– డా. రామహరిత

తూర్పు ఆసియాలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు చైనా తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రపంచమంత పరస్పర సహకారం పెంపొందించే ‘ఘర్షణలేని,  గౌరవంతో కూడిన, అందరికీ ప్రయోజనం కలిగే’ విధానాన్ని అవలంబించాలను కుంటే చైనా మాత్రం విస్తరణవాదాన్ని, నిరంకుశత్వాన్ని ప్రేరేపించే తన సంప్రదాయ విధానాన్నే అనుసరిస్తోంది.

‘అంతా స్వర్గం క్రిందనే’ అనే ‘తియాన్‌ – ‌జియా’ విధానం ప్రకారం కేంద్రీకృత వ్యవస్థ, దాని క్రింద పనిచేసే విధంగా మిగిలిన వ్యవస్థలను తయారు చేయడం చైనా లక్ష్యం. దీని ప్రకారం పొరుగు దేశాలను కూడా తనకు అనుకూలంగా, తన అధికారం క్రింద పనిచేసేట్లు చూడటానికి ప్రయత్నిస్తోంది. ‘సరైన మార్గంలో వెళ్లాలంటే పొరుగు దేశాలు చైనాను నమ్మడం తప్ప మరో దారి లేదు’ అని అందరితో ఒప్పించడానికి ప్రయత్నిస్తోంది.


చైనా విస్తరణవాదాన్ని గురించి ప్రస్తావించిన ప్రధాని మోదీ  ‘నేడు ప్రపంచం విస్తరణవాద శక్తుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటోంది. విస్తరణవాదం ఒక మానసిక జాడ్యం, వెనుకబడిన 18వ శతాబ్దపు ఆలోచన. ఇలాంటి ధోరణిని భారత్‌ ‌కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది’ అని అన్నారు. దీపావళి సందర్భంగా లోంగేవాలా పోస్ట్‌ను సందర్శించిన ప్రధాని బీజింగ్‌ ‌పేరు చెప్పకుండానే ఈ మాటలన్నారు. చైనాతో సైనిక కమండర్ల స్థాయి చర్చలు ఒక కొలిక్కిరాని సందర్భంలో ప్రధాని మాటలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఆరు నెలలుగా  భారత్‌, ‌చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. నవంబర్‌ 6 ‌చర్చల తరువాత వాస్తవాధీన రేఖ వద్ద యధాతధ స్థితిని కొనసాగించాలని రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయి. పాంగాంగ్‌ ‌ప్రాంతంలోని ఫింగర్‌ ఎనిమిది వరకు బలగాలను ఉపసంహరించుకోవడంతోపాటు ఫింగర్‌ 4,8 ‌ల మధ్య తాత్కాలిక కట్టడాలను పూర్తిగా తొలగించడానికి చైనా అంగీకరించింది. ఈ ప్రాంతాన్ని ‘గస్తీ అవసరం లేని’ ప్రాంతంగా భవిష్యత్తులో రూపొందించుకోవాలని కూడా రెండు పక్షాలు అంగీకరించాయి. సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం, ఘర్షణ వాతావరణాన్ని నివారించడం, కొత్తగా సైనిక సమీకరణకు స్వస్తి చెప్పడం వంటి మూడు చర్యలను 2021 ఏప్రిల్‌ ‌నాటికి తీసుకుంటామని అంగీకరించినట్లు వచ్చిన వార్తలను చైనా యధాప్రకారం ఖండించింది.

ప్రస్తుత ఉద్రిక్తతలు, 2017లో డోక్లాం వివాదం చైనా విస్తరణవాద ధోరణిని స్పష్టం చేస్తున్నాయి. చైనా గత చరిత్రను దృష్టిలో పెట్టుకుని ‘అపనమ్మకం, పరిశీలన’ అనే ధోరణి అవలంబించాలని భారత్‌ ‌నిర్ణయించుకుంది.

దక్షిణ చైనా సముద్రంలో దుందుడుకు చర్యలు, శ్రీలంక హంబన్‌ ‌టోటా నౌకాశ్రయాన్ని 99ఏళ్లకు లీజుకు తీసుకోవడం, మాల్దీవ్‌ల చుట్టూ జలాలను ఆక్రమించుకునే ప్రయత్నం, మయన్మార్‌, ‌బంగ్లాదేశ్‌లలో ప్రాజెక్ట్‌ల పేరు చెప్పి చొరబడటం మొదలైనవన్నీ చైనా విస్తరణవాద ధోరణికి నిదర్శనాలు. సెఫెంగ్‌ ‌వ్యవస్థగా పేర్కొనే ఈ విధానం ద్వారా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని నిరంతరం చూస్తూనే ఉంది.

బీఆర్‌ఐ ‌పథకం కింద పాకిస్తాన్‌తో చైనా చేపట్టిన ఆర్ధిక నడవా ఏర్పాటు కూడా ఈ విస్తరణవాదంలో భాగమే. చైనాతో ఉమ్మడి ప్రాజెక్ట్‌లు నిర్వహించడానికి సిద్ధపడే దేశాలు క్రమంగా సైనిక, వాణిజ్య, దౌత్య రంగాల్లో ఆ దేశానికి దాసోహం అనే పరిస్థితి వస్తుంది. పాకిస్తాన్‌ ఇప్పటికే పూర్తిగా చైనా గుప్పెట్లోకి వెళ్లిపోయింది. పాకిస్తాన్‌తో సాగిస్తున్న ‘ఎల్లవేళలా స్నేహసంబంధాలు’ అనే విధానాన్నే కంబోడియాతో కూడా అమలు చేయాలన్న చైనా ప్రయత్నాలు ఆగ్నేయాసియాలో అమెరికా ప్రయోజనాలకు భంగకరంగా పరిణమిస్తున్నాయి.

పాకిస్తాన్‌తో సంబంధాలు, ఆ దేశాన్ని ఎలా గుప్పిటిలో బిగించిందనే విషయం స్పష్టంగా ఎప్పటికప్పుడు తెలిసినా కంబోడియా మాత్రం తనకు తెలియకుండానే చైనా ఆధిపత్యంలోకి వెళ్లిపోతుంది.  కరోనా వ్యాప్తిని అరికట్టడం కోసం చైనాకి విమానాల రాకపోకలను అడ్డుకోవడానికి అటు పాకిస్తాన్‌, ఇటు కంబోడియాలు అంగీకరించలేదు. అంతేకాదు ఫిబ్రవరిలో కంబోడియా ప్రధాని హున్‌ ‌సేన్‌ ‌చైనా పర్యటనకు వెళ్లారు. మానవహక్కుల ఉల్లంఘన, నిరంకుశ పాలనకు పాల్పడుతున్నట్లు అమెరికా, యూరోప్‌ ‌దేశాల విమర్శలు ఎదుర్కొంటున్న ప్రధాని హున్‌ ‌సేన్‌ ‌వాటినుంచి బయటపడటానికి చైనాకు దగ్గరయ్యారు. ఎలాంటి షరతులు లేకుండా పెట్టుబడులు పెడతామన్న చైనా ప్రతిపాదనను వెంటనే ఒప్పుకున్నారు.

సాంస్కృతిక, ఆర్ధిక సంబంధాలు, కమ్యూనిస్ట్ ‌సిద్ధాంతం ఈ రెండు దేశాలను మరింత దగ్గర చేశాయి. 2019నాటికి చైనా పెట్టుబడులు 62శాతానికి చేరాయి. చైనా పర్యాటక రంగ సంస్థలు పెద్దయెత్తున కంబోడియాలో పెట్టుబడులు పెట్టాయి. కాసినోలు, వ్యాపార సముదాయాలు, హోటళ్లు వెలిశాయి. కంబోడియా ఆర్ధిక వ్యవస్థలో ప్రధాన వాటా ఆక్రమించాయి.

కంబోడియా జీవనరేఖ అయిన మెకాంగ్‌ ‌నదీ పరీవాహక ప్రాంతాన్ని కూడా చైనా ఆక్రమించుకుంది. నదీ ప్రవాహపు దిశను మార్చడమేకాక ఎనిమిది జలవిద్యుత్‌ ఆనకట్టలను చైనా నిర్మించింది. దీనితో నదీ జలాల్లో జీవజాలం బాగా తరిగిపోవడమేకాక పర్యావరణం బాగా దెబ్బతింది.

చైనా పెట్టుబడుల పెను ప్రమాదం ఎలా ఉంటుందో తెలియాలంటే కంబోడియాలోని సిహనౌక్‌ ‌విల్లా పట్టణాన్ని చూస్తే చాలు. అమెరికా రీమ్‌ ‌నౌక స్థావరానికి, చైనా తొమ్మిది ఆర్ధిక జోన్‌లకు దగ్గరగా ఉన్న ఈ పట్టణంలో 90శాతం వ్యాపారాలు చైనా చేతిలోనే ఉన్నాయి. జూద కేంద్రాలకు ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం పర్యాటక ఆకర్షణగా మారింది. ఇక్కడ ఉన్నతమైన, లాభసాటి వ్యాపారాలు, ఉద్యోగాలన్నీ  చైనా వారి చేతిలోనే ఉన్నాయి. కంబోడియా వాసులు కేవలం చిన్న చిన్న పనులకే పరిమితమయ్యారు. చైనా చొరబాటును పట్టించుకొని కారణంగా కంబోడియా పాలకులకు ఇప్పుడు ఈ పట్టణంపై పట్టు పూర్తిగా పోయింది. ఇక్కడ అన్నీ వ్యవహారాలు చైనా కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. పట్టణంలోని చెరువులన్నీ చెత్త కుండీలుగా మారడంతో తరుచూ వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

అంతర్జాతీయ విమర్శలు ఎక్కువ కావడంతో ప్రధాని హున్‌ ‌సేన్‌ ‌మరింతగా చైనా సహాయంపై ఆధారపడ్డారు. 2018లో ఎన్నికలు గట్టెక్కడానికి హున్‌కు చైనా సహాయం చేసింది. వాయిస్‌ ఆఫ్‌ ‌డెమాక్రసీ, వాయిస్‌ ఆఫ్‌ అమెరికా మొదలైన స్వతంత్ర మీడియా సంస్థల అనుమతులు రద్దు చేయడంతో ఇప్పుడు చైనా చర్యలను ఎత్తిచూపే మీడియా లేకుండా పోయింది.

చైనా మద్దతు చూసుకుని సేన్‌ ‌తమ దేశంలో పౌర సమాజం, పత్రికలు, ప్రజాస్వామ్య సంస్థల గొంతు నొక్కెశారు. ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఈ ఫలితాలను చైనా తప్ప ఏ ప్రజాస్వామ్య దేశం ఆమోదించలేదు. ఆ తరువాత చైనా 600 మిలియన్‌ ‌డాలర్ల ఆర్ధిక సహాయాన్ని ప్రకటించింది. అయితే చైనా కబంధ హస్తాల్లో చిక్కుకున్న కంబోడియా సిహనౌక్‌ ‌విల్లా వంటి వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన తమ పట్టణాలపైన కూడా అధికారాన్ని, పట్టును కోల్పోయింది.

ప్రధాని హున్‌సేన్‌ ‌తన రాజకీయ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం దేశ ప్రయోజనాలను చైనాకు తాకట్టు పెట్టేశారు. చివరికి రాజపరివారం కూడా చైనా ఆదేశాలకు తలొగ్గల్సిన పరిస్థితి వచ్చింది.

చైనా సహాయం పొందుతున్న కంబోడియా ఐక్యరాజ్యసమితి వంటి అంతర్జాతీయ వేదికలపై ఆ దేశానికి మద్దతు పలుకుతోంది. దీనితో కంబోడియాను ఉపయోగించుకుని చైనా ఆసియాన్‌ ‌సంస్థను బలహీన పరచడానికి ప్రయత్నిస్తోంది. 2012 నుంచి ఆసియాన్‌లో చైనా వ్యతిరేక అంశాలను, తీర్మానాలను వీటో చేయడం ద్వారా కంబోడియా తన స్వామిభక్తిని నిరూపించుకుంటోంది. ఇటీవల కోవిడ్‌ ‌విషయమై జరిగిన ఆసియాన్‌ ‌సమావేశాల్లో మాట్లాడుతూ హున్‌ ‌సేన్‌ ‘‌మనం జాతి వివక్షకు, మరొకరిపై నేరారోపణలు చేయడానికి దూరంగా ఉండాలి’ అన్నారు. ఆ విధంగా చైనాను పరోక్షంగా సమర్ధించారు. చైనా అనుకూల ధోరణిని అవలంబించి లంకాంగ్‌ – ‌మెకాంగ్‌ ‌సహకార ఫోరం ద్వారా ప్రాంతీయ ప్రయోజనాలను కూడా కంబోడియా తాకట్టు పెడుతోంది. ‘ఒకే చైనా’ అనే విధానానికి మద్దతుగా తైవాన్‌, ‌టిబెట్‌ ‌జెండాలను కూడా బహిరంగంగా ఎగురవేయడాన్ని నిషేధించింది కంబోడియా ప్రభుత్వం.

ఆర్ధిక, రాజకీయ సహకార, సంబంధాలతోపాటు చైనా, కంబోడియాల మధ్య విస్తరిస్తున్న  సైనిక సంబంధాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కోవిడ్‌ ‌మహమ్మారి పరిస్థితులను కూడా లెక్క చేయకుండా రెండు దేశాలు గోల్డెన్‌ ‌డ్రాగన్‌ ‌సంయుక్త సైనిక విన్యాసాలను నిర్వహించాయి. ఈ సైనిక విన్యాసాలు 2016 నుంచి జరుగుతున్నాయి. 2008లో కంబోడియా కొహ్‌ ‌కాంగ్‌ ‌ప్రాంతంలోని దారా సకోర్‌ ఆర్ధిక జోన్‌లో 45వేల హెక్టార్ల భూమిని చైనాకు చెందిన తైజిన్‌ ‌గ్రూప్‌ ‌కంపెనీలకు 99 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఈ ప్రాంతం అమెరికా నౌకాదళ స్థావరానికి దగ్గరగా ఉంది. ఇక్కడ చైనా కొత్తగా నిర్మించిన విశాలమైన రన్‌ ‌వే, ఇతర నిర్మాణాల పట్ల అమెరికా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

వివిధ దేశాలతో సంబంధాల పేరు చెప్పి చైనా సైన్యపరమైన మౌలికసదుపాయాలను పెంచుకుంటూ పోతోంది. అలాంటిది ఏమి లేదంటూ ఆ దేశం బుకాయిస్తున్నా గ్వాదర్‌, ‌దారా సకోర్‌లలో చైనా చేస్తున్న నిర్మాణాలు పలు సందేహాలను బలపరుస్తున్నాయి.

చైనాతో కొనసాగిస్తున్న సంబంధాలపట్ల పలు విమర్శలు వస్తున్నప్పటికి కంబోడియా ప్రధాని తన పదవి కాపాడుకునేందుకు  చైనా అనుకూల విధానాన్నే కొనసాగిస్తున్నారు. అంతర్జాతీయ ఒత్తిడుల నుంచి తనకు చైనా రక్షణ కల్పిస్తుండడంతో హున్‌ ‌సేన్‌ అం‌దుకు కృతజ్ఞతగా చైనాకు పూర్తి వాణిజ్య హక్కులను కట్టబెట్టారు. 2020లో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందాన్ని చేసుకున్నారు. దీనితో కంబోడియాలో చైనా ప్రభావం, ప్రాబల్యం మరింత పెరిగిపోతాయి. అవినీతిలో పీకల్లోతు కూరుకుపోయిన హున్‌ ‌సేన్‌ ‌ప్రభుత్వం కంబోడియాను చైనాకు సామంత దేశంగా మార్చేసింది. దీనితో ఈ ప్రాంతంలో చైనా వ్యూహాత్మక చర్యల మూలంగా థాయిలాండ్‌, ‌వియత్నాం, సింగపూర్‌, ‌మలేషియా, ఇండోనేషియా వంటి దేశాలకు కూడా ముప్పు ఏర్పడుతోంది.

కంబోడియాతో స్నేహసంబంధాలకు గుర్తుగా చైనా అధ్యక్షుడు జీపింగ్‌ ‌తమ దేశపు అత్యున్నత పురస్కారాన్ని కంబోడియా రాజమాత నోరోడోమ్‌ ‌మోనినేత్‌ ‌సిహనౌక్‌కు అందజేశారు. అయితే దీని తరువాత కొన్ని రోజులకే కంబోడియాలోని అమెరికా నౌకాదళ స్థావరంలో మరొక భవనపు కూల్చివేత జరిగిందని వ్యూహాత్మక, అంతర్జాతీయ సర్వీసుల సంస్థ ఒక కధనంలో పేర్కొంది.

రీమ్‌లోని సముద్రజలాల రక్షణ సంస్థ కేంద్రంలో మరమ్మత్తులు చేయడానికి అమెరికా సంసిద్ధత వ్యక్తం చేసినా కంబోడియా పట్టించుకోలేదు. చైనా జోక్యం ఏది లేదని చెపుతున్నప్పటికీ రీమ్‌ ‌నౌకాదళ స్థావరాన్ని కొహ్‌ ‌ప్రీప్‌ ‌ద్వీపానికి మార్చాలని నిర్ణయం తీసుకున్నట్లు కంబోడియా ప్రకటించింది. చైనా, అమెరికాల మధ్య ఉద్రిక్తతలు పెరగడం, తమ సైనిక దళాలకు శిక్షణ నివ్వడానికి అమెరికా దళాలు తమవద్దకు వచ్చాయని తైవాన్‌ ‌ప్రకటించిన నేపధ్యంలో అమెరికాకు చెందిన భవనాలను కూల్చేయాలని కంబోడియా ప్రభుత్వంపై చైనా ఒత్తిడి తెచ్చి ఉండవచ్చును.

ఈ వార్తలకు తగినట్లుగానే అమెరికా భవనాన్ని కూల్చేసినట్లు కంబోడియా రక్షణ మంత్రి ధ్రువీకరించడమేకాక రీమ్‌ ‌నౌకా స్థావరాన్ని 30 ఏళ్లపాటు ఉపయోగించుకునేందుకు చైనాకు అనుమతినిచ్చినట్లు కూడా ప్రకటించారు. థాయిలాండ్‌ ‌గల్ఫ్‌లో వ్యూహాత్మక ఉనికి వల్ల చైనాకు దక్షిణ చైనా సముద్రంలో నిఘా, గస్తీ అవకాశాలు మరింతగా పెరిగాయి.

కంబోడియాతో సహా వివిధ దేశాల్లో  చైనా అమలు చేస్తున్న ఈ విస్తరణవాద విధానాలు ఆ దేశం పురాతనంగా అనుసరిస్తున్న  గందరగోళం ప్రపంచ వ్యవస్థ ఏర్పాటులో భాగమే. ఈ విషయాన్ని ప్రపంచం ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది.

By editor

Twitter
Instagram