జూలై 6.. జాతీయవాదం, నిస్వార్థ సేవా భావాలను ఆచరించే ఎంతోమందికి ఒక ప్రత్యేకమైన రోజు. ‘భారతమాత’ పట్ల అచంచలమైన అంకిత భావానికి, ధైర్యసాహసాలకు శాశ్వత నిదర్శనంగా నిలిచిన డాక్టర్‌ ‌శ్యామ్‌ ‌ప్రసాద్‌ ‌ముఖర్జీ 125వ జయంతిని మనం ఈ సందర్భంగా స్మరించుకుంటు న్నాము. ఆధునిక భారతదేశంలో మేధస్సు, ప్రజాసేవ,  నైతిక నిబద్ధతల అద్భుత కలయికకు డాక్టర్‌ ‌శ్యామ్‌ ‌ప్రసాద్‌ ‌ముఖర్జీలా నిలిచిన నాయకులు చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారు. యువ శ్యామ్‌ ‌ప్రసాద్‌ ‌సురక్షితమైన, సుఖవంతమైన జీవితాన్ని సులభంగా అందించగల పరిస్థితులలో జన్మించారు. ఆయన తండ్రి సర్‌ అశుతోష్‌ ‌ముఖర్జీ తన కాలంలోని అగశ్రేణి విద్యావేత్తలలో, మేధావులలో ఒకరు. అయినప్పటికీ విధి ఆయన ముందు విశేషాధికారాల మార్గాన్ని ఉంచినప్పటికీ, ఆయన మనస్సాక్షి ఆయనను త్యాగం, జాతీయసేవ వైపు నడిపించింది. వలసవాదం, మతతత్వం, మానవతా సవాళ్లు ఇంకా మరెన్నో విషయాలలో తన కాలంలోని కల్లోలాలకు తాను మౌన ప్రేక్షకునిగా ఉండలేనని ఆయన దృఢంగా విశ్వసించారు. ఈ ప్రయాణంలో ఆయన పసిబిడ్డను, ఆ తర్వాత భార్యను కోల్పోవడం వంటి తీవ్రమైన వ్యక్తిగత విషాదాలను చవిచూశారు. అయినప్పటికీ ఈ విషాదాలు ఆయన సంకల్పాన్ని మరింత బలపరిచి, సేవ చేయాలనే ఆయన అచంచలమైన నిబద్ధతను దృఢపరిచాయి.

డాక్టర్‌ ‌శ్యామ్‌ ‌ప్రసాద్‌ ‌ముఖర్జీ ప్రజా జీవితాన్ని అన్నింటికంటే మిన్నగా నిర్వచించిన ఆదర్శం ఏదైనా ఉందంటే అది భారతదేశ సమగ్రత. దేశ విభజన సమయంలో తలెత్తిన సంక్షోభ పరిస్థితుల్లోనూ, పశ్చిమ బెంగాల్‌ ‌భారతదేశంలో అంతర్భాగంగానే ఉండేలా చూడటంలో ఆయన దృఢంగా నిలిచారు. కొన్నేళ్ల తర్వాత అదే దృఢ విశ్వాసం ఆయనను జవ్మ కాశ్మీర్‌ ‌వైపు నడిపించింది. కారాగారవాసం ఆయన సంకల్పాన్ని సడలించలేదు. ఏకాంతవాసం ఆయనను కుంగదీయలేదు. ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే ఆయన పోరాడారో, వారికి దూరంగా, నిర్బంధంలోనే ఆయన జీవితం అకస్మాత్తుగా ముగిసింది. ఒక వ్యక్తి చేసే అంతిమ త్యాగం రాజకీయాలకు అతీతంగా నిలిచి, జాతీయ స్మృతిలో శాశ్వత స్థానాన్ని సంపాదించుకుంటుంది. డాక్టర్‌ ‌ముఖర్జీ చివరి ప్రయాణం అటువంటి ఘట్టమే. తనకు నమ్మకం ఉన్న ఒక ఆశయం కోసం డాక్టర్‌ ‌ముఖర్జీ తన ప్రాణాలను త్యాగం చేశారని ఆచార్య వినోబా భావే పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్నో ఏళ్లకు, 2019లో ఆర్టికల్‌ 370, 35() ‌రద్దు కావడం అనేది ఆయన త్యాగానికి అత్యంత సముచితమైన నివాళిగా నిలిచింది.

డాక్టర్‌ ‌ముఖర్జీ భారతదేశానికి, భారతీయ విలువలకు ప్రథమ స్థానం ఇచ్చారు. ఆనాటి సాంప్రదాయ ఆలోచనా విధానాలను ధిక్కరించే సంస్థలను నిర్మించడం, వ్యవస్థలను పెంపొందిం చడం ద్వారా ఆయన దీనిని సాధించారు. ఆయన కలకత్తా విశ్వవిద్యాలయానికి అతి పిన్న వయస్కుడైన వైస్‌ ‌ఛాన్సలర్‌ అయ్యారు. తనదైన ప్రత్యేక శైలిలో, ఆయన దేశభక్తితో కూడిన, భవిష్యత్‌ ‌దృష్టితో కూడిన సానుకూల మార్పులను తీసుకువచ్చారు. విద్యావేత్తల సదస్సులో ప్రసంగిస్తూ ‘‘కాబోయే గుమాస్తాలను, తక్కువ జీతాలు పొందే సిబ్బందిని ఉత్పత్తి చేసే కర్మా గారాలుగా విద్యా సంస్థలను చూడటం సరికాదు. పురపాలక సంస్థలు, కేంద్ర, రాష్ట్ర చట్టసభల వంటి మన స్వయం పరిపాలనా సంస్థలకు నాయకత్వం వహించగల, అలాగే ఆర్థిక, వాణిజ్య, పారిశ్రామిక రంగాల వంటి వివిధ రంగాలలో వ్యవహారాలను నడిపించగల సామర్థ్యం ఉన్న విద్యార్థులను మనం తయారు చేయాలి’’ అని ఆయన అన్నారు.

ఆయన నాయకత్వంలో కలకత్తా విశ్వ విద్యాలయం గ్రంథాలయ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, విజ్ఞాన శాస్త్రాలలో పరిశోధనను ప్రోత్సహించడం, పురావస్తువుల అధ్యయనాన్ని ప్రోత్స హించడం, వ్యవసాయంలో కోర్సులను స్థాపించడం వంటి విశిష్టమైన ప్రయత్నాలను చేపట్టింది. ఆయన క్రీడలు, ఉపాధ్యాయ శిక్షణ, విద్యార్థుల సంక్షేమం వంటి రంగాలపై దృష్టి సారించారు. విద్యార్థులు,  పూర్వ విద్యార్థులలో ఆత్మ గౌరవ భావాన్ని నింపడా నికి, జనవరి 24వ తేదీని విశ్వవిద్యాలయ వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకునే ఆచారాన్ని ప్రారంభిం చారు. విశ్వవిద్యాలయం కోసం ఒక పాటను రచించమని ఆయన గురుదేవ్‌ ‌టాగోర్‌ను కోరారు.

ఆయన జీవితం తర్వాతి దశలో ‘భారతీయ జనసంఘ్‌’‌ను స్థాపించాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనలోని ఆ స్ఫూర్తికి మరో ఉదాహరణ కనిపిస్తుంది. కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధిపత్యం సర్వవ్యాప్తమై ఉన్న ఆ కాలంలో, మన సాంస్కృతిక వ•లాలకు కట్టుబడి ఉంటూనే భారతదేశ ప్రగతి కోసం గళమెత్తే ఒక ప్రత్యామ్నాయ శక్తి అవసరం ఎంతైనా ఉందని ఆయన భావించారు. ఆ పార్టీకి ‘దీపం’ (మట్టి ప్రమిద) చిహ్నంగా ఉండటం ఎంతో సముచితం. ఒక చిన్న దీపం చూడటానికి సామాన్యంగా అనిపించి నప్పటికీ, తన పరిధిని దాటి ఎంతో దూరం వరకు చీకటిని పారదోలే శక్తి దానికి ఉంటుంది. జనసంఘ్‌ ‌తన క్రియాశీలక కాలంలోనూ, ఆ తర్వాత కూడా సరిగ్గా అదే పనిని చేసింది.

భారతదేశపు మొట్టమొదటి పరిశ్రమల, సరఫరాల శాఖ మంత్రిగా డాక్టర్‌ ‌శ్యామ్‌ ‌ప్రసాద్‌ ‌ముఖర్జీ పదవీకాలం, అభివృద్ధిపై ఆయనకున్న అవగాహన, అసాధారణమైన సమగ్రత, మానవతా దృక్పథం కలిగిన ఒక రాజనీతిజ్ఞుడిని వెల్లడిస్తుంది. కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశానికి గౌరవాన్ని, అవకాశాలను, విశ్వాసాన్ని పునరుద్ధరించే సాధనంగా ఆయన పరిశ్రమను చూశారు. ఆయన సంపద సృష్టిని, విలువ జోడింపును గౌరవించారు. దామోదర్‌ ‌వ్యాలీ కార్పొరేషన్‌, ‌సింద్రీ ఫెర్టిలైజర్‌ ‌ప్లాంట్‌ ‌వంటి మార్గదర్శకమైన కార్యక్రమాలు, పటిష్టమైన పారిశ్రామిక విధానం ద్వారా ఆధునిక పారిశ్రామిక భారతదేశానికి పునాదులు వేస్తూనే, భారతదేశపు సాంప్రదాయ బలాలు నిర్లక్ష్యం కాకుండా ఆయన ఏకకాలంలో చూసుకున్నారు. చేనేత, కుటీర పరిశ్రమలు, కళాకారులు, వస్త్ర కార్మికులు ఆయనలో అంతే నిబద్ధత కలిగిన సమర్థకుడిని కనుగొన్నారు.

ఇక్కడ నేను ఒక వ్యక్తిగత అనుభవాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. స్వయంసమృద్ధి అనే స్పష్టమైన లక్ష్యంతో డాక్టర్‌ ‌ముఖర్జీ స్థాపించడానికి కృషి చేసిన సింద్రీ ప్లాంట్‌ను దశాబ్దాల తరబడి దేశాన్ని పాలించిన వారు విస్మరించారు. దాని పునరుద్ధరణలో తోడ్పడే అవకాశం మా ప్రభుత్వానికి లభించడం నాకు ఎంతో గౌరవంగా అనిపిస్తోంది. ఆ కార్యక్రమానికి హాజరు కావడం నిజంగా నాకు అత్యంత ప్రత్యేకమైన క్షణాలలో ఒకటిగా నిలిచింది.

భారతదేశ నాగరిక సంప్రదాయం ఎప్పటినుంచో సంభాషణలను, చర్చలను ప్రోత్సహిస్తూ వస్తోంది. డాక్టర్‌ ‌ముఖర్జీ ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలిచారు. తొలిదశలో దేశ నిర్మాణ కార్యం రాజకీయ విభేదాలకు అతీతమైనదని విశ్వసించి ఆయన పండిట్‌ ‌నెహ్రూ మంత్రివర్గంలో చేరారు. ఆయన చిత్తశుద్ధితో, నిర్మాణాత్మక స్ఫూర్తితో సేవ చేశారు. కానీ, జాతీయ ప్రాముఖ్యత గల ప్రశ్నలకు భిన్నమైన మార్గం అవసరమని భావించినప్పుడు, ఆయన గౌరవప్రదంగా పదవిని విడిచిపెట్టి, దేశానికి అవసరమని తాను భావించిన రాజకీయ కార్యకలాపాలకు నిండు మనసుతో అంకితమయ్యారు.

75 సంవత్సరాల క్రితం భావ ప్రకటనా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి అన్నట్టుగా మొదటి సవరణను పండిట్‌ ‌నెహ్రూ తీసుకువచ్చారు. దానిని తీవ్రంగా విమర్శించిన వారిలో ఒకరిగా డాక్టర్‌ ‌ముఖర్జీ ఉన్నారు. కాంగ్రెస్‌ ఏమి చేయగలదో ఆయన పూర్తిగా అర్థం చేసుకున్నారు. ఆయన అంచనా సరైనదని నిరూపితమైనది. 75 సంవత్సరాల క్రితం మొదటి సవరణను తీసుకువచ్చిన వారే 1975లో అత్యవసర పరిస్థితిని విధించారు. 50 సంవత్సరాల క్రితం 42వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చారు. ఇది మరోసారి ఉదార ప్రజాస్వామ్య విలువల వ•లాలపై దెబ్బకొట్టింది.

డాక్టర్‌ ‌ముఖర్జీ తన మానవతా ప్రయత్నాలతో కూడా ప్రత్యేక గుర్తింపు పొందారు. 1943లో బెంగాల్‌లో అత్యంత విషాదకరమైన కరవు సంభవించినప్పుడు బాధితులకు సేవ చేయడంలో డాక్టర్‌ ‌ముఖర్జీ పూర్తిగా నిమగ్నమయ్యారు. ప్రజలకు ఆహారం అందించడానికి అనేక క్యాంటీన్లు, సహాయ కేంద్రాలు తెరిపించేలా ఆయన చూశారు. ఒకవైపు తన ప్రజల దుస్థితి చూసి ఆయన తీవ్రంగా చలించిపోగా, మరోవైపు వలస పాలకుల సున్నితత్వం లేని వైఖరి ఆయనకు తీవ్ర అసహ్యం కలిగించింది. ఆయన ‘పంచాషెర్‌ ‌మన్వంతర్‌’ అనే పుస్తకాన్ని కూడా రాశారు, అందులో తన ఆవేదనను వ్యక్తం చేశారు. 1942లో మేదినీపూర్‌ను ఒక పెను తుపాను తాకినప్పుడు అక్కడ సాధారణ పరిస్థితులను పునరుద్ధరించడానికి ఆయన చేసిన ప్రయత్నాలు విస్తృతంగా ప్రశంసలు అందుకున్నాయి.

కోల్‌కతాలోని ఒక కళాశాలలో యువతను ఉద్దేశించి ప్రసంగిస్తూ ‘‘మీరు ఏ పని చేపట్టినా, దానిని శ్రద్ధగా, క్షుణ్ణంగా, చక్కగా చేయండి. ఏ పనినీ సగంలో గానీ, అసంపూర్తిగా గానీ వదిలిపెట్టవద్దు. మీరు మీ అత్యుత్తమ కృషిని అందించేంత వరకు సంతృప్తి చెందవద్దు’’ అని డాక్టర్‌ ‌ముఖర్జీ పిలుపునిచ్చారు.  భారతదేశం వికసిత్‌ ‌భారత్‌ ‌లక్ష్యం వైపు పురోగమిస్తున్న తరుణంలో, ఆయన గాఢంగా విశ్వసించిన బలమైన, ఐక్యమైన, ఆత్మవిశ్వాసం గల, కరుణామయమైన భారతదేశాన్ని నిర్మించడానికి ప్రతిరోజూ కృషి చేయడమే మనం ఆయనకు అర్పించగల అత్యుత్తమ నివాళి. నేటి యువతను చూసినప్పుడు వారు ఈ సందర్భానికి తగినట్లుగా నిలబడి, కచ్చితంగా అదే చేస్తారనే నమ్మకం నాకు ఉంది.

– ‌నరేంద్ర మోదీ,
భారత ప్రధానమంతి

About Author

By editor