‘జాగృతి’ నిర్వహించిన స్వర్గీయ కొండపాక కిషన్‌రావు స్మారక
నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన రచన
‘‘అ రె.. డిండిమా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ఎలా ఉన్నావ్? రా రా పైకి రా మిత్రమా..’’ చాలా ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించాడు అంకాల. డిండిమ నీతినిజాయితీలు అంకాలకు ఇష్టం. గణపతిదేవుడు ఇచ్చిన గొప్ప హోదా, స్థాయి వదిలేసి తిరిగి ప్రజాక్షేత్రంలోకి వెళ్లిపోయిన డిండిమ ప్రజలకు మరింత ఇష్టంగా మారాడు. ప్రజాహితైషి అయిన గణపతిదేవునికి ప్రజలవాణి వినిపించడానికి తనలాంటి వారికి ఆవకాశం కల్పించిన అంకాల శెట్టి అంటే డిండిమకు ఉన్నత అభిప్రాయం.
దుమ్ముకొట్టుకుపోయిన దుస్తులలో ఉన్న డిండిమ అలసినట్లు కనిపిస్తున్నాడు. దగ్గరగా వచ్చి అంకాలకు మరిన్ని వందనాలు చేస్తూ ఆయన ప్రక్క పల్యంకంలో కూలబడ్డాడు. దాదాపు పదిహేనేళ్లు అవుతోంది చూసి. వయసు పెరిగింది కాని శరీరం ప్రజా జీవనంలో మరింత కృంగినట్లు బక్కచిక్కినట్లు కనపడుతున్నాడు. కాని కళ్లలో అదే చురుకు వెలుగు.. నిర్భీతి..
‘‘కాస్త దాహం ఇప్పించండి..’’ అన్నాడు డిండిమ.
అప్పటికే పరిచారిక మంచినీళ్ల చెంబు, చెరకు రసమున్న కొప్పెర పెట్టి ఉన్న పళ్లెరంతో వచ్చింది. అందుకుని గటగటా తాగి కాస్త అలసట తగ్గినట్లు నవ్వాడు.
అంకాల కూడా నవ్వి, ‘‘అదేవిటి.. మంచి నీళ్లు కూడా తాగి చాలా కాలమయినట్లు..’’
ఆయన మాటను ఆపి, ‘‘అవును.. మా గ్రామంలో మంచి నీళ్లు కూడా లేవు శెట్టి.’’ అన్నాడు.
డిండిమ ప్రతి మాటకు విలువ ఇస్తాడు అంకాల.
‘‘అదేవిటి??’’ అన్నాడు మ్రాన్పడిపోయి. చెరువులు, బావులు ఎండిపోయాయేమో అనుకుంటు న్నాడు మనసులో.
‘‘కరవు .. శెట్టి! కరవు.. వర్షాలు లేవు రెండేళ్లుగా. ఎగువన కూడా వర్షాలు కురవడం లేదు కాబోలు రేవులు, కాలువలు ఎండిపోతున్నాయి. గ్రామాల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మళ్లీ ఊళ్లకు ఊళ్లు నాశనం అవుతాయి. ప్రజలు పక్క ఇంట్లో కూడా దొంగతనానికి తెగిస్తారు. వృద్ధులను, పిల్లలను చంపుకుంటారు. కనీసం..ఇంత గంజి కూడా దొరకదు. భవిష్యత్తును ఊహిస్తేనే వణుకు పుడుతోంది. దయచేసి తగిన ఏర్పాట్లు చేయండి. మహారాజులది ఏముంది.. వాళ్లు ఎన్నిచెప్పినా పన్నులు వసూలు చేయడం ఆపరు. కనీసం పన్నులో.. ఎర్ర ఎగాణి కూడా తగ్గిం చరు. ఇప్పుడు పూనుకోవలసింది మీరే.. వణిజులు!! మీరు పృధ్వీశెట్టి అయ్యారని తెలిసి సంతోషించాను. కాబట్టి అన్ని రాజ్యల నుంచి సరుకులు, వస్త్రాలు తెప్పించండి. కనీసం ధాన్యం.. తగినన్ని వడ్లు తరలించండి. ఇంత గంజి పోసినా మనిషి చావడు. బ్రతికించండి! గ్రామాన్ని బతికిస్తే కరవు తర్వాత కరువుతీరా ధాన్యాన్ని పండించి మీ రుణం తీర్చుకుంటారు మన తెలుగు రైతులు..’’ చేతులు జోడించి వేడు కుంటున్నట్లు చెప్పాడు. అతని గొంతు ఉద్వేగంతో వణుకుతోంది.
కదిలిపోయాడు అంకాల.
ఇప్పుడే అతడు మొదటిసారి కరవు మాట వింటున్నాడు. ఇటీవల అతని అమ్మకందారులు ఇబ్బడిముబ్బడిగా లాభాలు చవి చూడడానికి కారణం కరవు అన్నమాట. తుఫాను ముందు ప్రశాంతతలా కరవు ముందు వస్తువులు అధిక ధరలకు అమ్ముడు పోతాయని అతని అనుభవం.
‘‘ఆ తర్వాత కొనేవాడు ఉండడు. అంతేకాదు.. జనమంతా తిరగబడి మన కోష్టాగారాలను పగల గొట్టి సరుకులు లాక్కుపోతారు.. జాగ్రత్త..’’
అది తండ్రి చెప్పిన వృత్తి పాఠం!
వెనువెంటనే తన అనుచరులు వస్తు సరఫరా దారులు, పెరికెలు, రాశి వర్తకులు.. తదితరులను సమావేశపరచి కరవు గురించి అడిగాడు. డిండిమ చెప్పింది చెప్పాడు. వాళ్లంతా పగలబడి నవ్వారు.
‘‘వాడెవ్వడు శెట్టి మీకు చెప్పింది.. వాడు ఏదో భ్రాంతిలో ఉన్నట్టుంది. కరవా వాడి బొంద. వాడి ఊరిలో వర్షాలు కురవకపొతే.. కాలువ ఎండిపోతే.. పంటలు పండకపోతే.. ఇక రాజ్యమంతా కరవేనా.. అన్ని రాజ్యాలూ.. చెప్పన్న రాజ్యాలు కరవుతో అల్లాడుతున్నాయా..? వాడు చెప్పడం మీరు నమ్మడం..ఈ సమావేశం ఏవిటి?భలే వారే.. మా పనులు ఆపుకుని పరిగెత్తుకొచ్చాం.. చాలు చాల్లే.. మళ్లీ పిలవకండి.’’
ముఖాన పేడ కళ్ళాపు చల్లినట్లు గోలగోలగా అరిచి వెళ్లిపోయారు.
తన అనుచర వణిజులు నవ్విపోయినా డిండిమ చెప్పిందే నిజమేమోననే అనే సందేహంతో అంకాల పోయి గణపతిదేవుడిని కలిశాడు. డిండిమ తనను కలిసినట్లు.. కరవు రాబోతున్నదని చెప్పినట్లు వివరించాడు.
‘‘డిండిమ చెప్పాడూ అంటే ఆలోచించ వలసిందే..’’ అని పన్ను వసూలు నియోగాధిపతిని, భాండాగారాధిపతిని, ధాన్యగారాధిపతిని పిలిపించి అంకాల సెట్టితో సమావేశం ఏర్పాటు చేయించాడు. వాళ్లంతా కూడా వర్తకుల్లాగే పడి పడి నవ్వేశారు.
‘‘ఈ మన గ్రామీణులు ఇటీవల బాగా తెలివి మీరారు. కాస్త పంట తగ్గినా.. వర్షం కురవకపోయినా క•వు వచ్చేసింది మొర్రో అని మొత్తుకుంటారు. అవన్నీ మేము నిత్యమూ భరించే ఏడుపులే. వాటికి చెవిన పెట్టకుసెట్టి. నీ వాణిజ్యం చంకనాకి పోతుంది..’’ అన్నారు.
చేసేది లేక వెనక్కు వచ్చేశాడు.
మరో ఏడాది గడిచింది. కరవు రక్కసిగా మారి గ్రామాలను కబళిస్తోంది. పన్ను వసూళ్లకు వెళ్లిన నియోగులను రైతులు పడేసి కుమ్మారు. కత్తులు, బల్లెలు చూపించి బెదిరిస్తే ‘మాకు పన్నులు కట్టడం కంటే చావే సులువు. చంపి పుణ్యం కట్టుకోండి’ అని ఈసడించి ఊరు నుండి తోలేశారు.
వణిజులకు లాభాల సంగతి అలా ఉంచి అమ్మ కాలు కూడా రాను రానూ పూర్తిగా ఆగిపోయాయి.
అప్పుడు మళ్లీ వచ్చాడు డిండిమ. రావడం ఒక్కడే రాలేదు. ప్రజాసమూహంతో వచ్చాడు. అంకాల కోష్టాగారంపై దాడి చేశాడు.
అప్పుడు ఆ విశాలప్రాంగణం అంతా ఎప్పటిలాగే దాదాపు వంద ఎడ్లబళ్ల నుంచి సరుకులు ఎత్తడం దించడంతో పూర్తి హడావిడిగా ఉంది. ప్రాంగణం తలుపులు తీసే ఉన్నాయి. ఒక్కసారిగా వందలాది మగ ఆడా జనాలు లోపలికి వచ్చిపడ్డారు. బక్కిచిక్కి ఉన్నా.. అంతా క్రోధాన్ని నింపుకున్న ముఖాలతో.. తీవ్రమైన అలజడితో విచక్షణారహితంగా దాడి చేశారు. అందినవాడిని అందినట్లు చావకొట్టారు. నిజానికి బలిష్టమైన కోష్టాగారపు పనివారు కూడా వాళ్ల దెబ్బలకు చచ్చుపడిపోయినట్లు ఎదురుదాడి చేయలేకపోయారు. ఒకరిద్దరు చేసినా మరిన్ని దెబ్బలు.. దెబ్బమీద దెబ్బ పడేసరికి కిక్కురుమన కుండా క్రిందపడిపోయారు. జనం దొరికినవి దొరికినట్లు అందినవి అందినట్లు పుచ్చుకుని పరారయ్యారు.
ఓ వీరుల్లాంటి పాతికమంది బృందం రక్షణలో డిండిమ అంకాల ముందుకొచ్చాడు..
‘‘క్షమించు మిత్రమా! మీరు నాకెంతో సహాయం చేశారు. అందుకు నాకెప్పుడూ మీరంటే కృతజ్ఞతే ఉంది. కాని జనం తిరగబడితే ఎలా ఉంటుందో మీకు తెలియజెప్పడానికే ఇప్పుడు వచ్చాను. ఇకపై మీ ఇష్టం..’’
అంకాల అంగరక్షకులు ఆయుధాలతో కదలడంతో వారిని నివారించాడు అంకాల.
అనంతరం అంకాల రాజప్రాసాదానికి వెళ్లాడు.అప్పుడే మహామండలేశ్వరుడు గణపతిదేవుడు కూడా అదే అంశంపై సమావేశం నిర్వహిస్తున్నాడు.
‘‘గ్రామాలలో పన్ను వసూలు నియోగులను ప్రజలు చితక్కొట్టారు’’ డిండిమ సాధారణ ప్రజలతో వచ్చి తన కోష్టాగారంపై దాడిచేసి సమస్తం పట్టుకుపోయినట్లు వివరించాడు.
‘‘పన్ను వసూలు కోసం వెళ్లిన నియోగులను ప్రజలు అవమానించి కొట్టడం తెలిసి నేను గూఢ•చార నియోగం వారితో వెనువెంటనే సమాచారం సేకరిం చాను. డిండిమ మీ కోష్టాగారంపై దాడిచేశాడంటే.. అతనికి ప్రాణదానం చేసిన మీ పైనే దాడి చేసి సరకులు దోచుకుపోవడం అంటే.. కరవు చాలా తీవ్రంగా ఉన్నట్లే అంకాలా!. వెంటనే మీరు రంగం లోకి దిగాలి. అన్ని గ్రామాలలో.. సమస్త కాకతీయ రాజ్యంలో మన సామంతుల రాజ్యాలలో.. మొత్తం తెలుగు ప్రాంతాలలో.. వెనువెంటనే భోజన సదుపాయాలు అందించండి. సాధ్యమౌతుందా మిత్రమా?’’
‘‘అందరికి.. ఇన్ని లక్షల మందికి వెనువెంటనే భోజనం అంటే కష్టమేమో మహారాజా! పృధీసెట్టిగా చప్పన్న రాజ్యాలలోని వణిజులందరినీ వాకబు చేసి వారినుండి సమస్త ధాన్యం మన రాజ్యానికి తరలిస్తే గాని భోజనం.. ఊహు.. కనీసం గంజి కాచి పోయాలేం.’’ అన్నాడు అంకాల.
‘‘అవునవును. ఇంత• తక్కువ సమయంలో మళ్లీ వర్షాలు కురిసి పంటలు పండే కాలం వరకు అందరికి భోజనం సాధ్యం కాదేమో ప్రభూ..! కనీసం గంజి కాచి అందరికి అందించడానికి గ్రామాలకు దగ్గరగా స్థల కేంద్రాలలో వంట ఏర్పాట్లు కలిగిన గంజి కేంద్రాలు ఏర్పాటు చేస్తే సాధ్యమే.’’ అన్నాడు ధాన్యభాండగారాధికారి లకుమయ.
‘‘సరే సరే.. ముందు మన ధాన్యాగారాల్లోని ధాన్యాన్ని యుద్ధ ప్రాదిపదికన గ్రామాలకు తరలించండి. మరీ అల్లల్లాడుతున్న గ్రామాలకు తొలి ప్రాధాన్యాతనివ్వండి. ఈ రోజు నుంచి ఒక్క మరణం కూడా మా చెవిన పడకూడదు’’
కాకతీయ యంత్రాంగం, పృధ్వీసెట్టి చప్పన్న రాజ్యాలలోని వణిజశ్రేణుల సంపూర్ణ సహకారంతో ఆ రోజు నుంచే రాజ్యవ్యాప్తంగా గంజి కేంద్రాల ఏర్పాటు.. కొనఊపిరితో కొట్టాడుతున్న వేలాది గ్రామాలు కాస్త గొంతు తడిచేసుకుని మరి కాస్త కడుపు నింపుకుని.. మెల్లమెల్లగా తిరిగి ఊపిరి తీసుకుంటూ కాస్త కాస్తగా తేరుకుని తిరిగి పొలాలవైపు వెళ్లసాగారు. వారితోనే కాలువల్లో నీరు ప్రవహించసాగింది. మెల్లమెల్లగా మేఘాలు క్రమ్ము కుని చుక్క చుక్క మెల్లగా భూమి పైకి జారసాగింది.
తిరిగి కాలూ చేయీ కూడగట్టుకుని గ్రామాలు కోలుకోసాగాయి.
ళి ళి ళి
అనుమకొండ రాజప్రాసాదంలో మంత్రాంగ మందిరం.
గణపతిదేవుడు, తిక్కనామాత్యుడు, ఆర్థిక నిపుణులు, సామాజిక శాస్రవేత్తలు, పృధ్వీసెట్టి, అంకాలశెట్టి.. విభిన్న మండలాల పాలకులు, కొందరు సామంతులు.. అందరి ముఖాల్లో ఓ పిసరు ఆహ్లాదం.. గొప్ప ఆపద తప్పిపోయినట్లు కొంత ఊపిరి పీల్చుకోవడం కనిపిస్తోంది.
‘‘అంకాలా.. అన్నిమండలాల్లో గంజికేంద్రాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు కదా?! చావులు.. ఆకలిచావులు ఆగిపోయినట్లే కదా..’’ అంకాల సెట్టిని ఉద్దేశించి అడిగాడు గణపతిదేవుడు.
‘హమ్మయ్య.. గండం గడిచింది’ అన్న భావన ఆయన మాటల్లో, ఆయన శారీరక భాషలో ధ్వనిస్తోంది.
‘‘నిస్సందేహంగా.. మారుమూలనున్న చిన్న గ్రామంలో కూడా గంజి కేంద్రం ఉంది మహారాజా. అందరికి ముప్పూటలా గంజి పోస్తున్నాం ప్రభు.’’
‘‘గొప్ప సహాయం సెట్టి. సమయానికి మీరు పృధీసెట్టి రావడం మనకు కలిసొచ్చింది.’’ అన్నాడు తిక్కన.
‘‘అదే అదే.. మనకు ఎంతో సహాయపడింది. చప్పన్న రాజ్యాల శ్రేణి ముఖ్యులంతా నా మాటకు విలువ ఇచ్చి తమ తమ కోష్టాగారాలలోని ధాన్యమంతా మన రాజ్యాల్లోని గ్రామగ్రామానికి తరలించారు. మళ్లీ వర్షాలు కురిసి గ్రామాల్లో రైతులంతా పంట పండించుకుని తమ గాదెల్లో ధాన్యం నిండేవరకూ నేను చప్పన రాజ్యాల సెట్టి లందరూ పూర్తి సహకారం అందిస్తారు. నాది పూచి మహామాత్యా..’’
‘ఇప్పుడిప్పుడే కరవుఛాయలు తగ్గిపోతున్నాయ్. గత మాసం రోజులుగా అన్నిరాజ్యాల్లో వర్షాలు కురుస్తున్నాయ్. అక్కడక్కడా భారీ వర్షాలు కూడా కురుస్తున్నట్లు సమాచారం వస్తోంది మహారాజా..’’
అప్పటివరకు కూర్చోకుండా అటూ ఇటూ తిరుగుతున్న గణపతిదేవుడు కాస్త ఆనందంగా తల పంకించి పల్యంకంలో కూలబడ్డాడు.
‘కరవు కూడా మన తెలుగురాజ్యాలన్నింటిని ఏకం చేసింది. తెలుగు ప్రజలంతా ఎక్కడవున్నా ఏకమై కలగలసి పోయి పూర్తి గ్రామ్య తెలుగులో మాట్లాడుకుంటూ కష్టసుఖాలు పంచుకుంటూ సామూహికంగా కలిసి గంజి తాగుతూ కరవును జయించారు.’ అన్నది ఆయన ఆనందానికి కారణం. ఆయన ముఖంలోని ఆ ఆనందం తిక్కనార్యుని ముఖంలో తిరిగి ప్రతిఫలించింది.
ళి ళి ళి
హోరుకల్లు, బెలగావి రాజ్యంలో ఓ సరిహద్దు గ్రామం.
గంజి కేంద్రాలు ఏర్పాటు కాకముందు పిట్టలా రాలిపోయిన ఆ రాజ్యాల గ్రామీణులు గంజి కేంద్రాల తర్వాత కూడా చనిపోతూనే ఉన్నారు.
ఆ రాజ్యాలు ఒకటి రెండు కాదు దాదాపు పది ప్రాంతాలు.. దాదాపు వంద గ్రామాలు. అవి హోయసల రాజ్యం నుంచి దేవగిరి రాజ్యంలోకి మారిన రాజ్యప్రాంతాలు.. గ్రామాలు. అక్కడ చనిపోయిన వారంతా తెలుగు మాట్లాడే ప్రజలు. వాళ్లు కేవలం ఆకలి వల్ల మాత్రమే చనిపోవడం లేదు. కక్ష కట్టి కావాలని చచ్చేలా చేస్తున్నారు కొందరు. ఆ దుర్మార్గులకు నాయకురాలు బాలకవ్వలబాయి.
సరిహద్దుకు ఆవల మనవాళ్లు ఆకలితో మలమలమాడి పోతున్నారని ఈవల తెలుగుచోడ మండలేశ్వరులు అక్కడ కూడా గంజి కేంద్రాలు తెరవడానికి యత్నించినప్పుడు అవతలి గ్రామ సమయాల సెట్టిలు ముళ్లకంచెలు వేసి అటు నుండి ఇటు రానివ్వలేదు. ఇటు నుండి ఎవరైనా కాస్త గంజి పోస్తారేమోనని ఆశగా చూసిన కరువు బాధితులు అలా కళ్లు తేలేసి చనిపోయారు.
ఇంత ఘోరం జరుగుతుంటే తిక్కనామాత్యుల వారి గూఢచార బృందాలు ఈ ఘోరాలను సరిహద్దు ఈవలనున్న తెలుగుచోడ రాజ్యాల పాలకులకు నివేదించారు. అన్నమో రామచంద్రా అని అలమటి స్తున్నవారి కోసం తక్షణమే నడుము కట్టినవాడు వెల్లూరు విషయాధిపతి గంగయదేవుడు. ఆయన స్వయంగా సరిహద్దు వెంటనున్న గ్రామాలన్నింటిని పర్యటించాడు. ఈవల గంజి కేంద్రాలు ప్రజలకు కాస్త ఆకలి తీరుస్తుండగా సరిహద్దుకు ఆవల.. అంటే కేవలం కొన్ని గజాల దూరంలో ఉన్న గ్రామాలలోని తెలుగు ప్రజలు.. కాకుంటే కన్నడ ప్రజలు ఆకలితో కుప్పకూలిపోవడం.. నేలపైపడి తన్నుకులాడి ప్రాణాలు విడవడం చూసి దిమ్మెరబోయిన గంగయ దేవుడు గంజి కేంద్రాల నిర్వాహకులను అడిగాడు, ‘ఏవిటా దారుణం?!’ అని.
వాళ్లు చెప్పింది విని మరింత హతాశుడయ్యాడు.
‘‘అవతల ప్రజలు తెలుగువాళ్లు లేకుంటే కన్నడవాళ్లు. కానీ ఇప్పుడు పాలకులు మరాఠి వాళ్లు ప్రభూ! తెలుగురాజ్యాలను చూసి ఎవ్వరైనా గంజి కేంద్రాలు ఏర్పాటు చేస్తే.. ఆ నిర్వాహకులను ముందు బల్లేలతో గుచ్చి గుచ్చి చంపేస్తున్నారట ప్రభూ..’’
నోట మాట పడిపోయింది గంగయకు.
‘‘ఇది ఎవరో కావాలని కక్షకట్టి చేస్తున్న దారుణం. ఎవరై ఉంటారు.. గ్రామ సమయసెట్టా.. వణిజ సెట్టా..! ఎవరై ఉంటారు?’’
‘‘ఎవరో మహిళ అట ప్రభూ.. దేవగిరి మహా రాజుల వారి ప్రతినిధి అట.. పేరు ఏదో ఉంది.’’
ఒళ్లు చల్లబడింది గంగయకు. వెంటనే గుర్తించాడు. ఆమె?.. ఆమే!!
దేవగిరిరాజ్య వణిజ సంధివిగ్రహిగా తిరుగు తోందని విన్నాడు. అంటే ప్రస్తుతం ఇక్కడే ఉందన్న మాట. ఈ దుర్మార్గానికి ఆమె కారణం కావచ్చు. అతనికి ఎంతో బాధ కలిగింది. ఎందుకు ఈ దుర్మార్గం!? గణపతిదేవుల వారిపై పగతో అమాయకులైన తెలుగు ప్రజలను చంపడం ఘోరం. ఏమి చెయ్యాలి? ఆమె ఉన్మత్తంగా ప్రవర్తిస్తోంది. ఆమెను తను నియంత్రించలేడు. ఈ రాజ్యాలలో ఏ సమస్య వచ్చినా నెల్లూరు వెళ్లి తిక్కనామాత్యునకు, తిక్కభూపాలునకు నివేదించమని గణపతిదేవుడు ఆదేశించాడు.
వెంటనే నెల్లూరు వెళదామా.. లేక మరో పని చేస్తే?!
ఆలోచనలో పడిపోయాడు గంగయ..
ళి ళి ళి
చిక్కబసప్పశెట్టి భవంతి.. కంపిలి పట్టణం.
రాజప్రాసాదాన్ని తలదన్నేలా నిర్మించిన ఆకాశ హర్మ్యం అది. రెండవ అంతర్వులో అటూ ఇటూ పచార్లు చేస్తోంది బాలకవ్వలబాయి. కిందనుండి వేగంగా పరుగులు పెడుతూ పైకి వచ్చింది పరిచారిక..
‘‘అమ్మా.. అమ్మగారూ.. మీ శ్రీవారు మహారాజు శ్రీ కేయూర దేవులవారు విచ్చేయుచున్నారు..’’ అంది బిగ్గరగా అరుస్తున్నట్లు.
దిమ్మెరబోయింది బాలకవ్వల. మాటరాక అలా పరిచారికను చూస్తోంది.
‘‘నిజం అమ్మా! మహారాజులవారు పూర్తి రాజలాంఛనాలతో మత్తగజంపై విచ్చేస్తున్నారు. అదిగో చూడండి.’’
చెబుతూనే అంతర్వు అంచు వరకు పరుగున వెళ్లి క్రిందికి చూస్తోంది పరిచారిక. చివ్వున కదిలి అంతర్వు అంచుకు వెళ్లి తనూ క్రిందికి చూసింది బాలకవ్వల.
నిజమే. అంబారి కలిగిన ఓ మహామత్తగజం భవంతి దగ్గరగా వస్తోంది. వెనుక రథంలో పంచ వాద్యాలు మోగుతుండగా మహాగజంపై అంబారీలో కూర్చున్నవ్యక్తి వెనుక అంగరక్షకుడు.. అతని ప్రక్కన వెల్లూరు రాజ్యకేతనం పట్టి నిలుచున్న పరిచారకుడు..
పూర్తి రాజలాంఛనాలతో వస్తున్నట్లు కనిపి స్తోంది. అంబారీలోకి వంగి చూసింది. ప్రాణాలు పైనే పోయాయి. నిజమే. కేయూరదేవ మహారాజు. తన భర్త.. సరిహద్దు దాటి ఈ కంపిలి నగరంలో తను ఉన్నట్లు తెలిసి తన కోసమే వస్తున్నట్లుంది. అంటే.. తను ఇక్కడ ఉన్నట్లు ఆయనకు తెలుసా..!!
ఈయనకు ఇక్కడ రాజలాంఛనాలు ఏవిటి? తనను ఆశ్రయించిన కేయూరను..కొంపదీసి ఏదైనా మండలేశ్వరుని చేశాడా ఆ దుష్టుడు గణపతి దేవుడు?! నిజమే కావచ్చు.. హతవిధీ. ఏమిటి తక్షణ కర్తవ్యం??
కవ్వల ముఖంలో కదలాడుతున్న భావాలను పరికిస్తోంది పరిచారిక. సాధారణంగా మహారాణులు అత్తారింటికి వస్తున్నప్పుడు పుట్టింటి నుంచే పరిచారికలను వెంట తెచ్చుకుంటారు. ఈమే కూడా అలాంటిదే. ఆమెకు కవ్వల భర్త ఎవ్వరో.. వారిద్దరి మధ్య ఉన్న దూరాలు.. అన్ని క్షుణ్ణంగా తెలుసు.
భవంతి ముందు మత్తగజం ఆగింది. భవంతి నుంచి వణిజుడు బయటకు వచ్చి కేయూరకు అధికార లాంఛ•నాలతో స్వాగతం పలికాడు.
కవ్వలబాయి తన భార్య అని కేయూర తప్పక చెబుతాడు. కాబట్టి అతని భార్యగా చెప్పక తప్పదు.
‘‘ఒసే.. వెళ్లు వెళ్లి హారతి సిద్ధం చెయ్యి.. తప్పదు. ఆయన గారికి స్వాగతం చెబుదాం.’’ అంది హడావిడిగా.
ఏడేళ్ల కరవు కాలమంతా ఆమె చేతులు ముడుచుకు కూర్చోవాల్సివచ్చింది. సరిహద్దులోని గ్రామాల తెలుగు ప్రజలను చంపేయడమే ధ్యేయంగా నిర్వహిస్తున్న కార్యకలాపాలకు కరవు వల్ల అంతరాయం ఏర్పడినా తెలుగు ప్రజలు అంటు రోగాలు తగిలిన పెంపుడు జంతువుల్లా కరవు కోరల్లో చిక్కి గిలగిల కొట్టుకుని చనిపోవడం ఆమెకు మహ దానందం కలిగిస్తోంది. తెలుగు వారి ఏడుపులు, పెడబొబ్బలు ఆమె వీనులకు ఆర్తనాద మాధుర్యాన్ని కలిగిస్తున్నాయి.
సరిహద్దు ఆవల తెలుగుచోడ రాజ్యాలలో గణపతిదేవుడు ఏర్పాటు చేయించిన గంజి కేంద్రాలకు.. ఇటు కన్నడ రాజ్యాలలోని గ్రామీణులు.. ముఖ్యంగా తెలుగు జనం అటు వెళ్లకుండా ఇనుపకంచె వేయించింది. దానికి ఆవల తెలుగు ప్రజలు గంజి తాగుతూ ప్రాణాలు కాపాడుకుంటుంటే ఇటు వైపు నుంచి వాళ్లను చూస్తూ ఏడుస్తూ చనిపోతున్నవాళ్లను చూస్తుంటే కవ్వలకు గణపతి దేవుడే చనిపోతున్న భ్రాంతి..
రాజకుటుంబాలకు, కులీనులకు, పెద్ద రైతులయిన అగ్ర శూద్రులకు కరవువల్ల వచ్చిన నష్టం కష్టం ఉన్నాయి. కాని తినడానికి లోటు లేదు. పైన దేవగిరి నుండి కింద కంపిలి వరకు పల్లకిలో తిరుగాడుతూ ఆమె పిట్టల్లా రాలిపోతున్న ప్రజల ఆర్తనాదాలను ఆనందంగా వింటూ గడిపేసింది.
తిరిగి వర్షాలు పడటం.. నదులన్నీ నిండుగా ప్రవహించడం మొదలయ్యాక కరవు తొలగి పోయింది. తిరిగి తన కార్యకలాపాలు మొదలెట్టాలని యోచిస్తూ సింఘణదేవుని నుండి ఆదేశాల కోసం ఎదురుచూస్తోంది. అలాంటి సమయంలో భర్త కేయూర తను ఇక్కడ ఉన్నట్లు తెలుసుకుని వచ్చినట్లు ఆమె గుర్తించింది.
అప్పుడే కేయూర, చిక్కబసప్పసెట్టి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకుంటూ పైకి వచ్చారు.
కవ్వల ఎలా ఆహ్వానిస్తుందో అనే సందేహం కేయూర ముఖంలోనూ.. కేయూర ఇలా ఎందుకు వచ్చాడో అనే ఉత్కంఠ కవ్వల ముఖంలోనూ దోబూచు లాడుతుండగా ఇద్దరూ ఎదురుబదురుగా వచ్చినా మధ్యలో ఉన్న బసప్పశెట్టి గళ్ళున మాట్లాడసాగాడు.
‘‘కవ్వలాబాయి గారూ.. వీరు గంగయదేవ మహారాజు అని.. కాకతీయ సామంత రాజ్యం వెల్లూరు రాజ్యపాలకులు అని తెలుసుగాని.. మీ శ్రీవారని నాకు తెలియదు సుమా!కరవు కాలంలో ఏమైపోయారోనని.. తమరిని వెదుక్కుంటూ వచ్చారు. మీరంటే వారికి ఎంత ప్రేమో కదా!.. మీ మధ్య నేనెందుకు..వెళతాను.’’ నవ్వుతూనే అంటూ కదిలి వెళ్లిపోయాడు.
ఎంత ఈసడించుకున్నా ఎదురుగా తనకు తాళి కట్టిన భర్త.. నడుముపై చేతులుంచి గతం కంటే కాస్తంత దర్పంగా ఆత్మవిశ్వాసంతో నిలబడిన భర్తను చూసి ఆప్యాయంగా నవ్వింది కవ్వల.
ఆమె నవ్వులో కదిలి కరిగిపోయాడు గంగయ అనబడే కేయూర. భార్య ఇస్తోన్న ఊహాతీతమైన గౌరవం చూసి అతనిలో ఓ మైమరుపు కలిగింది. తన్మయత్వంతో ఆమెనే చూస్తుండగా పరిచారిక తెచ్చిన కర్పూర పళ్లెరం అందుకుని భర్తకు హారతి ఇచ్చింది. హారతి అయ్యాక పళ్లెరం పరిచారికకు అందించి ఆమెను వెళ్లిపొమ్మన్న ట్లుగా సైగ చేసింది.
ఇదంతా కేయూర గమనిస్తూనే ఉన్నాడు.
ఇద్దరే మిగిలారు అక్కడ. భర్త చేతులు పట్టుకుని తీసుకెళ్లి తల్పంపై కూర్చోబెట్టింది.
‘‘ఏవిటి నీలో ఈ పెనుమార్పు?! నన్ను ప్రేమగా చూడటం.. చేతులు పట్టుకుని తీసుకెళ్లి పల్యంకంలో కూర్చోబెట్టడం.. ఈ హారతి మర్యాదలు.. ఓహ్.. నిజమేనా కవ్వలా?!’’ అన్నాడు ఏదో మత్తులో మాట్లాడుతున్నట్లు.
ఆమె విశాలంగా నవ్వింది.
‘‘మనకు వివాహమయ్యి ఇరవై ఏళ్లు దాటుతోంది. అక్క మరణంతో మా కుటుంబంలో పెనుమార్పులు జరిగాయి. మనిద్దరి వివాహం ఎలా ఎప్పుడు జరిగిందో కూడా నాకు గుర్తు లేదు మహారాజా. కానీ జరిగింది. మీరు నా భర్త. ఇన్నేళ్లూ మిమ్మల్ని దూరంగా పెట్టాను కాని నేనెవ్వరికి దగ్గర కాలేదు. సింఘణదేవ బావగారు నన్నెప్పుడూ తన అంతఃపురంలోకి రమ్మని పిలవలేదు.. కోరలేదు.. బలవంతపెట్టలేదు. ఓ దగాపడ్డ బంధువుగానే చూశారు. కోరిన సహాయం చేస్తూనే ఉన్నారు. తనకు పెళ్లయ్యిందని.. కేయూరదేవుడు అనేవాడు ఆమె భర్త అని.. ఆయన అందరితో.. నన్ను పరిచయం చేసినప్పుడల్లా చెబుతూనే ఉంటారు. మిమ్మల్ని దూరంపెట్టినా అందరికి తమరే నా భర్త అని నేను చెబుతుంటాను..’’ చెప్పడం ఆపి మెల్లగా లేచింది.
‘‘నా సోదరిని అతిదారుణంగా ఖండఖండాలుగా చంపించిన ఆ కాకతీయు డిపై నా పగ.. నాకు ఎలాంటి శారీరక, మానసిక కోర్కెలు లేకుండా చేసింది. వాడి అంతమే నాకు ఆనందం. నా జీవితధ్యేయం. వాడిని వాడి రాజ్యాన్ని ఆ తెలుగు ప్రజలను నామరూపాలు లేకుండా చేసేవరకు నేను నిద్రపోను.’’
పిట్టగోడ వరకు వెళ్లి చివ్వున వెనుదిరిగింది.
‘‘మీకు ఆ కాకతీయుడి వద్ద గొప్ప గౌరవం హోదా లభించినట్లున్నాయి. సింఘణదేవుడు తన సామంతులను, మండలాధీశులను ఇబ్బందులు పెడుతున్నాడని విన్నాను. అందుకే మీరు.. మీ సహచర దేవగిరి సామంతులు గణపతిదేవుని శరణు వేడారని తెలిసింది. సహజంగా వాడు.. సింఘణ పాలనపై వ్యతిరేకులను తప్పక ఆశ్ర యమిస్తాడు. మీకూ ఇచ్చినట్లున్నాడు కదూ..!?’’
(సశేషం)

మత్తి భానుమూర్తి