దేశ ప్రగతికి, పతనానికీ కారణం జనాభా. అడ్డూ అదుపు లేని జనాభా పెరుగుదల ఆకలి, దారిద్య్రాలను మిగులుస్తుంది. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్యలకు కారణమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ శరవేగంగా పెరుగుతుంటే మరోవైపు వనరుల లేమి వెంటాడుతోంది. సకాలంలో ప్రభుత్వాలు సరైన నిర్ణయాలు తీసుకోని పక్షంలో మౌలిక వసతుల లేమి, నిరుద్యోగం వంటి సమస్యలు ప్రగతికి ఆటంకంగా మారతాయి.
సైన్స్, మెడిసిన్ రంగాల్లో వచ్చిన అభివృద్ధి కూడా జనాభా పెరుగుదలకు ఒక కారణం. వీటి కారణంగానే శిశు మరణాల రేటు తగ్గిపోవడంతో పాటు (ఎక్కువమంది పిల్లలు యుక్త వయస్సు వరకు), చాలామంది వృద్ధాప్యంలో కూడా మనుగడ కొనసాగి స్తున్నారు. ఇకముందు కూడా ఇదే కొనసాగనున్న నేపథ్యంలో 2050 నాటికి ప్రపంచ సగటు ఆయుర్ధాయం 77.2 సంవత్సరాలుగా ఉండనుంది.
భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రస్తుతం మన దేశ జనాభా 146.39 కోట్లుగా ఉంది. 1901లో దేశ జనాభా 23.6 కోట్లు. 1911లో 25.2 కోట్లు, 1921లో 25.1 కోట్లు, 1951లో 36.1 కోట్లు, 2001లో 102.8 కోట్లు, 2011లో 121కోట్లుగా ఉంది. భారతదేశంలో పూర్వం రాజుల కాలంలోనూ జనగణన జరిగేదని చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. అవి రాతపూర్వకంగా లేకపోవడమో లేదా ఆధారాలు లభించకపోవడంతో పాటు దేశమంతా చిన్న రాజ్యాలుగా ఉండటం వల్ల నాటి వివరాలేవీ లభ్యం కాలేదు.
రుగ్వేదకాలంలో జనగణన జరిగినట్టు కొన్ని ఆధారాలున్నాయి. 4,5 శతాబ్దాల్లో జనాభా లెక్కింపు జరిగినట్టు బౌద్ధ సాహిత్యంలో ప్రస్తావన ఉంది. అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో భారతదేశ జనసాంద్రత క్రిక్కిరిసి ఉండేదని అలెగ్జాండర్ సేనలు ప్రస్తావించాయి. మౌర్య సామ్రాజ్యంలో జనగణన జరిగినట్టు కౌటిల్యుడు రాశాడు. ఒక అంచనా ప్రకారం సాధారణ శకం 1600లో దేశ జనాభా 10కోట్లు. ఇది 1800లో 12కోట్లకు చేరింది. 1841లో 13కోట్లు, 1871లో 22.5కోట్లకు చేరింది. 1871 నుంచి 2011 వరకు దేశంలో 15 సార్లు జనగణన జరిగింది. ప్రస్తుతం 16వ జనగణన జరుగుతోంది. 1901-21 మధ్య కాలంలో అంటే 19వ శతాబ్దంలో జనాభా పెరుగుదల నెమ్మదిగా సాగింది. 1901-11 మధ్య కాలంలో పెరుగుదల రేటు కేవలం 5.42 శాతం మాత్రమే. 1921-51 మధ్య కాలంలో దేశ జనాభా 25.1 నుంచి 36.1 కోట్లకు పెరిగింది.
వ•డు దశాబ్దాల కాలంలో 47.3శాతం జనాభా వృద్ధిరేటు నమోదైంది. దీన్ని స్థిరమైన వృద్ధిరేటుగా పరిగణిస్తారు. 1951-81 మధ్య కాలంలో జనాభా విస్ఫోటనం జరిగింది. 1951లో 36.1 కోట్ల నుంచి ఏకంగా 68.33 కోట్లకు పెరిగింది. 30 ఏళ్ల కాలంలో 89.36శాతం వృద్ధి రేటు నమోదైంది. 1981-2011 మధ్య కాలంలో వృద్ధి రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ 1981తో పోలిస్తే తక్కువనే చెప్పాలి.
భారతదేశం కేవలం జనాభా పెరుగుదల వల్ల ఎదురవుతున్న సవాళ్లనే కాదు, జనాభా నిష్పత్తిలో మతపరమైన ప్రాబల్యాలు మారుతుండటంతో అధిగమించలేని సమస్యల వైపు పయనిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ‘డెమోగ్రఫీ’లో వస్తున్న మార్పులపై ఇటీవలే దృష్టి సారించింది. చొరబాట్లు, ఇతర కారణాలతో ఏర్పడే జనాభా మార్పు ఏ దేశానికైనా పెను సవాలే. జనాభా నిష్పత్తుల్లో వస్తున్న మార్పులను అధ్యయనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఇటీవలే నియమించింది. రిటైర్డ్ జడ్జి ప్రకాశ్ ప్రభాకర్ నవ్‌లేకర్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు.
కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త డాక్టర్ షమికా రవి, జనగణన కమిషనర్ సభ్యులుగా ఉంటారు. అక్రమ వలసలు, సరిహద్దుల్లో చొరబాట్లు, ఇతర అసాధారణ కారణాలతో దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న మార్పులతో పాటు మత, సామాజికవర్గాల వారీగా జనాభా మార్పుల సరళిని ఈ కమిటీ సమగ్రంగా విశ్లేషించనుంది. దీనికి తగిన పరిష్కారాల్ని కూడా కమిటీ సూచించనుంది.
సరిగ్గా ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ దేశ వ్యాప్తంగా ‘ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ’-సర్ పక్రియను చేపట్టింది. సకాలంలో కేంద్రం సంస్కరణలకు నడుం బిగించింది. ఇప్పటికే 16 రాష్ట్రాల్లో ‘సర్’ పక్రియ పూర్తయింది. కొన్ని కోట్లమంది అక్రమ ఓటర్ల పేర్లను ఈసీ తొలగిం చింది. సరైన పత్రాలు సమర్పించిన వారిని తిరిగి ఓటరు జాబితాలో చేర్చింది. జాతీయ పౌర పట్టిక-ఎన్.పి.ఆర్.పై కసరత్తు జరుగుతోంది.
దేశ నికర జనాభా ఎంతో తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రయత్నాలు, ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2019లో పౌరసత్వ చట్టానికి సవరణలు ప్రతిపాదించి, తదుపరి చట్టం చేసింది. అక్రమ వలసల సమస్య భారతదేశ సార్వభౌమత్వానికి, జాతీయ భద్రతకు, సామాజిక సమతుల్యతకు, గిరిజన సమాజాల పరిరక్షణకు పెనుసవాలుగా పరిణమించింది. త్రిపుర, అసోం, బెంగాల్ రాష్ట్రాల్లో అక్రమ చొరబాట్ల సమస్య తీవ్రంగా ఉండటంతో కేంద్రం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది.
ఈ తరహా విధాన నిర్ణయాలకు ప్రాతిపదిక దేశ జనాభాపై, అక్రమ చొరబాట్లపై అదుపు కలిగి ఉండటం కోసమే అని గతంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నికరం తేలితే తకరారు తీరుతుంది. ఇదీ కేంద్రం అనుసరిస్తున్న సూత్రం. ప్రపంచవ్యాప్తంగా జనాభా 800 కోట్లను ఎప్పుడో దాటేసింది. కొన్ని దేశాల్లో జనాభా సంఖ్య భారీగా తగ్గిపోతోంది. యూరప్ దేశాల్లో జననాల రేటు వేగంగా తగ్గిపోతోంది. అలాగే వృద్ధుల జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నం అవుతున్నాయి.
ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలు ఇప్పటికే జనాభా క్షీణతను ఎదుర్కొంటున్నాయి. జనాభా క్షీణతలో ప్రపంచంలోనే దక్షిణ కొరియా మొదటిస్థానంలో ఉంది. ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఫ్యూచర్ నివేదిక ప్రకారం, 2125 నాటికి దక్షిణ కొరియా జనాభా 11.15 మిలియన్లకు, అంటే 15%కి తగ్గుతుందని అంచనా. ఇది ప్రపంచంలో అతి తక్కువ జనన రేటు. జపాన్ కూడా జనాభా క్షీణత సమస్యను ఎదుర్కొంటోంది. తక్కువ జనన రేటు, ఎక్కువ జీవనకాలం వల్ల జపాన్ జనాభాలో వృద్ధాప్యం రేటు పెరుగుతోంది.
జపాన్‌లో 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య భారీగానే ఉంది. చైనా జనాభా 2100 నాటికి 63 కోట్ల 30 లక్షలకు తగ్గుతుందని అంచనా. భారత్ జనాభా 2061నాటికి 1.7 బిలియన్లకు చేరుకుని, ఆ తర్వాత క్రమంగా తగ్గి 2100 నాటికి 1.5 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఇక మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా శరవేగంగా పెరుగుతోంది. భారత్‌లో సైతం ఇదే ధోరణి వ్యక్తమవు తోంది. ముస్లిం జనాభాలో మన దేశం ఇండోనేసియాను దాటిపోయింది. ముస్లింల జనాభా 23.9% నుంచి 25.6శాతానికి పెరిగింది. ఇంచుమించుగా క్రైస్తవ జనాభాకు సమానంగా ఎదుగుతోంది. హిందువులు 15% నుంచి 14.9శాతానికి తగ్గిపోయారు. 2010లో భారత్‌లో హిందువుల జనాభా 80% కాగా.. 2025 నాటికి ఇది 79 శాతానికి పడిపోయింది. అదే సమయంలో భారత్‌లో ముస్లింల జనాభా14.3% నుంచి 15.2 శాతానికి పెరిగింది. కజకిస్తాన్, బెనిన్, లెబనాన్, ఒమన్, టాంజానియా దేశాల్లో ముస్లింల జనాభా గణనీయంగా పెరిగింది. యూరప్‌లో ఫ్రాన్స్, జర్మనీ, యూకేల్లో సైతం ముస్లిం జనాభా రోజు రోజుకూ పెరుగుతోంది. 1950 తో పోల్చుకుంటే 2015లో హిందువుల జనాభా వాటా 7.82 శాతం తగ్గిందని గణాంకాలు చెపుతున్నాయి. అదే సమయంలో ముస్లిం జనాభా వాటా 43 శాతం పెరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 38 ఇస్లామిక్ దేశాల్లో మెజారిటీ మతస్తుల సంఖ్య పెరిగింది. భారతదేశంలో వేగవంతమైన జనాభా పెరుగుదల నిరుద్యోగ సమస్యను సృష్టిస్తోంది. ఉద్యోగాల లభ్యత కంటే ఉద్యోగార్థుల సంఖ్య విపరీతంగా ఉంది. దీంతో విపరీతమైన పోటీ ఏర్పడింది.
ప్రపంచంలో ఏ దేశానికీ లేని అద్భుతమైన అనుకూలత మన దేశానికి ఉంది. జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ యువ జనాభా అధికంగా ఉంది. శ్రమశక్తిని, మేధాశక్తిని వెచ్చించే యువత ఉండటంతో మన దేశంలోని ఉత్పాదక పరిశ్రమలు లాభాల బాటలో నడుస్తాయి. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి పథంలో ఉన్నప్పుడు శ్రమశక్తిని, మేధాశక్తినీ వెచ్ఛించే యువతను సద్వినియోగం చేసుకోవడం ద్వారా దేశం ప్రగతిపథంలో పయనిస్తుంది. దేశంలో సుమారు 41శాతానికి పైగా 20 ఏళ్లలోపు వయసువారే ఉన్నారు. స్వల్పకాలంలోనే దేశ స్వరూప, స్వభావాలు గుణాత్మకంగా మారిపోనున్నాయి. జనాభాలో యువకుల సంఖ్య ఎక్కువ ఉన్న ప్పుడు ‘పాపులేషన్ డివిడెండ్’ అనే భావనకు ప్రాధాన్యత ఏర్పడుతుందంటారు ‘డెమోగ్రఫర్లు. ఈ కారణంగానే కేంద్ర ప్రభుత్వం యువ జనాభాపై దృష్టి సారించింది. అందుకే ‘స్కిల్ డెవ్‌లప్‌మెంట్ ’అనే మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. యువ జనాభా ఉండటం మాత్రమే కాదు, వారికి అవసరమైన నైపుణ్య అభివృద్ధి తప్పనిసరిగా ఉండాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా స్కిల్ డెవ్‌లప్ మెంట్‌ను ప్రోత్సహిస్తోంది. 2016 లోనే కేంద్ర ప్రభుత్వం 50కోట్ల మంది యువకులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని లక్ష్య నిర్దేశం చేసుకుంది. స్టార్టప్, మేక్ ఇన్ ఇండియా వంటి విధాన నిర్ణయాలు అందులో భాగమనే చెప్పాలి.
2025, డిసెంబర్ 15న భారత ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం 15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తుల నిరుద్యోగిత రేటు 2025, నవంబర్‌లో 4.7శాతం తగ్గింది.15 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తుల మొత్తం కార్మిక జనాభా నిష్పత్తి (వర్కర్ పాపులేషన్ రేషియో) 2025, అక్టోబర్ నాటికి 52.5 శాతం నుంచి 53.2శాతానికి మెరుగుపడింది. ప్రపంచ బ్యాంకు 2025, ఏప్రిల్‌లో భారతదేశంలో పేదరిక గణాంకాలను ప్రకటించింది. పదేళ్లలో 17.1 కోట్లమంది ప్రజలు పేదరికం నుంచి బయటపడినట్లు ప్రకటించింది. రోజుకి 2.15 డాలర్ల కంటే తక్కువ ఆదాయంతో జీవించే ప్రజల శాతం 2011-12లో 16.2శాతం ఉండగా 2022-23లో 2.3శాతానికి తగ్గిందని తేల్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 2011-12లో 18.4 శాతంగా ఉన్న తీవ్ర పేదరికం 2022-23 నాటికి 2.8 శాతానికి తగ్గింది. అదే కాలంలో పట్టణ ప్రాంత పేదరికం 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది.
2011-12లో దేశంలో అత్యంత పేదరికంలోని 65శాతం మంది 5 అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లో ఉన్నారు. 2022-23నాటికి ఈ రాష్ట్రాల్లో తీవ్ర పేదరికం పండింట రెండో వంతుకు తగ్గింది. ఇలాంటి పరిస్థితుల్లో జనాభా నియంత్రణ మేలా, నిర్వహణ ప్రయోజనకరమా అనేది భారత్ ముందున్న సవాలు. అయితే నియంత్రణతో పాటు నిర్వహణకు ప్రాధాన్యమివ్వా లని కేంద్రం భావిస్తోంది. ఉపాధి కల్పన, నైపుణ్య శిక్షణపై దృష్టి సారించింది. అంటే కేంద్ర ప్రభుత్వం ద్విముఖ వ్యూహాన్ని అనుసరిస్తోంది. జనాభా నియంత్రణ, నిర్వహణ శాస్త్రీయంగా నిర్వహించేం దుకు తగు చర్యలు తీసుకుంటోంది. సమగ్రమైన, శాస్త్రీయమైన చర్యలవైపు అడుగులు వేస్తోంది.