ఆర్‌ఎస్‌ఎస్‌-100

హల్దేకర్‌జీ సైద్ధాంతిక కాంతిపుంజం. వారి కాంతి మనకు సదా దిశా దర్శనం గావిస్తుంది. సంఘకార్యంలోనే జీవించేవారికి మరణముండదు. ఎందుకనగా సంఘకార్యమే వారి జీవనంగా ఉండినది కనుక. వారిది యుగానుకూల ఆలోచన. వారు వాస్తవ రూపంలో అత్యంత ఆధునికులు.

సంఘకార్యంలో మృత్యువే విశ్రాంతి అని హల్దేకర్‌జీ తరచూ చెబుతుండేవారు…  ఇదే విధంగా వారు వారి జీవితపు అంతిమ ఘడియవరకు సంఘకార్యంలోనే నిమగ్నమై ఉన్నారు. వారు సదా స్పూర్తిప్రదాత, నిరంతర చలనశీలి. ఒకసారి తృతీయవర్ష సంఘ శిక్షావర్గలో శిక్షక్‌గా 58 నిమిషాలపాటు ఆగకుండా గణసమత తీసుకున్నారు. ఆనాడు అంతసేపు ఆగకుండా సమత తీసుకోవటం విశేషంగానే కనిపిస్తుంది. అయినా అంతసేపు అలసిపోకుండా గణసమత తీసుకోవటం హల్దేకర్‌జీ కార్యక్షమతను, సమర్థతను గుర్తుచేసుకుంటే ఇప్పటికీ ఆశ్చర్యమనిపిస్తుంది. గుండెకు లబ్‌డబ్‌ ‌శబ్దం ఎటువంటిదో సంఘ శాఖకు దక్ష-ఆరమ అటువంటివని చెబుతుండేవారు.

హల్దేకర్‌జీ సంఘటన వ్యవస్థను నియమబద్ధంగా తీర్చిదిద్దారు. వారు ఎక్కడికి వెళ్లినా కొత్త వ్యక్తుల్ని పరి చయం చేసుకొని వారిని సంఘకార్యంలోకి తీసుకొచ్చేవారు.  వ్యవస్థపట్ల పూర్ణ సమర్పిత వ్యక్తిత్వం వారిది. వ్యవస్థలో భాగంగా ఏదేని నిర్ణయం జరిగితే ఆ నిర్ణయంపట్ల వారెప్పుడూ వ్యతిరేకతను, అసంతృప్తి భావనను వ్యక్తంచేసేవారు కాదు. కార్యకర్తలు తమ తోటి అభిప్రాయాలు చెబుతుంటే పూర్తి ధ్యానమగ్నులై మందస్మిత సహనంతో వినడం వీరి ప్రత్యేకత. స్థానిక కార్యకర్తలు తీసుకున్న నిర్ణయాలను సమ్మతించడంలోనే విశిష్ఠత కనిపిస్తుంది. వారు అనారోగ్యంగా మంచం మీదుండి చికిత్స పొందుతున్నపుడు, జ్యేష్ఠ ప్రచారక్‌గా వారు క్షేత్రస్థాయి కార్యకర్తలను పిలిపించుకొని, కార్యకర్తలలో దోషాలను ఎలా సరిచేయాలో చర్చించేవారు. ఈ పక్రియలో ఒక్కొక్కసారి కంటతడి పెట్టేవారు. ఆర్ద్రతతో విషయ ప్రస్తావన ఉండేది. దోషాలను సరిచేసే చక్కటి వ్యవస్థకోసం పరితపించేవారు.

హల్దేకర్‌జీకి తమ కింద పనిచేసే ప్రచారకులపై సంపూర్ణ విశ్వాసం ఉండేది. అందువల్ల సంఘకార్యం విషయంలో వాళ్లకు సంపూర్ణ స్వేచ్ఛ నిచ్చేవారు. ఎప్పుడైనా, ఏదైనా పొరపాటు జరిగినా తీవ్రంగా పరిగణించేవారు కాదు. బైఠక్‌లలోనే ఆ విషయం ప్రస్తావనకు తెచ్చి మార్గదర్శనం చేసేవారు. అది కూడా వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి కాకుండా అందరికీ వర్తించే విధంగానే చేసేవారు. ప్రచారక్‌ ‌లేక సంఘ కార్యకర్త తన గ్రహణశక్తితో, అనుభవంతో సంఘ పని ఎలా చేయాలనే విషయం స్వయంగానే తెలుసుకోగలుగుతాడని వారు భావించేవారు. ఈ సందర్భంలో స్వర్గీయ దాదారవు పరమార్ధ్ ‌గారిని ఉదహరిస్తుండేవారు. కొత్తగా తమిళనాడుకు ప్రచారక్‌గా వచ్చిన ఒకరు దాదా రావ్‌జీని సంఘ పని ఎలా చేయాలో చెప్పండని అడిగాడట. అప్పుడు దాదారావుజీ ‘‘నీకు ఏం చేయాలో తెలుసుగదా? ఎలాచేయాలో అదే తెలుస్తుంది – చేస్తూపో’ అన్నారట. బహుశా దాదారావుజీ చెప్పిన ఈ సమాధానమే హల్దేకర్‌జీకి మార్గదర్శకమై ఉంటుంది.

సంఘకార్యానికి మూలాధారం సంపర్కమే. అందువల్ల నిరంతరం స్వయంసేవకులను కలవటానికి హల్దేకర్‌జీ ఎక్కువ ప్రాముఖ్యమిచ్చేవారు. స్వయంసేవకుల కుటుంబాల్లో జరిగే శుభ, అశుభ కార్యాలన్నిటికీ వారు తప్పక హాజరయ్యేవారు. అక్కడికి వచ్చే బంధువులందరితో పరిచయాలు చేసుకుని వాళ్లతో కలిసిపోయేవారు. ఆ సంఘటనలను వారెప్పుడు మర్చిపోయేవారు కాదు. శాఖకు కొత్త స్వయంసేవక్‌ ఎవరైనా వచ్చినట్లయితే ఇంట్లో శిశువు పుట్టినప్పుడు కుటుంబసభ్యులందరూ ఆ శిశువును చూసి ఆనందించినట్లుగా మన నిత్యశాఖలో ఎవరైనా కొత్తగా శాఖకు వస్తే అదేవిధంగా మనం ఆనందిస్తాము. అతనితో పరిచయం పెంచుకుంటాము అని అభివర్ణించేవారు. ఇంట్లో కొత్తగా పుట్టిన శిశువుపట్ల ఎంత శ్రద్ధ తీసుకుంటామో సంఘశాఖకు కొత్తగా వస్తున్న స్వయంసేవక్‌ ‌పట్ల కూడా అంతే ప్రేమ, ఆప్యాయతతో తప్పకుండా శ్రద్ధ తీసుకోవాలని వారు కోరేవారు. స్వయంసేవకుల పట్ల వారు చూపించే ఆత్మీయ ప్రేమానురాగాలు అనిర్వచనీయం.

సామాజికంగా చాలా సంస్థలు ప్రారంభమవుతుంటాయి. ఒకటి రెండు కార్యక్రమాలు ఉత్సాహవంతంగా ప్రారంభిస్తారు. కార్యాలయం ప్రారంభం చేస్తారు.  తరువాత కార్యక్రమాలు చల్లబడుతాయి. ఎందుకు ఆగిపోయిందంటే నిధులు లేవంటారు. మన శాఖలు 1925 నుండి నడుస్తున్నాయి. ఒకవేళ శాఖ ఆగిందంటే ముఖ్యశిక్షక్‌ ‌బదిలీ అయితే బహుశా ఎపుడైనా శాఖ ఆగవచ్చు.  తిరిగి ఎవరో ఒకరు ప్రారంభం చేస్తారు. కానీ నిధులు లేవు, శాఖ ఆగిపోయింది అనే పరిస్థితి మనకు రాదు అంటుండేవారు. శాఖ పనికి డబ్బుతో పనేముంది. ధ్వజముంటే పెడతాము లేకపోతే ధ్వజస్థానం శుభ్రం చేసి దానికే ప్రణామ్‌ ‌చేస్తాము. ఆడుకుంటాము, పాడుకుంటాము అని స్వయంసేవకులకు ఉద్బోధ చేసేవారు. హల్దేకర్‌జీ ఆదర్శ స్వయంసేవక్‌. ‌తన సంపూర్ణ జీవితాన్ని డాక్టర్జీ, గురూజీలు కలలుకన్న రాష్ట్ర కార్యానికి అంకితం చేసారు. వీరు సంఘ దీక్షాపరుడిగా జీవించారు. ఏ కోణం నుంచి దర్శించినా వీరి నిస్వార్థసేవ ఎంతోమందికి ప్రేరణనిస్తోంది. ఆయనే  శ్రీరామచంద్ర సదాశివ హల్దేకర్‌జీ. వారు క్షేత్ర ప్రచారక్‌ ‌బాధ్యతల నుంచి విముక్తులైనా చివరిశ్వాస వదిలేవరకు రకరకాల పనులను చేపట్టి అనేకమంది స్వయంసేవకులకు అహర్నిశలు మార్గదర్శనం చేస్తూనే వచ్చారు.

ఆత్మీయతకు ప్రతిరూపం హల్దేకర్‌జీ పుస్తకం నుండి

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.