కర్తవ్య నిర్వహణకు లోటు రానీయకుండా కన్నుమూసినశ్రీ దాసరి ఆంజనేయులు
దాసరి ఆంజనేయులు 1942 లో ఆర్‌ఎస్‌ఎస్ లో చేరి అనేక బాధ్యతలు నిర్వహించారు. దశాబ్దం పాటు కృష్ణాజిల్లా కార్యవాహగా పనిశారు. తదుపరి విజయవాడ విభాగ్ సహ కార్యవాహగా పనిచేశారు. ఏ బాధ్యత తీసుకున్నా మనస్సునూ, హృదయాన్నీ లగ్నంచేసి నియమనిష్ఠలతో నిర్వహించేవారు. విజయవాడలో, కృష్ణాజిల్లాలో రా.స్వ. సంఘ కార్య విస్తరణకు, పటిష్టీకరణకు ఎంతో కృషిచేశారు. ఎందరెందరో కార్యకర్తలకు ప్రేరణగా నిలిచారు. నిత్య శాఖ నియమాన్ని అంతిమశ్వాస వరకు ఆచరించారు.
ఆంజనేయులుకు విద్యారంగంపట్ల విశేషమైన ఆసక్తి. భారతీయ విద్యాపీఠం కార్యదర్శిగా పెక్కు పాఠశాలల నిర్వహణలో మార్గదర్శనం చేస్తూ, ఆయా విద్యాలయాల ద్వారా బాలబాలికలకు ఉత్తమ సంస్కారాలు అందించడానికి ఎప్పటికప్పుడు శ్రద్ధ వహిస్తూ వాటి అభివృద్ధికి, భవనాల నిర్మాణానికి వనరులు సమకూర్చుతూ వాటిని కంటికి రెప్పలా కాపాడుతూ వచ్చారు. విజయవాడలోని శిశువిద్యా మందిరంలో 1986 జనవరిలో జరిగిన సంఘకార్యకర్తల శిబిరానికి సర్‌సంఘ్‌చాలక్ బాలాసాహెబ్ దేవరస్ విచ్చేయడం ఆంజనేయులుకు ఎంతో ఆనందం కలిగించింది. శిబిరం ముగింపు నాటి (26వ తేదీ) సాయంత్రం విజయవాడ గాంధీజీ మునిసిపల్ హైస్కూల్‌లో జరిగిన సార్వజనికోత్సవం ప్రారంభంలో ఆంజనేయులు వేదిక ఎక్కి సభాధ్యక్షులను, సర్ సంఘచాలక్‌ను, ఇతర పెద్దలను పరిచయం చేశారు. వేదికదిగి నిలబడ్డవారు నిలబడ్డట్లే ఒక్కసారిగా ఒక దూలం క్రింద పడినట్లుగా బిగుసుకొని పడిపోయారు. తనువు చాలించారు. ఎంతటి ధన్యజీవనం!? జనవరి 26, భారతగణతంత్ర దినోత్సవంనాడు, భరతమాత సేవలోనే తల్లి ఒడిలో తనువు చాలించిన ధన్యజీవి దాసరి ఆంజనేయులు. మరునాటి ఉదయం పూజ్య సర్‌సంఘచాలక్ బాలాసాహెబ్ దేవరస్ ఆంజ నేయులు ఇంటికి వెళ్లి, భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఆ తర్వాత కార్యకర్తల శిబిరంలో శ్రద్ధాంజలి సభ జరిగింది. దేశ కార్యాన్ని చేస్తూ చేస్తూనే పరమపదించిన ఆంజనేయులు కర్తవ్య పరాయణతను ప్రశంసిస్తూ, సర్‌సంఘచాలక్‌జీ ప్రసంగించారు. ప్రాంత సంఘచాలకులు చిలుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి కూడా శ్రద్ధాంజలి ఘటిస్తూ, ఆంజనేయులు ఆదర్శజీవితాన్ని కొనియాడారు. శిబిరం కార్యకర్తలంతా విలపిస్తూ కన్నీళ్లతో పుష్పాంజలి ఘటించారు.
సంఘస్థాన్‌లో, భగవాధ్వజఛాయలో, సర్‌సంఘచాలక్ సమక్షంలో ‘‘త్వదర్థే పతత్వేషకాయో నమస్తే నమస్తే’’ అని భరతమాతను కోరుతూ స్వయంసేవకులు చేసే ప్రార్థనను సార్థకం చేసుకున్న ధన్యజీవి ఆంజనేయులు.
44 సంవత్సరాలు నిష్ఠగా, నిరంతరంగా సంఘ కార్యంచేస్తూ మరింత సమయం సంఘకార్యానికి ఇవ్వలేకపోయానే అని మనసులో బాధపడుతూ, పదవీవిరమణ వయస్సుకు ముందే విరమించుకొని దాదాపు పూర్తి సమయాన్ని సంఘ పనికి ఇవ్వడం ప్రారంభించిన కొద్దినెలలకే వారు కన్నుమూశారు.
సాధారణ రైతు కుటుంబ జన్మించి ఎన్నో ఒడుదొడుకులను ఎదుర్కొనవలసి వచ్చినా,‘‘ఋణాను బంధరూపేణ పశుపత్నీ సుతాలయాః’’ అనే సూక్తిని ఆచరణలో పెడుతూ, అలాంటి ఇబ్బందులు సమాజకార్యానికి అడ్డురాకుండా నిబ్బరంతో మెలిగిన ఆదర్శ స్వయంసేవకులు దాసరి ఆంజనేయులు.
దత్తోపంత్‌జీ శ్రద్ధాంజలి
సత్యనారాయణపురం శిశుమందిరంలో ఆంజనేయులుకు వివిధ సంస్థల తరఫున శ్రద్ధాంజలి ఘటించే సభ జరుగుతూ ఉండగా, అనుకోకుండా భారతీయ మజ్దూర్ సంఘ్ సంస్థాపకులు దత్తో పంత్‌జీ ఠేంగ్డీ వచ్చారు. నిర్వాహకుల అనుమతితో ప్రసంగిస్తూ, ‘మేము మద్రాసులోని సంఘ కార్యా లయంలో భోజనానికి కూర్చున్నాం. ఆ సమయంలో విజయవాడ నుండి బాలాసాహెబ్ దేవరస్, ఆబాజీ వచ్చారు. అక్కడి కార్యకర్తలు ప్రయాణం బాగా జరిగిందా? అంతా కుశలమే గదా? అని అడుగగా, ‘విజయవాడ సార్వజనికోత్సవంలో ఆంజనేయులు స్వాగతవచనాలు పలికి, వేదిక దిగి ప్రాణాలు వదిలిన విషయం’ ఆబాజీ తెలియజేశారు. ఆ మాట వింటూనే నోట్లో ముద్ద పెట్టుకోవటం ఆపి నలుగురు కార్యకర్తలు ఒకే మాట పలికారు. ఆ మాటలకు అర్థం ‘ఎంత గొప్ప మరణమిది!’ అని అన్నారు.
ఆపై దత్తోపంత్‌జీ ఇలా కొనసాగించారు. ‘ఒకసారి నెపోలియన్ తన సైనిక దళాన్ని ఒక పనిపై పంపించి, విజయవార్తకై ఎదురుచూస్తున్నాడు. చూసి,చూసి విసిగి వేసారిన సమయంలో ఒక సైనికుడు గుర్రం దిగి, కుంటుకుంటూ వచ్చి, ‘జనరల్! మనం యుద్ధం గెలిచాం’ అని నివేదిం చాడు. అయితే ఆ సైనికుని రక్త సిక్త శరీరాన్ని చూసి- ‘కాని, నీవు బాగా గాయపడినావే!’ అంటూ సానుభూతి ప్రకటించాడు. దానికి జవాబుగా, ‘‘లేదు జనరల్! నేను గాయపడలేదు, నేను ఇప్పటికే మరణిం చాను’’ అంటూ ఆ సైనికుడు కుప్పకూలిపోయాడు. ఆంజనేయులు మరణమూ అలాంటిదే అంటూ ముగించారు.
ఆర్ద్ర స్వభావి, ఆదర్శ అధ్యాపకులు శ్రీ యరగుడిపాటి నరసయ్య
ఆనాటి నెల్లూరు జిల్లా ప్రచారక్ ఎన్.ఎమ్. దేశపాండే సంఘశాఖలో అనర్గళంగా ఆంగ్లంలో ఇచ్చిన ఉపన్యాసాన్ని విని డిసెంబర్ 1944లో 9వ తరగతి విద్యార్థి నరసయ్య శాఖకు రావడం ప్రారంభించారు. ఆ విధంగా వారు గటనాయక్‌గా, శిక్షక్‌గా, ముఖ్యశిక్షక్‌గా అనేక బాధ్యతలను శ్రద్ధగా నిర్వహించారు. సోమయ్య నెల్లూరు జిల్లా ప్రచారక్‌గా ఉన్నప్పుడు వీరు తాలూకా కార్యవాహగా బాధ్యత స్వీకరించారు. జిల్లా శారీరక్, బౌద్ధిక్ ప్రముఖ్‌గా, జిల్లా, విభాగ్ కార్యవాహగా అకుంఠిత దీక్షతో కార్యక్రమాలను నిర్వహించారు. వీరు బాధ్యతను నిర్వహించిన సమయంలో పాతవారితోను, కొత్త వారితోనూ, కార్యకర్తలందరితో మంచి సంబంధాలు ఉండేవి. కార్యకర్తలకు చక్కని మార్గదర్శనం చేసేవారు. తన ఆర్ద్రస్వభావంతో-అందరికీ అత్యంత ఆత్మీయులై స్వయంసేవకుల హృదయాలను చూరగొన్నారు.
ఒకవైపు నెల్లూరు సెంట్‌పీటర్స్ హైస్కూలు గణితశాస్త్ర ఉపాధ్యాయులుగా సేవలందిస్తూనే మరోవైపు – నెల్లూరు జిల్లాలోనేగాక, చిత్తూరు, మదనపల్లి, తిరుపతి పట్టణాలలో పర్యటించి మార్గ దర్శనం చేశారు. హైస్కూలు విద్యార్థులకు అత్యంత నైపుణ్యంతో పాఠాలు చెప్పి, వారి మన్ననలను పొందిన మహనీయుడై తనవద్ద విద్యనేర్చిన విద్యార్థుల హృదయాలలో శాశ్వత స్థానాన్ని పొంది ధన్యుడైనారు.
ఆయన గణితంలో స్వర్ణ పతక గ్రహీత. ‘స్వయం సేవకులు సంఘపని బాగా చెయ్యటమేకాదు, బాగా చదవాలి. మంచి మార్కులు తెచ్చుకోవాలి’ అని చెప్పే వారు. పరీక్షలకు ప్రతిరోజు ఉదయం 4.00గం.కు సైకిలుపై వచ్చి ఇంటింటికీ తిరిగి స్వయంసేవకులైన విద్యార్థుల్ని లేపి చదివించేవారు. తర్వాత శాఖ పూర్తి చేసుకొని ఉదయం.9.30వరకు శాఖపనిలోనే తిరిగేవారు. మీరు బడికి ఎప్పుడు వెళ్తారని అడిగితే, ‘‘ఏముందయ్యా మరో 8 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను. 5 ని.లు స్నానం, 8ని.ల్లో భోజనం చేసి మరో 5 నిమిషాల్లో బడిలో ఉంటాను’’ అంటూ సైకిల్‌పై వేగంగా వెళ్లేవారు. వారినుండి అందరమూ నేర్చుకోవలసిన సమయపాలన అది. నెల్లూరుకు దగ్గరగా ఉన్న గ్రామాలకు సాయంత్రం సమయంలో వెళ్లి సంఘకార్యాన్ని నిర్వహించేవారు.
సర్‌సంఘచాలకుల సహా అఖిల భారత అధికారుల పర్యటన కార్యక్రమాలలో వారి బౌద్ధిక్‌లను తెలుగులోకి అనువదించేవారు. వీరు నెల్లూరు విభాగ్ అంతా పర్యటించి సంఘశాఖల అభివృద్ధికి నిరంతరం కృషిచేశారు. ఒకవైపు ఉద్యోగం – సంఘశాఖల పని – మరోవైపు కుటుంబ నిర్వహణ -ఊపిరిసలపని పనులలో సంఘపనిని నిర్వహించే వారు. తమ ఇంటికి వచ్చిన సంఘకార్యకర్తలను, స్వయంసేవకులను ఆత్మీయంగా ఆదరించేవారు. వారికి నచ్చేవిధంగా సలహాలు ఇచ్చి మెప్పించడం వారి దైనందిన కార్యక్రమం.
పేద స్వయంసేవకుల కుమార్తెలకు వివాహం జరిపించడానికి, పేద విద్యార్థుల చదువు సాగడానికి ధనసహాయం చేసేవారు. ఏ మాత్రం కోపపడకుండా తన ఆత్మీయస్వభావంతో స్వయంసేవకులను, కార్యకర్తలను దగ్గర తీసేవారు. శారీరక బాధ ఉన్నా ఎవ్వరికీ తెలియనివ్వకుండా సంఘ కార్యక్రమాలను నిర్వహించేవారు. ఒకసారి సోమయ్య ‘‘నర్సయ్యగారు తక్కువగా మాట్లాడతారు, ఎక్కువగా పని చేస్తారు’’ అని వారి ఎదుటే ప్రశంసించారు.
ఉపాధ్యాయుడుగా – విద్యార్థులలో చురుకైన వారిని ఎంపిక చేసి నియమితంగా శాఖకు రప్పిస్తూ, నిదానంగా, అంచెలంచెలుగా తీర్చిదిద్దారు. అలా ఎందరో ప్రాంత, విభాగ్, జిల్లా, నగర స్థాయుల్లో వివిధ క్షేత్రాలలో ఈనాటికీ పనిచేస్తున్నారు. 1948 సంవత్సరంలో సత్యాగ్రహం చేసి జైలుకెళ్లారు. అక్కడి ఖైదీలకు చదువు చెప్పి, మొదటి శ్రేణిలో ప్యాసయ్యే టట్లు తర్ఫీదునిచ్చారు.
చిన్నతనంలో సంఘంలో చేరినప్పటి నుండి ఆఖరి క్షణము వరకు సంఘము కొరకు, సమాజము కొరకు జీవించారు. అత్యంత సామాన్యంగా కనపడే నరసయ్య అసామాన్యంగా జీవించారు. ఆయన గుర్తుకు రాగానే – వారి సైకిలు, సంచి జ్ఞప్తికి వస్తాయి. జీవితాంతము నిరాడంబరముగా, నిజాయతీగా, ప్రణాళికాబద్ధంగా, క్రియాశీలకంగా జీవిస్తూ సంఘపనిలో లీనమయ్యారు. నియమితంగా నిత్యమూ శాఖలో పాల్గొనడం, స్వయంసేవకుల ఇళ్లకెళ్లి ప్రేమతో కలియడం వారి జీవిత స్వభావము. అందువలననే నెల్లూరు జిల్లాలో ఉండే పెద్దలందరికీ, స్వయంసేవకులందరికీ నర్సయ్య మాట వేదవాక్కు. చూడగానే అత్యంత సామాన్యంగా కనపడే నర్సయ్య అసమాన్యమైన వ్యక్తిత్వము. నెల్లూరులో పనిచేసిన యువ ప్రచారకులందరు వారి ఆప్యాయత రుచి చూసినవారే. ప్రచారక్ నెల్లూరు రాగానే భోజన వ్యవస్థసహా స్వయంగా అన్ని ఏర్పాట్లుచేసేవారు. ప్రచారకులందరూ ఆయన దగ్గర అప్యాయత పొందినవారే.
ఎం.ఎల్.సి.గా పోటీ చేయాలని పలువురు ఒత్తిడి తెచ్చినపుడు వినమ్రంగా తిరస్కరించారు నర్సయ్య. జయభారత్ ఆస్పత్రి ప్రారంభ వికాసాలల్లో వీరి కృషి అమూల్యం. అయినా అహంకారము దరిచేరనీయ లేదు. నెల్లూరులో ఏబీవీపీ, ఉపాధ్యాయ సంఘం, వీహెచ్‌పీ, భారతీయ జనసంఘ్ తదితర సంస్థల విస్తరణకు కృషిచేశారు.
భాగ్యనగరంలోని శ్రీ విద్యావిహార పాఠశాలకు ప్రధానాచార్యునిగా వెళ్లాలని సంఘపెద్దలు సూచించగానే అక్కడికి వెళ్లి 4 సంవత్సరాలపాటు ఉన్నత విద్యా ప్రమాణాలతో ఆ సంస్థను తీర్చిదిద్దారు.
విజయవాడ దగ్గరలోని విజ్ఞాన విహార పాఠశాల ప్రగతికై వెళ్లాలన్న సంఘపెద్దల సూచన మేరకు అక్కడ 2 సంవత్సరాలు పనిచేసి ఆ పాఠశాలను కూడా తీర్చిదిద్దారు. తమ 30 సంవత్సరాల ఉపాధ్యాయ జీవితంలో సేకరించిన అమూల్యగ్రంథాలను అక్కడి గ్రంథాలయానికి అందజేశారు.
సాధారణంగా కనపడే ఒక స్వయంసేవకు – ఉత్తమ ఉపాధ్యాయులుగా, ఉత్తమ గృహస్థునిగా, జీవితాంతము క్రియాశీల కార్యకర్తగా, సేవా భావంతో అనేక సంస్థలకు సహకరిస్తూ, నిరాడంబరంగా ప్రామాణికంగా, ఎంతోమంది కార్యకర్తలను తీర్చిదిద్దుతూ, అహంకార రహితంగా, ప్రశాంతంగా ఎలా జీవించగలరో మన కళ్లకు కట్టి చూపించారు నరసయ్య. అత్యంత ఉన్నతమైన జీవితం గడిపిన నర్సయ్య ఒక సంవత్సరం అనారోగ్యంతో బాధపడి జనవరి 19,2012న తుదిశ్వాస విడిచారు. నెల్లూరు జిల్లా సంఘశాఖలకు భీష్మపితామహునిగా ఉండి అలుపెరుగక సలహాలు, సహకారాలను అందించిన వ్యక్తి శాశ్వతంగా కనుమరుగైనారు.
భౌతికంగా వారు లేకపోయినా, వారు ప్రబోధించిన విషయాలు స్వయంసేవకులకు మార్గదర్శకాలు. స్వర్గీయ నర్సయ్య సంఘకార్యంలో జీవితాన్ని గంధం చెక్కలా అరగదీసి సుగంధాలు పంచిన మహనీయుడు. ఇదే సంఘసృష్టి.