ఏప్రిల్ 14 డా. బీఆర్ అంబేడ్కర్ జయంతి

డా.అంబేడ్కర్ ఆలోచన, కృషి అపారమైనవి. దాదాపు ప్రతి ఒక్కరూ ఆయనను తమ తమ దృక్కోణాల నుండి చూశారు కానీ చాలా కొద్ది మంది మాత్రమే ఆయనను సమగ్రంగా అంచనా వేశారు. ఆయనపై కొన్ని దృక్కోణాలు అసంపూర్ణంగా ఉండగా, మరికొన్ని వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయి. డాక్టర్ అంబేడ్కర్ జీవితం విశాలమైనది, విస్తృతమైనది, బహుముఖమైనది. దేశానికి దురదృష్టవశాత్తు ఆయనపై సమగ్ర అధ్యయనం, విశ్లేషణ చాలా అరుదుగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆయనలోని ఒక కోణాన్ని మాత్రమే చూసి, దాని ఆధారంగా తమ సొంత అభిప్రాయాలను ఏర్పరచుకోవడం ప్రారంభించారు. డాక్టర్ అంబేడ్కర్ గురించి మనం రకరకాల అభిప్రాయాలను వింటూనే ఉంటాం. ఆయన మనకు దేవుడని, సాక్షాత్తు భగవంతుని అవతారమని, మన పరిస్థితిని మెరుగుపరచడానికి ఆయన చేసిన ప్రయత్నాలు ఒక దైవిక కృషికి ఏమాత్రం తక్కువ కాదని చాలామంది అంటారు. అందువల్ల, కొందరు ఆయనను దేవుని అవతారంగా భావిస్తారు. మరికొందరు ఆయనను దేవునిగా భావించరు. ఆయన బోధనలను తిరస్కరిస్తారు. ఆయన కేవలం షెడ్యూల్డ్ కులాల వారి కోసమే ఉన్నారని కొందరు అంటారు. అయితే ఆయన యావత్ సమాజం కోసమే ఉన్నారని మరికొందరు అంటారు. ఆయనకు మహాత్మాగాంధీ, కాంగ్రెస్‌తో తీవ్రమైన విభేదాలు ఉన్నాయని కొందరు నమ్ముతారు, కానీ మరికొందరు మహాత్మా గాంధీ, అంబేడ్కర్ ఇద్దరి లక్ష్యం ఒకటేనని విశ్వసిస్తారు. మార్క్సిస్టు భావజాలం గలవారు ఆయన వర్గ పోరాటాన్ని విశ్వసించారని నమ్ముతారు. కానీ నేను కమ్యూనిజానికి, కమ్యూనిస్టులకు నంబర్ వన్ శత్రువునని అంబేడ్కర్ స్పష్టంగా రాశారు. కొందరు ఆయన ధర్మానికి వ్యతిరేకి అని అంటారు, కానీ డాక్టర్ అంబేడ్కర్ స్వయంగా ఇలా అన్నారు, “నేను ధర్మాన్ని నమ్ముతాను. ధార్మికపరమైన విలువలు లేకపోతే, సమాజంలోని పోరాటాలు అసూయ, అధికారం కోసం ఆరాటపడే వ్యక్తుల మధ్య జరిగే చిన్నపాటి పోరాటాలుగా మారిపోతాయి.” ఆయనకు ధర్మం పట్ల ప్రగాఢ విశ్వాసం ఉండేది. ఆయన అగ్రవర్ణాలను, బ్రాహ్మణులను వ్యతిరేకించారని కొందరు నమ్ముతారు. కానీ ఆయన తన జీవితంలో ఏ ఒక్క వర్గాన్ని కూడా నిందించలేదు. ఆయన కొన్ని వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడారు. ఆయన పోరాటం కొన్ని నమ్మకాలకు వ్యతిరేకంగా సాగింది. ఆయన పోరాటం అగ్రవర్ణ ప్రజలకు వ్యతిరేకంగా కాదు. అన్ని కులాలు, వర్గాల ప్రజలు ఆయన పోరాటంలో పాలుపంచుకున్నారు. ఆయన తన చివరి రోజులలో బౌద్ధమతాన్ని స్వీకరించారన్నది నిజం. ఆయన అన్ని మత విశ్వాసాల గురించి విస్తృతంగా రాశారు. అయితే, ఈ విషయాలు, ఆలోచనలు సమగ్రంగా విశ్లేషణకు, అధ్యయనానికి నోచుకోలేదు. ఆయన జీవితం విశాలమైనది, విస్తృతమైనది. ఆయన ఆలోచన, అధ్యయనం, రచనలు పరిశోధనాత్మకమైనవి. ఆయన పోరాటం సాటిలేనిది. దాని కోణాలు అనేకమైనవి, విస్తృతమైనవి. నేను కొన్ని విషయాలను క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను.


మహార్ అనే అస్పృశ్య కులంలో జన్మించిన భీమ్‌రావ్ అనే బాలుడి తండ్రి పేరు రామ్‌జీ సక్‌పాల్. ఆయన సైన్యంలో సుబేదార్‌గా పనిచేశారు. 14 మంది తోబుట్టువు లలో అందరికంటే చిన్నవాడైన భీమ్‌రావ్ జీవితం కష్టాలతో, పోరాటాలతో నిండి ఉన్నప్పటికీ, అతడు మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడైన మొదటి మహార్ కులస్థుడిగా నిలిచాడు. అతడి ఈ విజయానికి, అంబేడ్కర్ అనే ఇంటిపేరు గల అతని బ్రాహ్మణ ఉపాధ్యాయుడి సృజనాత్మక మద్దతు ఎంతగానో దోహదపడింది. మరొక ఉపాధ్యాయుడు కృష్ణాజీ కేలుస్లుకర్ భీమ్‌రావ్‌కు భగవాన్ గౌతమ బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన చిన్న పుస్తకాన్ని చదవడానికి ఇచ్చారు. “నేను కేలుస్లుకర్‌ను, గౌతమ బుద్ధుడిని ఎన్నడూ మర్చిపోలేదు” అని భీమ్‌రావ్ పేర్కొ న్నారు. కేలుస్లుకర్ భీమ్‌రావ్‌ను బరోడా రాజా సాహెబ్ వద్దకు తీసుకు వెళ్లారు. అక్కడ రూ.25 ఉపకార వేతనం పొందసాగారు. 1912లో ఆయన బొంబాయి విశ్వవిద్యాలయం నుండి అర్థశాస్త్రం, రాజనీతిశాస్త్రంలో బి.ఏ. పట్టా పొందారు. బరోడా రాజు ఆయన ఉపకార వేతనాన్ని రూ.75కు పెంచారు. ఆయన బరోడా రాజ్యంలో కొద్దికాలం ఉద్యోగం చేశారు. అక్కడ కూడా వివక్ష ఎదురవడంతో, భీమ్‌రావ్ తన ఉద్యోగాన్ని వదిలి తిరిగి వచ్చారు. కేలుస్లుకర్ కృషితో, ఆయన నెలకు 92.5 పౌండ్ల ఉపకార వేతనం సంపాదించి, ఉన్నత విద్య కోసం కొలంబియాకు వెళ్లారు. అక్కడ ఆయన ఎంఏ, పీహెచ్‌డీ పట్టాలను పొందారు. కొలంబియాలో చదువుతున్నప్పుడు, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో చదువుకోవడానికి కొంత సమయాన్ని కేటాయించారు. ఆయన రెండు సంస్థలలోనూ డిగ్రీలను సంపాదించారు. ఒక సంస్థ నుండి ఎంఏ, పీహెచ్‌డీ, మరొక సంస్థ నుండి ఎంఎస్సీ, డీఎస్సీ పట్టాలను పొందారు. ఇది అంత సులభమైన విషయం కాదు. ఆయన ఈ నాలుగు డిగ్రీలనూ సంపాదించడమే కాకుండా, విదేశంలో న్యాయశాస్త్రంను కూడా పూర్తి చేశారు.

ఆయన తన చదువు పూర్తి చేశాక సామాజిక జీవితంలోకి ప్రవేశించారు. ఆయనకు సామాజిక సేవ పట్ల అమితమైన ఆసక్తి ఉండేది. ఆయన ఒక ప్రఖ్యాత సంఘ సంస్కర్త, శ్రామిక నాయకుడు, బారిస్టర్, నేర్పరి అయిన రాజకీయ నాయకుడు,అనేక వార్తాపత్రికలకు సంపాదకుడు, నేర్పరి అయిన వక్త, మంచి ఆర్థికవేత్త, ప్రఖ్యాత మానవ శాస్త్రవేత్త, సాంఘిక సమస్యలపై సిద్ధాంతకర్త, అనేక దేశాల రాజ్యాంగాల నిపుణుడు, రాజ్యాంగ నిర్మాత. ఆయన కానిది ఏముంది? దీనితో ఆయన జీవితానికి అనేక కోణాలు ఉన్నాయని స్పష్టమవుతుంది.

జీవితం పోరాటాలతో నిండి ఉన్నా, ఆయనకు శత్రువులు లేరు. ఆయన పోరాడాడు కానీ ఎవరినీ తన శత్రువుగా భావించలేదు. ద్వేషం ద్వేషంతో అంతం కాదు, శత్రుత్వం శత్రుత్వంతో తొలగిపోదు, కాబట్టి ద్వేషాన్ని మనసులో పెట్టుకుని సమానత్వాన్ని, కరుణను పెంపొందించుకోవడం అసాధ్యం అని మహాత్మా బుద్ధుడు చెప్పారు. ద్వేషాన్ని మనసులో పెట్టుకోకుండానే ఇలాంటి వ్యక్తిత్వం ముందుకు సాగుతుంది.

ఆయన జీవితంలోని కొన్ని విషయాలు మాత్రమే ప్రజలకు వెల్లడయ్యాయనేది నిజం. ఆయన సంపూర్ణ జీవితం, దానికి సంబంధించిన కోణాలు, ఆయన అసాధారణ సామర్థ్యాలు అప్రకటితంగానే మిగిలి పోయాయి. మనుషుల విషయంలో ఇది సర్వ సాధారణం. ఒక వ్యక్తికి అనేక సామర్థ్యాలు ఉంటాయని, కానీ విధి వాటిలో ఒకదాన్ని ఎంచుకుని దానితోనే ముందుకు సాగుతుందని డాక్టర్ జాన్సన్ రాశారు.

లోకమాన్య తిలక్ గణితశాస్త్రంలో ప్రతిభావంతు డైన విద్యార్థి అని మనకు తెలుసు, కానీ ఆయనకు తన చదువును కొనసాగించడానికి సమయం దొరకలేదు. అటల్ బిహారీ వాజ్‌పేయి గొప్ప కవి. కానీ ఆయనకు కవిత్వం, వ్యాసాలు రాయడానికి సమయం దొరకలేదు. స్వామి రామతీర్థ, స్వామి వివేకానంద కూడా గణిత, విజ్ఞాన శాస్త్రాలలో మంచి విద్యార్థులే, కానీ సన్యాసమే వారి జీవితాలకు రాసి పెట్టి ఉంది.

విధి మనల్ని ఒక చోటు నుండి మరో చోటుకు తీసుకువెళుతుంది. ఆంబేడ్కర్ జీవితం కూడా అలాంటిదే. అందువల్ల, మనం ఆయన జీవితాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, దానిపై సంపూర్ణంగా ఆలోచించడానికి కృషి చేయాలి. అప్పుడే ఒక వ్యక్తిగా ఆయన్ను సరిగ్గా అంచనా వేయగలం.

ఒప్పందం ప్రకారం తన విద్యను పూర్తి చేసుకున్న తర్వాత, ఆయన బరోడాకు తిరిగి వచ్చారు. బరోడా సంస్థానానికి కార్యదర్శి అయ్యారు. అక్కడి వాతావరణం కూడా ఆయనకు అనుకూలంగా లేదు. ఆయన గుమస్తా ఆయనపై ఫైళ్లను విసిరేవాడు. ఆయన తన నీటిని తానే తీసుకొనిరావలసి వచ్చేది. క్లబ్‌లో ఆయనతో ఎవరూ ఆడేవారు కాదు. ఆయనకు ఒక ప్రత్యేక సీటు ఉండేది. ఆయనకు అద్దెకు ఇల్లు దొరకలేదు. చివరకు, ఆయన ఆదల్జీ సొరాబ్జీ అనే నకిలీ పేరుతో, ఒక పార్శీ ధర్మశాలలో గదిని అద్దెకు తీసుకున్నారు. ఇదే విషయమై డాక్టర్ అంబేడ్కర్ ఒకానొక సందర్భంలో మాట్లాడుతూ “ఒక రోజు చాలా మంది పార్సీ పురుషులు కర్రలతో నా వద్దకు వచ్చి, వెంటనే అక్కడి నుండి వెళ్లిపొమ్మని చెప్పారు. నా వస్తువులతో నేను బయట రోడ్డు మీద ఒక చెట్టు కిందకు చేరుకున్నాను. అనేక డిగ్రీలు ఉన్నా కూడా వాటివల్ల నాకు ఏ ఉపయోగం లేదు. నేను ఎక్కడికి వెళ్లాలి? కనీసం నాతో స్నేహం చేయడానికి కూడా ఎవరూ ఇష్టపడరు. సమాజంలో నాకు గౌరవం దక్కడం లేదు” అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అవమానం ఆయన హృదయాన్ని తీవ్రంగా గాయ పరిచింది.  ఆయన కళ్ల నుండి నీళ్లు ధారలు కట్టాయి. ఆ రోజే ఆయన ఒక సంకల్పం చేసుకున్నారు. ఆ సంకల్పం క్రమంగా జీవితకాల సంకల్పంగా మారింది. ఆయన తన జీవితాన్ని సమాజ పరి వర్తనకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నారు. తన చివరి శ్వాస వరకు ఆయన ఆ సంకల్పానికే కట్టుబడి ఉన్నారు.

చిన్న మట్టి దీపం వెలుగులో రాత్రిళ్లు చదువు కుని, అన్నం లేకుండా కేవలం కొన్ని రొట్టె ముక్కల తోనే గడిపి, ఆ తర్వాత కొలంబియా విశ్వవిద్యా లయంలోనూ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లోనూ చదువుకున్న ఆయన ఎంత డబ్బు అయినా సంపా దించుకోవచ్చు. కానీ అలా చేయలేదు. తన జీవిత మంతా సామాజిక మార్పునకే అంకితం చేశారు. సమాజంలోని బాధలను, దుఃఖాన్ని తొలగించడానికి, దాని వివక్షాపూరిత సంప్రదాయాలు, నమ్మకా లన్నింటినీ పరివర్తన చెందించడానికి తనను తాను అంకితం చేసుకున్నారు.

ముగ్గురు గురువుల మార్గదర్శనం

ఆయన జీవితమంతా మూడు ఆదర్శాలతో నడిచింది. ఆయన మొదటి గురువు మహాత్మా బుద్ధుడు. బుద్ధుడు తన కాలంలోని సంప్రదాయాలు, నమ్మకాలు, ఆచారాలు, కపటత్వం, కర్మకాండలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ, ఆయన మౌలిక సారాన్ని మాత్రం గట్టిగా పట్టుకున్నారు. ఈ దేశం మౌలిక సారం ప్రేమ, ఏకత్వం, దయ, కరుణ, విశ్వాసం, విధేయత, ఆత్మీయత. ఈ మౌలిక సూత్రా లను స్వీకరించడం ద్వారా బుద్ధుడు కర్మకాండలను పక్కనపెట్టి, సంఘర్షణకు కాకుండా ప్రేమ, విశ్వాసం, కరుణ, ఆప్యాయత అనే మూలాలకు కట్టుబడిన ఈ దేశపు శాశ్వత తత్వాన్ని పునరుద్ధరించాడు. అందువల్ల, గౌతమ బుద్ధుడు ఆయనకు మొదటి గురువు అయ్యాడు.

రెండవ గురువు సామాజిక రుగ్మతల పట్ల తిరుగుబాటు చేసిన కబీర్‌దాస్. కబీర్ కూడా ధార్మికుడు. ఈ కవి రాముని భక్తుడు. అతను తనను తాను రాముని కుక్క అని పిలుచుకుంటాడు. కానీ కబీర్ ప్రేమ, కరుణ, దయ, ఆప్యాయత, భక్తి అనే భాషలో మాట్లాడతాడు. అతని ధర్మం మొత్తం ప్రేమ అనే రెండున్నర అక్షరాల మీద ఆధారపడి ఉంటుంది. అతను చేతిలో కర్ర పట్టుకుని మాట్లాడతాడు, కానీ ఎవరినీ తన శత్రువుగా భావించడు. ఆయన ధర్మం ఆధారంగా పోరాడతాడు. ఎవరిపైనా ద్వేషం పెంచుకోడు. కానీ మార్పు కోసం గళం విప్పుతాడు. గొంతు లేని వారికి గళం, వేదిక లేని వారికి వేదిక కల్పిస్తాడు. నిరాదరణకు గురైన వారిని గౌరవిస్తాడు. ఆయన పేరు కబీర్.

మూడవ గురువు మహాత్మా ఫూలే. భారతీయ సంప్రదాయంలో గాఢంగా పాతుకుపోయి ఉన్నారు. ఆయన అర్థరహితమైన ఆచారాలు, అర్థరహితమైన నమ్మకాలు, కపటత్వం, అబద్ధాలు, శాస్త్రాల తప్పుడు వ్యాఖ్యానాలను వ్యతిరేకించారు. మహాత్మా ఫూలే తిరుగుబాటు భేరీని మోగించారు. ప్రజలు నిరసన తెలిపారు. కానీ ఫూలే దృఢంగా నిలబడ్డారు.

ఈ ముగ్గురు గురువులు ఒక దృక్పథాన్ని, ఒక తత్వాన్ని అందించారు. దాని ఆధారంగానే అంబేడ్కర్ తన పోరాటాన్ని ముందుకు నడిపించారు. అంబేడ్కర్ పోరాటానికి మూలమైన ఆత్మ బుద్ధుడు, కబీర్, మహాత్మా ఫూలేల నుండి వచ్చింది. బుద్ధుడు, కబీర్, ఫూలేలను అర్థం చేసుకోకుండా, అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడం అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.

వ్యక్తిపూజకు వ్యతిరేకం

అంబేడ్కర్ వ్యక్తిత్వం చాలా విప్లవాత్మకమైనది.  “నేను ఎలాంటి వ్యక్తిపూజను నమ్మను. వ్యక్తులను పూజించవద్దు.” అని స్పష్టం చేశారు. అందుకే, తన పుట్టినరోజు జరుపుకునే వారితో, “నా పుట్టినరోజు వేడుకలకు మీరెందుకు వస్తారు? మీరంతా ఇక్కడి నుండి వెళ్ళిపోండి,” అని వారిని తరిమివేసేవారు. అంబేడ్కర్ తన స్నేహితులతో, “గత పదిహేను సంవత్సరాలుగా మీరు నా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు, కానీ నేను ఎప్పుడూ వాటిలో పాల్గొనలేదు” అని అనేవారు. నేను దీనిని ఎల్లప్పుడూ వ్యతిరేకించాను. మీరంతా నా స్వర్ణోత్సవ పుట్టిన రోజును జరుపుకున్నారు. ఇప్పుడు అలాంటి వేడుక అవసరం లేదు అని వారికి స్పష్టం చేసేవారు. ఆయన కీర్తిని కోరుకునే వ్యక్తి కాదు. “మీ అభివృద్ధి పెద్ద నాయకుల నుండి, పెద్ద పార్టీల నుండి, ఎన్నికలలో గెలిచిన వారి నుండి రాదు. మీ అంతటా మీరే వృద్ధి చెందడానికి ప్రయత్నించండి. చదువుకోండి, సంఘటి తమవ్వండి, సరిగ్గా ప్రవర్తించండి, మీ జీవితాన్ని మెరుగుపరుచుకోండి. ఎవరిపైనా ఆధార పడకండి. వేరే ఏ వ్యక్తీ వచ్చి మిమ్మల్ని ఆదుకోడు. మీ వృద్ధి కోసం మిమ్మల్ని ఏ ఒక్క వ్యక్తిపైనా ఆధారపడేలా చేయడం నాకు ఇష్టం లేదు. మీ స్వంత ప్రయత్నాల ద్వారా, మీ స్వంత బలం ద్వారా, మీ స్వంత సంకల్పం ద్వారా మీ వృద్ధిని సాధించుకోవడానికి ప్రయత్నించండి” అని సూచించేవారు. ఆయన తనను తాను నిలబెట్టుకోవడానికి, కీర్తి గడించ డానికి, వార్తాపత్రికలలో తన ఛాయాచిత్రాలను ప్రచురితం చేసుకోవడానికి చాలా దూరంగా ఉండేవారు. ఇదే ఆయన వ్యక్తిత్వం.

స్వాతంత్య్ర ఉద్యమంలో అంబేడ్కర్  ఎక్కడ ఉన్నారు అని చాలాసార్లు ప్రజలు అడుగుతుంటారు. దానికి ఆయన ఇలా అనేవారు, ‘ఈ దేశానికి స్వాతంత్య్రం రావాలని మీలాగే నేను కూడా కోరు కుంటున్నాను. కానీ నా మనసులో ఒక ప్రశ్న ఉంది, దేశానికి స్వాతంత్య్రం వస్తే, నాకు, నా స్నేహితులకు, సోదరులకు స్వాతంత్య్రం లభిస్తుందా లేదా, లేక మునుపటిలాగే బానిసలుగానే ఉండి పోతామా?’ ఆయన కాంగ్రెస్ నాయకులను ఇలా అడిగేవారు, “స్వాతంత్య్రం తర్వాత నా బంధువులకు కూడా స్వేచ్ఛ లభిస్తుందని మీరు నాకు హామీ ఇవ్వగలరా? వారు స్వేచ్ఛగా ఉంటారా?” 1942 ఏప్రిల్ 26న బొంబాయిలో ఆయన కాంగ్రెస్ నాయకులతో ఇలా అన్నారు, “మీరు పోరాడుతున్న దానికంటే ఎక్కువ శక్తితో నేను స్వాతంత్య్రం కోసం పోరాడతానని మీకు హామీ ఇస్తున్నాను, కానీ దయచేసి స్వరాజ్యంలో నా బంధువులకు ఎంత వాటా ఉంటుందో నాకు హామీ ఇవ్వండి.” ఆయన ఇలా అనేవారు, “నా సోదరులను స్వతంత్రులను చేస్తామని నాకు హామీ ఇవ్వండి. మీరు ఇవ్వకపోతే, నేను ఈ స్వరాజ్యంతో ఏం చేయాలి? నా దేశానికి స్వాతంత్య్రం కావాలి, అదే సమయంలో నా ఈ సోదరులకు కూడా స్వాతంత్య్రం కావాలి.”

దేశాభివృద్ధిలో పారిశ్రామికీకరణ

భారతదేశంలోని గ్రామాలలో వ్యవసాయ భూమి రోజురోజుకీ తగ్గిపోతూ, చెల్లా చెదురుగా అయి పోతోంది. చిన్న కమతాలతో ఈ దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. ఈ దేశ పారిశ్రామికీకరణను వేగంగా చేయాలని వంద సంవత్సరాల క్రితమే చెప్పేవారు. వ్యవసాయంపై ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. 80, 85 నుండి 90 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. వ్యవసాయ సమస్యకు, గ్రామాల సమస్యకు భారతదేశ పారిశ్రామికీకరణే ఏకైక పరిష్కారం. 1920వ దశకంలో ఆయన, ‘భారతదేశ వ్యవసాయ సమస్యలకు పారిశ్రామికీకరణే ఉత్తమ పరిష్కారం’ అని అన్నారు. యూరప్, అమెరికాలోని రైతులు వ్యవసాయం వదిలి పారిశ్రామిక వ్యాపారాలు చేపట్టగా, మనం మాత్రం మన పరిశ్రమలను వదిలి వ్యవసాయంలో నిమగ్నమయ్యాము. 80-85 శాతం ప్రజలు వ్యవసాయం ద్వారానే తమ జీవనోపాధిని పొందుతున్నారు. ఆయన సిద్ధాంతాలు, ఆయన పరిశోధనా గ్రంధాలు ఏమయ్యాయి? వాటిపై ఒక మంచి పరిశోధన జరిగి ఉండాల్సింది. కానీ వందేళ్ల తర్వాత కూడా అది జరిగేలా కనిపించడం లేదు.

అణగారిన వారికి అండగా..

ఆయన అణగారిన వారికి సత్యం కోసం ఒక వేదికను, గొంతులేని వారికి గొంతును ఇచ్చారు. ఆయన వార్తాపత్రిక ‘మూÅ£ నాయక’ ద్వారా మనకు ఈ విషయం తెలుసు. ఆయన వారికి ఒక ఉనికిని, ఒక పునాదిని ఇచ్చి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. క్లుప్తంగా చెప్పాలంటే, ఆయన ప్రజలలో వారి హక్కుల పట్ల చైతన్యం కలిగించి, వారిని సంఘటితం చేసి, క్రమశిక్షణ నేర్పి, పోరాటానికి సిద్ధం చేశారు. ఆయన ప్రజలలో ఆత్మగౌరవాన్ని నింపి, విద్యావంతులు కావాలని ప్రోత్సహించి, తమ హక్కులను సాధించుకోవడానికి వారిని సమీకరించి, అనేక విజయవంతమైన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. మనకు మహాడ్ సత్యాగ్రహం గురించి తెలుసు. చెరువులోని నీటిని తాగడంపై చట్టం ఉంది. దాని ప్రకారం ముస్లింలు, క్రైస్తవులు నీరు తాగవచ్చు, అగ్రవర్ణాలవారు నీరు తాగవచ్చు. కానీ అంటరాని వారు మాత్రం తాగకూడదు. అలాంటివారు నిరసన తెలిపి నీరు తాగారు. అక్కడి సంప్రదాయవాదులు పంచగవ్యాన్ని కలిపి చెరువును శుద్ధి చేశారు. అక్కడికి వచ్చిన వారిని వారు కొట్టారు. “చూడండి, మేము ముస్లింలుగా మారితే, ఈ నీటిని కూడా తాగుతాము. అప్పుడు మీరు మమ్మల్ని అడ్డుకోరు. మేము క్రైస్తవులుగా మారితే, ఈ నీటిని తాగనిస్తారు; అప్పుడు కూడా మీరు మమ్మల్ని అడ్డుకోరు. మేము హిందువులం, హిందువులుగానే ఉండాలనుకుంటు న్నాము, మమ్మల్ని నీళ్లు ఎందుకు తాగనివ్వడం లేదు?” అని అంబేడ్కర్ ప్రశ్నించారు. నాసిక్‌లోని రామమందిరంలో ప్రవేశించడానికి ఆయన ఇలాంటి సత్యాగ్రహాన్నే చేపట్టారు. మేము హిందువులం. మేము దర్శనం కోసం గుడికి వెళ్లాలనుకుంటే, ప్రజలు నిరసన తెలిపి మమ్మల్ని కొట్టారు. ‘ఈ అంట రానితనం హిందూ సమాజానికి, హిందూ మతానికి ఒక కళంకం, మేము దానిని తొలగిస్తాము’ అని ఆయన అన్నారు. ‘ఇది హిందూ మత శరీరానికి ఉన్న కళంకం కాదు, ఈ కళంకం మన శరీరాలకు ఉంది.’ అని అన్నారు.

భగవద్గీత స్ఫూర్తిగా సత్యాగ్రహం

ఆయన జీవితం అనేక విభిన్న దశల గుండా సాగిందని చెప్పవచ్చు. కొన్నిసార్లు ఆయన, “నా సత్యాగ్రహానికి గీతే(భగవద్గీత) స్ఫూర్తి. గీత నన్ను సత్యాగ్రహం వైపు నడిపించింది” అని అనేవారు. ఆయన తన వార్తాపత్రిక పైభాగంలో “జైభవానీ” అని రాసుకునేవారు. తనను తాను హిందువు అని చెప్పుకోవడానికి ఏ మాత్రం సంకో చించేవారు కాదు. సామాజిక సంస్కరణ, రాజకీయ సంస్కరణ, ఆర్థిక సంస్కరణల కోసం పోరాట స్వరూపాలు మారి పోయాయి. మార్పునకు ధర్మమే పునాది అని, అలాగే సామాజిక సంస్కరణకు కూడా ధర్మమే పునాది అని ఆయన నమ్మేవారు. యువత ధర్మం పట్ల ఉదాసీనంగా ఉండటం చూసి ఆయన ఆందోళన చెందేవారు. ధర్మం ఆశను కలిస్తుంది, విశ్వాసాన్ని ఇస్తుంది, సమాజంలో విలువలను స్థాపిస్తుంది. ధర్మం అంటే ఇతరుల సంక్షేమం గురించి ఆలోచించడం, అలాగే ఇతరుల శ్రేయస్సును పట్టించుకుంటూనే తన స్వంత శ్రేయస్సును కూడా చూసుకోవడం. తన ఆకలిని తీర్చుకుంటూనే ఇతరుల ఆకలిని కూడా తీర్చడం. భిక్షకులు సైతం కడుపు నింపుకోగలరు. కానీ ఇతరుల ఆకలిని తీర్చడం ధర్మం. ధార్మిక విశ్వాసం ఉన్నవారు అందరినీ పట్టించుకుంటూ ముందుకు సాగుతారు అని ఆయన తెలిపేవారు. సామాజిక సంక్షేమ స్ఫూర్తి ధర్మంలోనే అంతర్లీనంగా ఉంటుంది అని ఆయన అభిప్రాయం. అందుకే ఆయన మార్క్సిస్టులను వ్యతిరేకిస్తారు. ‘మార్క్సిస్టులు ధర్మాన్ని ఒక నల్లమందుగా భావిస్తారు. వారు వెన్న, టోస్ట్ లేదా చికెన్ లెగ్‌తోనే సంతోషంగా ఉంటారు. నేను వారి అభిప్రాయాలను సమర్థించను. అందువల్ల, మనం మౌలిక సూత్రాలను పరిరక్షిం చడం ద్వారా ఈ సమాజంలో మార్పు తీసుకు రావాలి.’ అని ఆయన అనేవారు. ధర్మం పేరుతో చేసే కపటత్వం, ధర్మం పేరుతో చేసే నటన అంటే ధర్మాన్ని అపహాస్యం చేయడమే. దానిని అంగీకరించ డానికి నేను సిద్ధంగా లేను అని స్పష్టం చేసేవారు. ద్వేషం, విద్వేషం ఎన్నడూ సంస్కరణలకు ఆధారం కాలేవు. ఈ దేశంలో మతమే సంస్కరణలకు ఏకైక ఆధారం అవుతుంది. రాజకీయ సంస్కరణల కన్నా సామాజిక సంస్కరణలే ముఖ్యం. మీరు రాజకీయ సంస్కరణలు అమలు చేయవచ్చు, రాజ్యాంగ హక్కులు కల్పించవచ్చు, కానీ వాటిని ఎవరు పాటిస్తారు? వాటిని పాటించే ఆధ్యాత్మిక భావన సమాజానికి లేకపోతే, సమాజం వాటికి గౌరవ మర్యాదలు ఇవ్వకపోతే, ఆ సంస్కరణలు కేవలం కాగితాలకే పరిమితమవుతాయి. మనకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అనే మూడు రకాల స్వేచ్ఛలూ అవసరం. వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా స్వేచ్ఛ అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. దేశం స్వతంత్ర మవుతోంది, కానీ కోట్లాది ప్రజల గతి ఏమిటి? వారి సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయి? ఆర్థిక పేదరికం కొనసాగితే, దీర్ఘకాలంలో రాజకీయ స్వాతంత్య్రానికి అర్థం ఉండదు అని అంబేడ్కర్ అభిప్రాయపడ్డారు.

ఈ దేశంలో గోమాంసం తినడం క్షమించరాని నేరంగా భావిస్తున్నప్పుడే అంటరానితనం ఉనికిలోకి వచ్చిందని అంబేడ్కర్ అన్నారు. అంటరానితనానికి మొదటి ఉదాహరణ దాహిర్ కుటుంబంలో జరిగింది. దాహిర్ ఓడిపోయినప్పుడు, ఈ నేరస్థులు(గోమాంస భక్షకులు) దాహిర్ రాజభవనానికి వచ్చారు. అప్పుడు దాహిర్ కుటుంబంలోని స్త్రీలు “వాళ్లు వస్తున్నారు, వాళ్లు మ్లేచ్ఛులు, వాళ్లు మనల్ని తాకితే మనం అపవిత్రులమవుతాము. వాళ్లు మనల్ని తాకకముందే మనం చనిపోవాలి. అందువల్ల, అగ్నిగుండాన్ని సిద్ధం చేయండి” అని అన్నారు. భారతదేశ చరిత్రలో మహిళలు ‘అంటరాని’ అనే పదాన్ని ఉపయోగిం చడం ఇదే మొదటిసారి.

కమ్యూనిస్టులకు బద్ధ శత్రువు

ఆయన కమ్యూనిస్టులను ఎంతగానో విమర్శించారు. 1937లో మైసూరులో జరిగిన ఒక దళిత సదస్సులో ఆయన “నేను కమ్యూనిస్టులలో చేరతానని కొందరు అంటున్నారు, కానీ అది ఏమాత్రం సాధ్యం కాదు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం శ్రామికులను దోపిడీ చేసే కమ్యూనిస్టులకు నేను బద్ధ శత్రువును” అని అన్నారు. మనిషి కేవలం రొట్టెతోనే బతకడు. అతనికి మనసు ఉంది. ఆ మనసుకు ఆలోచనలనే ఆహారం కావాలి. ధర్మం మనిషి మనసులో ఆశను నింపుతుంది. అది అతడిని పనిచేయడానికి ప్రేరేపిస్తుంది, కానీ మార్క్సిస్టులు ధర్మాన్ని ఒక మత్తుమందుగా భావిస్తారు. నేటి కమ్యూనిస్టు వర్గం అంబేడ్కర్ చిత్రాన్ని ప్రదర్శిస్తూ, ఆయనే వర్గ పోరాటానికి మార్గదర్శకుడని చెబుతుంది. దీన్ని ఎలా నమ్మగలం? అంబేడ్కర్ 1942 నుండి 1946 వరకు వైస్రాయ్ కౌన్సిల్‌లో కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు. శ్రామిక పరిరక్షణ విధానాన్ని రూపొందించిన మొదటి వ్యక్తి ఆయనే. శ్రామిక విధానాన్ని ముసాయిదా చేసిన మొదటి మంత్రి కూడా ఆయనే. శ్రామికులు, యజమానులు, ప్రభుత్వం వేర్వేరు కారు. వారంతా కలిసి కూర్చోవాలి. శ్రామికుల ప్రయోజనాలు, పరిశ్రమల ప్రయోజ నాలు, యావత్ సమాజ ప్రయోజనాలు వేర్వేరు లేదా పరస్పర విరుద్ధమైనవి కావు. వారంతా కలిసి పనిచేయాలి. అప్పటి నుంచి త్రిపక్ష చర్చలు ప్రారంభ మయ్యాయి. ఆయన శ్రామికుల కోసం చట్టాలను రూపొందించారు. పారిశ్రామిక వివాదాలను పరిష్కరించడానికి ఆయన కమిటీలను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ శ్రామిక రంగానికి కనీస వేతనాలు, ఫ్యాక్టరీ చట్టం, ప్రావిడెంట్ ఫండ్లు, ఓవర్‌టైమ్‌కు అదనపు చెల్లింపులు, రాయితీతో కూడిన ఆహారం, ఫ్యాక్టరీ క్యాంటీన్లు, ఫ్యాక్టరీలోనే వైద్య సహాయం వంటి నిబంధనలను ప్రవేశపెట్టారు. ప్రధాన కార్మిక కమిషనర్, ప్రాదేశిక కార్మిక కమిషనర్, కార్మిక ఇన్‌స్పెక్టర్లను నియమించిన ఘనత డాక్టర్ సాహెబ్‌దే. ప్రసూతి సెలవును సాధించడం కోసం ఆయన బొంబాయి అసెంబ్లీలో తీవ్రమైన పోరాటం చేశారు. మహిళలకు పూర్తి ప్రసూతి సెలవు లభించాలని పట్టుపట్టారు.

ఆయన గాంధీజీ వల్లే రాజ్యాంగ సభకు వచ్చారు. ఆయనకు గాంధీజీతో తరచుగా విభేదాలు వచ్చేవి. కానీ దేశ రాజ్యాంగాన్ని రూపొందిస్తున్న సమయంలో వల్లభభాయ్ పటేల్, జవహర్‌లాల్ నెహ్రూలను గాంధీజీ పిలిచి, ఆ పనిని ఎవరికి అప్పగిస్తున్నారని అడగ్గా, జవహర్‌లాల్ నెహ్రూ, “మేము జర్మనీకి చెందిన ప్రఖ్యాత రాజ్యాంగవేత్త సర్ జ్యోర్ జెరీని పిలుస్తున్నాము” అని బదులిచ్చారు. అందుకు గాంధీజీ “ఇంత పెద్ద దేశంలో రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎవరూ లేరంటే ప్రపంచం ఏమనుకుంటుంది?” అని ప్రశ్నించారు. ఆ తర్వాత గాంధీజీ “ఈ పనిని డాక్టర్ అంబేడ్కర్‌కి అప్ప గించండి, ఆయన చాలా విద్వత్తు ఉన్నవారు అని అన్నారు.

రాజ్యాంగం అమలులో ప్రజలు కీలకం

ఆయన రాజ్యాంగ పరిషత్తులో చేరి, ముసాయిదా కమిటీలో పనిచేసి, ఛైర్మన్ అయ్యి, రాజ్యాంగాన్ని రచించారని మనకు తెలుసు. ఆయన చివరి ప్రసంగంలోని ఒక పేరాను నేను ఇక్కడ అందిస్తు న్నాను. ఈ ప్రతికూల పరిస్థితులలో కూడా ఆయన హృదయం ఎంత ఉదారంగా, విశాలంగా ఉండేదో కూడా మనం గమనిద్దాం. ఆయన ఆలోచనలు సమాజాన్ని ఏకం చేసేవిగా ఉండేవి. ఆయన కృతజ్ఞతాభావంతో నిండి ఉండేవారు. “నేను రాజ్యాంగ పరిషత్తులో చేరినప్పుడు, నా వెనుకబడిన సోదరుల (అంటే, నా అంటరాని సోదరుల) ప్రయోజనాలను కాపాడటమే నా ఏకైక లక్ష్యం. నేను డ్రాఫ్టింగ్ కమిటీలో ఉంటానని కలలో కూడా అనుకోలేదు. నాకంటే ఎక్కువ అర్హత, సామర్థ్యం ఉన్న వ్యక్తులు ఉన్నప్పటికీ, నన్ను దాని ఛైర్మన్‌గా నియమించినప్పుడు నా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయాయి” అని ఆయన అన్నారు.

ఒక సందర్భంలో 1954లో ఆయన రేడియోలో ప్రసంగించారు. ఆయన పరిహాసంగా, కొద్దిగా వ్యంగ్యంగా మాట్లాడుతున్నా, ఆయన హృదయంలో మాత్రం తీవ్రమైన వేదన ఉంది. “హిందువులకు వేదాలు అవసరమైనప్పుడు, వారు ఆ పనిని వ్యాసుడు అనే ఒక నిమ్న కులానికి చెందిన వ్యక్తికి అప్పగించారు. వేదవ్యాసుడు వేదాలను సంకలనం చేశాడు. హిందువులకు రామాయణ ఇతిహాసం అవసరమైనప్పుడు, వారు వాల్మీకిని పిలిచి దానిని రాయించారు. హిందువులకు దేశ రాజ్యాంగం అవసరమైనప్పుడు, వారు నన్ను పిలిచారు.” అని ఆ ప్రసంగంలో వ్యాఖ్యానించారు.

నవంబర్ 25, 1949న రాజ్యాంగ సభలో చేసిన తన చివరి ప్రసంగంలో, రాజ్యాంగం విజయం సాధిస్తుందా లేదా విఫలమవుతుందా అనే ప్రశ్నకు అంబేడ్కర్ సమాధానమిస్తూ “అది దానిని తమ చేతుల్లో ఉంచుకునే ప్రజల స్వభావంపై ఆధారపడి ఉంటుంది. ఏ రాజ్యాంగమూ మంచిది లేదా చెడ్డది కాదు. అత్యంత చెడు ప్రజలు ఉంటారు, కానీ అత్యుత్తమ రాజ్యాంగాలు కూడా విఫలమవుతాయి. అందువల్ల, పార్లమెంటు, కార్యనిర్వాహక వర్గం, న్యాయవ్యవస్థ, మంచి ప్రజల మద్దతుతో కలిసి రాజ్యాంగాన్ని విజయవంతం చేస్తాయా లేదా అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ప్రజలు మంచివారై ఉండాలి” అని అన్నారు. “రాజకీయ పార్టీలు తమ సొంత ఆశయాలను నెరవేర్చుకోవ డానికి దేశ ఆశయాలను త్యాగం చేస్తే, అది విజయం సాధించినట్టు అవుతుందా? ఏదీ కాదు” అని తెలిపారు. “భారతదేశం జనవరి 26, 1950న రిపబ్లిక్ దేశంగా అవతరిస్తుంది. కానీ మనం అంతకు ముందే స్వతంత్రులుగా లేమా? ఈ స్వాతంత్య్రం స్థిరంగా, శాశ్వతంగా ఉంటుందా? మనం ఎందుకు బానిసలమయ్యాము?” అని ప్రశ్నించారు. ముహమ్మద్ బిన్ ఖాసిం దండెత్తి నప్పుడు, స్థానిక సేనాపతి వెళ్లి వారిని కలిశాడు. ముహమ్మద్ ఘోరీ దండెత్తినప్పుడు, రాజా జయచంద్ర వెళ్లి మొఘలులను కలిశాడు. బ్రిటిష్ వారు సిక్కు రాజ్యాన్ని నాశనం చేస్తూ పోరాడుతుండగా, గులాబ్ సింగ్ మౌనంగా ఉండిపోయాడు. 1857లో దేశం స్వాతంత్య్రం కోసం పోరాడుతున్నప్పుడు, చాలామంది మౌనంగా ఉండిపోయారు. మనం మన స్వాతంత్య్రాన్ని నిలబెట్టుకోగలమా? అనే ఆలోచన నన్ను కలవరపెడుతోంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దేశం గురించి ఆయనకు ఎంత ఆందోళన ఉంది? స్వాతంత్య్రం వస్తోంది, మన రాజ్యాంగం కూడా వస్తోంది. ఈ దేశ ప్రజలు ఎలా ప్రవర్తిస్తారు, వారు దేశభక్తితో ఉంటారా లేదా-ఇవే ఆయన్ను పట్టిపీడించిన అతిపెద్ద ఆందోళనలు.

భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకం

భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు ప్రారంభం కాబోతున్నప్పుడు, అంబేడ్కర్ మాట్లాడుతూ “ఒకే భాష మాట్లాడే వారందరూ ఒకే రాష్ట్రంలో ఎందుకు కలవాలో నాకు అర్థం కావడం లేదు. ఒకే భాష మాట్లాడే వారందరినీ పిలిచి ఒకే రాష్ట్రంలో సమీక రించడంలో అర్థం ఏమిటి? అందువల్ల, తెలుగు మాట్లాడేవారందరూ ఒకే తెలుగు రాష్ట్రంలో, మరాఠీ మాట్లాడేవారందరూ ఒకే మరాఠీ రాష్ట్రంలో, హిందీ మాట్లాడేవారందరూ ఒకే పెద్ద రాష్ట్రంలో నివసించాల్సిన అవసరం నాకు కనిపించడం లేదు.  రాజకీయ నిర్మాణం పరిపాలనా సూత్రాలపై ఆధారపడి ఉండాలి, దేశం మొత్తం మీద అందరికీ తప్పనిసరిగా ఒక కేంద్ర అధికారిక భాషను ఏర్పాటు చేయాలి. హిందీ నా మాతృభాష కాదు. అయినప్ప టికీ అన్ని రాష్ట్రాలు హిందీని స్వీకరించి, తమ తమ రాష్ట్రాలలో బోధించినప్పుడే మనం ఈ దేశాన్ని నిజంగా ఐక్యంగా, విశాలంగా ఉంచగలం.” అని సూచించారు.

విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ “ఆగస్టు 15, 1947న మనకు స్వాతంత్య్రం వచ్చిన ప్పుడు, మనకు శత్రువులు లేరు. 1948-49లో ఏం జరిగింది? కశ్మీర్ సమస్యతో భారతదేశం ఐక్యరాజ్యసమితికి వెళ్లినప్పుడు, అక్కడ భారతదేశానికి మద్దతు ఇచ్చే దేశం ఏదీ కనబడలేదు” అని వాపోయారు. చైనా టిబెట్‌ను ఆక్రమించుకోవడానికి వచ్చినప్పుడు అంబేడ్కర్ మాట్లాడుతూ “ఏమి జరుగు తోంది? మన ప్రధానమంత్రి ఏమి చేస్తున్నారు? భవిష్యత్తులో చైనా సరిహద్దు మన సరిహద్దును దాటుతుంది. ఆయనకు ఈ ప్రమాదం కనిపించడం లేదా? చైనా మన గడప వద్దకు వస్తోంది, నెహ్రూ కలల ప్రపంచంలో జీవిస్తున్నారు. మనల్ని మనం రక్షించుకోలేము” అని హెచ్చరించారు.

ఆయన రాజ్యాంగంలోని ఆర్టికల్ 370పై షేక్ అబ్దుల్లాతో చర్చించారు. ఆయన షేక్ అబ్దుల్లాతో ఇలా అన్నారు, “మీరు నాతో ఉన్నారు. భారతదేశం కాశ్మీర్‌ను కాపాడుతుంది. కాశ్మీరీలకు భారతదేశం అంతటా సమాన హక్కులు ఉంటాయి. కానీ కాశ్మీర్‌లో భారతదేశానికి, భారతీయులకు పూర్తి హక్కులు ఇవ్వడం మీకు ఇష్టం లేదా? నేను భారతదేశ న్యాయశాఖ మంత్రిని, నా దేశానికి జరిగే ఈ రకమైన మోసంలో, ద్రోహంలో నేను పాలుపంచుకోలేను” అని అన్నారు. ఆర్టికల్ 370పై ఆయన అభిప్రాయాల గురించి నేటి రాజకీయ నాయకులకు, అన్ని పార్టీలకు తెలుసా?

అందరూ ఆర్యులే

ఆర్యులు బయటి నుండి వచ్చారన్న వాదన ప్రాథమికంగా ఒక తప్పుడు సిద్ధాంతమని ఆయన అన్నారు. ఇది ఒక పిరికి విధానం. ఐరోపావాసులు అమెరికాకు వచ్చి స్థానిక ప్రజలను చంపి తరిమి వేసినట్లే, లేదా బయటివారు కెనడా, ఆస్ట్రేలియాలకు వెళ్లినట్లే, ఆర్యులు బయటి నుండి వచ్చి స్థానిక ప్రజలను చంపి తరిమివేశారని, దాని నుండి ఎస్సీలు ఉద్భవించారని ఇక్కడ నిరూపించాలని చూస్తున్నారు. ఇది తప్పు అని స్పష్టం చేశారు. నేటి సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయ నాయకులు ఆయన సిద్ధాంతం గురించి మాట్లాడరు. వారు మౌనం పాటిస్తారు. “ఈ భావననే తప్పుగా సృష్టించారు, దీనిని సమర్థించే ఆధారాలు కూడా లభించాయి. ఆర్యులు ఒక జాతి కాదు” అని అంబేడ్కర్ అన్నారు. రుగ్వేదంలో ‘ఆర్య’ అనే పదం 33 సార్లు కనిపిస్తుం దని, కానీ ఒక్కసారి కూడా అది ఒక జాతిని సూచించదని అంబేడ్కర్ రాశారు.

“భారతదేశంలోని శూద్రులందరూ ఆర్యులే,  శూద్రులు, క్షత్రియులు కూడా. రుగ్వేదంలోని తొమ్మిది మండలాలలో ‘శూద్ర’ అనే పదం ఎక్కడా కనిపించదు. దీనిని తరువాత దశమ మండలంలో చేర్చారు. ఆ తర్వాతే ‘శూద్ర’ అనే పదం వచ్చింది. శూద్రులు ఆర్యులు. శూద్రులు క్షత్రియ వర్గానికి చెందినవారు. వేణ రాజు, పురుఖ రాజు, నహుష రాజు, నిమి రాజు, సుదాస రాజు బ్రాహ్మణులతో ఘర్షణ పడ్డారు. వారు బ్రాహ్మణులను హింసించారు. ఆ అఘాయిత్యాలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే, బ్రాహ్మణులు విలపించసాగారు. దీనికి ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తెలియక, వారు ఆ క్షత్రియులకు యజ్ఞోపవీత ధారణను నిలిపివేశారు. ఆ శిక్ష సరిపోయింది. జంధ్యం స్వీకరించలేని క్షత్రియ వర్గం క్రమంగా విద్యకు దూరమయ్యారు. వారిని పూజలు, యజ్ఞాలు, ఆచారాల నుండి దూరం చేసి, ఆస్తి హక్కును కూడా హరించారు.యజ్ఞోపవీతం ధరించాలా వద్దా అన్నది ముఖ్యం కాదు; దానిని ధరించే హక్కు ఉందా లేదా అన్నదే ముఖ్యం. వారికి అసలు ఏ హక్కులూ లేవు. క్రమంగా, వారి సామాజిక హోదా క్షీణించింది. నేటి శూద్రులందరూ పూర్వపు క్షత్రియులే. వారి వంశాలు, వంశపారంపర్యాలు అవే” అని అంబేడ్కర్ తెలిపారు.

అతను ఇలా రాశాడు, “శూద్రులు ఆర్యులు. శూద్రులు సూర్యవంశీయులు. శూద్రులను క్షత్రియులుగా లెక్కించేవారు, మొత్తం మీద బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అనే మూడు కులాలు మాత్రమే ఉండేవి. ఒకసారి ఎవరికైనా జంధ్యం అందకుండా పోతే, అతనికి జంధ్యం వేసే కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు.” అని అంబేడ్కర్ రాశారు. శివాజీ మహారాజ్‌కు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించినప్పుడు, కొందరు “శివాజీ మహారాజ్ క్షత్రియుడు కానప్పుడు, ఆయనకు ఎలా పట్టాభిషేకం చేయగలరు?” అని ప్రశ్నించారు. సమర్థ రామదాస్ కాశీ నుండి పండిట్ గంగాభట్‌ను పిలిపించారు. గంగాభట్ ఒక వంశవృక్షాన్ని సంకలనం చేశారు. ఆ వంశవృక్షంలో, శివాజీ మహారాజ్ కొన్ని తరాల క్రితం రాజస్థాన్ నుండి వచ్చిన ఒక క్షత్రియుడు అని గంగాభట్ ధృవీకరిం చారు. ఆయన ఉపనయన సంస్కారం చేసుకుని ఉండవచ్చు. శివాజీ పట్టాభిషేకానికి ముందే ఆయన ఉపనయన సంస్కారం జరిగింది. అంతకు ముందే ఆయనకు రెండుసార్లు వివాహం జరిగింది. ఆయనకు రాజారామ్, సంభాజీ అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. శివాజీ ఉపనయన సంస్కారం తర్వాత, ఆయన పునర్వి వాహం చేసుకుంటారని ప్రకటించారు. శివాజీ తన భార్యలు, పిల్లల సమక్షంలో పునర్వివాహం చేసుకున్నారు. దీని తర్వాత ఆయన పట్టాభిషేకం జరిగింది. ఒక సంప్రదాయం ఉద్భవించినప్పుడు, అది లోతుగా పాతుకుపోతుందని మనం చెప్పవచ్చు.

పంజాబ్‌లోని అంటరాని వారుగా పిలవబడే చుహార్లు, యునైటెడ్ ప్రావిన్సెస్ (ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్) బ్రాహ్మణులకు ఒకే ముక్కు ఆకారం ఉంది. చమార్లు, బీహార్‌లోని అంటరానివారు. వారికి, బీహార్‌లోని బ్రాహ్మణులకు ఒకే ముక్కు ఆకారం ఉంది. కర్ణాటకలోని అంటరానివారు, బ్రాహ్మణులకు ఒకే ముక్కు ఆకారం ఉంది. తమిళనాడులోని చెర్మల్‌లు, బ్రాహ్మణులు, అయ్యంగార్లు, అయ్యర్‌లకు ఒకే నాసికా సూచిక ఉంది. అది బీహార్, పంజాబ్, మహారాష్ట్ర, లేదా తమిళనాడు ఏదైనా సరే, అక్కడి అంటరాని వారికి, అగ్రవర్ణాలకు చెsదినవారికి ఒకే నాసికా సూచిక ఉందని అంబేడ్కర్ పేర్కొన్నారు. ప్రముఖ మానవ శాస్త్రవేత్తలు ఈ కులాలన్నీ ఒకే గోత్రాన్ని పంచు కుంటాయని నమ్ముతారు. అంటరానివారి గోత్రం, బ్రాహ్మ ణుల గోత్రం ఒకటే. అందువల్ల, వారందరికీ ఒకే పూర్వీకులు ఉన్నారని చెప్పవచ్చు.

ముస్లింలకు తలొగ్గరాదు

భారత దేశంలో ముస్లిం సమస్య చాలా పెద్దది. ఆయన ఈ విషయంపై ఒక బృహత్తర పరిశోధనా పత్రాన్ని రాశారు. ఇది ఎలా పరిష్కారమవుతుందో మన మిత్రులు అధ్యయనం చేయాలి. “కాంగ్రెస్ ముస్లింల డిమాండ్లన్నింటికీ ఇలాగే తలొగ్గుతూ ఉంటే, అది ఏ పరిష్కారానికీరాదు. ఇలాంటి డిమాండ్లకు తలొగ్గుతూ ఉండటం ఎప్పటికీ రాజీకి గానీ, సమానత్వానికి గానీ దారితీయదు” అని ఆయన తేల్చి చెప్పారు.

“సైమన్ కమిషన్ భారతదేశానికి వచ్చినప్పుడు, ముస్లిం లీగ్ బొంబాయి ప్రెసిడెన్సీ నుండి సింధ్‌ను వేరు చేయాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్ అవసరం ఏమిటి? బొంబాయి ప్రెసిడెన్సీ నుండి సింధ్‌ను ఎందుకు వేరు చేయాలి? కొన్ని జిల్లాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్నారన్నది నిజమే. కానీ, మెజారిటీ ప్రజలున్న చోట ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా?” అని అంబేడ్కర్ ప్రశ్నించారు. ఆ సమయంలో అంబేడ్కర్ ఒక ప్రత్యేక నివేదికను సమర్పించారు. బొంబాయి ప్రెసిడెన్సీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ అభిప్రాయాన్ని వ్యతిరేకించారు. తరువాత, 1932లో, సింధ్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, కమ్యూనల్ అవార్డును ఆమోదించారు. ఈ రెండు చర్యలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మౌలానా ఆజాద్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పెద్ద జాతీయవాద నాయకుడు, కానీ ఆయన ఏం చెబుతున్నారు?అని నిలదీశారు. హిందువులు మెజారిటీగా తొమ్మిది ప్రావిన్సులు ఉన్నాయి. సింధ్ అనే కొత్త ప్రావిన్స్ ఏర్పాటుతో, ఇప్పుడు ముస్లింలు మెజారిటీగా ఉన్న ప్రావిన్సులు ఐదు అవుతాయి. హిందువులు ఏదైనా చేస్తే, మీరు(ముస్లింలు) ప్రతీకారం తీర్చుకోవచ్చు అని మౌలానా ఆజాద్ అన్న మాటలను అంబేడ్కర్ ప్రస్తావించారు. “ ఇది మీకు జాతీయవాద భాషలా అనిపిస్తోందా? కమ్యూనల్ అవార్డు, హిందూ-మెజారిటీ ప్రావిన్సులలో ముస్లింలు మైనారిటీలుగా ఉన్నారని భావించి, వారికి అదే శాతం సీట్లను కేటాయించింది. హిందువులు మైనారిటీగా ఉన్న ముస్లిం ప్రావిన్సులలో వారికి అదే వాటా ఇస్తారా? ముస్లింలు మైనారిటీగా ఉన్న చోట వారి సీట్లను పెంచినప్పుడు, మైనారిటీలో ఉన్న హిందువుల సీట్లను ఎందుకు పెంచరు?” అని ఆయన ప్రశ్నించారు.

భారత్‌పై ముస్లిం దండయాత్రలు

“ఐక్యతను సాధించగల అంశాలు ఏమిటి? క్రీ.శ. 711 నుండి చరిత్ర యుద్ధాలు, దండ యాత్రలు, అత్యంత క్రూరమైన సంఘటనలతో నిండి ఉంది. భారతదేశంపై దాడి చేసిన వారిలో చాలా మంది ముస్లింలు ఉన్నారు. వారి ఉమ్మడి లక్ష్యం ఒక్కటే: హిందూ మతాన్ని నాశనం చేయడం. చారిత్రక, మతపరమైన, సాంస్కృతిక, సామాజిక సంఘర్షణలు కలిసి ఒక లోతైన రాజకీయ విభజనను సృష్టించాయి. హిందూ-ముస్లిం ఐక్యత గురించి మాట్లాడేవారు ఒక విషయం గుర్తుంచుకోవాలి: ఈ సంఘర్షణకు చారిత్రక, మతపరమైన, సాంస్కృతిక, సామాజిక కారణాలున్నాయి. పైకి కనిపించే రాజకీయ వ్యతిరేకత ఉపరితలమైనది మాత్రమే. ఇవన్నీ కలిసి ఒక లోతైన అగాధాన్ని సృష్టిస్తున్నాయి, దానిని పూడ్చడం అంత సులభమైన పని కాదు. మౌలానా మహమ్మద్ అలీ తనను తాను నిజమైన ముస్లింగా భావించు కుంటారు. నిజమైన ముస్లిం భారతదేశంలో ఖననం కావడానికి నిరాకరిస్తాడు. అతడిని ఖననం కోసం జెరూసలేంకు తీసుకువెళ్తారు” అని అంబేడ్కర్ పేర్కొన్నారు. నిజమైన ముస్లిం భారతదేశాన్ని తన మాతృభూమిగా భావిస్తాడా? అనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఒకవేళ ఆఫ్ఘనిస్తాన్ దాడి చేస్తే, భారతదేశంలోని ముస్లింలు ఎక్కడికి వెళ్తారు? ఇది మనం పరిగణించాల్సిన విషయం. మొదటి ఆఫ్ఘన్ దండయాత్ర సమయంలో ముస్లింలు ఎలా ప్రవర్తించారో మనం మర్చిపోవాలా? అని ప్రశ్నించారు. విభజన అవసరమైతే, మొత్తం జనాభాను ఒకేసారి మార్పిడి చేయాలి. అప్పుడు ఈ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుంది. నేను ముస్లిం భారతదేశం, ముస్లిమేతర భారతదేశాన్ని విశ్వసిస్తాను. ఈ సమస్యకు యూరప్ ఒక పరిష్కారాన్ని కనుగొంది. ఈజిప్ట్, బల్గేరియా సహా ఎనిమిది దేశాలు తమ మైనారిటీలను పూర్తిగా మార్పిడి చేసుకుని ఈ సమస్య నుండి బయట పడ్డాయని అంబేద్కర్ రాసుకొచ్చారు. ఈ సందర్భంగా హైదరాబాద్ (ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న హైదరాబాద్)లో నివసిస్తున్న అల్పసంఖ్యాక వర్గీయులను ఆయన హెచ్చరించారు.

“విభజనకు ముందు ప్రజల భద్రతకు హామీ ఇవ్వండి. ఆ తర్వాత ఏం చేసినప్పటికీ ఏం ప్రయోజనం ఉంటుంది?” అని కూడా ఆయన ప్రభుత్వంతో అన్నారు. చాలా మంది ప్రజలు హైదరాబాద్‌లోనే ఉండిపోయారు. వారు ప్రమాదంలో ఉన్నారు. ముస్లిం ఐక్యత వారిని ముస్లింలుగా మారుస్తోంది. వారు నిస్సహాయులుగా ఉన్నారు. అంబేడ్కర్ వారికి ఒక లేఖ పంపారు, అందులో “ఎట్టి పరిస్థితుల్లోనైనా భారతదేశానికి రండి. ఒక్కసారి మీరు హిందూ ధర్మాన్ని విడిచిపెడితే, శాశ్వతంగా దూరమైపోతారు. నేను మిమ్మల్ని పవిత్రపరిచి, తిరిగి హిందువులుగా చేస్తాను. భారతదేశానికి రండి” అని పిలుపునిచ్చారు. ఇది హైదరాబాద్‌లోని తన తోటి షెడ్యూల్డ్ కులాల వారికి అంబేడ్కర్ ఇచ్చిన పిలుపు. “నేను హిందూ సమాజానికి తప్పకుండా ఒక షాక్ ఇస్తాను. అలాంటి షాక్ చికిత్స అవసరం” అని ఆయన సంకల్పించుకున్నట్లు మనం చూడవచ్చు. 1935లో ఆయన, “నేను హిందువుగా పుట్టాను” అని అన్నారు.

హిందువులు మాకు సోదరులు

1956లో, తన జీవితం ఎక్కువ కాలం లేదని ఆయనకు అనిపించడం మొదలైంది. ఆయన గాంధీజీకి “నేను దేశానికి అత్యంత ప్రయోజనం చేకూర్చే మార్గాన్ని అనుసరిస్తాను” అని వాగ్దానం చేశారు. ఈ కారణంగా, ఆయన బౌద్ధమతాన్ని స్వీకరించారు. 1935 నుండి 1956 వరకు, హిందూ సమాజం ఎలా స్పందిస్తుందో, వారు(హిందువులు) ఉదార మనఃపరిస్థితిని ప్రదర్శిస్తారో లేదో అని ఆయన వేచి చూశారు. చివరకు, ఆయన బౌద్ధమతంలోకి మారారు. పోప్, నిజాం ప్రతినిధులు కూడా ఆయన వద్దకు వచ్చారు. ఆయన వారందరినీ తిరస్క రించారు. “నేను క్రైస్తవ మతంలోకి గానీ, ఇస్లాంలోకి గానీ మారితే, ఈ దేశం గొప్ప ప్రమాదంలో పడుతుంది. అందువల్ల, ఈ దేశపు మౌలిక తత్వంతో నన్ను అనుసంధానించే మార్గాన్ని నేను అనుసరిస్తున్నాను. దలైలామా బౌద్ధులను, హిందువు లను ఆధ్యాత్మిక సోదరులుగా భావిస్తారు. మనం తమ్ముళ్లం; భారతదేశంలోని హిందువులు మన అన్నలు” అని అంబేడ్కర్ అన్నారు. తద్వారా దేశానికి అతి తక్కువ హాని కలిగించే మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు.

ఆయన ఈ దేశపు సాంస్కృతిక, భావజాల, నైతిక, తాత్విక వారసత్వంతో అనుసంధానమై ఉన్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, అంబేడ్కర్ జీవితం బహుముఖమైనది. ఆయన తన అధ్యయనాలు, అనుభవాల ఆధారంగా అనేక విషయాలపై విస్తృతంగా రాశారు. తీవ్రమైన పేదరికంలో, అంటరానితనం అనే అవమానకరమైన వాతా వరణంలో పుట్టి పెరిగిన ఆయన, ఉత్తమ డిగ్రీలు పొందిన తర్వాత కూడా గౌరవాన్ని పొందలేక పోయారు. ఇంతటి జ్ఞానంతో, కొన్ని విషయాలు ఆయన మనసులో మెదలవచ్చు. అవి ప్రజలకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. ఆయన ‘రిడిల్స్ ఇన్ హిందూయిజమ’ అనే ఒక చిన్న పుస్తకాన్ని కూడా రాశారు, కానీ దానిని ప్రచురించ లేదు. చనిపోయే వరకు దానిని తన బీరువాలోనే ఉంచారు. అందులో చాలా పంక్తులు ఉన్నాయి, వాటి కింద ఉన్న సంపాదకీయ గమనికలో ఆ పంక్తులను చెదలు తినేశాయని రాసి ఉంది. ఆయన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నాయి.

అశాంతిలోనూ ప్రశాంత చిత్తం

సమాజ పరిస్థితులు మారినకొద్దీ, ఆయన నమ్మకాలు కొద్దికొద్దిగా మారాయి, కానీ ఆయనలోని దేశభక్తి, సమాజాన్ని తనతో పాటు తీసుకువెళ్లాలనే ఆయన కోరిక మాత్రం మారలేదు. ఇది చాలా ప్రాథమికమైనది. అందువల్ల, ఆయన పుట్టినప్పటి నుండి చివరి శ్వాస వరకు భారతీయుడిగానే ఉండిపోయారు. బౌద్ధమతంలోకి మారారు. హిందూ సమాజంలోని కపటత్వం, నిందలు, మితిమీరిన కర్మకాండలు, అనైతిక ప్రవర్తన పట్ల ఆయనకు కోపం వచ్చింది. అయినప్పటికీ, ఆయన మౌలిక తత్వశాస్త్రం ద్వారా భారత నేలతో అనుబంధాన్ని నిలుపుకున్నారు. ఆయన జీవితం తీవ్రమైన అశాంతితో నిండి ఉన్నప్పటికీ, ఆయన మనసు మాత్రం ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేది. ఆయన జీవితం పోరాటాలతో నిండి ఉంది, కానీ ఆయనకు శత్రువులు లేరు. ఆయన బ్రాహ్మణ్యాన్ని వ్యతిరేకిం చారు, కానీ బ్రాహ్మణులు అతనికి మంచి స్నేహితులుగా ఉండేవారు. మొదట్లో ఆయన శ్రీరాముని భక్తునిగా కనిపిస్తూ, రామ మందిరానికి వెళ్లడానికి ప్రయత్నించారు, కానీ తరువాత హిందూ మతంలో ఉండ కూడదని కూడా అన్నారు. పూనా ఒప్పందం సమయంలో, మహాత్మా గాంధీ వస్తారు, వెళ్తారు, మహాత్మా గాంధీ అమరులు కారు అని చెబుతూ ఆయన గాంధీని కఠినంగా మందలించారు. గాంధీ మరణం పట్ల ఆయన తీవ్రంగా దుఃఖించారు. రాజ్యాంగ ముసాయిదాను రూపొందించడానికి మహాత్మా గాంధీ కూడా ఆయనను పిలిపించారు.

స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పక్కకు తప్పుకున్నట్లు మనకు అనిపిస్తుంది, కానీ హృదయ పూర్వకంగా దానితోనే నిలబడ్డారు.  హిందూ ధర్మాన్ని త్యజించాలనే తన ఉద్దేశాన్ని ప్రకటించారు. కానీ ఆ పనిచేయడానికి 21 సంవత్సరాలు వేచి ఉన్నారు. ఆయన కాంగ్రెస్‌కు బద్ధ శత్రువు, అయినప్పటికీ కాంగ్రెస్ మంత్రివర్గంలో చేరారు. ఆయన పుట్టుకతోనే విశాల హృదయం గల వ్యక్తి అని, ఈ దేశానికి భాగ్యవశాత్తూ లభించిన వ్యక్తి అని మనం చెప్పవచ్చు. ఆయన అద్భుతమైన జీవితం అనేక విషయాలకు నిదర్శనం. అటువంటి అసాధారణ వ్యక్తులలో విధి నిర్దేశించిన ఒకటి లేదా రెండు గుణాలు ఉంటాయని మనం మొదట్లోనే పేర్కొన్నాం. ఇతర ప్రతిభలు గుప్తంగానే ఉండిపోతాయి.

చివరిగా, మనం డాక్టర్ అంబేడ్కర్‌ను సాపేక్షతా దృక్పథంతో, సమగ్రంగా అర్థం చేసుకోవాలని నా అభ్యర్థన. ఆయన సాధించాలని సంకల్పించిన లక్ష్యం నెరవేరలేదు. ప్రతి గ్రామంలోని పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. ఆర్థిక, సామాజిక, లేదా రాజకీయమైనా సరే, సామాజిక అసమానతలను మనం వీలైనంత త్వరగా పరిష్కరించాలి. యావత్ దేశం ఐక్యంగా నిలబడాలి. దేశానికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. దేశం తన పూర్వ వైభవాన్ని తిరిగి పొందాలి. మన సమాజం ఒకే స్ఫూర్తితో, ఒకే ఆలోచనతో, ఒకే ఆత్మగౌరవంతో ఐక్యంగా నిలవాలి. మనం వేద ఋషుల దార్శనికతతో, మహాత్మా బుద్ధుని విశ్వాసాలతో దృఢంగా నిలబడి, ప్రపంచంలో మనకంటూ ఒక ఉన్నత స్థానాన్ని ఏర్పరచుకోవాలి. ఇది డాక్టర్ అంబేడ్కర్ ఆకాంక్ష కూడా.

– ‘పాంచజన్య’ నుంచి

డా. కృష్ణగోపాల్

సహ సర్‌కార్యవాహ, ఆరఎసఎస్

About Author

By editor

Twitter
YOUTUBE