‘‘గాలివానలో వాననీటిలో పడవ ప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం, ఇది హోరుగాలి అని తెలుసు, అది వరద పొంగు అని తెలుసు’’ స్వయంవరం సినిమా కోసం రాజశ్రీ రాశారు. సముద్రంలో ప్రయాణం చేస్తున్న నావికులకు ఈ పాటకు దగ్గర సంబంధం ఉంది. తీవ్రమైన వైపరీత్యాలు, అగ్నిప్రమాదాలు, నౌకలు మునిగిపోతాయేమో నన్న భయం, ఒంటరితనంతో కూడిన సుదీర్ఘ ప్రయాణాలను ఎదుర్కొంటారు. అకస్మాత్తుగా వచ్చే ప్రమాదాలు, నాచులో చిక్కుకు పోవడం (సర్గాసమ్ అల్గే అనే నాచు) వంటివి ఎదురవు తుంటాయి. 1492లో క్రిస్టోఫర్ కొలంబస్ అట్లాంటిక్ మహా సముద్రంలో అన్వేషణ చేస్తున్నప్పుడు తన బోటు నాచులో చిక్కుకు పోయి ఎన్నో కష్టాలు పడ్డాడు. ‘సర్గాసమ్’ మీద ప్లోరిడా యూనివర్శిటీ ప్రొఫెసర్‌లు గత 20 ఏళ్లుగా అధ్యయనం చేస్తున్నారు. అంతరిక్షంలోని శాటిలైట్ ద్వారా ఫొటోలు తీసి దీని పెరుగుదలను అంచనావేస్తూ నావికులను అప్రమత్తం చేస్తుంటారు..
భౌతిక విషయానికి వస్తే మానసిక శారీరక ఇబ్బందులు, యంత్రాల వైఫల్యం, అంతర్జాతీయ వివాదాల వల్ల వేరే దేశ జలాలలోకి ప్రవేశించి నప్పుడు నిర్బంధం, సముద్ర దొంగల భయం, తుఫాన్‌లో చిక్కుకుని ఓడలు విరిగి నాశనం కావడం వంటివి జరుగుతుంటాయి. టైటానిక్ కార్గోషిప్ ప్రమాదాన్ని దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
పూర్వం ఓడ ప్రయాణం అంటే సాహసయాత్ర కిందే లెక్క. ఇటువంటి సముద్ర ప్రయాణం గురించి, కట్టుబట్టలు కూడా లేకుండా ఒంటరిగా ఓ దీవిలో ఏళ్ల తరబడి బతకడం ఊహకు కూడా అందని విషయం. అలాంటి వాస్తవ సంఘటనల స్ఫూర్తితో బ్రిటిష్ రచయిత డానియల్ డెపో 1719లో రాసిన నవల ‘రాబిన్‌సన్ క్రూసో’. ఆ దీవిలో జీవితాన్ని క్రూసో మాటల్లోనే చెప్పిస్తారు రచయిత. రియలిస్టిక్ ఫిక్షన్‌కు నాంది పలికిన నవలగా దీన్ని పేర్కొంటారు.
పురాతన కాలంలో నావికులు సముద్ర ప్రయాణాల మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి, నౌకల మరమ్మతులకు, లేదా సరకులను మార్పిడీ చేసుకోవడానికి ఉపయోగించిన కొన్ని ముఖ్యమైన స్థావరాలు గుర్తించారు.
సోకోట్రా ద్వీపం: ఇది అరేబియా సముద్రంలో ఉంది. పురాతన రోమన్, భారతీయ, గ్రీకు, అరబ్ నావికులకు ఒక ప్రధాన విశ్రాంతి కేంద్రం. ఇక్కడ లభించే సుగంధ ద్రవ్యాలు, వనరుల కోసం నావికులు ఇక్కడ ఆగేవారు.
ద్వారక: ఇది శ్రీకృష్ణుని రాజధాని (యాదవ రాజ్యం). భారతదేశం పశ్చిమ తీరంలో ఉన్న పురాతన ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయి నప్పటికీ ఇది పూర్వం ఒక ప్రధాన ఓడరేవు. నావికు లకు ఆశ్రయం కల్పించే ప్రదేశం, అలాగే ఎలిఫెంటా గుహలు ముంబాయి దగ్గర ఉన్నాయి. ఇవి కూడా ఎందరో నావికులకు విశ్రాంతి కేంద్రంగా ఉపయోగ పడింది.
మహాబలిపురం: తమిళనాడు తీరంలో మునిగి పోయిన ఈ ప్రాంతంలోని దేవాలయాలు, రేవులు పురాతన తమిళ నావికులకు, పల్లవుల కాలం నాటి వ్యాపారులకు విశ్రాంతి స్థావరాలుగా ఉండేవని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. అలాగే కళింగపట్టణం, తామ్రలిప్త, ఎర్ర సముద్ర తీరాలు. ఈజిప్టులోని షెర్మ్-ఎల్.షేక్, హుర్ఘుదా, ఎల్.గునా వంటి ప్రాతాలు నావికులకు విశ్రాంతి కేంద్రాలుగా నిలిచాయి. సౌదీ అరేబియాలో జెడ్డా నగరం యెమెన్‌లో ‘‘అడెన్ గల్ఫ్’’ ఈ కోవలోనికే వస్తాయి.
అలెక్సాండ్రియా: ఈజిప్టులోని ఈ రేవు నగరం మధ్యధరా సముద్రంలో ప్రయాణించే నావికులకు ఓడల మరమ్మతులకు ప్రధాన కేంద్రంగా ఉండేది. ఆధునిక కాలంలో రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన పెరల్ హార్బర్ కూడా ఈ కోవలోనికే వస్తుంది. ఇంజన్లు లేని కాలంలో నౌకలు గాలులు ఆధారంగా ప్రయాణించేవి. గాలులు అనుకూలించే వరకు నావికులు ఆ రేవులలో ఆగుతూ ఉండేవారు. కొన్నిసార్లు నెలల తరబడి ఉండిపోయేవారు.
ఈజిప్టు రాజులైన ఫారోల కోసం నిర్మించిన సమాధులే పిరమిడ్లు. తమ రాజు మరణించిన తరువాత గౌరవంగా పరలోకానికి వెళతారని నమ్మేవారు. ఆహారం, బట్టలు, బంగారం… తదితర వస్తువులను సమాధుల్లో ఉంచి మూసేసే వారు. రాజుల శరీరాలు (మమ్మీలు) పాడవ్వకుండా లేపనాలు పూసి, నార, బెరడు చుట్టేవారు. దొంగల నుండి కాపాడుకోవడానికి చాలా ఎత్తుగా, బలమైన బండరాళ్లతో మూసేసేవారు. పిరమిడ్ లోపల కింగ్స్ చాంబరు, క్వీన్సు చాంబరు అని ప్రత్యేక గదులు ఉంటాయి.
ఇంగో స్ట్రాచ్ స్విట్జర్యాడ్‌లోని లౌసాన్ విశ్వవిద్యా లయంలో సంస్కృతం, బౌద్ధ అధ్యయనాల ప్రొఫెసర్. ఆయన భారతీయ శిలా శాసనాలు, బౌద్ధమత చరిత్ర, శాసనాల విశ్లేషణపై దృష్టి సారించారు. దక్షిణాసియా చరిత్రపై దృష్టి పెడుతూ, అందులో భాగంగా భారత దేశంలోని దైనందిన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి భారత్ సందర్శించారు. భారతదేశ సామాజిక చరిత్రపై ఆయన చేసిన కృషికి గుర్తింపు పొందారు. ఆయన మొదటి రచన ‘‘సోకోత్రాపై విదేశీ నావికులు’’ (Foreign Sailors on Socotra : The inscriptions and drawings from the cave HoQ)
భారతీయులు ప్రాచీన కాలం నుండి సుమారు 1300 సి.ఇ. వరకూ చారిత్రాత్మకంగా వారి పని తనపు అనుభవాలు, నైపుణ్యాలు, సామర్ధ్యాలు, సౌందర్య భావన, ఆలోచనలు, మత విశ్వాసాలు, భౌతిక వస్తువులు, శిల్పాలు, చిత్రలేఖనం, వాస్తు శిల్పాల సంప్రదాయ కళలలో మాత్రమే కాకుండా, వేదాలు, మానవ ధర్మశాస్త్రం మొదలైన లిఖిత రికార్డులను కూడా భద్ర పరిచారు. అందువల్ల వారు తమ భౌతిక, మేధో వికాసం సందేశాన్ని ఇతరులకు శాశ్వత మార్గంలో తెలియజేయడానికి సాధనంగా రాళ్లపై అక్షరాలతోపాటు గోడలపై వివిధ సంకేతాలు లేదా చిహ్నాలు, బొమ్మలు గీశారు. ఇవి సోమాలి యాకు ఈశాన్యంలో ఉన్న సోకోట్రా ద్వీపంలో ఇటీవల వెల్లడయ్యాయి.193 ఇండిక్ శాసనాలతో (2వ శతాబ్దం నుండి 5వ శతాబ్దం ప్రారంభం వరకు) మనలను అనుసంధానించ వచ్చంటారు చరిత్ర కారులు. ఇది పండితుల దృష్టిని ఆకర్షించింది.
దక్షిణాసియా ఉపఖండం మధ్యధరా ప్రపంచంతో పరస్పర చర్యలను అర్థం చేసుకొనే సందర్భంలో సోకోట్రా శాసనాల సముదాయాన్ని పరిగణనలోనికి తీసుకున్నారు. ఈ శాసనాలను భారతీయ నావికులు, వ్యాపారులు,పశ్చిమ హిందూ మహాసముద్రంలో సముద్ర వాణిజ్య కార్యకలాపాలలో పాల్గొన్న ఓడరేవుల భాగస్వామ్యాన్ని అర్థం చేసుకోవ డానికి కూడా అధ్యయనం చేశారు. సోకోట్రా నుండి వచ్చిన ఇండిక్ ఎఫిగ్రాప్‌లలో మతపరమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటిల్లో బౌద్ధ, వైష్ణవ, శైవ, ఇతర మతస్తులవారు ఉన్నారు. బౌద్ధ్దుల పేర్లు, బుద్ధ్దనందిన్, బుద్ధ మిత్ర, ధర్మ, సమగ్ర నాగిని, సంఘదిశ. ఇక వైష్ణవ నామాలు… విష్ణు, విష్ణుభత్తి, విష్ణుదత్త, విష్ణుసేన, విష్ణుపతి,విష్ణునిర్ధ్దా. శైవుల పేర్లు… శ్రీ శివగోష, శివమిత్ర, రుద్ర నందిన్, రుద్రదత్త, ఈశ్వర దాస. ఇక ఇతర నామాలకు వస్తే… శ్రయసింహ, స్కంద భూతి, స్కందమిత్ర, స్కంద, ఈశ్వరకాండ, కుమారసేన, భటో కుమార, ప్రాప్తి, ఆర్యంభూతి మొదలైన పేర్లు శాసనాలలో లభిస్తున్నాయి.
స్విట్జర్లాండ్‌లోని లౌసాన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ ఇంగోస్ట్రౌచ్, పారిస్‌లోని ఫ్రెంచ్ స్కూల్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ ప్రొఫెసర్ షార్లెట్ స్మిడ్‌తో కలిసి ఆయన ఈజిప్టు పిరమిడ్‌లపై అధ్యయనం చేశారు. ఇక్కడ పిరమిడ్‌లలోని సమాధులలో ఆరు తమిళ బ్రాహ్మీ రాతి శాసనాలు, ఆరు ప్రాకృత భాషలోను 18 ఇతర భారతీయ భాష శాసనాలను కనుగొన్నారు. ఇవి ప్రాచీన కాలంలో ప్రపంచ వాణిజ్య పటంలో తమిళులు ప్రధాన పాత్ర పోషించినట్లు రుజువు చేస్తున్నాయి.భారతదేశ సముద్రచరిత్రను తిరిగి రాసే సందర్భంలో, ఈజిప్టులో అత్యంత భద్రత గల రాజ సమాధుల లోపల 2000 సంవత్సరాల నాటి తమిళ, బ్రాహ్మీ శాసనాలను పరిశోధకులు గుర్తించారు.
పూర్వకాలంలోనే తమిళ వ్యాపారులు అన్వేషణ, పర్యాటకం కింద ఈజిప్టు అంతర్భాగంలోకి లోతుగా ప్రయాణించారని నిర్ధ్దారించే ఈ పరిశోధనలను 2026 ఫిబ్రవరి 11-14 మధ్య శిలాశాసనాలపై జరిగిన తమిళ ఎపిగ్రఫీ సదస్సులో ఎందరో పరిశోధకులు నిరూపించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన డా।। ఇంగో స్ట్రౌచ్ ‘‘సికై కొర్రాన్ వరకాంట’’లలో పిరమిడ్ శాసనాలతో కన్పించిందని వివరించారు. అంటే ‘‘సికై కొర్రాన్ వచ్చి చూశాడు’’ అని అర్థం అని పరిశోధకులు గమనించారు. పారిస్‌కు చెందిన చార్లెట్ స్కమిడ్‌తో పాటు డా।। ఇంగో స్ట్రౌచ్ Fro the Valley of kings to India – Indian Inscriptions in Egypt అనే పత్రాన్ని ఈ సదస్సులో సమర్పించారు. సముద్ర మార్గాల గురించి వివరించారు. మొదటి సముద్ర మార్గాన్ని భారత్ (గుజరాత్) నుండి పశ్చిమతీరం మీదుగా మధ్యధరా సముద్రంలో, రెండవ మార్గం దక్షిణ భారత్‌లోని కేరళ ప్రాంతం నుండి సముద్రంలో కలియడం. వ్యాపారులు ఎక్కువ కాలం ఈజిప్టులో ఉండేవారని, తీరానికి దూరంగా లోతట్టు వారసత్వ ప్రదేశాలను సందర్శించేందుకు సరదాపడేవారని పేర్కొన్నారు. సికై అంటే టఫ్ట్ లేదా కిరీటం, కొర్రాన్ అంటే నాయకుడు, ఆ వ్యక్తి ప్రారంభ చరిత్రా కాలంలోని వ్యాపార సంఘాలలో (గిల్డు) ముఖ్యమైన హోదా కలిగిన వ్యక్తి అని ఆయన అభిప్రాయపడ్డారు.
బెరానికే ఈజిప్టు దగ్గర ఎర్ర సముద్రం తీరంలోనిది (బెరానిస్ ట్రోగ్లోడియా) ఇక్కడ స్టీవెన్ సైడ్ బోధమ్ (డెల్ వేర్ విశ్వవిద్యాలయం) మారియాజ్డా (వార్సా విశ్వవిద్యాలయం) నేతృత్వంలో జరిగిన తవ్వకాల్లో బి.సి. 3 శతాబ్దం-సా.శ 6వ శతాబ్దం మధ్య మధ్యధరా సముద్రాన్ని భారతదేశం, ఆఫ్రికాతో అనుసంధానించే ఒక ప్రధాన ఓడరేవు అని వెల్లడైంది.సా.శ.2వ శతాబ్దం నాటి బుద్ధ విగ్రహం, సంస్కృత శాసనాలు, 17వ పౌండ్ల నల్లమిరియాలు, రోమన్-ఇండియన్ వాణిజ్యానికి సంబంధించిన విస్తృతమైన ఆధారాలు లభించాయి. పురాతన తూము శాసనాల ద్వారా ప్రారంభ సమాజాలు నీటి పారుదల, ప్రజా వనరులను ఎలా నిర్వహించాయో నమోదు చేస్తుంది.
అసలు ఈజిప్టులో పిరమిడ్లు ఎవరు నిర్మించారనే దానిని చూస్తే, గిజాలోని పిరమిడ్ల బేస్ వద్ద నిలబడితే ఈస్మారక చిహ్నాలు కనిపిస్తాయి.ఒక ఫారో (చక్రవర్తి) జీవితకాలంలో నిర్మించి ఉంటాడంటే నమ్మడం కష్టం. క్రీ।।పూ।। 5వ శతాబ్దంలో మొదటి పిరమిడ్ ఖుపు చక్రవర్తిపై నిర్మించినది.ఆ తరువాత2,700 సంవత్సరాలకు చరిత్రకారుడు హెరిడోటస్ సందర్శించాడు. ఈ పిరమిడ్‌పై పరిశోధించిన చికాగో విశ్వవిద్యాల ••నికి చెందిన మార్క్ లెహ్నర్, హవాస్ అనే శాస్త్రవేత్తలు, సుమారు 600 అస్థి పంజరాలను కనుగొన్నారు. వాటిలో కొన్ని ఈజిప్షియన్లవి కాగా, మరికొన్ని, పిరమిడ్ నిర్మాణ సమయంలో ప్రమాదవశాత్తూ మరణించిన కార్మికులవి. అక్కడి గోడలపై హైరోగ్లిఫిక్ లేదా చిత్ర లిపిలో (ఈజిప్టు వారి లిపి) పేర్లు రాసి ఉన్నాయి.భూగ•ర్భ,గుహల శాస్త్రజ్ఞులు పీటర్ డి-జోయిస్ట్ నాయకత్వంలో సా.శ. 2000 డిసెంబర్‌లో సోకోట్రా దీవిలోని హోక్ గుహలో జరిపిన పరిశోధనలో అనేక శాసనాలు, డ్రాయింగ్‌లు బయటపడ్డాయి. ఈ గుహ సుమారు 2.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. వీటిలో సుమారు 193 శాసనాలు భారతీయ నావికులకు చెందినవి ఉన్నాయి.ఈ శాసనాలన్నీ సాధారణ వ్యవహారిక భాషలో ఉన్నాయి. ప్రధానంగా సంస్కృతం లేదా బ్రాహ్మీలిపి, ప్రాంతీయభాష, కొన్ని శాసనాలు కలగలసిన భాషలో..మరీ ముఖ్యంగా ఖరోషి, ప్రాకృత భాషలలో ఉన్నాయి.శాసనాలు వేసిన వారి పేర్లు, ఇతర వివరాలు కూడా ఇచ్చారు. ఉదాహర ణకు శివఘోష పుత్ర రుద్ర నమ్ది ప్రతాప “Rudranandin son of Sivagosha arrived” (P-139) వారి మతాలు, వారి ఓడ నడిపిన నావికుని పేరు, వారు ఎక్కడ నుండి బయలు దేరినది ఓడరేవు పేరు ఉదాహరణకు (బోచ్ గుజరాత్) ‘‘బరుకచ్చ హస్తవకప్ర’’ (హతాబ్ గుజరాత్). ఈ శాసనాలను చదివేటప్పుడు ఎంతో శ్రద్ధతో పరిశోధన చేసి రాసినట్లుగా ఇంగోస్ట్రాచ్ తన గ్రంథ•ంలో రాసుకున్నాడు.
Sources:
1) The International Conference on Tamil Epigraphy held at Chennai from Feb 11 to 14th 2026.
2) Foreign Sailors on Socotra by Ingostrouch

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు