ప్రస్తుత పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీని ప్రారంభించాలంటే ఎంతో దమ్ము, ధైర్యం ఉండాలి. పకడ్బందీ ప్రణాళిక, వివేచన, ముందుచూపు అవసరం. రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా పాతుకుపోయిన నేపథ్యంలో మూడో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేయడం ఆషామాషీ విషయం కాదు. అదీ ఎన్నికలు మరో నాలుగు నెలల్లో తరుముకొస్తున్న తరుణంలో పార్టీ ప్రకటన అంటే ఆచితూచి ఆలోచించాల్సిన అంశం. ఈ పరిస్థితుల్లో మరాఠీ మూలాలు గల ‘తలైవార్‌’ ‌రజనీకాంత్‌ ‌రాజకీయ పార్టీ ప్రకటనపై తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రజనీకాంత్‌గా పేరుగాంచిన శివాజీరావు గైక్వాడ్‌ ‌ద్రవిడ రాజకీయాలను ఎంతమేరకు ప్రభావితం చేయగలరనే విషయమై అంతటా ఆసక్తి నెలకొంది. ఇప్పటికిప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి ఒక అంచనాకు, నిర్ణయానికి రావడం తొందర పాటే అవుతుంది. ఒక్క తమిళ తంబిలు మాత్రమే తలైవార్‌ ‌తలరాతను తేల్చగలరు.


అన్నింటికీ మించి ఆధ్యాత్మిక రాజకీయాల గురించి రజనీకాంత్‌ ‌చేసిన ప్రస్తావన ఆసక్తికరం. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా ఆ రాష్ట్ర ప్రగతికి, ప్రజల సంక్షేమానికి పాటుపడటమే ధ్యేయమని పేర్కొంటుంది. కానీ దీనితోపాటు రజనీ కాంత్‌ ‌రాజకీయాలకు ఆధ్యాత్మికను జోడిస్తామనడం సంచలనంగా మారింది. దాదాపుగా తమిళ పార్టీలన్నీ నాస్తికవాదం ప్రాతిపదికన ముందుకు సాగుతున్న తరుణంలో తలైవార్‌ ‌ప్రకటన ఒక్క తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా సరికొత్త ఆలోచనకు తెరదీసింది. స్వాతంత్య్రం అనంతరం తొలిరోజుల్లో తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసి, తనదైన రీతిలో చక్రం తిప్పిన కాంగ్రెస్‌ ‌నాయకుడు కామరాజ్‌ ‌నాడార్‌ , ‌భక్తవత్సలం తదితరులు నాస్తికులేమీ కారు. అలా అని అపర ఆధ్యాత్మికవాదులూ కారు. వారిది మధ్యేమార్గం. కాంగ్రెస్‌ ‌పార్టీ విధానం కూడా అదే. లౌకికవాదం హస్తం పార్టీ విధానం అయినప్పటికీ, అది ప్రజల మత విశ్వాసాలను కాదనలేదు. కాంగ్రెస్‌ ‌తరవాత ద్రవిడ రాజకీయాలకు మూలపురుషులు ఈవీ రామస్వామి నాయకర్‌, అన్నాదొరై నాస్తిక వాదాన్ని నరనరాన జీర్ణించుకున్న నాయకులు. తన విధానాన్ని క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో ఆయన విజయవంతమయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న డీఎంకే (ద్రవిడ మున్నెత్ర కజగం) నాస్తికత్వాన్ని బలంగా నమ్ముతుంది. ఇతర పార్టీలు ఈ స్థాయిలో కాకపోయినా ఎంతోకొంత నాస్తికవాదాన్ని తలకెక్కించుకున్నవే. కానీ కాలక్రమంలో ద్రవిడ పార్టీలు నాస్తికత్వం విషయంలో ఒకింత ఉదారత కనబరుస్తున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ కాలం చక్రం తిప్పిన అన్నా డీఎంకే ఉదార విధానాన్నే ఎంచుకుంది. పార్టీ మూలపురుషుడు ఎంజీ రామచంద్రన్‌, ఆయన తరవాత పార్టీని విజయవంతంగా ముందుకు నడిపిన జయలలిత నాస్తికత్వాన్ని నరనరాన జీర్ణించుకున్న నేతలేమీ కాదు. కాలక్రమంలో కారణాలేమైనప్పటికీ అన్ని వర్గాల ప్రజల్లో నాస్తికత్వానికి బదులు ఆధ్యాత్మిక భావనలు పెరుగతున్నాయి. ఆయా కులాలు, మతాల వారు తమ దేవుళ్లను ఆరాధించడం అధికమైంది. ఇందుకు తమిళనాడు ఏమీ మినహాయింపు కాదు. కరడుగట్టిన డీఎంకేలోనూ ఇటీవల కాలంలో ఈ ధోరణి కనపడుతోంది.

 ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ ఆధ్యాత్మిక రాజకీయాల అంశాన్ని తెరపైకి తీసుకురావడం వ్యూహాత్మకమే. సాధారణంగా అయితే రజనీ ప్రతిపాదనను మత రాజకీయాలు అని లౌకిక పార్టీలు దునుమాడతాయి. కానీ ఇక్కడే తలైవార్‌ ‌తగిన జాగ్రత్తలు తీసుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మత రాజకీయాలకు, ఆధ్యాత్మిక రాజకీయాలకు మధ్య స్పష్టమైన విభజన రేఖ ఉంది. మత రాజకీయాలపై విమర్శలను ఎక్కుపెట్టినంత తీవ్రంగా ఆధ్యాత్మిక అంశాలపై విమర్శలను సంధించడం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ పార్టీకైనా కష్టమే. స్వయంగా రాఘవేంద్ర స్వామి భక్తుడైన రజనీకి ఈ విషయం బాగా తెలుసు. చిన్నప్పుడు బెంగళూరులోని తమ నివాసానికి సమీపంలో గల ఆలయానికి రజనీ నిత్యం వెళ్లేవారని ఆయన సోదరుడైన సత్యనారాయణ రావు ఇటీవల గుర్తు చేయడం గమనార్హం. ఇటీవల రజనీ బెంగళూరు వెళ్లి తన అగ్రజుడు సత్యనారాయణ రావు నుంచి ఆశీస్సులు పొందిన సంగతి తెలిసిందే. ఇక రజనీ తన పార్టీ కార్యకలాపాలను కూడా రాఘవేంద్ర కల్యాణ మండపంలోనే నిర్వహిస్తుంటారు. తన సినిమాల్లోనూ ఆయన ఆధ్యాత్మికతకు పెద్దపీట వేస్తారు. మారిన పరిస్థితుల్లో లౌకిక రాజకీయాలకు కాలం చెల్లిందన్న భావనను రాజకీయ విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. ఇదే రజనీని ముందుకు నడిపిస్తోంది. నాస్తికవాదం తమిళనాడులో ఎంత బలంగా పాతుకుపోయిందో అదే స్థాయిలో ఆధ్యాత్మికవాదం సైతం వేళ్లూనుకుంది. గుళ్లు గోపురాలకు, పీఠాలకు, ఆధ్యాత్మిక కేంద్రాలకు రాష్ట్రం ప్రసిద్ధి. ప్రఖ్యాతిగాంచిన కంచి కామకోటి పీఠం, ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం రామేశ్వరం ఇక్కడే ఉన్నాయి. మధుర, కంచి వంటి పుణ్యక్షేత్రాలు రాష్ట్రానికి తలమానికంగా ఉన్నాయి. అందువల్ల నాస్తికవాదానికి కాలం చెల్లిందని, మున్ముందు ఆధ్యాత్మిక రాజకీయాలదే పైచేయి అవుతుందని రజనీ అంచనాగా ఉందన్నది ఆయన అభిమానుల వాదన. మున్ముందు అధికార అన్నా డీఎంకే, కాంగ్రెస్‌, ‌భారతీయ జనతా పార్టీల నుంచి రజనీ పార్టీలోకి వలసలు వచ్చే అవకాశాలు లేకపోలేదు. అన్నా డీఎంకే నాయకత్వంపై పార్టీ శ్రేణుల్లో అంతగా విశ్వాసం లేదు. ఎన్నికల గోదారిని ఈదేంత శక్తి ప్రస్తుత పార్టీ నాయకత్వానికి లేదని అంతర్గతంగా పార్టీ శ్రేణులు అభిప్రాయ పడుతున్నాయి.

 రజనీ ఆధ్యాత్మిక రాజకీయాలపై విమర్శలు కూడా లేకపోలేదు. ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో ఆయన మత రాజకీయాలకు బీజం వేస్తున్నారన్న వాదన ఉంది. ఆయన అభిమానించే భారతీయ జనతా పార్టీ ప్రత్యక్షంగా మత రాజకీయాలకు తెరలేపగా, రజనీ తెలివిగా దానికి ఆధ్యాత్మిక రాజకీయాలన్న ముసుగు వేశారని విమర్శకులు విశ్లేషిస్తున్నారు. అంతిమంగా ఇదే ఆయనకు రాజకీయంగా నష్టం తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తు న్నారు. దీనివల్ల రాష్ట్రంలో బలమైన ఓటుబ్యాంకుగా ఉన్న ముస్లిములు, దళితులు దూరమయ్యే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఆధ్యాత్మికత పేరుతో వచ్చే ఓట్లు కూడా ఉండవన్న వాదన ఉంది. సంప్రదాయ హిందువులు సహజంగానే భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపుతారని, ఉదారవాద హిందూ వాదులు వివిధ పార్టీల మధ్య చీలిపోతారని.. అంతిమంగా తలైవార్‌కు కష్టాలు తప్పవని చెబుతున్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నప్పటికీ తన సరికొత్త ఆధ్యాత్మిక రాజకీయం మేలు చేస్తుందన్న బలమైన భావనలో రజనీ అభిమానులు ఉన్నారు. రాజకీయ రణరంగంలో తనకు చేదోడువాదోడుగా నిలిచేందుకు అర్జున్‌మూర్తి, తమిళారువి మణియన్‌లను రజనీ ఎంచుకున్నారు. అర్జున్‌మూర్తి భారతీయ జనతా పార్టీ మేధో విభాగం మాజీ అధిపతిగా పనిచేశారు. తమిళారువి కాంగ్రెస్‌ ‌మూలాలున్న నాయకుడు. ఆయన రాజకీయ సలహాదారుగా వ్యవహరిస్తారు. అర్జున్‌మూర్తి పార్టీ ప్రధాన సమన్వయకర్తగా పనిచేస్తారు.

 తనకు ఎంజీఆర్‌ ఆదర్శమని రజనీ చెబుతుంటారు. ఆయనంత గొప్పవాడిని కానని వినమ్రంగా చెప్పుకుంటూనే ఎంజీఆర్‌ ‌పాలనను తీసుకువస్తానని ప్రకటించడం విశేషం. ఇదే రజనీ ఒకప్పుడు ఎంజీఆర్‌ ‌తరవాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలితను తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. మరోసారి ఆమె గెలిస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేరని పరుషంగా వ్యాఖ్యానించారు. రజనీకి స్థిరమైన అభిప్రాయాలు లేవని, ఊగిసలాట ఎక్కువని, పార్టీ పెట్టడానికే సంవత్సరాల సమయం తీసుకున్న వ్యక్తి పార్టీని నడిపించడం, అధికారంలోకి తీసుకురావడం అంత తేలికకాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలుగు నెలల్లో పార్టీని అధికారం లోకి తీసుకువచ్చిన నాయకుడు ప్రపంచంలో ఎక్కడా లేరని విమర్శకులు గుర్తు చేస్తున్నారు. 1980ల్లో ఉమ్మడి ఆంధప్రదేశ్‌లో సినిమా నటుడైన నందమూరి తారకరామారావు తొమ్మిది నెలల్లో పార్టీని అధికారం లోకి తీసుకువచ్చారు. ఆ తరవాత వచ్చినవారు చతికిలపడ్డ సంగతి తెలిసిందే. నాడు ఏపీలో కాంగ్రెస్‌కు బలమైన ప్రత్యామ్నాయ పార్టీ లేదు. ఆ లోటును తెలివిగా ఉపయోగించుకుని నందమూరి లబ్ధి పొందారు. ఇప్పుడు తమిళనాడులో అలాంటి రాజకీయ శూన్యత లేదని, రెండు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అంచనా. నాయకత్వ పరంగా అధికార అన్నాడీఎంకే బలహీనంగా ఉన్న మాట వాస్తవమే.

అయితే శశికళ జైలు నుంచి వచ్చిన తరవాత పరిస్థితులు మారే అవకాశం ఉంది. ఇక విపక్ష డీఎంకే అటు సంస్థాగతంగా, ఇటు నాయకత్వపరంగా బలంగా ఉంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ 80కిపైగా స్థానాలు గెలిచి అన్నాడీఎంకేకు గట్టి సవాల్‌ ‌విసిరింది. గత ఏడాది పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 38 సీట్లలో డీఎంకే కూటమి 37 గెలుచుకుని అధికార అన్నా డీఎంకేను చావుదెబ్బ తీసింది. కూటమిలోని కాంగ్రెస్‌, ‌వామపక్షాలు కూడా బలమైన ఓటు బ్యాంకు కలిగి ఉన్నాయి. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్‌ 8, ‌సీపీఐ 2, సీపీఎం 2 సీట్లు గెలుచుకోవడం గమనార్హం. ఈ రెండు పార్టీలు రాజకీయంగా తమ ఉనికి కోసం డీఎంకేను కాదని ముందుకువెళ్లే పరిస్థితి లేదు. తక్కువ సీట్లిచ్చినా సర్దుకుపోక తప్పదు. రాజకీయంగా అన్న ఆళగిరితో పార్టీ అధినేత స్టాలిన్‌కు కొంత ఇబ్బంది లేకపోలేదు. అయితే ఆళగిరికి అంతగా ప్రజాదరణ లేని సంగతి గమనార్హం. సోదరి, పార్లమెట్‌ ‌సభ్యురాలైన కనిమొళి మాత్రం స్టాలిన్‌కు అండగా ఉన్నారు. అదే స్థాయిలో అన్నా డీఎంకే అంత బలంగా లేదు. కేంద్రంలో చక్రం తిప్పుతున్న భారతీయ జనతా పార్టీ మద్దతు దానికి ఉంది. రెండు పార్టీలు రేపటి ఎన్నికల్లో అధికారికంగా కలసి పనిచేస్తాయని ప్రకటించాయి. భాజపాకు పెద్దగా బలం లేదు. అది ఉనికి కోసం పోరాడు తోంది. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక రాజకీయాల పేరుతో భాజపా ఓట్లకు గండి కొట్టడం, సంప్రదాయ హిందువులు, అభిమానుల ఓట్లు పొందడం మినహా రజనీ పెద్దగా సాధించేదేమీ లేదన్నది కొందరి వాదన.

 తమిళ రాజకీయాలకు, సినిమాలకు అవినాభావ సంబంధం ఉంది. గత అయిదు దశాబ్దాలుగా తమిళ రాజకీయాలన్నీ సినిమాల చుట్టే తిరుగుతున్నాయి. అన్నాదొరై, కరుణానిధి, ఎంజీ రామచంద్రన్‌, ‌జయలలిత వంటి వెండితెర వేలుపులే రాజకీయా లను శాసిస్తూ వచ్చారు. ఆ తరహాలో చేయాలన్నదే రజనీ ఆంతరంగం. కానీ ఇటీవల కాలంలో చూస్తే వెండితెర వేలుపుల ప్రభ రాజకీయ తెరపై వికసించడం లేదు. 1979లో హిందీ నటుడు దేవానంద్‌ ‌నేషనల్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా స్థాపించి విఫలమయ్యారు. ఎంజీఆర్‌ 1972 అక్టోబరులో పార్టీ ప్రారంభించినప్పటికీ విజయం కోసం 1977వరకు వేచి ఉండాల్సి వచ్చింది. కన్నడ నటుడు ఉపేంద్ర ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ’ పెట్టి విఫలమయ్యారు. విజయ్‌ ‌కాంత్‌ ‌డీఎండీకే (దేశీయ మురుపొక్కు ద్రవిడ కజగం) పార్టీ పెట్టినప్పటికీ అధికారానికి ఆమడ దూరంలోనే ఆగిపోయారు. శరత్‌కుమార్‌ ‌స్థాపించిన ఆలిండియా సమతువ మక్కల్‌ ‌కట్చి పార్టీ కూడా చేదు అనుభవాలనే ఎదుర్కొంది. ఆంధప్రదేశ్‌లో ప్రజాదరణ గల నటులుగా పేరుగాంచిన చిరంజీవి, ఆయన సోదరుడు పవన్‌ ‌కల్యాణ్‌ ‌విఫలమయ్యారు. తాజాగా మరో సినీనటుడు కమలహాసన్‌ ‌మక్కల్‌ ‌నేదీ మైయిం పార్టీని 2018లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆయన రజనీతో పొత్తుకు సిద్ధమని ప్రకటించారు. విధానాల పరంగా రజనీ, కమల్‌ ‌పార్టీలకు వైరుద్ధ్యం ఉంది. రజనీది ఆధ్యాత్మిక బాట కాగా, కమల్‌ ‌ది అందుకు పూర్తిగా భిన్నం. అందువల్ల ఉభయులూ చేతులు కలిపే అవకాశాలు దాదాపుగా ఉండవు. ఒకప్పుడు తమిళ అగ్రనటుడు శివాజీ గణేశన్‌ ‌కూడా రాజకీయ రంగ ప్రవేశం చేసి విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ తమిళ రాజకీయాలను మలుపు తిప్పగలరా, ఆయన ప్రభావం ఓటర్లపై ఎంతన్నది తెలియాలంటే మరో అయిదు నెలలు ఆగక తప్పదు.

– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్‌, ‌సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram