వ్యవసాయ ప్రధానమైన మన దేశంలో ఈ సంవత్సరంలో (2026) ఖరీఫ్ పంటకాలానికి రైతులందరు సాగుకు సమాయత్తమవుతున్నారు. ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో వేసవి ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగి జన బాహుళ్యానికి ఎండ వేడిమి ఎక్కువై సతమతమవుచున్నారు. వేసవి తాపంతోపాటు ఈ పంట కాలం (ఖరీఫ్)లో రుతుపవనాల ద్వారా వర్షపాతం సాధారణ సగటు వర్షపాతం, సాధారణ సగటు వర్షపాతం, సాధారణ స్థాయి కన్నా మిన్నగా ఉండదని వాతావరణ శాఖ ప్రాథమిక అంచనా. సాధారణ వర్షపాతం కన్నా మించి వర్షాలు రాకపోవటంవల్ల సాగు నీటికి కూడా కటకట పడవలసి వస్తుందనే నేపథ్యానికి తోడు యూరప్- గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న అనిశ్చితి పరిస్థితుల కారణంగా యూరియా, ఇతరముల సరఫరాలో కొంతమేరకు ఇబ్బందులు ఉండవచ్చని తెలిసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే తగిన చర్యలను తీసుకుంటూ ఖరీఫ్ సాగుకు రైతాంగాన్ని సంసిద్ధం చేస్తున్నది.
వ్యవసాయ రంగంలో సాగు క్రమంగా ముందుకు సాగుటకు ప్రధానమైనది పెట్టుబడి. ఆయా ప్రాంతాల్లో పంటల సాగుకు అనువైన నాణ్యమైన విత్తనాలు, సాంకేతిక పరిజ్ఞానం సాగునీరు, ఎరువులు, పురుగుమందులు, కోత తర్వాత సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలుచేయటం, దిగుబడులు వచ్చిన తర్వాత పంట ఉత్పత్తులకు తగిన మద్దతు ధరతో, పూర్తిగా పంట ఉత్పత్తులను సకాలంలో కొనుగోలు చేసి రైతులకు వచ్చే రాబడిని అందజేయటం ముఖ్యమైనవి. రైతులకు అవసరమైన పెట్టుబడుల కోసం ప్రధానమంత్రి కిసాన్ నిధి ద్వారా పలు విడతలుగా రైతులకు అందజేయబడుతుంది. అదేవిధంగా ‘కిసాన్ క్రెడిట్’ కార్డుల ద్వారా రైతులందరకు బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతోను, వడ్డీ రాయితీలతోను రుణాలు ఇచ్చుటకు ఏర్పాటు జరిగాయి / జరుగుతున్నాయి. నాణ్యమైన విత్తనాలు (పలు పంటల్లో), సేంద్రీయ ఎరువులు, రసాయనిక ఎరువులు, పురుగుమందులు తదితర ఉపకారణాలన్ని అందుబాటులో ఉండేవిధంగా ప్రభుత్వం పలు పథకాల ద్వారా చేపట్టడం జరిగింది. అదేవిధంగా రైతులందరికీ ప్రోత్సాహంగా, రాబోయే ఖరీఫ్ పంటల ఉత్పత్తులకు ముందుగానే కనీస మద్దతు ధరలను ప్రకటించి రైతులను ప్రోత్సహించటం జరుగుతుంది.
మారుతున్న పరిస్థితులను, యూరియా లాంటి ఎరువుల సరఫరా, మన అవసరాలకు అవసరమైన పంటల సాగును ఆయా వాతావరణం, నేలలను/ ప్రాంతాలను దృష్టిలో ఉన్న భిన్న వాతావరణ పరిస్థితుల్లో అనువైన పంటల సాగును చేపట్టి తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి రాబోయే ఖరీఫ్ పంటకాలంలో సాగుకు తగిన జాగ్రత్తలతో రైతులు ముందుకు సాగాలి.
పలు ప్రాంతాల్లో ఉన్న నీటి సౌకర్యాలను, నేలలను వాతావరణ పరిస్థితులను, అందుబాటులో ఉన్న సాగుకు అవసరమైన ఉపకరణాలను దృష్టిలో ఉంచుకొని, మన ఆహార అవసరాలను ఆ తర్వాత ఎగుమతికి అవసరం మేరకు ఆయా పంటలను భిన్న వాతావరణ పరిస్థితుల్లో, ఆయా పంటలకు ప్రాంతాలకు తగిన వ్యవసాయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి పంటల సాగును చేపట్టాలి.
పంటల మార్పిడి
ఆయా ప్రాంతాల్లో అనువైన పంటల సాగును మాత్రమే చేపట్టాలి. వరి, గోధుమ పంటల ప్రాధా న్యతే కాకుండా, మనకు సరిపడా అందుబాటు (ఉత్పత్తులు)లో లేనటువంటి, చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలు, నూనె గింజలు వాణిజ్య పంటలైన ప్రత్తి, చెరుకు ఇతరములను కూడా పరిగణించాలి. వరి సాగును నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే పరిమితం చేయాలి. నీటి సౌకర్యాలు బాగా ఉండి వరి తప్ప, ఇతర పంటల సాగు ఇంత నీరు అందు బాటులో ఉన్న ప్రాంతాల్లో సాగుకు వీలు లేకున్నపుడు మాత్రమే వరి సాగును చేపట్టాలి. అప్పుడే మనం తక్కువ పరిమాణంలో అందుబాటులో ఉన్న నీటిని ఇతరపంటలకు చిరుధాన్యాలు, అపరాలు (పప్పు ధాన్యాలు), నూనెగింజలు, సక్రమంగా వాడుకోవాలి.
చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజల్లో ఉత్పత్తులు మన అవసరాలకన్న తక్కువగానే సాగుచేస్తున్నాం. ప్రధానంగా నూనెగింజలు, పప్పుధాన్యాలు కొంతమేర దిగుబడులు చేసుకుంటు న్నందున విదేశీ మారకద్రవ్యం లక్ష కోట్లకు పైనే ఖర్చు పెడ్తున్నాము. మన ఆరోగ్య పరిరక్షణ, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయుటకు ఇతోధికంగా నూనె గింజలను, అపరాల సాగును గణనీయంగా పెంచవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఆరోగ్య పరిరక్షణకు, మంచి పోషక విలువలతో కూడిన చిరుధాన్యాల సాగును ప్రోత్సహించి ఆ ఉత్పత్తులను మన ఆహారంలో భాగం చేస్తే, పోషక విలువలతో కూడిన తగినంత ఆహార లబ్ధితో మన ఆరోగ్యం చక్కగా, మెరుగ్గా ఉంటుంది. ఈ పంటల సాగుకు ముఖ్యంగా చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజల తక్కువ నీరు అవసరం. వర్షాధారపు పంటగానే పలు ప్రాంతాల్లో సాగవుతుంది. ఆ విధంగా అపరాలు, నూనెగింజలు చిరుధాన్యాలను రసాయనిక ఎరువులను వాడకుండానే, సహజ సేంద్రియ ఎరువులతోనే మంచి దిగుబడులను ఇవ్వగలము.
రసాయన రహిత ఉత్పత్తులు ముఖ్యంగా సేంద్రియపు ఎరువులను ఉపయోగించి పండించే పంట ఉత్పత్తులను ఆదరణ క్రమేపి పెరుగుతున్నప్పటికి, అవసరానికి చాలినంతగా ఉత్పత్తి జరగటం లేదు గనుక, రసాయన రహిత ఉత్పత్తులను ఇతోధికంగా సాగుచేయవలసిన అవసరం ఉంది.
ప్రభుత్వం కూడా సహజ ఉత్పత్తుల సాగుకు (రసాయన రహిత) ప్రోత్సాహమిస్తూ, ‘ప్రకృతి వ్యవసాయాన్ని’ ఇతోధికంగా ప్రోత్సహిస్తుంది. ఆ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకుని ఆచరించుటకు తగిన సమయం ఇప్పుడు వచ్చింది. రసాయనిక ఎరువులైన (యూరియా లాంటివి) అందుబాటులో లేకపోయిన వాటి అవసరం చాలా పంటలవరకు ముఖ్యంగా చిరుధాన్యాలు, అపరాలు, నూనెగింజలు, ప్రత్తి, పసుపు, చెరకు, కూరగాయలు, పండ్లు (Spices & Cudiments) ఔషద, సుగంధ ద్రవ్యాలు ఇచ్చే పంటలకు లేదు. వాటి అవసరాలు సేంద్రియ ఎరువులతోను, సహజ వ్యవసాయ పద్ధతులతోనే సరిపోతాయి.
తక్కువ నీరు అందుబాటులో ఉండవచ్చని, యూరియా అందుబాటులో తక్కువగా ఉండవచ్చనే నేపథ్యంలో, ఇది మనకు అంది వచ్చిన అవకాశంగా భావించి తక్కువ నీటి వనరులతోను, (సహజ సేంద్రియ ఎరువులు) సహజ వ్యవసాయంతో మనం వైవిధ్య పరిస్థితుల్లో, ఆయా పరిస్థితుల్లో అనువైన పంటల సాగును ప్రోత్సహించి, ఇతోధికంగా సాగు చేసి, మంచి రసాయన రహిత ఉత్పత్తులను సాధించి, మన ఆరోగ్యసంరక్షణకు (ఆహారం ద్వారా) వీలు కల్పించాలి. ఈ విధంగా ఉత్పత్తులను ముఖ్యంగా నూనె గింజల్లో గనక సాధిస్తే, నూనెల దిగుబడి ఇతోధికంగా తగ్గి, తదనుగుణంగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. ఇంతవరకు మనం నూనెలను దిగుమతి చేసుకునే విదేశీ మారకద్రవ్యం విలువ లక్ష కోట్లకు పై మాటే. నూనె గింజల్లో ఉత్పత్తులను గణణీయంగా పెంచుటకు ప్రభుత్వం పలు పథకాల ద్వారా శ్రమిస్తూ ఉంది. ఇప్పుడు సదవకాశాన్ని అందిపుచ్చుకుని, వరి, గోధుమలే కాకుండా ఇతర పంటలు ముఖ్యంగా నూనెగింజలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు ఇతోధికంగా సాగుచేసి రైతాంగం లబ్ధి పొందాలి.
ఇలా పంట మార్పిడి వల్ల జరిగే ఇతర అనుకూలమైన అంశాలు నేల (భూమి) ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఒకే పంట సాగువల్ల వచ్చే చీడపీడల ఉత్పత్తి బెడద తగ్గుతుంది, తద్వారా ఖర్చు తగ్గుతుంది. భూ ఆరోగ్య స్థితి మెరుగుపడటం, చీడపీడల ఉధృతి తగ్గటం, నేలలో భూసారాన్ని పంటలు సద్వినియోగం చేయుటవల్ల, పంటల (దిగుబడి) ఉత్పాదకత పెరుగుతుంది. కనుక రైతులందరు ఈ విషయాలను ఆకళింపుచేసుకుని, ఆయా పరిస్థితులకు అనువైన చిరుధాన్యాలు, నూనెగింజలు, అపరాలతో / ఇతర పంటలతో పంట మార్పిడి చేసి మంచి దిగుబడులను పొందగలరు / పొందాలి.
తక్కువ నీరు, తక్కువ ఎరువులు (అదీ సహజ ఎరువులు చాలు)తో హెచ్చు పోషక విలువలు గల మెట్ట పంటల సాగును ఇతోధికంగా ప్రోత్సహించాలి. మెట్ట ప్రాంతాల్లో తక్కువ వనరుతోనే పండే చిరుధాన్యాలను ఇతోధికంగా సాగు చేయాలి. వీటి ప్రాముఖ్యతను గుర్తించే మన ప్రధాని చిరుధాన్యాలను ‘‘శ్రీఅన్న’’ పేరుతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తీసుకొనివచ్చారు. వీటి సాగుతో మన అవసరాలకు విదేశీ వ్యాపారాలకు అనుగుణంగా ఉత్పత్తులను పెంచే విధంగా సాగును ప్రోత్సహించాలి.
– వరి, గోధుమల్లో స్వయం సమృద్ధిని సాధించినప్పటికి, నూనెగింజలు, పప్పుధాన్యాల్లో మాత్రం స్వయం సమృద్ధిని ఇంకా సాధించలేక పోతున్నాము. ఇప్పటికీ మనం నూనెగింజలను, పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటూ ఇతోధికంగా విదేశ మారకద్రవ్యాన్ని ఖర్చు చేస్తున్నాం. స్వయం సమృద్ధి దిశగా ప్రభుత్వం ఇతోథికంగా ఇంకనూ చేపట్టవలసి అవసరం ఉంది. నూనె గింజలకు, అపరాలకు, చిరుధాన్యాలకు తగిన మద్దతు ధరను నిర్ణయిస్తూ పండించిన ప్రతి గింజను మద్దతు ధరకు కొనే విధంగా (వరి, గోధుమలలో పటిష్టంగా అమలుచేసే విధంగా) చర్యలు ఇంకనూ పటిష్టం చేస్తే రైతులు తప్పక మొగ్గు చూపిస్తారు. ఇంకా అవసరమైతే (వరిలో సన్నబియ్యానికి ప్రోత్సహ మిచ్చినట్లు) వీటి సాగును ప్రోత్సహించడానికి క్వింటాలుకు వెయ్యి రూపాయలవరకు ప్రోత్సాహం కల్పిస్తే (కొంతకాలం) వీటి విస్తీర్ణం ఉత్పత్తులు ఇంకా పెరుగుతాయి.
అదేవిధంగా పలు ప్రభుత్వ పథకాల ద్వారా ఇతర పంటల సాగును ఈ ఖరీఫ్‌లో సాగు చేయుటకు చేయూతనివ్వాలి.
ఉద్యాన పంటల్లో కూరగాయలు, పండ్లు, సుగంధ ద్రవ్యాలను, ఔషధమొక్కలను తగిన విధంగా ప్రోత్సహించి సాగు చేయించాలి.
ముఖ్యంగా కొబ్బరి, జీడిమామాడి, కోకా, శ్రీగంధం, పసుపు పంటలను ఇతోధికంగా సాగు చేయటం, వాటి ఉత్పత్తులను అమ్మటం ద్వారా రైతుల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. వీటితోపాటు పోషక విలువలున్న గింజల సాగును ప్రోత్సహించి రైతుల ఆదాయాన్ని పెంచుటకు ప్రభుత్వం చిత్తశుద్ధితో తగిన బడ్జెట్ కేటాయింపులతో ముందుకు వెళ్తుంది.
ఈ పథకాలన్నింటితోపాటు రైతు సంక్షేమం కొరకు ప్రధానమంత్రి కిసాన్‌పథకం ద్వారా కేటాయింపులో మార్పులేదు. పశుగణాభివృద్ధి ఆసరా పథకం, పంటల భీమాపథకం, భూసార ఆరోగ్య కార్డుల జారీ, తుంపర్ల సాగునీటి పథకం మొదలగునవి కొనసాగుతాయి.
ఈ కార్యక్రమాల అమలులోను, పంటల సాగులోను అవసరమైన సాంకేతిక సహాయము / రైతులకు సంక్షేమ సహాయం అన్నియు రైతులకు వారి పొలాల్లో ఆచరించే విధంగా భారత్, విస్తార్ కార్యక్రమం ద్వారా వ్యవసాయ విషయాలపై, సాంకేతికతలపై రైతులందరకు వారి భాషల్లోనే విశదీకరించుటకు సమగ్ర సమాచార వ్యవస్థను పటిష్టపరచి, రైతుల వద్ద అందుబాటులోఉంచారు. రైతులు తక్కువ ఎరువుతోనే పంట మార్పిడి వైవిధ్యంతో, ఈ ఖరీఫ్‌లో కూడా పంటల సాగును చేపట్టి రసాయన రహిత పంటలఉత్పత్తులతో లబ్ధి పొందగలరని ఆశిస్తాము.
పొ. పి.రాఘవరెడ్డి
ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ
విశ్వవిద్యాలయం, మాజీ ఉపకులపతి