– యస్‌. ‌గురుమూర్తి

జిహాద్‌ అం‌టే ‘పవిత్ర యుద్ధం’ అని అందరికీ తెలుసు. మధ్యయుగంలో ముస్లింలు మత వ్యాప్తికోసం ఇతర మత సమూహాలపై, జాతుపై చేసిన యుద్ధాలకు జిహాద్‌ అని పేరు. మత వ్యాప్తి కోసం చేసిన యుద్ధాలు కాబట్టి వాటిని ‘పవిత్రయుద్ధాలు’గా పేరు పెట్టుకున్నారు. అయితే ఇస్లాం వ్యాప్తికోసం చేసే ప్రతి కృషిని ఆ పేరుతో ఆధునికులు ఇప్పుడు పిలుస్తున్నారు. యుద్ధం మాత్రమే కాదు ప్రేమ, పెళ్లిళ్లు కూడా ఇస్లాం వ్యాప్తిలో కీలక పాత్రపోషిస్తున్నాయా? పరిశోధకులు, పరిశీలకులు ఏమి చెప్తున్నారు?


హార్వర్డు విశ్వవిద్యాలయానికి చెందిన రాబర్డ్ ఎప్‌స్టీన్‌ (Robert Epstein) ప్రసిద్ధ మనస్తత్వ శాస్త్రవేత్త. వివాహాల గురించి చేసిన పరిశోధనలు ఆయనకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. పాశ్చాత్య దేశాలలో ముఖ్యంగా అమెరికాలో ప్రేమ ముందు, పెళ్లి తర్వాత అన్న విషయం మనందరికీ తెలిసిందే. మనదేశంలో అందుకు భిన్నంగా పెళ్లి ముందు, ప్రేమలు తర్వాత అన్నదీ తెలిసిందే. వీటినే  ఆయన సాధికారంగా చెప్పారు. భారతదేశంలో ఈనాటికీ పెద్దలు కుదిర్చిన వివాహాలే ఎక్కువ. ప్రేమ వివాహాలు పెద్ద పెట్టున జరుగుతున్నప్పటికి, పెద్దలు కుదిర్చే వివాహాల ప్రాధాన్యం తగ్గలేదని ఆయన అంటున్నారు. ప్రేమపెళ్లిళ్లు పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లతో పోటీ పడుతున్నాయి. అయితే మరొక కొత్తరకం పెళ్లిళ్లు కూడా పెద్దలు కుదిర్చే పెళ్లిళ్లకు పోటీగా నిలుస్తున్నాయి. అవే లవ్‌ ‌జిహాద్‌ ‌పెళ్లిళ్లు. ఒక దశాబ్దం కిందట మతాంతరీకరణ లక్ష్యంగా చేసుకొనే పెళ్లిళ్లు కేరళలో మొదలయ్యాయి. ఇప్పుడు వ్యూహత్మకంగా భారతదేశమంతటా వ్యాపించాయి.

‘లవ్‌ ‌జిహాద్‌’ అనే పదం పుట్టినప్పుడు ‘హిందూ మతోన్మాదులు’ రెచ్చగొట్టటానికి చేస్తున్న ప్రచారంగా కొట్టి వేసిన వాళ్లు సైతం ఇప్పుడు ఈ సమస్యను గుర్తిస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాలకు, ‘హిందూమతోన్మాదుల’కు అతీతంగా సమాజం ఇస్లాం వ్యాప్తి చేస్తున్న ఈ వలపు ఉద్యమ సవాలును గురించి ఆందోళన చెందుతున్నారు. మతవ్యాప్తికి వలపును ఒక పనిముట్టుగా, సాధనంగా వాడుకోవచ్చునని గుర్తించి, ఆ దిశగా ప్రోత్సా హించటం, కృషి చేయటం మతవ్యాప్తికి ఉపయోగపడే సాధనాలలో గొప్ప ఆవిష్కరణగా చెప్పుకోవచ్చు. మానవులలో సహజంగా ఉండే రెండు అనురక్తులు రక్తి, భక్తిలను కలగలిపి, వ్యక్తిగత భావోద్వేగాలను సామూహిక భావోద్వేగమైన మతంతో ముడిపెట్టగలగటం సామాన్యమైన వ్యూహమేమీ కాదు. అయితే ఆ వ్యూహ ఫలితాలు మాత్రం దారుణంగా ఉన్నాయి. వలపు ఉద్యమం వలన కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. సంప్రదాయాలు మంట కలసిపోతున్నాయి. మత సమూహాల మధ్య అవిశ్వాసం పెరుగుతున్నది. అభద్రతా భావం పెచ్చుపెరుగుతున్నది. వ్యూహత్మకంగా ముస్లిమేతర యువతులను లక్ష్యంగా చేసుకొని చేపడుతున్న కొత్తరకపు వలపు మతాంతరీకరణ ముస్లింలకు ఇతరులకు మధ్య అగాధాలను సృష్టించటంతో మత విద్వేషాలు పెరుగుతున్నాయి.

తేడా ఎక్కడుంది?

ఆహార, నిద్ర, భయ, మైధునాలు సర్వప్రాణులకు సహజం, మానవ ప్రకృతిలోనే ప్రేమించటం, కామించటం ఉంటాయి. యువతీ యువకుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ సహజం. వయసు రాగానే పొందుకోసం తహతహలాడటం  సహజ పరిణామం. కులాలు, మతాలు వేరైనా ఇద్దరు యువతీయువకుల మధ్య ప్రేమ పుట్టటమో, కామం జనించటమో సాధారణం. కనుక ప్రేమను, ప్రేమ వివాహాలను తప్పుపట్టనవసరంలేదు. అయితే ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌ప్రేమ విలక్షణమైనది. ముస్లిం యువకులు, ముస్లిమేతర యువతుల మధ్యే ప్రేమపుడుతుంది. వలపు వికసిస్తుంది. అంతేకాని ముస్లిం యువతులు, ముస్లిమేతర యువకుల మధ్య అది వికసించనే వికసించదు. ముస్లిం యువతులకు ముస్లిమేతరులను ఎంచుకొనే స్వేచ్ఛను ఇస్లాం ఇవ్వలేదు. యువకులకు మాత్రం పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. కనుక ముస్లిం యువకులు ముస్లిమేతర యువతులను ప్రలోభ పెట్టి, వలపు వల విసిరి, తమకు లోబడిన తర్వాత పెళ్లి చేసుకోవటానికి మతాంతరీకరణ తప్పనిసరి చేస్తున్నారు. ఒకరికంటే ఎక్కువమందిని భార్యలుగా చేసుకొనేందుకు వీలు ఉన్నది కాబట్టి పెళ్లయిన యువకులు సైతం వలపు వలలు విసురుతూ ఉంటారు. చిక్కిన వారిని మతం మార్చి భార్యలుగా చేసుకుంటున్నారు. సాధారణ ప్రేమ వ్యవహారాలకు, లవ్‌ ‌జిహాద్‌కు ఇదే ముఖ్యమైన తేడా.

ముస్లిం వ్యతిరేక భయం నుండి పుట్టలేదు

ఇస్లాం వ్యతిరేకత నుండి పుట్టుకొచ్చిన భావమే ‘లవ్‌ ‌జిహాద్‌’ అని కొందరు అనుకొంటున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. వివిధ ముస్లిమేతర వర్గాల స్వానుభవం నుండే ఈ భావన పుట్టుకొచ్చింది. హిందువులు మాత్రమే కాదు. క్రైస్తవులు, బౌద్ధులు, ఇతరులు సైతం ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌బాధితులే. ముస్లిమేతరులందరిలోనూ లవ్‌ ‌జిహాద్‌ ‌పట్ల ఆందోళన ఉంది. లవ్‌ ‌జిహాద్‌ అం‌టే ఏమిటి అన్న ప్రశ్నకు జవాబు ఇప్పటికే మనకు అర్ధమయి ఉంటుంది. జిహాద్‌కు, ప్రేమకు సంబంధమేలేదు. జిహాద్‌ అం‌టే వ్యతిరేకులపై చేసే యుద్ధం. ప్రేమ అంటే అభిమానించే వారిపట్ల ఇష్టాన్ని ప్రకటించటం. ఇవి రెండూ పరస్పరం విరుద్ధ అంశాలు. కానీ జిహాద్‌కు విస్తృతమైన అర్ధం కూడా ఉంది. జిహాద్‌ అం‌టే యుద్ధం మాత్రమే కాదు. యుద్ధానికి మాత్రమే పరిమితంగా ఆ పదాన్ని ఆధునికకాలంలో వాడటం లేదు. మతాన్ని వ్యాప్తి చెయ్యటానికి, సంఖ్యాబలాన్ని పెంచుకోవటానికి చేసే ప్రతి ప్రయత్నం జిహాద్‌ ‌కిందకే వస్తుంది. కనుక కత్తితో చేయలేని పని కళ్లతో సులభంగా చేయకల్గినపుడు కత్తిని ఉపయోగించటం అనవసరం కదా! కత్తిని ఎప్పుడు వాడాలో, కళ్లను ఎప్పుడు వాడాలో తెలిసిన వారికి లవ్‌ ‌జిహాద్‌ ఇస్లామీకరణకు ఉపయోగపడే ఒకతేనె పూసిన కత్తి.

ఈ అంశం మీద చేసిన పరిశోధనలు ఆసక్తికరంగా ఉన్నాయి. స్వతంత్ర పరిశోధకులు, పరిశీలకులు చేసిన అధ్యయనాలు, వెలువరించిన పరిశోధనా పత్రాలు కీలకమైన విషయాలను వెలుగులోకి తెచ్చాయి. ఫిలిపీ ఫార్గ్యూస్‌ (Phillippe Fargues) అనే పరిశోధకుడు ఇస్లామీకరణలో బలప్రయోగం, హింస ఒకప్పుడు ఎంత పాత్ర పోషించాయో, ప్రేమ, పెళ్లిళ్లు కూడా ఇప్పడు అంతే పాత్ర పోషిస్తున్నాయని తన విశేష అధ్యయనం ముగిస్తూ రాశాడు. హుస్సామ్‌మునీర్‌ అనే ఇస్లామిక్‌ ‌పండితుడు కత్తిబలంతో ఇస్లాం వ్యాప్తి చెందిందన్న అభిప్రాయం తప్పని వాదిస్తూ, ప్రేమ, పెళ్లిళ్లు ఇస్లామీకరణలో ప్రధాన పాత్ర పోషించాయని సోదాహరణంగా పేర్కొన్నాడు. ముస్లింలు, ముస్లిమేతురుల మధ్య జరిగిన పెళ్లిళ్ల వల్ల ముస్లింల సంఖ్యాబలం పెరిగిందని, అయితే ఈ ప్రేమ, పెళ్లి వ్యవహారాల వల్ల మతం మారిన వారందరూ ముస్లిమేతరులేనని, పై పెచ్చు వారందరూ మహిళలే అని వెల్లడించాడు. ఇటీవలి కాలంలో ఈ అంశంపై ఆసక్తి పెరిగి, విస్తృత పరిశోధనలు వివిధదేశాలలో మొదలయ్యాయని కూడా తన అధ్యయన పత్రంలో పేర్కొన్నాడు. ఇస్లామిక్‌ ‌వలపు ఉద్యమం ద్వారా ఇస్లాం మత వ్యాప్తి చెందిన దేశాల జాబితాను కూడా ఆయన ప్రకటించాడు. స్పెయిన్‌ ‌దేశంలో పప్రథమ ముస్లిం సమాజం ఆ విధంగా ఏర్పడిందేనని, ఒట్టమాన్‌ల సామ్రాజ్య విస్తరణలోనూ పెళ్లిళ్లు ప్రధాన పాత్ర పోషించాయని, వాస్తవాలు వెలుగులోకి తెచ్చాడు. వలస పాలనాకాలంలోనూ అనేకమంది దళిత యువతులు ముస్లిం యువకులను పెళ్లిళ్లు చేసుకున్న కారణంగా ముస్లింలుగా మారారని చెప్పారాయన. బలవంతపు మత మార్పిళ్ల స్థానంలో ఆధునిక కాలంలో ముస్లిమేతర యువతులతో ముస్లిం యువకుల ప్రేమ పెళ్లిళ్లు మతాంతీకరణకు సాధనాలు అయ్యాయని ఫిలపీ సిద్ధాంత ప్రతిపాదనకు మునీర్‌ ‌చూపిన సాక్ష్యాధారాలు బలాన్ని చేకూర్చాయి. కేవలం కొందరు ముస్లింలుగా మారటానికి మాత్రమే కాక దేశాలకు దేశాలు ఇస్లామిక్‌ ‌దేశాలుగా మారిపొవ టానికి ప్రేమలు, పెళ్లిళ్లు కారణ మయ్యాయని నిరూపించటానికి సాక్ష్యాధారాలు మునీర్‌ ‌చూపించాడు.

సి. సహ్నేర్‌ (Christian C. Sahner) అనే పరిశోధకుడు పై ఇద్దరి పరిశోధకులతో ఏకీభవిస్తూ తన ఉద్గ్రంథంలో ఈ విధంగా వ్యాఖ్యానించాడు, ‘‘క్రైస్తవ ప్రపంచంలో పడకగది ద్వారా ఇస్లాం వ్యాపించింది.’’  ముస్లిం యువకులు ముస్లిమేతర యువతుల పట్ల కనపరుస్తున్న ఉత్సుకతకు, ప్రేమకు వారిని ఇస్లాంలోకి మార్చాలన్న ఆకాంక్ష, తద్వారా సంఖ్యాబలాన్ని పెంచుకోవాలన్న నిగూఢమైన మత పెద్దల వ్యూహం ఉన్నాయి. సహజంగానే యువకులకు వయసులో స్త్రీవ్యామోహం ఉంటుంది. ఆ వ్యామోహాన్ని నియంత్రించటానికి బదులు, భుజం తట్టి ప్రోత్సాహిస్తున్నారు. ముస్లిమేతర యువతులను ముగ్గులోకి దించి, మతం మార్చి, పెళ్లి చేసుకుంటే ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ముస్లిమేతర యువతులతో, స్త్రీలతో ముస్లిం యువకులకు, పురుషులకు ఉన్న ఏకైక లక్ష్యం వారిని పొందటంతో పాటుగా వారిని ముస్లింలుగా మార్చటమేనని స్పష్టం అవుతున్నది.

ఏకపక్ష ప్రేమలు, పెళ్లిళ్లు

ఎందుకంటే ముస్లింలు, ముస్లిమేతరుల మధ్య జరిగే పెళ్లిళ్లలో వరులు ఎప్పడూ ముస్లిం యువకులే, వధువులు ఎప్పుడూ ముస్లిమేతరులే. ముస్లిం యువతులు ముస్లిమేతర యువకులను ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం అరుదు. ప్రేమలు, పెళ్లిళ్లు అన్నీ ఏకపక్షమే. ముస్లిం యువతులు ముస్లిమేతరులను పెళ్లి చేసుకోవటాన్ని ఇస్లాం శతాబ్దల కింద నిషేధించింది. ఆ నిషేధం ఇంకా ఉంది. అమెరికాలో పిల్లల పెళ్లిళ్లుకు సంబంధించి ఒక ప్రముఖ సంస్థ (PeW Research Center) తల్లిదండ్రుల అభిప్రాయ సేకరణ చేసింది. మగపిల్లలు ముస్లిమేతరులను చేసుకోవటానికి అంగీకరించిన ముస్లిం తల్లిదండ్రులు తమ ఆడపిల్లలు ముస్లిమేతరులను చేసుకోవటానికి అయిష్టత చూపారని తేల్చి చెప్పింది. ఏ కొద్దిమందో అభ్యుదయవాదులు తప్ప అత్యధికులు తమ ఆడపిల్లలు ముస్లిమేతరులను మనువు ఆడటానికి ఇష్టపడటం లేదు.

భారతదేశంలో పరిస్థితీ భిన్నంగాలేదు. జరుగు తున్న మతాంతర పెళ్లిళ్లలో వరులలో అత్యధికులు ముస్లిం యువకులు. 2012లో కేరళ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్‌కు చెందిన ఉమన్‌చాందీ పనిచేసారు. 2012-2019 మధ్య 2667 మంది ముస్లిమేతర యువతులు తమ స్వమతం వీడి ఇస్లాంలోకి వచ్చారని పేర్కొన్నారు. వీరందరూ పెళ్లి కారణంగా మతం మారిన వారేనని వేరే చెప్పనక్కరలేదు. ముస్లిం యువతులలో కేవలం 81 మంది మాత్రమే ఇతర మతాలోకి వెళ్లారని చెప్పారు. అంటే పెళ్లిళ్ల కారణంగా ఇస్లాం స్వీకరించిన వారి సంఖ్య, ఇస్లాం నుండి ఇతర మతాలోకి వెళ్లిన వారి సంఖ్య కంటె 33 రెట్లు అధికం!

కేరళ ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌ప్రపంచవ్యాప్తం అయ్యింది

‘లవ్‌ ‌జిహాద్‌’ అనే పదం కేరళలో మొదటిసారిగా 2009లో వాడుకలోకి వచ్చింది. ముస్లిం యువకులు ముస్లిమేతర యువతులను పెళ్లి చేసుకోవటం ఒక నిరంతర పక్రియగా ప్రజల గమనంలోకి వచ్చిన తర్వాతే ఈ పదాన్ని వాడటం మొదలెట్టారు. ఏదో ఒక మూల ఎప్పుడో ఒకసారి మతాంతర వివాహాలు, జరిగితే ఎవరూ పట్టించుకొనేవారు కాదు. కాని నిరంతరంగా అలాంటి పెళ్లిళ్లు జరుగుతుండటంతో సమాజంలో ఆందోళన మొదలైంది. దానితో కేరళ హైకోర్టు  ఈ పెళ్లిళ్ల వ్యవహారాలను పరిశోధించమని ఆదేశించింది. ‘హిందూత్వ మూకలు’ చేస్తున్న పనికిమాలిన ప్రచారంగా కొట్టివేసిన వాళ్లు సైతం ఈ సమస్య గురించి ఆలోచించక తప్పలేదు. కేరళ క్రిష్టియన్‌ ‌సంఘాలు (Christian Association for Social Action) వారు ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌క్రైస్తవ యువతులను ఆకర్షించి, మత మార్పిడికి చేస్తున్న ప్రయత్నంగా ఆరోపించింది.  సెప్టెంబరు 13, 2009న వారి పత్రికలో ఈ అంశాన్ని పతాక శీర్షికగా ప్రచురించారు. కాథలిక్‌ ‌చర్చి అనేక సార్లు ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌పట్ల తన ఆందోళనను వ్యక్తపరిచింది. కర్ణాటక ప్రభుత్వం సైతం లవ్‌ ‌జిహాద్‌ ‌సమస్యను తీవ్రంగా పరిగణించటం మొదలెట్టింది. 2010లో కేరళ ముఖ్యమంత్రిగా ఉన్న సి.పి.యంకు చెందిన అచ్యుతానందన్‌, ‌కేరళను రెండు దశాబ్దలలో పూర్తిగా ఇస్లామీకరణ చెయ్యటానికి ముస్లిం పక్షమైన పాపులర్‌ ‌ఫ్రంట్‌ ‌ప్రణాళికలు సిద్ధం చేసిందని కుండబద్దలు కొట్టారు. అందుకు ధనాన్ని వెదజల్లటం, ముస్లిమేతర యువతులను వలపు వల విసిరి ఆకర్షించి మత మార్పిడి చేయటం వారి ప్రణాళికలో ముఖ్యమైన వ్యూహమని గూడా ఆయన చెప్పటం విశేషం.

‘లవ్‌ ‌జిహాద్‌’ ‌గురించిన ఆందోళన ఏ ఒక్క రాజకీయ పక్షానికో, మత వర్గానికో పరిమితమవలేదు. సందర్భానుసరం కాంగ్రెస్‌, ‌బీజేపీ, కమ్యూనిష్టులు ఈ అంశంపై కేరళలో మాట్లాతూనే ఉన్నారు. హిందువులే కాదు క్రైస్తవులు, బౌద్ధులు సైతం ఈ అంశం గురించి పదేపదే ప్రస్తావిస్తున్నారు. సామాజిక ప్రాధాన్య అంశంగా చర్చకు పెడ్తున్నారంటే లవ్‌ ‌జిహాద్‌ ‌పక్రియ పట్ల భయాందోళనకు గురి అవుతున్నారనమాట. 2017లో కేరళ హైకోర్టు రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారిని ఈ అంశం పట్ల సమగ్రంగా పరిశోధించమని అదేశించింది. జాతీయ పరిశోధనా సంస్థ కూడా ముస్లిం యువకుల మతాంతర పెళ్లిళ్లలో లవ్‌ ‌జిహాద్‌ ‌కేసులు ఉన్నట్లుగా తన పరిశోధనలో తేల్చింది. కేరళ మైనారిటీ కమిషన్‌ అధ్యక్షులు 2017లో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు క్రైస్తవ యువతులను ఇస్లాంలోకి మార్చటమే కాక వారిని ఇస్లామిక్‌ ఉ‌గ్రవాదులుగా మలుస్తున్న వైనం గురించి ఆందోళన వ్యక్తపరుస్తూ ఫిర్యాదు చేశారు. ఇందరి భయాందోళనల మధ్య లవ్‌ ‌జిహాద్‌ అ‌ప్రతిహతంగా కొనసాగుతూనే ఉందని పై సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. సిరియన్‌ ‌మలబార్‌ ‌చర్చి లవ్‌ ‌జిహాద్‌ ‌పెళ్లిళ్లు సంఖ్యాపరంగా పెరుగుతున్న అంశాన్ని ప్రస్తావిస్తూ క్రైస్తవ సమాజపు ఆందోళనను బయటపెట్టింది. ‘లవ్‌ ‌జిహాద్‌’ ‌పదం నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఈ జాఢ్యం భారతదేశానికి మాత్రమే పరిమితం కాలేదు. బర్మా, థాయిలాండ్‌ ‌దేశాలకు కూడా వ్యాపించింది. ఆ దేశాలకు చెందిన బౌద్ధులు లవ్‌ ‌జిహాద్‌ ‌వలన ఇస్లామీకరణకు, మిశ్రమ వివాహాలు పెరగటం మాత్రమే కాక బౌద్ధం మనుగడకు సైతం పెను సవాలుగా మారిందని వాపోతున్నారు.

ఆలోచనా ధోరణిలో మార్పురావాలి

కేవలం ఆందోళన వ్యక్తపరిచినంత మాత్రాన సమస్యకు పరిష్కారం దొరకదు. మన ఆలోచన ధోరణిలోనూ సమగ్రమైన మార్పు వచ్చినప్పుడు పరిష్కారం దొరకవచ్చు. 20వ శతాబ్దపు మూల భావనల కొనసాగింపే నేడు ప్రమాదంలో పడింది. వాస్తవాలను గుర్తించటానికి మనం వెనుకాడుతున్నాం. విజ్ఞానశాస్త్రం ప్రగతితో మతంకు ప్రాధాన్యం తగ్గుతుందని, మతం మత్తు నుండి మానవాళి బయటికి వస్తుందని ఒకప్పుడు అందరూ అనుకొన్నారు. కానీ ఆ ఆశకు, ఆలోచనకు కాలం చెల్లింది. నేటి వాస్తవం ఏమిటంటే మతం అదృశ్యం కాలేదు. అంతేకాదు మతానికి ఇదివరకు ఎన్నడూలేని ప్రాధాన్యం వచ్చింది. 1918లో మార్క్‌వెబర్‌ ఏమి చెప్పాడో మేధావులకు గుర్తుండే ఉంటుంది. విజ్ఞానశాస్త్ర పురోగతి మతాన్ని, మూఢనమ్మకాలను కొంతవరకు దెబ్బతీసినప్పటికి, అనేక పారలౌకిక అంశాలపట్ల విశ్వాసం సన్నగిల్లేటట్లు చేసినప్పటికీ మానవాళికి ఎదురయ్యే అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదని ఆయన ప్రకటించాడు. విజ్ఞానశాస్త్ర పరిమితులను స్పష్టంగా ఆయన చూడగలిగాడు. ఆ కారణంగానే మతం ఆధునిక ప్రపంచంలో ఒక ప్రాథమిక ప్రతిష్టంబనకు దారితీయగల అవకాశాన్ని ఆయన గుర్తించాడు. మధ్యకాలపు మతవిశ్వాసాలను తిరిగి నెత్తిన పెట్టుకోవటం జరగకపోవచ్చు. కానీ అటువంటి పోకడలు కూడా ఇటీవలి కాలంలో మనకు అనుభవంలోకి వచ్చాయి. అది అధమ స్థాయి పరిష్కారం అయిన్పటికీ ఆయన భయపడింది ఒక 100 సంవత్సరాల తర్వాత జరగుతున్నది. ఆశ్చర్యకరంగా ప్రపంచమంతా నేడు మతమయ మయింది. మతమే భౌగోళిక రాజకీయాలకు కేంద్ర బిందువు అయింది. మతాన్ని విశ్వసించే వారి సంఖ్య 2050 నాటికి 2.3 బిలియన్లు మేర పెరగగలదని, అవిశ్వాసుల సంఖ్య 0.1 బిలియను మేర మాత్రమే పెరగగలదని అంచనాలు చెప్తున్నాయి. 1970వ దశకంలో ప్రతి ఐదుగురిలో ఒకరు మతం పట్ల విశ్వాసంలేని వారు కాగా, 2050 నాటికి వారి సంఖ్య తగ్గి ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రమే అవిశ్వాసులుగా ఉంటారని చెప్తున్నారు. రాబోయే కాలంలో మతాన్ని విశ్వసించేవారి శాతం పెరిగి అవిశ్వాసుల శాతం గణనీయంగా తగ్గుతుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌ ఈ అం‌చనాల ఆధారంగా ఇలా అంటున్నది ‘‘వ్యవస్థీకృత మతం అదృశ్యం అవుతుందనే నివేదికలు అతిశయోక్తులతో కూడినవి. ఇటీవల పరిశోధనల సారాంశం ప్రకారం 2010, 2050 మధ్య ప్రపంచ వ్యాప్తంగా మతాన్ని విశ్వసించే వారి జనాభా, విశ్వసించని వారి జనాభాకంటే 23 రెట్లు పెరుగు తుందని అంచనా’’. శామ్యూల్‌ ‌హంటిగ్టంన్‌ ‘‌నాగరికత ఘర్షణల సిద్ధాంతం’, హార్వర్డు విశ్వ విద్యాలయం ‘ప్లూరలిజం ప్రాజెక్టు 1995’ రెండూ కూడా సమీప భవిష్యత్తులో మతానికి ఎనలేని ప్రాధాన్యం వస్తుందన్న అంచనా ఆధారంగానే అభివృద్ధి చెందినవి.

ప్రపంచం వేగంగా మారుతున్నది. వెబర నీయనిజం తగ్గుతున్నది. మతం పట్ల విశ్వాసం పెరుగుతున్నది. మతతత్వం విస్తరిస్తున్నది. అటువంటి ప్రపంచంలో ఉదారవాద భావనలకు కాలం చెల్లినట్లు అన్పిస్తున్నది.  అంతేకాదు మతాంతరీకరణ కోసం ప్రేమించటం, పెళ్లాడటం అనే భయంకర సమస్యలకు  అటువంటి ఉదారవాద భావనలు తగిన పరిష్కార మార్గాన్ని చూపగల శక్తి లేనివి అవుతాయి. కాలానికి తగ్గట్లు భావజాలంలో కూడా మార్పు రావాలి. మతం పట్ల విశ్వాసం తగ్గుతున్న కాలంలో మనం ఏర్పరుచుకొన్న ఉదారవాద భావనలు మతతత్వం పెరుగుతున్న కాలానికి సరిపోవు. కనుక నిజాయితీగా, ధైర్యంగా, బహిరంగంగా ఈ అంశాలపై చర్చించటం ఈనాటి అవసరం. అయితే భారతదేశ వక్రీకరణల లౌకికవాదం అటువంటి చర్చకు తెరతీయటానికి అనుమతిని ఇస్తుందా అన్నది సంశయాత్మకమే!

‘ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌’ ‌నుంచి

అను: డా।। బి. సారంగపాణి

About Author

By editor

Twitter
Instagram