తెలుగు రాష్ట్రాల్లో విద్యాకుసుమాలను పూయించిన విజ్ఞాన గని, విశాఖపట్టణానికి గర్వకారణమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం, 2026 ఏప్రిల్‌ 26‌న శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంది. ఈ విశ్వవిద్యాలయం నాడు ఏర్పడటానికి ఎందరో కృషి చేశారు. ఆంధ్రరాష్ట్ర ఏర్పాటు, ఆంధ్ర విశ్వవిద్యా లయం స్థాపన ఆంధ్రుల ప్రధాన డిమాండ్లు, వారి కృషిని ఒకసారి స్మరించుకుందాం.

ఆంధప్రాంతం మద్రాసు రాష్ట్రంలో ఒక భాగంగా ఉండేది. దీనిని కాంపోజిట్‌ ‌మద్రాసు స్టేట్‌ అని పిలిచేవారు. ఈ రాష్ట్రంలో ఆంధప్రాంతం 58 శాతం విస్తీర్ణంలో, (రెండు కోట్ల జనాభా) రాష్ట్ర జనాభాలో 40 శాతంగా, భాషాపరంగా ఆలోచిస్తే తెలుగువారు 3వ స్థానంలో ఉండేవారు. కాని బెంగాలీలు, గుజరాతీలు, తమిళులతో పోలిస్తే ఆంధ్రులు చాలా వెనుకబడి ఉన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదు, వారిని ‘మద్రాసీలు’ గానే పిలిచేవారు.

1910 నాటి గణాంకాలు చూస్తే ఆంధ్రులు ఎంతటి నిరాదరణకు గురయ్యారో తెలుస్తుంది. రాష్ట్రంలో 31 కళాశాలలు ఉండగా, ఆంధ్రాలో 8 మాత్రమే స్థాపితమయ్యాయి. రాష్ట్రంలో 583 సెకండరీ పాఠశాలలుండగా 163 మాత్రమే ఆంధ్రాలో ఉన్నాయి. పారిశ్రామిక పాఠశాలలు 3800 ఉండగా ఆంధ్రాలో 400 మాత్రమే ఉండేవి. ఇంజనీరింగ్‌, ‌మెడికల్‌, ‌లా కాలేజీలు ఆంధ్రాలో ఒక్కటీ లేదు. ఆయా విద్యాసంస్థల్లో ప్రిన్సిపాల్‌, ‌హెడ్‌ ‌మాస్టర్లుగా ఆంధ్రేతరులే పని చేసేవారు. రాష్ట్ర రాజధాని అయిన మద్రాసులోనే అన్ని కళాశాలలు, పరిశ్రమలు స్థాపితమయ్యాయి.

గుంటూరులో జొన్నవిత్తుల గురునాధం ‘యంగ్‌మెన్‌ ‌లిటరరీ అసోసియేషన్‌’ ‌స్థాపించారు. దీనిలో చల్లా శేషగిరివారు, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య సభ్యులుగా వుండేవారు. వీరంతా పత్రికలకు వ్యాసాలు రాసి ఆంధ్రాలో విద్యాభివృద్ధి ఆవశ్యకతను, ప్రత్యేకాంధ్ర ఏర్పాటును ప్రచారం చేసేవారు. 1912 మే నెలలో నిడదవోలులో కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల 21వ సంయుక్త సమావేశాలు నిర్వ హించారు. దానితోపాటు ఆంధ్రసాహిత్య సమావేశం జరపాలని, ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వేమవరపు రామదాసు పంతులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో చర్చించారు.

1913లో బాపట్లలో ప్రధమాంధ్ర మహాసభ మే 20వ తేదీన బయ్యా నరసింహేశ్వర శర్మ అధ్యక్షతన జరిగింది. ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర తీర్మానం చేశారు. రెండవ సభ 1914 ఏప్రిల్‌లో విజయవాడలో న్యాపతి సుబ్బారావు అధ్యక్షతన, 3వ సభ విశాఖపట్నంలో 1915 మే నెలలో పానగల్‌ ‌రాజా పానుగంటి రామరాయణి అధ్యక్షతన జరిగింది.

1913 బాపట్ల ప్రధమాంధ్ర మహాసభలో ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయ ఆవశ్యకతను గూర్చి చర్చించారు. మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు భాషకు సరైన పరిగణన లేదని, తెలుగు పాఠ్య పుస్తకాలు పరిశీలించే సంఘ సభ్యులకు, పరీక్ష పేపర్లు దిద్దేవారికి కూడా తెలుగుభాష సరిగ్గా రాదని, మద్రాసు విశ్వవిద్యాలయంలో తెలుగు వారికి ప్రవేశం కష్టసాధ్యమని అనేకమంది సభ్యులు పేర్కొన్నారు. తెలుగువారి విద్యాభివృద్ధి కోసం, తెలుగు భాషాభివృద్ధి కోసం ప్రత్యేక ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని. ఇది ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర స్థాపనకు దారి తీయగలదని వారు భావించారు. భాషా ప్రయుక్తంగా విశ్వవిద్యాలయాలు ఏర్పాటుకావాలని వారు కోరారు. ఆంధ్రవిశ్వవిద్యాలయం ఏర్పాటు వీలుకాదని మద్రాసు ప్రభుత్వం సమాధానం ఇచ్చింది.

1925లో కొత్తగా ఏర్పడిన రెండవ కౌన్సిల్‌ ఆఫ్‌ ‌స్టేట్‌లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవశ్యకతను రామదాసు పంతులు వివరించారు. సరిగా అదే సమయంలో జస్టిస్‌ ‌పార్టీ తరుపున గెలిచిన శ్రీకాకుళానికి చెందిన అన్నపు పరశురామ్‌దాస్‌ ‌పాత్రో విద్యాశాఖ మంత్రి అయ్యారు. నాడు కాంపోజిట్‌ ‌మద్రాసు స్టేట్‌ ‌ముఖ్యమంత్రి సుబ్బరాయన్‌, ‌కుమార మంగళం తండ్రి అప్పటికే 1916లో మైసూర్‌ ‌విశ్వవిద్యాలయం, 1918లో ఉస్మానియా విశ్వవిద్యా లయం (హైదరాబాదు) స్థాపించడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయ ఏర్పాటుకు డిమాండ్‌ ‌పెరిగింది.

1917 ఫిబ్రవరిలో వేంకటపతిరాజు మద్రాసు శాసనసభలో ఒక తీర్మానం ప్రతిపాదిస్తూ మొదటి ప్రపంచ యుద్ధానంతరం తెలుగు జిల్లాలకు ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని, ఈ లోపుగా ఆంధ్రదేశంలో మరికొన్ని కళాశాలలూ, పాఠశాలలు స్థాపించాలని కోరారు. 1919, 1920ల్లో కూడా ఇలాంటి ప్రతిపాదనే వచ్చింది.

1920 అక్టోబర్‌ 15‌వ తేదీన మద్రాసు విశ్వ విద్యాలయ సెనేట్‌ ‌రాష్ట్రంలో మరికొన్ని విశ్వవిద్యాల యాలు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని, వీలైనంతవరకు ఈ విశ్వవిద్యాలయాలు భాషా ప్రయుక్తంగా ఉండాలని తీర్మానించింది. ప్రత్యేక ఆంధ్రవిశ్వవిద్యాలయం స్థాపించాలని కోరుతూ విశాఖపట్టణానికి చెందిన సభ్యుడు సూర్యనారాయణ శాసనమండలిలో తీర్మానం ప్రతిపాదించారు. కాని కొందరు తమిళ సభ్యులు వ్యతిరేకించారు. చివరకు తీర్మానం 1921 సెప్టెంబరు 2వ తేదీన శాసన మండలి ఆమోదం పొందింది, కానీ విద్యామంత్రి ఎ.పి.పాత్రో మద్రాసు యూనివర్శిటీ పునర్‌ ‌వ్యవస్థీకరణ బిల్లును ప్రవేశపెట్టారు. ఇది ఆంధ్రా యూనివర్శిటీ ఏర్పడకుండా పన్నిన పన్నాగమని పలువురు సభ్యులు భావించారు.

తరువాత నాలుగేళ్ల కాలవ్యవధిలో ఆంధ్ర విశ్వ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన బిల్లు శాసనమండలిలో ప్రవేశపెట్టి, సెలక్ట్ ‌కమిటీకి నివేదించారు. ఈ కమిటీలోని రాయలసీమ సభ్యులు తమ ప్రాంతాన్ని ఆంధ్ర విశ్వ విద్యాలయ పరిధి నుండి తొలగించాలని కోరారు. బళ్లారి జిల్లాను మినహాయించమని సత్యమూర్తి కోరారు. ఈ సవరణలన్నీ వీగిపోయాయి. కె.వి.రెడ్డి  నాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి బదులుగా తెలుగు విశ్వవిద్యాలయంగా వ్యవహరించాలని సవరణ ప్రతిపాదించగా, అది రెండు ఓట్ల తేడాతో వీగి పోయింది. చివరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం 1926 ఏప్రిల్‌ 26‌న బెజవాడలో ప్రారంభమయ్యింది.

ఈ విశ్వవిద్యాలయ నిర్వహణకు 33మంది సభ్యులతో సెలెక్ట్ ‌కమిటీని ఏర్పాటుచేశారు. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు జిల్లాలకు ప్రాతినిధ్యం వహించే ఈ విశ్వవిద్యాలయానికి కట్టమంచి రామలింగారెడ్డి (సి.ఆర్‌.‌రెడ్డి) ప్రధమ వైస్‌ ‌ఛాన్సలర్‌గా నియమితు లయ్యారు. భాషాపరంగా పేరు పెట్టిన భారత దేశంలోని ప్రథమ విశ్వవిద్యాలయం ఇదే. ఇక్కడ తెలుగు, కన్నడ, ఒరియా మొదలైన ప్రాంతీయ భాషలలో బోధన, పరీక్షల నిర్వహణకు అనుమతిం చారు.

విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయం ఏర్పాటు గురించి వివాదం నెలకొంది. 33మంది సభ్యులలో 20మంది వేరు వేరు పట్టణాలను సమర్థిస్తూ భిన్నా భిప్రాయాలను ప్రతిపాదించారు. చివరకు 1929లో వ్యవస్థాపక వైస్‌ ‌చాన్స్‌లర్‌ ‌సర్‌.‌సి.ఆర్‌.‌రెడ్డి కృషి ఫలితంగా వైజాగ్‌ ఈ ‌గొప్ప విద్యాకేంద్రానికి వేదికగా ఎంపికైంది. సి.ఆర్‌.‌రెడ్డి స్థానంలో 1931లో డా।। సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‌వైస్‌ ‌ఛాన్స్‌లర్‌గా నియమితు లయ్యారు. ఆయన 1931 జూలైలో ‘‘కాలేజ్‌ ఆఫ్‌ ఆర్టస్’’‌ను ప్రారంభించారు. ప్రారంభ కోర్సులుగా తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, ఆర్థిక శాస్త్రం, రాజనీతి శాస్త్రం ప్రారంభించారు. ఒక ఏడాది తర్వాత జైపూర్‌ ‌రాజా విక్రమ దేవవర్మ ఆర్థిక సహాయంతో, 1932 జూలై 4న కాలేజ్‌ ఆఫ్‌ ‌సైన్స్ అం‌డ్‌ ‌టెక్నాలజీ, భౌతిక, రసాయన శాస్త్ర శాఖలు ప్రారంభిం చాడు.1955లో సివిల్‌, ‌మెకానికల్‌, ఎలక్ట్రికల్‌ ‌విభాగాలతో ఆంధ్రాయూనివర్శిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఇం‌జనీరింగ్‌ ‌స్థాపితమైంది.

ఆంధ్ర విశ్యవిద్యాలయ చట్టంలో విశ్వవిద్యాలయ పాలనా విభాగాలు విజయవాడలో ఏర్పరచాలని, రాజమండ్రిలో బోధనాశాఖలు ఏర్పరచాలని నిర్ణయమైంది. కానీ ఈ నిర్ణయం అనుచితమని గమనించిన ప్రభుత్వం బోధనాశాఖలను కూడా విజయవాడకు మార్చడం ఉచితమని విశ్వవిద్యాలయ సెనేట్‌కు సిఫార్సు చేసింది. దీనితో వివాదం మొదలైంది. రాయలసీమ సభ్యులు విశ్వవిద్యాలయం తమ ప్రాతంలో ఉండాలని పట్టుబట్టారు. వారి అభిప్రాయాన్ని మన్నించి అనంతపురం విశ్వవిద్యా లయ కేంద్రంగా ఉండాలన్న ప్రతిపాదనను ఆంధ్ర విశ్వవిద్యాలయం సెనేట్‌ 35-20 ఓట్ల మెజారిటీతో ఆమోదించింది. మద్రాసు శాసన మండలి సెలక్ట్ ‌కమిటీ దీనిని అంగీకరించింది. వివాదం ముగిసినట్లే అనేవేళ, విశాఖ పట్నంలో విశ్వవిద్యాలయ కేంద్రంగా ఉండాలని అనేకమంది సభ్యులు ప్రతిపాదించిన మీదట  మద్రాసు రాష్ట్ర ముఖ్య మంత్రి డా।। సుబ్బరాయన్‌ ‌విశాఖపట్టణం విశ్వవిద్యా లయ కేంద్రంగాను, బోధనా విశ్వవిద్యాలయంగా కొనసాగాలని నిర్ణయించారు. చిత్తూరుకు చెందిన బొల్లిని మునిస్వామి నాయుడు రాయలసీమ ప్రాంతాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయ పరిధి నుండి తొలగించాలని సవరణ తీర్మానం ప్రతిపాదించగా దానిని ఆమోదించారు. రాయలసీమ జిల్లాలను తిరిగి మద్రాసు విశ్వవిద్యాలయ పరిధిలోనే ఉంచారు.

1937లో ఆంధ్ర మహా సభ రజతోత్సవ వేడుకలు కడప కోటరెడ్డి అధ్యక్షతన విజయవాడలో ప్రారంభమయ్యాయి. దానిలో ప్రారంభ ఉపన్యాసం హాలహర్వి సీతారామిరెడ్డి చేశారు.ఆయన మాట్లా డుతూ రాయలసీమ ప్రజలకుగల అనుమానాలను నివృత్తి చేస్తేగాని ఆంధ్రరాష్ట్ర సాధనకు సహకరించలేమని తేల్చే శారు. దానితో ఆంధ్ర, రాయలసీమ నాయకుల మధ్య విభేదాలు  ప్రారంభమ య్యాయి. వాటిని తొలగించడానికి 1937 నవంబరు 16న కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు నివాసమైన శ్రీభాగ్‌లో సమావేశమై చర్చించి ఒక అంగీకారానికి వచ్చారు. దీనిని శ్రీభాగ్‌ ఒడంబడిక అని పిలుస్తారు. దీని ప్రకారం ఆంధ్ర విశ్వవిద్యాలయ పర్యవేక్షణలో రెండు కేంద్రాలు వాల్తేరు, అనంతపురంలలో నెలకొల్పాలి. ఆంధ్రుల మధ్య సాంఘిక, సాంస్కృతిక సమన్వయం సాధించాలి. అందుకుగాను కళాశాలలను స్థాపించాలని నిర్ణయించారు. 1939లో రెండవ ప్రపంచయుద్దం ప్రారంభమవ్వడంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.

రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1939-45) ముఖ్యంగా జపాన్‌ ‌బాంబు దాడుల భయంతో ఆంధ్ర విశ్వ విద్యాలయ భవనాలను 1942 ఏప్రిల్‌ 16 ‌న మిలటరీ అవసరాల కోసం సైన్యం స్వాధీనం చేసుకున్నది. ఆ సమయంలో తరగతుల నిర్వహణకు అంతరాయం కలుగకుండా ఉండేందుకు విశ్వవిద్యా లయాన్ని గుంటూరు తరలించారు, కాని కెమిస్ట్రీ శాఖను మాత్రం మద్రాసులోని ప్రెసిడెన్సీ కాలేజికి మార్చారు.1945లో యుద్ధానంతరం ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని  విశాఖకు తరలించారు. నాటి నుండి ఈ విశ్వవిద్యాలయం నిరాటంకంగా కొనసాగుతోంది.

ఆంధ్ర విశ్వకళా పరిషత్‌కు ఎంబ్లమ్‌ను  కేతు రామమోహన శాస్త్రి తయారుచేశారు. ఎంబ్లమ్‌లో ‘తేజస్వినావధీతమస్తు’ అంటే మమ్మల్ని తేజోవంతులుగా చేయుము. సముద్రం, తామర పువ్వులు దానిపై ఉదయించే సూర్యుడు, ఆ కిరణాలు తామరపువ్వు పుష్పంపై పడుతున్నట్లుగా రూపొందిం చిన ఈ చిహ్నం చాలా అర్థవంతమైనది. దానికి రెండు ప్రక్కల నాగుపాములు ఉం టాయి. సముద్రం జ్ఞానానికి ప్రతీక. కలువ చదువుల తల్లి కూర్చునే ఆసనం, కిరణాలు అక్కడ బోధించే వివిధ బోధనాంశాలు. నాగులు జ్ఞాన పరిరక్షకులు.

నేడు 450 ఎకరాలలో 215 భవనాలతో 76 సమావేశ మందిరాలతో, 58 విభాగాలలో 16 పరిశోధనా కేంద్రాలతో 20 వేల మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. సుమారు 59 దేశాల నుండి వేయిమంది విద్యార్ధులు చదువుకుంటు న్నారు.  నాక్‌ ఎ‌క్రిజేషన్‌లో ఆంధ్రాయూనివర్శిటీ ‘ఎ++ గ్రేడ్‌ను పొందింది. ఈ విద్యా ప్రాంగణానికి ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలు న్నాయి.

ఆంధ్రాయూనివర్శిటీ శతాబ్ది దార్శనిక పత్రం (2026-2126)ను విడుదల చేసింది. 1926లో స్థాపించిన ఈ సంస్థను ఆవిష్కరణ, పరిశోధన, సుస్థిర అభివృద్ధిలో ప్రపంచ అగ్రగామిగా మార్చడంపై దృష్టి సారిస్తుంది. కాంపస్‌ ‌వారసత్వ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం. ‘‘100 పేటెంట్ల సేకరణ కార్యక్రమాన్ని’’ ప్రారంభించడం, డిజిటల్‌ ‌బోధనా పద్ధతి మెరుగుపరుచు కోవడం, పరిశ్రమ, విద్యాసంస్థల భాగస్వామ్యంను పెంపొం దించడం, సామాజిక బాధ్యతను ప్రోత్సహించడం దీని ముఖ్య లక్ష్యాలు.

‘‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట

ఎంత పరిమళమోయి ఈ తోట పూలు

ఏ అమృత హస్తాలు ఏ సురలు తాకిరో

ఏ అచ్చెరల మెరుపులీ తీరు దిద్దిరో

ఈ పూల తీరులో ఇంత తీయదనము

ఈ లతల పోకిళ్ల కింత వయ్యారము’’.

కందుకూరి రామభద్రరావు చెప్పినట్లు ఈ విశ్వవిద్యాలయంపై పాటలా విరాజిల్లుతోంది.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor