కేంద్రంలో మొదటిసారి ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం సంఖ్యాబలం లేని పరిస్థితుల్లో 1996లో పార్లమెంట్‌లో నాటి ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి కాంగ్రెస్ నేతృత్వంలోని  ప్రతిపక్షాలను ఉద్దేశించి  ప్రసంగిస్తూ “నేడు మా తక్కువ సీట్లను చూసి మీరు వ్యంగ్యంగా నవ్వుతుండవచ్చు. కానీ ఒక రోజు దేశం మొత్తం మిమ్మల్ని చూసి నవ్వడం ఖాయం’ అంటూ దూరదృష్టితో బీజేపీ సాధించే విజయాలపై నాడే పూర్తి విశ్వాసంతో వ్యాఖ్యానించారు. 1980లో బీజేపీ స్థాపించిన సందర్భంగా వాజ్‌పేయి ముంబాయిలో మాట్లాడుతూ.. “అంధేరా ఛటేగా, సూరజ్ నిక్లేగా, కమల్ ఖిలేగా” (చీకటి తొలగిపోతుంది, సూర్యుడు ఉదయి స్తాడు, కమలం వికసిస్తుంది) అన్నారు. నాడు వాజ్‌పేయి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వాస్తవ రూపం దాలుస్తున్నాయి. 1984లో కేవలం 2 పార్లమెంట్ స్థానాలను గెల్చిన బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ఎదురు లేకుండా పుష్కరకాలంగా అధికారంలో ఉంటూ ఇప్పుడు పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరిలో కూడా ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తూ మొత్తం 22 రాష్ట్రాల్లో అధికారంలో ఉండి తమకు తిరుగు లేదని నిరూపించింది. 2026 మే 9వ తేదీన పశ్చిమ బెంగాల్‌లో, మే 12న అసోంలో, మే 13న పుదుచ్చేరిలో బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

పశ్చిమబెంగాల్, అసోం, పుదుచ్చేరిలో అధికారంలోకి రావడంతో భారతీయ జనతా పార్టీ దేశ రాజకీయాల్లో మరో చారిత్రాత్మక అధ్యాయాన్ని రాసింది. ఉత్తర భారతదేశానికే పరిమితమైన పార్టీగా పేరు పొందిన బీజేపీ, ఇప్పుడు తూర్పు ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణ, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా తన జెండా రెపరెపలాడిస్తూ దేశ రాజకీయాల్లో అప్రతిహత శక్తిగా ఎదిగింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌లో తొలిసారిగా పూర్తి స్థాయి అధికారాన్ని సాధించడం, అసోంలో వరుస విజయాలతో తన బలాన్ని నిలబెట్టుకోవడం, పుదుచ్చేరిలో ప్రభుత్వ నిర్మాణంలో కీలక శక్తిగా నిలవడం బలోపేతమైన పార్టీ శక్తిని నిరూపిస్తున్నాయి. ఈ విజయాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలందరీ కృషి ఉన్నా ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్‌షా ద్వయం దీర్ఘకాలిక దార్శనికత, అలుపెర గని సంస్థాగత బలం, వ్యూహాత్మక నాయకత్వం పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించాయి.

బీజేపీ విజయాల వెనుక కేవలం ఎన్నికల ప్రచారం మాత్రమే లేదు. దాదాపు 10 సంవత్స రాలకు పైగా సాగిన బూత్ స్థాయి నిర్మాణం, సామాజిక వర్గాల వారీగా చేసిన సోషల్ ఇంజనీరింగ్, ప్రతి ఓటర్ని వ్యక్తిగతంగా కలుస్తూ మైక్రో మేనేజ్ మెంట్, వేల సంఖ్యలో జరిగిన కార్నర్ మీటింగ్‌లు, శక్తికేంద్ర సమావేశాలు, కార్యకర్తల శిక్షణ శిబిరాలు ప్రధాన కారణాలుగా నిలిచాయి. బీజేపీ ఎన్నికలను కేవలం ప్రచార యుద్ధంగా కాకుండా “సంస్థాగత యుద్ధం”గా మార్చింది. ప్రతి బూత్‌ను ఒక రాజకీయ కోటగా మార్చే వ్యూహంతో ముందుకు వెళ్లింది.

పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయాన్ని పార్టీ శ్రేణులు కేవలం ఎన్నికల ఫలితంగా మాత్రమే కాకుండా, దశాబ్దాల సిద్ధాంతపరమైన పోరాటానికి వచ్చిన ఫలితంగా కూడా భావిస్తున్నాయి. ఈ సందర్భంలో బీజేపీ సిద్ధాంతకర్తల్లో ఒకరైన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పేరు ప్రత్యేకంగా ప్రస్తావించు కోవాల్సిన ఆవశ్యకత ఉంది. బెంగాల్‌కు చెందిన ప్రముఖ జాతీయవాది నాయకుడైన శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ, భారతీయ జనసంఘ్ స్థాపకుడిగా భారత జాతీయవాద రాజకీయాల్లో ఒక కీలక వ్యక్తిగా నిలిచారు. అదే జనసంఘ్ తరువాత కాలంలో భారతీయ జనతా పార్టీగా రూపాంతరం చెందింది. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ గెలుపునకు శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ సిద్ధాంతాలు, ఆశయాలు పునాదిగా నిలిచాయి. బీజేపీ శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీని తమ పితామహుడిగా భావిస్తుంది.

శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ రాజకీయ వారసులమనే చెప్పుకునే బీజేపీకి పశ్చిమబెంగాల్‌లో గెలుపు ఎంతో  ప్రత్యేకతమైంది. భారత్‌లో పశ్చిమ బెంగాల్ భాగంగా ఉందంటే అది శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ చలవే. శ్యామ్‌ప్రసాద్ ముఖర్జీ బెంగాల్ రాజకీయ, విద్యా, జాతీయవాద చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించారు. చాలా చిన్న వయసులోనే కలకత్తా విశ్వవిద్యాలయ ఉపకులపతిగా బాధ్యతలు చేపట్టి గుర్తింపు పొందారు. స్వాతంత్య్రానంతరం జవహర్ లాల్ నెహ్రూ కేబినెట్‌లో పరిశ్రమల మంత్రిగా పనిచేసిన ఆయన, తరువాత జాతీయవాద సిద్ధాంతాల కోసం ప్రత్యేక రాజకీయ మార్గాన్ని ఎంచుకున్నారు. దేశ ఐక్యత, ఒకే రాజ్యాంగం, ఒకే జెండా అనే భావజాలానికి ఆయన బలమైన మద్దతుదారుగా నిలిచారు. ప్రత్యేకంగా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఆయన చేసిన ఉద్యమం బీజేపీ సిద్ధాంత చరిత్రలో కీలక అధ్యాయంగా నిలచింది. “ఒక దేశంలో రెండు రాజ్యాంగాలు, రెండు జెండాలు ఉండవు” అనే శ్యామ్‌ప్రసాద్ నినాదం అప్పటి నుంచే జాతీయవాద రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఈ సిద్ధాంత వారసత్వాన్నే బీజేపీ ఇప్పుడు తన రాజకీయ పునాదిగా ప్రస్తావిస్తోంది. మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మ కంగా 370 ఆర్టికల్ రద్దు చేసి ఆయనకు నివాళులు అర్పించింది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటాన్ని పార్టీ కార్యకర్తలు “శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కల నెరవేరిన రోజు”గా అభివర్ణిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయానికి అత్యంత కీలకంగా నిలిచిన నాయకుల్లో సువేందు అధికారి ఒకరు. తృణమూల్ కాంగ్రెస్‌లో మమతా బెనర్జీ నియంతృత్వ పోకడలతో విసిగిపోయిన ఆయన ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన తర్వాత బెంగాల్ రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. నందిగ్రామ్ ఉద్యమం ద్వారా గ్రామీణ బెంగాల్‌లో బలమైన పట్టు సంపాదించిన సువేందు అధికారి రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేశారు. 2021లో మమత మరోసారి గెలిచాక ఆమె ప్రభుత్వం దౌర్జన్యాలకు బెదిరి బీజేపీ ప్రజా ప్రతినిధులు, నేతలు పలువురు పార్టీ వీడినా సువేందు అధికారి ఆమెతో పోరాడారు. మమతా బెనర్జీ నియంతృత్వ పోకడలకు వ్యతిరేకంగా పోరాడిన ఆయన 2021, 2026లో బబానీపూర్‌లో ఆమెను స్వయంగా ఓడించారు. సువేందు అధికారి ప్రత్యేకంగా దక్షిణ బెంగాల్ గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టారు. మతువా సామాజిక వర్గం, ఇతర వెనుకబడిన వర్గాలు, గ్రామీణ హిందూ ఓటర్లను బీజేపీ వైపు తిప్పడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. చిన్న చిన్న సమావేశాలు, రాత్రివేళ గ్రామసభలు, స్థానిక దేవాలయ సందర్శనలు, కుటుంబ స్థాయి రాజకీయ పరిచయాలు ఇవి ఆయన ప్రచారంలో ప్రధాన ఆయుధాలయ్యాయి. ప్రత్యేకంగా నందిగ్రామ్ పోరాటం బీజేపీకి భావోద్వేగ బలం ఇచ్చింది. ఒకప్పుడు మమతా బెనర్జీ రాజకీయ ఎదుగుదలకు చిహ్నంగా నిలిచిన నందిగ్రామ్‌నే బీజేపీ శక్తి ప్రదర్శన వేదికగా మార్చడం పార్టీకి భారీ మానసిక విజయాన్ని అందించింది. సువేందు అధికారి ప్రతి బూత్‌పై వ్యక్తిగతంగా ఫోకస్ పెట్టి, స్థానిక కుల సమీకరణాలు, గ్రామస్థాయి ప్రభావవంత మైన కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టి బెంగాల్‌లో బీజేపీ మైక్రో మేనేజ్‌మెంట్‌కు ఒక కీలక స్తంభంగా మారారు.

బెంగాల్‌లో బాంగ్లాదేశీయుల అక్రమ చొరబాట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని, సరిహద్దు భద్రతను మరింత బలోపేతం చేస్తామని, అదే సమయంలో మతువా వంటి హిందూ శరణార్థ వర్గాలకు పౌరసత్వ రక్షణ కల్పిస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు ఓటర్లలో భరోసా నింపాయి. బాంగ్లాదేశ్ సరిహద్దుల్లో అక్రమ వలసదారులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఫెన్సింగ్ ఏర్పాటుకు సిద్ధమైతే బుజ్జగింపు రాజకీయా లకు పేరుగాంచిన మమతా బెనర్జీ ప్రభుత్వం అడ్డుకుంది. ఇప్పుడు బీజేపీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా అక్కడ ఫెన్సింగ్ పూర్తిచేసి వలసదారు లను అరికట్టేందుకు ముందుకొస్తుంది. ప్రతి బూత్‌లో కార్యకర్తలకు ఈ అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. సోషల్ మీడియా వీడియోలు, వాట్సాప్ ప్రచారం, స్థానిక భాషా పత్రికలు, కార్నర్ మీటింగ్‌లు పెట్టి ప్రజలకు బీజేపీ అవగాహన కల్పించింది.

బాంగ్లాదేశ్‌కు సరిహద్దు రాష్ట్రమైన అసోంలో వరుసగా మÖడోమారు బీజేపీ విజయం సాధించ డానికి అత్యంత కీలక శక్తిగా నిలిచింది హిమంత బిశ్వ శర్మ నాయకత్వం. ముఖ్యమంత్రి బిశ్వ శర్మ కేవలం ఎన్నికల నాయకుడిగానే కాకుండా, అసోం సామాజిక నిర్మాణాన్ని అర్థం చేసుకున్న వ్యూహకర్తగా పనిచేశారు. రాష్ట్రంలో టీ తెగలు, బోడోలు, హిందూ బెంగాలీలు, స్థానిక అసోమీ వర్గాలు, గిరిజన సమూహాలు ఇలా ప్రతి వర్గానికి కావాల్సిన వేర్వేరు రాజకీయ వ్యూహాలను ఆయన రూపొందించారు. ఆయన టీ తోట కార్మికులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. టీ తోట ప్రాంతాల్లో వేల సంఖ్యలో చిన్నచిన్న సమావేశాలు నిర్వహించి వారికి చేరువయ్యారు. మహిళా స్వయంసహాయకసంఘాలు, యువ సంఘాలు, స్థానిక పెద్దలతో ప్రత్యక్ష సంబంధాలు కొనసాగించారు. మహిళా సాధికారిత కోసం ఒక్కో మహిళకు 9 వేల రూపాయలను చొప్పున 40 లక్షల మందికి ఒరునోడి పథకం కింద పంపిణీ చేశారు. “ప్రతి గ్రామంలో బీజేపీ కార్యకర్త” అనే లక్ష్యంతో పనిచేశారు. అసోంలో ప్రతి బూత్‌కు ప్రత్యేక డేటా సేకరణ వ్యవస్థను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో బాంగ్లాదేశ్ అక్రమ వలసల అంశం మరింత భావోద్వేగపూరిత రాజకీయ అంశంగా మారింది. అక్రమ వలసదారులతో హక్కులు కోల్పోతున్న అస్సామీలు వారిని బీజేపీ అరికడుతుందనే భరోసాతో ఆ పార్టీకి పూర్తి మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలో బీజేపీ ఎనఆర్‌సీ అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లి దాన్ని ఆవశ్యకతను తెలియజేసింది. జాతీయ పౌరుల నమోదు ప్రక్రియ ద్వారా అక్రమ చొరబాటుదారులను గుర్తిస్తామని ప్రజలకు హామీ ఇచ్చింది. అదే సమయంలో మతపరమైన హింస కారణంగా వచ్చిన హిందూ శరణార్థులకు రక్షణ కల్పిస్తామని చెప్పడంతో ప్రజలు బీజేపీకి మళ్లీ అధికారం కట్టబెట్టారు.

దక్షిణ భారతదేశంలో బీజేపీకి కీలక మైలు రాయిగా పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం నిలిచింది. పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటం ద్వారా కేంద్రంతో సమన్వయం పెరిగి అభివృద్ధి పనులకు ఊతం లభించిందని నాయకులు చెబుతున్నారు. కేంద్రంలో ఉన్న పార్టీ పుదుచ్చేరిలో కూడా అధికారం చేపడితే అభివృద్ధి జరుగుతుందని విశ్వసించిన ప్రజలు ఎన్డీఏకి పట్టం కట్టారు. ఇప్పటికే అక్కడ అధికారంలో ఉన్న రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అంది స్తుండడంతో పుదుచ్చేరి అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోంది. ఈ భరోసాతో అక్కడి ప్రజలో మరోసారి ఎన్డీఏకు పట్టం కట్టారు.  ఈ విజయం దక్షిణ భారత రాజకీయాల్లో బీజేపీకి మరింత బలాన్ని ఇచ్చిందని కచ్చితంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి దేశంలోని రెండు డజన్లకుపైగా రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. 17 రాష్ట్రాల్లో బీజేపీ ముఖ్యమంత్రులు అధికారంలో ఉండగా,  మరో 5 చోట్ల ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉన్నారు. ఉత్తరాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు, పశ్చిమ భారతదేశం నుంచి దక్షిణ భారత కూటముల వరకు బీజేపీ వ్యూహాత్మకంగా తన ప్రభావాన్ని విస్తరించుకుంది. ఇప్పుడు పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరిలో విజయాలు  పార్టీకి 2029 లోక్‌సభ ఎన్నికల దిశగా మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయి.

నరేంద్ర మోదీ 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక దేశంలో 9 రాష్ట్రాల్లో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రులు పగ్గాలు చేపట్టారు. 2014లో హరియాణా, మహారాష్ట్రలతో ప్రారంభమైన బీజేపీ జైత్రయాత్ర 2016లో అసోం, అరుణాచల్ ప్రదేశ్, 2017లో మణిపూర్, 2018లో త్రిపుర, 2024లో ఒడిశా, 2026లో పశ్చిమబెంగాల్‌కు చేరింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన వికసిత్ భారత్ పాలనతో ప్రజల్లో విశ్వాసాన్ని నింపితే హోం మంత్రి అమిత్ షా వ్యూహాత్మకమైన ప్రణాళికలతో దాన్ని ఓట్లుగా మార్చారు. ఈ ద్వయానికి సువేందు అధికారి, హిమంతు బిశ్వ శర్మ రూపంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం తోడై సరిహద్దు రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాలను నమోదు చేసింది. ఈ వ్యూహాత్మక సమీకరణాలే ‘మోదీ-షా మోడల్ – ప్రాంతీయ నాయకత్వం’గా మారి బీజేపీ విజయాలకు ప్రధాన బలంగా మారుతున్నాయి.

– శ్రీపాద

About Author

By editor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Twitter
YOUTUBE