సంపాదకీయం

శాలివాహన 1941 శ్రీ శార్వరి మార్గశిర శుద్ధ చతుర్దశి

28 డిసెంబర్‌ 2020, ‌సోమవారం


జాతీయ ఆంకాక్షలకు విరుద్ధం కానంతవరకు ప్రాతీయ ఆంకాక్షలను ఆదరించడం భారతీయుల విలక్షణతకు నిదర్శనం. ఈ వైవిధ్యం కారణంగానే దేశంలోని వివిధ ప్రాంతాల ప్రజలు తమ ఆంకాక్షల సాకారానికి వేర్వేరు ప్రాంతీయ పార్టీలను ఆదరిస్తున్నారు. ప్రజలకు ప్రధాన జీవికలైన వ్యవసాయం, చేతివృత్తుల పట్ల చిన్నచూపుతో సాగిన తొలి తరం స్వతంత్ర భారత పాలన జాతీయతకు గొడ్డలి పెట్టు. ఏడు దశాబ్దాల తప్పిదాన్ని సరిదిద్దే ప్రయత్నాన్ని అడ్డుకునేదుకు స్వార్థ రాజకీయం జడలు విప్పుతోంది. ఈ రాజకీయ ప్రచ్ఛన్న యుద్ధంలో అన్నదాతలను పావులు చేసే కుట్రకు తెరలేచింది. నూతన వ్యవసాయ చట్టాలను తమ రాష్ట్రంలో అమలు చేయబోమని పంజాబ్‌ ‌ప్రభుత్వం ప్రకటించి, శాసనసభలో తీర్మానించింది. తమ రాష్ట్రంలో అమలు కాని చట్టాల రద్దు కోరుతూ పంజాబ్‌ ‌రైతులు ఢిల్లీకి వచ్చి ఆందోళనకు దిగడం కుట్ర కోణాన్ని వెల్లడిస్తోంది. సేద్యంతో, రైతులతో సంబంధం లేనివారు, తీవ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో అరెస్టయిన వామపక్ష నేతల విడుదలను రైతు సంఘాల డిమాండ్లలో చేర్చడాన్ని బట్టి రైతుల పేరిట జరుగుతున్న ఆందోళన వెనుక రాజకీయ లక్ష్యం ఉన్నట్లు తేటతెల్లమవుతోంది.

అంతర్జాతీయత భ్రమల్లో జాతీయతను ఉపేక్షించి కమ్యూనిష్టులు, అహంకారంతో ప్రాంతీయ ఆంకాక్షలను నిర్లక్ష్యం చేసి కాంగ్రెస్‌ ‌పార్టీ ప్రాంతీయ స్థాయికి పడిపోవడం నిష్ఠుర సత్యం. భారతీయ వైవిధ్యాన్ని వైరుధ్యంగా భ్రమ పడి ప్రాంతీయ ద్వేషాలు రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని రాజకీయ పార్టీలు పలుమార్లు విఫల యత్నం చేయడం చరిత్ర. ప్రాంతీయ పరిమితులు, జాతీయ విస్తృతి అవగతం కాకుండానే జాతీయ స్థాయి నాయకత్వం చేపట్టి నవ్వుల పాలైన నేతల అనుభవాలను దేశ ప్రజలికా మర్చిపోలేదు. ప్రాంతీయ ఆంకాక్షల సాధనాక్రమంలో వెల్లడైన ప్రజాభిమానాన్ని కుటుంబ స్థాయికి కుదించే యత్నాలను వివిధ ప్రాంతాల ప్రజలు తిరస్కరిస్తూ రావడం శుభ పరిణామం. ప్రజల్లో వెల్లడవుతున్న ఈ ప్రజాస్వామిక చైతన్య గీతి స్వార్థపరులైన నేతల చెవికెక్కడం లేదు. వారి ఆలోచనల్లో మార్పు జాడే లేదు. స్థానిక సంస్థలకు అధికారాలు, నిధులు బదిలీ చేయడానికి మనసొప్పని ప్రాంతీయ నేతలు దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామంటూ ప్రగల్భాలు పలకడం విడ్డూరం. ప్రాంతీయ వాపును కూడగట్టి జాతీయ బలుపుగా మలిచే ప్రణాళికల విందుతో మీడియా నోరూరిస్తున్నది.

ప్రాంతీయ పార్టీలను చేరదీసి జాతీయ స్థాయిలో అధికారం వెలగబెట్టే క్రమంలో యూపీఏ పేరిట సాగిన కాంగ్రెస్‌ ‌పాలన అంతులేని అవినీతి, అసమర్థతల చిరునామాగా మారిన వైనం ప్రజల జ్ఞాపకాల్లో భద్రంగా ఉంది. గత సార్వత్రిక ఎన్నికల్లో సోనియా నాయకత్వంలోని కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి సిద్ధపడిన బీఎస్పీ నేత మాయావతి, సమాజ్‌వాది పార్టీ నేత అఖిలేష్‌ ‌యాదవ్‌ ‌తదితర ప్రాంతీయ పార్టీల నేతలు క్రమంగా కాంగ్రెస్‌కు దూరంగా జరిగారు. కాంగ్రెస్‌ ‌పగ్గాలు తిరిగి చేపట్టిన సోనియా నేడో రేపో రాహుల్‌కు పార్టీ బాధ్యతలు అప్పజెప్పక తప్పదు. యూపీఏ మలివిడత ప్రయత్నాల్లో కాంగ్రెస్‌తో జట్టు కట్టడానికి, ఇప్పటికే విఫల నేతగా పేరు బడిన రాహుల్‌ ‌నేతృత్వంలో పనిచేయడానికి కేసీఆర్‌, ‌మమత వంటి నేతలు సిద్ధపడకపోవచ్చని విశ్లేషకుల అంచనా. పేరుకు జాతీయ పార్టీ అయినా ప్రాతీయ పార్టీ స్థాయికి కుంచించుకుపోయిన కాంగ్రెస్‌ ‌జాతీయ స్థాయికి తగిన సమర్థ నాయకుడిని కూడా ఎన్నుకోలేక అవస్థలు పడుతోంది. జాతీయ పార్టీలోని ఈ దుస్థితి ప్రాంతీయ పార్టీల్లో క్రొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లు మినహా మిగిలిన పార్టీలను ఒక తాటి మీదకు తెచ్చి జాతీయ స్థాయిలో తమ సత్తా చాటాలని పలుపురు నేతలు ఉవ్విళ్లూరుతున్నారు. కేసీఆర్‌ ‌వ్రవచిత ఫెడరల్‌ ‌ఫ్రంటు ఈ కోవలోనిదే.

ఆశల పల్లకిలో విహరించే మమత, అఖిలేశ్‌ ‌తదితర నేతలందరి చూపూ ఢిల్లీ పీఠం మీదనే ఉంది. జెండాలు, ఎజెండాలు వేరువేరయినా మోదీని వ్యతిరేకిచే ఏకైక ఎజెండాతో సాగుతున్న ఈ కప్పల తక్కెడ వార్తలు, టీవీ చర్చలు ప్రజలకు వినోదం పండిస్తున్నాయి. మోదీని వ్యతిరేకించడానికి చిన్న అవకాశం చిక్కినా జారవిడుచుకోరాదనే ఆత్రుతలో నూతన వ్యవసాయ చట్టాలను దొరక బుచ్చుకున్నారు. లోగడ పలుమార్లు తమ ఎన్నికల ప్రణాళికల్లో వ్యవసాయానికి సంబంధిచి పేర్కొన్న అంశాలనే నూతన వ్యవసాయ చట్టాల ద్వారా మోదీ ప్రభుత్వం అమలు చేయజూస్తున్న సత్యాన్ని మరుగు పరచి రైతులను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. మన దేశ రైతులకు భరోసా కల్పించి, భారతీయ సేద్యాన్ని ప్రపంచ శక్తిగా మలచాలని ప్రధాని మోదీ సంకల్పం. రైతు ప్రయోజనాలతో ముడిపడిన జాతీయ లక్ష్యానికి, వారసత్వ రాజకీయాలతో ముడిపడిన కుటుంబ పాలన లక్ష్యాలకు మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తెలుగు రైతులు జాతీయ లక్ష్యాలకు మద్దతిస్తారని ఆశిద్దాం!

About Author

By editor

Twitter
Instagram