– క్రాంతిదేవ్‌ ‌మిత్ర

దావూద్‌ ఇ‌బ్రహీం ఎక్కడున్నాడంటే పాకిస్తాన్‌లోనేనని చిన్నారులతో సహా ఎవరైనా చెప్పేస్తారు. భారత్‌, ‌పాక్‌ ‌దేశాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తెలిసిన బహిరంగ రహస్యం ఇది. కానీ అబద్ధాల కోరు పాక్‌ ‌మాత్రం తమదేశంలో లేడని మొదటి నుంచీ బుకాయిస్తూ వస్తోంది. 1993 నాటి ముంబై పేలుళ్లతో సహా తన మాఫియా కార్యకలాపాలతో ఎందరినో పొట్టన పెట్టుకున్న ఈ నరరూప రాక్షసున్ని పాకిస్తాన్‌ ‌తమదేశంలో భద్రంగా పెంచి పోషిస్తోంది. తాజాగా దావూద్‌ ‌తమ దేశంలోనే ఉన్నాడని అంగీకరించిన కొద్ది గంటల్లోనే మాట మార్చేసింది. దీంతో పాకిస్తాన్‌ అసలు స్వరూపం ఏమిటో ప్రపంచానికి మరోసారి స్పష్టంగా అర్థమైపోయింది. మరోవైపు కశ్మీర్‌ ‌విషయంలో ప్రతిసారీ చెవిలో జోరీగలా రొద పెడుతున్న పాకిస్తాన్‌తో మైత్రిని తెంచుకున్న సౌదీ అరేబియా భారత్‌కు దగ్గరైపోయింది.


దావూద్‌ ఇ‌బ్రహీం.. పాకిస్తాన్‌ ఇటీవల శాంక్షనరీ రెగ్యూలేటరీ పేరిట విడుదల చేసిన ఒక జాబితాలోని ఈ పేరు ప్రముఖంగా ఆకర్శించింది.  తమ దేశంలో ఉంటున్న 88 నిషేధిత ఉగ్రవాద సంస్థలు, వాటి నాయకుల వివరాలు ఉన్న జాబితా ఇది. వీరందరి చర, స్థిర ఆస్తులు స్వాధీనం చేసుకుంటున్నట్టు, వారి బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తున్నట్టు పాకిస్తాన్‌ ‌ప్రభుత్వం ప్రకటించింది. అందులో మోస్ట్ ‌వాంటెడ్‌ ‌టెర్రరిస్ట్, అం‌డర్‌ ‌వరల్డ్ ‌డాన్‌ ‌దావూద్‌ ఇ‌బ్రహీం పేరు కూడా ఉంది. దావూద్‌తో పాటు జమాత్‌ ఉద్‌ ‌దవా నాయకుడు హఫీజ్‌ ‌సయీద్‌, ‌జైష్‌ ఎ ‌మహమ్మద్‌ ‌నాయకుడు మసూద్‌ అజార్‌, ‌జాకీర్‌ ‌రెహమాన్‌ ‌లఖ్వీల పేర్లు కూడా ఉన్నాయి. దావూద్‌ అసలు తమ దేశంలోనే లేడని రెండు దశబ్దాలుగా బుకాయిస్తూ వచ్చిన పాకిస్తాన్‌, ఇప్పుడు తమ దేశంలో ఉన్నట్లు స్వయంగా అంగీకరించినట్లయింది. ఆయన కరాచీలో ఉంటు న్నట్టు చిరునామాలను కూడా ఇచ్చింది. కరాచీలోని వైట్‌ ‌హౌస్‌, ‌సౌదీ మసీదు దగ్గర ఓ ఇంటిని, నూరాబాద్‌లో ఇంటి నెం. 37,  డిఫెన్స్ 30 ‌వీధిలోని పలాటియన్‌ ‌భవన్‌ను దావూద్‌ ‌చిరునామాలుగా పేర్కొంది. ఈ వార్త మీడియా ద్వారా ప్రముఖంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించేసరికి పాకిస్తాన్‌ ‌కుడితిలో పడిన ఎలుకలా విలవిలలాడి పోయింది. ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌గ్రే లిస్టు నుంచి తప్పించు కోవడానికి తప్పని పరిస్థితుల్లో విడుదల చేసిన ఈ జాబితా ద్వారా పాకిస్తాన్‌ ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయింది. దీంతో ఎప్పటిలాగే తన కుటిలబుద్ధిని బయట పెట్టుకుంటూ దావూద్‌ ‌తమ గడ్డ మీద లేడని పాత పాటే పాడింది. ఇందతా భారత్‌ ‌మీడియా సృష్టి అని, ఈ కథనాలు తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ పాక్‌ ‌విదేశాంగ శాఖ ఆరోపించింది. ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారమే ఉగ్ర సంస్థలపై ఆంక్షలు విధించామని, ఇది సాధారణ పక్రియనేనని తెలిపింది.

ముంబై మాఫియా, ప్రపంచాన్ని రెండు దశాబ్దాల పాటు శాసించిన నేరగాడు దావూద్‌ ఇ‌బ్రహీం. ‘డి కంపెనీ’ పేరుతో ఎన్నో బెదిరింపులు, కాంట్రాక్ట్ ‌హత్యలు, దొంగనోట్లు, అక్రమ ఆయుధాలు, హవాలా, మత్తు పదార్ధాల వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. బాలీవుడ్‌ ‌చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టి తన కనుసన్నల్లో నడుపుకున్నాడు. తనకు కావాల్సిన నటీనటులకు అవకాశాలు ఇప్పించుకోవడంతో పాటు సినీ నటి మందాకినీ, ఫైనాన్షియర్‌ ‌భరత్‌షా లాంటి వారితో సంబంధాలు అందరికీ తెలిసినవే. కొందరు ప్రముఖుల హత్యల వెనుక దావూదే ఉన్నాడని తేలింది. తాజాగా ఆత్మహత్య చేసుకున్న హీరో సుశాంత్‌సింగ్‌ ఉదంతం వెనుక దావూద్‌ ‌హస్తం ఉందని రా మాజీ అధికారి ఎన్‌కే సూద్‌ అనుమానం వ్యక్తంచేశారు. 1993 మార్చి 12వ తేదీ నాటి ముంబై పేలుళ్ల వెనుక దావూద్‌ ‌పాత్ర బయట పడింది. మొత్తం 13 బాంబు పేలుళ్లలో 257 మంది మృతి చెందడంతో పాటు, 713 మంది గాయపడ్డారు. ఈ ఘటన తర్వాత దేశం విడిచిపారిపోయిన దావూద్‌ ‌పాకిస్తాన్‌లోని కరాచీలో తల దాచుకుంటున్నాడు. ముంబై పేలుళ్ల వెనుక దావూద్‌, ఆయన అనుచరులు టైగర్‌ ‌మెమన్‌, ‌యాకూబ్‌ ‌మెమన్‌ ‌పాత్ర కనిపిస్తున్నా తెర వెనుక ఉండి నడిపించింది పాకిస్తానే. ఈ కేసులో న్యాయస్థానం యాకూబ్‌ ‌సహా 12 మందికి మరణశిక్ష, 18 మందికి జీవితఖైదు విధించింది. అయితే దావూద్‌ ఇ‌బ్రహీం, టైగర్‌మెమన్‌ ‌పరారీలోనే ఉన్నారు. ఇదే సందర్భంలో అక్రమ ఆయుధాల కేసులో హీరో సంజయ్‌ ‌దత్‌కు జైలు శిక్ష పడింది.

ఎన్నో ఆధారాలు

దావూద్‌ ఇ‌బ్రహీంను అప్పగించాల్సిందిగా భారత్‌ ‌మొదటి నుంచీ పాకిస్తాన్‌ను గట్టిగా డిమాండ్‌ ‌చేస్తూ వచ్చింది. వాస్తవానికి దావూద్‌ 1990 ‌నుంచే పాక్‌లో స్థావరం ఏర్పరచుకున్నాడు. కరాచీతో పాటు ఇస్లామాబాద్‌లో ఆయనకు తొమ్మిది స్థావరాలు ఉన్నాయి. కరాచీ కేంద్రంగా ‘డి కంపెనీ’ కార్యకలాపాలు మలేసియా, సింగపూర్‌, ‌థాయ్‌లాండ్‌, శ్రీ‌లంక, నేపాల్‌, ‌దుబాయ్‌లతోపాటు జర్మనీ, ఫ్రాన్స్, ఇం‌గ్లండ్‌లలో విస్తరించాయి. దావూద్‌ 3 ‌వేల కోట్ల రూపాయల విలువైన వ్యాపార సౌధాన్ని నిర్మించాడు. 2జీ స్పెక్ట్రమ్‌ ‌కుంభకోణంలోనూ డి కంపెనీ పాత్ర ఉంది. దావూద్‌ ‌భార్య, నలుగురు కుమార్తెలు, కుమారుడికి పాకిస్తాన్‌ ‌పాస్‌పోర్టులు ఉన్నాయి. పాకిస్తాన్‌ ‌క్రికెట్‌ ‌జట్టు మాజీ కెప్టెన్‌ ‌జావేద్‌ ‌మియాందాద్‌ ‌స్వయాన దావూద్‌ ‌వియ్యంకుడు. ఆయన కుమారుడు జునైద్‌కు తన కూతురు మహ్రూఖ్‌ను ఇచ్చి వివాహం చేశాడు దావూద్‌. అదేవిధంగా దావూద్‌ ‌తన ఏకైక కుమారుడు మొయిన్‌నవాజ్‌ ‌పెళ్లి కూడా కరాచీలోనే చేశాడు. ఈ  సందర్భంగా జరిగిన వలీమా విందుకు పాకిస్తాన్‌ ‌సీనియర్‌ ఆర్మీ అధికారులతో సహా పలువురు అతిథులు హాజరయ్యారు.

దావూద్‌ ఇ‌బ్రహీం తమ దేశంలో నివసిస్తున్నట్లు పాకిస్తాన్‌ అం‌గీకరించకున్నా, అక్కడి ప్రభుత్వానికి తెలియకుండా రహస్య జీవితం గడపడానికి అయితే వీలులేదు. కరాచీలో నివసించే ముఖ్యవ్యక్తుల నివాసాలన్నీ అక్కడ సైనిక సంరక్షణలో ఉన్నట్లు వెల్లడవుతోంది. భారత్‌ ‌నుంచి వలసవెళ్లిన మొహజిర్లు కరాచీలో పెద్ద సంఖ్యలోనే ఉంటారు. వీరిని అణచి వేసేందుకు వారి కదలికలపై ఓ కన్నేసి ఉంచుతుంది.  చివరికి కరాచీలో చెత్తను తరలించే పనిలో కూడా సైన్యం జోక్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో దావూద్‌ అక్కడ ఏళ్ల తరబడి నివసించినా కనుక్కోలేదనుకోవడం అపోహే. మరోవైపు దావూద్‌ ‌కరాచీలో నివసిస్తున్నాడన్న వార్తలను ఆయన ప్రధాన అనుచరుడు చోటా షకీల్‌ ‌ఖండించాడు. ఈ విషయంలో తాము పాక్‌ ‌సహా ఎవరికీ జవాబు చెప్పబోమని స్పష్టంచేశాడు. దావూద్‌ ‌కరాచీలో ఖరీదైన భవనంలో ఉన్నాడని చూపిస్తున్నందుకు భారత మీడియా బాధ్యత వహించాలని బెదిరిస్తున్నాడు. తాజాగా దావూద్‌ ఐటమ్‌ ‌గాళ్‌గా తన సినీ కెరీర్‌ ఆరంభించిన పాకిస్తాన్‌ ‌సినీ నటి మోహ్విష్‌ ‌హయత్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు పాకిస్తాన్‌ ‌మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆమెకు సినిమా అవకాశాలు, పాక్‌ ‌ప్రభుత్వ ప్రతిష్టాత్మక అవార్డు ‘తమ్‌గా ఏ ఇంతియాజ్‌’ ‌రావడం కూడా దావూద్‌ ‌చలవేనట. మోహ్విష్‌కు, దావూద్‌కు మధ్య 27 ఏళ్ల వ్యత్యాసం ఉంది. లేటు వయసులో ఘాటు ప్రేమ ఏమిటి అంటూ దావూద్‌ ‌మీద నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఉగ్రవాదులకు స్వర్గధామం

పాకిస్తాన్‌లోని కరాచీలో తలదాచుకున్న దావూద్‌ ఇ‌బ్రహీం అల్‌ ‌కాయిదా, లష్కరే తాయిబా వంటి మత ఛాందస సంస్థలతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. అల్‌ ‌ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్‌లాడెన్‌తో దావూద్‌కు సాన్నిహిత్యం ఉందని అమెరికా బయటపెట్టింది. అఫ్ఘనిస్తాన్‌ ‌నుంచి అల్‌కాయిదా సభ్యులు పారిపోవడానికి దావూద్‌ ‌తన మాఫియా మార్గాలను చూపించాడు. దావూద్‌ ఇ‌బ్రహీంను ‘స్పెషల్లీ డిజిగ్నేటెడ్‌ ‌గ్లోబల్‌ ‌టెర్రరిస్టు’గా 2003లో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. అయినా దావూద్‌ ‌తమ దేశంలో ఉన్నట్టు పాకిస్తాన్‌ ఏనాడూ అంగీకరించలేదు. పాకిస్తాన్‌ ఉ‌గ్రవాదులకు స్వర్గధామమని ప్రపంచమంతటికీ తెలిసిపోయింది. ‘హ్యూమానిటీ ఎట్‌ ‌రిస్క్- ‌గ్లోబల్‌ ‌టెర్రర్‌ ‌థ్రెట్‌ ఇం‌డికెంట్‌’ ‌పేరుతో ఆక్స్‌ఫర్డ్ ‌యూనివర్సిటీ – స్ట్రాటెజిక్‌ ‌ఫోర్‌సైట్‌ ‌గ్రూప్‌లు నిర్వహించిన సర్వేలో ఉగ్రవాదానికి పాకిస్తాన్‌ ‌మద్దతు ఇస్తోందని వెల్లడైంది. సిరియాలో కంటే మూడు రెట్లు ఎక్కువగా ప్రాణాపాయం పాక్‌లోనే ఉందని ఆ నివేదిక చెబుతోంది.

2001 భారత పార్లమెంట్‌, 2008 ‌ముంబై దాడి, 2016 పఠాన్‌కోట్‌, 2019 ‌పుల్వామా దాడి ఘటనలతో సంబంధం ఉన్న జైష్‌-ఎ-‌మహ్మద్‌ ‌వ్యవస్థాపకుడు మసూద్‌ అజర్‌, ‌జమాద్‌ ఉద్‌ ‌దవా నాయకుడు హఫీజ్‌ ‌సయీద్‌లకు కూడా పాకిస్తాన్‌ ఆ‌శ్రయం ఇస్తోంది. భారత్‌ ‌చాలా కాలం పాటు కృషి చేసి మసూద్‌ అజర్‌ ‌పేరును ఐక్యరాజ్య సమితి నిషేధిత జాబితా (1267)లో చేర్చింది. భారత్‌తో పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉగ్ర కార్యకలాపాలు సాగిస్తున్న అనేక సంస్థలను పాకిస్తాన్‌ ‌పెంచి పోషిస్తోంది. అమెరికాపై 2001లో దాడికి పాల్పడ్డ అల్‌ఖైదా చీఫ్‌ ‌వ్యవస్థాపకుడు బిన్‌ ‌లాడెన్‌ను పాకిస్తాన్‌ ‌తమ దేశంలోని అబోటాబాద్‌లో చాలా కాలం దాచిపెట్టు కుంది. చివరకు అమెరికా సైన్యం దాడి చేసి అతన్ని మట్టుబెట్టే సరికి పాక్‌ ‌నగ్న స్వరూపం ప్రపంచానికి తెలిసిపోయింది. జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించడంతో పాటు అనేక ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్‌ ‌శిక్షణ ఇస్తోంది. ఉగ్రవాదుల స్థావరాలకు, వారికి నివాసం కల్పిస్తున్న దేశాల్లో పాకిస్తాన్‌ ‌తొలి స్థానంలో నిలిచింది.

గ్రే లిస్టు అంటే?

ఉగ్రవాద మూకలను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ ‌తన స్వయంకృతాపరాధానికి ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటోంది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చితికిపోయింది. అమెరికా నుంచి అందే సాయం కూడా నిలిచిపోయింది. అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు ప్రభుత్వ ఆస్తులను సైతం అమ్మకం లేదా వేలం వేసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌గ్రే లిస్టు మూలిగే నక్కపై తాటి పండు పడిన చందాన మారింది పాకిస్తాన్‌కు. ఈ లిస్ట్‌లో ఉంటే ఐఎంఎఫ్‌, ‌ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు సహా ఇతర అంతర్జాతీయ సంస్థల నుంచి ఆర్థిక సాయం పొందడం కష్టమవుతుంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జారీ చేసిన నిషేధిత ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నందుకు పారిస్‌ ‌కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్‌ ‌యాక్షన్‌ ‌టాక్స్‌ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్‌) ‌సంస్థ పాకిస్తాన్‌ను 2018 జూన్‌లో గ్రే లిస్ట్‌లో చేర్చింది. ఇందులో ఉంటే అంతర్జాతీయంగా ఎలాంటి అర్థిక సహాయం అందదు. ఆ జాబితాలోంచి తొలగించా ల్సిందిగా పాకిస్తాన్‌ ‌బ్రతిమిలాడుకోగా 2019 చివరికల్లా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గడువు విధించింది. ఆ తర్వాత కరోనా సంక్షోభంతో గడువు పెంచింది. 2020 జూన్‌ ‌నాటికి కూడా పాకిస్తాన్‌ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రే లిస్టులోనే కొనసాగించాలని నిర్ణయించింది. దీంతో గ్రే లిస్ట్ ‌నుంచి బయటపడడానికి పాకిస్తాన్‌ ‌దావూద్‌ ఇ‌బ్రహీం, హఫీజ్‌ ‌సయీద్‌, ‌మసూద్‌ అజర్‌ ‌సహా 88 ఉగ్ర సంస్థలు, వాటి నాయకుల ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు జప్తు చేస్తూ శాంక్షనరీ రెగ్యూలేటరీ ఆర్డర్‌జారీ చేసింది. జమాత్‌ ఉద్‌ ‌దవా, జైషే మహమ్మద్‌, ‌తాలిబన్‌, అల్‌ఖైదా, హక్కానీ గ్రూప్‌ ‌వంటి సంస్థల అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధించక తప్పలేదు. ఇన్నాళ్లూ దావూద్‌ ‌తమ వద్ద లేడంటూ నమ్మబలికిన పాకిస్తాన్‌ ‌లోగుట్టు స్వయంగా బయట పెట్టుకున్నందుకు గతుక్కుమంది. దీంతో ఉత్తర్వులు  ఇచ్చిన 24 గంటల్లోనే మాట మార్చేసింది. దావూద్‌ ‌కరాచీ నివాసం ఆధారాలు బయటకు వచ్చే సరికి పాకిస్తాన్‌ ‌కొత్త పల్లవి అందుకుంది. దావూద్‌ ఆస్తులు ఉన్నాయన్నాము కానీ.. అతను ఇక్కడ ఉన్నాడని తాము అనలేదని చెబుతోంది. ఈ మేరకు పాక్‌ ‌విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. శాంక్షనరీ రెగ్యూలేటరీ ఆర్డర్‌లోని వారంతా ఇక్కడ ఉన్నారని అర్థం కాదు అని వక్రభాష్యం చెబుతోంది.

సౌదీ- పాక్‌ ‌మైత్రికి బీటలు

పాకిస్తాన్‌ ఏర్పడినప్పటి నుంచే గల్ఫ్ ‌దేశాలతో సంబంధాలు పెట్టుకుంది. ఇందుకు ప్రధాన కారణం మతమే. అయితే అన్ని చోట్ల మతం పాచిక పారదు. గల్ఫ్ ‌దేశాలు చమురు వనరులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఇతర వ్యాపారాలపై దృష్టి పెట్టాయి. ఈ క్రమంలో అతిపెద్ద మార్కెట్‌ ఉన్న భారత్‌ ‌వాటికి పెద్ద దిక్కుగా కనిపిస్తోంది. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ ‌దేశాలు ప్రధాని నరేంద్ర మోదీ కృషి కారణంగా భారత్‌కు దగ్గరయ్యాయి. పాకిస్తాన్‌ ఎప్పుడూ మతాన్ని అడ్డం పెట్టుకొని బికారీ కేకలు వినిపించి తమ దగ్గర సాయం పొందడం, ప్రతిఫలంగా వారికి ఎలాంటి లాభం కనిపించక పోవడం ఆ దేశాలకు ఇబ్బందికరంగా మారింది. పాకిస్తాన్‌ ‌ప్రతిసారీ కశ్మీర్‌ అం‌శంపై చెవిలో జోరీగలా రొద పెట్టడం సౌదీ అరేబియాకు నచ్చడం లేదు. కశ్మీర్‌ ‌విషయంలో 57 ముస్లిం దేశాలు సభ్యులుగా ఉన్న ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ‌కార్పొరేషన్‌ ‌మద్దతు పొందాలని పాక్‌ ‌భావించింది. ఓఐసీలో సభ్యత్వం కలిగి ఉన్న సౌదీని కశ్మీర్‌ అం‌శంపై చర్చించేందుకు సభ్యదేశాల్ని సమావేశపరచాలని కోరింది. కానీ దీన్ని సౌదీ పట్టించుకోలేదు. దీంతో పాకిస్తాన్‌ ‌ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌, ‌విదేశాంగశాఖ మంత్రి షా మహ్మద్‌ ‌ఖురేషి బహిరంగంగానే సౌదీని విమర్శించారు. సాదీ అరేబియా ముందుకు రాకపోతే ఇతర ముస్లిం దేశాలతో తామే సమావేశాన్ని నిర్వహిస్తామని పాకిస్తాన్‌ ‌హెచ్చరించింది. ఈ క్రమంలో సౌదీ అంటే గిట్టని ఇరాన్‌, ‌టర్కీ, ఖతార్‌, ‌మలేసియాతో కలిసి మరో ఇస్లామిక్‌ ‌దేశాల కూటమిని ఏర్పాటు చేయాలన్నది పాక్‌ ‌యోచన. అంతర్జాతీయ స్థాయిలో మంచి సంబంధాలున్న మలేసియా ప్రధానమంత్రి మహతీర్‌ ‌మహమ్మద్‌ ‌పదవి నుంచి దిగిపోవడంతో ఆ ప్రణాళిక ముందుకు సాగలేదు. తనకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌ ఆడుతున్న నాటకాలను చూసి సౌదీ కన్నెర్ర చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే సౌదీ అరేబియా నుంచి పాకిస్తాన్‌ అప్పుగా తీసుకున్న 3 బిలియన్‌ అమెరికా డాలర్లలో ఒక బిలియన్‌ను తిరిగి చెల్లించినట్లు తెలుస్తోంది. తీర్చడానికి ఇంకా సమయం ఉన్నా సౌదీ ఒత్తిడి మేరకు తప్పలేదు. సౌదీకి పాక్‌ ‌మొత్తం 6.2 బిలియన్‌ ‌డాలర్ల రుణం చెల్లించాల్సి ఉంది. సౌదీ నుంచి రాయితీ ధరకు చమురు పొందే ఒప్పందం ఇటీవల ముగిసింది. దీన్ని మరో రెండేళ్లకు పొడగించే అవకాశం ఉన్నా ఇరుదేశాల మధ్య దూరం పెరుగుతున్న నేపథ్యంలో సౌదీ అరేబియా ఈ దిశగా చొరవ చూపడం లేదని తెలుస్తోంది.

భారత్‌, ‌సౌదీ, యూఏఈల మధ్య ఆర్థిక, భద్రతా, రక్షణపరంగా మంచి సంబంధాలున్నాయి. సౌదీ-పాకిస్తాన్‌ ‌దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ 3.6 బిలియన్‌ ‌డాలర్లుకాగా, భారత్‌-‌సౌదీ అరేబియాల మధ్య వాణిజ్యం 27 బిలియన్‌ ‌డాలర్లు ఉంటుంది. కశ్మీర్‌ ‌విషయంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇవ్వడం ద్వారా భారత్‌తో తనకున్న వ్యాపార ప్రయోజనాలను వదులుకోవడం సౌదీ అరేబియాకు ఇష్టం లేదు. మరోవైపు తమ అప్పు తీర్చడానికి చైనా నుంచి పాకిస్తాన్‌ ‌రుణం తీసుకోవడం సౌదీ అరేబియాకు నచ్చలేదు. చైనా-పాకిస్తాన్‌ ‌కారిడార్‌లో తన ప్రత్యర్థి అయిన ఇరాన్‌ ‌కూడా పాల్గొనడంపై సౌదీ అరేబియా అసంతృప్తితో ఉంది.

పాకిస్తాన్‌ ‌తీరుపై అసంతృప్తితో ఉన్న సౌదీ ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కి తగ్గే అవకాశాలు లేవు. పాక్‌లోని గ్వాదర్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు వచ్చిన సౌదీ ఆ దేశ వైఖరి కారణంగా వెనక్కి తగ్గింది. సౌదీ అరేబియా తాను పాకిస్తాన్‌కు ఇచ్చే ఆర్థిక సాయం విషయంలో మనసు మార్చుకోకపోతే సెంట్రల్‌ ‌బ్యాంక్‌ ఆఫ్‌ ‌పాకిస్తాన్‌ ‌విదేశీ మారక నిల్వలు పూర్తిగా పడిపోతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అసలే ఆర్థికపరంగా పీకల్లోతు కష్టాల్లో ఉండి సౌదీతో కోరి కయ్యానికి దిగడం పాక్‌కే  నష్టం అని పరిశీల కులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ ‌గ్రే లిస్టు పాకిస్తాన్‌ ‌మెడ మీద కత్తిలా వ్రేలాడుతోంది.

వ్యాసకర్త : సీనియర్‌ ‌జర్నలిస్ట్

About Author

By editor

Twitter
Instagram