‘‌మధురము రామాయణ కథ/మధురము వాల్మీకి వాక్కు’ అంటారు కరుణశ్రీ, ‘తెలుగు రామాయణాలు’ వ్యాసంలో. వాస్తవానికి వాల్మీకి మహర్షియే తన రామాయణాన్ని ‘పాఠ్యే గేయేచ మధురమ్‌’ అని ఉగ్గడించాడు. రాముని చరిత్రమూ వాల్మీకి కవిత్వమూ రెండింటి సమైక్యతతో రామా యణ మహాకావ్యం ఆవిర్భవించింది. రామాయణం ఆబాలగోపాలానికీ ఆదరపాత్రమైన మహాకావ్యం. అందులో తెలుగువారికి సీతారాములు ఆరాధ్య దైవాలు. తెలుగుదేశంలో రాముని గుడిలేని గ్రామం లేదు. తెలుగువాడు ‘శ్రీరామ’ చుట్టకుండా ఏ రాతా ప్రారంభించడు. తెలుగుదేశంలోని గోదావరీ తీరం సీతారాముల పవిత్ర పాద పరాగాలతో పులకించి పోయింది.

తెలుగుభాషలో ఉన్నన్ని రామాయణాలు మరే భాషలోనూ లేవంటే అతిశయోక్తి కాదు. జాన పదులకు రామాయణ, భారత, భాగవతాలే ఇహపర సాధకాలు. వారి పాలిట ప్రస్థానత్రయం. వీటిలో రామాయణం మేలుబంతి. సీతారామచంద్రులు తెలుగు జానపదులకు తల్లిదండ్రులు. సుఖానికీ, దుఃఖానికీ వారికి రామనామమే శరణ్యం. ఆ ఆదర్శ పురాణదంపతులు అరణ్యవాస కాలంలో కొన్నాళ్లు మన గోదావరి తీరంలో నివసించడం మన పూర్వ పుణ్యం. నాటి నుండి నేటి వరకు ఆ గోదావరి తల్లి గుండె గలగలలు వింటున్న తెలుగు జానపదులకు తెలిసినంత రామాయణ రహస్యాలు ఇతరులకు తెలియవేమో! అలాంటి అనేక జానపద రామాయ ణాలను ఆచార్య బి. రామరాజు సేకరించారు.
వారు సేకరించిన రామాయణాలు- కూచకొండ రామాయణము, శారద రామాయణము, ధర్మపురి రామాయణము, రామకథా సుధార్ణవము, మోక్షగుండ రామాయణము, సూక్ష్మ రామాయణము, సంక్షిప్త రామాయణము, గుత్తెనదీవి రామాయణము, ఆధ్యాత్మ రామాయణము, చిట్టి రామాయణము, శ్రీరామ దండములు, లంకాసారథి, రామాయణ గొబ్బిపాట, శ్రీరామ జావళి, అడవి గోవింద నామాలు, శాంత గోవిందనామాలు, పెండ్లి గోవింద నామాలు, సేతు గోవిందనామాలు మొదలైనవి. ఇవికాక రామకథలోని కొంతభాగానికి పరిమిత మైనవి- శాంతా కల్యాణము, పుత్రకామేష్ఠి, కౌసల్య- కైకలు, కౌసల్య వేవిళ్లు, శ్రీరామ జననం, శ్రీరాముల ఉగ్గుపాట, రాఘవ కల్యాణం, రాముల వారి అలుక, సుందరకాండ పదము, ఋషుల ఆశ్రమము, సుగ్రీవ విజయము, కోవెల రాయ బారము, అంగద రాయబారము, లక్ష్మణ మూర్ఛ, లంకా యాగము, గుహ, భరతుల అగ్ని ప్రవేశము, శ్రీరాముల పట్టాభిషేకము, లక్ష్మణ దేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర, కుశలాయకము, పాతాళ హోమము, శతకంఠ రామాయణము మున్నగునవి.
కేవలం సీతమ్మ ఆధారంగా వెలువడిన పాటలు- సీత పుట్టుక, సీతాకల్యాణం, సీతనత్తవారింటి కంపుట, సీత సమర్త, సీత గడియ, సీత వామన గుంటలు, సీతమ్మ వారి అలుక, సీత వసంతము, సీత దాగిలిమూతలు, సీత మేలుకొలుపు, సీత ఆనవాలు, సీత అగ్ని ప్రవేశము, సీత వేవిళ్లు మొదలైనవి. ఇంకా అముద్రితాలు, అచ్చయినా తనకు లభ్యంకానివి చాలా ఉన్నాయని రామరాజు రాశారు.
ఆంధ్ర స్త్రీలు సీతమ్మ తల్లితో తాదాత్మ్యం చెందారు. విశ్వామిత్రుని వెంట రామలక్ష్మణులు ధనుర్యాగం చూడడానికి మిథిలకు వెళతారు. ఒక సాయంకాలం సీతమ్మ చెలికత్తెలతో ఉద్యాన వనానికి వచ్చింది. శ్రీరాముడు సాయం సంధ్య వార్చడానికి అక్కడకే చేరాడు. బాలయోగి వేషంలో ఉన్న శ్రీరామునితో మాట్లాడిన సీతమ్మకు అతడే రాముడని తెలియగానే సిగ్గు దొంతరమల్లెయైపోయింది. వివాహ సమయంలో వరమాల వేయడం ఓ వేడుక. ‘రాముడు ఆజానుబాహుడు, ఆపై పట్టు తలపాగా ధరించాడు. సీత వరమాల వేయబోగా తలదించలేదు. ఆయన చిలిపితనం గ్రహించిన లక్ష్మణుడు చటుక్కున కాళ్లకు నమస్కరించాడు. అన్నగారు అసంకల్పితంగా వంగి తమ్ముని లేవనెత్తబోయాడు. సమయం చూసి సీత రాముడి మెడలో వనమాల వేసింది. రామలక్ష్మణులు ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. నేటికి జానపదులు ఈ తంతు నడుపుతూ ఉంటారు.
సీత గడియ, సీత వసంతము, సీతమ్మ వారి అలుక వంటి పాటలు సీతారాముల శృంగార జీవితాన్ని ఆవిష్కరిస్తాయి. సీత వామనగుంటలాడు పాటలో రాముడు ఓడిపోయాడు. ఓడినవారు కొంత ఫణం చెల్లించాలి. రాముడు చెల్లించాడు. జయాప జయాలు ఎవరివోనన్న కుతూహలంతో కౌసల్య సీతను అడిగింది. సీతమ్మ చతురతతో ‘మీ కొడుకు గడుసు కనుక డబ్బీలు తీసెను’ అని చెప్పింది. అంటే విజేత తానే అయినా పూజ్యురాలైన అత్తగారి ముందు తానోడినట్లు చెప్పి వినయం ప్రదర్శించింది. తోటికోడళ్లు అడిగే మాత్రం ‘మీ బావగారు ఓడి యిదె పదివేలు కట్నాలిచ్చిరి’’ అని సత్యమే పలికింది.
సీత గడియ పాటలో సమిష్ఠి కుటుంబం పెద్ద కోడలు బరువు బాధ్యతలు, పిన్నలు పెద్దలు అందరికి భోజనాలు పెట్టి, ఇల్లు చక్కదిద్దుకొని, ‘అత్త కౌసల్యకు అడుగులొత్తి, మామ దశరథునకు మడతలందించి, కౌసల్యకు పాన్పు పరచి’ తాను స్నానం చేసి అలంక రించుకొని భోజనానంతరం శయ్యాగృహానికి వెళ్లింది. ఇంత జాగుకు రామయ్యకు అలిగి తలుపు గడియ వేసుకొని పరున్నాడు. సీతమ్మ కూడా అలిగి అత్త గారితో చెప్పుకొన్నది. కౌసల్య రాముని మందలించి తలుపు తీయించింది. సంక్షేప రామాయణ మను పా•లో కైక వరములు ప్రకారము శ్రీరాముడు అడవులకు బోనుండగా దుఃఖించు దశరధుని కడకుబోయి కౌసల్య ఓదార్చిన ఘట్టము కరుణా పూరితమే. రుషుల ఆశ్రమము పాటలో శ్రీరాముడు య్ఞశాలలో పడుకొని ఉండగా సీతమ్మ పాదములు వత్తుచు ‘‘సరగ మీ పాదములు శంఖు పద్మములు- యీ లక్షణములు మీ కెంతైన నొప్పు అయోధ్య విడిచి మీరడవులకు రాగ- ఇడుములు పడ మీకు నింతెట్లు వ్రాసె, పాదరక్షలు తొడిగి నడవకుండా – భరతుడు గొనె మీదు పావు కోళ్లని’’ అని హాస్య మాడింది.
అశోక వనములో సీతమ్మ తన విషాద గాధను వినిపిస్తూ త్రిజటను ‘వేగు చుక్కా వినుము, వెడలు శృంగార బంగారు బొమ్మ వినుమా – తీగ మెరుపా వినుము. చీకటింటద్దమా, విభీషణుని పుత్రీ వినుమా’ అని సంబోధించిన తీరు సహృదయులనలరిస్తుంది. సీతాన్వేషణకు బయలుదేరిన హనుమకు ఆమెను కనుగొనడం ఎలా అనే దానికి కొన్ని ఆనవాళ్లు చెప్పాడు రాముడు. అదే సీతాదేవి యానవాలు పాట. ‘తొలకరి మెరుపు వలె తా మెరయుచుండు, మసిపాత గట్టిన మాణిక్యం వలెను, శీతాకాలము నాటి ఉదకమ్ము వలెను. పాడ్యమి చదివిన వేదమ్ము వలెను. పరమసతి ప్రభావ మెల్ల యుండునట… ఆంజనే యునికి ఇట్టి ఆనవాళ్లు పదమూడు చెప్పి శ్రీరాముడు సాగనంపెను’.
‘సీత అగ్ని ప్రవేశము’ పాటలో రావణ వధా నంతరం శ్రీరాముడు సీతను తీసుకురమ్మని విభీషణా దులను ఆజ్ఞాపించాడు. అప్పుడు వారు ‘ఇప్పటి రూపమున దెత్తుమా దేవా, పూర్వంపురూప మున దెత్తుమా’ అని అడిగారట. ఇప్పటి రూపం అంటే ఒక దీనవనిత, పూర్వం రూపం అంటే రామునితో కలసి ఉన్నప్పటిది. రాముడు మొదటి రూపంలోనే చూస్తానన్నాడు. సీతమ్మకు స్నానం చేయించి అలంకరించి రాముని సన్నిధికి తెచ్చారు. ఆమె శ్రీరాముని పాదాల మీద వాలింది. రాముడు ముఖము త్రికొని మాట్లాడాడు. ఆమె మూర్చ పోయింది. రాముడు రథమెక్కి కదిలాడు. సీతమ్మ తేరుకొని దుఃఖించి అగ్ని ప్రవేశం చేసింది. అయితే అగ్నిదేవుడు కరుణించిన తీరు ఈ పాటలో చక్కగా ఉంటుంది. ఎలా! ‘కణకణ నిప్పులూ కుంకుమ్మ లాయె, పరిచున్న నిప్పులు పన్నీరు ఆయె, చాపిన నిప్పులు చందనంబాయె, మండేటి నిప్పులు వడగండ్లు ఆయె, చిలుకలు కోవెలలు హంసలు గుమిగూడి సీతకు తోడుగా కొలనాడు చుండె, సింహాసనం మీద సీత గూర్చుండె. శ్రీరాముడు ఇంకనూ శంకించగా అశరీర వాణి ప్రత్యక్షమై శ్రీరామునకు నమ్మకము కలుగు నట్లుగా చెప్పి సీతమ్మనప్పగించిరి.’
ఆంధ్ర స్త్రీలకు ఊర్మిళా క్ష్మణుల త్యాగసేవా భావాలు బాగా నచ్చిన అంశాలు. వాటిలో ఊర్మిళా దేవి నిద్ర, లక్ష్మణదేవర నవ్వు తమాషాగా ఉంటాయి. ముందుగా ఊర్మిళాదేవి నిద్రపాట-
‘శ్రీరామ భూపాలుడూ పట్టాభిషేకుడై కొలు వుండగా/భరతశతృఘ్నలపుడూ సౌమిత్రి వరుస సేవలు సేయగా /మారుతాత్మజుడప్పుడూ రాఘవుల జేరి పాదములొత్తగా’ అని ప్రారంభమవు తుంది.
వనవాసం నుంచి తిరిగి వచ్చాక లక్ష్మణుడు ఊర్మిళ ప్రక్కన కూర్చుండి జడలల్లినాడట. పదు నాలుగేండ్లు తరువాత కలిసిన ఈ దంపతులు ఇలా ముచ్చటలాడారట. (శృంగార ప్రసంగముల నుకు నేరు, కాదు) ‘‘సింహ విక్రములు మీరూ ఉండగా సీతెట్లు చెరబోయెనూ, రాజ్యాధిపతులు మీరూ ఉండగా రమణెట్లు చెరబోయెను అని ప్రశ్నించినది. ఊర్మిళమ్మకు ఆ కథ చెప్పగా విని ఆమె వలవల ఏడ్చిందట. ఈ తెలుగు పాట పాడుకొను స్త్రీలందరూ ఊర్మిళా దుఃఖమున పాలుపంచు కొంటారు.
రావణ వధానంతరం అయోధ్యలో సకల దేవతల సమక్షంలో శ్రీరామ పట్టాభిషేకం జరుగు తున్నది ఆ నిండు కొలువులో, ప్రశాంత గంభీర వాతావరణంలో ఒక్కసారిగా కలకల నవ్వాడట లక్ష్మణదేవర. ఇక్కడ చమత్కారం అద్భుతం. ఆ నవ్వుకు అక్కడ ఉన్న ప్రముఖులంతా భుజాలు తడుముకున్నారు. ‘క్ష్మణుడకారణముగా నవ్వినందు లకు సభాసదు లందరూ గుమ్మడికాయలు మోసినట్లు తమ తమ భుజములను తడుముకొని, జాలారి పడుచును నెత్తి కెక్కించుకొన్నందుకు నవ్వెనని శంకరుడు.. అన్నగారి ఆయువు పట్టెరిగించి చంపించి తాను రాజైనందుకు నవ్వెనని విభీషణుడు, ఆడరాని మాటలాడిన ఆడువారిని నమ్మరాదని నవ్వెనని సీతమ్మ, ఇటులే సుగ్రీవుడు, జాంబ వంతుడు, నలుడు, ఆంజనేయుడు, శ్రీరాముడు, భరత శత్రుఘ్నులు, అంగదుడు, ఆదిశేషువు మొదలగు వారందరూ తమని చూసే నవ్వాడని తలచారు. సభా మర్యాద నుల్లంఘించినందుకు శ్రీరామునికి క్ష్మణునిపై విపరీతమైన కోపం వచ్చి ఖడ్గమెత్తాడు. శంకరాదులడ్డుపడి వారించారు. లక్ష్మణుడు తను నవ్విన కారణమీవిధంగా తెలిపెను.’
‘ఆ పర్ణశాలలో మనముండగానూ
పరమాత్మ మీసేవ చేయగా జూచీ
ఉండగానే వచ్చె ఉత్తమ్ము నిద్రా
రెండు జాముల వేళ నిద్రయేతెంచే
నరులెవ్వారును నను గెల్వలేరు
సాష్టాంగ నమస్కారములు జేసి
మాయన్న రఘుపతికి మా వదినకునూ
ఈ పర్ణశాలకూ తాను కాపనెనూ
కడువేడ్క అయోధ్య కనక పట్టణాన
తప్పక ఒక ఘడియ తడబడకుండా
తను నిద్ర పొందితే నవ్వితీ ననెనూ’ (పర్ణశాలలో ఉన్నప్పుడు పరమాత్మ మీ సేవ చేసినప్పుడు నేను అయోధ్యలో ఉంటే ఒక కునుకు తీసి ఉండేవాడిని కదా అని అప్పుడు అనుకున్న మాట గుర్తుకు వచ్చి నవ్వొచ్చింది అన్నాడట) లక్ష్మణుని సమాధానంతో శ్రీరాముని గుండె జారిపోయింది.
పట్టాభిషేకానంతరం రాముడు తమ్ముళ్లకు మరదండ్రకు కావలసిన పదార్థాలన్నీ చేయించి మిత్రులతోను కలసి భోజనం చేశాడట. కాని హనుమను మరిచారు. ఇంతలోనే వచ్చాడు హనుమ. ‘రామునికి తన పొరపాటు తెలిసినది’. ఇంటివాడవు గనుక ఊరకుంటిమీ అంటూ వచ్చి దగ్గర కూర్చోమని బతిమాలాడు. ఇలా పొగిడాడు కూడా. ‘ఉత్తమా పురుషా, నీవుండగా గదా సీత దెచ్చుకొని అయోధ్య పట్టణమ్ము ఏలగలిగితినీ..తమ్ముళ్లు పంక్తి భుజియింప గల్గితిని. హనుమా వినుమా పొత్తునా గూర్చొమ్మి’ అన్నాడు రాముడు. సర్వేసు భోజనము తినగా జూచి ముందర పళ్లెము ఎత్తుకొని పోయె- తాబోయి హనుమన్న అవిసిచెట్టు ఎక్కి ద్వాదశి ముద్ద కొమ్మపై వుంచె. అందు మీద పళ్లెమ్ము పడవేసె’నట, ఎత్తినది కోతి జన్మ గనుక రామభక్తికి రామ ప్రసాదానుభవానికి కోపం కలుగకుండా, తన కోపాన్ని కూడా దాచకుండా ప్రదర్శించాడు ఆంజనేయుడు. జానపదులకు ఇలాంటి అంజనేయుడే ప్రియుడు. దీనికి ఫలశ్రుతి ‘ఈ పాట యెవరైన పాడినా విన్నా-పరబ్రహ్మ లోకంబు పరమాత్ముడిచ్చు’.

డా. కాశింశెట్టి సత్యనారాయణ
విశ్రాంత ఆచార్యుడు

About Author

By editor

Twitter
YOUTUBE