యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి ఒకవైపు, దేశంలో చమురు, గ్యాస్‌కు ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు నెలకొన్న తరుణంలో భారత్ సహా రష్యా, చైనా, ఇరాక్, పాకిస్తాన్‌లు హార్ముజ్ జలసంధి గుండా నౌకల రవాణాకు అనుమతిస్తామని ఇరాన్ ప్రకటించినా, జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే మాటపై ఎంతవరకు నిలబడుతుందో తెలియడం లేదు. ఎందుకంటే ఇరాన్ ఇప్పుడు హార్ముజ్ జలసంధిపై మరింత పట్టు బిగిస్తోంది. తనకు పూర్తి మద్దతుగా ఉన్న చైనాకు చెందిన రెండు నౌకలను కూడా మార్చి 27న ఈ జలసంధి గుండా ప్రయాణించకుండా అడ్డుకుంది. సీఎస్‌సీఎల్ ఇండియన్ ఓషన్, సీఎస్‌సీఎల్ ఆర్కిటిక్ ఓషన్ అనే పేరుగల ఈ రెండు నౌకలు చైనాకు చెందిన సీఓఎస్‌సీఓ సంస్థకు చెందినవి. ఈ రెండు నౌకలు పర్షియన్ గల్ఫ్‌ను దాటడానికి యత్నించగా ఇరాన్ బలవంతంగా వెనక్కు మరలించడం తాజా పరిణామం. చైనా పతాకాలున్నప్పటికీ ఇరాన్ వాటిని అనుమతించక పోవడం గమనార్హం.
యుద్ధా విరమణకు మధ్యవర్తిత్వం వహిస్తామని పాకిస్తాన్ చెబుతున్న వేళ, మార్చి 25న కరాచీకి వెళుతున్న పాక్ చమురు నౌక ‘సెలెన’ను హార్ముజ్ జలసంధినుంచి వెనక్కు పంపేసింది. తర్వాత రెండు రోజులకు హార్ముజ్ జలసంధిని దాటుతున్న ఆ దేశ చమురు నౌకపై ఇరాన్ దాడిచేసి ధ్వంసం చేసింది. దుబాయ్ – అబుదాబీ సముద్ర తీరంలో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయకుండానే ఈ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి ఇరాన్ ఫీజు వసూలు చేయడమే కాదు, ఈ చెల్లింపు వ్యవస్థను పార్లమెంట్ ఆమోదం ద్వారా అధికారికం చేయాలని ప్రయత్ని స్తోంది. హార్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకుంటా మని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనే ఇరాన్ వైఖరిలో మార్పునకు కారణమని వేరే చెప్పాల్సిన పనిలేదు.
ఇంటర్నెట్ కేబుళ్లు తెంచే యోచన
సముద్రగర్భంలోని ఇంటర్నెట్ కేబుళ్లను తెంచేసే ఆలోచనలో ఇరాన్ ఉన్నట్టు వస్తున్న వార్తలు మరింత కలవరం కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ డేటా రవాణా 95 నుంచి 97శాతం వరకు సముద్రగర్భం గుండా జరుగుతోంది. ఎర్ర సముద్రం, హార్ముజ్ జలసంధి గుండా వెళ్లే కేబుళ్లు ఆసియా, ఐరోపా, ఆఫ్రికా ఖండాలను అనుసంధా నిస్తున్నాయి. ఇరాన్ తాజా హెచ్చరికలతో ఈ కేబుళ్లకు ముప్పు వాటిల్లే ప్రమాదముందని నిపుణులు భయపడుతున్నారు. ఇది ఇరాన్ అనుసరిస్తున్న “గ్రే జోన్ వార్ ఫేర”గా పేర్కొంటున్నారు. దీని వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్తంభించిపోవడం ఖాయం! గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు ఇప్పటికే తమ కేబుల్ ప్రాజెక్టుల విషయంలో ఆందోళన చెందుతున్నాయి. “2 ఆఫ్రికా పర్ల్స” వంటి భారీ ప్రాజెక్టుల పనులు ఇప్పటికే నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్‌టెల్ వంటి సంస్థలతో చర్చలు జరిపి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించడం తాజా పరిణామం.
పరస్పర షరతులు
దేశీయంగా, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు తీవ్రం కావడం, అనవసర యుద్ధం అమెరికా నెత్తిన రుద్దారంటూ దేశ ప్రజల్లో వ్యక్తమవుతున్న అసహనం, దారుణంగా పడిపోతున్న రేటింగ్ నేపథ్యంలో, ఈ యుద్ధం నుంచి తన ‘అహం’ దెబ్బతినని రీతిలో బయటపడాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇందుకోసం ఆయన 15 ప్రతిపాదనలను ముందుకు తెచ్చారు. ఇందుకు ప్రతిగా ఇరాన్ ఎనిమిది షరతులు విధించింది. ఇక్కడ పరస్పర ప్రతిపాదనలను మోసుకెళ్లే ఒక వార్తాహరుడి పాత్రను పాకిస్తాన్ పోషించింది అంతే! మధ్యవర్తిత్వం అంటే సంఘర్షణలో ఉన్న అన్ని పార్టీలతో చర్చలు జరపగలగడం. కానీ పాకిస్తాన్‌ను తన దరిదాపుల్లోకి కూడా ఇజ్రాయెల్ రానీయదు. అమెరికా చెప్పినట్లు తాను వినాలి తప్ప, డోనాల్డ్ ట్రంప్‌నకు చెప్పగలుగు తుందా? అంటే ఇక్కడ పాకిస్తాన్ తన బాస్ అమెరికా తరపున ఒక దళారిగా వ్యవహరిస్తున్నదనేది అక్షరసత్యం. దీన్ని మధ్యవర్తిత్వమని ఎలా అనగలం? కనీసం దీన్ని ఎంతమాత్రం ఆలోచించకుండా మనకన్నా చిన్నదేశమైన పాకిస్తాన్ యుద్ధం ముగింపునకు ముందుకొచ్చిందని, కానీ మనదేశం నోరు మెదపలేదని విమర్శించడం వెనుక ఔచిత్యం విపక్ష నేతలకే తెలియాలి!
పాక్ అగమ్యగోచరం
అసలు పాకిస్తాన్ పరిస్థితేంటో అర్థం కావడం లేదు. ఒకపక్క ఇరాన్`యుఎస్/ఇజ్రాయెల్ యుద్ధంలో మధ్యవర్తిత్వం వహిస్తున్నానని రొమ్ములు విరుచుకొని ముందుకెళుతున్న పాక్‌కు శరాఘాతం వంటి సంఘటనలు ఎదురవుతున్నాయి. ఇరాన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం సమీపంలో క్షిపణులతో దాడులు జరపడం ద్వారా ఇజ్రాయెల్ గట్టి హెచ్చరిక చేసింది. ఇక ఏ అమెరికా అయితే చంకనెక్కించుకుందో, అక్కడి కాంగ్రెష్‌నల్ రీసెర్చ్ సర్వీస్ ఇటీవల విడుదల చేసిన నివేదికలో లష్కరే తొయ్యబా, జైషే మహ మ్మద్ వంటి ఉగ్రసంస్థలు పాక్ కేంద్రంగా పనిచేస్తున్నాయని, భారత్‌ను లక్ష్యంగా చేసుకొని ఇవి పనిచేస్తున్నాయని స్పష్టం చేసింది. ఈ సంస్థలు దేశీయంగా, అంతర్జాతీయంగా, కొన్ని ఆఫ్ఘన్‌కు సంబంధించి మరికొన్ని భారత్`కశ్మీర్ లక్ష్యంగా పనిచేస్తున్నాయని పేర్కొంది. టీటీపీ (తెహ్రిక్ ఏ తాలిబన్) దేశంలో అత్యంత ప్రమాదకర ఉగ్రవాద సంస్థగా రూపొందిందని వివరించింది. అంతకు ముందు తులసీ గబార్డ్ నేతత్వంలోని కమిటీ, భవిష్యత్తులో అమెరికాకు పాకిస్తాన్‌వల్ల అణు ప్రమాదం ఉందని హెచ్చరించడం గమనార్హం.
జె.డి.వాన్స్ ఆగ్రహం
ఇరాన్‌పై విజయం విషయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తమను తప్పుదోవ పట్టించారని అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్ కోపంతో ఉన్నారు. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్‌కాల్ సంభాషణ అంశాన్ని ఒక వార్తాసంస్థ బయటపెట్టిన నేపథ్యంలో ఇది బయటకు వచ్చింది. ఇరాన్‌లో ప్రభుత్వం కుప్పకూలడంతో యుద్ధం త్వరగా ముగుస్తుందని ఇజ్రాయెల్ ప్రధాని వేసిన అంచనాలు తప్పని మండిపడ్డట్టు కూడా తెలుస్తోంది. ఒకవైపు ఏదో విధంగా ఈ యుద్ధం నుంచి బయటపడాలని యు.ఎస్. ప్రయత్నిస్తుంటే, ఇరాన్ అసలు చర్చల ప్రసక్తేలేదని తేల్చిచెప్పడం, మరోవైపు ఇరాన్, ఇజ్రాయెల్‌లు తమ దాడులను కొనసాగిస్తుండటం చూస్తుంటే, ఈ యుద్ధం ముగింపు డోనాల్డ్ ట్రంప్ చేతుల్లో లేదని, పరిస్థితులు చేయిదాటి పోయాయన్నది సుస్పష్టం. ఇదే సమయంలో ఇజ్రాయెల్, జె.డి.వాన్స్‌ను బలహీనపరచేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ విషయంలో ట్రంప్, వాన్స్‌ల మధ్య స్వల్ప విభేదాలున్నట్లు స్పష్టమైంది. దీనికితోడు అమెరికా శాంతి ప్రతిపాదనలను ఇజ్రాయెల్ అంగీక రించడంలేదు. ఇరాన్ అంతు చూడాల్సిందేనన్న పట్టుదలతో బెంజమిన్ నెతన్యాహు తన ప్రణాళికను కట్టుదిట్టంగా అమలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ శాంతికి అంగీక రించకపోతే, యు.ఎస్.లో శక్తిమంతమైన యూదుల లాబీ, దేశ నాయకత్వాన్ని యుద్ధంవైపునకే మొగ్గుచూపేలా చేస్తుంది. అందువల్ల ఈ యుద్ధంలో డోనాల్డ్ ట్రంప్ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. ఏతావాతా చెప్పొచ్చేదేమంటేñ యుద్ధం ముగింపు కేవలం ఇజ్రాయెల్ చేతిలో ఉన్నదనేది సుస్పష్టం. ఒకవైపు హార్మూజ్ జలసంధి సమస్య కొనసాగుతుండగానే ఇజ్రాయెల్ నిశ్శబ్దంగా తాను చేయాలనుకుంటున్న పనులు కానిచేస్తున్నది. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్‌పై జరిపిన దాడిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ నౌకాదళాధిపతి అలీరెజా టాంగ్సిరీ మరణిం చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. యు.ఎస్. ఒకవైపు ఐదురోజుల యుద్ధ విరామం ప్రకటించినప్పటికీ, రెండోవైపు ఇరాన్`ఇజ్రాయెల్‌ల మధ్య పరస్పర దాడులు కొనసాగుతుండటాన్ని చూస్తే, ఈ యుద్ధంపై యు.ఎస్.కు నియంత్రణ లేదన్నది స్పష్టమైంది. ఇప్పుడు ఇరాన్‌కు మద్దతుగా యెమెన్‌లోని హూతీలు కూడా రంగంలోకి దిగారు. వారికి మద్దతుగా హిజ్బుల్లా ఉగ్రవాద సంస్థ నిలుస్తోంది. ఎర్ర సముద్రంలో ఏటా కనీసం లక్షకోట్ల వాణిజ్యం జరిగే కీలకమైన బాబ్ ఎల్ మందెబ్ జలసంధిని హూతీలు మూసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే ప్రపంచ దేశాలు మరింత ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోక తప్పదు.అమెరికా తమ గగన తలాలను ఉపయోగించుకోవడానికి అనుమతించడానికి వీల్లేదని ఇరాన్ హుకుం జారీచేయడంతో గల్ఫ్ దేశాలు బిక్కుబిక్కు మంటున్నాయి. తమకు తాగునీటి ఆధారమైన డీసాలినేషన్ కేంద్రాలపై ఇరాన్ దాడులకు పాల్పడితే పరిస్థితేంటన్న భయం వాటిని వెంటాడు తోంది. కువైట్ ప్రాంతంలో 90% తాగునీరు ఇదే. మార్చి నెల మొదట్లో బహ్రెయిన్ దేశంలోని ‘డీసాలినేషన’ ప్లాంట్‌పై ఇరాక్ దాడి చేయడంతో అది కొంతమేర దెబ్బతిన్నది.
యుద్ధం వల్ల ఏర్పడిన ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో అర్జెంటీనా మనదేశానికి గ్యాస్ సరఫరా చేయడానికి ముందుకొచ్చింది. 2024కు ముందు మనకు అర్జెంటీనా నుంచి గ్యాస్ దిగుమతి ఉండేది కాదు. కానీ 2025లో ప్రభుత్వ చొరవతో 22వేల టన్నుల గ్యాస్ మనకు సరఫరా చేసింది. ఈ ఏడాది తొలి మూడు నెలల్లోనే ఇది 50వేల టన్నులకు చేరింది. మార్చి 5న 11వేల టన్నుల గ్యాస్‌తో ఆ దేశ నౌక మనదేశానికి చేరుకుంది. అర్జెంటీనా మనకు 20వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత్‌కు దీర్ఘకాలం పాటు గ్యాస్ సరఫరా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అర్జెంటీనా రాయబారి మారియానో అగస్టిన్ కాసియోనో ప్రకటించారు. ఖర్చులు భారమైనా సంక్లిష్ట స్థితినుంచి బయటపడేందుకు ప్రభుత్వం అర్జెంటీనా గ్యాస్‌కు ఆమోదం తెలిపింది. ఇరాన్ నుంచి కూడా నెలరోజుల పాటు చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి ఇవ్వడంతో ఇరాన్‌నుంచి చైనాకు వెళుతున్న ఎల్‌పీజీ ట్యాంకర్ అరోరాను మంగళూరు పోర్టుకు మళ్లించారు. ప్రస్తుతం పర్షియన్ గల్ఫ్‌లో చిక్కుకుపోయిన మన చమురు నౌకల తరలింపుతో పాటు, ఖాళీ కార్గోలను నింపే పని జరుగుతోంది. అమెరికా, జపాన్, ద.కొరియా, పాకిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాల్లో పెట్రోల్ ధరలు పెరిగినా మనదేశంలో స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతేకాదు కేంద్రం పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ పన్నును తగ్గించడంతో లీటరుకు రూ.10 ధర తగ్గింది. గల్ఫ్ దేశాలనుంచే కాకుండా మొత్తం 41 దేశాలనుంచి చమురు, గ్యాస్‌ను మనదేశం కొనుగోలు చేస్తోంది. వచ్చేనెల డెలివరీలకోసం మనదేశ చమురు కంపెనీలు రష్యానుంచి 60మిలియన్ బ్యారళ్ల చమురుకు ఆర్డర్లు ఇచ్చాయి. ఫిబ్రవరి నెలలో చేసిన కొనుగోళ్లకంటే ఇవి ఎక్కువ. వెనెజులా నుంచి ఏప్రిల్ నెలలో ఏకంగా 20లక్షల బ్యారళ్ల చమురు కొనుగోలు చేసింది. 2020 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో ఆ దేశం నుంచి చమురు కొనడం ఇదే ప్రథమం. ఇటీవల భారత్‌కు చెందిన అధికార్ల బదం టెహ్రాన్‌కు వెళ్లి అక్కడి అధికార్లతో రసాయన ఎరువుల సరఫరాపై జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి.ఇరాన్ ప్రకటనతో సౌదీ అరేబియా, ఖతార్ దేశాలనుంచి రసాయన ఎరువులు ఎటువంటి ఆటంకం లేకుండా మనదేశానికి చేరగలవు. ఇది వచ్చే ఖరీఫ్ సీజన్‌కు గొప్ప ఊరట.
భారత్ విశ్వసనీయ భాగస్వామి
హార్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్ తమకు అత్యంత విశ్వసనీయ భాగస్వామి అని ఇరాన్ ప్రకటించడం విశేషం. ఈవిధం గా ఇరాన్ ఇప్పటి వరకు చైనా, రష్యాలకు అనుకూల దౌత్య వైఖరినుంచి, బహుళ దౌత్య విధానానికి మారుతున్నట్టు స్పష్టమవుతోంది. చబ్బహార్ పోర్టు నిర్వహణపై మరో పదేళ్లపాటు ఒప్పందాన్ని పొడిగించడం, ఇరాన్‌పై పశ్చిమ దేశాల ఆంక్షలను సమర్థించకపోవడం వంటి అంశాలు మనదేశాన్ని విశ్వసించడానికి ప్రధాన కారణాలు. ఇరాన్‌కు దన్నుగా జమ్ము-కశ్మీర్ ప్రజలు నగదు మొదలుకొని పలురకాల మానవతా సహాయాన్ని విరాళాల రూపంలో సేకరించి పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరాన్ తాను ప్రయోగిస్తున్న క్షిపణులపై “థాంక్యూ పీపుల్ ఆఫ్ ఇండియా” అంటూ రాసి మరీ ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తూ కృతజ్ఞతలు తెలుపుతోంది. ఇరాన్ మీడియాతో పాటు ముంబయిలోని ఇరాన్ కాన్సులేట్ కూడా ఈ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.

జమలాపురపు విఠల్‌రావు,
సీనియర్ జర్నలిస్ట్