జాతి వ్యతిరేక శక్తులు కొందరు యువతను కూడగట్టి దేశ రాజధానిలో దేశంలో మార్పు కోసం పని చేస్తున్నామంటూ నానారచ్చ చేస్తుంటే, నిజమైన మార్పు ఎలా ఉంటుందో సమయ్ సంఘ్వీ ఆచరణలో చూపించాడు. నిన్నటి వరకూ ఆపిల్ సంస్థకు చాలా చిన్న వయసులోనే దాని వ్యవస్థాపకులు తమ కార్ షెడ్‌లో పునాదులు వేశారంటూ విజయగాథలు చదువుకున్న మనం ఒకసారి దృష్టి మళ్లించి, మన దేశంలోనే పరికించి చూస్తే అటువంటి స్టార్టప్‌లను విజయ వంతంగా నిర్వహిస్తున్న నవయువకులు అనేకానేకమంది కనిపిస్తున్నారు.
యువతలో వ్యవస్థాపకతను శక్తిమంతం చేసే విధానపరమైన మద్దతుగా 2016లో ప్రభుత్వం రూపొందించిన ‘స్టార్టప్ ఇండియా’, ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత వైవిధ్యమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలలో ఒకటిగా పరిణామం చెందడం విశేషం. వికసిత భారత్ లక్ష్యాలతో ఇది సమలేఖనం అయి ఉన్న ఈ గొడుకు కింద మొలకెత్తిన స్టార్టప్‌లు భారతదేశ ఆర్థిక పరివర్తన, ఆవిష్కరణలకు ప్రోత్సాహం,ఉపాధి సృష్టి, సమ్మిళిత అభివృద్ధికి కీలకమైన మూల స్తంభాలుగా ఉద్భవించాయి. బెంగళూరు, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి ప్రధాన కేంద్రాలు ఈ పరివర్తనలో ముందంజలో ఉండగా, టైర్ 2`3 నగరాల నుండి ఉద్భవిస్తున్న 50శాతం స్టార్టప్‌లతో చిన్న నగరాలు కూడా స్థిరంగా ఊపందుకుంటూ, వ్యవస్థాపకత ప్రజాస్వామీకరణను ప్రతిబింబింప చేస్తున్నాయి.
రాకెట్లు, డ్రోన్లతో సహా అనేకానేక లోతైన సాంకేతికతలను (డీప్‌టెక్) ఆవిష్కరిస్తూ దూసుకుపోతున్న యువతే అందుకు ఉదాహరణ. అటువంటి వారిలో బెంగళూరుకు చెందిన సమయ్ సంఘ్వీ ఒకరు. ఏడాది కన్నా ఎక్కువ రోజులు, సరిగ్గా చెప్పాలంటే 417 రోజులు ఎటువంటి ఇంధన అవసరం లేకుండా వాయువునే ఇంధనంగా చేసుకొని ఎగురగల యుఎవి (అన్‌మాన్డ్ ఏరియల్ వెహికిల్) అభివృద్ధి చేస్తున్నాడు. స్వయంప్రతిపత్తి గల అధిక-సామర్థ్య విమానాలుగా వాటిని అభివృద్ధి చేస్తున్నాడు.
చైతన్యవంతమైన శక్తికి, ప్రగాఢ విశ్వాసానికి, జాతీయ పరివర్తనకు యువత గొప్ప మూలం అని అభిప్రాయపడ్డ స్వామి వివేకానంద మాటలను సాకారం చేస్తున్నాడు సంఘ్వి. మÖడేళ్ల కింద, అంటే 2023లో హైస్కూలు విద్య పూర్తి చేసిన సమయ్, తన డ్రోన్ ప్రాజెక్టుపై పని ప్రారంభించి, రెండేళ్లలోనే ఆల్టియన్ కంపెనీని స్థాపించాడు. ఇప్పుడు ఆ కంపెనీలో 20మంది సభ్యులతో కూడిన బృందం పనిచేస్తోంది. బెంగళూరుకు చెందిన ఈ డీప్‌టెక్ స్టార్టప్ ఆల్టియోన్, లాచీ గ్రూమ్ నేతృత్వంలో టుగెదర్ ఫండ్ భాగస్వామ్యంతో జరిగిన ప్రీ-సీడ్ రౌండ్‌లో 2.5 మిలియన్ డాలర్లను సమీకరించడం విశేషం.
అతడు అభివృద్ధి చేస్తున్న విమానం డైనమిక్ సోరింగ్ అనే పద్ధతిని ఎంచు కుంది. సాధారణ విమానయాన పద్ధతైన ఇది లిఫ్ట్‌పై ఆధారపడకుండా, రెండు వేర్వేరు వాయురాశుల వేగంలోని వ్యత్యాసాలను ఉపయోగించుకోవడానికి విండ్ షియర్ (గాలి కోత)ను వాడుకుంటుంది. ఆల్బట్రాస్ అనే సముద్ర పక్షి సహా ఇతర పెద్ద సముద్రపక్షులు తమ రెక్కలను కదపకుండా సముద్రాల చుట్టూ ప్రదక్షిణ చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తాయి. కొన్ని గ్లైడర్‌లు కూడా అధిక వేగంతో ఎగరడానికి దీనిని ఉపయోగిస్తాయి.
ఆగస్టులో, ఆ సంస్థ ఒక ఆఫ్‌షోర్ ఫ్లైట్ టెస్ట్‌ను నిర్వహించింది. అది అభివృద్ధి చేసిన విమానం సముద్రానికి ఒక మీటరు కంటే తక్కువ ఎత్తులో స్వయంప్రతిపత్తితో వరుసగా అనేక వలయాలలో ఎగిరి ఆ ప్రయత్నం సాధ్యమేనని రుజువు చేసింది. ‘డైనమిక్ సోరింగ్ ఉపయోగించి గాలి నుండి శక్తిని పొందడం సాధ్యమని మనకు ఇప్పటికే తెలుసు. దీనిని ఉపయోగించి ఏడాదికి పైగా ఎగిరే విమానాలను నిర్మించడం అనేది కేవలం ఒక సాంకేతిక పురోగతికి సంబంధించిన విషయం కాదు, స్వయంప్రతిపత్తి, నిర్మాణాలు, ఏరోడైనమిక్స్, మరిన్ని రంగాలలో ఉన్న అనేక సవాళ్లతో కూడిన ఇంజనీరింగ్ సమస్యలను పరిష్కరించడమే’ అని వ్యవస్థాపకుడు, సీఈఓ సంఘ్వి పేర్కొన్నాడు.
ఒక దేశంలోని జలాలన్నింటినీ నిజ సమయంలో (రియల్ టైమ్) పర్య వేక్షించడం, వాతావరణ, సముద్ర పరిస్థితులను మ్యాపింగ్ చేయడం, నౌకలను, చేపల వేట కార్యకలాపాలను ట్రాక్ చేయడం నుండి కీలకమైన మౌలిక సదు పాయాలను పర్యవేక్షించడం, అలాగే రక్షణ, శోధన, రక్షణ, శాస్త్ర, పారిశ్రామిక రంగాలలో స్వయంప్రతిపత్తి గల వ్యవస్థలను సమన్వయం చేయడం వరకు వివిధరకాల అనువర్తనాల కోసం అనేక రకాల పేలోడ్‌లను మోయగల వాహనాల సమÖహాన్ని అభివృద్ధి చేయడమే ఆల్టియోన్ లక్ష్యంగా సమయ్ సంఘ్వి చెబుతున్నాడు.
‘ఒకేసారి ఏడాదికి పైగా గాలిలో తేలియాడగలిగే విమానాన్ని నిర్మించే దిశగా సమయ్, అతని బృందం అద్భుతమైన పురోగతిని సాధిస్తున్నారు. వారు దీనిని విజయవంతం చేస్తే, ప్రస్తుతం పెద్ద ఓడలు, సిబ్బంది, భారీ మౌలిక సదుపాయాలు అవసరమయ్యే పనులను చేసే లక్షలాది విమానాలు త్వరలోనే మనకు అందుబాటులోకి వస్తాయి. పైగా,వాటిని ఆకాశంలోనే నిలిపి ఉంచవచ్చు,’ అని రోబోల కోసం ప్రాథమిక ఎఐ నమూనాలను రూపొందిస్తున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ సహ-వ్యవస్థాపకుడు, ఏంజెల్ ఇన్వెస్టర్ అయిన లాచీ గ్రూమ్ వివరించారు. ప్రొపల్షన్ (చోదకశక్తి) లేకుండా స్వయంప్రతిపత్తి గల డైనమిక్ సోరింగ్‌ను సాధించడానికి, అలాగే సముద్రంపై ఈ విమానాల సముదాయాన్ని మోహరించే దిశగా ఆరఅండ్‌డిని విస్తరించడానికి ఆల్టియోన్ ఈ నిధులను ఉపయోగించుకో నుంది. వికసిత భారత్ దిశగా దూసుకుపోతున్న దేశానికి ఇటువంటి యువకుల కృషే ఆలంబన అవుతుందన్నది నిర్వివాదం. సృజనాత్మకత, ఆవిష్కరించగల సామర్ధ్యం, ఉనికిలో ఉన్న ఆలోచనల పరిధికి ఆవలకు వెళ్లి ఆలోచించగల శక్తి యువత సొంతం. వాటిని కాక్రోచ్ జనతాపార్టీ నాయకులలాగా నకారాత్మకంగా ఉపయోగించకుండా, సమయ్ సంఘ్వీ వంటివారిలా సకారాత్మకంగా ఉపయోగిం చుకుంటే భారత్‌ను ఆపగల శక్తి ఈ ప్రపంచంలోనే ఉండదు.