కత్తి పడితే రుద్రమదేవి.. కలం పడితే మొల్ల.. పోరాడితే ఝాన్సీ లక్ష్మీబాయి.. రంగం ఏదైనా, సవాలు ఎంతటిదైనా.. తాము అనుకుంటే సాధించగలమని నాటినుంచి నేటివరకు నిరూపిస్తూనే ఉన్నారు మన మహిళలు. చరిత్రను మలుపు తిప్పిన ధీర వనితల స్ఫూర్తితో.. నేటి తరం మహిళలు సైతం ఎనలేని విజయాలు సాధిస్తున్నారు. ఆధునిక సమాజంలో అమ్మగానూ.. దేశ సరిహద్దుల్లో తుపాకీతో శత్రువును ఆపే సైనికురాలిగాను.. స్త్రీ రూపాంతరం చెందింది. తాను అబల కాదని నిరూపిస్తూ… అన్ని రంగాల్లోనూ తనదైన ముద్ర వేస్తోంది.

ఒకప్పుడు నాలుగు గోడల మధ్యే బందీ అయిన జీవితాలు.. కానీ ఈరోజు అంతరిక్ష నౌకలో మువ్వన్నెల జెండాను ఎగరేస్తున్న చేతులు.. అసలు మహిళలు లేని సమాజాన్ని ఊహించగలమా? ఒకవైపు కట్టుబాట్లు, మరోవైపు హేళనలు.. వీటన్నింటినీ అధిగమించి చరిత్ర పుటల్లో తమ సంతకాన్ని బలంగా లిఖించారు ఎందరో నారీమణులు. సావిత్రీబాయి ఫూలే అక్షర జ్ఞానం మొదలుకొని.. నేటి కార్పొరేట్‌ ‌ప్రపంచాన్ని శాసిస్తున్న మహిళా పారిశ్రామికవేత్తల వరకు.. సమాజ పునాదులనే మార్చేశారు.

మహిళల అభివృద్ధి లేనిదే ఏ దేశవ•, ఏ సమాజవ• ముందుకు సాగలేదు. ఒక బండి సజావుగా సాగాలంటే రెండు చక్రాలు సమానంగా ఉండాలి. దేశ జనాభాలో సగంగా ఉన్న మహిళలు ఇంట్లోనే ఉండిపోతే, దేశ ప్రగతి ప్రశ్నార్ధకమౌతుంది. సగభాగం మానవ వనరులను వాడుకోనట్లే అవుతుంది. మహిళలు చదువుకుని, ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేసినప్పుడు కుటుంబ ఆదాయంతో పాటు స్థూల దేశీయోత్పత్తి కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఒక అమ్మాయికి చదువు చెబితే, ఒక తరానికి చదువు చెప్పినట్లు. ఒక స్త్రీకి విద్యనందిస్తే ఒక దేశానికే విద్యనందించినట్లవు తుంది. విద్యావంతురాలైన తల్లి తన పిల్లల చదువు, క్రమశిక్షణ, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. దీంతో భావితరాలు మరింత తెలివైనవిగా, బాధ్యతాయుతమైనవిగా తయారవుతాయి.

మహిళల ఆరోగ్యం, పోషకాహారంపై పెట్టుబడి పెట్టిన దేశాల్లో శిశు మరణాలు తగ్గి, ఆరోగ్యకరమైన మానవవనరులు పెంపొందుతాయి. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం, తద్వారా దేశం ఆరోగ్యంగా ఉంటుంది. భారతీయ సంస్కృతిలో స్త్రీకి ఎప్పుడూ ఉన్నత స్థానం ఉంది. అయితే, ఆధునిక కాలంలో వారిని ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బలోపేతం చేయడం ఎంతయినా అవసరం. మహిళల అభివృద్ధి లేనిదే దేశ అభివృద్ధి సాధ్యం కాదు.  ఒక మహిళ సంపాదిస్తే, ఆ కుటుంబ జీవన ప్రమాణాలు పెరుగుతాయి. మహిళలకు అవగాహన పెరిగితే, కుటుంబంలో ఆరోగ్యం, పరిశుభ్రత మెరుగవుతాయి. ఇది దేశంలో శిశు మరణాల రేటును తగ్గించి, ఆరోగ్యకరమైన మానవ వనరులను అందిస్తుంది.

నేటి మహిళ

నేడు మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్నారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌ ‌పదవుల నుంచి దేశ అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ప్రధానమంత్రి వరకు మహిళలు సమర్థవంతంగా రాణిస్తున్నారు. ఒకప్పుడు పురుషులకే పరిమితం అనుకున్న సైన్యం, వైమానిక దళం, నౌకాదళంలో మహిళలు ఫైటర్‌ ‌పైలట్లుగా, కమాండర్లుగా దేశ సరిహద్దులను కాపాడుతున్నారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌, ‌మంగళయాన్‌ ‌వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల వెనుక ఎందరో మహిళా శాస్త్రవేత్తల మేధస్సు ఉంది. పి.వి. సింధు, మిథాలీ రాజ్‌, ‌మీరాబాయి చాను వంటి వారు అంతర్జాతీయ వేదికలపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామీణ మహిళలు, స్టార్టప్‌ల ద్వారా పట్టణ మహిళలు ఆర్థిక విప్లవాన్ని సృష్టిస్తున్నారు.

ప్రభుత్వ సహకారం

నారీశక్తిని మరింత బలోపేతం చేయడం కోసం గడచిన పన్నెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. ఆడపిల్లల రక్షణ, విద్యను ప్రోత్సహించడానికి ‘బేటీ బచావో – బేటీ పఢావో’, మహిళా పారిశ్రామికవేత్తలకు సులభంగా రుణాలను అందించడానికి ‘ముద్ర యోజన’, గ్రామీణ మహిళల ఆరోగ్య రక్షణ, ఉచిత గ్యాస్‌ ‌కనెక్షన్లు కోసం ‘ఉజ్వల యోజన’ వంటి పథకాలు అమలు చేస్తోంది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేం దుకు, చట్టసభల్లో రిజర్వేషన్లు అందుబాటులోకి తెచ్చేందుకు బిల్లు సిద్ధంగా ఉంది. మహిళల విద్య, ఆరోగ్యం, ఆర్థిక స్వాలంబన, రక్షణే ధ్యేయంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయి.

ప్రభుత్వ తోడ్పాటును మనం ప్రధానంగా నాలుగు విభాగాలుగా చూడవచ్చు. మహిళలు సొంతంగా వ్యాపారాలు చేయడానికి, ఆర్థికంగా ఎదగడానికి ప్రభుత్వాలు రుణ సదుపాయాలు, సబ్సిడీలను అందిస్తున్నాయి. మహిళా పారిశ్రామిక వేత్తలకు ఎటువంటి గ్యారెంటీ లేకుండా వ్యాపార రుణాలు అందిం చడం వీటిలో కీలకమైనది. ఈ పథకంలో ద్వారా మహిళల నేతృత్వంలోని స్టార్టప్‌లకు 10లక్షల నుండి కోటి రూపాయల వరకు రుణ సహాయం అందిస్తారు. గ్రామీణ, పట్టణ మహిళలను సంఘాలుగా ఏర్పరచి, తక్కువ వడ్డీకే రుణాలు లేదా వడ్డీ లేని రుణాలు అందిస్తూ, వారు సొంతంగా చిన్న తరహా పరిశ్రమలు లేదా వ్యాపారాలు చేసుకునేలా తోడ్పాటు నందిస్తున్నారు.

ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, బీడీ కార్మికులు, వృద్ధులకు ఆసరా పెన్షన్‌ ‌పథకం ద్వారా నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఆరోగ్య రక్షణ పథకం ద్వారా గర్భిణీలకు పౌష్టికాహారం, ఆడపిల్లల డ్రాపౌట్లను నివారించడానికి ప్రత్యేక మరుగుదొడ్లు, శానిటరీ పాడ్స్ ‌వంటివి అందిస్తు న్నారు. ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

కుటుంబంలో మహిళ

కుటుంబంలో మహిళలకు లభించే మద్దతు అనేది ఒక ఇల్లు ఆనందంగా ఉండడానికే కాదు, వారు మానసికంగా, ఆర్థికంగా, సామాజికంగా ఎదగడానికి కూడా చాలా కీలకం. ఉదయం నుంచి రాత్రి వరకు ఇల్లూ, పిల్లల బాధ్యతలు చూసుకోవడం లేదా ఉద్యోగం చేస్తూ ఇంటిని మేనేజ్‌ ‌చేయడం అంత సులువు కాదు. వారు చేసే చిన్న చిన్న పనులను గుర్తించి ఒక మంచి మాట మాట్లాడడం వారికి కొండంత బలాన్ని ఇస్తుంది. ప్రతి మహిళకూ సొంత ఆలోచనలు, ఇష్టాలు ఉంటాయి. వారి నిర్ణయాలకు గౌరవం ఇవ్వడం ముఖ్యం. కుటుంబంలో అందరూ కలిసి ఇంటి పనులను పంచుకుంటే వారిపై శారీరక ఒత్తిడి తగ్గుతుంది. పిల్లల చదువు, వారి అవసరాలను చూసుకోవడంలో తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు భాగస్వామ్యంతో పిల్లల పెంపకంలో తల్లికి కొంత విశ్రాంతి దొరుకు తుంది. మహిళకు పోషకాహారం, శారీరక ఆరోగ్యం పట్ల కుటుంబం ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. వారికి 35 సంవత్సరాలు దాటిన తర్వాత కనీసం ఆరు నెలలకు ఒకసారైనా సాధారణ ఆరోగ్య పరీక్షలు చేయించడం బాధ్యతగా తీసుకోవాలి. పెళ్లి లేదా ప్రసవంవంటి ముఖ్యమైన మార్పులు వచ్చినప్పుడు వారి కెరీర్‌ ఆగిపోకుండా, అవసరమైన భరోసాను కుటుంబమే ఇవ్వాలి. కుటుంబంలో మహిళను కేవలం బాధ్యతలు మోసే వ్యక్తిగా కాకుండా, సమాన భాగస్వామిగా చూసినప్పుడే ఆ బంధాలు మరింత బలపడతాయి.

కుటుంబంలో ఎందరు సభ్యులున్నా, అందరినీ ఒక తాటిపైకి తెచ్చేది మహిళే. ఎంతటి కష్ట సమయాల్లోనైనా కుటుంబ సభ్యులకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వడంలో వారు ముందుంటారు. పిల్లలకు కేవలం చదువు మాత్రమే కాదు, సమాజంలో ఎలా బతకాలి? ఇతరులను ఎలా గౌరవించాలి? అనే విలువలను, బాధ్యతాయుతమైన ప్రవర్తనను నేర్పే తొలి గురువు అమ్మే. ఆర్థిక వనరులను లోపాలు లేకుండా నిర్వహించడం మహిళలకు సహజంగా అబ్బిన కళ. సంపాదన తక్కువైనా, ఎక్కువైనా దానికి తగ్గట్టుగా ఇల్లు గడపడం, భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ఆమెకే సాధ్యం. తాను ఎదుగుతూ, తన కుటుంబానికి ఆర్ధికంగా సమాంతరంగా అండగా నిలబడటం నేటి మహిళ ప్రత్యేకత.

మార్పు అవసరమే

మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది, సమానత్వంతో జీవిస్తున్న దేశాలను మనం గమనిస్తే… ప్రపంచంలో కొన్ని దేశాలు మిగతా వాటి కంటే చాలా ముందున్నాయి. గ్లోబల్‌ ‌జెండర్‌ ‌గ్యాప్‌ ఇం‌డెక్స్ ‌నివేదికల ప్రకారం, మహిళల హక్కులు, భద్రత, విద్య, ఆర్థిక, రాజకీయ భాగస్వామ్యంలో కొన్ని అగ్రస్థానంలో ఉన్నాయి.

మహిళా సాధికారతలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఐస్లాండ్‌. ఇది ప్రపంచంలోనే మహిళలకు అత్యంత సురక్షితమైన, సమానత్వం కల దేశం. ఇక్కడ పురుషులతో సమానంగా మహిళలకు వేతనాలు ఇవ్వడం చట్టంలో ఒక భాగం. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం చాలా ఎక్కువ.

కార్పొరేట్‌ ‌కంపెనీల బోర్డులలో కనీసం నలభై శాతం మహిళలు ఉండాలనే చట్టం తెచ్చిన దేశం నార్వే. ఇక్కడ ప్రసవ సమయాల్లో తల్లిదండ్రులిద్దరికీ ఇచ్చే సెలవులు ప్రపంచంలోనే అత్యుత్తమంగా ఉంటాయి.

మహిళా విద్య, ఆరోగ్య రంగాల్లో ఫిన్లాండ్‌ అ‌గ్రస్థానంలో ఉంది. ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళా ప్రధానమంత్రి సనా మారిన్‌ ‌నేతృత్వంలో ఇక్కడ ప్రభుత్వం పనిచేసిన రికార్డు ఉంది.  మహిళలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం న్యూజిలాండ్‌. 1893‌లోనే మహిళలకు అంతటి ప్రాధాన్యతను కల్పించింది. జసిండా ఆర్డెన్‌ ‌వంటి మహిళా నాయకురాళ్ల నాయకత్వంలో ఈ దేశం మహిళా హక్కుల్లో ఆదర్శంగా నిలిచింది. స్వీడన్‌ ‌పార్లమెంట్‌లో దాదాపు సగంమంది మహిళలే. స్త్రీ, పురుష భేదం లేకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో ఈ దేశం ముందుంది.

మన దేశంలో కూడా సమాన పనికి స్త్రీ, పురుషులకు సమానమైన జీతం అందించడం, చట్టసభల్లో, నిర్ణయాలు తీసుకునే పదవుల్లో మహిళలకు ఎక్కువ స్థానాలు కేటాయించడం, రాత్రి వేళల్లో కూడా మహిళలు ఎలాంటి భయం లేకుండా తిరగగలిగేలా పూర్తి రక్షణ కల్పించడం, ఉద్యోగం చేసే మహిళలకు ప్రసవ సెలవులు, పిల్లల సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వమే కల్పించడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని అమలు చేసేందుకు ప్రయత్నించాలి.

కాగా, ఇప్పటికే భారతదేశం ఈ దిశగా అడుగులు వేస్తోంది. మహిళలు రాజకీయాల్లోకి, ఉన్నత పదవుల్లోకి వచ్చినప్పుడు సమాజంలో అవినీతి తగ్గి, ప్రజా సమస్యలపై మరింత సున్నితత్వంతో కూడిన నిర్ణయాలు, చట్టాలు వస్తాయి.

నారీశక్తి అనేది కేవలం ఒక నినాదం కాదు… అది దేశ వికాసానికి ఇంధనం. స్వామి వివేకానంద అన్నట్లు ఒక పక్షి ఒకే రెక్కతో ఎగరలేదు. అలాగే మహిళల స్థితి మెరుగుపడకుండా దేశ, ప్రపంచ సంక్షేమం సాధ్యం కాదు.

ప్రభుత్వాలు ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా… వాటిపై మహిళల్లో పూర్తి అవగాహన ఉన్నప్పుడే, సమాజంలో పురుషుల ఆలోచనా విధానంలో మార్పు వచ్చినప్పుడే నిజమైన మహిళా సాధికారత, దేశాభివృద్ధి సాధ్యమవుతాయి.

About Author

By editor