాటాలి. మరో దరి చేరాలి. గమ్యం అందుకోవాలి. అప్పుడే ఓడని తయారుచేయడంలోని సార్ధకత. ఆవిడ తీర్ధయాత్ర ముగించేసరికి నీ కారు యాత్ర మొదలుపెట్టు. వీలైతే ఆవిడ యాత్ర ముగించుకుని బస్సు దిగేటప్పటికి నువ్వు కారుతో ఎదురెళ్లు. కాశీ గంగ, ప్రసాదాలు, బట్టలు ఇవన్నీ పట్టుకుని ఏ ఆటో కోసమో చూసే అవసరంలేకుండా నువ్వు కార్లో రావడం చూసి ఆవిడ ఎంత పరవశిస్తుందో చూడు.’

‘నువ్వు చెప్పింది బాగుంది.. ప్రయత్నిస్తా’

‘ప్రయత్నించడం కాదు, ఫలితం సాధించు.. ఆల్‌ ‌ది బెస్ట్. ‌కారు దుమ్ము దులుపు.. దూకించు ముందుకు’ – గీతోపదేశం చేస్తున్నట్లు అంది గిరిజ.

‘అవునూ!..నువ్వేమిటే మా ఇద్దరి మాటల్ని నిశ్శబ్దంగా వింటున్నావ్‌?!’ ‌శిరీషని అడిగింది దేవి. అంతవరకూ శ్రోతలా ఉన్న శిరీష –

‘నా దగ్గర కారు లేదు కదే..’ నెమ్మదిగా చెప్పింది

‘… డ్రైవింగ్‌ ‌నేర్చుకోవాలంటే కారు కాదు కావల్సింది, మిత్రురాలా!.. హుషారు, పట్టుదల. సాహసంతో సావాసం చేస్తే శాస్త్రాలు మనల్ని శెభాష్‌ అం‌టాయి. ఈ నెల్లాళ్లలో నువ్వూ డ్రైవింగ్‌ ‌నేర్చుకున్నావనుకో. నా కారు ఇస్తా… సరిగ్గా మీ మామగారు యాత్రా స్పెషల్లో దిగగానే నా కారుతో ఎదురెళ్లు. కొడుకులు అమరావతిలో ఉన్నారు. రిసీవ్‌ ‌చేసుకోవడానికి వస్తారో రారో అని వాళ్లు అనుకుంటూ వస్తూ ఉంటారు. మీ ఆయనా, మీ ఆయనా వస్తే సరే…వాళ్లని కార్లో తీసుకెళ్లండి. మీ పెద్దోళ్లు, అదే మీ పాపాల భైరవుల కళ్లల్లో ఆనందం చూడండి’ – గిరిజ మాటలు మంత్రోపదేశంలా ఉన్నాయి.

‘ఎప్పుడూ పెద్దవాళ్ల మీద నిందలు వేయడం, నెపం మోపడం మాత్రమే కాదు. అప్పుడప్పుడు వాళ్లనీ గౌరవిద్దాం. వాళ్లకీ ఈ సౌఖ్యాలనీ సౌకర్యాలనీ పరిచయం చేద్దాం. ఒకవేళ వాళ్లు చిరాకు పడితే? వాళ్లకి ఈ లగ్జరీ ప్రాప్తం లేదనుకుందాం! ఇష్టపడితే -అలా అందించడం మనకు మాత్రమే దక్కిన వరమనుకుందాం. అంతే సింపుల్‌!’ ‌వేదాంతాన్ని కట్టె కొట్టే తెచ్చేలా చెప్పేసింది గిరిజ.

హఠాత్తుగా కారు ఆపమంది దేవి. గిరిజ కారుని రోడ్డుపక్కన ఆపింది. అక్కడ గోడ మీద-‘కారు డ్రైవింగ్‌ ‌నేర్పబడును’ అని కింద ఫోన్‌ ‌నెంబర్‌ ‌రాసి ఉంది.

ఐబ్రో పెన్సిల్‌తో ఓ చిన్న కాగితమ్మీద నెంబర్‌ ‌రాసుకుంటోన్న దేవి భుజం తట్టింది శిరీష. గర్వంగా కళ్లెగరేసి వెంటనే కారుచీకట్లని హెడ్‌లైట్లతో చీల్చుకుంటూ ముందుకు దూకించింది గిరిజ కారుని.

‘సాహసం నా పథం.. రాజసం నా రథం.. సాగితే ఆపడం సాధ్యమా.. పౌరుషం ఆయుధం.. పోరులో జీవితం.. కైవసం కావడం కష్టమా’ కారు స్టీరియోలో వస్తోన్న పాటకి కోరస్‌ అం‌దిస్తున్నారు ముగ్గురూనూ.

About Author

By editor

Twitter
Instagram