చెప్పేదొకటి.. చేసేదొకటి.. నినాదమొకటి.. కార్యాచరణ మరొకటి.. ప్రజల ముందు ప్రకటించేదొకటి.. అంతర్గత ప్రణాళిక మరొకటి.. హామీ ఇచ్చేదొకటి.. ఆచరించేది ఇంకొకటి.. పార్టీ ఒకటే.. వైఖరులు ఎన్నో.. ఇవన్నీ సరిగ్గా ఎవరికి అతుకుతాయో, ఎవరి తీరుకు నిదర్శనంగా నిలుస్తాయో అన్నది చదువుతుంటూనే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. నిజమే. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచీ నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న అనుభవాలు తరచూ ఇక్కడి ప్రజలను సందిగ్ధంలో పడేస్తున్నాయి. తాజాగా అదే అనుభవం మరోసారి ఎదురయింది. తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా ఓటర్లను ఆలోచనలో ముంచెత్తింది.


మొన్న జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, నిన్న జరిగిన జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు టీఆర్‌ఎస్‌ ‌గ్రాఫ్‌ను అథఃపాతాళంలోకి నెట్టేశాయి. తెలంగాణలో అసలు ప్రతిపక్షమే లేదని, తమకు ఎదురేలేదని అత్యుత్సాహంతో దూసుకెళ్తున్న ఆ పార్టీకి ఈ రెండు పరిణామాలు ఊహించని బ్రేకులు వేశాయి. టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం, పార్టీ నాయకుల అతి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశాయి.

ఇవి ఒకెత్తయితే, జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల పక్రియ పూర్తయి ఫలితాలు వెలువడిన వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ జరిగిన భారత్‌ ‌బంద్‌కు కేసీఆర్‌ ‌బహిరంగ మద్దతు ప్రకటించారు. కొన్ని చోట్ల ఆ పార్టీ శ్రేణులు హింసాత్మక చర్యలకు కూడా పాల్పడ్డారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం మీద రాష్ట్రవ్యాప్తంగా విమర్శల వెల్లువ కనిపించింది. భారత్‌ ‌బంద్‌కు మద్దతు ఇచ్చిన టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఇతర వర్గాలు మినహా.. ప్రతిఒక్కరి నుంచీ వ్యతిరేకత వ్యక్తమయింది. ఇక్కడి రైతుల అవస్థలు, కష్టాలు పట్టించుకోకుండా.. ఎక్కడో ఢిల్లీలో జరిగే రైతు ఉద్యమానికి మద్దతు ఇవ్వడంపై రైతుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమయింది. ఎప్పుడూ సామెతలు, పిట్టకథలు చెప్పే కేసీఆర్‌కు.. ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలి’ అన్న నానుడి తెలియదా అని కూడా అన్నదాతలు గుర్తు చేస్తూ వీడియోలు రికార్డ్ ‌చేసి వైరల్‌ ‌చేశారు. ముందు మన రైతులను బాగు చేసి.. ఆ తర్వాత ఇతర ప్రాంతాల రైతుల ఉద్యమాలకు మద్దతు ఇస్తే ఆదర్శంగా ఉంటుందని కూడా విమర్శలు వచ్చాయి. తెలంగాణ రైతులను సన్నవడ్ల పేరుతో ఆకర్షించి కల్లాల్లో జాగారం చేసే పరిస్థితి కల్పించారని, కేవలం ప్రతిపాదనలు ప్రకటించడం తప్ప.. ఆచరణకు వచ్చేసరికి కేసీఆర్‌ ‌తన సహజ శైలిలో చేతులు ఎత్తేశారన్న వాదనలు వ్యక్తమయ్యాయి. అలాగే, ఎల్‌ఆర్‌ఎస్‌ అం‌టూ.. ధరణి అంటూ ఆస్తుల రిజిస్ట్రేషన్లలో మెలికలు పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కూడా ఆరోపణలు వచ్చాయి.

ఈ సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ఢిల్లీ పర్యటన అందరినీ ఆలోచనలో ముంచెత్తింది. ఒక్కరోజు, రెండు రోజులు కాదు.. వరుసగా మూడు రోజులు కేసీఆర్‌ ‌ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనకు ముందు కూడా ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. తొలుత జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో కేంద్రంపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. రైతుల భారత్‌ ‌బంద్‌కు మద్దతు ప్రకటించి కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. కానీ, ఆ వెనువెంటనే.. కేంద్రాన్ని కొనియాడుతూ లేఖ రాశారు. పార్లమెంటు నూతన భవనం నిర్మాణం గురించి సెంట్రల్‌ ‌విస్టా ప్రాజెక్టుపై కేంద్రాన్ని ప్రశంసిస్తూ ఉత్తరాయణం నడిపారు. ఆ తర్వాత ఢిల్లీకి వెళ్లారు.

ఈ పర్యటనలో కేసీఆర్‌ ‌షెడ్యూల్‌పై అధికారిక వర్గాలు వెలువరించిన వివరాల ప్రకారం.. తక్షణ వరద సాయం కింద రూ.1350 కోట్లు ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని కోరారు కేసీఆర్‌. ‌పెండింగ్‌లో ఉన్న జీఎస్టీ బకాయిలు విడుదల చేయాలని, సాగునీటి ప్రాజెక్టులకు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. నీతి ఆయోగ్‌ ‌సిఫారసు చేసిన రూ.24 వేల కోట్లు ఇవ్వాలని, నిధులు మంజూరు చేసి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరారు. అంతకుముందు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ ‌పురిని కలిసి ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో ఆరు కొత్త ఎయిర్‌పోర్ట్‌ల కోసం చర్యలు చేపట్టాలని కోరారు. వాటిలో పెద్దపల్లి జిల్లా బసంత్‌ ‌నగర్‌, ‌వరంగల్‌లోని మామునూర్‌, ఆదిలాబాద్‌, ‌నిజామాబాద్‌ ‌జిల్లా జక్రాన్‌పల్లి, మహబూబ్‌నగర్‌ ‌జిల్లా గుడిబండ, భదాద్రి కొత్తగూడెం జిల్లా ఎయిర్‌ ‌పోర్టులు ఉన్నాయి. సిద్దిపేట సహా ఆరు విమానాశ్రయాల ఏర్పాటుపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ ‌షెకావత్‌తోనూ కేసీఆర్‌ ‌భేటీ అయ్యారు. నీటి ప్రాజెక్టులు, నదీ జలాల వినియోగానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం హోంమంత్రి అమిత్‌షాతో సమావేశ మయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లేందుకే కేసీఆర్‌ ‌ఢిల్లీకి వెళ్లారని ప్రకటించినా ప్రధాని సహా.. కేంద్రమంత్రులు అందరితోనూ కేసీఆర్‌ 40 ‌నిమిషాల నుంచి గంటసేపు చర్చలు జరిపారు. వీటి మీద తెలంగాణ వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది.

కేసీఆర్‌ ‌మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. అంతకు ముందు వారంలోనే జరిగిన రైతుల భారత్‌ ‌బంద్‌కు ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. రాజధాని సరిహద్దుల్లోనే రైతుల ఆందోళన కొనసాగుతోంది. వేలసంఖ్యలో రైతులు అక్కడ తిష్ట వేసి కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. నూతన రైతు చట్టాలను విరమించుకొనే దాకా నిరసనలు ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో ఒక ముఖ్యమంత్రిగా ఉండి భారత్‌ ‌బంద్‌కు మద్దతు ఇచ్చిన కేసీఆర్‌.. ‌ఢిల్లీకి వెళ్లి రైతు సంఘాలకు సంఘీభావం తెలుపకపోవడంపై రకరకాలుగా చర్చలు సాగుతున్నాయి. పైగా, హడావుడి పర్యటన కాదు. మూడు రోజులూ ఢిల్లీలోనే మకాం వేశారు. ప్రధానమంత్రి సహా.. కేంద్రమంత్రులతో భేటీ కోసం ప్రయత్నాలు చేసి వాళ్లను కలిశారు. గంటల పాటు వాళ్లతో చర్చించారు. అదే సమయంలో ఆందోళనల్లో పాల్గొంటున్న పంజాబ్‌ ‌రైతులు, రైతు సంఘాల దగ్గరికి వెళ్లి వాళ్లను పరామర్శించడం పెద్ద పనికాదు. కానీ, కేసీఆర్‌ ఆ ‌ప్రయత్నం చేయలేదు. అంటే, బీజేపీ లక్ష్యంగా రాష్ట్రంలో గాంభీర్యం ప్రదర్శిస్తున్న కేసీఆర్‌.. ‌ఢిల్లీకి వెళ్లి అక్కడ రైతులను కలిస్తే కేంద్ర ప్రభుత్వం పెద్దల ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుందన్న కారణమే కావొచ్చంటున్నారు విశ్లేషకులు. కేవలం మాటలకు తప్ప చేతల్లో కేసీఆర్‌ ‌వైఖరి గురించి అందరికీ తెలిసిందే కదా అని కూడా తెలంగాణ వాసులు పెదవి చిట్లిస్తున్నారు. అంటే, రైతులకు, రైతు సంఘాలకు, జాతీయస్థాయిలో ఆ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన ఇతర పార్టీలను కేసీఆర్‌ ‌తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్న చర్చ కూడా సాగుతోంది.

మరోవైపు, కేసీఆర్‌ ‌ఢిల్లీ పర్యటన వెనుక వేరే కారణాలున్నాయన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. హస్తిన కేంద్రంగా తెలంగాణ రాజకీయాలపై జోరుగా చర్చ జరుగుతోందని, కేంద్ర ప్రభుత్వం ఆగ్రహానికి గురికాకుండా వాళ్లను ప్రసన్నం చేసుకోవడం కోసమే ఆగమేఘాల మీద కేసీఆర్‌ ‌ఢిల్లీ వెళ్లారని అంటున్నారు. పలు కీలక, వివాదాస్పద అంశాల నేపథ్యంలో బీజేపీతో టీఆర్‌ఎస్‌ ‌సంధి కుదుర్చుకోవాలన్న ప్రతిపాదనతోనే కేసీఆర్‌ ‌ఢిల్లీ వెళ్లారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

కేసీఆర్‌, ‌టీఆర్‌ఎస్‌ ఇతర నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనడానికి ఆధారాలున్నాయని, వాటిపై న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌బాహాటంగా ప్రకటిస్తున్నారు. వీటికి సంంధించి కేంద్రం వద్ద కీలక ఆధారాలు కూడా ఉన్నట్లు సమాచారం. గ్రేటర్‌ ఎన్నికల సందర్భంగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఖాతాల్లోకి ఒక కాంట్రాక్టర్‌ ‌నుంచి కోటి రూపాయల వంతున నేరుగా జమ చేయించారన్న విషయం కేంద్ర ఏజెన్సీలు పసిగట్టాయని, బిహార్‌ ఎన్నికల సమయంలో ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్‌కు కేసీఆర్‌ ఆర్థికసాయం చేశారన్న సమాచారాన్ని కూడా కేంద్రం సేకరించిందని, కేసీఆర్‌ ‌కేంద్రమంత్రిగా ఉన్నప్పటి పాతకేసుపై సీబీఐ దర్యాప్తుకు రంగం సిద్ధమవుతోందని, వీటన్నింటి నేపథ్యంలో ‘రాజీ’ కోసమే కేసీఆర్‌ ‌ఢిల్లీకి వెళ్లారని మీడియాలో, సోషల్‌ ‌మీడియాలో వార్తలు వచ్చాయి. అంతేకాదు.. కొన్ని గ్రూపుల్లో అయితే.. జీహెచ్‌ఎం‌సీ మేయర్‌, ‌డిప్యూటీ మేయర్‌ ‌సీట్లను బీజేపీతో పంచుకునే ప్రతిపాదనను కేసీఆర్‌ ‌కేంద్రం పెద్దల ముందు ఉంచారని కూడా పుకార్లు వినిపించాయి. ఫలితంగా అవినీతి ఆరోపణలను పక్కనపెట్టాలని ప్రధాని, ఇతర ముఖ్యులను వేడుకున్నట్లు చర్చలు సాగాయి.

అయితే, జీహెచ్‌ఎం‌సీలో టీఆర్‌ఎస్‌తో పొత్తు ప్రచారాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌ఖండించారు. టీఆర్‌ఎస్‌తో అసలు పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. మరోవైపు కేసీఆర్‌ ‌ఢిల్లీ పర్యటన ముగిసి హైదరాబాద్‌కు బయలుదేరిన కాసేపటికే తెలంగాణ బీజేపీ చీఫ్‌ ‌బండి సంజయ్‌కి అధిష్టానం నుంచి పిలుపొచ్చింది. ఈ పరిణామం కూడా కలకలం సృష్టించింది. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో ఇబ్బడిముబ్బడిగా చేసిన విమర్శలపై కేసీఆర్‌ ‌ప్రధాని, ఇతర పెద్దల ముందు విచారం వ్యక్తంచేసి ఉంటారని, కొన్ని రాజీ ప్రతిపాదనలు చేసి ఉంటారని, వాటి గురించి చర్చించేందుకే బండి సంజయ్‌ని బీజేపీ అధిష్టానం పిలిపించిందన్న చర్చ విస్తృతంగా సాగింది. గులాబీ-కమల దళాలు రాజీ కాబోతున్నాయన్న పుకార్లు షికార్లు చేశాయి. గ్రేటర్‌ ఎన్నికల తర్వాత ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ‌ద్వారా బీజేపీతో పోరాడుతానన్న కేసీఆర్‌ ఆ ‌దిశగా కార్యాచరణ ప్రకటించలేదు. కేంద్రం పట్ల టీఆర్‌ఎస్‌ ‌వైఖరి మారిందనే చర్చ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్‌ ‌ఫెడరల్‌ ‌పోరు ముగిసినట్లే అన్న విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి.

ఈ విశ్లేషణలు సాగుతుండగానే ఢిల్లీలో బండి సంజయ్‌ ‌తన విమర్శల పదును మరింత పెంచారు. కేసీఆర్‌ అం‌టే నమ్మే పరిస్థితులో ఎవరూ లేరని.. ఆయన త్వరలో జైలుకెళ్లడం ఖాయమని అన్నారు. అక్రమాలపై భరతం పడతామని హెచ్చరించారు. కోతల రాయుడు ఢిల్లీ వెళ్తారని ముందే చెప్పామని బండి సంజయ్‌ ‌గుర్తుచేశారు. వంగి వంగి పొర్లి దండాలు పెట్టినా క్షమించబోమని తేల్చిచెప్పారు. ప్రజల దృష్టి మరల్చడానికే కేసీఆర్‌ ‌ఢిల్లీ పర్యటన చేశారని తెలిపారు. అయితే లోపల జరిగేది ఒకటి.. కేసీఆర్‌ ‌బయట చెప్పేది ఇంకొక్కటి అని చెప్పారు. కాళేశ్వరం మూడో టీఎంసీ పేరుతో ప్రజాధనం దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. కాళేశ్వరం అంచనాలను అడ్డగోలుగా పెంచారని మండిపడ్డారు. హస్తిన పర్యటనలో ఉన్న బండి సంజయ్‌ ‌చేసిన ఈ విమర్శలు సైతం కలకలం రేపాయి.

ఇదే సమయంలో కేసీఆర్‌ ‌సహజ శైలిపైనా జోరుగా చర్చ జరుగుతోంది. కేసీఆర్‌ అం‌దితే జుట్టు, లేదంటే కాళ్లు పట్టుకునే రకమని ప్రత్యర్థులు విమర్శిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సమయంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని దేవత అని పొగిడిన కేసీఆర్‌.. ‌తర్వాత ఆమెను దెయ్యం అని విమర్శించారని, అంతేకాకుండా, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలు తప్పారని కాంగ్రెస్‌ ‌నేతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ పెద్దలను కూడా కేసీఆర్‌ ‌తన మాటల మంత్రంతో మాయ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ ‌వైఖరిలో ఎప్పటికప్పుడు ఈ స్థాయిలో మార్పులు చోటు చేసుకోవడం వెనుక లోగుట్టు కచ్చితంగా ఉండి ఉంటుందన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది.

– సుజాత గోపగోని, 6302164068 : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram