ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాలు గతవారం ఐదు రోజుల పాటు జరిగాయి. అవి ఎలా జరిగాయి అనడిగితే, ఎప్పటిలానే ఇప్పుడు కూడా అంతే చక్కగా, అంతే సుందర ముదనష్టంగా జరిగాయనే సమాధానమే వస్తుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎప్పటిలానే ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు, బురద చల్లుకున్నారు. ఇప్పుడు కూడా కోట్ల రూపాయల ప్రజాధనం ఆవిరైపోయింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వయంగా పేర్కొన్నట్లుగా కరోనా కారణంగా సభను నడిపించే పరిస్థితి లేకపోయినా అనివార్యంగా నడిపించారు. అయితే ఆ అనివార్యత ఏమిటో, ఈ సమావేశాల్లో ఏం సాధించారో, ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో, ఏం సందేశం ఇచ్చారో మాత్రం ఎవరికీ అర్థం కాలేదు. అదొక అంతుచిక్కని బ్రహ్మ పదార్థంగా, సమాధానంలేని భేతాళ ప్రశ్నగానే మిగిలిపోయింది.

ఇటీవలి వర్షాలు, వరదలు వరుస విపత్తులతో అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగానికి శాసనసభ సమాధానం ఇవ్వలేకపోయింది. రైతాంగాన్ని సంతృప్తి పరచలేకపోయింది. అందుకేనేమో.. రాష్ట్రంలో మళ్లీ రైతుల ఆత్మహత్యల వార్తలు వినవలసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీ, జనసేన కూటమి అన్నదాత లకు అండగా నిలిచే బాధ్యతను తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ‌సారథ్యంలో రైతులకు న్యాయం చేయాలని, ముఖ్యంగా ఎకరాకు పదివేల రూపాయల తక్షణ సహాయం అందించాలని, అదేవిధంగా పాడైపోయిన రోడ్లను మరమ్మత్తు చేయడం; రైతులతో పాటుగా రైతుకూలీలు, చేనేత తదితర చేతివృత్తుల వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించాలని బీజేపీ, జనసేన కూటమి ఆందోళనలు నిర్వహిస్తోంది. దీక్షలు చేపట్టింది. సరే, ‘దున్నపోతు మీద వాన’ చందంగా ప్రభుత్వం స్పందించకపోతే.. చివరకు ఏమవుతుందో పొరుగు రాష్ట్ర ప్రజలు రుచి చూపించారు.

అయితే, ఈ శాసనసభ సమావేశాలకు కొన్ని ప్రత్యేకతలున్నాయి. ప్రత్యేక ఆకర్షణలున్నాయి. సభా నాయకుడు, ప్రతిపక్ష నేత, ఇరు పార్టీల నాయకులు కొత్త రికార్డులు సృష్టించారు. కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు తన వయసును, ఆ వయసుకు ఉండవలసిన గౌరవాన్ని, తనకున్న అనుభవాన్ని, ఆ అనుభవం తాలూకు విజ్ఞతను మరిచి గీత దాటి స్పీకర్‌ ‌పోడియం వద్దకు వెళ్లి బైఠాయించారు. ఆవిధంగా ఆయన కొత్త సంప్రదాయాన్ని సృష్టించారు. (గిట్టనివాళ్లు దుష్ట సంప్రదాయమని అని కూడా అంటున్నారు!)

సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజే.. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన వర్షాలు, వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా పంట నష్టం, నష్ట పరిహారంపై చర్చ జరిగింది. ఈ చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు స్వయంగా పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలియచేశారు. గతంలో ప్రతిపక్ష సభ్యులు స్పీకర్‌ ‌పోడియంను చుట్టుముట్టడం, నినాదాలు చేయడం, ప్లకార్డులు ప్రదర్శించడం, సభను స్తంభింప చేయడం చూశాం. కొన్ని సందర్భాలలో మరో అడుగు ముందుకు వేసి స్పీకర్‌ ‌మీద కాగితాలు విసరడం కూడా అనుభవంలో ఉన్న విషయమే. అయితే ఇంతవరకు ఎప్పుడూ కూడా ప్రతిపక్ష నేత ఎవరూ స్వయంగా గీత దాటలేదు. స్పీకర్‌ ‌పోడియం ముందు కూర్చుని నిరసన తెలియచేయలేదు. చంద్రబాబు నాయుడు ఆ విధంగా మరో ముందడుగు వేశారు. ఒకప్పుడు తాను ముఖ్యమంత్రిగా, యనమల రామకృష్ణుడు స్పీకర్‌గా ఉన్నరోజుల్లో గీసిన నియమావళి గీతను చంద్రబాబునాయుడే స్వయంగా, స్వహస్తాలతో చక్కగా చెరిపేశారు.

మరోవైపు సభానాయకుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కూడా ప్రతిపక్ష నేతకు ఏమాత్రం తీసిపోలేదు. ఆయన కూడా అంతే ‘హుందా’గా వ్యవహించారు. ప్రతిపక్ష నాయకుడు సభలో ‘రౌడీయిజం’ చేస్తున్నారని అన్నారు. అంతేకాదు, ప్రతిపక్ష నాయకుడి హావభావాలను అనుకరిస్తూ ఎద్దేవా చేశారు. అది చాలదన్నట్లుగా.. ప్రతిపక్ష సభ్యులను మార్షల్స్‌తో ఎత్తి బయట వేయించమని అధ్యక్షులవారికి ‘విజ్ఞప్తి’ చేశారు. ఇంకా చాలా అన్నారు. చాలా చేశారు. స్పీకర్‌ ‌తమ్మినేని సీతారాం కూడా సభానాయకుడు, ప్రతిపక్ష నేతకు తీసిపోని విధంగా సభను ‘గౌరవప్రదం’గా నడిపించారు. ఇక ఇరు పార్టీల సభ్యుల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా? అన్న సామెతను గుర్తుచేశారు. చివరకు 12 మంది తెలుగుదేశం సభ్యుల సస్పెన్షన్‌తో తొలి రోజు సభా కార్యక్రమాలకు చుక్కపెట్టారు. ఇంతచేసి చివరకు రైతులకు మేలు జరిగే మంచి మాట ఏదైనా వచ్చిందా అంటే, అదీ లేదు. ముఖ్యమంత్రి తక్షణ సహాయం విషయంలో చాలా స్పష్టంగా చేతులెత్తేశారు. రైతులకు ఇవ్వవలసిన ఇన్‌పుట్‌ ‌సబ్సిడీ బకాయిలను కూడా కొత్త సంవత్సరం వరకు వాయిదా వేశారు. ఈలోగా లెక్కలు తేల్చి వచ్చే జనవరి తర్వాత నిధులు విడుదల చేస్తామని చెప్పారు. నిజమే మరి, అప్పు చేస్తే గాని పూట గడవని స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు అంతకంటే ఏం చేస్తారు. రాష్ట్ర ఖజానాలో కాసులు లేకుండా ఆయన మాత్రం ఎక్కడనుంచి తెచ్చి ఇస్తారు. నిజానికి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎంత అద్వాన్నంగా ఉందో వేరే చెప్పనక్కరలేదు. నిన్న మొన్ననే కాగ్‌ ‌రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ, ప్రభుత్వ నిర్వహణకు చేసే ఖర్చులో 51.73 శాతం అప్పుల నుంచే వస్తోందని (అంటే- అప్పులు పుడితేనే ప్రభుత్వం నడుస్తుందని) తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు ఒకటో తారీఖున వస్తాయనే భరోసా లేకుండాపోయింది. 2026 నాటికి లక్ష కోట్లకు పైగా అప్పు తీర్చాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని విశ్లేషిస్తూ.. సమగ్ర ఆర్థిక వ్యూహం లేకపోతే ఇబ్బందులు తప్పవని ‘కాగ్‌’ ‌హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితిని పసిగట్టే కావచ్చు.. ఆంధప్రదేశ్‌ ‌నుంచి ఎన్నికైన రాజ్యసభ సభ్యుడు సురేష్‌ ‌ప్రభు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతరామన్‌కు లేఖ రాశారు. అంటే గడచిన ఏడేళ్లలో రాష్ట్రాన్ని పాలించిన ప్రాంతీయ, కుటుంబ పార్టీలు ఏ స్థితికి దిగజార్చారో అర్థం చేసుకోవచ్చు.

అదలా ఉంటే, ఈసారి సమావేశాల్లో మరో విశేషం కూడా చోటు చేసుకుంది. ‘బిగ్‌ ‌స్క్రీన్‌’ ఎం‌ట్రీ ఇచ్చింది. గతంలో ఎవరెవరు, ఎప్పుడెప్పుడు, ఏమేమి మాట్లాడారో ఆ క్లిప్పింగ్స్‌ను ముఖ్యమంత్రి సందర్భోతంగా, తమకు అనుకూలమైన రీతిలో సభలో ప్రదర్శిస్తున్నారు. నిజానికి, సభా నియమాల ప్రకారం వార్తాపత్రికలలో వచ్చిన కథనాలను సభలో ఉటంకించాలంటే ముందుగా స్పీకర్‌ అనుమతి తీసుకోవాలని అంటారు. అలాగే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ ‌ప్రత్యక్ష ప్రసారం విషయంలో కూడా స్పీకర్‌కే అన్ని అధికారాలు ఉంటాయి. కానీ, ప్రత్యక్ష ప్రసారం సాక్షిగా ఈ ప్రసారాలకు సంబంధించిన రిమోట్‌ ‌ముఖ్యమంత్రి చేతిలోనే ఉంది. ఆయన ‘ప్లే’ అనగానే బొమ్మ పడుతోంది. ‘స్టాప్‌’ అనగానే ఆగిపోతోంది. సభలో మాట్లాడిన మాటలనే కాదు, ఎక్కడో, ఎప్పుడో బహిరంగ సభల్లో మాట్లాడిన మాటలను సభలో ప్రదర్శిస్తున్నారు. నవ్వుతున్నారు. నవ్విస్తున్నారు. అయితే ఇలా ఎక్కడెక్కడో, ఎప్పుడెప్పుడో జరిగిన సంఘటనలను సభలో చూపవచ్చునా? సభా నిబంధనలు అందుకు అంగీకరిస్తాయా? ఇది ఇంతటితో ఆగుతుందా లేక ఇంకెక్కడికో వెళుతుందా? అసెంబ్లీ టీవీ చర్చల స్థాయికి, ఇంకా అవమానకర స్థాయికి దిగజరుతుందా? అనే భయంకర ప్రశ్నలకు ఇంతవరకు ఎవరినుంచి సమా ధానాలు లేవు. ఇప్పటికైనా స్పీకర్‌ ‌సమాధానం చెపితే బాగుంటుంది. కాదంటే, కోర్టులు ఉండనే ఉన్నాయి.

అలాగని ఈ సమావేశాలలో అసలేమీ జరగలేదా అంటే, అదేమీ లేదు. ఇంచుమించుగా ఈ సంవత్సరం ఆరంభం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి మధ్య జరుగతున్న ‘స్థానిక’ వివాదం సభలోనూ ధ్వనించింది. నిజానికి, ముఖ్యమంత్రి శీతాకాల సమావేశాలు జరిపేందుకు ఉన్నాయన్న అనివార్య కారణాలలో ఇది కూడా ఒకటి కావచ్చునో ఏమో గానీ, ఈ సమావేశాలలో ప్రభుత్వం స్థానిక సంగ్రామాన్ని మరో మెట్టు పైకి తీసుకుపోయింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతి లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకూడదని అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఒకవిధంగా స్వయం ప్రతిపత్తి గల రాజ్యాంగ సంస్థకు సర్కారు హుకుం జారీచేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే, చాలా దూరం వెళ్లిన వివాదం ఇంకా ఎంత దూరం పోతుందో, ఎలాంటి రాజాకీయ, రాజ్యాంగ సంక్షోభాలకు తెరతీస్తుందో.. చూడవలసి ఉంది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ ‌గవర్నర్‌కు లేఖ రాశారు. ఎన్నికల సంఘానికి ఆర్టికల్‌ 243 ‌ద్వారా రాజ్యాంగం కలిపించిన స్వయం ప్రతిపత్తిని ప్రభుత్వం సవాలు చేయలేదని, అదే సమయంలో ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం విధి అని, ప్రభుత్వం సమ్మతితోనే ఎన్నికలు జరపాలనడం రాజ్యాంగ విరుద్ధమని ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే, మొత్తానికి ఈ వ్యవహారం మళ్లీ అన్ని కోర్టుల చుట్టూ తిరిగివచ్చేసరికి పుణ్యకాలం పూర్తవుతుంది. మార్చిలో రమేష్‌కుమార్‌ ‌పదవీవిరమణ చేస్తారు. ఆ తర్వాత ‘అస్మదీయ కమిషనర్‌’ ‌సారథ్యంలో ఇష్టారాజ్యంగా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఇది బహిరంగ రహస్యం. మంత్రి కొడాలి నాని మార్చి తర్వాతనే ఎన్నికలు అని ప్రకటించారు. కాబట్టి మొత్తానికి కరోనా కష్టకాలంలో జరిగిన శాసనసభ శీతాకాల సమావేశాలు వాడీవేడీగానే కాదు, వికార విషాదాలకు, వికృత విన్యాసాలకు వేదికగా నిలిచాయి. ఈ ఇద్దరూ, ఈ రెండు పార్టీలు ఉన్నంతవరకు ఈ మాయా వినోదం ఇలా కొనసాగుతూనే ఉంటుందనే చెప్పాలి. రాష్ట్రం అన్నివిధాలుగా దిగజారుతూనే ఉంటుంది. అందులో సందేహం లేదు.

కొసమెరుపు ఏమిటంటే, అసెంబ్లీ సమావేశాలు జరుగతున్న సమయంలోనే, రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల నెత్తిన భారీ బండను మోపింది. రేషన్‌ ‌దుకాణాల్లో రాయితీపై ఇచ్చే సరకుల ధరలను భారీగా పెంచింది. కిలో కందిపప్పుపై ఏకంగా ఒకేసారి రూ.27 పెంచింది. కిలో పంచదారపై రూ.14 వడ్డించింది. ఈ రెండు సరుకుల ద్వారానే సంవత్సరానికి పేదలపై పడే భారం అక్షరాల 600 కోట్ల రూపాయలు ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, పేద ప్రజలకు నిత్యావసర సరుకులపై ఇచ్చే సబ్సిడీని 50 శాతం నుంచి 25 శాతానికి తగ్గించింది. అంటే, ఇంతవరకు మార్కెట్‌ ‌ధరలో సగానికి సరుకులు పొందుతున్న పేదలు ఇక ఇప్పుడు 75 శాతం చెల్లించవలసి ఉంటుంది. అలాగే, గతంలో అవినీతి, అక్రమాలకు, అన్యమత ప్రచారానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై సస్పెండ్‌ అయిన శ్రీశైలం దేవస్థానం ఉద్యోగుల సస్పెన్షన్‌ను రద్దు చేసింది. అన్యాక్రాంతమైన అన్నవరం భూములను క్రమబద్ధీకరణ పేరిట సొమ్ము చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. ఇలా ఇంకా వెలుగుచూడని ఘన కార్యాలు ఎన్నెన్ని జరుగుతున్నాయో! తస్మాత్‌ ‌జాగ్రత్త..

– రాజనాల బాలకృష్ణ, సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram