పశ్చిమ బెంగాల్‌లో కొత్త వెలుగులు నిండుతున్నాయి. నలభై ఏళ్ల నిర్దిష్ట పరిపాలనలో కమ్మిన చీకట్లు మెల్లమెల్లగా కరిగిపోతున్నాయి. ప్రజాపాలనే ధ్యేయంగా కాంతి కమలాలు వికసిస్తున్నాయి. ప్రఖ్యాత బాంగ్లా రచయిత్రి తస్లీమా నస్రీన్, మూడు సంస్థల సంయుక్త ఆహ్వానంతో సుదీర్ఘ కాలం తర్వాత మాతృ భాషా సోదరులను కలవనున్నారు. భావప్రకటనా స్వేచ్ఛకు, మత విమర్శలకు సంబంధించి దక్షిణాసియాలో ఒక చెరగని ముద్ర వేసిన సాహస రచయిత్రిగా నిలిచారు. భావ ప్రకటన స్వేచ్ఛను ప్రోత్సహించే కేంద్రంలోని అధికార పక్షం ఆమెను బెంగాల్‌కు ఆహ్వానించింది.
తస్లీమా నస్రిన్ ఈ తరానికి తెలియకపోవచ్చు. స్త్రీవాద మానవ హక్కుల కార్యకర్త, వామపక్ష సభ్యురాలైన ఆమె నిజమైన లౌకకవాదానికి ప్రతీక. బాంగ్లాదేశ్‌లోని మైమన్సింగ్‌లోని ఆగస్టు 25,1962న ముస్లిం కుటుంబంలో ఆమె జన్మించిన ఆమె వృత్తిరీత్యా వైద్యులు అయినా, సాహిత్యంపై ఉన్న ఆసక్తితో పూర్తిస్థాయి రచయిత్రిగా మారారు. బాంగ్లాదేశ్‌లో బెంగాలీ హిందువులపై జరుగుతున్న దాడులతో సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితిని విశదీకరిస్తూ, ‘లజ్జ’(1993)పేరుతో నవల రాశారు. 1992లో బాబ్రీ కట్టడం కూల్చివేత అనంతరం బాంగ్లాదేశ్‌లోని మైనారిటీ హిందువులపై జరిగినా దాడులు, హింసను ఇతివృత్తంగా రాసిన ఈ నవల ఆమెను స్వదేశానికి దూరం చేసింది. ఈ పుస్తకం అక్కడ తీవ్ర వివాదాన్ని రేపింది.ఆమె ఇస్లాంను అవమానించిందని ఆరోపిస్తూ ముస్లిం ఛాందసవాద గ్రూపులు ఆమెపై ఫత్వాలు జారీ చేయడమే కాకుండా, ఆమె తలపై వెల కట్టాయి. భద్రతా కారణాలను చూపుతూ ఆ దేశ ప్రభుత్వం ఆ పుస్తకాన్ని నిషేధిం చింది.
ఆ పరిణామాలతో 1994లో ఆమె తన మాతృభూమిని వదిలిపెట్టవలసి వచ్చింది స్వీడన్, జర్మనీ, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో ప్రవాస జీవితం గడిపిన ఆమెకు స్వీడిష్ పౌరసత్వం కూడా ఉంది. కాగా ఆ తరువాత బాంగ్లాదేశ్‌లో ఏర్పడిన ఏ ప్రభుత్వమూ ఆమెపై గల నిషేధం ఎత్తివేతకు మొగ్గు చూపలేదు. బాంగ్లాదేశ్‌లో రాజకీయ మార్పులు జరిగిన ప్రతిసారీ ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లాలని, అక్కడి ప్రజల మధ్య జీవించాలని ఆశిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం ఆమె న్యూయార్క్, ఢిల్లీలలో నివసిస్తూ భారత ప్రభుత్వ దీర్ఘకాలిక ‘రెసిడెన్స్ పర్మిట్’ ద్వారా ఇక్కడే కొనసాగుతున్నారు.
భారతదేశ సంస్కృతితో గల అనుబంధంతో తస్లీమా 2004లో కోల్‌కతాలో నివాసం ఏర్పరచు కున్నారు. అయితే, ఆమె ఆత్మకథ ‘ద్విఖందితో’పై తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో, ఆమె కోల్‌కత్తాను వీడవలసిందిగా 2007లో అప్పటి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆదేశించింది. అల్లరి మూకలపై చ•ర్యలు తీసుకోవాల్సింది పోయి, వారిని శాంతింప జేయడానికి రాత్రికి రాత్రే కోల్‌కతా నగరం విడిచి వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇది స్పష్టమైన రాజకీయ తూష్టీకరణకు నిదర్శనమని విమర్శకులు, హక్కుల కార్యకర్తలు అప్పట్లో తీవ్రంగా ఖండించారు. కోల్‌కతాను వీడి తస్లీమా ప్రభుత్వ రక్షణలో ఢిల్లీలో నివసిస్తూ వచ్చారు. తమ వ్యాఖ్యలు, రచనల ఫలితంగా మతాధికారుల నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొని, దేశాన్ని వీడినా సామాజిక మాధ్యమం, వ్యాసాల ద్వారా మహిళా హక్కుల కోసం తన గళాన్ని వినిపిస్తూనే ఉన్నారు.సొంతగడ్డలోని మైనారిటీలపై దాడులు, మహిళలపై హింసాత్మక సంఘటనలను చోటు చేసుకున్నప్పుడు వాటిని ప్రపంచానికి ఎత్తి చూపడంలో దూరంగా ఉండి కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆమె భౌతికంగా బాంగ్లాదేశ్‌కు దూరంగా ఉండడంతో స్థానికులు ఒక బలమైన సంస్కర్త సేవలను నేరుగా అందుకోలేకపోవడం కొరతేనని విశ్లేషకులు అంటున్నారు. పితృస్వామ్య వ్యవస్థ, మత మౌఢ్యానికి వ్యతిరేకంగా అంత ధైర్యంగా మాట్లాడే మరో గళం లేదని, ఆమె ఆ దేశంలోనే ఉండి ఉంటే, క్షేత్రస్థాయిలో మహిళా హక్కుల పోరాటాలకు పెద్ద దిక్కుగా ఉండేవారనే అభిప్రాయమూఉంది. అదే సమయంలో ఆమె ప్రాణ రక్షణ దృష్ట్యా, దేశంలో తీవ్రమైన ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉండటం కోసం ఆమె దూరంగా ఉండటమే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా స్థానికులు భావిస్తున్నారు.‘ఆమె స్వదేశానికి తిరిగి వస్తే ఆమె ప్రాణాలకే కాకుండా, ఆమె మద్దతుదారులకూ తీవ్ర ముప్పు ఉంటుంది. ఆమె చేసే తీవ్ర విమర్శ వల్ల దేశంలో మతపరమైన ఘర్షణలు, అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉంది. కనుక ఆమె దూరంగా ఉండటమే శాంతిభద్రతల పరంగా మంచిది’ అని ప్రభుత్వాలు భావించాయి
తస్లీమా చేసిన సాహసోపేత రచనలు, వాక్ స్వాతంత్య్ర పోరాటానికి గాను •••రోపియన్ పార్లమెంట్ నుండి ప్రతిష్టాత్మక ‘సఖరోవ్ బహుమతి’, ఫ్రాన్స్ ప్రభుత్వ మానవ హక్కుల పురస్కారం,ఆనంద పురస్కారం వంటి అనేక అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తస్లీమా దాదాపు 19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత, ఆగస్టు1,2026 న కోల్‌కతాలో జరిగే ‘మత ఛాందసవాద వ్యతిరేక సాహిత్య సదస్సు’లో పాల్గొనేందుకు రావడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ వేదికపై తాను ప్రసంగిచడంతో పాటు కవితలు చదవనున్నట్లు ఆమె సామాజిక వేదికగా తెలిపారు.‘సుమారు 19 ఏళ్ల తర్వాత ఒక స్వేచ్ఛా బెంగాల్‌కు తిరిగి వస్తున్నాను’’ అంటూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. తస్లీమా నస్రీన్ భారతదేశంలో ఎక్కడైనా పర్యటించేందుకు కేంద్ర ప్రభుత్వం నుండి పూర్తి అనుమతి, వీసా సదుపాయం ఉందని అధికారులు ధ్రువీక•రించారు. ఈ పర్యటన నేపథ్యంలో ఆమె భద్రతకు సంబంధించి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం తగిన రక్షణ ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది.ఆమె కోల్‌కతాకు వస్తున్నప్పటికీ, మాతృభూమి బాంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్లే అవకాశాలు ప్రస్తుతానికి కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ప్రస్తుతం పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ సమీకరణాలు మారాయి. ఇన్నేళ్ల తరువాత ఆమె మళ్లీ కోల్‌కతాలో అడుగుపెడుతుండటం వెనుక కూడా రాజకీయ వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు. బీజేపీ వంటి పార్టీలు ఆమెను ‘‘తూష్టీకరణ రాజకీయాల’కు వ్యతిరేకం చిహ్నంగా చూపిస్తూ, వామపక్ష, తృణవ•ల్ కాంగ్రెస్ పార్టీల ఓటు బ్యాంకు రాజకీయాలను ఎండగట్టడానికి ఈ సందర్భాన్ని వాడుకుంటున్నాయంటున్నారు
మహిళా హక్కుల విషయంలో తస్లీమా ప్రధాన పోరాటాలు చేశారు. మతం పేరుతో స్త్రీలను నాలుగు గోడలకే పరిమితం చేయడాన్ని, వారి హక్కులను కాలరాయడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. కొన్ని మతపరమైన ఆచారాలు, చట్టాలు మహిళల స్వేచ్ఛను, హక్కులను హరించేలా ఉన్నాయని బలంగా నమ్ముతారు. తమ వివిధ సాహిత్య పక్రియల్లో స్త్రీల వేదనను, వారిపై జరిగే లైంగిక, మానసిక వేధింపులను నిర్భయంగా ప్రస్తావించారు. తన రచనల ద్వారా చైతన్య పరిచేందుకు ప్రయత్నించారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీని కేవలం ఒక వస్తువులా చూడడాన్ని ఆమె తప్పుపట్టారు. స్త్రీలకు ఆర్థిక స్వాతంత్య్రం, తమ శరీరంపై, జీవిత నిర్ణయాలపై పూర్తి హక్కు ఉండాలని పోరాడారు. పెళ్లి, సంసారం అనే బంధాల పేరుతో స్త్రీల స్వేచ్ఛను హరించ కూడదని ఆమె రాశారు. సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ సమాన హక్కులు కల్పించే లౌకిక చట్టాలు ఉండాలని ఆమె వాదించారు. మతపరమైన, వ్యక్తిగత చట్టాల వల్ల ..ముఖ్యంగా వివాహం, విడాకులు, ఆస్తి హక్కుల విషయంలో మహిళలకు అన్యాయం జరుగుతోందని, అందరికీ సమానమైన లౌకిక చట్టాలు ఉంటేనే మహిళలకు నిజమైన రక్షణ, ప్రాధాన్యత లభిస్తుందని తస్లీమా వాదిస్తారు.
భారత్‌లో బీజేపీ రాజకీయాలు, మహిళా హక్కుల విషయంలో తస్లీమా వైఖరి ఆసక్తికరంగా ఉంటుంది. మహిళల విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను స్వాగతించిన ఆమె, మరికొన్ని అంశాలపై భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముస్లిం మహిళలకు తీవ్ర అన్యాయంగా మారిన ‘త్రిపుల్ తలాక్’ పద్ధతిని చట్టవిరుద్ధం చేస్తూ నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గట్టిగా సమర్థించారు. మతం పేరుతో మహిళలపై జరిగే అణచివేతను అరికట్ట డానికి ఇది ఒక మంచి అడుగు అని అభిప్రాయ పడ్డారు. దేశంలో ‘ఉమ్మడి పౌరస్మృతి’ని తీసుకురావాలనే బీజేపీ ప్రభుత్వ యోచనకు మద్దతు ఇస్తున్నారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియం’ బిల్లు ఆమోదం పొందడం పట్ల హర్షం వ్యక్త చేశారు.
మహిళా హక్కులు అంటే.. ప్రాథమిక మానవ హక్కులే అని తస్లీమా గట్టిగా చెబుతారు. పురుషుడికి సమాజంలో లభించే స్వేచ్ఛ, గౌరవాలు మహిళకు కూడా దక్కాలని నిరంతరం వాదిస్తుంటారు.చట్టాలు మతం ఆధారంగా కాకుండా, మానవత్వం, రాజ్యాంగం ఆధారంగా ఉండాలని,రాజకీయాల్లో లేదా ప్రభుత్వ నిర్ణయాల్లో మతం ప్రమేయం ఏ మాత్రం ఉండకూడదని తస్లీమా అంటారు. మతపరమైన వివాహం, విడాకులు, ఆస్తి హక్కులు వంటి పర్సనల్ చట్టాలు స్త్రీలను వెనక్కి నెడుతున్నాయని వాదిస్తారు. అందుకే అందరికీ సమానమైన ఉమ్మడి పౌర స్మృతిని సమర్థిస్తారు. మహిళా హక్కులను మెరుగుపరిచే బీజేపీ నిర్ణయాలను అభినందిస్తూ, అదే సమయంలో దేశంలో మహిళల భద్రత, స్వేచ్ఛ విషయంలో ఇంకా పూర్తిస్థాయి మార్పు రావాలని ఆమె ఆశిస్తారు.
‘పితృస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, లౌకికవాదం, మానవ హక్కుల కోసం అంతర్జాతీయంగా అవగాహన కల్పించడం నా భవిష్యత్ ఎజెండాలో ముఖ్య భాగం. ఆరోగ్యం సహక రించినంత కాలం నా అనుభవాలను, సమాజంలోని రుగ్మతలను విశ్లేషిస్తూ రచనలు చేయడం ఆపను’ అని స్పష్టం చేస్తున్నారు. భవిష్యత్తులో అక్కడ మాతృదేశంలో భావప్రకటన స్వేచ్ఛకు అనుకూలమైన వాతావరణం ఏర్పడితే, అక్కడికి తిరిగి వెళ్లడమే ఆశయంగా తస్లీమా జీవిస్తున్నారు.

జయశ్రీ ఆచంట
సీనియర్ జర్నలిస్ట్