దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ శతజయంతి ప్రత్యేకం

రెండు తెలుగు రాష్ట్రాలలో రైతుల పరిస్థితి దయనీయంగానే ఉన్నప్పటికీ, వ్యవసాయం దండగ అనుకోవడం సాధ్యం కాదని భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ (‌బీకేఎస్‌) అఖిల భారత కార్యవర్గ సభ్యుడు జలగం కుమారస్వామి అన్నారు. బీకేఎస్‌ ‌వ్యవస్థాపకుడు దత్తోపంత్‌ ‌ఠేంగ్డీ శత జయంతి సందర్భంగా ఈ సంస్థ కూడా పలు కార్యక్రమాలను చేపట్టింది. అందులో గో ఆధారిత వ్యవసాయాన్ని విస్తరించడం కూడా ఒకటని కుమారస్వామి చెప్పారు. 1996 నుండి భారతీయ కిసాన్‌సంఘ్‌ ‌పూర్వ ఆంధప్రదేశ్‌ ‌సంఘటనా కార్యదర్శిగా పని చేశారు. ప్రస్తుతం అఖిల భారత కార్యవర్గ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

జాగృతితో కుమారస్వామి ముఖాముఖీలోని కొన్ని అంశాలు:

ఆంధప్రదేశ్‌, ‌తెలంగాణ రాష్ట్రాలలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లు ఏమిటి?

నేడు ఆంధ్ర, తెలంగాణాలలో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. కేవలం కృష్ణా, గోదావరి డెల్టాలో తప్ప ఎక్కడా భూగర్భజలాలు లేవు. రెండోవైపు అధిక వర్షాల కారణంగా ఈ రెండు ప్రాంతాలలో పంటలు దెబ్బతిన్నాయి. ప్రాజెక్టులలో వర్షాధారంతో జీవిస్తున్న నాగార్జునసాగర్‌ ‌క్రింద ప్రకాశం జిల్లా వంటి ప్రాంతాలలో సాగునీరుకు భరోసాలేదు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లో ఎకరాకు రూ.10,000 ఇస్తామని చెప్పి ప్రభుత్వాలు చేతులు దులుపుకున్నాయి. సేద్యంలో మౌలికమైన ఎరువులు, విత్తనాలు రైతులకు అందుతున్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం కూడా లేదు.

ఆంధప్రాంతంలో ఒక్కొక్క రైతుకి రూ.25,000 బాకీ ఉంది. నీలం, ఫైలన్‌, ‌హెలిన్‌ ‌తుఫాన్‌లు, కరవు రాయితీలు బీమా కంపెనీలు ఇవ్వాలి. వేలకోట్ల రూపాయలు రైతుకి ప్రభుత్వమే బాకీ పడ్డాయి. ఇదికాకుండా సబ్సిడీలు, వ్యవసాయ పరికరాలు మొదలైనవి కోట్ల రూపాయలలో రావలసి ఉంది. తెలంగాణలో సబ్సిడీ ప్రశ్నే లేదు. గాలికి వదిలేశాయి. రాయలసీమలో రైతులు సాధారణంగా వర్షాధారంతోనే సేద్యం చేస్తున్నారు. వేరుసెనగలో నష్టాలు వసున్నాయని చిరుధాన్యలవైపు మళ్లారు.ఈ పంటకు మార్కెట్‌ ‌లేదు. చిరుధాన్యాలు పండిస్తే కొనేవారు లేరు. ధాన్యానికి గిట్టుబాటు ధరలేదు. కూరగాయలు పండించే రైతులు నష్టపోయారు. పొరుగు రాష్ట్రాల నుండి కూరగాయలు తెప్పించుకుంటున్నారు. సరైన విత్తనం దొరక్క, విత్తనానికి సరైన చట్టం లేక మార్కెటింగ్‌ ‌లేక దళారుల బెడద, ప్రభుత్వాలు గాలిలో దీపం పెట్టి, రైతులను సమస్యల వలయంలోకి నెట్టేశారు.

ఉభయ రాష్ట్రాలలో కూడా రైతులకు సబ్సిడీలు అందించడం కంటే లాభసాటి ధర, కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఎక్కువ అవసరమని గుర్తించాలి ప్రభుత్వం. రైతు ఆదాయం రెండంకెలు కావాలంటే దేశీయ విత్తనాలను అభివృద్ధి చేసి, చీడపీడలను తట్టుకొనే విత్తనాలు రైతులకు అందించాలి. దళారీ వ్యవస్థ లేకుండా ప్రభుత్వం కల్పించుకొని మార్కెటింగ్‌ ‌వ్యవస్థ నెలకొల్పాలి. పంట రుణాల ఆలోచన చేసి తగిన స్థాయిలో ఏర్పాటు చేయాలి. జీరో వడ్డీతో రుణాలు ఇవ్వాలి. నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు ప్రభుత్వం అందించాలి. నదీ జలాలను సాగుకు సక్రమంగా అందించి సముద్రం పాలు కాకుండా చేయాలి. విద్యుత్‌ ‌సమస్య లేకుండా చేయాలి. భూసార పరీక్షలు సక్రమంగా చేయాలి. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి సక్రమంగా వర్తింపచేయాలి.

ప్రధానమంత్రి ఫసల్‌భీమా పథకం అమలు రాష్ట్రాలలో సక్రమంగా లేదు. రైతుల ప్రయోజనాలకు ప్రైవేట్‌ ‌కంపెనీలు కూడా పనిచేయాలి. ప్రభుత్వమే భాగస్వామిగా బీమా పథకాలు చేపట్టాలి. తక్కువ బీమా చేసినా కార్యరూపం దాల్చడంలేదు. సర్వే నెంబర్‌వారీ ఇన్సూరెన్స్ ఉం‌టేనే రైతుకు లాభం.

సేద్యం లాభసాటిగా ఉండాలంటే ఏం చేయాలి?

వ్యవసాయం చేస్తే నష్టం అనుకోవడం సరికాదు. అసలు రైతు అసలు ముడిసరకుగా అమ్మకుండా బైప్రోడక్ట్‌గా అమ్మితే మేలు. ఒక్క ఉదాహరణ చూడండి! చెరకు ధర కిలో రూ. 3 ఉందనుకుందాం! అయితే రైతు చెరకును బెల్లంగా మార్చి అమ్మితే ఎంతో మేలు. చాలా ఉత్పత్తులు అంతే.ఆఖరికి మునగ కూడా.

ఉభయ రాష్ట్రాలలో మార్కెటింగ్‌ ‌వ్యవస్థ ఎలా ఉంది?

ఆంధ్రరాష్ట్రంలో మామిడి, పసుపు, ఉల్లికి మాత్రమే మార్కెటింగ్‌ ఉం‌ది. అయినా దళారులదే పైచేయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులలో కూడా వీరిదే పెత్తనం. తెలంగాణలో మార్కెటింగ్‌ ‌యార్డ్‌లు ఉన్నా, వ్యవస్థ సరిగా లేదు. అక్కడ కూడా దళారీలదే రాజ్యం. దళారుల నిర్ణయమే అంతిమం. ఈ -నామ్‌ ‌కూడా దళారుల కారణంగా అమలులో విఫలమైంది. మార్కెట్‌ ‌కమిటీలు రాజకీయ నిరుద్యోగులకు నిలయాలైనాయి. రైతులనే మార్కెట్‌ ‌యార్డ్ ‌ప్రతినిధులుగా నియమించాలి. నేడు జరగవలసింది మార్కెట్‌ ‌వ్యవస్థ ప్రక్షాళన.

అఖిల భారతీయ స్థాయిలో జరుగుతున్న రైతు ఉద్యమాల వెనుక రాజకీయం ఉందన్న ఆరోపణ గురించి ఏమంటారు?

రైతు సంఘాలన్నీ పార్టీలకు అనుబంధ సంఘాలే. కానీ కొన్ని సంఘాల వారు తమ తమ తాత్కాలిక ప్రయోజనాలకై రైతులను రెచ్చగొడుతున్నారు. అందుకే ఆ ఉద్యమాల మీద రాజకీయ నీలినీడలు తప్పడం లేదు. విమర్శలు కూడా తప్పడం లేదు.

ఇప్పుడు దేశంలో కొన్నిచోట్ల గో-ఆధారిత వ్యవసాయం ప్రాచుర్యంలోనికి వస్తున్నది. ఆ మాట తరుచు వినిపిస్తున్నది. ఆ విధమైన సేద్యం మన ఉభయ రాష్ట్రాలలో ఎలా ఉంది?

ఆంధప్రాంతంలో పది సంవత్సరాలుగా భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ ‌పొలాలు కొనండన్న ప్రచారం చేస్తున్నది. అయితే గత నాలుగు సంవత్సరాల నుండి దీని అమలు వేగం పుంజుకుంది కూడా. వేల సంఖ్యలో రైతులు గో-ఆధారిత వ్యవసాయానికి మారారు. 50%, 100% కూడా ఆ సేద్యంలోకి మారిన వారున్నారు. ప్రభుత్వం కూడా గో-ఆధారిత వ్యవసాయ ప్రాముఖ్యతను గుర్తించింది. ఇతర స్వచ్ఛంద సంస్థలు, సుభాష్‌ ‌పాలేకర్‌ (‌ప్రకృతి వ్యవసాయం) తోడ్పాటుతో ఈ పక్రియ ఇప్పటికి వేగంగానే సాగుతున్నది. వ్యవసాయం లాభాల బాట పట్టడంతో ముందుకు వెళుతున్నది. కానీ మార్కెటింగ్‌ ‌వ్యవస్థ సరిగా లేని కారణంగా కొందరు వెనక్కి వెళ్లారు. మార్కెటింగ్‌ ‌లేకనేవారు అయోమయంలో ఉన్నారు. సరైన గిట్టుబాటు ధరకు మార్కెటింగ్‌ ‌తోడైతే ఈ విధానం మరింత పురోగమిస్తుంది. ఆరోగ్య ఆంధప్రదేశ్‌, ఆరోగ్య తెలంగాణ నిర్మాణం కోసమైనా రాష్ట్ర ప్రభుత్వాలు, గో- ఆధారిత వ్యవసాయ సంఘాలక• నిధులు సమకూర్చాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం తగినంత శ్రద్ధతో రైతులకు ప్రోత్సాహం చూపిస్తే ఈ విధానం ఇంకా ముందుకు పురోగ మిస్తుంది. తెలంగాణలో గో-ఆధారిత వ్యవసాయ సంఘం, ఏకలవ్య ఫౌండేషన్‌ ‌సొంత నిధులతోనే రైతులకు సేవలు అందిస్తున్నాయి. ఆంధప్రాంతంలో రైతు నేస్తం రైతులకు శిక్షణ కార్యక్రమాల ద్వారా సేవలు అందుతున్నాయి.

వ్యవసాయానికి సంబంధించి అనుబంధ పరిశ్రమగా చెప్పాలంటే,  మొదట పాడి పరిశ్రమను ప్రస్తావిస్తాం. ఆ పరిశ్రమ పరిస్థితి ఏమిటి?

పశుసంపద ద్వారా రైతులు ప్రత్యామ్నాయ ఆదాయంతో జీవనం గడపడం గమనార్హం. ఆవు పాలకు కూడా లాభసాటి ధర లభించాలి. లీటర్‌కు కనీసం 50 రూపాయలు లేకపోతే ప్రోత్సాహకరగా ఉండదు. గేదెపాలు లీటరుకు రూ.75 ఉండాలి. మినరల్‌ ‌వాటర్‌ ‌లీటర్‌కు రూ.25లు చెలిస్తున్నారు. పాల అవసరాలను బట్టి, అవి ఇచ్చే శక్తిని బట్టి కొంచెం ధర పెరిగినా ఆరోగ్యం కోసమే కదా?

ఆంధ్రరాష్ట్రంలో వ్యవసాయ మిషన్‌ ‌తీరు ఎలా ఉంది?

రైతుల సమస్యలకు పరిష్కార వేదిక చైర్మన్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి, వైస్‌ ‌చైర్మన్‌గా రైతు నాయకుడు నాగిరెడ్డి ఉన్నారు. సమావేశాలకు మాత్రమే పరిమితమయింది. ఇంకా కార్యాచరణకు నోచుకో లేదు. తెలంగాణలో రైతు సమన్వయ సమితి పరిస్థితి కూడా అలానే ఉంది.

నేడు చిరుధాన్యాల పంటపై రైతులు దృష్టి సారించారు. భవిష్యత్‌ ఎలా ఉంటుంది?

రాయలసీమలో వర్షపాతం తక్కువ. ఆ కారణంగా ఎప్పటి నుంచో ఈ పంటలను పండించే వారు. తరువాత వాణిజ్య పంటలు వచ్చినా నష్టాలు మిగిల్చాయి. రైతులు మళ్లీ చిరుధాన్యాలపై దృష్టి సారించారు. జీవనశైలి మారిన కారణంగా డా।। ఖాదర్‌వల్లీ, వీరమాచినేని వంటి అనేకమంది ఆయుర్వేద నిపుణులు చెప్పిన కారణంగా దేశ విదేశాలలో చిరుధాన్యాలకు గిరాకీ కూడా పెరిగింది. గత రెండు సంవత్సరాల నుండి వాటికి ఆదరణ బాగా పెరిగింది. వీటికి కూడా మార్కెటింగ్‌ ‌సమస్యే ఉంది. ప్రాసెసింగ్‌ ‌మిల్లులు తక్కువ కావడం వల్ల మార్కెటింగ్‌ ‌లోపిస్తున్నది. రేషన్‌ ‌షాపులలో చిరుధాన్యాల విక్రయాన్ని ప్రోత్సహించాలి. మార్కెటింగ్‌ ‌వ్యవస్థలో రేషన్‌ ‌షాపులను భాగం చెయ్యాలి. ధర నిర్ణయం చేయాలి. చిరుధాన్యాల అభివృద్ధి బోర్డ్ ఏర్పాటు చేసి, ప్రత్యేక బడ్జెట్‌ను వెనుకబడిన పంటలకు గాను కేటాయించి ప్రోత్సహించాలి.

భారతీయ కిసాన్‌సంఘ్‌ ఉభయ రాష్ట్రాలలో దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఎలాంటి యోజన చేసింది?

రుణమాఫీలు వద్దు, లాభసాటి ధర ముద్దు అనే నినాదంతో మేం ఉద్యమాలు చేస్తున్నాం. రైతుల ప్రయోజనాలకే కిసాన్‌ ‌సంఘ్‌ ‌ప్రాధాన్యమిస్తుంది. విద్యుత్‌, ‌రెవెన్యూ, విత్తన చట్టంపై రుణ అర్హతపై, లాభసాటి ధరపై మా సంస్థ దృష్టి కేంద్రీకరించింది. భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ ‌కేవలం రైతు ఉద్యమాలకే పరిమితం కాకుండా, రైతాంగంతో ముడిపడి ఉన్న సహకార సంఘాలపై కూడా దృష్టి సారించింది. కూరగాయల రైతులకు సరైన ధర అందించేందుకు కృషి చేస్తుంది. తుఫాన్లు, వరదలు సంభవించినప్పుడు ఆర్‌.ఎస్‌.ఎస్‌. ‌సహకారంతో కొన్నికోట్ల రూపాయల ఎరువులు, విత్తనాలు, మొక్కల రూపంలో రైతులకు అందజేసింది. గో-ఆధారిత వ్యవసాభివృద్ధికై ప్రత్యేక సంఘాన్ని ప్రారంభించి ఆంధ్రరాష్ట్రంలో ముందుకు తీసుకువెళుతున్నది.

బీకేఎస్‌, ‌బీఎంఎస్‌ ‌వ్యవస్థాపకులు ఠేంగ్డీజీ శతజయంతి సందర్భంగా మీ ప్రణాళిక లేమిటి?

మన ఉభయ రాష్ట్రాలలో (తెలంగాణ, ఆంధ్ర) గో ఆధారిత వ్యవసాయంపై కార్యకర్తలకు శిక్షణ ఇచ్చి, ప్రస్తుతం వేలాదిగా ఉన్న రైతులను లక్షలాది రైతులుగా పెంచడం. సంస్థ బలోపేతానికి యువ, మహిళా రైతుల సదస్సుల నిర్వహణ, జిల్లా కమిటీలను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. వచ్చే నవంబర్‌ 10‌న పెద్ద ఎత్తున రైతుల సమ్మేళనం ఏర్పాటు చేయాలని ప్రణాళిక రచించాం.

About Author

By editor

Twitter
Instagram