విశ్వాసమా? ఉన్మాదమా?

భారత అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పును వ్యతిరేకించాలను కున్నా, చట్టబద్ధంగా ఎన్నికైన పార్లమెంట్‌ ‌తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిఘటించడానికైనా ముస్లిం మతోన్మాదులు వీధి పోరాటాలను ఎంచుకున్నారా? కోర్టుల నిర్ణయాలనే కాదు, మెజారిటీ ప్రజల మనోభావాలకు విజయం దక్కినప్పుడల్లా కూడా హింసకూ, విధ్వంసానికీ దిగడం మతోన్మాదులు తమ హక్కుగా, విధిగా భావిస్తున్నారా? ఈ దేశంలో ఏ రాజకీయ నిర్ణయమైనా షరియత్‌ ‌పరిధిలోనే జరగాలని ఈ రూపంలో ఫత్వాలు ఇస్తున్నారా? పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఢిల్లీ నగరాన్ని అల్లకల్లోలం చేసిన షాహిన్‌బాగ్‌ ‌శిబిరం, ఢిల్లీ హింసాకాండ, ఈ ఆగస్టు 11న బెంగళూరు నగరంలో జరిగిన అల్లర్లు దీనికి తాజా ఉదాహరణలు. ముస్లిం మతోన్మాదులు అనుసరిస్తున్న ఈ వైఖరి సమర్ధనీయమే అన్నట్టు వ్యవహరిస్తున్న హక్కుల కార్యకర్తలకు, మీడియాకు ఎలాగూ లోటు లేదు. ముస్లిం మతోన్మాదుల చర్యల పట్ల ఈ వర్గం ఎల్లప్పుడూ మౌనాన్ని ఆశ్రయిస్తుంది. భారత్‌లో మత స్వేచ్ఛ లేదంటూ అరిచే అంతర్జాతీయ సంస్థలకు కూడా కొదవలేదు. అలా ఇక్కడి మతోన్మాద ధోరణులు బలపడుతున్నాయి. అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ఆగస్టు ఐదున ప్రధాని నరేంద్రమోదీ భూమిపూజ చేసిన తరువాత దేశంలో మరొకసారి తమ ప్రతాపం చూపించాలని ముస్లిం మతోన్మాదులు ఆరాటపడుతున్నారని అనిపిస్తున్నది.

భారత సమగ్రత, రక్షణ, సమైక్యత గురించి ఎప్పుడు బీజేపీ ప్రభుత్వం దృఢంగా ఒక అడుగు వేసినా, గట్టి చర్య తీసుకున్నా ముస్లిం మతోన్మాదులు పథకం ప్రకారం నిరసనకు దిగడం రివాజుగా మారిపోయింది. ఎక్కడో జరిగిన చిన్న దుర్ఘటనకు యావత్‌ ‌సమాజాన్ని బాధ్యురాలిని చేస్తూ విధ్వంసం సృష్టిస్తూ, భయాందోళనలు రేకెత్తిస్తూ; ఇదే శిక్ష అన్నట్టు స్వైరవిహారం చేస్తున్నారు. బెంగళూరు హింసాత్మక ఘటన దానికి పరాకాష్ట. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఈ భారత ఐటీ రాజధాని దాదాపు మూడున్నర దశాబ్దాల తరువాత మళ్లీ ఇప్పుడు విలవిల్లాడింది. దాదాపు ఎనిమిది వందల మంది మూడుచోట్ల దాడి చేసి యథేచ్ఛగా విధ్వంసం సృష్టించారు. పోలీసులను చంపమంటూ నినాదాలు చేశారు. చిత్రం ఏమిటంటే, బెంగళూరు ఉదంతం గురించి విచారం వ్యక్తం చేసి, సమగ్ర దర్యాప్తు జరిపించాలంటూ పాకిస్తాన్‌ ఆగస్టు 14న పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్‌కి ఫిర్యాదు చేయడం. ఇంకా విచిత్రం- ఈ రగడకు కారణమైన వ్యక్తిగా భావిస్తున్న నవీన్‌కుమార్‌ను తెచ్చి ఇచ్చిన వారికి 51 లక్షల రూపాయలు బహుమానం ఇస్తానని మీరట్‌కు చెందిన ముస్లిం నాయకుడు ఒకరు ప్రకటన ఇచ్చారు. ఈ విషయం టౌమ్స్ ‌నౌ వెల్లడించింది.

ఆగస్టు 11 నాటి బెంగళూరు అల్లర్లు

చైనా యాప్‌ ‌టిక్‌టాక్‌ను ప్రధాని మోదీ నిషేధించినందుకు నిరసనగా ఒక ముస్లిం యువకుడు ఒక చిన్న శివాలయం ముందు ఉన్న నందిని తన్నుతూ, దానిని వీడియో తీసి దేశం మీదకు వదిలాడు. తరువాత పోలీసులు ఏదో చర్య తీసుకున్నారు. అది వేరే విషయం. ఆ అజ్ఞాని చేసిన ఆ దుశ్చర్యకు ప్రతీకారంగా ఆ ఘటన జరిగిన ఆ ఊరో, రాష్ట్రమో అగ్నికీలలకి ఆహుతి కాలేదు. ఉన్మాదం చెలరేగలేదు. ఒకటైతే నిజం. ఏ మతాన్నీ, దేవతలను, పవిత్ర గ్రంథాన్ని అన్య మతం వారు అవమాన పరచకూడదు. అపవిత్రం చేయకూడదు. ఒకవేళ కొందరు అజ్ఞానులు అలాంటి చేష్టలకు పాల్పడినా చట్టం తన పని తాను చేసుకు వెళ్లే అవకాశం ఇవ్వాలి. కానీ ముస్లిం మతోన్మాదులు ఈ పక్రియకు విలువ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. బెంగళూరు తాజా హింసాగ్నికి హేతువు ఇదే. కాంగ్రెస్‌ ‌బుజ్జగింపు రాజకీయం ఇందుకు ఊతం ఇచ్చింది. టి. నవీన్‌కుమార్‌ (35) అనే వ్యక్తి సామాజిక మాధ్యమాలలో పెట్టిన ప్రవక్త వ్యతిరేక వ్యాఖ్య ఈ అల్లర్లకు కారణమని చెబుతున్నారు. అదొక వ్యంగ్య చిత్రమని తరువాత తేలింది. ఇతడు పులకేశినగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ శాసనసభ్యుడు ఆర్‌. అఖండ శ్రీనివాసమూర్తి మేనల్లుడు. శ్రీనివాసమూర్తి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఎస్సీ వర్గానికి చెందినవారు. నవీన్‌ ‌మరొక బంధువు జనతాదళ్‌ ఎస్‌ ‌తరఫున కౌన్సిలర్‌.

‌ఫిర్యాదు చేసీ చేయగానే పోలీసులు హుటాహుటిన వెళ్లి నవీన్‌ను అరెస్టు చేయనందుకే (రెండు గంటల జాప్యం) ముస్లిం మతోన్మాదులు కొందరు ఈ దాడులకు దిగారు. నవీన్‌ ‌పెట్టినట్టు చెబుతున్న పోస్ట్ ‌పూర్వాపరాలు తెలియకుండానే కొన్ని గంటలలోనే ఇంత విధ్వంసం జరగడాన్ని బట్టి ఇదంతా పథకం ప్రకారం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం, మీడియా కూడా అభిప్రాయపడుతున్నాయి. దేవరాజీవన్‌హళ్లి, కాడుగొండనహళ్లి పోలీసు స్టేషన్ల మీద, కావల్‌ ‌బైరిసంద్ర అనే చోట ఉన్న అఖండ శ్రీనివాసమూర్తి ఇంటి మీద దాదాపు ఏకకాలంలో దాడులు జరిగాయి. వందలాది వాహనాలు దగ్ధం చేసి, వాటినే రక్షణ గోడగా పెట్టి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఆ ప్రాంతానికి రాకుండా పథకం వేశారు. ఆగస్టు 11వ తేదీ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో శ్రీనివాసమూర్తి ఇంటి ఎదుట వందమంది హాజరై, నవీన్‌ అరెస్టుకు నినాదాలు చేశారు. ఆపై ఇంటిలో చొరబడి, అన్నీ దోచుకుని, దగ్ధం చేశారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేరు. ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు కూడా నష్టం వాటిల్లచేశారు. తరువాత కొందరు డీజే హళ్లి పోలీసు స్టేషన్‌కు వెళ్లి నవీన్‌ అరెస్టుకు పట్టుపట్టారు. ఇందులో ఎస్‌డీపీఐ (సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా) సభ్యులే కీలకంగా ఉన్నారు. ఇది అత్యంత వివాదాస్పద ముస్లిం మతోన్మాద సంస్థ పీపుల్స్ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ)‌కి రాజకీయ విభాగం. దీనిని కర్ణాటకలో నిషేధించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నది. రాత్రి పదకొండు ప్రాంతంలో నవీన్‌ను కేజీ హళ్లి పోలీస్‌ ‌స్టేషన్‌లో దాచి పెట్టారన్న వదంతి వచ్చింది. దీనితో ఆ స్టేషన్‌ ‌మీద కూడా దాడి జరిగింది. విధ్వంసాన్ని అదుపు చేయడానికి పోలీసులు జరిపిన కాల్పులలో వాజిద్‌ ‌ఖాన్‌ (20), ‌యాసిమ్‌ ‌పాషా (22), వాసిం (40) అనే ముగ్గురు చనిపోయారు.

నవీన్‌ ‌వైఖరి ఏమిటి?

నవీన్‌ ‌గురించి మీడియాలో భిన్న కథనాలు వస్తున్నాయి. లెఫ్ట్ ‌మీడియాలో తండ్రి (వపన్‌ ‌కుమార్‌) ‌తన కుమారుడి చర్య పట్ల ఆవేదనతో ఉన్నారని వార్త వచ్చింది. కానీ అందులోనే ఉన్న ఇతర వివరాలు అతడి వ్యక్తిత్వాన్ని వేరే విధంగా చిత్రిస్తున్నాయి. తానొక రాజకీయ కార్యకర్తనని అతడు ఫేస్‌బుక్‌లో పేర్కొన్నాడు. అయితే ఈ వివాదానికి సంబంధించి తన అకౌంట్‌ను వేరెవరో హ్యాక్‌ ‌చేశారని నవీన్‌ ఆరోపిస్తున్నాడు. పలువురు హిందూ దేవుళ్లు మీద, నరేంద్ర మోదీకి (ఛత్రపతి శివాజీకి కూడా) వ్యతిరేకంగా అడయార్‌ ‌బషీర్‌ అనే వ్యక్తి పెట్టిన పోస్టుకు నిరసనగానే నవీన్‌ ఆ ‌వ్యంగ్య చిత్రం పోస్ట్ ‌చేశాడన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతకీ నవీన్‌ ‌పెట్టిన పోస్టులోని వ్యంగ్య చిత్రం 2018 నాటిదని కొందరు చెబుతున్నారు. దీనిని బట్టే చాలామంది అభిప్రాయం- నవీన్‌ ‌పోస్టును ఎవరో మార్ఫింగ్‌ ‌చేశారనే. అంటే, వివాద మూలాలేమిటో స్పష్టత లేదు. విధ్వంసం మాత్రం ఆలస్యం లేకుండా జరిగిపోయింది. ఆగస్టు 5న మోదీ భూమిపూజ నిర్వహించిన తరువాత రాముని బొమ్మను నవీన్‌ ‌పోస్ట్ ‌చేశాడు. తరువాత బురఖా ధరించిన ఒక ముస్లిం మహిళ బాలకృష్ణులు, గోపిక వేషధారణలో ఉన్న ముగ్గురు పిల్లలను తీసుకుని వెళుతున్న ఫోటో పెట్టి ‘ఇది భారతదేశ సౌందర్యం’ అని వ్యాఖ్య రాశాడు. నేను నా దేవుడి గురించి రాశానే తప్ప, ఇతర మతాలను కించపరిచానా అంటూ మరొక చోట రాశాడు. అతడి రాతలలో కొంచెం పేర్కొనదగినది ఒక్కటే. అది, ‘పులికేశినగర్‌లో కొందరు నకిలీ సెక్యులరిస్టులు ఉన్నారు. సెక్యులరిజం అంటే అర్థం తెలియని వాళ్లంతా ఆ ముసుగులు తొలగిస్తే మంచిది.’ ఆగస్టు 5న భూమిపూజ తరువాత నవీన్‌ ‌తన ఇంటి సమీపంలో బాణసంచా కాల్చడంతో పాటు, హిందువులతో పాటు ముస్లింలకు కూడా మిఠాయిలు పంచాడని, ఇది రెచ్చగొట్టే చర్యేనని కొందరు ఆరోపిస్తున్నారు.

హిందూ వ్యతిరేక కుట్రల కుటీర పరిశ్రమ

ఐటీ పరిశ్రమకు కొందరు బెంగళూరును కేంద్రంగా చేసుకుంటున్నారు. ముస్లిం మతోన్మాదులు మాత్రం హిందూ వ్యతిరేకతకి ఈ భారత సిలికాన్‌ ‌వ్యాలీని కుటీర పరిశ్రమ కేంద్రంగా మలుచుకోవాలని కోరుకుంటున్నారు. ఈ ఆగస్టు 11న సంభవించిన అల్లర్లను పోలిన ఘటనలను గతంలోను పలుమార్లు ఈ నగరం చూసింది. డిసెంబర్‌ 8, 1986‌న న్యూయార్క్ ‌టైమ్స్ ‌పత్రిక ప్రచురించిన వార్త ప్రకారం బెంగళూరు, మైసూరు, తుంకూరు, ఇంకొన్ని చోట్ల పోలీసులతో ముస్లిం వర్గీయులు తలపడ్డారు. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక డెక్కన్‌ ‌హెరాల్డ్ ‌కార్యాలయాన్ని తగులబెట్టే ప్రయత్నం జరిగింది. పోలీసు కాల్పులలో 17 మంది మరణించారు. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఇప్పటికీ అదే మనస్తత్వంతో నగరంలోని ముస్లిం మతోన్మాదులు వ్యవహరిస్తున్నారు. పోలీసులను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు. అప్పుడు కూడా మహమ్మద్‌ అనే పేరు కారణంగానే అల్లర్లు జరిగాయి. పీకేఎన్‌ ‌నంబూద్రి అనే రచయిత మహమ్మద్‌ ‌ది ఇడియెట్‌ ‌పేరుతో రాసిన కథను డెక్కన్‌ ‌హెరాల్డ్ ‌ప్రచురించింది (డిసెంబర్‌ 7, 1986 ‌సంచిక). మతి స్థిమితం లేని మహమ్మద్‌ అనే ఒక యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఇందులో ఇతివృత్తం. అక్కడ ప్రవక్త పేరును ఉపయోగించి నందుకు అల్లర్లు చేశారు. 21వ శతాబ్దం ఆరంభంలో కూడా ఇలాగే జరిగింది. న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ‌కోసం టీజేఎస్‌ ‌జార్జ్ ఒక కథనం రాశారు. అందులో కూడా మహమ్మద్‌ అనే పేరు కనిపించడంతో అల్లర్లు జరిగాయి. కాంగ్రెస్‌ ‌నాయకులు రోషన్‌ ‌బేగ్‌, ‌సీఎం ఇబ్రహీం ఆనాటి గొడవల వెనుక ఉన్నారని తేలింది. 2007లో సద్దాం హుస్సేన్‌ ‌కూడా బెంగళూరులో మత కల్లోలాలకు కారణమయ్యాడు. ఆ సంవత్సరం జనవరిలో కాంగ్రెస్‌ ‌ప్రముఖుడు, రైల్వే మాజీ మంత్రి జాఫర్‌ ‌షరీఫ్‌ ఆ ‌పార్టీని వదిలి కొత్త కుంపటి వెలిగించాలని అనుకున్నారు. దాని పేరు పీపుల్స్ ‌ఫ్రంట్‌. ఇరాక్‌ ‌పాలకుడు సద్దాం హుస్సేన్‌ ‌మరణశిక్షకు నిరసనగా షరీఫ్‌ అమెరికా వ్యతిరేక ప్రదర్శనకు పిలుపునిచ్చాడు. అది జనవరి 19న జరిగింది. రెండు రోజుల తరువాత జరిగే ఆర్‌ఎస్‌ఎస్‌ ‌రెండో సర్‌ ‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌గోల్వాల్కర్‌ ‌శత జయంతి ఉత్సవాలకు సంఘ్‌ అప్పటికే ఏర్పాట్లు చేసుకుంది. ఈ ప్రదర్శన సమయంలో సంఘ్‌ ‌వాల్‌ ‌పోస్టర్లు, ఇతర ఏర్పాట్లను షరీఫ్‌ అనుచరులు ధ్వంసం చేశారు. తరువాత ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో అల్లర్లు జరిగాయి. పెద్ద ఎత్తున విధ్వంసం జరిగింది.

బంగ్లా వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్‌ ఒక రచన అనువాదాన్ని 2010లో కన్నడ ప్రభ ప్రచురించింది. అప్పుడు కూడా రోషన్‌ ‌బేగ్‌ ఆ ‌పత్రిక మీద దాడి చేయించాడన్న ఆరోపణ ఉంది. బురఖా గురించి ఆలోచిద్దాం అన్నదే ఆ రచన. అప్పుడు శివమొగ్గలో పోలీసులు కాల్పులు జరపవలసి వచ్చింది. మోదీ గెలిచి ప్రధాని అయితే తాను భారత్‌ ‌వీడి పాకిస్తాన్‌ ‌వెళ్లిపోతానంటూ ప్రముఖ కన్నడ రచయిత యూఆర్‌ అనంతమూర్తి ప్రతిజ్ఞ చేసింది కూడా ఈ నగరంలోనే. మోదీ గెలిచారు. ప్రధానిగా ప్రమాణం కూడా చేశారు. ఆ మరునాడే కొన్ని వందల మనియార్డర్లు ఆయన ఇంటికి వెల్లువెత్తాయి. అన్నీ ‘మీ పాకిస్తాన్‌ ‌ప్రయాణం నిమిత్తం’ అని రాసి ఉన్న రూ. 11లతో వచ్చిన మనీయార్డర్లే. జీవితంలో తాను ఇంత క్షోభ ఎప్పుడూ పడలేదని తరువాత ఎన్డీటీవీతో అనంతమూర్తి మొరపెట్టుకున్నారు. ఇక టిప్పు సుల్తాన్‌ ‌జయంతిని నిర్వహిస్తామని బలహీనపడిన ప్రతిసారి కాంగ్రెస్‌ ‌ప్రకటనలు ఇస్తూ ఉంటుంది. ఇది కూడా వివాదాలకు దారి తీస్తూ ఉంటుంది.

ఎస్‌డీపీఐ పాత్ర సుస్పష్టం

బెంగళూరు దుర్ఘటన తరువాత మొత్తం రెండు రోజులలో 206 మందిని పోలీసులు అరెస్టు చేశారు. నవీన్‌ ‌కుమార్‌ను ముందే అరెస్టు చేశారు. విధ్వంస కారకులుగా, అందుకు రెచ్చగొట్టిన వారిగా అనుమానిస్తూ పోలీసులు అరెస్టు చేసిన వారిలో ముజామిల్‌ ‌పాషా ఒకరు. ఇతడు ఎస్‌డీపీఐ నాయకుడు. మాజీ మంత్రి, ప్రస్తుతం సర్వజ్ఞాననగర్‌ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ ‌సభ్యునిగా ఉన్న కేజే జార్జ్‌కు అతడు సన్నిహితుడని చెబుతున్నారు. శివాజీనగర్‌ ఎమ్మెల్యే రిజ్వాన్‌ అర్షద్‌కు కూడా సన్నిహితుడే. చిత్రం ఏమిటంటే పాషా కాంగ్రెస్‌ ‌సిద్ధాంతాన్ని బలంగా నమ్ముతూ ఎస్‌డీపీఐతో పోరాడుతున్నాడని రిజ్వాన్‌ ‌చెప్పారు. ఈ అరెస్టుల తరువాత కలీమ్‌ ‌పాషా అనే మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. ఇతడు మాజీ కార్పొరేటర్‌. ‌ప్రస్తుతం కాంగ్రెస్‌ ‌పార్టీ తరఫు కార్పొరేటర్‌గా ఉన్న ఇర్షాద్‌ ‌బేగం భర్త. రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రచారం ఎస్‌డీపీఐ కాంగ్రెస్‌ ‌చేతిలో కీలుబొమ్మ. అంటే అటు పీఎఫ్‌ఐకి రాజకీయ విభాగంగా ఉంటూనే, ఇటు కాంగ్రెస్‌ ‌వారికి కావలసిన విధంగా అల్లర్లు, విధ్వంసమూ ఇది సృష్టిస్తూ ఉంటుంది. కానీ ఎస్‌డీపీఐ ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ ‌పట్ల కొంత అలకతో ఉంది. ఎందుకంటే, కాంగ్రెస్‌ ‌ముస్లింల పట్ల చూపించవలసినంత అనురాగం చూపడం లేదట. కాంగ్రెస్‌, ఎస్‌డీపీఐల మధ్య వచ్చిన ఈ విభేదాల ఫలితమే తాజా గొడవలని కర్ణాటక హోంమంత్రి బసవరాజ్‌ ‌బొమ్మయ్‌ ‌వ్యాఖ్యానించారు. అలాగే నవీన్‌పై కేసు నమోదు చేయడంలో, అరెస్టు చేయడంలో ఎలాంటి ఆలస్యం జరగలేదని బొమ్మయ్‌ ‌చెప్పారు. ఎలాంటి సంబంధం లేకున్నా కాంగ్రెస్‌కు చెందిన ఎస్‌సీ శాసనసభ్యుని ఇంటి మీద దాడి చేసినప్పటికీ కూడా ఆ పార్టీ నోరు విప్పకపోవడం వెనుక ఉన్న రహస్యం కూడా ఇదేనని విశ్లేషకుల అంచనా.

భూమిపూజకు నిరసనగానే?

అయోధ్య రామమందిరం స్థానంలో మళ్లీ మసీదు వస్తుందని అఖిల భారత ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు మౌలానా సాజిద్‌ ‌రషీదీ హెచ్చరించారు. కూల్చిన చోటే మళ్లీ మసీదు కడతామని ఆయన ‘హిందువుల’ను హెచ్చరించాడు. భూమిపూజ చేయడం ద్వారా ప్రధాని మోదీ రాజ్యాంగ ఉల్లంఘనకి పాల్పడ్డారని ఈయన తేల్చారు. కచ్ఛితంగా చెప్పాలంటే, మందిరం కూలుస్తామనే ఆయన మాటల వెనుక మర్మం. అఖిల భారత ముస్లిం పర్సనల్‌ ‌లా బోర్డు కూడా ఇదే చెప్పింది. అయోధ్య విషయంలో ముస్లింలకు అన్యాయం జరిగిందట. ఒకసారి మసీదు కడితే, ఆ స్థలం ఎప్పటికీ మసీదుకు చెందిన స్థలమే అవుతుందని అంటోంది బోర్డ్. ఆర్‌ఎస్‌ఎస్‌, ‌వీహెచ్‌పీలతో ఉన్న సంబంధాలను తెంచుకో వలసిందని ఆగస్టు 5 నాటి భూమిపూజ తరువాత బెంగాల్‌ ఇమామ్‌ల సంఘం ముస్లింలకు పిలుపునిచ్చింది. ఎందుకంటే వారి కుటుంబాల రక్షణ కోసమట. ఇది భారతీయ సమాజంలో చీలికలకు ఉద్దేశించిన ప్రకటన అని స్పష్టంగా తెలుస్తూనే ఉంది. ప్రస్తుతం బీజేపీ విధానం ఇస్లాంకు వ్యతిరేకంగా, ముస్లింలకు వ్యతిరేకంగా ఉందని ఆగస్టు ఏడున బెంగాల్‌ ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు మహమ్మద్‌ ‌యాహియా ఒక ప్రకటన చేశారు. ఒకప్పుడు మసీదు ఉన్న స్థలంలో రామాలయానికి భూమిపూజ చేశారని ఆయన ఆరోపణ. దీనిని బట్టి ఆర్‌ఎస్‌ఎస్‌, ‌బీజేపీ ముస్లింలకు మిత్రులు కాదని అర్థమవుతున్నదని చెప్పారు. ఇస్లాంకు ఎవరైనా వ్యతిరేకంగా వ్యవహరించినా వాళ్లతో కలిసినా వాళ్లు ముస్లింలు కాలేరని కూడా ఆయన చెప్పాడు. ఆర్‌ఎస్‌ఎస్‌, ‌వీహెచ్‌పీలతో, వాటి అనుబంధ సంస్థలతో సంబంధం కలిగి ఉన్న ముస్లింలు వారు ఎటు ఉన్నారో తేల్చుకోవాలని కూడా యాహియా హెచ్చరించారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌వైపు ఉంటారో లేదంటే తప్పు దిద్దుకుంటారో నిర్ణయించుకోవలసిన సమయం వచ్చిందని అన్నారు. వారి కుటుంబాలను కూడా ఉపేక్షించకుండా (అవతలివారు) ఉండే రోజులు వచ్చాయని అన్నారు. భూమిపూజకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర విద్యాశాఖ సహాయ మంత్రి సిద్దిఖుల్లా చౌదరి మాట్లాడిన మరునాడే యాహియా ఈ పిలుపునిచ్చారు. ‘ఒక మసీదు మీద ఆలయం ఎలా నిర్మిస్తారు? మేం సహనం పాటిస్తున్నాం. అది అల్లా మసీదు. ఎప్పుటికి అది మసీదే. ప్రధాని వెళ్లినా, తొలి ఇటుక వేసినా కూడా అదేం పెద్ద విషయం కాదు’ అని జమాయత్‌ ఉలేమా ఇ హింద్‌ ‌బెంగాల్‌ ‌శాఖ హెచ్చరించింది. ప్రతి ప్రకటన భారతీయ సమాజాన్ని కలవర పెట్టేందుకు ఉద్దేశించినదే. ముస్లింలకు ‘ప్రధాన శత్రువు ఆర్‌ఎస్‌ఎస్‌’ అని యాహియా ప్రకటించినట్టయింది. ఆ సంస్థ, అనుబంధ సంస్థలతో సంబంధం ఉన్నవారు ముస్లింలు కాలేరని కూడా చెబుతున్నారు. ఇలాంటి ప్రకటన చేయడం వెనుక పెద్ద కారణమే ఉంది. ముస్లింలలో పలువురు మేధావులు ముస్లిం రాష్ట్రీయ మంచ్‌తో కలసి పనిచేస్తున్నారు. ఈ మంచ్‌ ‌మోదీ నాయకత్వంలోని ప్రభుత్వానికి మద్దతిస్తున్నది. ముస్లింలలో ఒక వర్గం ప్రస్తుతం బెంగాల్‌లో కూడా బీజేపీతో కలసి నడుస్తున్నారు. నిజానికి బీజేపీ హిందూ, ముస్లిం విభజన తెస్తున్నదంటూనే యాహియా తన అసలు అజెండాను బయటపెట్టుకున్నారు. భూమిపూజకు హాజరు కావడం ద్వారా మోదీ రాజ్యాంగాన్ని తొక్కివేయడమే కాదు, కోట్లాది ముస్లింల మనోభావాలను గాయపరిచారని కూడా ఆయన ఆరోపిస్తున్నారు. ఇమామ్‌లు ముస్లింలందరికీ తామే ప్రతినిధులమన్నట్టు మాట్లాడడం కొత్త కాదు. ఇందులో రెచ్చగొట్టే తత్త్వం తప్ప మరొకటి ఉండదు. ముస్లిం ఊచకోత అనేది గుజరాత్‌ ‌నుంచి తరువాత అస్సాం నుంచి ఆరంభమైందట. ఆగస్టు 5, 2019 నుంచి ముస్లింల నరమేధం కశ్మీర్‌లో కూడా ఆరంభమైందట. కాబట్టి ఆగస్టు 5, 2020న అయోధ్యలో జరిగిన కార్యక్రమం కశ్మీర్‌ ‌ముస్లిం నరమేధం తొలి వార్షికోత్సవమని తన యావత్తు పైత్యాన్ని ప్రదర్శించారాయన. దీనికి దక్షిణ బెంగాల్‌ ఆర్‌ఎస్‌ఎస్‌ ‌నేత జిష్ణు బసు చక్కని సమాధానమే ఇచ్చారు. యాహియా, బెంగాల్‌ ‌ముస్లింలంతా మూర్ఖులు అనుకోవద్దు అని. నిజమే, మతోన్మాదుల చేతిలో సాధారణ ముస్లింలు పడిపోకూడదు.


పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐపై నిషేధం?

సోషల్‌ ‌డెమాక్రటిక్‌ ‌పార్టీ ఆఫ్‌ ఇం‌డియా.. ముస్లిం మతోన్మాదులు ప్రజాస్వామ్యాన్ని, సామ్యవాద నినాదాన్ని ఉపయోగించుకుని తమ పబ్బం గడుపుకోవాలని ఎలా అనుకుంటారో చెప్పడానికి ఈ పార్టీని చూస్తే తెలుస్తుంది. ఇంత పెద్ద పేరు. కానీ దీని అజెండా ముస్లిం మతోన్మాదాన్ని సమర్ధించడమే. జూన్‌ 21, 2009‌లో దీనిని ఢిల్లీలో నెలకొల్పారు. రాజకీయ పక్షంగా ఎన్నికల కమిషన్‌ ‌గుర్తింపు కూడా ఉంది. ఇప్పుడు ఎంకె ఫైజీ అధ్యక్షుడు. రాష్ట్రంలో తాజా విధ్వంసం, అందుకు ఒడిగట్టినట్టు చెబుతున్న ఎస్‌డీపీఐ మీద నిషేధాస్త్రం సిద్ధమవుతోందని కర్ణాటక పంచాయతీరాజ్‌ ‌మంత్రి కేఎస్‌ ఈశ్వరప్ప చెబుతున్నారు. ఆగస్టు 20న జరిగే మంత్రిమండలి సమావేశం ఈ నిర్ణయం తీసుకోబోతున్నది. పీఎఫ్‌ఐ ‌రద్దు గురించి కూడా ప్రభుత్వం ఆలోచిస్తున్నదని వార్తలు వచ్చాయి. సిమి (స్టూడెంట్స్ ఇస్లామిక్‌ ‌మూవ్‌మెంట్‌ ఆఫ్‌ ఇం‌డియా) కొత్త అవతారాలలో ఇదీ ఒకటి. అయితే ఇది అవతానికి అవతారం. సిమి సభ్యులు కొత్త రూపంలో ఏర్పాటు చేసుకున్న – పీపుల్స్ ‌ఫ్రంట్‌ ఆఫ్‌ ఇం‌డియా (పీఎఫ్‌ఐ)‌కి ఇది రాజకీయ విభాగం. ఈ సంస్థ మీద లెక్కలేనన్ని ఆరోపణలు ఉన్నాయి. అంతా మతతత్త్వమే. భారత వ్యతిరేకతే. 2014లో దక్షిణ కేరళలోని ఒక ప్రైవేటు పాఠశాల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నుంచి వందేమాతరం తొలగించింది.

దానికి కారణం – అలా చేయకుంటే కార్యక్రమానికి విఘాతం కలిగిస్తామని ఎస్‌డీపీఐ బెదిరించడమే. ఆ రోజు ఏర్పాటు చేసిన నృత్య కార్యక్రమంలో నమస్కారంతో ఉన్న భంగిమలను కూడా తొలగించారు. దీని మీద చాలా విమర్శలు వచ్చాయి. వందేమాతర గీతాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నదీ కూడా ఎస్‌డీపీఐ చెప్పింది. ఆ గీతంలోని కొన్ని పదాలు ముస్లింల మనోభావాలకు వ్యతిరేకమట. అలాంటి పదాల గురించి ఎందరో పిల్లల తల్లిదండ్రులు తమకు ఫిర్యాదు చేశారని ఆ సంస్థ కార్యకర్తలు చెప్పారు. పౌరసత్వ సవరణ చట్టం అనుకూల ప్రదర్శనలో పాల్గొన్నారన్న కక్షతో బెంగళూరుకు చెందిన ఆర్‌ఎస్‌ఎస్‌ ‌సభ్యుడు వరుణ్‌ ‌భూపాలం మీద ఎస్‌డీపీఐ కార్యకర్తలు దాడి చేశారు. ఈ కేసులో ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ బెంగళూరు లోక్‌సభ సభ్యుడు తేజస్వి సూర్య హత్యకు కూడా పథకం పన్నారు. ఆయన చేసిన తప్పు- పౌరసత్వ సవరణ చట్టం అనుకూల ప్రదర్శనలో పాల్గొనడమే. కేరళలో సీపీఎం, కాంగ్రెస్‌, ‌ముస్లింలీగ్‌ ‌సభ్యుల హత్యలలో ఈ సంస్థకు ప్రమేయం ఉంది. ఆ మేరకు కేసులు నమోదయ్యాయి. జాతీయగీతం మీదనే కాదు, హిందూ కళారూపాల మీద ఆంక్షలు పెడతారు. పత్రికా కార్యాలయాల మీద దాడులు చేస్తారు. అయినా పార్టీ పేరులో ప్రజాస్వామ్యం తగిలించుకున్నారు. ఈ సంస్థ ఏం చెప్పినా చాలామంది ముస్లింలు, ముస్లిం సంస్థలు కూడా నమ్మడం లేదు. షాహిన్‌బాగ్‌ ‌నిరసనలు, తరువాత ఢిల్లీ అల్లర్లు, తమిళనాడు, కర్ణాటక, కేరళ అల్లర్లలో దీని పేరు ప్రముఖంగా వినిపించింది. ఎస్‌డీపీఐ ఉగ్రవాద సంస్థేనని కేరళకు చెందిన జమియ్యాతుల్‌ ఉలేమా, సున్నీ యువజన సంఘం కూడా ఆరోపించాయి. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో తిరిగి మసీదు నిర్మించాలన్న నినాదంతో గతంలో తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలలో నిరసన ప్రదర్శనలు నిర్వహించింది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశం నలుమూలలా తీవ్ర స్థాయిలో నిరసన కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంలో ఈ సంస్థ దొంగ వేషాలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ‌కూడా ఎండగట్టారు. తబ్లిఘి జమాత్‌లో పాల్గొన్న తమిళ ముస్లింలను తిరిగి రాష్ట్రానికి రప్పించవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని రాష్ట్ర హైకోర్టులో వ్యాజ్యం నడిపి ఎస్‌డీపీఐ విజయం సాధించింది. తబ్లిఘి జమాత్‌లో పాల్గొన్నవారిని రాష్ట్రానికి రప్పించి, క్వారంటైన్‌ ఏర్పాట్లు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం పదహారు రాష్ట్రాలలో ఎస్‌డీపీఐ కార్యకలాపాలు సాగుతున్నాయి. ఇందులో ఆంధప్రదేశ్‌ ఒకటి. కర్ణాటకలో కొంత బలంగా కూడా ఉంది. కర్ణాటక, రాజస్తాన్‌, ‌కేరళ రాష్ట్రాలలో ఇటీవల జరిగిన నగరపాలక ఎన్నికలలో ఈ పార్టీ 68 స్థానాలు గెలిచింది. 2019 లోక్‌సభ ఎన్నికలలో దక్షిణ కన్నడ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌ ‌తరువాత 46,839 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలబడింది.


శంకరాచార్య ప్రతిమకు అపచారం?

ఇంత గొడవ జరిగిన మూడో రోజున ఎస్‌డీపీఐ మరొక వివాదంలో పడింది. కర్ణాటకలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం శృంగేరిలో ఉన్న శంకరాచార్యుల వారి ప్రతిమను ఏర్పాటు చేసిన కట్టడం మీద ఎస్‌డీపీఐ పతాకానికి దగ్గరగా ఉన్న ఒక గుడ్డ కనిపించడం వివాదానికి దారి తీసింది. స్థానిక బీజేపీ నాయకులు అది ఎస్‌డీపీఐ జెండాయేనని, ఈ ఘటన మీద దర్యాప్త జరిపించాలని కోరుతున్నారు. అది తమ జెండా కాదని ఎస్‌డీపీఐ చెబుతున్నా, దాని మీద నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగులు ఉన్నాయని, అవి ఆ పార్టీ పతాకంలోనివే అని చిక్‌మగళూరు పోలీసు సూపరింటెండెంట్‌ ‌మచ్చింద్ర అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *