ఇం‌గ్లీషు సాహిత్య చరిత్రలో విక్టోరియన్‌ ‌యుగానికి (1837-1901) ఓ ప్రత్యేకత ఉంది. పారిశ్రామిక విప్లవం, నగరాభివృద్ధి శాస్త్రం పురోగతి (డార్విన్‌ ‌సిద్ధాంతం) సామాజిక సంస్కరణ, సామ్రాజ్యవాద విస్తరణ, వాస్తవికతావాదం (రియలిజమ్‌) ఈ ‌యుగం ప్రత్యేకత. బ్రోంటే సోదరీమణులు షెర్లాట్‌, ఎమిలీ, చార్లెస్‌ ‌డికెన్స్, ‌జార్జ్ ఎలియట్‌, ‌థామస్‌ ‌హార్డీ, ఆల్ఫ్రెడ్‌ ‌టెన్నిసన్‌, ‌బ్రౌనింగ్‌ ‌వంటి కవులు ఈ కాలంలోనే జన్మించారు. డార్విన్‌ ‌మానవ పరిణామ సిద్ధాంతం ఈ యుగం ప్రత్యేకత. అయితే నగరీకరణ, అధిక జనాభా, మురికి వాడలు, అసమానతలు, వ్యసనాలు, వ్యాధులు, (కలరా, మశూచి) అంటువ్యాధులు, వైద్య సదుపాయం కొరత, అకాల మరణాలు, అధిక సంతానం ఇలా ఎన్నో సమస్యలు ప్రజలను పీడించాయి. ముఖ్యంగా రవి అస్తమించని బ్రిటిష్‌ ‌సామ్రాజ్యం దీనికి మినహాయింపు కాదు.

ఇం‌గ్లండ్‌ ‌రాజధాని లండన్‌ ‌నగరం గుండా ప్రవహించే పొడవైన(346 కిలో మీటర్లు) నది థేమ్స్. ‌చారిత్రాత్మక లండన్‌ ‌నగరాన్ని విభజిస్తూ ఉత్తర సముద్రంలో కలిసే ఈ నదిపై టవర్‌ ‌బ్రిడ్జ్, ‌వెస్ట్ ‌మినిష్టర్‌ ‌ప్యాలెస్‌ ‌వంటి అనేక చారిత్రాత్మక కట్టడాలు ఉన్నాయి. అయితే 1858లో (గ్రేట్‌ ‌స్టింక్‌) అది గొప్ప దుర్వాసనలు వెదజల్లుతూ మురికి నీటి కాలువగా మారింది. ఆ దుర్గంధం భరించరానిదిగా ఉండడంతో, బ్రిటిష్‌ ‌పార్లమెంటునే మూసివేయాలనే పరిస్థితి వచ్చింది. 1858 వేసవిలో మానవ మల విసర్జితాలు, పారిశ్రామికవ్యర్థాలు, చచ్చిన జంతువులు, గుర్రాలు వేసిన పేడ, నూనెలు నేరుగా నదిలో కలవడంతో, వేడి వాతావరణం కారణంగా అవి కుళ్లిపోయి, దుర్వాసనకు దారితీసింది. నది దగ్గరగా వెళితే ప్రజలు వాంతులు చేసుకునేవారు. గంటల్లోనే మరణించేవారు. 1848లో ఇంగ్లాండులో కలరా వ్యాధి 53,000 మంది ప్రాణాలను బలిగొంది దానిలో 14,137 మంది లండన్‌లోనే మరణించారు.

పార్లమెంటు సభ్యులు హాంకీలు పట్టుకొని పార్లమెంటులో తమ వాదనలు వినిపిస్తూ, అందరూ కలిసి విక్టోరియన్‌ ‌మురిగినీటి వ్యవస్థకు నాంది పలికారు. దీనిపై ఎంతో సాహిత్యం వచ్చింది. లండన్‌వాసులు ఇప్పటికీ మురికిగా వున్న థేమ్స్‌నది నీటిని తాగడానికి, బట్టలు ఉతకడానికి ఉపయో గిస్తున్నారు.

కొత్త మురుగు నీటి కాలువకు నిధులు సమకూర్చేందుకు బెంజిమిన్‌ ‌డిస్రేలీ ప్రతిపాదించిన బిల్లును ప్రభుత్వం హడావిడిగా ఆమోదించింది. ఈ బిల్లు కేవలం 18 రోజుల్లోనే చట్టంగా మారింది. ‘‘పట్టణం నడి బొడ్డున ఒక ప్రాణాంతకమైన మురుగు కాలువ మంచి తాజా నది స్థానంలో ప్రవహిస్తున్నది. ప్లషింగ్‌ ‌టాయిలెట్‌ ‌వాడకం బాగా ప్రాచుర్యం పొంద డంతో పరిస్థితులు మరింత దిగజారి పోయాయి, సంపన్న కుటుంబాలవారు తమ మలం నేరుగా నదిలోనికి వదిలేసేవారు’’ అని చార్లెస్‌ ‌డికెన్స్ 1850‌లో తన నవల ‘‘లిటిల్‌ ‌డోరిట్‌’’‌లో ఈ పరిస్థితిని వర్ణించాడు. గాలిలోని దుర్వాసన కలరా వంటి వ్యాధులు వ్యాప్తికి కారణమని ఆ సమయంలో చాలామంది విశ్వసించారు. ఈ నమ్మకాన్ని ‘మియాస్మా సిద్ధ్దాంతం’ అని పిలుస్తారు. దాని సారాంశాన్ని ప్రొఫెసర్‌ ‌బూత్‌ 1844‌లో ‘‘గొడ్డు మాంసం’’ వాసన పీల్చడం ద్వారా ఊబకాయం వస్తుందని, అలా ఒక కసాయి వాని భార్యకు వచ్చిందని రాశారు. ఇది శాస్త్రీయమైనది కాకపోయినా ప్రజలు నమ్మేవారు.

స్టిఫెన్‌ ‌హాలిడే రాసిన ‘‘ది గ్రేట్‌ ‌స్టింక్‌ ఆఫ్‌ ‌లండన్‌’’‌లో థేమ్స్ ‌నదిలో పేరుకు పోయిన మురుగు నీరు, తద్వారా ఏర్పడి దుర్వాసన, ఆ సంక్షోభాన్ని పరిష్కరించడానికి చేసిన కృషిని ఇంజనీర్‌ ‌జోసఫ్‌ ‌బాజార్గెట్‌ ‌కథ వివరిస్తుంది. ఈ చారిత్రక సంఘటనను శానిటేషన్‌ ‌విప్లవంగా వర్ణిస్తారు. కోలీన్‌ ‌పేప్‌ ‌రచించిన ‘‘ది గ్రేట్‌ ‌స్టింక్‌’’ అనే పుస్తకంలో 9 అధ్యాయాలున్నాయి. ది గోల్డెన్‌ ‌డస్ట్ ‌మేన్‌, ఇన్‌గ్లోరియస్‌ ‌మడ్‌, ‌నైట్‌ ‌సాయల్‌, ‌రిమూవబుల్‌ ‌కాజెస్‌, ‌వైల్‌ ‌బాడీస్‌, ‌ది గ్రేట్‌ అన్‌వాష్‌, ‌ది పబ్లిక్‌ ‌కన్వీనియన్స్, ‌రెచ్చడ్‌ ‌హౌసేస్‌, ‌ది వీల్‌ ఆఫ్‌ ‌సూట్‌ అనే భాగాలుగా విభజించాడు.

1899లో ఇంగ్లండ్‌ ‌వచ్చిన చైనా రాయబారిని ‘లండన్‌ ఎలా ఉంది’ అని ఒక జర్నలిస్ట్ ‌ప్రశ్నించగా, “too dirty” అనడంతో ఈ నవల మొదలవుతుంది. మానవ మలాన్ని రాత్రిపూట సేకరించేవారు కాబట్టి దీనిని ‘నైట్‌ ‌సాయిల్‌’ అని పిలుస్తారు. దీనిని వ్యవసాయంలో సేంద్రియ ఎరువుగా వాడేవారు. దీనిని సభ్యోక్తిగా చెప్పేవారు.

చాలావరకు వ్యాధులు కుళ్లిపోయిన వృక్ష సంపద, కుళ్లిన శవాలు, మురుగునీరు కారణంగా లండన్‌లో కలరా వ్యాధి సోకినట్లు ప్రొ।।హెచ్‌.‌బూత్‌ 1844 ‌జూలైలో ది బిల్డర్‌లో రాశారు. దీనిపై ఓ సుదీర్ఘ చర్చ జరిగింది. ఎడ్విన్‌ ‌చాడ్విక్‌ ‘‌రిపోర్టు ఆన్‌ ‌ది శానిటరీ కండీషన్‌ ఆఫ్‌ ‌ది లేబరింగ్‌ ‌పాపులేషన్‌ ఆఫ్‌ ‌గ్రేట్‌ ‌బ్రిటన్‌’ (1800-1890)‌లో ఆవాసాల నుండి వచ్చే హానికరమైన వాసనలను తొలగించ డానికి ఇంటి డ్రైనేజ్‌ని మెరుగుపరచాలని వాదించాడు. •చాడ్విక్‌, ‘‌తాగునీటిని శుద్ధి చేయడం కంటే నివాసాల నుండి దుర్వాసనలను తొలగించడం చాలా ముఖ్యం’ అని పార్లమెంటరీ కమిటీకి వివరించాడు. లండన్‌ ‌వ్యర్థాల తొలగింపుకే ప్రాధాన్యం ఇచ్చాడు.

ప్రముఖ వైద్యుడు నీల్‌ ఆర్నాట్‌ (1788-1874) ‌రాయల్‌ ‌కమీషన్‌ ‌ఫర్‌ ఎం‌క్వైరింగ్‌ ఇన్‌స్టేట్‌ ఆఫ్‌ ‌లార్డస్‌లో మాట్లాడుతూ ‘‘ఆహారానికి ఉపయోగించే పదార్థాల కుళ్లిపోతున్న అవశేషాలు, మానవ శరీరాల నుండి వచ్చే మలినాలు ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా తయారవుతున్నాయని అన్నాడు. మురుగునీటి కాలువలపై నిర్మించిన ఇళ్లున్న ప్రాంతాలలోనే ఈ వ్యాధులు ఎక్కువగా సోకుతున్నట్లు వివరించారు.

1858 వేసవిలో థే•మ్స్ ‌నదిని, దాని మురుగు నీటి సరుకును ‘‘గొప్ప దుర్వాసన’’ అని పిలిచే స్థితికి చేరుకుంది. జూన్‌ 18, 1858‌న వార్తాపత్రికలో వచ్చిన ‘‘తీవ్రమైన వేడి మన శాసనసభ్యులను, నదికి ఎదురుగా గల వారి భవనాల నుండి తరిమికొట్టింది. కొంతమంది సభ్యులు ఈ విషయాన్ని దాని లోతుల వరకూ పరిశోధించడానికి మొగ్గుచూపారు. లైబ్రరీలోకి ప్రవేశించారు. కాని, వారు తక్షణమే వెనక్కి తగ్గారు. ప్రతీ ఒక్కరు ముక్కుకు రుమాలు కట్టుకున్నారు’’ అని వార్త రాశారు.

భారతీయులను అపరిశుభ్రమైన ప్రజలు (Dirty People) లేదా మృగతుల్యమైనవారు (Beastly people) అని వ్యాఖ్యానించిన ప్రముఖ బ్రిటిష్‌ ‌ప్రధాని విన్సటన్‌ ‌చర్చిల్‌ (I hate Indians they are with slit eyes and pig tails, they are beastly people with a beastly religion)  నేను భారతీయులను అసహ్యించుకుంటాను. వారిది మృగతుల్యమైన మతం.. వారు మృగతుల్యమైన ప్రజలు. 1943లో బెంగాల్‌లో కరువు వచ్చిన సందర్భంలో సాయం కోసం అర్ధించగా ‘‘భారతీయులు- కుందేళ్లులా పిల్లలను కంటున్నారు’’(Breeding like rabbits)  అని ఈసడించుకుని భారత్‌కు ఆహార సహాయాన్ని నిలిపివేశాడు. ‘‘భారతదేశానికి స్వాతంత్య్రం వస్తే అధికారం’’ తక్కువ స్థాయి వ్యక్తులు, పనికి రానివారి (Rascals, rogues and men of straw)  చేతుల్లోనికి వెళ్తుందని కూడా విమర్శించారు. అలాగే నల్ల జాతివారు, తెల్లజాతి వారంతటి సమర్థులు, పనిమంతులు కాదు (the black people were not as capable or as efficient as white people) అని అభిప్రాయపడ్డాడు.

వ్యాపారం కోసం భారతదేశానికి వచ్చిన బ్రిటిష్‌ ఈస్టు ఇండియా కంపెనీ ఇక్కడి సంస్థానాల అనైక్యతను, పాలకుల కలహాలను స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకుంది. ఆధునిక ఆయుధ పాటవంతోపాటు సంస్థానాలను ఒక్కొక్కటిగా జయిస్తూ సామ్రాజాన్ని విస్తరించింది. బ్రిటిష్‌ ‌పాలనలోని మూడు వ్యవస్థలు- సివిల• సర్వీసు, సైన్యం, పోలీసు శాఖలలో కీలకమైన పదవులకు భారతీయులకు అవకాశం ఇవ్వలేదు, తద్వారా వలస• దోపిడీలు నిరాటంకంగా కొనసాగించారు.

ఇండియన్‌ ‌సివిల్‌ ‌సర్వీసు చట్టం ద్వారా సివిల్‌ ‌సర్వీసుల్లో భారతీయులను ప్రవేశించకుండా ఆంగ్లేయులు ఆ పోటీ పరీక్షలను ఇంగ్లండులో నిర్వహించడం, పరీక్షలకు వయోపరిమితిలో తరచూ హెచ్చుతగ్గులు చేయడంలాంటి అనేక అవరోధాలు సృష్టించారు. సైన్యం విషయంలో భారతీయ రాష్ట్రాలను మార్షల్‌, ‌నాన్‌ ‌మార్షల్‌ ‌రాష్ట్రాలుగా విభజించి సైనిక ఉద్యోగాలకు ఆ రాష్ట్రాలవారినే ఎంపిక చేసేవారు. పైగా భారతీయులను సిపాయిలని, యూరోపియన్లను సోల్జర్స్ అని పిలిచేవారు. దానితోపాటు జీతభత్యాల వ్యత్యాసం ఉండేది.

ముఖ్యంగా పోలీసు విధులు జమీందారుల నిర్వహణ నుండి కారన్‌వాలీసు లాగేసుకున్నాడు. తద్వారా రెగ్యులర్‌ ‌పోలీసు వ్యవస్థకు నాంది పలికి గ్రామాలకు ఠాణాలను, ఠాణాకు దరోగా (పోలీసు అధికారిని) అనే అధికారిని నియమించాడు. పోలీసు వ్యవస్థ బ్రిటిష్‌ ‌సామ్రాజ్యాధికారులకు కొమ్ము కాస్తూ ఎక్కువగా భారతీయులను పీడించడమే పనిగా పెట్టుకుంది. స్వాతంత్య్రోద్యమకారులను, స్వాతంత్రోద్యమాన్ని కఠినంగా అణచి వేసేందుకు పోలీసు వ్యవస్థను ఒక పావుగా వాడుకుంది. బ్రిటిష్‌ ఇం‌డియా చరిత్రలో పాలనావ్యవస్థకు మూల స్తంభాలైన సివిల్‌ ‌సర్వీసు, పోలీసు, సైన్యం బ్రిటిష్‌ ‌సామ్రాజ్యవాదుల వలస విధానానికి అనుగుణంగా పనిచేశాయి.

భారత ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ పారిశ్ధ్యు ఉద్యమాన్ని2014 అక్టోబరు 2న (గాంధీ జయంతినాడు) ప్రారంభించారు. 2019 నాటికి బహిరంగ మలవిసర్జన రహిత (Open defecation free ODF) భారత్‌ను చూడటం కోసం 12 కోట్ల కంటే ఎక్కువ మరుగు దొడ్ల నిర్మాణంతో దేశంలోని ప్రజారోగ్యాన్ని మెరుగుపరిచేందుకు పని ప్రారంభించారు. పాఠశాలల్లో విద్యార్థులకు ప్రత్యేక మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. స్వచ్ఛతా హి సేవా (పరిశుభ్రతే సేవ) అనే నినాదంతో ఈ కార్యక్రమం ముందుకెళ్తున్నది.

ప్రతీరోజు స్నానం చేయడం, చేతులు కడుక్కోవడం ప్రాచీన భారతదేశం, శాస్త్రాలలో నొక్కి చెప్పిన విషయాలు. శౌచ్యము అంటే వ్యర్థాల నిర్వహణ. దీని గురించి కౌటిల్యుని అర్థశాస్త్రం పేర్కొన్నది. భగవత్‌ ‌గీత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ఒక దైవిక గుణంగానూ, తపస్సు రూపంగానూ కనిపిస్తుంది. ‘‘శౌచం స్ధైరమాత్మ వినిగ్రహః’’ (13.8 నుండి) శుచిత్వమునకు గీతాచార్యుడు ఎక్కువ ప్రాముఖ్యత నొసంగుచున్నాడు. బాహ్యాభ్యంతర శౌచము ముముక్షువుల కత్యావశ్య కము. బయట గల మురికి, లోపల (చిత్తమును) గల మురికి రెండింటిని కడిగి వేయవలెను.

ఆరోగ్యకరమైన జీవనశైలికి వ్యక్తిగత పరిశుభ్రత మొదటిమెట్టు. స్నానం చేయడం, పళ్లు తోముకోవడం, చేతులు కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం వంటి రోజువారీ అలవాట్లు అనారోగ్యాలను, ఇన్‌ఫెక్షన్‌లను నివారిస్తాయి. మనం శుభ్రంగా ఉన్నప్పుడు మనలో ఆత్మ విశ్వాసం, క్రమశిక్షణ , గౌరవం ఏర్పడతాయి.

మన పరిసరాలను, అంటే ఇళ్లు, పాఠశాలలు, కార్యాలయాలు, బహిరంగ ప్రదేశాలను శుభ్రంగా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. శుభ్రమైన వాతావరణం కీటకాలు, వ్యాధులను నివారించి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది, కాబట్టే పరిశుభ్రతను దైవత్వంతో సమానమని శాస్త్రాలు చెపుతున్నాయి. భారతదేశం దీనిని సనాతన కాలం నుండి అనుసరిస్తూ ఆరోగ్య భారతాన్ని ఇచ్చింది.

హరప్పా (సింధులోయ) నాగరికతలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థకు ప్రాధాన్యం ఇచ్చారు. సుమారు 4000 సంవత్సరాల నాడే పరిశుభ్రతకు పట్టణ ప్రణాళికలు ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చాయో ఇది తెలియజేస్తుంది. కాలువలను శుభ్రం చేయడానికి మేన్‌హోల్సును కట్టారు. ఈ డ్రైనేజీకి కాల్చిన ఇటుకలు, జిప్సం వాడారు. ప్రతీ ఇంటి కాలువను వీధిలోని ప్రధాన కాలువకు అనుసంధానించారు. ఇళ్లలో చిన్న సంపులుండి ఘనవ్యర్థాలు అక్కడే నిలిచిపోయి, నీళ్లు మాత్రమే కాలువల్లో వెళ్లేలాగా ఏర్పాటు చేశారు. ఈ డ్రైనేజీ వ్యవస్థ హరప్పా ప్రజలకు పరిశుభ్రత పట్ల ఉన్న అవగాహనను, వారి ఇంజనీరింగ్‌ ‌నైపుణ్యాన్ని తెలియజేస్తుంది.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor